General Essay – Groups Speical – AI | వస్తువుకు ప్రాణం.. కృత్రిమ మేధ మాయాజాలం
కృత్రిమమేధ (Artificial Intelligence)
- పాతకాలం నాటి విఠలాచార్య సినిమాలు గుర్తున్నాయా? మంత్రగాడు రాజు శరీరంలోకి ప్రవేశించి, రాజ్యం కాజేయటం వంటి పన్నాగాలు గుర్తుకు వచ్చాయా?
- వెండితెరపై ఒకప్పుడు అబ్బురపరిచిన కాల్పనిక అంశాలు నేడు నిజజీవితంలో స్మార్ట్ ఫోన్ పైకి వచ్చి గగుర్పాటుకు గురిచేస్తున్నాయి.
- మన కుటుంబ సభ్యుల నుంచే వీడియోకాల్ వస్తుంది. ఫోన్ నంబర్, ముఖం, గొంతు అన్నీ వారివే. ఏదో అత్యవసరం అని తక్షణం డబ్బు పంపమని అడుగుతారు. పెద్ద మొత్తంలో డబ్బు వారు చెప్పిన ఖాతాకు ఆగమేఘాల మీద ట్రాన్స్ఫర్ చేస్తాం. తీరా చూస్తే అంతా మోసం. A.I (కృత్రిమ మేధ) మాయాజాలం. వీడియో వచ్చింది క్లోజ్ అయిన సిమ్ కార్డ్ నుంచి, వినిపించింది, కనిపించింది కృత్రిమ మేధతో రూపొందించిన మన కుటుంబీకుల సాంకేతిక ప్రతిరూపం. ఒకేఒక్క నిజం మాత్రం డబ్బు చేజారిపోవడం.
- అదొక అత్యాధునిక సర్జరీలు జరిగే ఆస్పత్రి. అతిక్లిష్టమైన మెదడు చికిత్స ఒకటి చేయాల్సి ఉంది. కత్తి పొరపాటున మెదడులో ఎక్కడ తాకినా ఆ భాగంలో సంబంధంగల ఏదోఒక శరీర అవయవంపై ప్రభావం పడుతుంది. మానవ తప్పిదాలకు ఏ మాత్రం అవకాశం ఉండకూడని ఆ శస్త్ర చికిత్స చేయాలంటే కొన్నివేల ఆపరేషన్లు చేసిన చేతులకు కూడా వణుకే. అప్పుడే రంగంలోకి వచ్చింది A.I రోబో డాక్టర్. అతిక్లిష్టమైన ఆ సర్జరీని అతి సూక్ష్మమైన కత్తులు వినియోగించి, అతి కచ్చితతంతో అతి తక్కువ సమయంలో కానిచ్చేసింది.
- పై రెండు ఉదంతాలు ఒకే కత్తికి ఉన్న రెండు పార్శాలు. మానవజాతిపై కృత్రిమ మేధ పొందిన రోబోలు ఆధిపత్యం చెలాయించే రోజులు రాబోతున్నాయనే దానికి సంకేతాలు.
- ఈ నేపథ్యంలో అసలు కృత్రిమమేధ అంటే ఏమిటి? దాని చరిత్ర, లాభనష్టాలు, క్రమబద్దీకరణ చర్యలు తదితర అంశాలను పరిశీలిద్దాం. ‘మనిషిలా ఆలోచించేగలిగే, స్వయంగా నిర్ణయాలు తీసుకోగలిగే శక్తిని కంప్యూటర్లు కలిగి ఉండేలా తీర్చిదిద్దే సాంకేతికతే’ కృత్రిమ మేధ.
- డీప్ లెర్నింగ్, నాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ విధానాలను జోడించి చేయవలసిన పనికి అవసరమైన డేటాను కృత్రిమ మేధకు (కంప్యూటర్‌కు) అందిస్తారు. డేటా ఎంత ఎక్కువ సమకూర్చితే పనిలో అంత ఖచ్చితత్వం ఉంటుంది.
- చాట్ GPT, డీప్‌ఫేక్, వర్చువల్ రియాలిటీ, డ్రైవర్‌లెస్ కార్లు, రొబోట్లు ఇవన్నీ కృత్రిమమేధ అనువర్తనాలు.
- 1950లో అంటే ఇంటర్నెట్ను ఆవిష్కరించకమునుపే కృత్రిమ మేధకు బీజం పడింది. అలన్ ట్యూరింగ్ (Alan Turing), ‘కంప్యూటింగ్ మెషినరీ అండ్ ఇంటెలిజెన్స్’ అనే దార్శనిక పత్రంలో ‘మెషీన్లను ఆలోచింప చేయగలమా?’ అని ఒక ప్రశ్నను సంధించారు.
- 1956లో డార్ట్ మౌత్ (Dart mouth) కాలేజీలో జరిగిన మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్ఫరెన్స్‌లో జాన్మెక్కార్తె (John Mc Carthy) Artificial Intelligence అనే పదాన్ని తొలిసారి ప్రయోగించారు.
- ఆ మరుసటి ఏడాది అలెన్ మావెల్ జె.సి.షౌ, హెర్బర్ట్ సెమన్లు సంయుక్తంగా ‘లాజిక్ థియరిస్ట్’ అనే తొలి ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ ప్రోగ్రాంను రచించారు.
- 1967లో ఫ్రొవ్ రోసెన్ బ్లాట్ ట్రెయిల్ అండ్ ఎర్రర్ విధానంలో న్యూరల్ నెట్‌వర్క్‌ను ఏర్పరుచుకొని పనిచేసే తొలి కంప్యూటర్ ‘మార్క్ 1 పర్ సెప్ట్రాన్’ను రూపొందించారు.
- 1980లలో న్యూరల్ నెట్వర్క్ విధానాన్ని ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్‌లో విస్తృతంగా ఉపయోగించడం మొదలైంది. అప్పటివరకు కంప్యూటర్లలో ఫీడ్ చేసిన డేటా ఆధారంగా సమాచారాన్ని అవి ప్రాసెస్ చేస్తుండేవి. న్యూరల్ నెట్వర్క్ విధానంలో మానవ మస్తిష్కం వలె వివిధ నోడ్ల అనుసంధానతతో సమాచారాన్ని లింక్ చేసుకుంటూ, సమన్వయ పరుచుకుంటూ విశ్లేషణ జరుగుతుంది. ఈ న్యూరల్ నెట్వర్క్ వివిధ చిత్రాలు, పట్టికలు, ప్యాట్రన్లను విశ్లేషించగలదు.
- 1997లో IBM కంపెనీకి చెందిన ‘డీప్ బ్లూ’ కంప్యూటర్ ప్రపంచ చెస్ చాంపియన్ అయిన గ్యారీ కాస్థరోవ్ను చదరంగంలో ఓడించింది.
- 2011లో IBM ‘వాట్సన్’ కంప్యూటర్ జియోపార్టీ అనే టీవీ క్విజ్ ప్రోగ్రామ్‌లో ఆల్‌టైం బిగ్గెస్ట్ చాంపియన్స్ రికార్డులు గల కెన్ జిన్నింగ్స్, బ్రాడ్ రట్టల్ను ఓడించింది.
- 2015లో ‘మిన్వా’ అనే సూపర్ కంప్యూటర్ కాన్వొలూషనల్ న్యూరల్ నెట్వర్క్ అనే అత్యాధునిక నెట్‌వర్క్‌ను వినియోగించి సాధారణ మానవుడి కంటే అత్యంత కచ్చితత్వంతో చిత్రాలను గుర్తించి వాటిని కేటగిరైజ్ చేసింది.
- 2023లో ‘చాట్ జీపీటీ’ ఏఐ అనువర్తనాల్లో సరికొత్త సాంకేతిక విప్లవానికి తెరలేపింది. క్షణాల్లో సమస్త సమాచారాన్ని ప్రోదిచేసి ఇవ్వడంతో పాటు, అడిగిన విధంగా దాన్ని రూపొందించి అందించగలదు. పైగా ఇది మానవ ఆలోచనా ధోరణి, భావ వ్యక్తీకరణను సైతం అనుకరిస్తుంది.
- చాట్ జీపీటీ ఆగమనంతో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చిన కృత్రిమ మేధఅంశం నిజానికి మనకు పరిచయం లేనిదేమీ కాదు. మనకు తెలియకుండానే మనం అనునిత్యం దాన్ని వినియోగిస్తున్నాం.
- స్మార్ట్‌ఫోన్ అన్‌లాకింగ్‌కు వాడే ఫేస్ ఐడీ, గూగుల్ సెర్చ్, అలెక్సా, సిరి వంటి వాయిస్ కమాండ్ పర్సనల్ అసిస్టెన్స్ యాప్‌లు, ఫేస్బుక్, అమెజాన్, ఇన్‌స్ట్రాగ్రామ్, నెట్‌ఫ్లిక్స్ వంటి యాప్‌లలో మన అభిరుచిని బట్టి కనిపించే సమాచారం (POP-UP), రద్దీలేని ప్రత్యామ్నాయ మార్గాల గురించి సమాచారం ఇచ్చే గూగుల్ మ్యాప్స్ లైవ్, ట్రావెల్ అండ్ ఫుడ్ డెలివరీ యాప్స్‌లోని లైవ్ ట్రాకింగ్ తదితర అంశాలన్నీ మనకు తెలియకుండానే మనం విరివిగా వినియోగిస్తున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనువర్తనాలు.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రకాలు
- ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రెండు రకాలుగా విభజించవచ్చు. అవి.. నారో ఏఐ (బలహీనమైన కృత్రిమ మేధ), బ్రాడ్ ఏఐ (బలమైన కృత్రిమ మేధ). మీన్ లేదా నారో ఏఐ అంటే ఏవో కొన్ని పనులు చేయడానికి మాత్రమే ప్రత్యేకంగా రూపొందించిన కృత్రిమ మేధ.
- మనం రోజూ వినియోగించే కృత్రిమ మేధ అనువర్తనాలు ఈ వర్గీకరణలోకి వస్తాయి. యాపిల్ సిరి, అమెజాన్ అలెక్సా, చాట్ బాట్స్, సోషల్ మీడియా ఆల్గారిథమ్స్, డ్రైవర్ రహిత వాహనాలు మొదలైన వాటిని బలహీనమైన కృత్రిమ మేధగా పేర్కొంటారు.
- స్ట్రాంగ్/బ్రాడ్ ఏఐ (బలమైన కృత్రిమ మేధ)ను రెండు రకాలుగా వర్గీకరిస్తారు. అవి ఆర్టిఫీషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI), ఆర్టిఫీషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ (ASI).
- ఆర్టిఫీషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటే మానవ మేధస్సుతో సమానమైన మేధస్సు కలిగి, స్వయంగా విషయాలు అవగాహన చేసుకోగల, నిర్ణయాలు తీసుకోగల, సమస్యలు పరిష్కరించి భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించుకోగల కృత్రిమ మేధ. దీనికి ఉదాహరణగా హ్యూమనాయిడ్ రోబోలను చెప్పుకోవచ్చు. (సౌదీ అరేబియా పౌరసత్వం కల్పించిన హ్యూమనాయిడ్ రోబో ‘సోఫియా’ దీనికి ఉదాహరణ)
- ఆర్టిఫీషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ అంటే మానవ మస్తిష్కాన్ని మించి మేధస్సు గల కృత్రిమ మేధ. ఇప్పటి వరకు దీనికి ఉదాహరణగా చెప్పుగోదగ్గ ఆవిష్కరణలు జరగకపోయిప్పటికీ, భవిష్యత్తులో చేసే అవకాశం ఉంది. సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో కనిపించే రోగ్ రోబోబోట్లను (రోబో సినిమాలోని ‘చిట్టి’)ను ఉదాహరించవచ్చు.
- ప్రస్తుతం అందుబాటులో ఉన్న న్యారో/వీక్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తోనే అన్ని రంగాలూ విపరీతంగా ప్రభావితం అవుతున్నాయి. ఏ రంగంలోనైనా ఏ సేవనైనా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను జోడించడం ద్వారా సేవల పనితీరు 100 శాతం మెరుగుపడుతుంది. ఆ సేవల ఆర్థిక విలువ కూడా పెరుగుతుంది.
- మానవ తప్పిదాలకు తావులేని, అతివేగవంతం, కచ్చితత్వం గల ఈ కృత్రిమ మేధ పరిశోధనా రంగాన్ని విశేషంగా ప్రభావితం చేస్తుంది. అతిసూక్ష్మ అంశాలతో కొన్ని లక్షల పర్మిటేషన్స్, కాంబినేషన్స్ పరిశీలించాల్సి ఉండే ఔషధ, రసాయన, భౌతిక రంగంలో కృత్రిమ మేధ విప్లవాత్మక ఆవిష్కరణలు తీసుకురానుంది. ఉదాహరణకు నానో ఔషధాలు, ఆధునిక టీకాల అభివృద్ధికి కొన్ని లక్షల రసాయనాల, జన్యువుల విశ్లేషణ, సమ్మేళన చర్యల ఫలితాల అంచనా వంటివి మానవులు చేయాలంటే ఏళ్ల తరబడి సమయం పడుతుంది. అవే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌కు డేటాను అందిస్తే చాలు చిటికెలో పనవుతుంది.
- రోగ నిర్ధారణ, డీఎన్ఏ విశ్లేషణ ద్వారా ముందస్తు అనారోగ్య సంకేతాలను గుర్తించడం, స్కాన్లలో డాక్టర్లు పసిగట్ట లేని అతి సూక్ష్మమైన తేడాల గుర్తింపు, పేషెంట్ ఆరోగ్య చరిత్ర అనుసంధానం వంటి ఎన్నో విషయాలను చిటికెలో విశ్లేషించి తగు పరిష్కార మార్గాలను సైతం కృత్రిమ మేధ సూచిస్తుంది.
- అతి క్లిష్టమైన శస్త్ర చికిత్సలతో పాటు సాధారణ శస్త్ర చికిత్సలను సైతం వేగంగా, సురక్షితంగా కృత్రిమ మేధ సహాయంతో చేయవచ్చు.
- కరోనా, ఎబోలా నిఫా వంటి అతి ప్రమాదకర వైరస్ల విజృంభణ సమయంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ గల రోబోలు, రోగి సంరక్షణ, శానిటైజేషన్, రోగ నిర్ధారణల్లో విశేషంగా ఉపకరిస్తాయి.
- అంతేకాక మానవులు పనిచేయలేని అపాయకర పరిస్థితులైన అగ్ని ప్రమాదాలు, గని ప్రమాదాలు, అణు రసాయన విపత్తులు, సముద్ర అంతర్గత/ ఖగోళ అంతర్గత/భూ అంతర్గత అన్వేషణలకు కృత్రిమ మేధ ఎంతగానో అక్కరకు వస్తుంది.
- అతి విస్తారంగా ఉన్న సమాచారాన్ని (Big Data) మానవులు విశ్లేషించడం కష్టం. స్టాక్ మార్కెట్, వాతావరణ అంచనా, వ్యాపార లావాదేవీలు, మార్కెటింగ్ ఎనలిటిక్స్, ప్యాట్రన్స్ ఐడెంటిఫికేషన్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ రచన, పంటల విశ్లేషణ, ఉపగ్రహ చిత్రాల అధ్యయనం, డేటా వడపోత వంటి అంశాలు కృత్రిమ మేధ ద్వారా సునాయాసంగా చేయవచ్చు.
- ఇరవై నాలుగు గంటలూ అందుబాటులో ఉండటం, ఒకే పనిని పదేపదే చేయాల్సి వచ్చినా విసుగు విరామం లేకుండా చేయగలగడంతో మానవులకు ఉన్న పరిమితులను అధిగమించడానికి ఉపకరిస్తుంది.
- సంగీతం, కవిత్వం వంటి సృజనాత్మక అంశాల్లో కూడా అద్భుత పనితీరు కనబరుస్తుండటంతో పాటు, గ్రాఫిక్స్, వర్చువల్ రియాలిటీ, సాంకేతికతలతో వినోద రంగాన్ని కూడా ఈ కృత్రిమ మేధ విశేషంగా ప్రభావితం చేస్తుంది.
- ప్రతి ఒక్కరికీ ఒక పర్సనల్ అసిస్టెంట్‌లా పనిచేస్తూ ఈమెయిల్స్, జాబ్ అప్లికేషన్స్ రాయడం, విద్యాపరమైన విషయాలు సునాయాసంగా అర్థం అయ్యేలా చెప్పడం, విషయాలు గుర్తు పెట్టుకుని తిరిగి తగిన సమయంలో మనకు గుర్తు చేయడం వంటి ఎన్నో విషయాలు ఈ కృత్రిమ మేధతో సాధ్యం అవుతాయి.
- అతి త్వరగా నిర్ణయాలు తీసుకుని స్పందించగల సామర్థ్యం కృత్రిమ మేధకు ఉండటం బుల్లెట్ ట్రైన్లు, డ్రైవర్‌లెస్ కార్లు, హైపర్ లూప్ ట్రాన్స్పోర్ట్, విమానాల్లో ఆటోమేషన్ వంటి వాటికి ఎంతో ఉపయుక్తం.
కృత్రిమ మేధ ప్రయోజనాలు- సమస్యలు
3వ పేజీ తరువాయి
- మనిషిని ఇతర జీవుల నుంచి వేరు చేసేది ఆలోచించగల శక్తి, తార్కిక జ్ఞానం. కృత్రిమ మేధ వల్ల మనిషి ఆలోచించనవసరం లేకుండానే గుర్తు పెట్టుకోకుండానే చాలా పనులు జరిగిపోతాయి. వినియోగించని శరీర భాగాలు క్రమంగా అంతరించిపోతాయని డార్విన్ చెప్పిన Servival of the Fittest అనే జీవశాస్త్ర సిద్ధాంతం ప్రబోధిస్తుంది. ఇప్పటికే కాలిక్యులేటర్లపై ఆధారపడుతూ నోటి లెక్కలు వేయగల సామర్థ్యాన్ని కోల్పోతున్న కొత్త తరం ఇకపై కృత్రిమ మేధపై ఆధారపడుతూ వస్తుంటే మానవ మేధస్సు కుచించుకుపోయిన మానవ జాతిపై మేధస్సు గల రోబోలు ఆధిపత్యం చెలాయించే రోజులు రావచ్చని అంచనా.
- కృత్రిమ మేధ వల్ల శారీరక శ్రమ తగ్గి జీవనశైలి వ్యాధులు చుట్టుముడతాయి. ఆయుఃప్రమాణం తగ్గిపోతుంది. సృజనాత్మక అంశాలైన సంగీతం, చిత్ర లేఖనం తదితర కళల్లో కూడా కృత్రిమ మేధ ప్రవేశంతో మానవుడిలో సృజనాత్మకత అంతరించే ప్రమాదం ఉంది.
- మనిషికి సహకారంగా రోబోలు రంగ ప్రవేశం చేయడంతో మానవ సంబంధాలు దెబ్బతింటాయి. ఒంటరితనం చుట్టుముడుతుంది.
- కృత్రిమ మేధ వేగంగా, నిరంతరం, కచ్చితత్వంతో అన్ని పనులూ చేయగలుగుతుండటంతో అనేక కంపెనీలు తమ సిబ్బందిని తగ్గించుకుంటున్నాయి. ‘దుఖాణ్’ అనే భారత ఈ-కామర్స్ స్టార్టప్ కంపెనీ తన ఉద్యోగుల్లో 90 శాతం మందిని తొలగించి కృత్రిమ మేధపై ఆధారపడటం ఇటీవల సంచలనం రేకెత్తించింది. అంతేకాకుండా అమెజాన్, ఫేస్బుక్, ప్రముఖ ఐటీ సంస్థలు తమ సిబ్బందిని భారీగా తొలగించడం వెనుక కృత్రిమ మేధ హస్తముంది. OECD (Organization for Economic Co-operation and Development) సర్వే ప్రకారం రాబోయే రోజుల్లో 27 శాతం ఉద్యోగాలు AI వల్ల ప్రపంచ వ్యాప్తంగా రద్దవుతాయని అంచనా. కొన్ని వేలమంది చేయగల ఒక పనిని తక్కువ ఖర్చుతో ఒక యంత్రం త్వరితగతిన చేస్తుండటం ప్రపంచ వ్యాప్తంగా నిరుద్యోగ సమస్యను తీవ్రతరం చేస్తుంది.
- డీప్ ఫేక్ వంటి మార్ఫింగ్ సాంకేతికతతో ఎంతో కచ్చితమైన మార్ఫ్డ్ చిత్రాలు, వీడియోలు తయారు చేయడం సాధ్యమవుతుంది. సినీనటీమణులు, యువతుల చిత్రాలను నగ్నంగా మార్చి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం, బ్లాక్మెయిల్ చేయడం, అశ్లీల వెబ్సైట్లు నిర్వహించడం వంటి నేరాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి.
- ఈ డీప్‌ఫేక్, సిమ్‌కార్డు క్లోనింగ్, వాయిస్ క్లోనింగ్ వంటి కృత్రిమ మేధ సాంకేతికతతో సైబర్ నేరాల విస్తృతి విపరీతంగా పెరిగింది. భారతదేశంలో జరుగుతున్న సైబర్ మోసాల్లో 83 శాతం కృత్రిమ మేధ సాంకేతికత వల్ల జరుగుతున్నాయని తేలింది. ఈ కృత్రిమ మేధ రాజకీయ రంగంలోనూ పెను ప్రకంపనలు సృష్టిస్తుంది.
- 2014 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేయడానికి 50 మిలియన్ల ఫేస్బుక్ ఖాతాల డేటాల్లోకి కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థ అక్రమంగా చొరబడింది. ఒక పార్టీకి అనుగుణంగా ఓటర్ల అభిమతం మారేవిధంగా టార్గెటెడ్ ఇన్ఫర్మేషన్ను వ్యాప్తి చేసింది. ఆయా ఓటర్ల గత పోస్ట్‌లు, వారి లైక్‌ల ఆధారంగా వారిని ప్రభావితం చేసేవిధంగా ప్రత్యేక సమాచారాన్ని వారి ఖాతాల్లోకి గుప్పించింది.
- బ్రెగ్జిట్ సమయంలో బ్రిటన్, యూరోపియన్ యూనియన్ నుంచి విడిపోవాలన్న అభిమతానికి మద్దతు పెంచడానికి కూడా ఈ తరహా చర్యలు జరిగాయని భారత్‌లో సైతం గతంలో ఎన్నికల సమయంలో కేంబ్రిడ్జ్ అలిటికా వంటి సంస్థలు కీలక పాత్ర పోషించాయనే ఆరోపణలున్నాయి. అయితే ప్రస్తుతం ఈ చర్యలు సామాజిక మాధ్యమాల విచ్చలవిడి వ్యాప్తితో బహిరంగంగానే జరుగుతున్నాయి.
- ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ యుద్ధం విరమించి తమ కుటుంబాల వద్దకు చేరుకోమని తమ సైనికులకు విజ్ఞప్తి చేస్తున్న వీడియో, అదేవిధంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధం ఆపేస్తున్నట్లు ప్రకటిస్తున్న ఒక వీడియో, అమెరికా అధ్యక్షుడు బైడెన్ కొత్త పాలసీ తీసుకువస్తున్నట్లు ప్రకటిస్తున్నట్లు కొన్ని వీడియోలు ఈ మధ్య సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. ఎంతో కచ్చితత్వంతో అదే గొంతు, ముఖం, హావభావాలు కలిగి ఉన్న ఆ డీప్‌ఫేక్ వీడియోలు చాలా మంది అవి నిజమేనని నమ్మారు. ఇదే పరిస్థితి కొనసాగితే వార్తల్లో ఏది నిజం ఏది నిజం కాదు అని తెలుసుకోవడం కష్టం. ఇది సామాజిక ఉద్రిక్తతలకు ఒక్కోసారి అశాంతియుత పరిస్థితులకు దారి తీయవచ్చు.
- భారతదేశం వంటి ప్రాంతీయ, సామాజిక, మతపరమైన వైవిధ్యతలు గల దేశంలో ఇది మరింత ప్రమాదకరం. అంతేకాక దేశాల మధ్య కూడా ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉంది.
- ఇటీవల ఢిల్లీలో రెజ్లర్లు ఆందోళనలు చేపట్టిన సమయంలో వారు బస్సులో ప్రయాణిస్తూ చాలా ఉల్లాసంగా నవ్వుతూ ఉన్నట్లు డీప్‌ఫేక్‌తో సృష్టించిన ఒక ఫొటో సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చెందింది. నిజానికి వారు చాలా దిగాలుగా ఉన్న ఫొటో అది. అయితే తప్పుడు ఫొటో ప్రచారం చేయడం ద్వారా రెజ్లర్లు చేస్తున్న ఆందోళనలో నిజాయితీ లేదని, అదంతా కుట్రపూరిత చర్యగా నమ్మబలికే ప్రయత్నం జరిగింది.
- ప్రజల రాజకీయ అభిప్రాయాలను ప్రభావితం చేసే అంశాలను కృత్రిమ మేధ సహాయంతో తయారు చేసి సామాజిక మాధ్యమాల్లో వ్యాప్తి చేస్తుండటం దేశ ప్రజాస్వామ్యానికి, లౌకికతత్వానికి ముప్పు కలిగిస్తుంది.
- భారతదేశంలో అక్షరాస్యులు కేవలం 77 శాతం మందే. పైగా వీరిలో కూడా సాంకేతిక అక్షరాస్యత (Digital Literacy) ఉన్నవారు అతితక్కువ మంది. నేషనల్ శాంపిల్ సర్వే రిపోర్ట్ ప్రకారం 75 శాతం భారతీయులకు ఎటాచ్మెంట్స్తో ఈ-మెయిల్స్ పంపడం రాదు అని తెలుస్తుంది.
- సాంకేతిక నిరక్షరాస్యత భారీస్థాయిలో గల దేశంలో కృత్రిమ మేధతో జరిగే నేరాలు, మోసాలు మరింత ఎక్కువ ఉంటాయి.
- రాబోయే కాలంలో దేశాల మధ్య యుద్ధాలు అంతా కృత్రిమ మేధపరమైన డ్రోన్స్, రోబోస్, టార్గెటెడ్ వెపన్స్‌తోనే అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే నిఘా, బాంబింగ్ వంటి అవసరాల కోసం ఈ డ్రోన్స్ ప్రపంచ వ్యాప్తంగా వినియోగంలో ఉన్నాయి. ప్రపంచ దేశాలన్నీ కృత్రిమ మేధ ఆధారిత ఆయుధ పరిశోధనలపై తీవ్ర స్థాయిలో నిధులు వెచ్చిస్తున్నాయి. భవిష్యత్తులో సమాజంలో జరిగే నేరాలు, హత్యలు వంటి వాటికి కూడా టార్గెట్ కిల్లింగ్ వెపన్స్ వాడకం జరుగుతుందని అంచనా.
- కృత్రిమ మేధకు భావోద్వేగాలు అర్థం కావు. కాబట్టి నీతి నియమాలు, జాలి, కరుణ వంటి భావోద్వేగాలు లేకపోవడంతో అనేక సామాజిక, నైతిక పరమైన సమస్యలకు దారితీస్తుంది. ఉగ్రవాదులకు ఈ టెక్నాలజీ ఒక విధ్వంసకర ఆయుధంగా మారే అవకాశం ఉంది.
ప్రత్యేక చట్టాలు అవసరం
- మానవాళికి ఒకవైపు ఎన్నో సౌలభ్యతలు అందిస్తునే మరోవైపు ఎన్నో ప్రమాదాలను ముంగిటకు తెస్తున్న ఈ సాంకేతికత వినియోగంపై నియంత్రణ, కట్టుబాటు చర్యలు అంతర్జాతీయ జాతీయ చట్టాలు రూపొందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
- సాక్షాత్తు చాట్ జీపీటీని తయారు చేసిన కంపెనీ ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మెన్ ఈ సాంకేతికతపై నియంత్రణ మార్గదర్శకాలను యుద్ధ ప్రాతిపదికన రూపొందించాల్సిన అవగతం ఉందని విజ్ఞప్తి చేశారు.
- టెస్లా ఫౌండర్ ఎలాన్ మస్క్ కృత్రిమ మేధ న్యూక్లియర్ బాంబుల కంటే ప్రమాదం అని పేర్కొన్నారు. భారీ ఎత్తున ఉద్యోగాలు గల్లంతై ప్రపంచం ఆర్థిక మాంధ్యంతో కూరుకుపోతుందని హెచ్చరించారు.
- ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పితామహుడిగా పేరొందిన డాక్టర్ జెప్రీ హిన్టన్ ఏఐ వల్ల తలెత్తనున్న ఉపద్రవాల గురించి అవగాహన పెంచడానికి గూగుల్‌లో తన అత్యున్నత పదవికి రాజీనామా చేశారు.
- వీరందరితో పాటు వేలమంది ప్రముఖులు కలిసి AI Pause for 6 Months (ఆరు నెలల పాటు కృత్రిమ మేధ అభివృద్ధి పనుల నిలిపివేత) కోసం ఫ్యూచర్ ఆఫ్ లైఫ్ సంస్థ తయారు చేసిన ఒక వినతి పత్రంపై సంతకం చేశారు.
- ఈ ఆరు నెలల కాలంలో కృత్రిమ మేధ అభివృద్ధి నిలుపుదల చేసి దానిపై నియంత్రణలు, చట్టాలు ఏర్పాటు చేసుకోవాలని వీరు ఆశిస్తున్నారు.
- నైతిక విలువలు, పిల్లలపై దుష్ప్రభావాలు, సామాజిక అంశాలతో కృత్రిమ మేధ అక్రమ వినియోగం వంటి విషయాలతో పాటు ఉపాధి నష్ట నివారణ చర్యలు, డిజిటల్ అక్షరాస్యత పెంపు వైపు ప్రతిదేశం తగిన పాలసీలు, చట్టాలు తీసుకురావాల్సిన తక్షణ అవసరం ఉంది. లేదంటే సరైన సమయంలో నియంత్రించలేక చేయిదాటి పోయిన సామాజిక మాధ్యమాలు వెర్రితలలు వేస్తున్న ఓటీటీ వేదికలు గుప్పిస్తున్న విశృంకలతకు కృత్రిమ మేధ జతకడితే ఎదురయ్యే దుష్పరిణామాలు ఊహాతీతం.
- ఇప్పటికే కొన్ని దేశాలు కృత్రిమ మేధను నియంత్రించే దిశగా కొన్ని చట్టాలు చేసుకున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 37 చట్టాలు 2022లో రూపొందించారని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ AI Index-2023 చెబుతోంది. మొట్టమొదటిసారిగా అమెరికా 9 చట్టాలను తీసుకురాగా, స్పెయిన్ 5, ఫిలిప్పీన్స్ 4 చట్టాలను రూపొందించుకున్నాయి.
- యూరోపియన్ యూనియన్ డేటా ప్రొటెక్షన్ బోర్డ్ చాట్ జీపీటీపై నియంత్రణ వ్యక్తిగత భద్రతల పరిరక్షణ అంశాలపై ఒక టాస్క్‌ఫోర్స్‌ను నియమించింది.
- World Economic Forum వివిధ దేశాల ప్రభుత్వ ప్రతినిధులు, సాంకేతిక రంగ నిపుణులు, విద్యావేత్తలతో శాన్ ఫ్రాన్సిస్కోలో మూడు రోజుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏఐ సాంకేతికత వినియోగంతో నైతికత, సామాజిక పర్యవసానాల గురించి చర్చించింది.
- 12 మందితో కూడిన యూరోపియన్ యూనియన్ శాసన సభ్యుల గ్రూపు ఏఐపై నియంత్రణ చట్టం రూపొందించే దిశగా కసరత్తు ప్రారంభించింది. వీరు ఏఐను నియంత్రించడానికి గల మార్గాల అన్వేషణకు ఒక ప్రపంచ సదస్సుకు సైతం పిలుపునిచ్చారు.
- భారతదేశం సైతం 2023 అక్టోబర్ 14, 15 తేదీల్లో కృత్రిమ మేధపై ఒక గ్లోబల్ సమ్మిట్‌ను ఏర్పాటు చేస్తుంది. అయితే ఇంకా భారత్‌లో కృత్రిమ మేధ పరమైన చట్టాలు రాకపోవడం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్‌లో కూడా ఏఐ నియంత్రణపై పెద్దగా సమాచారం లేకపోవడం దురదృష్టకరం. బాలల హక్కులు, సామాజిక అంతరాలు ఈ కృత్రిమ మేధ వల్ల ప్రభావితం కానున్న నేపథ్యంలో ఆయా విషయాలపై కూడా దృష్టి పెట్టే చట్టాలు దేశంలో రావలసిన అవసరం ఉంది.
- సరైన నియంత్రణ, మార్గదర్శకాలు సకాలంలో తీసుకురావడం ద్వారా న్యూక్లియర్ టెక్నాలజీ, క్లోనింగ్ టెక్నాలజీ వంటి వాటితో ప్రయోజనాలు పొందవచ్చు. కృత్రిమ మేధ ద్వారా కూడా ప్రయోజనాలు పొందవచ్చు.
- ప్రతి టెక్నాలజీ ప్రారంభంలో ఎన్నోకొన్ని సవాళ్లను విసిరింది. పారిశ్రామికీకరణ, కంప్యూటరైజేషన్ వంటి సరికొత్త ధోరణులు అప్పట్లో ఉద్యోగరంగంలో తీవ్ర ఒడుదొడుకులను సృష్టించినా Y2K వంటి వినూత్న సవాళ్లను విసిరినా మానవజాతి సంకల్పం వల్ల సద్దుమణిగి కొంతకాలానికి సత్ఫలితాలనే ఇస్తున్నాయి. గిగ్ ఎకానమీ వంటి సరికొత్త ఉపాధిమార్గాలను చూపుతున్నాయి. అదేబాటలో సరైన నియంత్రణలు తీసుకురావడం ద్వారా ఏఐ సత్ఫలితాలను అందుకుంటూ దుష్ఫలితాలకు అదే ఏఐ టెక్నాలజీని ఉపయోగించి అడ్డుకట్ట వేయవచ్చు.
మల్లవరపు బాలలత
సివిల్స్ ఫ్యాకల్టీ
సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ,
హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు