Geography – Groups Special | విన్సన్ మాసిఫ్ పర్వతాన్ని అధిరోహించినది ఎవరు?
ఖండాలు – వివరాలు
అంటార్కిటికా ఖండం
- అంటార్కిటికా ఖండం చుట్టూ ఉన్న సముద్రాన్ని అంటార్కిటికా సముద్రం అంటారు. దీన్నే శ్వేత ఖండం అంటారు.
- దక్షిణ పసిఫిక్, దక్షిణ అట్లాంటిక్, దక్షిణ హిందూ మహాసముద్రాల కొనసాగింపు కాబట్టి దీన్ని దక్షిణ మహాసముద్రం అంటారు.
- ఈ మహాసముద్రంలోని నీరు పశ్చిమ పవన ప్రభావితమైన పశ్చిమ పవన ప్రవాహం (వెస్ట్-వైండ్ డ్రిఫ్ట్) రూపంలో అంటార్కిటికా ఖండం చుట్టూ సవ్యదిశలో నిరంతరం తిరుగుతూ ఉంటుంది.
- ఆర్కిటిక్ వ్యతిరేక అర్థాన్నిచ్చే పదం అంటార్కిటికా (Opposite to the Arctic).
పర్వతాలు
1) ట్రాన్స్ అంటార్కిటిక్ పర్వతాలు - 3050 కి.మీ. పొడవైన పర్వతాలు.
- ఈ పర్వతాలను అంటార్కిటికాకు రెండు భాగాలుగా విభజించారు.
ఎ. పశ్చిమ అంటార్కిటికా- దీనిలో రాస్ వేస్ షెల్స్, మేరీ బైర్ట్ల్యాండ్, అంటార్కిటికా ద్వీపకల్పం, రోన్ ఐస్ షెల్ఫ్‌లు భాగంగా కలవు.
బి. తూర్పు అంటార్కిటికా- విల్కిస్ల్యాండ్, ఎండర్ బీల్యాండ్, క్వీన్ మాండ్ల్యాండ్, కోట్స్ల్యాండ్ కలవు. ఈ పర్వతాల్లో ఎత్తయిన శిఖరం విన్సన్ మాసిఫ్ (4892 మీ.). దీన్ని మొదటిసారిగా అధిరోహించింది నికోలస్ క్లించ్ నాయకత్వంలోని అమెరికా పర్వతారోహకుల బృందం (1966).
2) ప్రిన్స్ చార్లెస్ పర్వతాలు - తూర్పు అంటార్కిటికాలోని చిన్న పర్వత శ్రేణులు. దీనిలో ఎత్తయిన శిఖరం మెంజీస్ (3,355 మీ.)
సముద్ర భాగాలు - అంటార్కిటికా సముద్ర భాగాలైన డేవిస్ సముద్రం, వెడ్డెల్ సముద్రం, బెల్లింగ్ షాసన్ సముద్రం, అముండసన్ సముద్రం, రాస్ సముద్రాలు అంటార్కిటికా ఖండం చుట్టూ ఉన్నాయి.
శీతోష్ణస్థితి - అంటార్కిటికా శీతోష్ణస్థితిని రెండు రుతువులుగా విభజించారు.
- అంటార్కిటికాలో శీతాకాలం మార్చి నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది. అత్యల్ప ఉష్ణోగ్రతలు జూలై, ఆగస్టు నెలలో నమోదవుతాయి.
- అంటార్కిటికాలో నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత- 88.30C. ఇది రష్యా వోస్టోక్ పరిశోధన కేంద్రం వద్ద నమోదైంది.
- సెప్టెంబర్ నుంచి ఏప్రిల్ వరకు అంటార్కిటికాలో వేసవి కాలం. ఉష్ణోగ్రతలు డిసెంబర్, జనవరిలో అధికంగా నమోదవుతాయి. అధికంగా నమోదైన ఉష్ణోగ్రత 20.750C
- అంటార్కిటికాలో వర్షం పడదు. గత 20 లక్షల సంవత్సరాలుగా ఇక్కడ వర్షం పడటం లేదు. 5 సెం.మీ. నుంచి 50 సెం.మీ. పొడిమంచు కురుస్తుంది.
- కటిక చీకటి గల ఆరు నెలల శీతాకాలంలో అరోరా ఆస్ట్రాలిస్ అనే ధ్రువపు కాంతులు ఏర్పడతాయి.
- అంటార్కిటికాలో అత్యంత తీవ్రమైన బ్లిజార్డ్స్ అనే మంచు తుఫానులు ఏర్పడతాయి.
వృక్ష సంపద: వృక్షాలు లేని ఏకైక ఖండం ఖండతీర ప్రాంతాల్లో వేసవికాలంలో పాకుడు జాతి నాచు మొక్కలు పెరుగుతాయి.
జంతు సంపద: ఖండం మీద నివసించే జీవులు కాకుండా సముద్ర జలాల్లో, తీర ప్రాంతాల్లో నివసించే జీవులు అంటార్కిటికా జలాల్లో అత్యధికంగా ఉన్నాయి. - పెంగ్విన్, తిమింగళాలు, సీల్స్, క్రీల్ వంటివి ఇక్కడ ఉన్నాయి.
- పెంగ్విన్ పక్షులు ప్రధానంగా ఇక్కడ ఉంటాయి. వీటి గుంపులను ‘రూకరీలు’ అంటారు.
- ప్రస్తుతం అంటార్కిటికాను ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలకు వినియోగించడం లేదు. కేవలం పరిశోధనల కోసం మాత్రం శాస్త్రవేత్తలు అంటార్కిటికాను సందర్శిస్తున్నారు.
ముఖ్యాంశాలు
1) అంటార్కిటికా ఖండంలో 98 శాతం భూభాగం మంచుతో కప్పి ఉంది. ప్రపంచంలోని మొత్తం మంచులో 90 శాతం ఈ ఖండంపై ఉంది. సగటున 3,000 మీటర్ల మందంతో మంచు నిక్షేపాలు ఉన్నాయి.
2) అంటార్కిటికాలో 70 డిగ్రీల దక్షిణ అక్షాంశం, 11 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద భారతదేశ పరిశోధన కేంద్రం ‘మైత్రి’ ఉంది. మరో పరిశోధన కేంద్రం ‘భారతి’.
3) ధ్రువానికి దగ్గరగా ఉన్న పరిశోధనా కేంద్రం రష్యాకు చెందిన వోస్టోక్.
4) దక్షిణ ధ్రువ బిందువును అముండిసన్ స్కాట్ ధ్రువ బిందువు అని కూడా అంటారు. దీని ఎత్తు 2835 మీ.
5) ప్రపంచంలోనే అతి పొడవైన హిమనదం ‘లాంబర్ట్-ఫిషర్ హిమనదం’. దీని పొడవు 400 కి.మీ..
6) అంటార్కిటికాలో దాదాపు 70 శాశ్వత పరిశోధన కేంద్రాలున్నాయి.
ఆస్ట్రేలియా ఖండం
- ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీప ఖండం, అతిచిన్న ఖండం.
- ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దాన్ని ఆనుకొని ఉన్న పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలోని ద్వీప భూభాగాలను కలిపి ఆస్ట్రేలియా అని పిలుస్తారు.
- 10 డిగ్రీల అక్షాంశం నుంచి 45 డిగ్రీల దక్షిణ అక్షాంశాల మధ్య, 110 డిగ్రీల నుంచి 155 డిగ్రీల తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. దీన్నే ‘నగర ఖండం’ అని పిలుస్తారు.
- ఆస్ట్రేలియాను 6 రాజకీయ విభాగాలుగా విభజించారు (రాష్ర్టాలు).
1) పశ్చిమ ఆస్ట్రేలియా
2) ఉత్తర ఆస్ట్రేలియా
3) క్వీన్స్లాండ్
4) న్యూసౌత్‌వేల్స్
5) దక్షిణ ఆస్ట్రేలియా
6) విక్టోరియా అండ్ టాస్మేనియా - దీన్ని ద్వీపఖండం అని, పురాతన ఖండం అనే పేర్లతో పిలుస్తారు.
సరిహద్దులు
- ఉత్తరం- ఆరాపుర సముద్రం, కార్పెంటారియా సింధుశాఖ (పసిఫిక్ సముద్ర భాగాలు)
- తూర్పు- పసిఫిక్ మహాసముద్రం
- దక్షిణం- అంటార్కిటికా మహాసముద్రం
- పశ్చిమం- హిందూ మహాసముద్రం
- వాయవ్యం- తిమోర్ సముద్రం (హిందూ మహాసముద్రం)
భౌతిక స్వరూపాలు
3 రకాలు
1) పశ్చిమాన గల పీఠభూమి: పశ్చిమం నుంచి తూర్పునకు పల్లపు ప్రాంతంగా ఉంటుంది. ఈ ప్రాంతం అంతా అధికంగా పశ్చిమ ఆస్ట్రేలియా ఎడారిలో ఉంది. దీనిలో చిన్న విచ్ఛిన్న పర్వతశ్రేణులు ఉన్నాయి. అవి..
ఎ)మెక్‌డోనెల్ శ్రేణులు: ఉత్తర ఆస్ట్రేలియా రాష్ట్రంలోని ఈ శ్రేణులకు తూర్పున ‘సింప్సన్ ఎడారి’ ఉంది. దీనిలో ఎత్తయిన శిఖరం మౌంట్జిల్ (1531 మీ.)
బి) పీటర్ మూన్ అండ్ మాస్గ్రేట్ శ్రేణులు: ఇవి మెక్‌డోనల్ శ్రేణులకు దక్షిణాన ఉన్నాయి. ఈ రెండు శ్రేణులకు మధ్యలో అమేడియన్ అండ్ నిలే సరస్సులు ఉన్నాయి. - పీటర్ మూన్ శ్రేణుల్లో ఎత్తయిన శిఖరం మౌంట్ విన్హయ్ (1231 మీ.).
- అయర్స్రాక్ అనే ఏకాంతరకొండ ఈ పీటర్మూన్ శ్రేణుల్లో ఉంది. దీన్ని స్థానికంగా ‘ఉలురు’ అంటారు.
- పీటర్ మూన్ శ్రేణులకు దక్షిణాన ‘గ్రేట్ విక్టోరియా ఎడారి’ ఉంది.
- పీటర్ మూన్ శ్రేణుల తూర్పు భాగాన మాస్గ్రేవ్ శ్రేణులు ఉన్నాయి.
సి) హమెర్సిలీ శ్రేణులు: ఆస్ట్రేలియా పశ్చిమ భాగాలు గల శ్రేణులు. వీటిలో ఎత్తయిన శిఖరం 1250 మీ. గల మెహర్రీ శిఖరం. - హమెర్సిలీ అండ్ మెక్‌డోనల్ శ్రేణుల మధ్యలో గిబ్బన్ ఎడారి ఉంది.
- హమెర్సిలీ అండ్ మెక్‌డోనల్ శ్రేణుల మధ్యలో గిబ్బన్ ఎడారి ఉంది.
డి) కింబర్లీ శ్రేణులు: ఆస్ట్రేలియా వాయవ్య భాగంలోని అవశిష్ట పర్వతాలు. ఆస్ట్రేలియాలో తొలి మానవ నివాసాలు ఇక్కడే లభ్యమయ్యాయి. ఇవి పురాతన ముడుత పర్వతాలు. - కింబర్లీ శ్రేణులకు, మెక్‌డోనల్ శ్రేణులకు, బర్క్లీ టేబుల్ ల్యాండ్‌కు మధ్యలో తానామి ఎడారి ఉంది.
2. తూర్పు ఉన్నత భూములు - ఆస్ట్రేలియా ఉత్తరాన గల కేప్‌యార్క్ ద్వీపకల్పం నుంచి దక్షిణాన గల టాస్మేనియా ద్వీపం వరకు, తీరం వెంట 3,500 మీ. విస్తరించిన శ్రేణులు. వీటినే గ్రేట్ డివైడింగ్ శ్రేణులు’ అంటారు. ఇవి పురాతన ముడుత పర్వతాలు.
- ఆస్ట్రేలియా నైరుతి భాగంలోని న్యూ సౌత్‌వేల్స్ రాష్ట్రంలోని కొనియాస్కా శిఖరం (2228 మీ.) గ్రేట్ డివైడింగ్ శ్రేణుల్లో ఎత్తయినది.
- ఆస్ట్రేలియా ఈశాన్య భాగంలో వీటిని ఆస్ట్రేలియన్ ఆల్ప్స్ పర్వతాలు అని పిలుస్తారు.
- సిడ్నీ పశ్చిమ భాగాన ఈ శ్రేణుల భాగాన్ని ‘బ్లూ మౌంటెయిన్స్’ అని పిలుస్తారు.
3) మధ్య పల్లపు భూములు: పశ్చిమాన గల పీఠభూములకు, తూర్పున గల ఉన్నత శ్రేణులకు మధ్యగల పల్లపు ప్రాంతాలు. - ముర్రే డార్లింగ్ నదీ పరీవాహక ప్రాంతం, ఐరీ సరస్సు పరీవాహక ప్రాంతం ఇందులో ముఖ్యమైనవి.
- వీటి దక్షిణ భాగాన ప్లిండర్స్ శ్రేణులు ఉన్నాయి. వీటికి పశ్చిమాన ఫ్రోమ్ సరస్సు, టారెన్స్ సరస్సు, గైర్డ్నార్ సరస్సు, ఐలాండ్ సరస్సులు ఉన్నాయి. ఈ సరస్సులన్నీ ఐరీ సరస్సు దక్షిణ భాగాన ఉన్నాయి.
ఆర్టీషియన్ బావులు: భూమి అంతర్భాగం నుంచి అంతర్భూజలం సహజంగా ఉబికి రావడాన్ని నీటిబుగ్గ (Spring) అంటారు. ఆస్ట్రేలియా ప్రాంతంలో ఉన్న భూ అంతర్ భూభాగపు నిర్మాణం వల్ల చిన్న గొట్టాలను భూమి లోపలికి దించడం వల్ల నీరు అదే ఉబికి వస్తుంది. ఇలాంటి కృత్రిమ నీటి బుగ్గలను ఆర్టీషియన్ బావులు (Artesian Wells) అంటారు.
ఓషియానియాలోని ద్వీపాలు - ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పపువాన్యూగినియా, టాస్మేనియా, ఫిజీ, మెలనేషియా వంటి ద్వీపాల సముదాయాన్ని ఓషియానియా అంటారు.
1) న్యూజిలాండ్: ఇది రెండు ద్వీపాల దేశం. ఎ) నార్త్ ఐలాండ్, బి) సౌత్ ఐలాండ్. - నార్త్ ఐలాండ్‌లో న్యూజిలాండ్ రాజధాని వెల్లింగ్టన్ ఉంది.
2) న్యూగినియా: ఆస్ట్రేలియా ఉత్తరాన గల ద్వీపం. ఇది ప్రపంచంలో రెండో పెద్ద ద్వీపం.
3) టాస్మేనియా ద్వీపం: ఆస్ట్రేలియా ఆగ్నేయ భాగాన గల ద్వీపం. దీనిలో 1617 మీ. ఎత్తయిన ‘మౌంట్ ఓసా శిఖరం’ ఉంది.
4) మెలనేషియా ద్వీపం: ఇది ఆస్ట్రేలియాకు తూర్పు భాగాన ఉంది. వీటితోపాటు ఈశాన్యంలో మైక్రోనేషియా, ఫ్రెంచ్ పాలినేషియా ద్వీపాలు ఉన్నాయి. - మెలనేషియా అంటే ‘నలుపు ద్వీపాలు’. పాలనేషియా అంటే చాలా ద్వీపాలు అని అర్థం.
ద్వీపకల్పాలు
1) కేప్‌యార్క్ ద్వీపకల్పం: కార్పెంటారియా సింధు శాఖకు, కోరల్ సముద్రానికి మధ్యలో గల భూ భాగం.
2) ఆర్నమ్ ద్వీపకల్పం: తిమోర్ సముద్రానికి, కార్పాలియన్ సముద్రానికి మధ్యగల భూ భాగం.
3) ఐరీ ద్వీపకల్పం: స్పెన్నర్ సింధుశాఖ, గ్రేట్ ఆస్ట్రేలియన్ బైట్‌కు మధ్యగల భూ భాగం.
గ్రేట్ బారియర్ రీఫ్: ఆస్ట్రేలియా ఈశాన్యంలో క్వీన్స్లాండ్ తీరం వెంట గల 2,300 కి.మీ. ప్రపంచంలోనే పొడవైన అవరోధ భిత్తిక, పసిఫిక్ మహాసముద్రంలో ఉంది.
సముద్ర భాగాలు
1) కార్పెంటారియా సింధు శాఖ: ఆర్నమ్ ద్వీపకల్పానికి, కేప్‌యార్క్ ద్వీపకల్పానికి మధ్యగల సముద్ర భాగం.
2) టారెన్ జలసంధి: కేప్యార్క్కు న్యూగినియా ద్వీపానికి మధ్యగల జలసంధి. అరాపుర సముద్రం, కోరల్ సముద్రాలను కలుపుతుంది.
3) కుక్ జలసంధి: నార్త్ ఐలాండ్, సౌత్ ఐలాండ్ మధ్యగల జలసంధి. న్యూజిలాండ్‌ను వేరుచేసే జలసంధి.
4) బాస్ జలసంధి: విక్టోరియాను, టాస్మేనియాను వేరుచేసే జలసంధి. టాస్మాన్ సముద్రాన్ని, దక్షిణ మహాసముద్రాన్ని కలుపుతుంది.
5) గ్రేట్ ఆస్ట్రేలియన్ బైట్: ఆస్ట్రేలియా దక్షిణ భాగంలో చాపాకారంలో చొచ్చుకొని వచ్చిన పెద్ద జలభాగాన్ని ‘గ్రేట్ ఆస్ట్రేలియన్ బైట్’ అంటారు.
ఆస్ట్రేలియా శీతోష్ణస్థితి
1) ఆస్ట్రేలియా ఉత్తర, ఈశాన్య భాగాల్లో రుతుపవన శీతోష్ణస్థితి ఉంటుంది. భారతదేశంలోకి నైరుతి రుతుపవనాలు జూన్‌లో ప్రవేశించి వర్షాన్నిస్తే, ఆస్ట్రేలియాకు వాయవ్య రుతుపవనాలు డిసెంబర్లో ప్రవేశించి వర్షాన్నిస్తాయి.
2) ఆస్ట్రేలియా పశ్చిమాన గల ఎడారి: ఎ. ఆస్ట్రేలియా లోని విస్తీర్ణంలో అధిక భాగం ఈ ఎడారి కింద ఉంది.
బి. పశ్చిమ ఆస్ట్రేలియా శీతల ప్రవాహం కారణంగా, వ్యాపార పవనాల వైఫల్యం వల్ల ఈ ఎడారి ఏర్పడుతుంది.
సి. పశ్చిమ ఆస్ట్రేలియా రాష్ట్రంలో ఉత్తరాన గ్రేట్ శాండీ ఎడారి ఉంది. దీనికి దిగువన గిబ్సన్ ఎడారి. ఇంకా దక్షిణాన గ్రేట్ విక్టోరియా ఎడారి ఉంది.
డి. ఉత్తర ఆస్ట్రేలియా రాష్ట్రంలో తానామి ఎడారి, సింప్సన్ ఎడారి ఉన్నాయి.
ఇ. దక్షిణ ఆస్ట్రేలియా రాష్ట్రంలో ఐరీ సరస్సుకు ఉత్తరాన స్టర్ట్స్టోనీ ఎడారి, తిరారి ఎడారి ఉన్నాయి.
ఎఫ్. అన్నింటి కంటే గ్రేట్ విక్టోరియా ఎడారి పెద్దది.
3) ఆస్ట్రేలియా నైరుతి భాగం (పెర్త్), దక్షిణ ఆస్ట్రేలియా దక్షిణ భాగం (అడిలైడ్)లో మధ్యధరా శీతోష్ణస్థితి ఉంది.
జీ గిరిధర్
సివిల్స్ ఫ్యాకల్టీ
ఏకేఎస్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్
అశోక్‌నగర్, హైదరాబాద్
9966330068
Previous article
CLAT 2024 | Common Law Admission Test Latest Updates
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు