Telangana Movement | పరిస్థితులపై పట్టు.. ఉద్యమ రూపానికి మెట్టు
1969 తర్వాత తెలంగాణ మలిదశ ఉద్యమం వివిధ దశల్లో కొనసాగింది. విద్యార్థులు, రాజకీయ నాయకులు, ఉద్యోగులు, రచయితలు, కవులు, కళాకారులు, కార్మికులు, కర్షకులు ఇందులో భాగమయ్యారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం కదం తొక్కారు. కలిసికట్టుగా ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. ఆ ఉద్యమ వివరాలు తెలుసుకుందాం.
తెలంగాణ మలిదశ ఉద్యమం
- 1969-70లో వచ్చిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని కొన్ని చట్టపర, రాజకీయ చర్యల ద్వారా నిరోధించగలిగినప్పటికి తమకు జరుగుతున్న అన్యాయాలపై తెలంగాణలోని వివిధ వర్గాల ప్రజల్లో అసంతృప్తి రగులుతూనే ఉంది.
- మలిదశ ఉద్యమం కూడా దానికి కొనసాగింపే అయినప్పటికి దీనికి అదనంగా కొన్ని ప్రత్యేక కారణాలు కూడా ఉన్నాయి.
- మెట్ట ప్రాంతాల్లో కూడా హరిత విప్లవాన్ని ఏ విధంగానైనా తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బోరుబావుల వ్యవసాయం, వర్షాధార ప్రాంతాల భిన్న వ్యవసాయ పంటలను, పద్ధతులను దెబ్బతీసిన రెండు రూపాయల బియ్యం పథకం, ప్రజాపంపిణీ వ్యవస్థ, ఉత్తర తెలంగాణలో ప్రారంభమై తెలంగాణ అంతటా వ్యాపించిన నక్సలైట్ ఉద్యమం, చిన్న, అతి చిన్న కమతాల అవతరణ, మండల వ్యవస్థ కారణంగా తెలంగాణలో అధికార వేదికల మీదకు కొత్త సామాజిక వర్గాల ప్రవేశం, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు పెద్ద ఎత్తున వచ్చిన సీమాంధ్ర పెట్టుబడిదారులు, ప్రజల వలసలు, ఫలితంగా పెరిగిన రియల్ ఎస్టేట్ వ్యాపారం, నూతన ఆర్థిక విధానాల ఆరంభం, తెలంగాణలో కులవృత్తుల విధ్వంసం ఇవన్నీ కూడా మలిదశ ఉద్యమానికి ప్రేరకాలుగా పని చేశాయని చెప్పొచ్చు.
- 1993, ఆగస్టులో ఉస్మానియా విశ్వవిద్యాలయం ల్యాండ్‌స్కేప్ గార్డెన్, ఠాగూర్ ఆడిటోరియంలో చిన్న రాష్ర్టాలపై జాతీయ సదస్సు జరిగింది. సురేంద్రమోహన్ ప్రారంభించిన ఈ సదస్సులో జస్టిస్ మాధవరెడ్డి ప్రసంగించారు. ముగింపు సమావేశంలో జార్జి ఫెర్నాండెజ్ ప్రసంగించారు. విదర్భ నుంచి విలాస్బోన్గడే, కర్ణాటక నుంచి లక్ష్మణ్ దస్తీతో పాటు ఇంకా దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు.
- 1996 లో తెలంగాణ ప్రజాసమితి ఆధ్వర్యంలోని వరంగల్ సదస్సులో తెలంగాణ మహాసభ, తెలంగాణ ప్రజాపార్టీ ఆవిర్భవించాయి. అఖిల భారత ప్రజా ప్రతిఘటన వేదిక ఆధ్వర్యంలో ప్రముఖ స్వాతంత్య్ర యోధుడు, కవి కాళోజీ నారాయణరావు నేతృత్వంలో ప్రజాస్వామిక తెలంగాణ సదస్సు 1997 డిసెంబర్లో జరిగింది. ఆ తర్వాత తెలంగాణ జనసభ రూపుదిద్దుకొంది.
- 1998లో డా. జయశంకర్ ఆధ్వర్యంలో తెలంగాణ సంస్థల విలీనంతో తెలంగాణ ఐక్యవేదిక ఏర్పడింది.
- మాజీ మంత్రి ఇంద్రారెడ్డి అధ్యక్షతన తెలంగాణ ఉద్యమ కమిటీ ఆవిర్భవించింది. ఉద్యమం హైదరాబాద్‌కే పరిమితం కాకుండా దేశవిదేశాల్లోని తెలంగాణ ప్రజల్లోకి విస్తరించింది.
- 1999లో అమెరికాలోని న్యూయార్క్‌లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరమ్ ఏర్పడింది. వారితో ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ జనార్దన్‌రావు వంటి మేధావులు సభలు, సమావేశాలు నిర్వహించారు. ఇక్కడి ప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం ఏదో ఒక రూపంలో నిరంతరం ఉద్యమిస్తూనే ఉన్నారు.
- గోదావరిఖని, కరీంనగర్, సిద్దిపేట, జనగామ, ఆలేరు, నిజామాబాద్, ఖమ్మం, నల్లగొండ, హైదరాబాద్ పాతబస్తీ, భువనగిరి వంటి ప్రాంతాల్లో సదస్సులు, సమావేశాలు నిర్వహించారు.
- 1997, మార్చిలో భువనగిరిలో, ఆగస్టులో సూర్యాపేటలో, డిసెంబర్లో వరంగల్‌లో జరిగిన సభలు మైలురాళ్లుగా నిలిచాయి.
- బెల్లి లలిత, ఆకుల భూమయ్య, కనకాచారి, బియ్యాల జనార్దన్‌రావు, గాదె ఇన్నయ్య వంటి ఉద్యమకారులు చేసిన ప్రచార ఆచరణోద్యమాలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ప్రజ్వలింపజేశాయి.
భువనగిరి డిక్లరేషన్ - 1997, మార్చి 7, 8 తేదీల్లో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం భువనగిరిలో సదస్సు జరిగింది. తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన న్యాయపరమైన వాటా, హక్కుల సాధన కోసం ఈ సభ తీర్మానిస్తూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి నిర్మాణాత్మక కృషి ప్రారంభించింది.
- మార్చి 8, 9 తేదీల్లోనే సభ జరపడం వెనక రెండు చారిత్రక కారణాలున్నాయి. మొదటిది 1944లో భువనగిరిలో పదకొండో ఆంధ్రమహాసభలు మార్చి 8, 9 తేదీల్లోనే జరిగాయి. రెండోది 1969, మార్చి 8న ఖమ్మంలో 1969 ఉద్యమ వీరుడు రవీంద్రనాథ్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు.
- భువనగిరిలోని ఇండియా మిషన్ స్కూల్ ఆవరణలో జరిగిన ఈ మహాసభ ఉద్యమాన్ని మలుపుతిప్పింది. ఇందులో కాళోజీ నారాయణరావు, ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ కేశవరావు జాదవ్, ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వర్రావు, డాక్టర్ సింహాద్రి, సిధారెడ్డి, గద్దర్ వంటి అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు. విద్య, ఉద్యోగ, వ్యవసాయ రంగాల్లో తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగిన తీరును కాళోజీ వివరించారు. విద్య, వైద్య రంగాల్లో జరుగుతున్న దగాను ప్రొఫెసర్ జయశంకర్ వివరించారు.
- తెలంగాణలోని వనరులు, పరిశ్రమలు, పారిశ్రామిక కాలుష్యం అంశంపై ప్రొఫెసర్ కేశవరావ్ జాదవ్ ప్రసంగించారు. నిధులను ఆంధ్రాకు తరలిస్తూ కాలుష్యాన్ని తెలంగాణకు పంచుతున్నారని ఆవేదన చెందారు.
- తెలంగాణలోని పరిశ్రమల్లో, వ్యాపార సంస్థల్లో, ప్రభుత్వ సంస్థల్లో స్థానికేతరుల ప్రాబల్యం తగ్గించి స్థానికులకు ప్రాధాన్యం కల్పించాలని ఆ సదస్సు కోరింది.
ఈ సదస్సు చేసిన ఇతర తీర్మానాలు - తెలంగాణలో కరెంటు కోత పూర్తిగా ఎత్తేయాలి.
- మిగులు, బంజరు, మన్యం, శిఖం భూములను పేదలకు పంపిణీ చేయాలి.
- తాగునీటి వసతి కల్పించాలి.
- తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేయని రాజకీయ పార్టీల వైఖరిని ఖండించాలి.
- ప్రసార సాధనాల్లో తెలంగాణ భాషను, యాసను అవమానించే ధోరణులను తీవ్రంగా వ్యతిరేకించాలి.
- సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించాలి.
- తెలంగాణలోని షుగర్ పరిశ్రమలు, ఇతర సంస్థలను ప్రైవేటీకరణ చేసే ప్రతిపాదన మానుకోవాలి.
- తెలంగాణ ప్రజల దోపిడీ, దగా, అన్యాయాలకు కారకులు కాని ఇతర ప్రాంతాల ప్రజల మనోభావాలను కించపరచొద్దు.
- సూర్యాపేటలో జరిగిన సదస్సులో కూడా ఈ అంశాలపై విస్తృతంగా చర్చించారు.
- దీని తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ క్రమంలో మరో మైలురాయి వరంగల్ డిక్లరేషన్.
తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం-2001
- తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు 2001, ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ని స్థాపించారు.
- టీఆర్ఎస్ ఏర్పాటు తెలంగాణ ఉద్యమంలో కీలక మలుపుగా భావించొచ్చు.
- తెలంగాణ సాధన కోసం అవతరించిన పార్టీ కావడంతో టీఆర్ఎస్ను ప్రజలు ఆదరిం చారు. పార్టీ ఎదుర్కొన్న తొలి ఎన్నికల్లోనే ఊహించని విజయాన్ని అందించారు.
- ఈ పార్టీని ఆరంభించే సమయంలోనే అధినేత కేసీఆర్ ఇది పూర్తిగా ఉద్యమ పార్టీ అని, చేపట్టే అన్ని కార్యక్రమాలు, వ్యూహాలు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసమేనని ప్రకటించారు.
- లక్ష్య సాధన కోసం ఎన్నికల వ్యూహాన్ని వివిధ రూపాల్లో చేపట్టబోయే నిరసనల్లో ప్రజా సమూహాన్ని భాగస్వామ్యం చేయడం వంటివి చేస్తామన్నారు.
- తెలంగాణ రాష్ట్ర సమితి మొదట తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతపై భావజాల వ్యాప్తిని ఉధృతం చేసింది.
- అనేక ప్రజా సంఘాలు, కవులు, రచయితలు, పాత్రికేయులు, మేధావులు, విద్యావంతులు ప్రజల్లో కలిగించిన చైతన్యాన్ని, తెలంగాణ ప్రజల మనోఫలకాలపై ఉన్న అసంతృప్తిని ఉద్యమ రూపంలోకి మార్చడంలో పార్టీ సఫలీకృతమైంది.
- తెలంగాణ పరిస్థితులపై పూర్తి పట్టున్న కాళోజీ నారాయణరావు, కొత్తపల్లి జయశంకర్, కొండా లక్ష్మణ్ బాపూజీ వంటి వారు తోడవడంతో ఈ నినాదం సమాజంలోని అన్ని వర్గాలకు, రాజకీయ పార్టీలకు చేరింది. దీంతో ఇతర రాజకీయ పార్టీలు కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం గురించి మాట్లాడకుండా ఉండలేని పరిస్థితులు ఏర్పడ్డాయి.
- తెలంగాణ రాష్ట్ర సమితి ఒకవైపు ఈ భావజాల వ్యాప్తిలో భాగం పంచుకొంటూనే ఎన్నికల వ్యూహంతో రాజకీయంగా కూడా తన స్థానాన్ని సుస్థిరం చేసుకొంది.
- నదీజలాల పంపకాల్లో జరుగుతున్న అన్యాయాలను, ప్రభుత్వ కేటాయింపుల్లో జరుగుతున్న దగాను, భాష, యాస, సంస్కృతి పట్ల అవహేళనను, అన్ని రంగాల్లో తెలంగాణపై చూపిస్తున్న వివక్షను ఎండగట్టడంలో తనవంతు పాత్రను పోషించింది.
- కళాకారులతో విభిన్న కళారూపాలను రూపొందించి సామాన్యులకు కూడా అర్థమయ్యేలా ప్రచారం చేసింది.
- గాయకులు, కవులు, వీధి కళాకారులు ఇందులో కీలక పాత్ర పోషించారు.
- ఏపీ ఏర్పడినప్పటి నుంచి జరిగిన ఉల్లంఘనలు, స్వార్థంతో తీసుకొన్న రాజకీయ నిర్ణయాలను, గణాంకాలను శాస్త్రీయంగా వెలికి తీసి ప్రత్యేక రాష్ట్రం మాత్రమే వీటన్నింటికి పరిష్కారం అందిస్తుందని ప్రజల్లో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను రగిలించగలిగారు.
- ఈ పార్టీకి అనుకూలించిన అంశాలను పరిశీలిస్తే ప్రజల్లో అప్పటివరకు మేధావులు, ఉద్యమకారులు, ప్రజాసంఘాలు కలిగించిన ప్రత్యేక రాష్ట్ర చైతన్యం, చారిత్రకంగా తెలంగాణకున్న అస్థిత్వం, దానిపైన జరుగుతున్న దాడి, సమర్థవంతమైన కేసీఆర్ నాయకత్వం ప్రధానంగా చెప్పొచ్చు.
- తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వం ఇందుకోసం విభిన్న వ్యూహాలను రూపొందించుకొని ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను ప్రజల్లో సజీవంగా ఉంచగలిగింది.
- సృజనశీలమైన ఆలోచనలతో వినూత్న నిరసనలు చేపట్టింది. దీంతో పాటు అదే సమయంలో కేంద్రంలోని రాజకీయ పరిస్థితులను తనకనుకూలంగా మార్చుకొని జాతీయ స్థాయిలో తెలంగాణపై అన్ని పార్టీల ఏకాభిప్రాయం కోసం కృషి చేసింది.
- అంతకుముందు ప్రజా సంఘాలు చేయలేని కార్యక్రమాలను రాజకీయ పార్టీగా, ఉద్యమ పార్టీగా పార్లమెంటరీ రూపాల్లో తన నిరసన తెలియజేస్తూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ముందు భాగాన నిలబడింది.
- ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర నినాదాన్ని జాతీయ స్థాయిలో ప్రచారం చేసి మద్దతు కూడగట్టడం కోసం వివిధ రాష్ర్టాల్లో ప్రత్యేక రాష్ర్టాల కోసం ఉద్యమిస్తున్న వారందరితో ‘చిన్న రాష్ర్టాల సమాఖ్య’ ఏర్పడింది.
- మరోవైపు తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకొని రెండో ఎస్.ఆర్.సి (స్టేట్ రీ ఆర్గనైజేషన్ కమిషన్) ఏర్పాటు చేయాలంటూ కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరుతూ కాంగ్రెస్ ఒక తీర్మానాన్ని పంపింది.
- అంతకుముందు ఎన్డీఏ ప్రభుత్వం మూడు ప్రత్యేక రాష్ర్టాలను ప్రకటించడం దీనికి ఊతమిచ్చింది. అయితే ఈ డిమాండ్ పట్ల ఏపీలో అప్పుడున్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా దాన్ని ఎన్డీఏ తిరస్కరించింది.
- భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాకినాడ తీర్మానం ద్వారా కోరి ఉన్నప్పటికి ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని పరిగణనలోకి తీసుకోలేదు.
వరంగల్ డిక్లరేషన్
- 1997లో జరిగిన వరంగల్ సదస్సు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతతో పాటు ఇతర అంశాలను కూడా చర్చించింది. కేంద్ర, రాష్ట్ర సంబంధాల్లో కూడా మార్పు రావాలని, అధికారాల్లో, నిధుల పంపిణీలో అత్యధిక భాగం రాష్ర్టాలకు చెందాలని కోరింది.
- కేంద్ర, రాష్ట్ర సంబంధాలను ఇప్పుడున్నట్లు కాకుండా రాష్ర్టాల ప్రయోజనాలకు అనుకూలంగా మార్చాలని సర్కారియా కమిషన్ చేసిన సూచనలు అమలు చేయాలని డిమాండ్ చేసింది.
- తెలంగాణలోని అన్ని జిల్లాల్లోని ప్రజల సమస్యలకు నిర్దిష్టమైన పరిష్కార మార్గాలను చూపించే అభివృద్ధి విధానం ఉండాలని కోరింది.
ఈ సదస్సు చేసిన తీర్మానాలు, డిమాండ్లు - వ్యవసాయ యోగ్యమైన భూమి అంతటికి సాగునీటి వసతి కల్పించాలి. ఇందుకు చిన్న, మధ్యతరహా నీటి పారుదల ప్రాజక్టులు, చెక్‌డ్యాంలు, ఊట చెరువులు, వాటర్‌షెడ్ పథకాలను అమలు చేయాలి. చెరువులను, కుంటలను బాగు చేయాలి.
- జలాలను వెనుకబడిన ప్రాంతాల అవసరాల ప్రాతిపదిక మీద, జనాభా, భూ విస్తీర్ణం ప్రాతిపదికలపై పంపిణీ చేయాలి.
- కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి కరవుపీడిత మహబూబ్‌నగర్ జిల్లాకు సాగునీటిని అందించాలి.
- రక్షిత మంచినీటి పథకాలను అమలు చేసి ఫ్లోరైడ్ బాధితులను ఆదుకోవాలి.
- తెలంగాణ ప్రాంత భూములను ముంపునకు గురిచేసే పోలవరం ప్రాజెక్టును నిలిపివేసి ప్రత్యామ్నాయంగా చిన్న ప్రాజెక్టుల నిర్మాణాలను చేపట్టాలి. వీటితో పాటు ఇంకా అనేక తీర్మానాలు చేశారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు