Israel – Hamas war | రావణకాష్టం.. ఇజ్రాయోల్ – పాలస్తీనా వివాదం
తూర్పు జెరూసలెంలోని అల్-అఖ్సా కేంద్రంగా ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య అలజడి రేగింది. ఎన్నో ఏళ్లుగా కొనసాగుతూ వస్తున్న ఉద్రిక్తతలు తాజాగా ఇరు దేశాల మధ్య భీకర దాడులకు మళ్లీ తెరతీశాయి. అసలు అల్-అఖ్సా అంటే ఏమిటి? దీన్ని కేంద్రంగా చేసుకొని ఎందుకు ఘర్షణ సాగుతుంది? వార్తల్లో నిలిచిన ‘హమాస్’ అంటే ఏంటి? అది ఎలా ఏర్పడింది? ఆ సంస్థకు ఎవరు సాయం చేస్తున్నారు? అనే సందేహాలు అందరికీ కలుగుతు న్నాయి. వీటన్ని టికీ సమాధా నాలు తెలుసుకుందాం.
చరిత్ర
- ఇజ్రాయెల్ ఎలా ఏర్పడింది, పాలస్తీనా రెండు భూభాగాలుగా ఎందుకుంది. ఈ వందేళ్ల సంక్షోభానికి ముగింపు ఉంటుందా? అనే ప్రశ్నలు చాలామందికి తలెత్తుతాయి. ఒకసారి ఈ రెండు ప్రాంతాల మధ్య ప్రస్తుతం ఉన్న పరిస్థితులను అర్థం చేసుకునే ముందు ఈ ప్రాంత చరిత్ర ఏంటో చూద్దాం.
- మొదటి ప్రపంచ యుద్ధం సమయం నుంచి ఇదొక రావణకాష్టంలా రగులుతూనే ఉంది. ఇరవయ్యో శతాబ్దం ప్రారంభంలో ఐరోపాలో యూదులను లక్ష్యంగా చేసుకుని హింస ప్రజ్వరిల్లింది. ఆ పరిస్థితుల్లో యూదులకు ప్రత్యేక దేశం కావాలన్న డిమాండ్ ఊపందుకుంది.
- మధ్యధరా సముద్రం, జోర్డాన్ నదికి మధ్య ఉన్న పాలస్తీనా ప్రాంతాన్ని యూదులు, ముస్లింలు, క్రైస్తవులు కూడా పవిత్ర స్థలంగా భావిస్తారు, ప్రపంచవ్యాప్తంగా యూదులకు, ముస్లింలకు కూడా జెరూసలెం పవిత్ర స్థలం.
- మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ఈ ప్రాంతాన్ని ఒట్టోమాన్ సామ్రాజ్యం పరిపాలించేది. ఈ ప్రాంతం చాలావరకు ముస్లింలు, అరబ్బుల స్వాధీనంలో ఉండేది. ఐరోపాలో తమపై జరుగుతున్న దాడిని తప్పించుకునేందుకు అనేకమంది యూదులు ప్రాణాలు చేతబట్టుకుని పాలస్తీనా ప్రాంతానికి తరలివచ్చారు. క్రమేపీ ఈ ప్రాంతానికి వచ్చే యూదుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. దాంతో, స్థానిక అరబ్బులు, యూదులకు వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభించారు.
- మొదటి ప్రపంచ యుద్ధంలో పాలస్తీనా ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఒట్టోమాన్ సామ్రాజ్యం ఓటమి పాలైంది. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత ఒట్టోమాన్ సామ్రాజ్యం విచ్ఛిన్నం కావడంతో, ఆ ప్రాంతాన్ని తమ అధికారం కిందకు తెచ్చుకునేందుకు బ్రిటన్, లీగ్ ఆఫ్ నేషన్స్ నుంచి అనుమతి పొందింది.
- మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు, జరుగుతున్న సమయంలో కూడా ఆంగ్లేయులు యూదులకు, అరబ్బులకు అనేక వాగ్దానాలు చేశారు. వాటిలో కొన్నింటిని బ్రిటన్ నెరవేర్చలేకపోయింది. అంతే కాకుండా, మధ్యప్రాచ్యాన్ని ఫ్రాన్స్‌తో ముందే పంచుకుంది. ఈ పరిస్థితులన్నీ యూదులు, అరబ్బుల మధ్య ఉద్రిక్తతలకు కారణమయ్యాయి.
- రెండు పక్షాల సాయుధ దళాల మధ్య హింసాత్మక ఘర్షణలు ప్రారంభమయ్యాయి. నాజీల చేతిలో యూదుల ఊచకోత, రెండో ప్రపంచ యుద్ధం తరువాత యూదులకు ప్రత్యేక దేశం కావాలన్న డిమాండ్ మరింత పెరిగింది. బ్రిటన్ ఆ ప్రాంతాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకుంది. ఆ ప్రాంతంలో యూదులు తక్కువ సంఖ్యలోనూ, అరబ్బులు ఎక్కువ సంఖ్యలో ఉండేవారు.
- పాలస్తీనా ప్రాంతంలో యూదుల రాజ్యాన్ని ఏర్పాటు చేసే బాధ్యత ప్రపంచ దేశాలు బ్రిటన్‌కు అప్పగించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు మొదలయ్యాయి. పాలస్తీనా తమ పూర్వీకులకు చెందిన ప్రాంతమని తమకే హక్కు ఉందని యూదులు వాదిస్తే, అరబ్బులు అదే తమ మాతృభూమి అని దాన్ని వదల్లేమని కరాఖండీగా చెబుతూ వచ్చారు.
- 19201940 మధ్య పాలస్తీనాలో యూదుల శరణార్థుల సంఖ్య భారీగా పెరిగింది. ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధం కాలంలో యూరప్‌లో యూదులపై ఊచకోతతో ఎందరో పాలస్తీనాకు పారిపోయి వచ్చి తలదాచుకున్నారు. 1947లో పాలస్తీనాను రెండుగా విభజించి యూదులకు, అరబ్బు లకు పంచి ఇవ్వాలని, జెరూసలెంను అంతర్జాతీయ నగరంగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితి సిఫారసు చేసింది. కానీ అరబ్బులు అందుకు సమ్మతించలేదు. ఈ వివాదాన్ని బ్రిటిష్‌వారు పరిష్కరించలేకపోయారు.
- 1948లో బ్రిటిష్ వాళ్లు ఆ ప్రాంతాన్ని విడిచివెళ్లిపోయిన తరువాత యూదులు ఇజ్రాయెల్ దేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 1948, మే 14న ఇజ్రాయెల్ దేశం ఏర్పడింది. దీన్ని పాలస్తీనియన్లు తీవ్రంగా వ్యతిరేకంచడంతో ఘర్షణ చెలరేగింది. అప్పట్నుంచి ఇరు ప్రాంతాల మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది.
- దాంతో, స్థానిక ఉద్రిక్తతలు ప్రాంతీయ విభేదాలుగా మారిపోయాయి. మరుసటి రోజే ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, ఇరాక్‌లు ఈ ప్రాంతంపై దాడి చేశాయి. ఇదే మొదటి అరబ్-ఇజ్రాయెల్ యుద్ధం. దీన్నే యూదుల స్వాతంత్య్ర సంగ్రామం అని కూడా పిలుస్తారు. చుట్టుపక్కల ఉన్న అరబ్బు దేశాలు కూడా సైనిక చర్యలకు దిగాయి.
- 1967లో మరోసారి అరబ్ దేశాలకు, ఇజ్రాయెల్‌కు మధ్య ఘర్షణలు చెలరేగి భారీ యుద్ధానికి దారి తీశాయి. ఆ ఏడాది జూన్ 5 నుంచి 10 వరకు జరిగిన సంఘటనల దీర్ఘకాలిక ప్రభావాలు అనేక స్థాయిల్లో కనిపించాయి. ఈ యుద్ధంలో అరబ్ దేశాల కూటమిపై ఇజ్రాయెల్ విజయం సాధించింది. గాజా స్ట్రిప్, ఈజిప్ట్ లోని సినాయ్ ద్వీపకల్పం, వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూ సలేం, గోలన్ హైట్స్ ఇజ్రాయెల్ ఆధీనంలోకి వచ్చాయి. ఐదు లక్షల మంది పాలస్తీనియన్లు నిరాశ్రయులయ్యారు.
- 1973లో అరబ్ దేశాలకు, ఇజ్రాయెల్‌కు మధ్య ‘యోం-కిప్పుర్’ యుద్ధం జరిగింది. ఈజిప్ట్, సిరియా కలిసి ఇజ్రాయెల్‌పై దండెత్తాయి. ఈ యుద్ధంలో ఈజిప్ట్ సినాయ్ ద్వీపకల్పాన్ని స్వాధీనం చేసుకుంది. 1982లో ఇజ్రాయెల్ సినాయ్ ప్రాంతం నుంచి వైదొలగింది. కానీ, గాజా ప్రాంతంపై పట్టు వదల్లేదు.
- ఆరు సంవత్సరాల తరువాత ఈజిప్ట్, ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఇజ్రాయెల్‌తో సమస్యలను పరిష్కరించుకున్న తొలి అరబ్ దేశం ఇదే. తరువాత, జోర్డాన్ కూడా ఈజిప్ట్ బాటలో నడిచింది.
- 2005లో గాజా నుంచి ఇజ్రాయెల్ వైదొలిగినప్పటికీ, ఐక్యరాజ్యసమితి ఆ భూమిని ఇప్పటికీ ఆక్రమిత భూభాగంగానే పరిగణిస్తోంది. ఇక్కడి ప్రజలు, వస్తువులు, సేవలు, గాలి, నీరు, సముద్రంపై ఇంకా ఇజ్రాయెల్ నియంత్రణ ఉంది. ప్రస్తుతం గాజా, పాలస్తీనియన్ తీవ్రవాద సంస్థ ’హమాస్’ పాలనలో ఉంది. ఈ సంస్థ ఇజ్రాయెల్‌తో అనేకమార్లు పోరాడింది. వెస్ట్ బ్యాంక్, పాలస్తీనియన్ నేషనల్ అథారిటీ నియంత్రణలో ఉంది.
- పాలస్తీనియన్ నేషనల్ అథారిటీని అంతర్జాతీయ సమాజం పాలస్తీనా ప్రభుత్వంగా గుర్తిస్తుంది. ఇజ్రాయెల్ ఏర్పడిన తరువాత, పాలస్తీనియన్లను అక్కడ నుంచి పంపించేసిన తరువాత గాజా, వెస్ట్ బ్యాంక్, జోర్డాన్, సిరియా, లెబనాన్లలో పాలస్తీనా శరణార్థులు పెరగసాగారు. అరబ్ దేశాల్లో శరణార్థుల శిబిరాలలో పాలస్తీనా ఉద్యమం ఊపందుకుంది. ఈ ఉద్యమానికి ఈజిప్ట్, జోర్డాన్‌ల మద్దతు లభించింది.
బాల్ఫోర్ డిక్లరేషన్
- ప్రస్తుతం ఇజ్రాయెల్ ఉన్న ప్రాంతాన్నే దేవుడు తమ పూర్వీకుడైన అబ్రహంకు, ఆయన వారసులకు ఇస్తానని వాగ్దానం చేసినట్లు యూదులు విశ్వసిస్తారు. పూర్వం ఈ ప్రాంతంపై అసిరియన్లు (ప్రస్తుత ఇరాక్, ఇరాన్, టర్కీ, సిరియాల్లో నివసిస్తున్న గిరిజనులు), బాబిలోనియన్లు, పర్షియన్లు, మాసిడోనియన్లు, రోమన్లు దాడి చేశారు. రోమన్ పాలనలోనే ఈ ప్రాంతానికి పాలస్తీనా అనే పేరు వచ్చిందని తరువాత ఈ ప్రాంతం నుంచి యూదు ప్రజలను బహిష్కరించారు. ఇస్లాం పెరుగుదలతో ఏడో శతాబ్దంలో పాలస్తీనా అరబ్బుల ఆధీనంలోకి వచ్చింది. తరువాత యూరోపియన్లు దీన్ని జయించారు.
- 1516లో పాలస్తీనా టర్కీ ఆధీనంలోకి వచ్చింది. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత బ్రిటన్ ఆధీనంలోకి వెళ్లింది. 1947 సెప్టెంబర్ 3న ఐక్యరాజ్యసమితి ప్రత్యేక కమిటీ పాలస్తీనాపై తన నివేదికను జనరల్ అసెంబ్లీకి సమర్పించింది. ఈ నివేదికలో మధ్యప్రాచ్యంలో యూదుల ప్రత్యేక రాజ్యం స్థాపించడానికి మత పరమైన, చారిత్రక కారణాలను కమిటీ అంగీకరించింది.
- 1917లో ‘బాల్ఫోర్ డిక్లరేషన్’లో పాలస్తీనాలో యూదులకు ప్రత్యేక రాజ్యం ఏర్పాటు చేసేందుకు బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించింది. ఈ డిక్లరేషన్‌లో పాలస్తీనాకు, యూదులకు ఉన్న చారిత్రక సంబంధాన్ని అంగీకరించారు. దాంతో, ఇక్కడ యూదుల ప్రత్యేక రాజ్యం ఏర్పాటుకు పునాది పడింది. అయితే, అరబ్బులు, యూదుల మధ్య వివాదాలను బ్రిటన్ పరిష్కరించలేకపోవడంతో ఈ సమస్యను ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లింది.
ఐక్యరాజ్యసమితి ఆమోదం
- 1947, నవంబర్ 29న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ పాలస్తీనా విభజన ప్రణాళికను ఆమోదించింది. జెరూసలేంను అంతర్జాతీయ నగరంగా ప్రక టించాలని సిఫారసు చేసింది. దీనికి యూదు నాయకులు సమ్మతి తెలిపినప్పటికీ, అరబ్బులు అంగీకరించలేదు. కాబట్టి ఈ ప్రణాళిక ఎప్పుడూ అమల్లోకి రాలేదు.
- 1948లో బ్రిటిష్ వాళ్లు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లిపోయిన తరువాత ఇజ్రాయెల్ స్వతంత్ర రాజ్యం గా ప్రకటించు కుంది. మరుసటి రోజే ఇజ్రాయెల్ ఐక్యరాజ్యసమితి సభ్యత్వం కోసం దరఖాస్తు చేసింది. ఒక సంవత్సరం తరువాత అది ఆమోదం పొందింది. ఐక్యరాజ్యసమితి సభ్య దేశాల్లోని 83 శాతం దేశాలు ఇజ్రాయెల్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించాయి.
- మరి రెండు పాలస్తీనా భూభాగాలు ఎందుకున్నాయి అనే ప్రశ్న కూడా చాలా మందిలో తలెత్తుతుంది. పాలస్తీనాపై ఐక్యరాజ్యసమితి ప్రత్యేక కమిటీ 1947లో జనరల్ అసెంబ్లీకి సమర్పించిన నివేదికలో వెస్ట్రన్ గ్యాలీ (సమారియా, జుడియా పర్వత ప్రాంతం)ని అరబ్ దేశంలో చేర్చాలని, జెరూసలెం, ఈజిప్ట్ సరిహద్దులో ఉన్న ఇస్దుద్ తీర ప్రాంతాన్ని బయట ఉంచాలని సిఫారసు చేసింది. అయితే 1949లో ఏర్పడిన ’అర్మిైస్టెస్ రేఖ’ ద్వారా పాలస్తీనా విభజన జరిగింది.
- ఇజ్రాయెల్ ఏర్పడిన అనంతరం, మొదటి అరబ్-ఇజ్రాయెల్ యుద్ధం తరువాత ఈ రేఖ ఏర్పడింది. పాలస్తీనాలో ఉన్న వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్ ఒకదానికొకటి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. వెస్ట్ బ్యాంక్ వైశాల్యం 5,970 చదరపు కిలోమీటర్లు కాగా, గాజా స్ట్రిప్ వైశాల్యం 365 చదరపు కిలోమీటర్లు. వెస్ట్ బ్యాంక్ జెరూసలెంకు, జోర్డాన్‌కు తూర్పు భాగంలో ఉంది.
- పాలస్తీనా, ఇజ్రాయెల్ కూడా జెరూసలెంను తమ రాజధానిగా ప్రకటించుకున్నాయి. గాజా స్ట్రిప్ 41 కిలోమీటర్ల పొడవు.. 6 నుంచి 12 కిమీ వెడల్పు ఉంటుంది. గాజా సరిహద్దు, ఇజ్రాయెల్ వెంట 51 కిలోమీటర్లు, ఈజిప్టు వెంట ఏడు కిలోమీటర్లు, మధ్యధరా తీరం వెంట 40 కిలోమీటర్లు ఉంటుంది. గాజా స్ట్రిప్‌ను 1967 యుద్ధంలో ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది.
పాలస్తీనా విముక్తి సంస్థ
- 1967లో జరిగిన యుద్ధం తరువాత యాసర్ అరాఫత్ నేతృత్వంలోని ‘ఫతా’ వంటి సంస్థలు కలిసి ‘పాలస్తీనా విముక్తి సంస్థ (పీఎల్ఓ)’ను ఏర్పాటు చేశాయి. పీఎల్ఓ మొదట జోర్డాన్ నుంచి, తరువాత లెబనాన్ నుంచి ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఇజ్రాయెల్ లోపల, వెలుపల ఉన్న అన్ని ప్రాంతాలనూ లక్ష్యాలుగా చేసుకుంది.
- రాయబార కార్యాలయాలు, విమానాలు, ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుంది. ఇజ్రాయెల్‌పై పీఎల్ఓ దాడులు అనేక సంవత్సరాలపాటు కొనసాగాయి. చివరకు, 1993లో ఓస్లో శాంతి ఒప్పందంపై ఇజ్రాయెల్, పీఎల్ఓ సంతకాలు చేశాయి. పాలస్తీనా విముక్తి సంస్థ ఉగ్రవాదాన్ని, హింసను విడిచిపెడతామని హామీ ఇచ్చింది. ఇజ్రాయెల్ శాంతి, భద్రతల హక్కును అంగీకరించింది. కానీ, హమాస్ ఈ ఒప్పందాన్ని అంగీకరించలేదు.
- ఓస్లో ఒప్పందం తరువాత పాలస్తీనా నేషనల్ అథారిటీ ఏర్పడింది. ఈ అథారిటీకి అంతర్జాతీయ స్థాయిలో పాలస్తీనా ప్రజలకు ప్రాతినిధ్యం వహించే హక్కు లభించింది. దీనికి అధ్యక్షుడిని ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు. అలా ఎన్నికయిన అధ్యక్షుడు ప్రధానమంత్రిని, మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పౌరులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసే హక్కు ఈ అథారిటీకి ఉంటుంది. అయితే, చారిత్రకంగా పాలస్తీనియన్ల రాజధానిగా పరిగణిస్తున్న తూర్పు జెరూసలేంను ఈ ఒప్పందంలో చేర్చలేదు. జెరూసలేంకు సంబంధించి ఇప్పటికీ రెండు పక్షాల మధ్య తీవ్ర వివాదం కొనసాగుతోంది.
ఏమిటీ హమాస్?
- హమాస్ పూర్తి పేరు ‘హర్కత్ అల్ ముఖావమా అల్-ఇస్లామియా’ పాలస్తీనాలోని రెండు రాజకీయ పక్షాల్లో ఇదొకటి. 1987లో వెస్ట్ బ్యాంక్, గాజా, తూర్పు జెరు సలేంలో ఇజ్రాయెల్ ఆక్రమణకు వ్యతిరేకంగా పాలస్తీనా ప్రాంతాల్లో మొదటి ఇంతిఫధా (తిరుగుబాటు) ఉద్యమం జరిగింది. ఆ సమయంలోనే హమాస్ ఏర్పాటైంది. షేక్ అహ్మద్ యాసిన్ దీన్ని నెలకొల్పారు.
- ఇది ‘ముస్లిం బ్రదర్ హుడ్ సంస్థకు రాజకీయ అనుబంధ విభాగంగా ఉండేది. 1988లో హమాస్ తన చార్టర్‌ను ప్రచురించింది. ఇజ్రాయెల్‌ను నాశనం చేయాలని, ఒకప్పటి పాలస్తీనాను పునరుద్ధరించి ఇస్లామిక్ సమాజాన్ని ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అందులో ప్రకటించింది.
- 1993లో పాలస్తీనా నేత యాసర్ అరాఫత్, అప్పటి ఇజ్రాయెల్ ప్రధాని ఇజాక్ రాబిన్ మధ్య ఓస్లో ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం వెస్ట్ బ్యాంక్, గాజాల్లో పాలస్తీనా అథారిటీ ఆధ్వర్యంలో పరిమిత స్వయం పాలన ప్రభుత్వం ఏర్పడింది. దీన్ని హమాస్ తీవ్రంగా వ్యతిరేకించింది. ఒప్పందాన్ని నిరసిస్తూ హింసకు దిగింది. అదే ఏడాది ఏప్రిల్‌లో తొలిసారి ఆత్మాహుతి దాడికి పాల్పడింది. అది మొదలు అనేక దాడులకు దిగింది. ఇదో విదేశీ ఉగ్రవాద సంస్థ అంటూ అమెరికా, బ్రిటన్ తదితర దేశాలు ప్రకటించాయి.
- గాజాలో హమాస్ బలంగా ఉంది. 2006 నుంచి ఆ ప్రాంతంలో పరిపాలన సాగిస్తోంది. పాలస్తీనా ప్రవాసులు, పర్షియన్ గల్ఫ్‌లోని ప్రైవేటు దాతలు ఎక్కువగా హమాస్‌కు నిధులు అందిస్తుంటారు. పశ్చిమ దేశాల్లోని ఇస్లామిక్ దాతృత్వ సంస్థల నుంచి సాయం అందుతుంది. తుర్కియే నుంచి కూడా నిధులు వస్తున్నాయి. ఇరాన్ ప్రస్తుతం ఏటా 10 కోట్ల డాలర్లను హమాస్‌కు అందిస్తుంది.
- హమాస్ ఆయుధాల్లో ప్రధానమైనవి.. నేల నుంచి నేల మీద లక్ష్యాలపైకి ప్రయోగించే సామర్థ్యమున్న రాకెట్లు. లక్ష్యాన్ని కచ్చితత్వంతో ఛేదించేలా స్వీయమార్గనిర్దేశం (గైడెడ్ సామర్థ్యం) వీటికి ఉండదు. అయినా వాటిని పెద్ద సంఖ్యలో ప్రయోగించడం ద్వారా ఇజ్రాయెల్‌ను చికాకుపెడుతుంది. వీటి సామర్థ్యాన్ని అంతకంతకూ పెంచుకుంటూ పోతోంది.
- మోర్టార్లతోనూ దాడులకు దిగుతోంది. మండే స్వభావం గల పరికరాలతో కూడిన బెలూన్లను ఇజ్రాయెల్ పైకి వదులుతుంటుంది. వీటివల్ల మంటలు చెలరేగి.. భారీగా నష్టం వాటిల్లుతోంది. హమాస్‌లో ప్రస్తుతం 30 వేల మంది మిలిటెంట్లు, 400 మంది నేవల్ కమాండోలు ఉన్నారు.
అసలేంటి అల్-అఖ్సా?
- ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య గొడవలకు తూర్పు జెరూసలేంలోని అల్-అఖ్సా ప్రధాన కేంద్రంగా నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు, ముస్లింలు, యూదులు అత్యంత పవిత్రంగా భావించే పాత జెరూసలేంలో ఉండే అల్-అఖ్సా ఓ మసీదు. ఇస్లాం మతస్థులకు అత్యంత పవిత్ర స్థలాల్లో అల్-అఖ్సా ఒకటి. ఇస్లామిక్ నమ్మకాల ప్రకారం మహమ్మద్ ప్రవక్త మక్కా నుంచి ఒక రాత్రి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసిన తర్వాత స్వర్గారోహణ చేశారని చెబుతారు. యూదులు ఇదే ప్రాంతాన్ని టెంపుల్‌మౌంట్‌గా అభివర్ణిస్తారు. వారికి ఈ టెంపుల్‌మౌంట్ అత్యంత పవిత్రస్థలం.
- ఒకప్పుడు ఈ కొండపై రెండు పురాతన యూదు ఆలయాలు ఉండేవి. మెుదటిది బైబిల్ ప్రకారం కింగ్ సాల్మన్ నిర్మించింది. తర్వాత బాబిలోనియన్స్ దాన్ని కూలగొట్టారు. రెండోది నిర్మితమై 600 ఏళ్ల తర్వాత క్రీ.శ. తొలి శతాబ్దిలో రోమన్ చక్రవర్తి చేతిలో ధ్వంసమైంది. మెస్సయ్య తిరిగి వచ్చాక ఇక్కడే మళ్లీ ఆలయం కడతారని, ఇక్కడ ఇంకా దైవశక్తి ఉందని యూదుల నమ్మకం.
l 1967లో జరిగిన అరబ్-ఇజ్రాయెల్ యుద్ధంలో.. తూర్పు జెరూసలేంను జోర్డాన్ నుంచి ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. ఒకప్పుడు కూల్చిన తమ ఆలయాలను పునర్నిర్మించడానికి 1990లో కొంతమంది యూదు అతివాదులు ప్రయత్నించగా, గొడవలు తీవ్రమయ్యాయి. 1994 లో జోర్డాన్, ఇజ్రాయెల్ మధ్య ఓ శాంతి ఒప్పందం కుదిరింది. దాని ప్రకారం అల్-అఖ్సా విషయంలో యధాతథస్థితి కొనసాగించాని నిర్ణయించారు. - ఇక్కడ ప్రార్థనలకు ముస్లింలకు అనుమతించినట్లుగా.. యూదులు, క్రైస్తవులను అనుమతించరు. వారు కేవలం ఈ స్థలాన్ని సందర్శించి వెళ్లడానికి మాత్రమే అనుమతి ఉంది. అల్-అఖ్సా ప్రాంగణంలో ప్రార్థనలకు అనుమతుల్లో ముస్లిమేతరులపై వివక్ష చూపుతున్నారంటూ.. చాలా కాలంగా వివాదం కొనసాగుతోంది. ఇజ్రాయెల్‌లోని అనేక యూదు మతసంస్థలు.. తమకూ ప్రార్థనలకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నాయి. దీంతో అల్-అఖ్సా ప్రాంగణంలో.. ఇజ్రాయోల్ బలగాలతో పాలస్తీనీయులు గొడవకు దిగి ఘర్షణలు జరిగాయి. కొద్దిరోజుల కిందట ఇజ్రాయెల్ భద్రతా దళాల సాయంతో యూదు అతివాదులు భారీ సంఖ్యలో.. అల్-అఖ్సా ప్రాంగణంలోకి అడుగుపెట్టారు. ఫలితంగా ఘర్షణ ముదిరి హమాస్ దాడులకు దారి తీసింది.
ఇజ్రాయెల్పాలస్తీనా దాడుల్లో ప్రధాన ఘటనలు
- 2005లో గాజాస్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ సేనల ఉపసంహరణ తర్వాత చాలా ఘటనలు ఈ ప్రాంతాల మధ్య జరిగాయి. అందులో ముఖ్యమైనవి..
- 2006 జనవరి 25: పాలస్తీనా చట్టసభ సభ్యుల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను హమాస్ గెలుచుకుంది. ఇజ్రాయెల్‌ను గుర్తించడానికి, హింసను విడిచి పెట్టడానికి హమాస్ నిరాకరించడంతో పాలస్తీనాకు ఆర్థిక సాయాన్ని ఇజ్రాయెల్, అమెరికా నిలిపివేశాయి.
- 2007 జూన్ 14: గాజాను హమాస్ స్వాధీనపరచు కోవడం జరిగింది.
- 2008 డిసెంబరు 27: పాలస్తీనా సేనలు తమ పైకి రాకెట్ దాడులకు దిగడంతో ఇజ్రాయెల్ భీకర పోరుకు తెరతీసింది. 22 రోజులకు పైగా ఇది కొనసాగింది. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరేలోగా దాదాపు 1,400 మంది పాలస్తీనా పౌరులు, 13 మంది ఇజ్రాయెల్ వాసులు ప్రాణాలు కోల్పోయారు.
- 2012 నవంబర్ 14: హమాస్ సైనికాధిపతి అహ్మద్ జబారీని ఇజ్రాయెల్
హతమార్చింది. - 2014 జులై-ఆగస్టు: ఇజ్రాయెల్‌కు చెందిన కొంతమంది యువకులను హమాస్ ఆపహరించుకుపోయి హత్య చేయడంతో ఉద్రిక్తత తలెత్తింది. కొన్ని వారాల పాటు ముమ్మరంగా యుద్ధం కొనసాగింది. గాజాలో 2100 మంది పాలస్తీనావాసులు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ వాసులు, సైనికులు కూడా చనిపోయారు.
- 2018 మార్చి: గాజా కంచె ఉన్న సరిహద్దు వద్ద పాలస్తీనా నిరసనలు చేయడంతో వారిని నిలువరించేందుకు ఇజ్రాయెల్ సేనలు కాల్పులు జరిపింది. కొన్ని నెలలు కొనసాగిన ఘర్షణల్లో వందల మంది పాలస్తీనా వాసులు ప్రాణాలు కోల్పోయారు.
- 2023 ఫిబ్రవరి 2: పాలస్తీనా వేసిన ఒక రాకెట్‌ను ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ నిలువరించింది. ఎదురుదాడిలో ‘హమాస్’లకు చెందిన ఒక రసాయన కర్మాగారంపై ఇజ్రాయెల్ జెట్లు దాడి జరిపాయి. ఆయుధాల తయారీ క్షేత్రం పైనా విరుచుకుపడ్డాయి.
- 2023 మే 13: అయిదు రోజుల ముమ్మరపోరు తర్వాత ఇజ్రాయెల్, గాజా తీవ్రవాదుల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం చోటు చేసుకుంది.
- 2023 సెప్టెంబరు 26: హమాస్ సైనిక శిబిరంపై ఇజ్రాయెల్ సైనికులు డ్రోన్ల దాడి జరిపారు. గాజా నుంచి ఎరేజ్ వద్ద సరిహద్దు దాటే మార్గాన్ని ఇజ్రాయెల్ మూసివేయడంపై పాలస్తీనావాసులు రోజూ ప్రదర్శనలు చేస్తూ వస్తున్నారు. కొంతకాలం పాటు ఉన్న ప్రశాంతత మళ్లీ కరువైంది.
కొలిక్కి రాని సమస్యలు
- ఇజ్రాయెల్ జెరూసలేం మొత్తాన్ని తన రాజధానిగా ప్రకటించుకుంటే, పాలస్తీనియన్లు తూర్పు జెరూసలేంను తమ భవిష్యత్ రాజధానిగా ప్రకటించుకున్నారు.
- 2005లో గాజా నుంచి ఇజ్రాయెల్ సేనలు వైదొలగినప్పటికీ ఐక్యరాజ్యసమితి ఇప్పటికీ ఆ ప్రాంతాన్ని ఆక్రమిత భూభాగంగానే చూస్తోంది.
- వెస్ట్‌బ్యాంక్ ప్రాంతం ఇప్పటికీ ఇజ్రాయెల్ ఆధీనంలోనే ఉంది.
- ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య ఉద్రిక్తతలకు కేంద్రంగా తూర్పు జెరూసలేం, గాజా, వెస్ట్ బ్యాంక్ మారాయి.
- వెస్ట్‌బ్యాంక్‌లో ఇజ్రాయెల్ అంతర్జాతీయ నిబంధనల్ని తోసిరాజని ఎన్నో అక్రమ కట్టడాలను నిర్మించింది. వాటిని తొలగించే అంశంలో వివాదం నెలకొంది.
- పాలస్తీనా శరణార్థుల భవిష్యత్‌పై ఆందోళనలతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.
- ఇజ్రాయెల్‌తో పాటు పాలస్తీనా రాజ్యం కూడా ఏర్పడాలా? వద్దా? వెస్ట్ బ్యాంక్‌లో యూదుల నివాసాలను ఉంచాలా? లేక తొలగించాలా? పాలస్తీనా చుట్టూ పహారా కాస్తున్న ఇజ్రాయెల్.. ఇవే అక్కడి శాంతికి భంగం కలిగిస్తున్న అంశాలు.
- హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం పాలస్తీనా చుట్టూ ఇజ్రాయెల్ బిగించిన రక్షణ వలయాన్ని విమర్శించింది. 2000 సంవత్సరంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు.
- ఆ సందర్భంగా, పైన చెప్పిన అంశాలే కాకుండా, ఇరు పక్షాల మధ్య రాజీ కుదరని అంశాలు ఇంకా ఉన్నాయనే విషయం స్పష్టమైంది. ఆ సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని ఎహుద్ బరాక్, పాలస్తీనా అధ్యక్షుడు యాసర్ అరాఫత్ మధ్య రాజీ కుదర్చడంలో బిల్ క్లింటన్ విఫలమయ్యారు.
- పాలస్తీనియా శరణార్థుల భవిష్యత్తు ఏమిటి? జెరూసలేంను రెండు వర్గాలు పంచుకోవాలా, వద్దా? వెస్ట్ బ్యాంక్‌లో ఇజ్రాయెల్ సెటిల్మెంట్లు మొదలైన విషయాల్లో రెండు పక్షాల మధ్య అంగీకారం కుదరలేదు. జెరూసలేంను తమ రాజధానిగా ఇజ్రాయెల్ ప్రకటించుకుంది. కాగా, పాలస్తీనియన్లు తూర్పు జెరూసలేంను భవిష్యత్తు పాలస్తీనా రాజ్యానికి రాజధానిగా పేర్కొన్నారు. గత 50 ఏళ్లల్లో ఇజ్రాయెల్ ఈ ప్రాంతాల్లో అనేక నివాసాలను ఏర్పాటు చేసుకుంది.
- అంతర్జాతీయ చట్టాల ప్రకారం అవన్నీ అక్రమ నివాసాలని పాలస్తీనియన్లు ఆరోపిస్తున్నారు. ఇజ్రాయెల్ ఈ ఆరోపణలను అంగీకరించదు. పాలస్తీనా శరాణార్థుల సంఖ్య ఒక కోటి కంటే ఎక్కువగా ఉంటుందని పీఎల్ఓ చెబుతోంది. ఇందులో సగం మంది ఐక్యరాజ్యసమితిలో తమ పేరును నమోదు చేసుకున్నారు. ఈ శరణార్థులందరికీ తమ మాతృభూమికి తిరిగి వచ్చే హక్కు ఉందని పాలస్తీనా అంటోంది. వీరు మాతృభూమిగా చెబుతున్నది ప్రస్తుత ఇజ్రాయెల్. వీరంతా స్వదేశానికి చేరుకుంటే అక్కడ వీరి సంఖ్య పెరిగిపోయి, యూదు రాజ్యంగా ఉన్న తమ దేశ ఉనికి ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఇజ్రాయెల్ అంటోంది.
- పాలస్తీనాకు ఒక దేశంగా గుర్తింపు ఉందా? ఐక్యరాజ్యసమితి పాలస్తీనాను ’సభ్యత్వం లేని అబ్జర్వర్ స్టేట్’ గా గుర్తిస్తుంది. అయితే, ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాల్గొనే హక్కు, చర్చల ద్వారా ఐక్యరాజ్యసమితి సంస్థల్లో సభ్యత్వం పొందే అవకాశం పాలస్తీనాకు ఉంది. 2011లో పాలస్తీనా ఐక్యరాజ్యసమితిలో పూర్తి సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకుంది. కానీ, అది సాకారం కాలేదు. ఐక్యరాజ్యసమితి సభ్యత్వ దేశాల్లో 70 శాతం కన్నా ఎక్కువ దేశాలు పాలస్తీనాను ఒక దేశంగా గుర్తిస్తాయి.
- ఏది ఏమైనా, ఈ ప్రాంతంలో శాంతికి మార్గమేమిటి? దీనికోసం ఏం చేయాలి? ఈ ప్రాంతంలో శాశ్వత శాంతి నెలకొనాలంటే ఇజ్రాయెల్, హమాస్ సహా పాలస్తీనియన్ల సార్వభౌమత్వాన్ని అంగీకరించాలని నిపుణులు భావిస్తున్నారు. గాజా, వెస్ట్ బ్యాంక్, తూర్పు జెరూసలేంలో ఆంక్షల విషయంలో ప్రపంచ దేశాలు చొరవ తీసుకోవాలి. శాశ్వత శాంతి కోసం ఇరు దేశాలు ఒప్పందాలను కుదుర్చుకొని, పాటించాలి. సరిహద్దులు, యూదుల సెటిల్మెంట్లు, పాలస్తీనా శరణార్థులు స్వదేశానికి తిరిగి రావడం మొదలైన అంశాలపై ఇరు పక్షాలూ ఆమోదయోగ్యమైన ఒప్పందాన్ని కుదుర్చుకోవాలి.
మల్లవరపు బాలలత
సివిల్స్ ఫ్యాకల్టీ
సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ,
హైదరాబాద్
Previous article
Geography | సౌర కుటుంబంలో అత్యంత సాంద్రత గల గ్రహం?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?