కొత్త ఇండ్ల జోరు.. కొల్లూరు
కొల్లూరు.. ఒకప్పుడు మారుమూల గ్రామ పంచాయతీ. కానీ, ఇప్పుడు ఆధునిక ఇండ్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. విల్లా ప్రాజెక్టులు, హైరైజ్ అపార్ట్మెంట్లతో నగరవాసులను ఆకర్షిస్తున్నది. ఐటీ కారిడార్‌కు సమీపంలో.. ఔటర్ రింగ్‌రోడ్డును ఆనుకొని ఉండటంతో ఈ పల్లె ముఖచిత్రమే మారిపోయింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో అత్యంత ప్రాముఖ్యం కలిగిన ప్రాంతంగా గుర్తింపు పొందుతున్నది.
గచ్చిబౌలి, నానక్‌రాంగూడ, కోకాపేట ప్రాంతాలు.. ఐటీ కారిడార్‌కు అడ్డా అయితే, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ సమీపంలోని గౌలిదొడ్డి, గోపన్‌పల్లి, తెల్లాపూర్, కొల్లూరు ప్రాంతాలు అత్యాధునిక నివాసాలకు కేంద్రాలుగా మారాయి. వీటిలో తెల్లాపూర్ తర్వాత కొల్లూరు ప్రాంతం రియల్ ఎస్టేట్ రంగానికి ఊతమిస్తున్నది. ఒకవైపు ఐటీ కారిడార్, మరోవైపు ఔటర్ రింగురోడ్డు ఉండటంతో ఈ ప్రాంతంలో నివాసాలకు నగరవాసులు మొగ్గు చూపుతున్నారు. వీటిలో గేటెడ్ కమ్యూనిటీలు, విల్లా ప్రాజెక్టులు, హైరైజ్ అపార్టుమెంట్లే ఎక్కువగా ఉంటున్నాయి. భారీ నివాస ప్రాజెక్టులతో కొల్లూరు ఐటీ కారిడార్‌లో ఆధునిక టౌన్‌షిప్‌గా మారుతున్నది.
20 ఏండ్ల నుంచీ
ఔటర్ రింగురోడ్డు నిర్మాణానికి ముందు.. కొల్లూరు ఓ మారుమూల గ్రామం. కేవలం ఉదయం, సాయంత్రం వేళల్లో పటాన్చెరువు నుంచి ఆర్టీసీ బస్సులు వస్తుండేవి. అయితే, నగర శివారు ప్రాంతం కావడంతో 20 ఏండ్ల క్రితమే ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలైంది. ఔటర్ రింగ్ రోడ్డుతోపాటు ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్, తెల్లాపూర్ టౌన్షిప్.. ఇలా ఒకదాని వెంట మరొకటి రావడంతో కొల్లూరు ఎక్కడ లేని ప్రాధాన్యం సంతరించుకున్నది. అభివృద్ధి అంశాలన్నీ ఈ ప్రాంతానికి చుట్టుపక్కలే ఉండటంతో ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. వీటన్నిటికీ తోడు అతిపెద్ద ప్రాజెక్టుగా తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లను ఇక్కడే నిర్మిస్తున్నది. ఈ భారీ ప్రాజెక్టు కొల్లూరుకు మరింత ఆకర్షణను తీసుకువచ్చింది.
గేటెడ్ కమ్యూనిటీలకు..
కొల్లూరులో 15 ఏండ్ల క్రితం ఎకరం ధర రూ.5 లక్షలుంటే.. ప్రస్తుతం రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లదాకా పలుకుతున్నది. ఐటీ కారిడార్‌కు సమీపంలోనే ఉండటంతో ముందుచూపు ఉన్న పలువురు రియల్ వ్యాపారులు కొల్లూరు చుట్టుపక్కల భారీగా భూములను కొనుగోలు చేశారు. మొన్నటివరకు గ్రామపంచాయతీగా ఉన్న కొల్లూరు ప్రస్తుతం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోకి వెళ్లింది. దీంతో ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు పుంజుకోవడంతోపాటు భూముల ధరలూ ఒక్కసారిగా పెరిగాయి. మాదాపూర్, గచ్చిబౌలి, నానక్‌రాంగూడ ప్రాంతాల్లోని ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న ఎంతోమంది, సమీపంలోని తెల్లాపూర్, కొల్లూరు ప్రాంతాల్లోనే నివాసముండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక్కడే ఇండ్లను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులే ఇక్కడ వెలుస్తున్నాయి. ఒక్కో ప్రాజెక్టు 25, 50, 100 ఎకరాల్లో ఉంటున్నాయి. ఐటీ నిపుణులతోపాటు వ్యాపారవర్గాలు, సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులుకూడా ఇండ్ల కొనుగోలుకు ఆసక్తి కనబరుస్తున్నారు.
15,600 ఫ్లాట్లతో..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ ప్రాజెక్టుతో కొల్లూరు ప్రాంతం అభివృద్ధివైపు అడుగులు వేసింది. ఒకేసారి 125 ఎకరాల్లో సుమారు రూ.150 కోట్ల వ్యయంతో 15,600 ఫ్లాట్లతో ఈ భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. కోకాపేట నుంచి కేవలం అయిదు నుంచి ఆరు కి.మీ. దూరంలో, అటు పటాన్చెరువు నుంచి 10 కి.మీ. దూరంలో తెల్లాపూర్‌ను ఆనుకొనే ఈ ప్రాజెక్టు నిర్మితమైంది. దీంతో ఇక్కడ ప్రభుత్వ అభివృద్ధి పనులూ ఊపందుకుంటున్నాయి. అదే సమయంలో తెల్లాపూర్, కొల్లూరు ప్రాంతాల్లో భారీ రెసిడెన్షియల్ ప్రాజెక్టులూ వెలుస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో అతిపెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలైన మైహోం, అపర్ణ కన్స్ట్రక్షన్, రాజపుష్ప, ఆకృతి, ముప్పా, మేఫెయిర్, త్రిపుర కన్స్ట్రక్షన్.. ఇలా పదుల సంఖ్యలో సంస్థలు భారీ ప్రాజెక్టులను చేపడుతున్నాయి.
రెండు రేడియల్ రోడ్లు..
ఉద్యమ సమయంలో ఐటీ కారిడార్ భవిష్యత్తుపై అందరూ భయాందోళనలకు గురయ్యారు. అయితే, సీఎంగా కేసీఆర్ సుస్థిర పరిపాలన అందించడం, ఐటీ మంత్రిగా కేటీఆర్ చేపట్టిన చర్యలతో హైదరాబాద్ ఐటీరంగం దేశంలోనే అగ్రస్థానానికి చేరింది. ఐదారేండ్లలోనే నగరానికి పడమర దిక్కున గచ్చిబౌలినుంచి తెల్లాపూర్, కొల్లూరు దాకా ఐటీ కారిడార్ విస్తరించింది. రోజురోజుకూ జరుగుతున్న అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని, భవిష్యత్ ట్రాఫిక్ అవసరాలకు అనుగుణంగా కొల్లూరు దగ్గరనుంచి రేడియల్ రోడ్డును గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని క్యూసిటీ, విప్రో సర్కిల్ వరకూ విస్తరిస్తున్నారు. ప్రస్తుతం 60-70 శాతం పనులు పూర్తి కాగా, మరో ఏడాదిలోపే పూర్తిస్థాయిలో రేడియల్ రోడ్డు నిర్మాణం పూర్తి కానుంది. దీనికి అనుబంధంగా తెల్లాపూర్ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్నుంచి కొల్లూరు, వట్టినాగులపల్లి జంక్షన్ వరకు మరో రేడియల్ రోడ్డును నిర్మిస్తున్నారు. దీంతో రవాణా సౌకర్యం మునుపటికన్నా మెరుగైంది. ఫలితంగా ఈ ప్రాంతం నగరంలోనే అత్యంత ప్రాధాన్యం కలిగిన నివాసకేంద్రంగా మారింది.
పిల్లలకోసం ప్రత్యేకంగా..
ఇప్పుడు ప్రతి ఇంట్లో పిల్లలకోసం ప్రత్యేక గదులను ఏర్పాటు చేసుకొంటున్నారు. వాటిని తమ చిన్నారులకు నచ్చినట్లుగా, వారి అవసరాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దుతున్నారు. అయితే, ప్రస్తుతం స్కూల్స్ మూత పడటంతో పిల్లలంతా ఇండ్లకే పరిమితమయ్యారు. ఎక్కువ సమయాన్ని తమ గదుల్లోనే గడుపుతున్నారు. ఇలాంటి పరిస్థితులు పిల్లల మూడ్‌పై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే, వారి గదులను ఎప్పటికప్పుడు సరికొత్త ‘థీమ్స్’తో అలంకరించాలని సూచిస్తున్నారు. ఇవి వారిలో నూతనోత్సాహాన్ని నింపుతాయని అంటున్నారు. చిన్నారులు ఇష్టపడేలా ఐస్‌క్రీమ్ , చాక్లెట్, కేక్స్.. ఇలా అనేక రకాల థీమ్స్‌తో వాల్పేపర్లు మార్కెట్లో దొరుకుతున్నాయి. వాటిని ఇంటిగోడలకు అతికిస్తే చాలు. అవి గదులకు అందంతోపాటు చిన్నారుల్లోనూ సరికొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తాయి.
బరిగెల శేఖర్
- Tags
- sampada
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు