ఇంటి నిర్మాణం.. ఇక్కడే అగ్గువ!
- భాగ్యనగరంలో భవన నిర్మాణం చవక
- ముంబై కంటే 14 శాతం తక్కువ
గృహ, రియల్ ఎస్టేట్ రంగాల్లో అత్యంత కీలకమైంది.. నిర్మాణ వ్యయం. బిల్డర్ల లాభనష్టాలు, వినియోగదారుల సౌకర్యాలు.. అన్నిటికీ అదే ఆధారం. అయితే, దేశంలోనే అతి తక్కువ నిర్మాణ వ్యయం కలిగిన మెట్రో సిటీగా నిలిచింది.. మన భాగ్యనగరం. ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ జేఎల్ఎల్ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ముంబై మహానగరంతో పోలిస్తే, హైదరాబాద్‌లో నిర్మాణ ఖర్చు 14శాతం తక్కువగా ఉన్నట్లు జేఎల్ఎల్ తన నివేదికలో పేర్కొన్నది.
దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే, హైదరాబాద్‌లో నిర్మాణ వ్యయం తక్కువగా ఉన్నట్లు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థ జేఎల్ఎల్ వెల్లడించింది.
న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు, పుణె నగరాల్లో నిర్వహించిన సర్వే ద్వారా ఈ విషయాన్ని తేల్చింది. జేఎల్ఎల్ నివేదిక ప్రకారం.. ముంబై నగరంలో హైరైజ్ బిల్డింగ్‌లోని లగ్జరీ రెసిడెన్షియల్ అపార్టుమెంట్ నిర్మాణం కోసం చదరపు అడుగుకు రూ.5,625 వ్యయం అవుతుంది. అదే హైదరాబాద్ నగరంలో ఈ ఖర్చు కేవలం రూ. 4,275గా ఉన్నది. అదే సమయంలో మీడియం సైజ్ కమర్షియల్ బిల్డింగ్‌ను నిర్మించేందుకు ముంబైలో చదరపు అడుగుకు రూ.3,250 ఖర్చవుతుండగా, ఢిల్లీలో ఇది రూ.2,860గా ఉన్నది. హైదరాబాద్‌లో మాత్రం రూ.2,470 తోనే చదరపు అడుగు నిర్మాణం పూర్తవుతున్నది. ఇలా దేశంలోని అన్ని మెట్రో నగరాలకంటే భాగ్యనగరంలోనే నిర్మాణ వ్యయం తక్కువగా ఉన్నదని జేఎల్ఎల్ సర్వేలో తేలింది. దీనికి స్థానిక పరిస్థితులు, నిర్మాణ సామగ్రి లభ్యత, కొనుగోలు విధానం, బిల్డర్ల ప్రమేయం, నిర్మాణరంగ నిపుణులు, కార్మికుల లభ్యత లాంటివి ప్రధాన కారణమని సదరు నివేదిక వెల్లడించింది.
అందుబాటులో నిపుణులు
నిర్మాణరంగంలో నిపుణులైన ఇంజినీర్లు, ఆర్కిటెక్ట్‌లు, మేస్త్రీలు, ఇతర కూలీల లభ్యత.. భాగ్యనగరంలో ఎక్కువ. 2020లో కొవిడ్ ప్రభావంతో దేశంలోని అన్ని మెట్రో నగరాల నుంచి వేల సంఖ్యలో నిర్మాణరంగ కార్మికులు, కూలీలు, ఇతర నిపుణులు స్వస్థలాలకు వెళ్లిపోయారు. కానీ, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో హైదరాబాద్ నుంచి వలసలు తగ్గాయి. ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరులతో పోలిస్తే మధ్యతరగతి వారు నివాసముండేందుకు హైదరాబాద్ నగరం ఎంతో అనుకూలమైంది. దీంతో ఇక్కడ నిర్మాణరంగ నిపుణులు, కూలీలు ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉంటున్నారు. అంతేకాకుండా, ముంబైతో పోలిస్తే హైదరాబాద్‌లో సైట్ ఇంజినీర్లు, మేస్త్రీలు, కూలీలకు ఇచ్చే వేతనాల్లోనూ తేడాలున్నాయి. ఇక్కడ కార్మికులతోపాటు యంత్రాల వినియోగం కూడా ఎక్కువే. ఇవన్నీ నిర్మాణ వ్యయంపై ప్రభావం చూపుతున్నాయి.
అనుకూలమైన విధానాలు
భవన నిర్మాణాల్లో ప్రభుత్వ పాలసీలు కూడా ప్రధానమైనవే. నిర్మాణ రంగం ద్వారా లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారు. అలాంటి రంగా న్ని ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు పలు ప్రోత్సాహకాలను అందిస్తూనే ఉన్నది. నిపుణులతో చర్చించి బిల్డర్లు, వినియోగదారులకు అనుకూలంగా ఉండేలా టీఎస్ బీపాస్తోపాటు అనేక పాలసీలను తీసుకొచ్చింది. వీటిద్వారా నిర్మాణరంగంలోని సమస్యలను ఎప్పటికప్పడు పరిష్కరిస్తూ, ఈ రంగం వృద్ధికి దోహదం చేస్తున్నది. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ రంగం వృద్ధి చెందడానికి, ధరలు అందుబాటులో ఉండటానికి ఇలాంటి ప్రభుత్వ అనుకూల చర్యలు కూడా కారణమని నిపుణులు పేర్కొంటున్నారు.
స్వీయ నిర్మాణంతోనే..
ముంబై మహానగరంతోపాటు ఇతర మెట్రో సిటీల్లోని అనేక రియల్ ఎస్టేట్ సంస్థలు భవన నిర్మాణ బాధ్యతలను ఇతర కంపెనీలకు టోకుగా అప్పగిస్తాయి. దీనివల్ల నిర్మాణ వ్యయం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ, హైదరాబాద్‌లో బిల్డర్ల స్వీయ పర్యవేక్షణలోనే 70 నుంచి 80 శాతం భవనాల నిర్మాణాలు పూర్తవుతాయి. నిర్మాణరంగానికి అవసరమైన రా మెటీరియల్స్ కూడా భాగ్యనగరం చుట్టుపక్కల పుష్కలంగా దొరుకుతున్నాయి. నిర్మాణాల్లో అత్యవసరమయ్యే ఇసుక ధరలు కూడా ఇక్కడి ప్రభుత్వ నియంత్రణలోనే ఉన్నాయి. దీంతో ఇక్కడ నిర్మాణ వ్యయం తక్కువగా ఉంటున్నది. నిర్మాణ వ్యయంలో కీలకమైన సామాగ్రి కొనుగోలులోనూ స్థానిక బిల్డర్లు ప్రత్యేక శ్రద్ధ చూపుతారు. భారీ ప్రాజెక్టులు మొదలుకొని వ్యక్తిగత ఇండ్ల వరకూ మధ్యవర్తుల ప్రమేయం లేకుండానే సామాగ్రిని కొనుగోలు చేస్తుంటారు. దీనివల్ల కూడా నిర్మాణ ఖర్చు తగ్గేందుకు అవకాశం కలుగుతున్నది.
-బరిగెల శేఖర్
ప్రత్యక్ష ప్రమేయం..
ఆయా ప్రాంతాలు, అక్కడి పరిస్థితులపై భవన నిర్మాణ వ్యయం ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా నిర్మాణానికి అవసరమైన రా మెటీరియల్ (ఇసుక, సిమెంటు, ఇతర సామగ్రి) అందుబాటులో ఉండటమూ కీలకమే. నిర్మాణరంగ నిపుణులు, కూలీల లభ్యత కూడా ఖర్చుపై ప్రభావం చూపుతుంది. ఇవన్నీ భాగ్యనగరానికి ఎంతో అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ నిర్మాణ బాధ్యతలను వేరే సంస్థలకు అప్పగించడం చాలా తక్కువ. ఇక్కడి బిల్డర్లు తాము నిర్మించే భవనాలపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకొంటారు. అవసరమైన అన్ని రకాల సామగ్రిని స్వీయ పర్యవేక్షణలో కొనుగోలు చేస్తారు. దీనివల్ల కూడా నిర్మాణ వ్యయం తగ్గుతుంది.
- రాజశేఖర్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ, క్రెడాయ్
ఇవీ కూడా చదవండీ…
విమాన సర్వీసుల మార్పుపై ఫీజు రద్దు!
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు