లిటిల్ గురు అనే యాప్ దేనికి సంబంధించింది?
- సమగ్ర ప్రాంతీయ ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని ఆమోదించిన తొలి దేశం? ( డి)
ఎ) జపాన్ బి) థాయ్‌లాండ్
సి) దక్షిణకొరియా డి) సింగపూర్
వివరణ: రీజినల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్నే తెలుగులో ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యంగా చెప్పొచ్చు. ప్రపంచంలోనే ఇది అతిపెద్ద ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం. దీనికి చైనా నేతృత్వం వహిస్తుంది. మొత్తం 15 దేశాలు ఇందులో భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి. ఏఎస్ఈఏఎన్ (ఏషియన్) దేశాల కూటమిలో ఉన్న పది దేశాలతో పాటు చైనా, దక్షిణకొరియా, జపాన్, ఆస్టేలియా, న్యూజిలాండ్‌లు కూడా ఈ ఒప్పందంలో ఉన్నాయి. 2020 నవంబర్‌లో ఈ ఒప్పందం కుదిరింది. దీని విధి విధానాల్లో కీలక పాత్ర పోషించిన భారత్ 2019లో ఒప్పందం నుంచి వైదొలిగింది. కనీసంగా ఆరు ఏషియన్ దేశాలు, మరో మూడు కూటమిలో లేని దేశాలు ఆమోదించిన తర్వాత ఒప్పందం అమలులోకి వస్తుంది. ఒప్పందాన్ని ఆమోదించిన తొలి దేశంగా సింగపూర్ నిలిచింది. - తవ్వకాల్లో భాగంగా 3000 సంవత్సరాల నాటి నగరం ఇటీవల ఏ దేశంలో బయటపడింది? (బి)
ఎ) ఇటలీ బి) ఈజిప్ట్
సి) చైనా డి) మెసపటోమియా
వివరణ: ఫారోల పాలనలో ఈజిప్ట్ సుసంపన్నంగా ఉన్న సమయంలో నిర్మించిన ఏటెన్ నగరాన్ని పురాతత్వ శాస్త్రవేత్తలు అనుకోకుండా కనుగొన్నారు. ప్రఖ్యాత ఫారో టూటామ్ఖామూన్ మృతి తర్వాత ఆయనను మమ్మీగా మార్చే క్రమంలో పూజలు నిర్వహించిన ఆలయాన్ని కనుగొనేందుకు తవ్వకాలు మొదలుపెట్టగా ఈ నగరం బయటపడింది. ఈజిప్ట్‌లో ఇప్పటివరకు కనుగొన్న పురాతన నగరాల్లో ఇదే అతిపెద్దది. - అందరికీ విద్య అందించాలన్న లక్ష్యంతో కింది వాటిలో ఏర్పడిన కూటమి? (సి)
ఎ) జీ-4 బి) జీ-20
సి) ఈ-9 డి) ఈ-21
వివరణ: యునెస్కో లక్ష్యం అయిన అందరికీ విద్య సాధనకు ఈ-9 దేశాల కూటమి 1993లో ఏర్పాటయ్యింది. ఇందులోని సభ్య దేశాలు భారత్, బంగ్లాదేశ్, బ్రెజిల్, చైనా, ఈజిప్ట్, ఇండోనేషియా, మెక్సికో, నైజీరియా, పాకిస్థాన్. 2015లో ఆమోదించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో నాలుగోది కూడా విద్యకు సంబంధించిందే. సార్వత్రిక విద్యను సాధించాలని అది నిర్దేశిస్తుంది. ఇటీవల ఈ-9 దేశాల కూటమిలోని దేశాల విద్యాశాఖ మంత్రుల సమావేశం నిర్వహించారు. ప్రాథమిక విద్యను సార్వత్రిక విద్యగా మార్చేందుకు 1990లో అన్ని దేశాలు అంగీకరించాయి. నాడు థాయ్‌లాండ్‌లో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. యునెస్కో, యూఎన్డీపీ, యూఎన్ఎఫ్పీఏ, యునిసెఫ్ ప్రపంచ బ్యాంకులు ఇందుకు సహకరించాయి. - నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో)లో చేరేందుకు తీవ్రంగా యత్నిస్తున్న దేశం కింది వాటిలో ఏది? (ఎ)
ఎ) ఉక్రెయిన్ బి) పాకిస్థాన్
సి) జపాన్ డి) చైనా
వివరణ: నాటోలో తమను చేర్చుకొనే ప్రక్రియను వేగవంతం చేయాలని ఉక్రెయిన్ కోరింది. తమ దేశంలోని రష్యా అనుకూల వాదులను కట్టడి చేయడానికి నాటోలో చేరడం ఒక్కటే మార్గమని ఉక్రెయిన్ భావిస్తుంది. ఆ దేశపు సరిహద్దులో రష్యా కదలికలు పెరిగాయి. నాటో పూర్తి రూపం నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇది సైనిక కూటమి. వాషింగ్టన్ ఒప్పందం ద్వారా 1949, ఏప్రిల్ 4న ఏర్పాటయ్యింది. ఈ ఒప్పందంలో ఆర్టికల్ 5 కీలకమయ్యింది. దీని ప్రకారం నాటో సభ్యత్వం ఉన్న ఏ దేశంపై అయినా దాడి చేస్తే దానిని అన్ని నాటో దేశాలపై దాడిగానే భావించాలి. ఇప్పటివరకు ఈ ఆర్టికల్‌ను ఒక్కసారి ఉపయోగించారు. అది 2001, సెప్టెంబర్ 11 దాడులు. - ప్రతిపాదన (ఏ): రెమ్‌డెసివిర్ ఎగుమతులను భారత్ నిషేధించింది (ఎ)
కారణం (ఆర్): భారత్‌లో విపరీతంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి
ఎ) ఏ, ఆర్ సరైనవే. ఏ ను ఆర్ సరిగ్గా వివరిస్తుంది
బి) ఏ, ఆర్ సరైనవే. ఏ కు ఆర్ సరికాదు
సి) ఏ సరైనది, ఆర్ సరికాదు
డి) ఏ తప్పు, ఆర్ సరైనది
వివరణ: కొవిడ్-19 చికిత్సలో అత్యంత కీలకంగా మారిన రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్‌తో పాటు, దాని తయారీకి ఉపయోగించే క్రియాశీలక ఔషధ మూలకాల (యాక్టివ్ ఫార్మాస్యూటికల్స్ ఇంగ్రిడియంట్స్) ఎగుమతులను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. దేశంలో రోజురోజుకు కరోనా కేసులు భారీగా పెరుగుతూ ఉన్నాయి. దేశీయంగా ఉన్న డిమాండ్‌ను తట్టుకోవడానికి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ఏడు సంస్థలు ప్రతి నెలా 38.80 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేయగల సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మూడో టీకాకు కూడా భారత్ అనుమతి ఇచ్చింది. రష్యాలో తయారు చేసిన స్పుత్నిక్ కూడా భారత్‌లో అందుబాటులోకి రానుంది. - లిటిల్ గురు అనే యాప్‌ను ఇటీవల రూపొందించారు. ఇది దేనికి సంబంధించింది? (సి)
ఎ) చిన్న పిల్లలు గణితం నేర్చుకోడానికి
బి) ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించడానికి
సి) సంస్కృతం నేర్చుకోడానికి
డి) ఏదీకాదు
వివరణ: సంస్కృత భాష నేర్చుకోడానికి భారత ప్రభుత్వం ‘లిటిల్గురు’ అనే ఒక మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించింది. దీనిని ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ అభివృద్ధి చేసింది. క్రీడలతోపాటు సంస్కృత భాషను నేర్చుకొనేలా దీనిని తీర్చిదిద్దారు. ఈ తరహా యాప్ దేశంలో మొదటిది. మెషిన్ లెర్నింగ్, కృత్రిమ మేధ తదితర సాధనాలను కూడా ఇందులో ఉపయోగించారు. - భారత ప్రాదేశిక జలాల్లోకి ఇటీవల ఏ దేశపు యుద్ధ నౌక ప్రవేశించింది? (డి)
ఎ) చైనా బి) పాకిస్థాన్
సి) ఉత్తరకొరియా డి) అమెరికా
వివరణ: లక్షదీవులకు 130 నాటికల్ మైళ్ల దూరంలో భారత ప్రాదేశిక జలాల్లోకి అమెరికాకు చెందిన యుద్ధనౌక ఒకటి ప్రవేశించింది. ఆపరేషన్లను కూడా నిర్వహించింది. ఏప్రిల్ 7న ఈ సంఘటన జరిగింది. ఆ దేశానికి చెందిన ఏడో ఫ్లీట్ (నౌకల సమూహాన్ని ఇంగ్లిష్‌లో ఫ్లీట్ అంటారు) 60-70 నౌకలను కలిగి ఉంది. దాదాపు 300 ఎయిర్ క్రాఫ్ట్‌లు కూడా ఉన్నాయి. ఇదే భారత ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్లోకి ప్రవేశించింది. స్వేచ్ఛాయుత నౌకాయాన హక్కును చాటడంతో పాటు, భారత్ ప్రాదేశిక జలాలపై ఎక్కువగా హక్కులు కోరుకుంటుందని కారణాలు చూపుతూ అమెరికా ఈ చర్యకు పాల్పడింది. - పీఎస్ జొరాస్టర్ అనేది ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇది ఏంటి? (బి)
ఎ) కొత్త యాప్ బి) గస్తీ నౌక
సి) విమానయాన సంస్థ డి) ఏదీకాదు
వివరణ: పీఎస్ జొరాస్టర్ అనేది భారత్‌లో తయారైన గస్తీ నౌక. దీనిని సీషెల్స్‌కు భారత దేశం కానుకగా ఇచ్చింది. రూ.100 కోట్ల విలువైంది ఇది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, సీషెల్స్ అధ్యక్షుడు వావెల్ రామ్కలవాన్లు వర్చువల్ పద్ధతిలో చర్చలు జరిపిన అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 2005 నుంచి భారత్ ఆ దేశానికి నౌకలు ఇస్తూ ఉంది. ప్రస్తుతం ఇచ్చిన పీఎస్ జొరాస్టర్ నాలుగోది. 48.9 మీటర్ల పొడవైన ఈ నౌకను గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజినీరింగ్ అనే సంస్థ నిర్మించింది. - ఎస్యూపీఏఎస్ఈ (సుపాస్) ఇటీవల వార్తల్లో నిలిచింది, ఇది దేనికి సంబంధించింది? (సి)
ఎ) కరోనా సమయంలో తీసుకోవాల్సిన
జాగ్రత్తలకు సంబంధించింది
బి) పార్లమెంట్లో ఆమోదం పొందిన
బిల్లులకు సంబంధించింది
సి) న్యాయ వ్యవస్థకు చెందింది
డి) ఏదీకాదు
వివరణ: ఎస్యూపీఏఎస్ఈ అనేది సంక్షిప్త రూపం. దీనిని విస్తరిస్తే-సుప్రీంకోర్ట్ పోర్టల్ ఫర్ అసిస్టెన్స్ ఇన్ కోర్ట్స్ ఎఫిషియన్సీ. ఇది ఒక కృత్రిమ మేధ పోర్టల్. న్యాయమూర్తులకు అవసరమైన సమాచారాన్ని క్రోడీకరిస్తుంది. అయితే ఎలాంటి నిర్ణయాలు చేయదు. కేవలం అవసరమైన సమాచారాన్ని మాత్రమే ఇస్తుంది. తద్వారా వారిపై పని భారాన్ని తగ్గించేందుకు ప్రయోజనకరంగా ఉంటుంది. - ఆహార్ క్రాంతి ఇటీవల వార్తల్లో నిలిచింది.ఇది ఏంటి? (బి)
ఎ) వ్యవసాయ రంగంలో మరో విప్లవం
బి) పోషకాహారంపై అవగాహన
సి) వ్యవసాయం, అనుబంధ రంగాల
మధ్య అనుసంధానం
డి) ఏదీకాదు
వివరణ: కొవిడ్‌లాంటి విపత్కర పరిస్థితుల్లో మంచి పోషక విలువలున్న ఆహారం తీసుకోవడం, అవగాహన కల్పించడం కోసం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఆహార్ క్రాంతి అనే పథకాన్ని ప్రారంభించారు. ప్రతి ప్రాంతంలో స్థానికంగా లభ్యమయ్యే కూరగాయలు, పండ్లలో పోషకాల సమతౌల్యత ఎలా ఉందనే విషయంపై ఆహార్ క్రాంతి దృష్టి సారిస్తుంది. తక్కువ వ్యయంతోనే పౌష్టికాహారాన్ని పొందడంపై ప్రజలకు వివరిస్తారు. - ఈఎస్ఏఎన్టీఏ అనే పోర్టల్‌ను ఇటీవల ప్రారంభించారు. ఇది ఎవరికి ప్రయోజనం కలిగిస్తుంది? (ఎ)
ఎ) మత్స్యకారులకు బి) క్రీడాకారులకు
సి) లాక్‌డౌన్‌వల్ల చదువుకు దూరమైనవారికి
డి) వ్యాక్సిన్ల సమాచారం కోసం
వివరణ: ఈ-ఎస్ఏఎన్టీఏ పేరుతో మత్స్యకారులకు అలాగే చేపల కొనుగోలుదారులకు ప్రయోజనం కలిగించేలా ఎలక్ట్రానిక్ మార్కెట్‌ను కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్ ప్రారంభించారు. దీని విస్తరణ రూపం-ఎలక్ట్రానిక్ సొల్యూషన్ ఫర్ ఆగ్మెంటింగ్ ఎన్ఏసీఎస్ఏ ఫార్మర్స్ ట్రేడ్ ఇన్ ఆక్వా కల్చర్. ఎన్ఏసీఎస్ఏ అంటే నేషనల్ సెంటర్ ఫర్ సస్టెయినబుల్ ఆక్వాకల్చర్. మత్స్యకారుల ఆదాయం పెంచడంతో పాటు మధ్యదళారుల వ్యవస్థ ఇందులో ఉండదు. కాబట్టి కొనుగోలుదారులు కూడా తక్కువ ధరకే చేపలను కొనవచ్చు. అలాగే నేరుగా మత్స్యకారులు ప్రయోజనాలను పొందుతారు. - కేంద్ర గణాంక శాఖ ఇటీవల విడుదల చేసిన ‘మహిళలు, పురుషులు-2020’ అనే నివేదిక ప్రకారం కింది వాటిలో సరైనది? (సి)
ఎ) ప్రజల సగటు జీవిత కాలం
2030-35 నాటికి తగ్గనుంది
బి) మహిళల కంటే పురుషులే ఎక్కువ
ఆయుర్దాయాన్ని కలిగి ఉంటారు
సి) ప్రజల సగటు జీవిత కాలం
2030-35 నాటికి పెరగనుంది
డి) ఏదీకాదు
వివరణ: 2031-35 నాటికి దేశ ప్రజల సగటు ఆయుర్దాయం 72.41 ఏండ్లకు చేరనుందని కేంద్ర గణాంక శాఖ విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నారు. 2014-18 మధ్య కాలంలో సగటు ఆయుర్దాయం 69.6 సంవత్సరాలుగా నమోదైంది. మహిళల సగటు జీవిత కాలం 74.66 సంవత్సరాలుగా పురుషుల ఆయుర్దాయం 71.17 సంవత్సరాలుగా ఉండనుందని నివేదికలో పేర్కొన్నారు. ప్రస్తుత జనాభా 136.1 కోట్లుగా అంచనా వేశారు. గడిచిన పదేండ్లలో జనాభా పెరుగుదల రేటు 1.6 నుంచి 1.1కి తగ్గింది. భవిష్యత్తులోనూ తగ్గే అవకాశాలు ఉన్నాయి. లింగ నిష్పత్తి గ్రామాలతో పోలిస్తే పట్టణాల్లో తక్కువ. 2011లో ప్రతి వెయ్యి మంది పురుషులకు 943 మంది మహిళలు ఉండగా ప్రస్తుతం 948 మంది ఉన్నారు. పట్టణాల్లో లింగ నిష్పత్తి 929గా ఉంటే గ్రామాల్లో 949గా ఉందని నివేదికలో పేర్కొన్నారు. - ప్రతిపాదన (ఏ): కేంద్ర వ్యవసాయ శాఖ, మైక్రోసాఫ్ట్ సంస్థలు ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి (బి)
కారణం (ఆర్): మైక్రోసాఫ్ట్ ఒక బహుళ
దేశాల సంస్థ (ఎంఎన్సీ-మల్టీ నేషనల్ కంపెనీ)
ఎ) ఏ, ఆర్ సరైనవే.
ఏ ను ఆర్ సరిగ్గా వివరిస్తుంది
బి) ఏ, ఆర్ సరైనవే. ఏ కు ఆర్ సరికాదు
సి) ఏ సరైనది, ఆర్ సరికాదు
డి) ఏ తప్పు, ఆర్ సరైనది
వివరణ: ఆరు రాష్ర్టాల్లోని పది జిల్లాల్లో విస్తరించి ఉన్న 100 గ్రామాల్లో ఒక ప్రత్యేక ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నారు. ఇందుకు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, మైక్రోసాఫ్ట్ సంస్థలు ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అలాగే ఇందులో క్రాప్ డేటా అనే సంస్థ కూడా భాగస్వామిగా ఉంది. ఇందులో భాగస్వామ్యంగా ఉన్న ఆరు రాష్ర్టాలు-ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, హర్యానా, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్. సాగు చేసేటప్పుడు, కోత తర్వాత కూడా పంట నిర్వహణ, పంపిణీలపై రైతులకు శాస్త్రీయ అవగాహన కల్పించడం, రైతుల పెట్టుబడి వ్యయాలను తగ్గించడం, లాభాలను పెంచడమే లక్ష్యంగా ఈ ఒప్పందం కుదిరింది. ఒక సంవత్సరం పాటు ఈ ప్రాజెక్ట్ అమలులో ఉంటుంది. - ‘1340’ ఈ సంఖ్య ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇది దేనికి సంబంధించింది? (డి)
ఎ) ఐపీఎల్లో కొట్టిన సిక్సర్ల సంఖ్య
బి) దేశంలో మొత్తం జంతు, వృక్ష జాతుల సంఖ్య
సి) దేశంలో మొత్తం గుర్తించిన వృక్ష జాతులు
డి) భారత్‌లో గుర్తించిన పక్షి జాతులు
వివరణ: పక్షులకు చెందిన కొత్త జాతిని అరుణాచల్‌ప్రదేశ్‌లో ఇటీవల గుర్తించారు. ఇది దేశంలో 1340వ పక్షిజాతి. సాధారణంగా ఇది దక్షిణ చైనా, భూటాన్లలో కనిపిస్తుంది. అయితే అరుణాచల్‌ప్రదేశ్‌లో సెలా అనే ప్రాంతంలో సముద్ర మట్టానికి 3852 మీటర్ల ఎత్తులో దీనిని బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. 2021లో ఇప్పటివరకు మొత్తం ఐదు జాతులను జాబితాలో చేర్చారు. 2016 నుంచి పరిశీలిస్తే ఇందులో కొత్తగా చేరిన జాతుల సంఖ్య 104. - కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ను నియమించేది ఎవరు? (సి)
ఎ) కేంద్ర మంత్రి మండలి
బి) లోక్‌సభలోని నియామకాల కమిటీ
సి) రాష్ట్రపతి
డి) సుప్రీంకోర్ట్ కొలీజియం
వివరణ: ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో పాటు ఇతర కమిషనర్లను కూడా రాష్ట్రపతే నియమిస్తారు. ఇటీవల వరకు ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఉన్న సునీల్ అరోరా పదవీ కాలం ముగియడంతో ఆయన స్థానంలో కొత్త సీఈసీగా సుశీల్ చంద్రను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నియమించారు. ఎన్నికల సంఘం రాజ్యాంగ బద్ధ సంస్థ. 1959, జనవరి 25న ఇది ఏర్పాటయ్యింది. రాజ్యాంగంలో 324 అధికరణం నుంచి 329వ అధికరణం వరకు ఉన్న ఎన్నికల సంఘానికి సంబంధించిన వివిధ అంశాలను పేర్కొన్నారు. ప్రారంభంలో ఒకే ఒక కమిషనర్ ఉండేవారు. అయితే 1989లో దీనిని బహుళ సభ్యకమిషన్గా మార్చారు.
వి.రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ , వ్యోమా.నెట్
9849212411
- Tags
Previous article
తెలుగులో మొదటి లక్షణ గ్రంథం?
Next article
భవిష్యత్తును ‘మేనేజ్’ చేసుకుందామిలా!
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు