Polity | రాజ్యాంగ పరిరక్షణ కర్త.. అత్యున్నత అప్పీలు కోర్టు
సుప్రీంకోర్టు – అధికార విధులు
- రాజ్యాంగ పరిషత్తు సభ్యుడు అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ సుప్రీంకోర్టును ప్రపంచంలో కెల్ల శక్తిమంతమైన న్యాయస్థానంగా అభివర్ణించారు.
- దేశంలో ఫెడరల్ కోర్టుగా, అత్యున్నత అప్పీలు కోర్టుగా, రాజ్యాంగ పరిరక్షణ కర్తగా అనేక విధులను నిర్వర్తిస్తుంది. వీటిని కింది విధంగా వర్గీకరించవచ్చు.
- స్వతఃసిద్ధ/ప్రాథమిక అధికార పరిధి
- అప్పీళ్ల విచారణ పరిధి
- సలహా పూర్వక విచారణ పరిధి
- కోర్ట్ ఆఫ్ రికార్డ్
- రిట్ పరిధి
- న్యాయ సమీక్షాధికారం
- ఇతర అధికారాలు
ప్రారంభ అధికారం - ప్రకరణ 131 ప్రకారం ప్రారంభ అధికారం అనేది సుప్రీంకోర్టు సమాఖ్య స్వభావాన్ని తెలియజేస్తుంది. సమాఖ్య వివాదాలన్నింటిని సుప్రీంకోర్టులోనే పరిష్కరించుకోవాలి. కొన్ని వివాదాలను సుప్రీంకోర్టు మాత్రమే పరిష్కరిస్తుంది.
ఉదా: - కేంద్ర, రాష్ట్ర వివాదాలు
- అంతర్రాష్ట్ర వివాదాలు
- ప్రాథమిక హక్కుల పరిరక్షణ
- రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాలు
ప్రత్యేక వివరణ - 1961లో పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి, కేంద్రానికి బొగ్గు గనుల ప్రాంతాల స్వాధీనం, అభివృద్ధి చట్టం విషయంలో తొలిసారి కేంద్రం, రాష్ర్టాల సంబంధిత వివాదం ఏర్పడింది.
సుప్రీంకోర్టు ప్రాథమిక పరిధికి మినహాయింపు - కింది వివాదాలు సుప్రీంకోర్టు ప్రాథమిక పరిధి నుంచి మినహాయించారు.
- కేంద్ర ఆర్థిక సంఘం పరిధిలోకి వచ్చే విషయాలు
- అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు. పార్లమెంట్ 262ప్రకారం ఒక చట్టం ద్వారా ప్రత్యేక ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేసినప్పుడు ఈ మినహాయింపు వర్తిస్తుంది. అయితే అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల ట్రిబ్యునళ్ల తీర్పులను పూర్తిగా సుప్రీంకోర్టు ప్రారంభ పరిధి నుంచి మినహాయించలేదు. ఆ తీర్పుల అమలు కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు.
- కేంద్ర, రాష్ర్టాల మధ్య కుదిరే ప్రత్యేక ఒప్పందాలు (సుప్రీంకోర్టు ప్రాథమిక పరిధి నుంచి మినహాయించబడతాయనే షరతును ఆ ఒప్పందంలో అంతర్భాగం చేసినప్పుడు)
- కేంద్రం నుంచి రాష్ర్టాల నష్టపరిహారం రాబట్టే వివాదాలు
- సుప్రీంకోర్టు ఏర్పడక ముందే కుదుర్చుకున్న ఒప్పందాలు, సుప్రీంకోర్టు అమల్లోకి వచ్చిన తర్వాత సమకాలీన పరిస్థితుల్లో వివాదం అయిన అంశాలు
అప్పీళ్లు – పరిధి
- సుప్రీంకోర్టు దేశంలో అత్యున్నతమైన అప్పీళ్ల కోర్టు. కింది విషయాలపై అప్పీళ్ల పరిధి ఉంటుంది.
రాజ్యాంగపరమైన వివాదాలు (ప్రకరణ 132) - హైకోర్టు చెప్పిన తీర్పుల విషయంలో రాజ్యాంగాన్ని మరింత లోతుగా వ్యాఖ్యానించాల్సిన అవసరం ఉందని హైకోర్టు ధ్రువీకరిస్తే అలాంటి కేసులను సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవచ్చు.
సివిల్ వివాదాల్లో అప్పీళ్లు (ప్రకరణ 133) - ఏదైనా సివిల్ వివాదంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులో చట్టానికి సంబంధించిన లోతైన అంశం ఇమిడి ఉందని భావించినా, లేదా ఈ వివాదంలో రాజ్యాంగపరమైన అంశం ఇమిడి ఉందని హైకోర్టు భావించి ధ్రువీకరిస్తే సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకోవచ్చు.
క్రిమినల్ వివాదాలు (ప్రకరణ 134) - తన కింది న్యాయస్థానాలు ప్రకటించిన తీర్పులను హైకోర్టు అప్పీళ్లను స్వీకరించి, కింది కోర్టు చెప్పిన తీర్పునకు పూర్తి విరుద్ధంగా తీర్పు చెప్పి, ముద్దాయికి మరణశిక్ష విధించినప్పుడు
- కింది కోర్టు విధించిన మరణశిక్షను పునఃసమీక్షించి, మరణశిక్షను హైకోర్టు రద్దు చేసిన సందర్భాల్లో సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకోవచ్చు.
- అప్పీలుకు హైకోర్టు అనుమతి ధ్రువీకరించినప్పుడు (134ఎ)
- 1970లో పార్లమెంటు ఒక చట్టం ద్వారా సుప్రీంకోర్టు క్రిమినల్ వివాదాల పరిధిని విస్తృతం చేసింది. దీని ప్రకారం హైకోర్టు కింది కోర్టు తీర్పునకు విరుద్ధంగా ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష లేదా 10 సంవత్సరాల శిక్ష విధించినప్పుడు
- కింది కోర్టు నుంచి హైకోర్టు ఒక కేసును బదిలీ చేయించుకుని ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష కాని లేదా 10 సంవత్సరాలల శిక్ష కానీ విధించినప్పుడు కూడా సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవచ్చు.
సుప్రీంకోర్టు ప్రత్యేక అనుమతితో అప్పీలు (ప్రకరణ 136)
- కొన్ని ప్రత్యేక సందర్భాల్లో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవచ్చు.
- హైకోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా బాధితుడికి న్యాయం జరగనప్పుడు సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకుంటే న్యాయం జరుగుతుందని బాధితుడు కోర్టును ఒప్పించగలిగితే ఆ సందర్భంలో కోర్టు అనుమతితో అప్పీలు చేసుకోవచ్చు.
- ఇది సుప్రీంకోర్టు విచక్షణాధికారంపై ఆధారపడి ఉంటుంది.
సలహాపూర్వక విచారణ పరిధి - ప్రకరణ 143 ప్రకారం రాష్ట్రపతి కింది విషయాల్లో సుప్రీంకోర్టు సలహాను కోరవచ్చు.
1. చట్టానికి సంబంధించిన వివాదం కానీ లేదా ప్రజా ప్రాముఖ్యం కలిగిన ఒక సంఘటనకు సంబంధించిన వాస్తవాలను తెలుసుకునే క్రమంలో గానీ,
2. రాజ్యాంగం రాకముందు కుదుర్చుకున్న ఒప్పందాలకు సంబంధించిన వివాదాల్లో రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాను కోరవచ్చు.
ప్రత్యేక వివరణ - ప్రకరణ 143: మొదటి రకం వివాదాల్లో సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించవచ్చు లేదా వ్యక్తీకరించడానికి
నిరాకరించవచ్చు. - రెండో రకం వివాదాల్లో సుప్రీంకోర్టు తన అభిప్రాయాన్ని తప్పనిసరిగా వ్యక్తీకరించాలి. (ప్రకరణ 131 ప్రకారం ప్రారంభ అధికార పరిధి నుంచి మినహాయించిన అంశాలు)
- పై రెండు సందర్భాల్లోనూ సుప్రీంకోర్టు వ్యక్తీకరించిన అభిప్రాయాన్ని (సలహాను) రాష్ట్రపతి పరిగణనలోకి తీసుకోవచ్చు లేదా తీసుకోకపోవచ్చు. వీటిని తీర్పులుగా పరిగణించరు.
- అయితే సుప్రీంకోర్టు వ్యక్తీకరించిన అభిప్రాయాలను దిగువ కోర్టులు తప్పనిసరిగా పాటించాలి.
- ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తమ అభిప్రాయాలను వ్యక్తీకరిస్తుంది.
కోర్ట్ ఆఫ్ రికార్డ్ - ప్రకరణ 129 ప్రకారం సుప్రీంకోర్టు వెలువరించిన అన్ని తీర్పులు, ప్రక్రియలు దేశవ్యాప్తంగా అన్ని దిగువ న్యాయస్థానాల్లో సాక్ష్యాలుగా, ఆధారాలుగా స్వీకరించాలి.
- దిగువ కోర్టులు సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులనే ప్రామాణికంగా చేసుకొని సంబంధిత వివాదాల్లో తీర్పును చెప్పాల్సి ఉంటుంది.
- దేశంలోని వ్యక్తులు, సంస్థలు సుప్రీంకోర్టు తీర్పును గౌరవించాలి. లేదంటే దాన్ని కోర్టు ధిక్కార నేరంగా పరిగణించి రూ.2000 జరిమానా, ఆరు నెలల వరకు శిక్ష విధించే అధికారం ఉంది.
రిట్లు జారీ చేసే అధికారం
- ప్రకరణ 32 ప్రకారం, సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్షియోరరి, కోవారంటో రిట్లను జారీ చేస్తుంది.
- రిట్లు జారీచేసే అధికారం సుప్రీంకోర్టు ప్రాథమిక అధికార పరిధిలోకి వస్తుంది.
రివ్యూ పిటిషన్- తీర్పులను సమీక్షించడం - ప్రకరణ 137 ప్రకారం సుప్రీంకోర్టు తన తీర్పులను సమీక్షించుకోవచ్చు. కక్షిదారులు సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును మరోసారి సమీక్ష చేయమని కోరవచ్చు.
- రివ్యూ అధికారం, న్యాయసమీక్ష అధికారం సుప్రీంకోర్టును అత్యున్నత కోర్టుగా నిలుపుతుంది.
- 1967 గోలక్‌నాథ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును 1973లో కేశవానందభారతిలో పూర్తిగా మార్చివేసింది.
- 2018లో షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల అకృత్యాల నిషేధ చట్టం 1989కు సంబంధించి సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును సమీక్ష చేయమని కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసింది.
- సుప్రీంకోర్టు సమీక్షించి తీర్పును మార్పు చేయడం జరిగింది.
క్యూరేటివ్ పిటిషన్ - సుప్రీంకోర్టు తీర్పులను పునఃసమీక్షకు వీలుకానప్పుడు కక్షిదారుడు తీర్పులోని కొన్ని అంశాల వల్ల బాగా నష్టపోతామనుకున్నప్పుడు వాటిని సవరించమని సుప్రీంకోర్టును కోరవచ్చు.
- ఆ విధంగా ప్రత్యేకంగా ప్రస్తావించిన అంశాల్లో మాత్రమే సుప్రీంకోర్టు కొంత ఉపశమనం కలిగించవచ్చు, లేదా
నిరాకరించవచ్చు.
ఇతర అధికారాలు-అంశాలు
- కింద పేర్కొన్న అధికారాలు కూడా సుప్రీంకోర్టు కలిగి ఉంటుంది.
- ప్రకరణ 138 ప్రకారం పార్లమెంటు ఒక చట్టం ద్వారా సుప్రీంకోర్టు అధికార పరిధిని విస్తృతం చేయవచ్చు.
- ప్రకరణ 139 ప్రకారం పార్లమెంటు ఒక చట్టం ద్వారా రిట్లను జారీ చేసే పరిధిని విస్తృతం చేయవచ్చు. ప్రకరణ 32(2) ప్రకారం ప్రాథమిక హక్కుల రక్షణకు కాకుండా ఇతర అంశాలకు కూడా రిట్లను జారీ చేసే విధంగా సుప్రీంకోర్టుకు అధికారాన్ని కల్పించవచ్చు.
- ప్రకరణ 139ఎ ప్రకారం సుప్రీంకోర్టులో ఉన్న ఒకే అంశానికి సంబంధించిన కేసులను, అలాగే రాష్ట్ర హైకోర్టుల్లో విచారణలో ఉన్న ఒకే అంశానికి చెందిన వివిధ కేసులను అన్నింటిని సమీకృతం చేసి విచారించవచ్చు.
- ప్రకరణ 141 ప్రకారం సుప్రీంకోర్టు ధ్రువీకరించినా లేదా ప్రకటించిన అన్ని అంశాలను దేశంలోని దిగువ న్యాయస్థానాలు తప్పనిసరిగా పాటించాలి.
- ప్రకరణ 142 ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను, ఆదేశాలను అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది.
- వాటికి సంబంధించి రాష్ట్రపతి లేదా పార్లమెంటు విధి విధానాలను రూపొందించాలి.
- సుప్రీంకోర్టు తన తీర్పుల అమలు కోసం ప్రత్యేక ఆదేశాలను జారీ చేయవచ్చు. దీన్నే సంపూర్ణ న్యాయం అందించడం అంటారు.
- తీర్పులను వెలువరించడమే కాకుండా వాటి అమలుకు కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయొచ్చు.
- జాతీయ రహదారుల వెంబడి మద్యం దుకాణాల తొలగింపునకు సంబంధించి సుప్రీంకోర్టు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది.
- ప్రకరణ 143 ప్రకారం సుప్రీంకోర్టు రాష్ట్రపతికి న్యాయ సలహాను అందిస్తుంది. ఐదుగురు న్యాయమూర్తుల కంటే తక్కువ కాకుండా రాజ్యాంగ ధర్మాసనం పరిశీలిస్తుంది.
- ప్రకరణ 144 ప్రకారం దేశంలో ఉన్న అన్ని అధికార సంస్థలు, సివిల్, క్రిమినల్ కోర్టులు సుప్రీంకోర్టుకు సహాయపడే విధంగా వ్యవహరించాలి.
- ప్రకరణ 145 ప్రకారం పార్లమెంటు రూపొందించిన చట్టాలకు అనుగుణంగా రాష్ట్రపతి పూర్వానుమతితో న్యాయప్రక్రియలో తాను పాటించాల్సిన నియమాలను, పద్ధతులను సుప్రీంకోర్టు నిర్దేశించుకోవచ్చు.
- ప్రకరణ 145, క్లాజ్-3 ప్రకారం రాజ్యాంగపరమైన అంశాలను పరిశీలించడానికి ఐదుగురు న్యాయమూర్తుల కంటే తక్కువ కాకుండా రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయవచ్చు.
- ప్రకరణ 146 ప్రకారం సుప్రీంకోర్టులో పని చేసే అధికారులు ఇతర సిబ్బందిని ప్రధాన న్యాయమూర్తి నియమిస్తారు. వీరి సర్వీసు విషయాలను ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతి పూర్వ అనుమతితో నిర్ణయిస్తారు.
- వీరి జీతభత్యాలు కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.
రాజ్యాంగంపై వ్యాఖ్యానం - రాజ్ంయంగంలోని అంశాలపై సుప్రీంకోర్టు ఇచ్చే వ్యాఖ్యానం అంతిమమైంది. సుప్రీంకోర్టు తీర్పులకు అన్ని వ్యవస్థలు కట్టుబడి ఉంటాయి.
- రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించే సమయంలో సుప్రీంకోర్టు అనేక న్యాయసూత్రాలను అనుసరిస్తుంది.
- ముఖ్యంగా గత 73 సంవత్సరాల్లో సుప్రీంకోర్టు కింది న్యాయసూత్రాలను అనుసరించింది.
- డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటి, డాక్ట్రిన్ ఆఫ్ వెయివర్, డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లీప్స్, డాక్ట్రిన్ ఆఫ్ పిత్, సబ్‌స్టాన్స్ శాసన సామర్థ్య సిద్ధాంతం, రాజ్యాంగ చైతన్య సిద్ధాంతం, క్రియాశీల సిద్ధాంతం, అనుభవాత్మక నిర్ణయ సిద్ధాంతం, రాజ్యాంగ పురోభావన సిద్ధాంతం మొదలైనవి.
రాజ్యాంగ పరిరక్షణ కర్త - సమాఖ్యలో భాగమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగం నిర్దేశించిన పరిధిలో పని చేసేలా నియంత్రిస్తుంది. ప్రజల ప్రాథమిక హక్కులను రక్షిస్తుంది.
- రాజ్యాంగంపై వ్యాఖ్యానించే విషయంలో సుప్రీంకోర్టుదే అంతిమ నిర్ణయం.
- రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక వివాదాన్ని పరిష్కరిస్తుంది.
- యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఇతర సభ్యులు, అలాగే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఇతర సభ్యుల తొలగింపు విషయాల్లో రాష్ట్రపతి సుప్రీంకోర్టుతో విచారణ చేయిస్తారు.
- సుప్రీంకోర్టుకు తన తీర్పును తనే మార్పు చేసుకునే అధికారం ఉంది. దీన్నే పునఃసమీక్షాధికారం అంటారు.
జీబీకే పబ్లికేషన్స్
హైదరాబాద్, 9959361278
Previous article
GATE 2024 | ఉన్నత చదువులకు కొలువులకు గేట్‌వే
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు