Indian History | విప్లవ భావాలు.. ఆంగ్లేయులపై వీరుల పోరాటాలు
విప్లవోద్యమం
మొదటి దశ 1897-1915
- మితవాదుల రాజ్యాంగబద్ధ పోరాటాల పట్ల విసిగి అతివాదుల ఆలోచనలకు ఆకర్షితులై కొందరు యువకులు స్వాతంత్య్ర సాధనకు విప్లవోద్యమాన్ని బాటగా ఎంచుకున్నారు. దీనికి ఐరిస్ ఉగ్రవాదులు, రష్యన్ శూన్యవాదులు ఆదర్శమయ్యారు.
- వీరికి తిలక్ ‘బిచ్చమెత్తడం కాదు శివమెత్తాలి’ అనే నినాదం కూడా వాళ్లని ఆకర్షించింది.
- ఈ విప్లవోద్యమాలు ప్రధానంగా మహారాష్ట్ర, బెంగాల్, పంజాబ్‌లలో కేంద్రీకృతమైనవి.
విప్లవోద్యమాల కార్యక్రమాలు - రహస్య సంఘాలను స్థాపించడం, కరువు అంటువ్యాధుల సమయాల్లో సామాజిక సేవ చేయడం, విదేశీ వస్తువుల బహిష్కరణ, స్వదేశీ అభిమానాన్ని ప్రచారం చేయడం, నిరంకుశంగా వ్యవహరించే అధికారులను హతమార్చడం, స్వదేశీ దోపిడీల పేరిట దోపిడీలు చేసి ఆయుధ సమీకరణ చేయడం.
పూనా హత్యలు - 1897లో పూనా ప్లేగు వ్యాధి సందర్భంగా నికృష్టంగా వ్యవహరించిన పూనా కమిషనర్ అయిన రాండ్, లెఫ్టినెంట్ అయిరెస్ట్లను, చాపేకర్ సోదరులు(దామోదర్, బాలకృష్ణ) హతమార్చారు. వీరిద్దరికి మరణ శిక్ష విధించారు.
- నాసిక్ కుట్ర కేసు
- 1904 ప్రాంతంలో మహారాష్ట్రలో అభినవ భారత్ అనే విప్లవ సంస్థ స్థాపితమైంది. దీని సారథుల్లో దామోదర్ సావర్కర్, గణేష్ సావర్కర్లు ముఖ్యులు.
- అభినవ భారత్ సభ్యుడైన అనంత లక్ష్మణ్ కార్‌కేర్ నాసిక్ జిల్లా జడ్జి జాక్సన్‌ను కాల్చి చంపాడు. ఇది నాసిక్ కుట్ర కేసుగా ప్రసిద్ధి.
- ఈ కేసులో 27 మందికి శిక్షలు పడ్డాయి. వారిలో దామోదర్ సావర్కర్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధించి అండమాన్ జైలుకు పంపించారు.
యాషే హత్య - మద్రాసు రాష్ట్రంలో నీలకంఠ బ్రహ్మచారి, వంతీ అయ్యర్లు భారత్ మాతా అసోసియేషన్ అనే సంస్థను స్థాపించాడు.
- అయ్యర్ తిరునల్వేలి జిల్లా జడ్జి యాషేని హత్యచేశాడు. తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు.
భారత మాతా సొసైటీ - పంజాబ్‌లో 1904లో జె.ఎం.ఛటర్జీ భారత మాతా సొసైటీ అనే విప్లవ సంస్థను స్థాపించాడు. దీనిలో లాలా హరదయాల్, అజిత్‌సింగ్, సూఫీ అంబాలా ప్రసాద్‌లు సభ్యులయ్యారు.
బెంగాల్లో విప్లవోద్యమం - బంకించంద్ర ఛటర్జీ, స్వామి వివేకానంద, అరవింద ఘోష్‌ల నుంచి స్ఫూర్తి పొందింది.
అనుశీలన్ సమితి (కలకత్తా) - కలకత్తాలో 1902లో అనుశీలన్ సమితి స్థాపితమైంది. ప్రారంభకుల్లో బరీంద్రకుమార్ ఘోష్, జతీంద్రనాథ్ బెనర్జీ, ప్రమోద్ మిట్టల్‌లు ప్రముఖులు.
- దీన్ని ప్రోత్సహించిన వారిలో అరవింద ఘోష్, మార్గెరెట్ ఎలిజబెత్ నోబుల్ ఉన్నారు.
అనుశీలన్ సమితి (ఢక్కా) - ఢక్కాలో మరో అనుశీలన్ సమితి స్థాపితమైంది. దీని స్థాపకుడు పులిన్ బిహారిదాస్.
ఆత్మోన్నతి సమితి - బిపిన్ బిహారీ గంగూలీ ఆత్మోన్నతి సమితి అనే మరో విప్లవ సంస్థను స్థాపించాడు.
- బెంగాల్ విభజన బెంగాల్లో విప్లవోద్యమాన్ని తీవ్రతరం చేసింది.
- సంధ్య, వందేమాతరం, యుగాంతర్ వంటి పత్రికలు ప్రచురించబడ్డాయి. వీటిల్లో బరీంద్రకుమార్ సారథ్యంలోని యుగాంతర్ అన్ని విభాగాల్లోకి విప్లవోద్యమాన్ని తీసుకెళ్లింది.
పుల్లర్ హత్యాయత్నం - ఈ సందర్భంలోనే 1906లో తూర్పు బెంగాల్ ఉప గవర్నర్ పుల్లర్‌పై బరీంద్ర కుమార్ ఘోష్, భూపేంద్రనాథ్ దత్‌లు విఫల హత్యాయత్నం చేశారు.
కింగ్స్ ఫోర్డ్ హత్యాయత్నం - 1908లో ప్రజా వ్యతిరేకి అయిన ముజఫర్‌పూర్ (బీహార్) జడ్జి కింగ్స్ ఫోర్డ్‌పై ఖుదీరాంబోస్, ప్రపుల్లా చౌకీలు అతను ప్రయాణిస్తున్న వాహనంపై బాంబులు వేయగా మరణించాడు.
- ప్రపుల్ల చౌకీ ఆత్మహత్య చేసుకున్నాడు. ఖుదీరాంకు మరణ శిక్ష పడింది.
అలీపూర్ కుట్ర కేసు - బెంగాల్‌లోని అలీపూర్‌లో తూటాలు, బాంబులు తీవ్రవాద సాహిత్యం దొరకడంతో యుగాంతర్ గ్రూపునకు చెందిన 34 మందిని అరెస్ట్ చేశారు. దీనిలో భరీంద్రకుమార్ ఘోష్‌కు ద్వీపాంతరవాస శిక్ష పడగా అతని సోదరుడు అరవింద ఘోష్ నిర్దోషిగా బయటపడ్డాడు. ఇదే అలీపూర్ బాంబు కేసుగా ప్రసిద్ధి.
- అలీపూర్ కుట్ర కేసులో అరవింద్ ఘోష్ తరఫున వాదించిన న్యాయవాది చిత్తరంజన్ దాస్.
టైగర్ జతిన్ - 1915, సెప్టెంబర్ 9న బాలాసోర్ (ఒరిస్సా)లో విప్లవకారుడు జతీంద్రనాథ్ ముఖర్జీని పోలీసులు పెద్ద సంఖ్యలో ముట్టడించినప్పుడు విరోచితంగా పోరాడి మరణించాడు. ఈయన బాఘా జతిన్ (టైగర్ జతిన్)గా ప్రసిద్ధుడు.
ఢిల్లీ కుట్ర కేసు - 1912లో నూతన రాజధాని ఢిల్లీలోకి అధికార ప్రవేశం చేసే సందర్భంలో ఏనుగుపై ఊరేగుతున్న నాటి వైస్రాయ్ లార్డ్ 2వ హార్డింజ్‌పై (1911, డిసెంబర్ 23) రాస్ బిహారీ ఘోష్, సచిన్ సన్యాల్‌లు బాంబు విసిరారు. హార్డింజ్కు గాయాలయ్యాయి. సచిన్‌కు అండమాన్ శిక్ష పడింది.
- రాస్ బిహారీ ఘోష్ జపాన్ పారిపోయి రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్‌ను స్థాపించి చివరికి ఇండియన్ నేషనల్ ఆర్మీలో విలీనం చేశాడు.
విదేశాల్లో విప్లవోద్యమం
- శ్యామ్‌జీ కృష్ణవర్మ
- అమెరికా, ఇంగ్లండ్ వంటి విదేశాల్లో కూడా భారత విప్లవ కార్యకలాపాలు కొనసాగాయి. వారిలో శ్యామ్‌జీ కృష్ణవర్మ ప్రముఖుడు.
- శ్యామ్‌జీ కృష్ణవర్మ 1897లో లండన్‌లో ఇండియాకు హోమ్‌రూల్ తెచ్చే ఉద్దేశంతో ఇండియా హోమ్‌రూల్ సొసైటీని స్థాపించాడు.
- ఆయన లండన్‌లో ప్రారంభించిన పత్రిక ఇండియన్ సోషియాలజిస్ట్. లండన్‌లో ఇండియా హౌస్‌ను స్థాపించాడు.
- బ్రిటిష్ ప్రభుత్వం ఈయన కార్యక్రమాలను వ్యతిరేకించడంతో ఆయన పారిస్ చేరుకున్నాడు. ఫలితంగా లండన్‌లో విప్లవోద్యమ బాధ్యతలు వి.డి.సావర్కర్ (మహారాష్ట్రవాసి) మదన్‌లాల్ డింగ్రాలు స్వీకరించారు.
మదన్‌లాల్ డింగ్రా - ఈ దశలోనే 1909లో లండన్‌లోని ఇండియా ఆఫీసు అధికారి అయిన కర్జన్ విల్లీని మదన్ లాల్ డింగ్రా కాల్చి చంపాడు. అక్కడే ఉరి తీయబడ్డాడు.
మేడం కామా - శ్యామ్‌జీ కృష్ణవర్మ అనుచరుల్లో ముఖ్యురాలు మేడం బికాజీ రుస్తుం కామా.
- ఈమె పార్శీ కుటుంబంలో జన్మించి సోషలిస్ట్ సిద్ధాంతాలకు ఆకర్షితురాలైంది.
- 1902లో దేశం విడిచి యూరప్, అమెరికాలో జీవనం కొనసాగించింది.
- ఈమె ఇంగ్లండ్‌లోని భారతీయ యువకులతో స్థాపించిన సంస్థ పారిస్ ఇండియా సొసైటీ సర్దార్ సింగ్ రాణాతో పాటు దీర్ఘకాలం పారిస్‌లో ఉంది.
- 1907లో జర్మనీలోని స్టట్‌గట్‌లో జరిగిన ప్రపంచ సోషలిస్ట్ సమావేశానికి రాణాతో సహా హాజరై భారతదేశంలో బ్రిటిష్ దుష్టపరిపాలన మీద ఆవేశపూరితమైన ఉపన్యాసం చేసి సమావేశపు చివర ఆకుపచ్చ, పసుపు, ఎరుపు రంగుల పతాకాన్ని భారత జాతీయ పతాకంగా ఎగురవేసింది.
గదర్ ఉద్యమం
- పంజాబ్ విప్లవకారులతో అమెరికా, శాన్ఫ్రాన్సిస్కో కేంద్రంగా సాగిన ఉద్యమమే గదర్ ఉద్యమం. గదర్ అంటే తిరుగుబాటు.
- 1913లో సోహన్ సంగ్ భక్నా హింద్ అసోసియేషన్ ఆఫ్ అమెరికాను స్థాపించాడు. ఈ సంస్థ తలపెట్టిన వార పత్రిక పేరు గదర్ లేదా హిందుస్థాన్ గదర్.
- 1857 తిరుగుబాటు స్మృతిగా ఈ పత్రిక ఇంగ్లిష్, ఉర్దూ, మరాఠీ, గురుముఖి భాషల్లో వెలువడిన రహస్య పత్రిక విప్లవ భావాలను దేశ విదేశాల్లో విస్తృతం చేసింది.
- ఈ పత్రిక పేరుతోనే గదర్ పార్టీ ఏర్పడింది. దీని మార్గదర్శకుడు లాలా హరదయాల్.
- ఇది శాన్ఫ్రాన్సిస్కోలో యుగాంతర్ ఆశ్రమం కేంద్రంగా తన కార్యకలాపాలను సాగించింది.
- గదర్ పార్టీ ప్రముఖులు లాలా హరదయాల్, భాయ్ పరమానంద్ రామచంద్ర, గదర్ పార్టీ సభ్యుల్లో ఆంధ్రుడైన దర్శి చెంచయ్య కూడా ఉన్నాడు.
- ఈ దశలోనే రాజమహేంద్ర ప్రతాప్, బర్కత్ ఉల్లాలు జర్మనీ, రష్యాల సహకారంతో కాబూల్‌లో ప్రొవిజనల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను స్థాపించారు.
విప్లవోద్యమం రెండో దశ (1922-33) - 1922లో సహాయ నిరాకరణోద్యమం నిలిచిపోవడం, గాంధీ అహింసాయుత పద్ధతులు యువతరంలో కొందరికి నచ్చకపోవడం మొదలైన కారణాల వల్ల విప్లవోద్యమంలో రెండో దశ ప్రారంభమైంది.
హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ - 1924లో కాన్పూర్‌లో సచిన్ సన్యాల్, జోగేష్ చంద్ర ఛటర్జీ, రామ్‌ప్రసాద్ బిస్మిల్, చంద్రశేఖర్ ఆజాద్‌లతో హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ స్థాపితమైంది.
- ఈ సంస్థ సభ్యులు లక్నో-సహారన్పూర్ మార్గంలో కాకోరి వద్ద నడుస్తున్న రైలు నుంచి రైల్వే పెట్టి డబ్బును కొల్లగొట్టారు. ఈ సందర్భంగా 29 మంది అరెస్ట్ అయ్యారు. ఇది కాకోరి కుట్ర కేసుగా ప్రసిద్ధి చెందింది.
- దీనితో సంబంధం ఉన్న రామ్‌ప్రసాద్ బిస్మిల్, అసఫ్ ఖుల్లాఖాన్, రోషన్ లాల్, రాజేంద్ర లహరిలకు మరణ శిక్ష పడింది. క్రమంగా హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ తెరమరుగైంది.
హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ (హెచ్ఎస్ఆర్ఏ) - కాకోరి కుట్ర కేసులో గైర్హాజరైన చంద్రశేఖర్ ఆజాద్ సోషలిస్ట్ సిద్ధాంతాలతో ప్రభావితుడై 1928లో ఢిల్లీ ఫిరోజ్ షా కోట్లా మైదానంలో హెచ్ఎస్ఆర్ఏను స్థాపించాడు. ఇండియాలో సోషలిస్ట్ రిపబ్లిక్‌ను స్థాపించడం ఇతని ఆశయం.
శాండర్స్ హత్య - సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమం సందర్భంగా లాలా లజపతిరాయ్ మీద లాఠీచార్జి చేసి ఆయన మరణానికి కారకుడైన లాహోర్ అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్ శాండర్స్‌ను హెచ్ఎస్ఆర్ఏ సభ్యులు భగత్‌సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, రాజ్గురులు లాహోర్ రైల్వే స్టేషన్లో 1928, అక్టోబర్ 30న హతమార్చారు.
లాహోర్ కుట్ర కేసు - శాండర్స్ హత్య తర్వాత హెచ్ఎస్ఆర్ఏ సభ్యులు ప్రవాసంలోకి వెళ్లిపోయారు. అయితే వారి ఆచూకీ కోసం పోలీసులు అమాయక ప్రజలను హింసిస్తూ ఉండటంతో ప్రభుత్వం దృష్టిని మళ్లించడానికి, భగత్‌సింగ్, బత్కేశ్వర్ దత్‌లు 1929, ఏప్రిల్ 8న లాహోర్‌లో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మీద రెండు నాటు (పొగ) బాంబులు విసిరారు.
- అప్పటికి సరిగ్గా అసెంబ్లీ పబ్లిక్ సేఫ్టీ బిల్‌ను, ట్రేడ్ డిస్ప్యూట్స్ బిల్‌ను గురించి చర్చిస్తోంది. వీరిద్దరు పట్టుబడి అరెస్ట్ అయ్యారు.
జతిన్‌దాస్ ఆత్మార్పణ - జైలులో స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నందుకు నిర్బంధించిన వారిని సాధారణ నేరస్థుల మాదిరిగా కాకుండా రాజకీయ నేరస్థుల మాదిరిగా చూడాలని కోరుతూ నిరాహార దీక్షలు చేశారు.
- 64 రోజుల నిరాహార దీక్ష తర్వాత జతిన్‌దాస్ 1929, సెప్టెంబర్ 29న అమరుడయ్యాడు.
భగత్‌సింగ్‌కు మరణ శిక్ష - లాహోర్ కుట్ర కేసుకు సంబంధించిన భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులకు 1931, మార్చి 23న లాహోర్‌లో మరణశిక్ష అమలు చేశారు.
చంద్రశేఖర్ ఆజాద్ మరణం - కాకోరి కుట్ర కేసు, లాహోర్ కుట్ర కేసులోనూ నిందితుడిగా ఉండి తప్పించుకున్న చంద్రశేఖర్ ఆజాద్, యశ్పాల్తో కలిసి లార్డ్ ఇర్విన్ ప్రయాణించే రైలును పేల్చివేయాలని విఫలయత్నం చేశాడు.
- 1931, ఫిబ్రవరి 27న అలహాబాద్‌లోని ఆల్ఫ్రేడ్ పార్క్ వద్ద పోలీసులు చుట్టుముట్టినప్పుడు విరోచితంగా పోరాడి వీరమరణం పొందాడు.
ఇండియన్ రిపబ్లికన్ ఆర్మీ - బెంగాల్ ఇండియన్ రిపబ్లికన్ ఆర్మీ లేదా హిందుస్థాన్ రిపబ్లికన్ ఆర్మీ స్థాపకుడు సూర్యసేన్. జాతీయ పాఠశాలలో ఉపాధ్యాయుడుగా చేరి మాస్టర్ దా అని పిలిపించుకున్నాడు.
- సూర్యసేన్ చిట్టగాంగ్ ఆయుధాగారాన్ని దోచుకుని పట్టుబడి 1933లో ఉరిశిక్షకు గురయ్యాడు.
ఇతర విప్లవ కారులు - 1931 డిసెంబర్లో ఇద్దరు బాలికలు కొమిల్లా (బెంగాల్) జిల్లా జడ్జిని కాల్చి చంపారు.
- కలకత్తా విశ్వవిద్యాలయ పట్టభద్రురాలైన బినాదాస్ స్నాతకోత్సవ సమయంలో పట్టా పుచ్చుకుంటూ బెంగాల్ గవర్నర్‌ను కాల్చి చంపింది.
- 1932లో ప్రీతి లత వడయార్ అనే విప్లవకారిణి చిట్టగాంగ్‌లోని రైల్వే ఇన్స్టిట్యూట్పై దాడి చేసి పోలీసులకు చెక్కకుండా ఆత్మహత్య చేసుకుంది.
- 1933 తర్వాత విప్లవోద్యమం బలహీన పడింది. విప్లవ భావాలు కలవాళ్లు క్రమంగా వామపక్ష పార్టీల్లో చేరిపోయారు.
విదేశాల్లో విప్లవోద్యమం
జీబీకే పబ్లికేషన్స్
హైదరాబాద్, 9959361278
Previous article
English Grammar | She has agreed to come, hasn’t she?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు