Indian History – Groups Special | శతపథ బ్రాహ్మణంలో ‘కుసుదిన్’లు అంటే ఎవరు?
వేద నాగరికత
- దేశంలో వేద నాగరికత రెండో నాగరికత. సప్త సింధూ లేదా ఆర్యావర్తనం దేశంలో ఆర్యుల తొలి నివాసం. వీరు నార్డిక్ జాతికి చెందినవారు. వేద నాగరికతకు వేదాలు మూలం. కాబట్టి వీరి నాగరికతను వేద నాగరికత అంటారు. వీరు దేశానికి తొలుత వలస వచ్చిన విదేశీయులుగా చెప్పబడ్డారు. ఆర్యులు భారత్‌లో మొదటగా సంస్కృత భాషను ప్రవేశ పెట్టారు.
వేద వాఙ్మయం - సింధూ నాగరికతకు పురాతత్వ శాస్త్ర ఆధారాలు ప్రధానమైనవి. అయితే వేద సంస్కృతికి వైదిక వాఙ్మయమే ప్రధాన ఆధారం. ఇందులో ప్రధానంగా నాలుగు వేదాలు, వేదాంగాలు, ఉపవేదాలు ఉన్నాయి.
- వేదాలు: రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం
- ప్రతి వేదం సంహితలుగా, బ్రాహ్మణాలుగా, అరణ్యాలుగా, ఉపనిషత్తులుగా విభజితమై ఉన్నాయి.
- సంహితలు: ఇవి మంద్ర జపతాపాల సమూహం
- బ్రాహ్మణాలు: కర్మకాండను వివరిస్తాయి.
- అరణ్యకాలు, ఉపనిషత్తులు: ఇవి తత్వజ్ఞానాన్ని వివరిస్తాయి. అంతేకాకుండా ఆత్మకు, పరమాత్మకు, మనిషి, ప్రపంచానికి మధ్య గల సంబంధాన్ని వివరిస్తాయి.
- రుగ్వేదం: ఇండో-యూరోపియన్ భాషల్లో లభించే మొట్టమొదటి లిఖిత గ్రంథం.
- రుగ్వేదంలో 1028 మంత్రాలున్నాయి. 10 భాగాలుగా విభజితమైంది.
- ఇది వేదాలన్నింటిలో కెల్లా పురాతనమైంది.
- రుగ్వేదం తొలి వేద ఆర్యుల సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక జీవన విధానాన్ని తెలుపుతుంది.
- దీన్ని భరద్వాజుడు, విశ్వామిత్రుడు, వశిష్టుడు వంటి రుషులు రచించినట్లు తెలుస్తుంది.
- ఇందులో 2 నుంచి 7 వరకు ఉన్న మండలాలు ప్రాచీనమైనవి. మొదటి మండలం, పదో మండలం చివరగా చేర్చారు. పదో మండలంలో మొదటిసారి శూద్రుల ప్రస్తావన ఉంది.
- 35వ మండలంలో అతి ప్రాచీన పవిత్ర మంత్రం గాయత్రీ మంత్ర ప్రస్తావన ఉంది.
- యజుర్వేదం: ఈ వేదం యజ్ఞాల సమయంలో పాటించాల్సిన నియమాల గురించి, మంత్ర, తంత్రాల గురించి పేర్కొంటుంది.
- ఈ వేదం 4 ఆశ్రమాల గురించి పేర్కొంటుంది. దీన్ని ‘అధర్వు’ పురోహితులు నిర్వహిస్తారు. దీని ఉపవేదం ధనుర్వేదం.
- రాజసూయ, వాజపేయ యాగాల గురించి మొదటిసారి పేర్కొన్నది.
- దీన్ని రెండు భాగాలుగా విభజించారు. కేవలం యజ్ఞ యాగాలకు సంబంధించిన మంత్రాలతో కూడింది శుక్ల యజుర్వేదం, కాగా బ్రాహ్మణకాలతో కలిసి ఉండేది కృష్ణ యజుర్వేదం.
సామవేదం - సామవేదం అనేది సంగీతం గురించి తెలుపుతుంది. సామ అంటే శ్రావ్యత అని అర్థం. ఇది భారతీయ సంగీతానికి మూలం.
- సామవేదంలో 1063 శ్లోకాలు ఉన్నాయి.
- సామవేదం ఉపవేదం గాంధర్వ వేదం. సామవేదానికి సంబంధించిన రెండు గ్రంథాలను అర్చికాలు అంటారు.
అధర్వణ వేదం - ఇది చాలా కాలం వేదంగా పరిగణించబడలేదు.
- దీనిలో 20 ఖండాలు ఉండి 711 శ్లోకాలు ఉన్నాయి. ఈ 20 ఖండాలను పిప్పలాద సంహిత, శౌనకేయ సంహిత అనే రెండు భాగాలుగా విభజించారు.
- ఈ వేదం భూతప్రేతాలను, వ్యాధులను ఏవిధంగా దూరం చేయాలో పేర్కొంటుంది.
- ఈ వేదం బానిసల గురించి మొదటిసారి ప్రస్తావించింది. మొదటిసారి గోత్రాన్ని గురించి పేర్కొన్నది.
- దానిలో యుద్ధ విద్యల (బానాలకు విషం పూయడం లాంటి) గురించి పేర్కొన్నారు. యుద్ధం మానవుని మెదడులో మొదలవుతుందని పేర్కొంది.
బ్రాహ్మణాలు - వేదాల్లోని మంత్రాలను ఒక క్రమపద్ధతిలో వివరిస్తాయి. ఇవి కర్మమార్గాన్ని ప్రచారం చేస్తాయి. 7 బ్రాహ్మణాలను వేదాలకు అనుబంధంగా రచించారు. బ్రాహ్మణాలన్నింటిలోనూ శతపథ బ్రాహ్మణం పెద్దది.
శతపథ బ్రాహ్మణం - ఇది అత్యంత ముఖ్యమైన బ్రాహ్మణం. ఇది శుక్ల యజుర్వేదానికి సంబంధించింది.
- వ్యవసాయ దశలను, రాజసూయ, వాజపేయ యాగాలను గురించి పేర్కొంటుంది. వడ్డీ వ్యాపారులను ‘కుసుదిన్’లగా పేర్కొంది.
- ఈ బ్రాహ్మణంలో మృత్యువు, పునర్జన్మ గురించి ఎక్కువగా చర్చ జరిగింది.
ఐతరేయ బ్రాహ్మణం - రుగ్వేదానికి సంబంధించింది. ఐతరేయుని ద్వారా సంకలనం చేయబడింది.
- దక్షిణ భారతదేశంలో నివసిస్తున్న గిరిజన జాతులైన కళింగ, పుళింద, మాతలు, సవరల గురించి దీనిలో భాగంగా ఆంధ్రుల ప్రస్తావన మొదటిసారి వచ్చింది.
- కుటుంబాన్ని రక్షించేది కుమారుడే. కూతురు వల్ల దురవస్థ కలుగుతుందని తెలిపింది.
తాండ్యమాన బ్రాహ్మణం - ఇది సామవేదానికి సంబంధించింది. ఇది అతి ప్రాచీన బ్రాహ్మణాల్లో మొట్టమొదటిది.
- దీనిలో ఆర్యేతరులను ఆర్యుల్లో చేర్చుకోవడానికి నిర్దేశించిన వ్యత్యస్థోమ క్రతువు గురించి వర్ణించారు.
వేదాంగాలు - ఇవి 6.
- శిక్ష: వేదమంత్రాలకు అవసరమైన, సక్రమమైన ఉచ్ఛారణను తెలుపుతుంది.
- కల్పం: ఇందులో గృహస్థు విధులు, సామాజిక బాధ్యతలు వివరిస్తుంది.
- వ్యాకరణం: భాషను క్రమపద్ధతిగా అధ్యయనం చేయడానికి ఇది తోడ్పడుతుంది.
- నిరుక్తం: పదాల వ్యుత్పత్తిని తెలియజేస్తుంది.
- జ్యోతిష్యం: నక్షత్రరాసుల స్థితిగత ప్రభావాలను తెలుపుతుంది.
- ఛందస్సు: వేద మంత్రాల రూపాన్ని వివరిస్తుంది.
- ఉపవేదాలు: 4 అవి..
- ఆయుర్వేదం- వైద్యానికి సంబంధించింది
- ధనుర్వేదం- యుద్ధ నైపుణ్యాలకు సంబంధించింది
- గాంధర్వ వేదం- సంగీతానికి సంబంధించింది
- శిల్ప వేదం- కళలు, సాహిత్యానికి సంబంధించింది
- వేదాలు రుషుల ద్వారా తెలపబడ్డాయని, అవి అపౌరుషేయాలని, నిత్యాలని ఒకరి నుంచి ఒకరికి వినికిడి ద్వారా నేర్పించబడి, ఈనాటికి లిఖిత రూపం సంతరించుకున్నాయని తెలుస్తుంది.
- వేద కాలాన్ని రుగ్వేదం కాలం, మలివేద కాలం అని రెండుగా విభజించారు.
- క్రీ.పూ. 2000 నుంచి క్రీ.పూ. 500 వరకు ఉన్న కాలాన్ని రుగ్వేద కాలంగా భావిస్తున్నారు.
రుగ్వేద కాలం
- ఆ నాటి సామాజిక నిర్మాణం బంధుత్వం మీద ఆధారపడి ఉంది. వ్యక్తిని అతని వంశం ఆధారంగా గుర్తించారు.
- ప్రజలు మొదట తమ తెగకు విధేయులుగా ఉన్నారు. అందుకే తెగను రుగ్వేదంలో జన అని అన్నారు. ఈ జన అనే పదం రుగ్వేదంలో 275 సార్లు ప్రస్తావించారు. కానీ జనపదం (రాజ్యం) అనే మాట ఒక్కసారి కూడా ఉపయోగించలేదు.
- తెగ అనే అర్థంలో ఉపయోగించిన మరొక పదం విష్. ఈ విష్ అనే పదం 170 సార్లు ఉపయోగించారు.
- విష్ అంటే కొన్ని గ్రామాల సముదాయం అయి ఉండవచ్చు. కులం అనే పదం రుగ్వేదంలో కుటుంబం అనే అర్థంలో వాడారు.
- రుగ్వేద కాలం నాటి కుటుంబం ఉమ్మడి కుటుంబం.
- రోమన్ సమాజంలాగే రుగ్వేద సమాజంలో కూడా పితృస్వామ్య వ్యవస్థ ఉండేది.
- పితృస్వామ్య సమాజంలో తండ్రికి పూర్తి అధికారాలు ఉండేవి. తండ్రిని గృహపతి లేక దంపతి అని పిలిచేవారు.
- ఆ నాడు తెగల మధ్య యుద్ధాలు సర్వసాధారణం. కాబట్టి తండ్రులు తమకు మగ పిల్లలే పుట్టాలని దేవుని ప్రార్థించేవారు.
- రుగ్వేద కాలంలోని స్త్రీల పరిస్థితి కొంత బాగానే ఉంది. వారు సమావేశాలకు రావచ్చు, పాల్గొనవచ్చు. భర్తలతో పాటు యజ్ఞాలు చేయవచ్చు. వేద మంత్రాలు కూడా రాయవచ్చు.
- కొన్ని అనాగరిక సంప్రదాయాలు ఉన్న వివాహ వ్యవస్థ ఆ నాటికే సమాజంలో స్థిరపడింది.
- అన్న చనిపోతే వదినను పెండ్లి చేసుకొనే నియోగ వివాహం, వితంతు పునర్వివాహం రుగ్వేదంలో కనిపిస్తుంది.
- రుగ్వేదంలో బాల్యవివాహాలు కనిపించవు. వివాహ వయస్సు 16, 17 సంవత్సరాలు ఉన్నట్లు తెలుస్తుంది.
- వర్ణం అంటే రంగు అని అర్థం. ఆ నాటి రుగ్వేద సమాజంలో రంగు ఆధారిత వర్ణ విచక్షణ, సామాజిక విభజన లేదు.
- రుగ్వేద కాలంలో సామాజిక విభజన కావడానికి ప్రధాన కారణం ఆర్యులు స్థానిక ప్రజలను జయించి, వారిని బానిసలుగా, దాసులుగా చూడటం, యుద్ధం జరిగినప్పుడు యుద్ధంలో వచ్చిన దోపిడీ ధనాన్ని పురోహితులు, తెగల నాయకులు ఎక్కువ భాగం పంచుకున్నారు. దీంతో మిగతా ప్రజల కంటే ఎక్కువ అభివృద్ధిలోకి రాగలిగారు. ఈ పరిణామమే సామాజిక విభజనకు కారణమైంది.
- తొలి ఆర్య సమాజం 3 వర్గాలు విభజితమైంది. వారు.. 1) యోధులు, 2) పూజారులు, 3) సామాన్య ప్రజలు ఇలాంటి విభజనే ఇరాన్లో కూడా ఉండేది.
- నాలుగో వర్గమైన శూద్రుల ప్రస్తావన రుగ్వేద యుగం చివరలో 10వ మండలంలోని పురుష సూక్తంలో కనిపిస్తుంది.
- రుగ్వేద కాలంలో బానిసలు ఉన్నట్లు తెలుస్తుంది. పురోహితులకు స్త్రీ బానిసలను కానుకలుగా ఇచ్చేవారు.
- రుగ్వేద కాలంలో బానిసలు ప్రధానంగా గృహ సంబంధం చేయడానికి వినియోగించేవారు. అంతేగాని వ్యవసాయం వంటి ఉత్పత్తి కార్యక్రమాలకు ఉపయోగించలేదు.
- రుగ్వేద కాలంలో వృత్తిమీద ఆధారపడ్డ సామాజిక విభజన ప్రారంభమైంది. అయితే ఆ విభజన మరీ తీవ్రంగా ఉండేది కాదు.
- రుగ్వేదంలో 9వ మండలంలో ఒక చోట నేను కవిని, మా నాన్న వైద్యుడు, మా వృత్తి పిండి రుబ్బడం ఇలా వివిధ వృత్తులను అనుసరిస్తూ, మా కుటుంబాన్ని మేం గడుపుకొంటున్నాం అని చెప్పడాన్ని బట్టి చూస్తే వృత్తి మీద ఆధారపడ్డ సామాజిక విభజన తీవ్రంగా లేదని తెలుస్తుంది.
- ఇటీవల హర్యానాలోని భగవాన్‌పూర్‌లో రుగ్వేద కాలం నాటి అవశేషాలు లభించాయి. అందులో ఒక ఇంటిలో 13 గదులున్న ఒక పెద్ద మట్టి ఇల్లు బయల్పడింది. ఇది ఒక నాయకుడిది గాని లేదా ఉమ్మడి కుటుంబ నివాసం గాని అయి ఉండవచ్చు.
రుగ్వేద సమాజంలోని ఆర్థిక అంశాలు - వారి ఆర్థిక వ్యవస్థ వ్యవసాయంపై ఆధారపడింది కాదు. వారిది పశుపాలన మీద ఆధారపడ్డ వ్యవస్థ. భూమిని దానం చేయడం కూడా రుగ్వేదంలో లేదు.
- రుగ్వేదంలో పశువుల సంపదల కోసం యుద్ధాలు ఉండేవి.
- రుగ్వేదంలో యుద్ధానికి గవిష్ట అనే పదం వాడారు. దానికి అర్థం ఆవుల కోసం అన్వేషణ అని. పశువులు వ్యక్తిగత ఆస్తిగాను, భూమి తెగ ఆస్తిగాను ఉండేది.
- రుగ్వేదంలో వడ్రంగి, రథకుడు, నేతకారుడు, చర్మకారుడు వంటి ప్రస్తావనల ద్వారా సమాజంలో చేతివృత్తులు ఉన్నట్లు తెలుస్తుంది.
- రుగ్వేదంలో ‘అయాస్’ అనే పదం ఉంది. అంటే లోహం అని అర్థం.
- తుది ఆర్యులకు రాగి, కంచు బాగా తెలిసిన లోహాలు.
- రుగ్వేద ఆర్యులకు వ్యవసాయం గురించి తెలుసు. వీరు కర్ర నాగలిని ఉపయోగించారు. వీరికి వ్యవసాయ పరిజ్ఞానం ఉన్నట్లు అంటే విత్తనాలు నాటడం, కోతలు, నూర్పిళ్ల గురించి తెలుసు అని శతపధ బ్రాహ్మణం తెలుపుతుంది.
- రుగ్వేద కాలం నాటి వారికి వ్యాపారాలు పెద్ద స్థాయిలో లేవు. అసలు సముద్రం గురించి తెలియదని తెలుస్తుంది. రుగ్వేదంలో సముద్రం అంటే నీటి సముదాయం మాత్రమే అని అర్థం.
- ప్రధానంగా వీరు గ్రామీణ ప్రాంతాల్లో నివసించారు. నగరాలు లేవు.
- వీరి చిన్న చిన్న వ్యాపారంలో గోవు మాధ్యమంగా ఉండేది. అయినప్పటికీ నిష్క, మాన అనే చిన్న నాణాలు చలామణిలో ఉండేవి.
- రాజుకు బలి అనే పన్ను చెల్లించేవారు. ఇది స్వచ్ఛందంగా ఉండేది. అంతేకాకుండా ఓడిపోయిన రాజు కూడా గెలిచినవాడికి బలిని చెల్లించేవాడు.
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ,
కోరుట్ల
Previous article
IPPB Recruitment 2023 | ఐపీపీబీ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్ పోస్టులు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు