Indian History – Groups Special | మరాఠా గిరిజనం.. బ్రిటిష్ పాలనపై తొలి పోరాటం
బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాట్లు
- భారతీయ సామాజిక వ్యవస్థలో అనాదిగా గిరిజనులు ముఖ్య పాత్ర పోషించారు. అడవి సంపదను తమ తల్లిగా, ఆస్తిగా నమ్మి బతికిన ఈ గిరిజనులు కూడా భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో బ్రిటిష్ పరిపాలన వల్ల అనేక కష్టాలకు గురయ్యారు.
- 1857కు పూర్వం దేశంలో ఉన్న ప్రధాన ట్రైబల్ తెగల్లో ‘కోలి’ (మహారాష్ట్ర) తమల్, చిరో, బొగటా (చోటానాగపూర్), మీటి (అస్సాం), కోల్ (బీహార్), నాయక్ (గుజరాత్), ఖోండ్లు (ఒరిస్సా), సంతాల్ (బిహార్) పేర్కొనదగినవి. వీరు కంపెనీ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాట్లు చేశారు.
- కంపెనీ అధికారులు చేసిన అటవీ చట్టాలు, వారి భూమిశిస్తు చట్టాలు గిరిజనుల స్వేచ్ఛను భంగపరిచి ఆదాయాన్ని దెబ్బతీశాయి. తండాల అధిపతులను తొలగించి వారి స్థానంలో గిరిజనేతరులైన సిక్కులను, ముస్లింలను, పెత్తందార్లను బ్రిటిష్‌వారు నియమించి గిరిజన సంప్రదాయ పరిపాలనను విచ్ఛిన్నం చేశారు.
- బ్రిటిష్ పాలనలోకి మరాఠా ప్రాంతంలోని ‘కోలి’ తెగ గిరిజనులు 1784-85లో తొలిసారిగా తిరుగుబాటు చేశారు. ఫ్రెంచి విప్లవం జరిగిన సంవత్సరంలోనే అంటే 1789లో ‘చోటానాగపూర్’ ప్రాంతంలోని ‘తమల్ తెగ’ గిరిజనులు అక్కడి కంపెనీ చట్టాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు.
- ఒరిస్సాలోని ఖోండ్ గిరిజనులు అనాదిగా నరబలిని, శిశు హత్యలను తమ ఆచారంగా నిర్వహించేవారు.
- 1846కు ముందు ప్రభుత్వం వీటిని నిషేధిస్తూ చట్టాలు చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఖోండులు 1846-48 మధ్య కాలంలో తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటుకు ఖోండు రాజైన ‘సామ్ బిసాయ్’ నేతృత్వం వహించాడు.
- బ్రిటిష్‌వారు నియమించిన గిరిజనేతర అధికారులు బీహార్‌లోని ‘సంతాల్’లు తిరుగుబాటు చేశారు.
- 1857లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో తిరుగుబాటు ప్రారంభం కాగానే పలమౌ, రాంచీ, హజారీబాగ్ ప్రాంతంలో పీతాంబర్ నాయకత్వంలో ‘చిరో’ తెగ గిరిజనులు తిరుగుబాటు లేవదీశారు.
భిల్ గిరిజనుల తిరుగుబాటు (1817-19) - లార్డ్ హేస్టింగ్స్ గవర్నర్ జనరల్‌గా పని చేస్తున్న రోజుల్లో ఖాందేష్ ప్రాంతంలో నివసించే భిల్ తెగ గిరిజనులు బ్రిటిష్ కంపెనీ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు.
- రెండో బాజీరావ్, అతని సేనాధిపతి ‘త్రియంబిజ్ జీ డాంగ్లియా’ భిల్ తెగ వారిని రెచ్చగొట్టారని బ్రిటిష్‌వారు ఆరోపించారు.
- బర్మా యుద్ధంలో బ్రిటిష్ సేనలకు ఎదురుదెబ్బ అనంతరం మరోసారి 1824-25లో ‘భిల్’లు సేవారాం నేతృత్వంలో 1846 వరకు ఇంకోసారి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు.
- రమోసే తెగ తిరుగుబాట్లు (1822)
- భారతదేశంలోని పశ్చిమ కనుమల్లో నివసించే ఆటవిక, గిరిజన తెగల్లో రమోసీలు, చిత్తూర్ సింగ్ నాయకత్వంలో 1822లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు.
- సతార పరిసరాల్లో దాడులు చేసి బీభత్సం సృష్టించారు. కానీ బ్రిటిష్ సైన్యాలు వీటిని అణచివేశాయి.
కోల్ గిరిజనుల తిరుగుబాటు (1831-32)
- కోల్ తెగకు చెందిన గిరిజనులు బీహార్‌లోని రాంచి సింగ్భమ్, హజారీబాగ్, పలమౌ ప్రాంతాల్లో ఈస్టిండియా కంపెనీ పాలనకు ముందు భూమిపై హక్కును కోల్ తెగ పెద్దలైన ‘ముండాలు’ చెలాయించేవారు. కానీ కంపెనీ ఈ ప్రాంతాలపై గిరిజనేతరులకు, పెత్తందార్లకు హక్కులను కట్టబెట్టింది. దీనికి వ్యతిరేకంగా గిరిజనులు 1831-32లో తిరుగుబాటు లేవదీశారు.
- రాంచీ ప్రధాన కేంద్రంగా సింగ్భమ్, హజారీబాగ్, పలమౌ కోల్ల దాడులకు గురయ్యాయి.
- కోల్ల హింసాత్మక చర్యలు అదుపు తప్పడంతో కంపెనీ అధికారులు ఈ ప్రాంతాల్లో సైనిక చర్యను ప్రారంభించింది.
- 1832 మార్చి నెల నాటికి కోల్ తిరుగుబాటును పూర్తిగా అణచివేశారు.
ముండా తిరుగుబాటు (చోటా నాగపూర్)
- ఉత్తర ప్రాంతపు మైదానాల నుంచి వస్తున్న ‘జాగీర్దారులు’, ‘థికాదారులు’ తమకు సంప్రదాయకమైన ‘ఖుంత్కట్టి’ భూ వ్యవస్థను ఇంగ్లిష్‌వారు నిర్మూలింపజేయడం వీరు గమనించారు.
- గిరిజనులు బిర్సా ముండా నాయకత్వంలో తిరుగుబాటు చేసి పరాజయం పాలయ్యారు. బిర్సా ముండా బందీ అయి తర్వాత జైలులోనే మరణించాడు.
- అయితే 1908 చోటానాగపూర్ కౌలుదారీ చట్టం ఆలస్యంగా అయినా ‘ఖుంత్కట్టి’ హక్కును గుర్తించి ‘బెత్ బెగరీ’ నిషేధించింది.
ఏపీలో గిరిజన తిరుగుబాటు - ప్రాచీన మధ్య యుగాల్లో ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలోప్రస్తుత శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలో నిజాం రాజ్యంలోని ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, కర్నూలు జిల్లాల్లో అధికంగా గిరిజనులు నివసించేవారు.
- ఏపీలోని గిరిజన తెగలు మధ్య యుగంలో స్వేచ్ఛాయుతమైన, నిజాయితీ గల జీవితాన్ని గడిపారు. ఆంధ్ర దేశాన్ని కాకతీయ, రెడ్డి, విజయనగర, కుతుబ్‌షాహీ వంశాల పాలకులు వీరి అంతరంగిక, జీవన, సామాజిక, మతాచారాల్లో జోక్యం కలిగించుకోలేదు. వారి అడవి హక్కులకు భంగం కలిగించలేదు.
- కానీ భారతదేశంపై బ్రిటిష్‌వారి సార్వభౌమాధికారం నెలకొల్పబడిన తర్వాత వీరి జీవనం దుర్లభమైంది. వారి స్వేచ్ఛ దెబ్బతింది. చివరకు విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో స్థానిక గిరిజనులు పరదేశీ ప్రభుత్వ క్రూర చట్టాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు లేవదీశారు.
రంపా విప్లవం (1879)
- మద్రాసు ప్రెసిడెన్సీలోని తెలుగు ప్రాంతాల్లో రంపా గ్రామం (ఏజెన్సీ ప్రాంతం). ఇక్కడి గిరిజనుల తిరుగుబాటుకు అతిముఖ్య కారణం ఆంగ్లేయుల క్రూరమైన రెవెన్యూ విధానం, వారు ప్రోత్సహించిన హింసా విధానం.
- రంపా ఏజెన్సీ ప్రాంతానికి అధిపతిగా (పరిపాలనాధికారిగా) మున్సబ్‌దార్ ఉండేవాడు. ఇతనికి సహాయంగా ముత్తేదార్లు
ఉండేవారు. - రంపా ఏజెన్సీ ప్రాంత అధిపతిగా మాధవతి రామ భూపతిదేవ్ ఉండేవాడు. ఇతడు నిరంకుశంగా పరిపాలన చేశాడు. ఇదే సమయంలో మద్రాసు ప్రభుత్వం కొండ జాతులవారికి తాటిచెట్ల నుంచి కల్లు తీసే హక్కులను రద్దు చేస్తూ చట్టం చేసింది.
- దీంతో విసుగెత్తిన గిరిజనులు తమ సహజ హక్కుల రక్షణ కోసం చంద్రయ్య సర్ధార్ జగన్, పురికాంత సాంబయ్య, కారుతిమ్మన దొర, అంబుల్రెడ్డి మొదలైనవారి నేతృత్వంలో గొప్ప గిరిజన తిరుగుబాటు లేవదీశారు.
- ఈ తిరుగుబాటులో అడ్డతీగల పోలీస్ స్టేషన్‌పై చంద్రయ్య దళం దాడి చేసి దగ్ధం చేసింది. విషయం గ్రహించిన మద్రాసు ప్రభుత్వం తిరుగుబాటును అణచడానికి ‘సవ్లెవన్’ అనే అధికారిని రంపా ఏజెన్సీకి పంపింది.
- కారణం తెలుసుకున్న ప్రభుత్వం రామభూపతి దేవ్‌ను మున్సబ్‌దార్ పదవి నుంచి తొలగించింది. తిరుగుబాటు వల్ల గిరిజనుల పోరాట పటిమ స్పష్టమైంది.
జమీందారీ, రైతు ఉద్యమాలు
- కారన్‌వాలీస్ ప్రవేశపెట్టిన శాశ్వత భూమి శిస్తు నిర్ణయ పద్ధతి వల్ల భారతదేశంలో జమీందారీ వ్యవస్థ అవతరించింది. ఈ జమీందారీ వ్యవస్థ బెంగాల్లో అమలు చేశారు. దాంతో మద్రాసు రాష్ట్రంలో కూడా జమిందారీ వ్యవస్థ అవతరించింది.
- శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు అనేక జమీనులు ఏర్పడినవి. ఈ జమీనుల్లోని రైతు పరిస్థితి దుర్భరంగా ఉండేది. జమీన్దారీలు ఏర్పడిన తర్వాత భూమిపై హక్కు ఎవరిది అనే ప్రశ్న ఉత్పన్నమైంది.
- రైతు భూమి తనదని వాదించగా జమీందారు తనదని భావించేవారు. జమీందార్లు తమ ఇష్ట ప్రకారం అధిక పన్నులు వసూలు చేసేవారు. ఎదిరించిన వారిని అనేక బాధలకు గురి చేసేవారు.
- గాంధీ నాయకత్వంలో జరుగుతున్న సహాయ నిరాకరణ ఉద్యమ కాలంలో చీరాల-పేరాల ఉద్యమం, పల్నాటి పుల్లరి వ్యతిరేక ఉద్యమం, పెదనందిపాడు పన్ను నిరాకరణోద్యమం జరిగాయి. ఈ ఉద్యమాలు దేశంలోని రైతులందరికీ ధైర్యాన్ని కలగజేశాయి.
పల్నాటి పుల్లరి సత్యాగ్రహం - పల్నాటిలో వెల్దుర్తి, శిరిగిరిపాడు మొదలగు అటవీప్రాంత గ్రామాలపై ప్రభుత్వం పుల్లరి పెంచగా ప్రజలు పుల్లరి కట్టకుండా పశువులను మేపారు. అందువల్ల ప్రభుత్వాధికారులు ప్రజల పశువులను బందెల దొడ్లలో తోలారు.
- 1921, సెప్టెంబర్ 22న మందాల గ్రామంలో కన్నెగంటి హనుమంతు అనే రైతు పశువులను ప్రభుత్వాధికారులు తోలుకొని పోతుండగా ప్రజలు అడ్డగించారు. అందుకు పోలీసులు కాల్పులు జరపగా హనుమంతు మరణించాడు.
మునగాల జమీందారు - మునగాల సంస్థానాధీశుడు వెంకట రంగారావు. ఆయన 1900లో చిన్నతనంలోనే జమీందారై 1948లో జమీందారీ రద్దయ్యేంతవరకు జమీందారుగా
కొనసాగాడు. - ఇతనికి కలువ కోవ అనే గ్రామంలో 22 ఎకరాల మాగాణి ఉంది. కోతలప్పుడు కూలీలకు 80 శేర్లు ఇస్తానని చెప్పి పని అయిపోయిన తర్వాత 60 శేర్లు ముక్కిపోయిన ధాన్యాన్ని కొలుస్తానన్నాడు. అందుకు కూలీలు అంగీకరించలేదు. దాంతో వివాదం మొదలైంది.
- కలెక్టర్ జోక్యం చేసుకొని కూలీలకు 80 శేర్ల ధాన్యాన్ని కొలిపించాడు.
- ఆనాటి కాంగ్రెస్ సెక్రటరీ గొట్టిపాటి బ్రహ్మయ్య రైతులకు, జమీందారుకు సయోధ్య కుదిర్చాడు. దానికి బ్రహ్మయ్య అవార్డు అని పేరు.
వెంకటగిరి జమీందారు - వెంకటగిరి జమీందారు రాజేంద్రుడు. ఆనాటి జమీందారీ సంఘానికి అధ్యక్షుడు, మద్రాసు అసెంబ్లీ సభ్యుడు. కానీ 1937లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయాడు.
- తన సంస్థానం ప్రజలే ఓడించారని కక్షతో పాళెంకోట వద్ద ఉన్న పనపకోన అనే అడవిలో రైతులు పశువులు మేపడానికి వీల్లేదని దిగ్బంధం చేశాడు.
- అందుకు కోపగించిన పాళెంకోట, తీర్థంపాడు గ్రామ స్త్రీలు అతడు కాపలా పెట్టిన పోలీసులు, దివానం సైనికుల మీద దాడిచేసి తరిమికొట్టారు. పోలీసులు ఆ స్త్రీలపై కేసు పెట్టగా కోర్టు ఆ కేసును కొట్టివేసింది.
రైతుల తిరుగుబాట్లు - బ్రిటిష్ పాలన ఫలితంగా మిగిలిన రంగాలకన్నా వ్యవసాయ రంగం బాగా నష్టపోయింది. బ్రిటిష్ వారి కొత్త భూమిశిస్తు విధానం, వాణిజ్య పంటల ప్రాధాన్యం, అధిక వడ్డీరేట్లు రైతులను మరిన్ని సమస్యల్లోకి నెట్టి తిరుగుబాట్లకు దారి తీశాయి.
నీలిమందు విప్లవం 1859-60 - బెంగాల్ భూస్వాముల నుంచి విస్తారమైన భూములు కౌలుకు తీసుకున్న యూరోపియన్ భూకామందులు వాటిలో నీలిమందు పంటను పండించాలని రైతుల్ని నిర్బంధించారు.
- నీలిమందు పంట వల్ల ప్రతిఫలం సరిగా లభించకపోయినా దాన్నే పండిచాల్సి రావడం రైతుల్లో అసంతృప్తికి దారి తీసింది.
- ఫలితంగా జరిగిన తిరుగుబాటుకు విష్ణుచరణ్ విశ్వాస్, దిగంబర్ విశ్వాస్‌లు నాయకత్వం వహించారు.
- మొదటిసారి కలకత్తాలోని మేధావి వర్గం తిరుగుబాటును సమర్థించింది. జమీందార్లు, క్రైస్తవ మిషనరీలు కూడా సహకరించారు.
- నీలిమందు తోటల యజమానుల దాష్టీకాన్ని దీనబంధు మిత్ర తన నీల్దర్బార్ గ్రంథంలో రాశాడు.
- ప్రభుత్వం తిరుగుబాటును అణచివేసినప్పటికీ రైతుల పట్ల సంయమనంతో వ్యవహరించింది.
పాబ్నా తిరుగుబాటు 1872-76 - తూర్పు బెంగాల్లో జమీందార్లు ఉన్నట్లుండి శిస్తు పెంచడంతో రైతులు సాయుధ తిరుగుబాటుకు సిద్ధమయ్యారు.
- సైన్యం తిరుగుబాటును అణచివేసింది.
- 1859లో జారీ చేసిన చట్టం 10ని రద్దు చేసి కౌలుదారుల హక్కులను రక్షించే చట్టం 8ని పునరుద్ధరించారు.
దక్కన్ తిరుగుబాటు-1879 - దక్కన్‌లోని రైత్వారీ విధానం వల్ల రైతులు నగదు రూపంలో శిస్తు చెల్లించాల్సి వచ్చింది.
- పంటలు పాడైనా శిస్తులో మార్పు ఉండేది కాదు.
- ఫలితంగా వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పుచేసి భూమిని కోల్పోయారు.
- 1865 తర్వాత పత్తి ధరలు పడిపోవటం రైతుల్ని బాగా నష్టపరిచింది.
- పూనా, అహ్మద్‌నగర్‌లలో తిరుగుబాట్లు ప్రారంభమయ్యాయి. దీనికి కూడా మేధావుల మద్దతు లభించినట్లు మరాఠీ పత్రిక
‘దైవాన్ చక్షు’ పేర్కొన్నది. - దక్కన్ వ్యవసాయదారుల సహాయ చట్టం ద్వారా అధిక వడ్డీలపైన, భూముల స్వాధీనంపైనా ఆంక్షలు విధించబడ్డాయి.
బెంగాల్ కౌలుదారుల చట్టం-1885 - 12 సంవత్సరాలు ఒకే గ్రామంలో ఉండి భూమిని కౌలుకు చేస్తే రైతుకు ఆ భూమి మీద ఆక్యుపెన్సీ రైట్స్‌ను కల్పిస్తూ చేసిన చట్టం. ఈ చట్టం ద్వారా రైతు ఆ భూమిని మరొకరికి బదిలీ చేయడానికి గాని, కౌలుకు ఇవ్వడానికి గాని లేదు.
- వడ్డీ వ్యాపారుల జులుం పెరిగింది.
- భూములను వడ్డీ వ్యాపారులు స్వాధీనం చేసుకున్నారు. 1902లో ప్రభుత్వం ఈ చట్టం ద్వారా వారి ఆట కట్టించింది.
జీబీకే పబ్లికేషన్స్
హైదరాబాద్, 9959361278
Marata
Previous article
NIT Calicut Recruitment | కాలికట్ నిట్‌లో 150 నాన్ టీచింగ్ పోస్టులు
Next article
Biology | కాఫీ గింజల్లో తినేభాగాన్ని ఏమంటారు?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు