కుర్క్యాల శాసనం వేయించింది?
వేములవాడ చాళుక్యులు (క్రీ.శ. 750-973)
వేములవాడ చాళుక్యులు రాష్ట్రకూటుల సామంతులుగా మొదట బోధన్ తరువాత వేములవాడ, కొంతకాలం గంగాధరను రాజధానులుగా చేసుకొని తెలంగాణలోని పశ్చిమోత్తర ప్రాంతాలను పాలించారు. ఈ ప్రాంతాలనే ‘సపాదలక్ష దేశం’ అని అంటారు. అంటే లక్షా యాభైవేల బంగారు నాణేల ఆదాయం కలిగిన దేశం (కొందరి అభిప్రాయం ప్రకారం లక్షా పాతిక వేల గ్రామాలను కలిగిన దేశం). గోదావరి నదికి దక్షిణాన గల మంజీర నది నుంచి మహాకాళ్వేర పర్యంతం వ్యాపించి ఉన్న భూభాగమే పొదనాడు. దీన్నే సపాదలక్ష దేశం అంటారు. ఇదే వేములవాడ చాళుక్య రాజ్యం.
వీరి చరిత్రకు ఆధారాలు
వీరికి సంబంధించిన 6 శిలాశాసనాలు, రెండు తామ్ర శాసనాలు లభించాయి.
కురవగట్టు శిలాశాసనం (మహబూబ్నగర్), రెండో అరికేసరి వేయించిన కరీంనగర్ (క్రీ.శ. 946), వేములవాడ, చెన్నూరు (941) శిలాశాసనాలు, జినవల్లభుని కుర్క్యాల శాసనం (940), కరీంనగర్ మ్యూజియంలోని శిలాశాసనాలు, మొదటి అరికేసరి కొల్లిపర తామ్ర శాసనం, మూడో అరికేసరి పర్బణి తామ్ర శాసనం (966) వీరి చరిత్ర నిర్మాణానికి ఉపకరిస్తున్నాయి.
అంతేకాకుండా కరీంనగర్ జిల్లాలో వేములవాడ, రేపాక, కోరుట్ల, బొమ్మలగుట్ట (కుర్క్యాల) మొదలైన ప్రదేశాల్లో వీరు నిర్మించిన హిందూ, జైన ఆలయాలు వీరి గురించి తెలుసుకోవడానికి పురావస్తు ఆధారాలుగా ఉపయోగపడుతున్నాయి.
సాహిత్య ఆధారాలు
పంప కవి రచించి విక్రమార్జున విజయం, సోమదేవ సూరి రచించిన యశస్తిలక చంపూ కావ్యం, నీతి వాక్యామృతం మొదలైన గ్రంథాలు వీరి కాలం నాటి మత, సాంఘిక, రాజకీయ విషయాలను తెలుసుకోవడానికి మిక్కిలిగా తోడ్పడుతున్నాయి.
వీరి శాసనాల ప్రకారం వేములవాడ చాళుక్య వంశానికి మూలపురుషుడు ‘సత్యాశ్రయ రణవిక్రముడు(650-675)’. తరువాత ఇతడి కుమారుడు పృథ్వీపతి (675-700), మహారాజు (700-725), పృదు విక్రముడు (725-750) పరిపాలన చేశారు. కానీ వీరి పాలనా వివరాలు, ఎక్కడ పరిపాలించింది, వారి రాజ్య వివరాలు స్పష్టంగా తెలియడం లేదు.
వినయాదిత్య యుద్ధమల్లుడు (750-775)
ఇతను వేములవాడ చాళుక్య రాజ్యస్థాపకుడు. ఇతను ధారాశ్రయ జయసింహ వర్మ కుమారుడని కొందరి చరిత్రకారుల అభిప్రాయం. అయితే పులకేశి సోదరుడే ఈ వినయాదిత్య యుద్ధమల్లుడు అని కొందరి వాదన.
ఇతను రాష్ట్రకూట రాజ్యస్థాపకుడైన దంతిదుర్గుడి వద్ద సేనాధిపతిగా ఉంటూ అనేక యుద్ధాల్లో పాల్గొని చిత్రకోట దుర్గాన్ని జయించి దంతిదుర్గుని మెప్పు పొందాడు.
దంతిదుర్గుడు ఇతని సేవలకు గుర్తింపుగా బోధన్, కరీంనగర్ జిల్లాలతో కూడిన సపాదలక్ష అనే ప్రాంతానికి సామంత రాజుగా నియమించాడు.
ఇతను బోధన్ పట్టణాన్ని రాజధానిగా చేసుకొని రాజ్యాన్ని బోధన్ నుంచి ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూరు వరకు విస్తరించాడు.
పంప కవి విక్రమార్జున విజయం ప్రకారం ఇతనికి గజ దళం ఎక్కువగా ఉందని, పోదన (బోధన్)లోని ఒక పెద్ద తైల తటాకంలో తన ఏనుగులు స్నానం చేసేవని తెలుస్తుంది.
వినయాదిత్య యుద్ధమల్లుడు కాంభోజ, మగధ, కళింగ, గాంగ, పల్లవ, పాండ్య, కేరళ ప్రాంతాలను జయించినట్లు, ఈ రాజ్యాల ప్రభువులు యుద్ధమల్లుని పాదపూజ చేశారని కొల్లిపర తామ్ర శాసనం పేర్కొంటుంది.
మొదటి అరికేసరి (775-800)
ఇతను వినయాదిత్య యుద్ధమల్లుడి కుమారుడు. రాష్ట్రకూట ధృవుని సామంతుడు.
ధృవునికి, అతని సోదరుడు రెండో గోవిందునికి జరిగిన వారసత్వ యుద్ధంలో మొదటి అరికేసరి ధృవుడిని సమర్థించాడు.
అంతేకాకుండా రాష్ట్రకూట గోవిందుడికి సహాయంగా వచ్చిన తూర్పు చాళుక్య రాజు నాలుగో విష్ణువర్ధనుడిని అరికేసరి ఓడించి వేంగీ, త్రికళింగలను జయించినట్లు మనకు కొల్లిపర శాసనం, విక్రమార్జున విజయం ద్వారా తెలుస్తుంది.
ఈ విజయాలకు గుర్తుగా ధృవుడు అరికేసరికి మహబూబ్ నగర్ జిల్లాలోని నాగర్కర్నూల్, నల్లగొండ జిల్లాలోని రామడుగు ప్రాంతాలను బహూకరించాడని కురవగట్టు శాసనం (మహబూబ్నగర్) వల్ల తెలుస్తుంది.
ఈ ప్రాంతాల చేరికతో వేములవాడ చాళుక్య రాజ్యం తూర్పు వైపున విస్తరించడంవల్ల మొదటి అరికేసరి తన రాజధాని బోధన్ నుంచి వేములవాడకు మార్చాడు.
మొదటి అరికేసరి కాలాముఖ శైవాచార్యుడైన ముగ్ధశివాచార్యునికి ‘బెల్మోగ’ గ్రామాన్ని విద్యాదానంగా ఇచ్చాడు. బీఎన్ శాస్త్రి ప్రకారం బెల్మోగ అనే గ్రామం నల్లగొండ జిల్లాలోని పెద్దవూర గ్రామమని తెలుస్తుంది.
అరికేసరి గొప్ప విద్వాంసుడని, గజతంత్రం, ధనుర్విద్య, ఆయుర్వేదంలో ప్రజ్ఞకలవాడని కొల్లిపర శాసనం తెలియజేస్తుంది. ఇతడికి సమస్త లోకాశ్రయ, త్రిభువనమల్ల, రాజత్రినేత్ర, సాహసరాయాది వంటి బిరుదులు ఉన్నాయి.
మొదటి అరికేసరి తరువాత ఇతడి కుమారులు వరుసగా మొదటి నరసింహుడు (800-825), ఇతని కుమారుడు రెండో యుద్ధమల్లుడు (825-850) పరిపాలించారు. వీరి యాభై సంవత్సరాల కాలంలో ఎటువంటి విజయాలు, విశేషాలు లేవు. తరువాత రాజ్యానికి వచ్చిన ‘బద్దెగ’ పేరుప్రఖ్యాతలు పొందాడు.
బద్దెగ (850-895)
ఇతడు రెండో యుద్ధమల్లుడి కుమారుడు. ఇతడికి ‘సోలదగండ’ అనే బిరుదు ఉంది. అంటే అపజయమెరుగని యోధుడు అని అర్థం.
ఇతడు 42 యుద్ధాలు చేసి అన్నింట్లో విజయం సాధించాడు. అందుకే ఈ బిరుదు పొందాడు.
బద్దెగుడు వేంగీ రాజ్యంపై దండెత్తి మొదటి చాళుక్య భీముడిని ఓడించి, మడుగులోని భయంకర మొసలిని పట్టుకొన్నట్లు చాళుక్య భీముడిని బంధించినట్లు పర్బణి శాసనం తెలుపుతుంది.
ఇతడు గుణగ విజయాదిత్యుడిని కూడా ఓడించినట్లు తూర్పు చాళుక్య శాసనాలు తెలియజేస్తున్నాయి.
ఇతడు తన పేరుమీదగా ‘బద్దెగేశ్వర ఆలయాన్ని’ వేములవాడలో నిర్మించాడు. ఇదే ఇప్పుడు వేములవాడ (ప్రస్తుతం సిరిసిల్ల జిల్లా)లో ఉన్న భీమేశ్వరాలయంగా ప్రసిద్ధి చెందింది.
బద్దెగుడి తరువాత అతడి కుమారుడు మూడో యుద్ధమల్లుడు సింహాసనాన్ని అధిష్టించి 895 నుంచి 915 వరకు పాలించాడు. అయితే ఇతడి పాలనా విశేషాల సమాచారం లేదు.
రెండో నరసింహుడు (915-930)
ఇతడు 3వ యుద్ధమల్లుడి కుమారుడు. మహాశక్తిమంతుడైన యుద్ధవీరుడు. గంగానది వరకు దండయాత్ర చేసి ఆనాటి చరిత్రలో తన వ్యక్తిత్వానికొక ప్రాధాన్యం కల్పించుకున్నాడు.
ఇతడు రాష్ట్రకూట 3వ ఇంద్రుడి సామంతుడు. 3వ ఇంద్రుడి ఆజ్ఞ మేరకు రెండో నరసింహుడు ఉత్తర ప్రాంతంపై దండెత్తి లాట, సప్త మాళవను జయించి తదుపరి కనోడ్పై దండెత్తి ప్రతీహార రాజైన మహిపాలుడిని ఓడించి, అతడి అశ్వాలను గంగానదిలో స్నానం చేయించారని తెలుస్తుంది.
ఆ తరువాత ఈ విజయానికి చిహ్నంగా తిరిగి వస్తున్న క్రమంలో యమునా నది తీరంలో కాళప్రియం వద్ద విజయస్తంభాన్ని నాటాడని తెలుస్తుంది.
ఈ ఉత్తర, మధ్య భారత ప్రాంతాల్లో రెండో నరసింహుడు చేసిన యుద్ధాలను కీర్తిస్తూ పంప కవి విక్రమార్జున విజయంలోనూ, రెండో అరికేసరి వేములవాడ శాసనంలోనూ వర్ణించారు.
ఇతడి విజయాలను మెచ్చుకొని 3వ ఇంద్రుడు తన సోదరి ‘జాకవ్వ’ను రెండో నరసింహుడికి ఇచ్చి వివాహం చేశాడు.
రెండో నరసింహుడి కాలంలో వేములవాడలో జైన చౌముఖాలు చెక్కించారు.
ప్రాక్టీస్ బిట్స్
- వేములవాడ చాళుక్య వంశానికి మూలపురుషుడు?
1) రెండో పులకేశి
2) సత్యాశ్రయ రణవిక్రముడు
3) కుబ్జవిష్ణువర్ధనుడు
4) వినయాదిత్య యుద్ధమల్లుడు - వేములవాడ చాళుక్య రాజ్యస్థాపకుడు?
1) వినయాదిత్య యుద్ధమల్లుడు
2) మొదటి అరికేసరి
3) వేగరాజు 4) బద్దెగ - రాజధానిని బోధన్ నుంచి వేములవాడకు మార్చిన చాళుక్య రాజు?
1) బద్దెగ 2) రెండో అరికేసరి
3) మొదటి అరికేసరి
4) యుద్ధమల్లుడు - బద్దెగ నిర్మించిన బద్దెగేశ్వరాలయం (వేములవాడ)ను ప్రస్తుతం ఇలా పిలుస్తున్నారు?
1) భీమేశ్వరాలయం
2) రాజరాజేశ్వరాలయం
3) బద్దిపోచమ్మ ఆలయం
4) రామేశ్వరాలయం - రాష్ట్రకూట మూడో ఇంద్రుడి సోదరిని వివాహం చేసుకున్న చాళుక్య రాజు?
1) అరికేసరి-1 2) నరసింహ-2
3) అరికేసరి-2 4) బద్దెగ - సమస్త లోకాశ్రయ, త్రిభువనమల్ల, రాజత్రినేత్ర బిరుదులు కలిగినది?
1) అరికేసరి-1 2) అరికేసరి-2
3) యుద్ధమల్ల-1 4) నరసింహ-1 - యశస్తిలక చంపూ కావ్యం రచయిత?
1) పంప 2) పృదువిక్రమ
3) సోమదేవ సూరి 4) జినవల్లభ - గంగానది వరకు దండయాత్ర చేసి యమునా నది తీరంలో కాళప్రియం వద్ద విజయ స్తంభాన్ని నాటిన చాళుక్య రాజు?
1) నరసింహ-2 2) అరికేసరి-1
3) బద్దెగ 4) యుద్ధమల్ల-1 - పర్బణి శాసనం ఎవరి విజయాలను తెలుపుతుంది?
1) అరికేసరి-1 2) బద్దెగ
3) వేగరాజు 4) బద్దెగ-2 - కుర్క్యాల శాసనం వేయించింది?
1) జినవల్లభుడు 2) పంపకవి
3) సోమదేవ సూరి 4) పొన్న - పంప కవి విక్రమార్జున విజయం ప్రకారం గజదళం ఎక్కువగా కలిగి ఉన్న చాళుక్య రాజు?
1) సత్యాశ్రయ రణవిక్రముడు
2) పృదువిక్రముడు
3) వినయాదిత్య యుద్ధమల్లుడు
4) మొదటి నరసింహుడు - కాలాముఖ శైవాచార్యుడైన ముగ్ధ శివాచార్యునికి బెల్మోగ గ్రామాన్ని విద్యాదానంగా ఇచ్చిన చాళుక్య రాజు?
1) బద్దెగ 2) అరికేసరి-1
3) వేగరాజు 4) నరసింహ-1
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, కోరుట్ల
9492 575 006
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు