Indian Polity | స్వేచ్ఛ, గుర్తింపుల ప్రతీక
- పౌరసత్వం అనేది ఆంగ్ల భాషా పదమైన ‘సిటిజన్ షిప్’నకు అనువాదం. లాటిన్ భాషా పదాలైన సివిస్, సెవిటాస్, అనే పదాల నుంచి సిటిజన్ షిప్ ఉద్భవించింది. సివిస్ అంటే పౌరులు అని సివిటాస్ అంటే నగరం అని అర్థం.
- పౌరసత్వం అనే భావన మొదటిసారిగా ప్రాచీన గ్రీకు రాజ్యాల్లో అవతరించింది. ప్రపంచ యుద్ధాల తర్వాత ఏర్పడిన జాతీయ రాజ్యాల నేపథ్యంలో పౌరసత్వ భావనకు ప్రాముఖ్యం ఏర్పడింది.
- ఆధునిక దేశాల్లోని ప్రజలను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. పౌరులు విదేశీయులు. పౌరులకు సంబంధిత రాజ్యంలో పౌర, రాజకీయ హక్కులను కల్పిస్తారు. విదేశీయులకు మాత్రం మానవతా దృష్ట్యా కొన్ని పౌరహక్కులను మాత్రమే కల్పిస్తారు. పౌరసత్వం అనే హోదాను రాజ్యం పౌరులకు కల్పించిన రాజకీయ పౌరహక్కుల ప్రాతిపదికపై గుర్తిస్తారు.
- పౌరసత్వం అనే భావనను బ్రిటన్ నుంచి గ్రహించారు.
రాజ్యాంగ ప్రకరణలు-పార్లమెంట్ చట్టాలు
- రాజ్యాంగంలోని రెండో భాగంలో ప్రకరణ 5 నుంచి ప్రకరణ 11 వరకు పౌరసత్వానికి సంబంధించిన ప్రాథమిక అంశాలను మాత్రమే పొందుపర్చారు.
- రాజ్యాంగం రూపొందించిన సమయంలో దేశ విభజనకు చెందిన పరిణామాలు ఏర్పడటం వల్ల పౌరసత్వానికి సంబంధించిన సమగ్ర అంశాలను పొందుపరచడానికి నాటి పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి పౌరసత్వానికి సంబంధించిన ఇతర అన్ని అంశాలను రూపొందించడానికి రాజ్యాంగం పార్లమెంటుకు అధికారాన్ని కల్పించింది.
- రాజ్యాంగం ప్రకారం సంక్రమించిన అధికారాన్ని వినియోగించుకొని పార్లమెంట్ పౌరసత్వ చట్టాన్ని 1955లో రూపొందించింది. ఆ తర్వాత ఈ చట్టాన్ని నాలుగుసార్లు
సవరించారు.
పౌరులకు ప్రత్యేక హక్కులు
- భారత రాజ్యాంగంలో కొన్ని పదవులు, హక్కులను భారతీయ పౌరులకు మాత్రమే కల్పించారు. ఉదాహరణకు ఉన్నత పదవులైన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రి, గవర్నర్, సుప్రీంకోర్టు. హైకోర్టు న్యాయమూర్తులతో పాటు ఇతర ప్రజాపదవులకు భారతీయ పౌరులు మాత్రమే అర్హులు.
పౌరులకు మాత్రమే వర్తించే ప్రత్యేక స్వాధికారాలు - ప్రకరణ 15 ప్రకారం పౌరులను జాతి, మత, కుల, లింగ, పుట్టుక ప్రాతిపదికలపై వివక్షత చూపరాదు.
- ప్రకరణ 16 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలకు భారత పౌరులు మాత్రమే అర్హులు
- ప్రకరణ 19 ప్రకారం భావ వ్యక్తీకరణ, సంచార స్థిర నివాస, సంఘాలు ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛను పౌరులకే పరిమితం చేశారు.
- ప్రకరణ 29 ప్రకారం సాంస్కృతిక, విద్యా హక్కు పౌరులకు మాత్రమే వర్తిస్తాయి.
- పౌరులతో సమానంగా భారతదేశంలో నివసించే విదేశీయులకు కల్పించిన హక్కులు.
- కొన్ని హక్కులను భారత పౌరులతో సమానంగా విదేశీయులకు కల్పించారు. అవి:
- చట్టం ముందు అందరూ సమానులే- ప్రకరణ 14
- అక్రమ శిక్షలకు వ్యతిరేకంగా రక్షణ – ప్రకరణ 20
- జీవించే హక్కు- ప్రకరణ 21
- పీడనాన్ని నిరోధించే హక్కు – ప్రకరణ 23
- మత స్వేచ్ఛ – ప్రకరణ 25
- మత ప్రాతిపదికన పన్ను విధింపుపై ఆంక్షలు ప్రకరణ 27
- భారతదేశంలో పౌరసత్వ ప్రాతిపదిక – రాజ్యాంగ ప్రకరణలు
- రాజ్యాంగంలో 5 నుంచి 11 వరకు ఉన్న ప్రకరణల ప్రకారం కింది వారిని పౌరులుగా పరిగణిస్తారు.
- 5వ ప్రకరణ ప్రకారం 1950, జనవరి 26 నాటికి అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చే సమయానికి భారతదేశంలో నివసించే పౌరులు భారతీయులే.
- 6వ ప్రకరణ ప్రకారం పాకిస్థాన్ నుంచి ఇండియాకు వలస వచ్చినవారు 1948 జూలై 19 వరకు తమ పేర్లను సంబంధిత కమిషనరేట్ల వద్ద నమోదు చేసుకున్న వారికి భారత పౌరసత్వం లభిస్తుంది. ఈ పద్ధతిలో పౌరసత్వాన్ని పొందేవారు 1935 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం పౌరులుగా నమోదై ఉండాలి.
- 7వ ప్రకరణను అనుసరించి పాకిస్థాన్‌కు వలసవెళ్లి తదనంతర కాలంలో తిరిగి భారతదేశానికి వచ్చి, 1948లో మార్చి 21వ తేదీలోగా కమిషనరేట్ల వద్ద తమ పేర్లను నమోదు చేసుకున్న వారికి భారత పౌరసత్వం లభిస్తుంది. అయితే వీరందరూ భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం భారతీయులై ఉండాలి.
- 8వ ప్రకరణ ప్రకారం తల్లిదండ్రులు, మాతామహులు, పితామహులు కనీసం ఒకరైనా భారతీయ సంతతికి చెంది ఉన్నట్లయితే ఇలాంటి వారు రక్త సంబంధం ప్రాతిపదికన భారత పౌరసత్వాన్ని పొందవచ్చు.
- 9వ ప్రకరణ ప్రకారం భారతీయ పౌరులు స్వచ్ఛందంగా భారతదేశ పౌరసత్వాన్ని కోల్పోతారు.
- 10వ ప్రకరణ ప్రకారం పైన పేర్కొన్న ప్రాతిపదికల ప్రకారం పౌరసత్వాన్ని పొందగలిగే అర్హతలు ఉంటే భారతదేశ పౌరులుగా కొనసాగుతారు. వాటికి సంబంధించిన నియమాలను పార్లమెంట్ రూపొందిస్తుంది.
- 11వ ప్రకరణ పౌరసత్వానికి సంబంధించిన అన్ని అంశాలపై అంటే పౌరసత్వం పొందే, రద్దు చేసే పద్ధతులపై పార్లమెంటుకే అంతిమ అధికారం ఉంటుంది.
భారతదేశంలో పౌరసత్వాన్ని పొందే పద్ధతులు - భారత పౌరసత్వ చట్టం 1955 ప్రకారం కింది పద్ధతుల్లో పౌరసత్వాన్ని పొందవచ్చు.
పుట్టుక ద్వారా పౌరసత్వం
- 1950 జనవరి 26 తర్వాత, 1987 జూలై 1లోపల భారతదేశంలో జన్మించిన ప్రతి వ్యక్తి భారతీయ పౌరుడవుతాడు. దీన్నే లాటిన్ భాషలో jus-Soil అంటారు. అయితే 1987 జూలై 1 తర్వాత భారతదేశంలో పుట్టినవారు భారత పౌరసత్వాన్ని పొందాలంటే తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు భారతీయ పౌరులై ఉండాలి. 2004 డిసెంబర్ 3లో దీనికి చిన్న సవరణ చేశారు. దీని ప్రకారం తల్లిదండ్రులు ఇద్దరూ భారతీయ పౌరులై ఉంటేనే వాళ్ల పిల్లలకు భారత పౌరసత్వం వస్తుంది.
వారసత్వం ద్వారా పౌరసత్వం
- 1950 జనవరి 26 తర్వాత, 1992 డిసెంబర్ 10లోపు భారతదేశం బయట జన్మించిన వారి తండ్రి భారతీయ పౌరుడైతే ఆ సంతానానికి భారతీయ పౌరసత్వం వస్తుంది.
- దీన్నే లాటిన్ భాషలో Jus sanguinis (Right of Blood) అంటారు. 1992 డిసెంబర్ 10 తర్వాత జన్మించిన వారికి భారత పౌరసత్వం పొందాలంటే తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు భారతీయ పౌరులై ఉండాలి. వారి పుట్టుకను భారత విదేశాంగ శాఖలో నమోదు చేయాలి.
- రిజిస్ట్రేషన్ ద్వారా పౌరసత్వాన్ని పొంది ఉంటారు. వారి రిజిస్ట్రేషన్ సంబంధిత అధికారి ముందు జరిగి ఉండాలి.
ఎ) భారత సంతతికి చెందిన వారు భారతదేశంలో ఏడు సంవత్సరాలు సాధారణ నివాసిగా ఉండాలి.
బి) భారతీయ పౌరులను వివాహం చేసుకొని ఉండాలి.
సహజీకృత పౌరసత్వం
- భారత ప్రభుత్వం రూపొందించిన చట్టాలకు లోబడి కింద పేర్కొన్న నిర్ణీత అర్హతలతో దరఖాస్తు చేసుకున్న విదేశీయులకు భారత పౌరసత్వం కల్పిస్తారు.
ఎ) భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో పేర్కొన్న 22 భాషల్లో ఏదో ఒక భాషలో ప్రావీణ్యం ఉండాలి.
బి) సత్ప్రవర్తన కలిగి ఉండాలి.
సి) అంతకుముందు కలిగి ఉన్న విదేశీ పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్లు ఒక అఫిడవిట్ దాఖలు చేయాలి.
డి) భారతదేశంలో కనీసం పదేళ్లు స్థిర నివాసం కలిగి ఉండాలి.
ఇ) కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో 14 ఏళ్లు పనిచేసినపుడు కూడా సహజీకృత పౌరసత్వానికి అర్హులౌతారు. - పై అర్హతలను కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మినహాయించవచ్చు. విదేశాలకు చెందిన మేధావులు, శాస్త్రవేత్తలు, గొప్ప వ్యక్తులకు వీటి నుంచి మినహాయింపు ఉంటుంది.
భూభాగాల విలీనం: భారత భూభాగంలోకి ఏదైనా ప్రాంతం విలీనం చెందినట్లయితే ఆ ప్రాంత ప్రజలకు భారత పౌరసత్వం లభిస్తుంది. (పాండిచ్చేరి, గోవా భారత్‌లో చేరడం)
పౌరసత్వాన్ని రద్దు పరిచే విధానం
- భారత పౌరసత్వ చట్టం 1955 ప్రకారం పౌరులు కింది పద్ధతుల్లో పౌరసత్వాన్ని కోల్పోతారు.
స్వచ్ఛంద రద్దు : భారతీయులు ఎవరైనా స్వచ్ఛందంగా భారత పౌరసత్వాన్ని వదులుకోవచ్చు.
అంతమొందించడం/ తొలగించడం : అక్రమ పద్ధతుల ద్వారా భారత పౌరసత్వాన్ని పొందినపుడు అలాంటి వారి పౌరసత్వాన్ని చట్టప్రకారం రద్దు చేస్తారు.
బలవంతంగా రద్దు చేయడం: పౌరులు ఎవరైనా దేశ ద్రోహానికి పాల్పడినా, రాజ్యానికి విధేయత ప్రకటించకపోయినా, యుద్ధ సమయంలో శత్రుదేశాలకు సహాయ పడినా, దేశ సాధారణ పౌరుడై ఉండి ఏడేళ్లపాటు విదేశాల్లో నివసించి ఉన్నా, పౌరసత్వాన్ని పొందిన అయిదేళ్లలోపు ఏ దేశంలోనైనా 2 సంవత్సరాల శిక్షను అనుభవించి ఉన్నా పౌరసత్వాన్ని శాశ్వతంగా రద్దు చేస్తారు.
భారత పౌరసత్వ స్వభావం- ఏకపౌరసత్వం
- సమాఖ్య వ్యవస్థలో సాధారణంగా ద్వంద్వ పౌరసత్వం ఉంటుంది.
ఉదా: అమెరికా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో ద్వంద్వ పౌరసత్వం ఉంది. భారత్‌లో సమాఖ్య వ్యవస్థ ఉన్నప్పటికీ ఏక పౌరసత్వాన్ని కొనసాగించారు. అందువల్ల ఈ లక్షణాన్ని సమాఖ్య విరుద్ధ లక్షణంగా పరిగణిస్తారు. ద్వంద్వ పౌరసత్వంలో పరిమితులు ఉన్నాయనే విమర్శ ఉంది.
పరిమితులు: భారతదేశంలో ఎక్కడ జన్మించినా ఒకే పౌరసత్వాన్ని పొందుతారు. గానీ ప్రభుత్వోద్యోగాలు ఇతరత్రా కొన్ని విషయాల్లో పుట్టుక, స్థిర నివాసం ప్రాతిపదికపై కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు కల్పించారు.
ఉదా: నిబంధన 16 ప్రకారం స్థిర నివాస ప్రాతిపదికపై లోకల్, నాన్‌లోకల్‌గా వర్గీకరణ చేసి ప్రభుత్వోద్యోగాల్లో ప్రత్యేక మినహాయింపులు ఇస్తున్నారు. ముఖ్యంగా సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టికల్ 371 డి ప్రకారం ఉద్యోగ నియామకాల్లో జోన్లవారీగా, జిల్లాస్థాయిల్లో నియామకాలు జరిపే వీలు కల్పించారు. - నిబంధన 370 ప్రకారం జమ్మూ కశ్మీర్ స్వయం ప్రతిపత్తి కలిగి ఉన్నది. రాష్ర్టేతరులు ఎవరూ జమ్మూ కశ్మీర్లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకోకూడదు. ఆ రాష్ట్ర పౌరసత్వంపై చట్టాలు రూపొందించే హక్కు ఆ రాష్ట్ర శాసన నిర్మాణ శాఖకే ఉంది. భారత పార్లమెంటుకు లేదు. అంటే జమ్మూ కశ్మీర్లో ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నది అని చెప్పవచ్చు. 2019లో భారత ప్రభుత్వం ఆర్టికల్ 370 ని రద్దు చేసింది.
- ఆదివాసీ ప్రాంతాల్లో నివసించే వారికి కూడా కొన్ని ప్రత్యేక హక్కులు కల్పించారు.
- కెనడా సమాఖ్యలా భారతదేశంలోనూ ఏక పౌరసత్వాన్ని కొనసాగించడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం దేశ ఐక్యతను, సమగ్రతను కాపాడటం. ఎందుకంటే ఇది కాందిశీకులు లాంటి అనేక ఇతర సమస్యలు సృష్టించింది. ఇలాంటి సమస్యలే పంజాబ్, త్రిపుర, పశ్చిమబెంగాల్లో కూడా తలెత్తాయి.
ద్వంద్వ పౌరసత్వం
- భారత సంతతికి చెంది విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు తరచూగా భారతదేశానికి రాకపోకలు నిర్వహిస్తుంటారు. ఈ విషయంలో వీరు ఎదుర్కొంటున్న వీసా పరమైన ఇబ్బందులను తగ్గించడం కోసం పౌరసత్వ చట్టానికి 2005లో కొన్ని మార్పులు చేశారు. ద్వంద్వ పౌరసత్వంలో కొన్ని సదుపాయాలను కల్పించారు. వాటిని కింది విధంగా వివరించవచ్చు.
- ప్రవాస భారతీయులు (ఎన్ఆర్ఐ): విదేశాల్లో తాత్కాలికంగా లేదా శాశ్వతంగా నివసిస్తున్న మొదటి తరం భారతీయులు. 182 రోజులు భారతదేశం వెలుపల నివాసం ఉండేవారిని ఎన్ఆర్ఐలు అంటారు. వీరికి భారత పాస్‌పోర్ట్ ఉంటుంది.
- భారత సంతతికి చెందినవారు : విదేశీ పౌరసత్వాన్ని కలిగి ఉన్న రెండోతరం భారతీయులు. అంటే విదేశాలకు వెళ్లి అక్కడ స్థిరపడి ఆదేశ పౌరసత్వాన్ని పొందిన తల్లిదండ్రులకు జన్మించిన సంతానం. వీరికి భారత పాస్‌పోర్ట్ ఉండదు.
ఉదాహరణకు అమెరికాలోని లూసియానా రాష్ర్టానికి గవర్నర్‌గా ఎన్నికైన బాబి జిందాల్. - ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా: భారత ప్రభుత్వ చట్టం 1955 ప్రకారం నమోదు చేసుకున్న వ్యక్తులు.
- ద్వంద్వ పౌరసత్వం-ఎల్.ఎం.సింఘ్వి కమిటీ సూచనలు
- ద్వంద్వ పౌరసత్వంలో ఓటింగ్ హక్కులు ఉండవు. అదే విధంగా ప్రజా పదవులకు అర్హులు కాదు. ద్వంద్వ పౌరసత్వంలో ఉండే సౌకర్యాలు మాత్రమే ఉంటాయి. పీఐవోలకు పీఐవో కార్డులు జారీ చేస్తారు. 2003లో చేసిన పీఐవో చట్టం ప్రకారం కొన్ని సదుపాయాలుంటాయి.
- ఈ సౌకర్యం అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, శ్రీలంకకు వర్తించదు. పీఐవోలకు భారతదేశాన్ని సందర్శించడానికి ప్రత్యేక వీసా అవసరం లేదు. పీఐవో కార్డు జారీ చేసిన తేదీ నుంచి 15 ఏళ్లపాటు ఈ సౌకర్యం ఉంటుంది.
- ఈ కార్డు పొందడానికి వయోజనులు రూ. 15000 చెల్లించాలి. ఎన్ఆర్ఐలకు ఉన్న అన్ని సౌకర్యాలు పీఐవోలకు ఉంటాయి.
టాపర్స్ ఇన్స్టిట్యూట్ దిల్సుఖ్నగర్
హైదరాబాద్
Previous article
General Studies | లోకాయుక్తను తొలగించే అధికారం ఎవరికి ఉంది?
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






