INDIAN POLITY | ప్రకరణల ప్రకారం.. పరిపాలన విధానం
రాష్ట్ర ప్రభుత్వం
- భారత రాజ్యాంగంలోని 6వ భాగంలో ప్రకరణ 152 నుంచి 213 వరకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి సమగ్రమైన అంశాలను పేర్కొన్నారు. 6వ భాగం అన్ని రాష్ర్టాలకు వర్తిస్తుంది.
గమనిక: 2019 ముందు జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి ఉండేది. కానీ తర్వాత రద్దు చేసి కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి సమగ్ర సమాచారం జమ్ముకశ్మీర్ చాప్టర్లో వివరించారు.
రాష్ట్ర గవర్నర్ - ప్రకరణ 153 నుంచి 167 వరకు గవర్నర్ పదవి, నియామకం, అర్హతలు, తొలగింపు, అధికార విధుల గురించి పొందుపరిచారు.
- ప్రకరణ 153 ప్రకారం ప్రతి రాష్ర్టానికి ఒక గవర్నర్ ఉంటారు. అయితే 1956లో ఏడో రాజ్యాంగ సవరణ ద్వారా రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ర్టాలకు ఉమ్మడి గవర్నర్‌ను నియమించే ఏర్పాటు చేశారు.
- ప్రకరణ 155 ప్రకారం గవర్నర్‌ను తన అధికార ముద్రచేత రాష్ట్రపతి నియమిస్తారు.
తాత్కాలిక గవర్నర్ - గవర్నర్ పదవిలో ఖాళీ ఏర్పడితే వెంటనే నూతన గవర్నర్‌ను నియమించకపోతే రాష్ట్రపతి ప్రకరణ 160 ప్రకారం ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కాని లేదా పక్క రాష్ట్ర గవర్నర్‌ను కాని తాత్కాలిక గవర్నర్‌గా విధులు నిర్వర్తించమని ఆదేశించవచ్చు. వీరు తదుపరి గవర్నర్ నియామకం జరిగేంత వరకు తాత్కాలిక గవర్నర్‌గా వ్యవహరిస్తారు.
- పార్లమెంటరీ వ్యవస్థలో కేంద్ర, రాష్ట్ర స్థాయిలో ఒకే విధమైన ప్రభుత్వ వ్యవస్థలు ఏర్పరిచారు. రాష్ట్ర గవర్నర్ రాజ్యాంగపరమైన అధిపతిగా, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరిస్తారు. ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తారు. కాబట్టి గవర్నర్‌ను ఎన్నుకోవడం సముచితమైనది.
- ప్రజలచేత ఎన్నుకోబడిన ఇద్దరు అధిపతులు ఒకే చోట పని చేయడం కొన్ని సమస్యలకు దారి తీస్తుంది.
- ఎన్నికల్లో వ్యక్తిగత, ఇతర అంశాలు ప్రభావాన్ని చూపుతాయి. గవర్నర్ రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలంటే ‘నియమించబడే పద్ధతే’ ఉత్తమమైంది.
- కెనడా పద్ధతివలె భారత్‌లో కూడా నియమించబడే గవర్నర్ల పద్ధతిని కొనసాగించారు. అమెరికాలో గవర్నర్లు ఓటర్లచేత నేరుగా ఎన్నికవుతారు.
అర్హతలు - ప్రకరణ 157 ప్రకారం నియమించబడే వ్యక్తికి కింది అర్హతలు ఉండాలి.
1. భారతీయ పౌరుడై ఉండాలి
2. 35 సంవత్సరాలు నిండి ఉండాలి
3. లాభదాయక పదవిలో ఉండరాదు
4. నేరారోపణ రుజువై ఉండరాదు - ప్రకరణ 158 ప్రకారం గవర్నర్‌గా నియమించబడే వ్యక్తి పార్లమెంటులోగాని, రాష్ట్ర శాసనసభలో గాని సభ్యుడై ఉండరాదు. ఒకవేళ సభ్యుడై ఉంటే, గవర్నర్‌గా నియమించబడిన వెంటనే తన సభ్యత్వం రద్దవుతుంది. అలాగే నియమించిన తర్వాత ప్రభుత్వంలో ఎలాంటి లాభదాయక పదవులు చేపట్టరాదు.
పదవీ కాలం - ప్రకరణ 156(1) ప్రకారం గవర్నర్‌ను ఐదేళ్ల కాలానికి నియమిస్తారు. పదవిని చేపట్టిన రోజు నుంచి ఐదు సంవత్సరాల పదవీ కాలాన్ని పరిగణిస్తారు. అయితే రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకే పదవిలో ఉంటారు. (తదుపరి గవర్నర్‌ను నియమించేంత వరకు) అంటే, గవర్నర్ పదవీ కాలం రాష్ట్రపతి విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. గవర్నర్‌కు పదవీకాల భద్రత లేదు. పునర్ నియామకానికి అర్హుడే.
గవర్నర్ పదవీ కాలం-అభీష్ట సూత్రం - గవర్నర్ ఐదేళ్ల కాలానికి నియమితులైనప్పటికి కచ్చితంగా ఐదేళ్లు పదవిలో కొనసాగే పరిస్థితి ఉండకపోవచ్చు. కేంద్ర ప్రభుత్వం మారినప్పుడు గత ప్రభుత్వం నియమించిన గవర్నర్లను రాజీనామా చేయమని అడగటం లేదా వారిని తొలగించడం జరుగుతుంది. దీనికి కారణం గవర్నర్లకు పదవీ భద్రత లేకపోవడమే.
- రాష్ట్రపతి విశ్వాసమున్నంత వరకు అధికారంలో ఉంటారని రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే సరైన కారణాలు లేకుండా వారిని తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని 2010లో బి.పి.సింఘాల్ V/S యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
- 2014లో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా అలాంటి పరిస్థితే ఏర్పడింది. గత కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన గవర్నర్లకు తమ పదవి నుంచి తప్పుకోవాలని సందేశాలు పంపారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. మారిన ప్రభుత్వ విధానాలు, సిద్ధాంతాలతో గవర్నర్లు ఇమడలేనప్పుడు వారిని పదవి నుంచి తప్పుకోమని కోరవచ్చు. కానీ అక్రమంగా, విచక్షణారాహిత్యంగా తొలగించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం.
గవర్నర్ తొలగింపు - ప్రకరణ 156(1) ప్రకారం గవర్నర్‌ను రాష్ట్రపతి తొలగిస్తాడు. తొలగించడానికి ప్రత్యేక కారణాలు రాజ్యాంగంలో ప్రస్తావించలేదు. రాష్ట్రపతి ఒక ఆదేశం ద్వారా గవర్నర్‌ను తొలగిస్తారు. ఇందులో అభిశంసన అనే ప్రక్రియ ఉండదు. రాష్ట్రపతి విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. అలాగే, రాష్ట్రపతి గవర్నర్‌ను ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ర్టానికి బదిలీ చేయవచ్చు.
ప్రత్యేక వివరణ - గవర్నర్లపై అవిశ్వాస తీర్మానం గాని, అభిశంసన తీర్మానం గాని ప్రవేశపెట్టడానికి అవకాశం లేదు. కేవలం రాష్ట్రపతి ఆదేశం ద్వారా మాత్రమే తొలగించవచ్చు.
పదవీ ప్రమాణ స్వీకారం-రాజీనామా - ప్రకరణ 159 ప్రకారం గవర్నర్‌గా నియమించిన వ్యక్తి పదవీ ప్రమాణ స్వీకారం చేయాలి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అతడు లేని పక్షంలో హైకోర్టు న్యాయమూర్తి ముందు పదవీ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. గవర్నర్‌గా వ్యవహరించే వ్యక్తి కూడా పదవీ ప్రమాణ స్వీకారం చేయాలి. గవర్నర్ తన రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి సమర్పిస్తాడు.
రాష్ట్ర మంత్రిమండలి-ముఖ్యమంత్రి
- భారత రాజ్యాంగం కేంద్రంలోను, రాష్ట్రంలోను పార్లమెంటరీ తరహా ప్రభుత్వాలను ఏర్పరచింది. రాష్ట్రంలో రాజ్యాంగాధిపతిగా ఉన్న గవర్నర్ తన అధికార విధుల నిర్వహణలో ముఖ్యమంత్రి, మంత్రిమండలి సలహాను తీసుకుంటారు.
- ప్రకరణ 163(1) ప్రకారం రాష్ట్ర గవర్నర్‌కు తన విధుల నిర్వహణలో సహాయాన్ని, సలహాలను అందించడానికి ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రిమండలి ఉంటుంది. వీరి సలహా మేరకే గవర్నర్ తన విధులను అధికారాలను నిర్వహిస్తారు.
- ప్రకరణ 163(2) ప్రకారం ఏదైనా అంశాన్ని గవర్నర్ తన వివేచనతో నిర్వహించవచ్చు. కొన్ని సందర్భాల్లో తన విచక్షణాధికారంతో కూడా వ్యవహరించవచ్చు.
- ప్రకరణ 163(3) ప్రకారం మంత్రిమండలి గవర్నర్‌కు ఇచ్చిన సలహాను న్యాయస్థానాల్లో ప్రశ్నించరాదు.
- ప్రకరణ 164(1) ప్రకారం ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తారు. ముఖ్యమంత్రి సలహా మేరకు ఇతర మంత్రులను నియమిస్తారు. మంత్రులు వ్యక్తిగతంగా గవర్నర్‌కు బాధ్యత వహిస్తారు.
- ప్రకరణ 164(2) ప్రకారం, మంత్రులు సంయుక్తంగా రాష్ట్ర విధానసభకు బాధ్యత వహిస్తారు.
- ప్రకరణ 164(3) ప్రకారం మంత్రులు తమ బాధ్యతలను చేపట్టే ముందు మూడో షెడ్యూల్లో పేర్కొన్నట్లుగా పదవీ ప్రమాణం చేయాలి. రెండు ప్రమాణాలు చేస్తారు. తమ విధులను నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా, రాజ్యాంగబద్ధంగా నిర్వర్తిస్తామని, ప్రభుత్వ రహస్యాలను కాపాడతామని ప్రమాణం చేయాల్సి ఉంటుంది. గవర్నర్ వీరిచేత ప్రమాణం చేయిస్తారు.
- ప్రకరణ 164(4) ప్రకారం శాసన సభ్యత్వం లేని వ్యక్తి మంత్రి అయితే అతడు ఆరు నెలల లోపు శాసనసభకు ఎన్నిక కావాల్సి ఉంటుంది. లేకపోతే మంత్రి పదవిని కోల్పోతారు.
- ప్రకరణ 164(5) ప్రకారం మంత్రుల జీతభత్యాలను రాష్ట్ర శాసనసభ నిర్ణయిస్తుంది.
మంత్రిమండలి సంఖ్య-స్వభావం ప్రకరణ 164(1A) - మౌలిక రాజ్యాంగంలో మంత్రిమండలి గురించి ప్రస్తావన లేదు. అయితే 2004లో 91వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్రంలోని మంత్రిమండలి సంఖ్య విధాన సభలోని మొత్తం సభ్యుల్లో 15% మించరాదని, కనిష్ఠంగా 12 మందికి తగ్గకుండా ఉండాలనే సవరణ చేశారు.
- అలాగే ప్రకరణ 164 (1B) 10వ షెడ్యూల్లో పేర్కొన్న విధంగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఏ సభ్యుడైనా అనర్హుడిగా ప్రకటించిన తర్వాత తిరిగి శాసన సభ్యుడిగా ఎన్నికయ్యేంత వరకు మంత్రిగా నియమించడానికి అర్హుడు కాదు.
ప్రత్యేక వివరణ - ప్రకరణ 164(1) ప్రకారం ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశాల్లో గిరిజనుల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. గతంలో బీహార్‌కు ఈ నిబంధన వర్తించేది. 2006లో 94వ రాజ్యాంగ సవరణ ద్వారా బీహార్‌ను తొలగించారు.
మంత్రులు-రకాలు - రాజ్యాంగ పరంగా మంత్రులందరూ సమానులే. అయితే పరిపాలనా సౌలభ్యం కోసం మంత్రులను మూడు రకాలుగా వర్గీకరించారు.
1. క్యాబినెట్ మంత్రులు
2. సహాయ మంత్రులు
3. ఉపమంత్రులు
4. పార్లమెంటరీ కార్యదర్శులు - ముఖ్యమంత్రి మంత్రిమండలికి అధ్యక్షత వహిస్తారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన క్యాబినెట్ అన్ని ముఖ్య నిర్ణయాలను తీసుకుంటుంది.
ప్రత్యేక వివరణ-పార్లమెంటరీ కార్యదర్శులు - పార్లమెంటరీ కార్యదర్శి అనేది కూడా మంత్రి పదవే. వీరిని శిక్షణలో ఉన్న మంత్రులు అంటారు.
- ఆంధ్రప్రదేశ్‌లో మొదటిసారి మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పదవులను ఏర్పాటు చేశారు.
- తెలంగాణలో కె.చంద్రశేఖర్‌రావు ముఖ్యమంత్రిగా మొదటిసారి ఈ పదవులను 2014లో ఏర్పాటు చేశారు. వీరు ప్రభుత్వ కార్యక్రమాల సమన్వయం, పర్యవేక్షణలో పాలుపంచుకుంటారు.
- వీరి నియామకం చెల్లదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు చెప్పింది. వీరితో కలిపితే మంత్రిమండలి గరిష్ఠ సభ్యుల సంఖ్య రాజ్యాంగం నిర్ణయించిన పరిమితిని మించిపోతుంది. కాబట్టి ఈ నియామకాలు చెల్లవని న్యాయస్థానం తీర్పునిచ్చింది.
- పార్లమెంటరీ కార్యదర్శుల పదవులు చాలా రాష్ర్టాల్లో అమల్లో ఉన్నాయి. అయితే 2009లో గోవాలో ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కార్యదర్శుల పదవులకు క్యాబినెట్ హోదా కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని బాంబే హైకోర్టు తీర్పు చెప్పింది.
మంత్రిమండలి-అర్హతలు - మంత్రులుగా నియమించాలంటే రాష్ట్ర శాసనసభలో (విధానసభ లేదా విధాన పరిషత్) సభ్యుడై ఉండాలి. మంత్రిగా నియమించబడే సమయానికి శాసనసభలో సభ్యుడై ఉండకపోతే, మంత్రిగా నియమించిన రోజు నుంచి ఆరు నెలల లోపల రాష్ట్ర శాసనసభకు ఎన్నిక కావాలి.
ప్రమాణ స్వీకారం - రాజ్యాంగంలోని ప్రకరణ 164(3) ప్రకారం మంత్రులు గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు.
పదవీ కాలం - ప్రకరణ 164(1) ప్రకారం రాష్ట్ర మంత్రులు గవర్నర్ విశ్వాసం మేరకు అధికారంలో ఉంటారు.
- ప్రకరణ 164(2) ప్రకారం రాష్ట్ర విధానసభకు మంత్రిమండలి సమష్టిగా బాధ్యత వహించాలి. అంటే ఏ మంత్రిపైనైనా అవిశ్వాస తీర్మానం విధానసభలో ఆమోదం పొందితే, మంత్రివర్గం మొత్తం రాజీనామా చేయవలసిందే.
- మంత్రివర్గంలోని ఏ మంత్రి అయినా వ్యక్తిగత హోదాలో రాజీనామా చేయవచ్చు.
జీతభత్యాలు - ప్రకరణ 164(5) ప్రకారం మంత్రుల జీతభత్యాలను రాష్ట్ర శాసనసభ ఒక చట్టం ద్వారా నిర్ణయిస్తుంది.
అధికారాలు-విధులు - ప్రకరణ 163(1) ప్రకారం గవర్నర్‌కు అతని విధుల నిర్వహణలో సహాయ సలహాలు ఇవ్వడానికి మంత్రిమండలి ఉంటుంది.
- ప్రకరణ 166(1) ప్రకారం ప్రభుత్వ నిర్వహణ గవర్నర్ పేరుపై జరిగినప్పటికి పార్లమెంటరీ సంప్రదాయం ప్రకారం వాస్తవాధికారాలన్నీ మంత్రిమండలివే.
- సాధారణ పరిస్థితుల్లో గవర్నర్ మంత్రిమండలి నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహరించరు.
రాష్ట్ర మంత్రిమండలి-అధికారాలు కార్యనిర్వహణాధికారాలు - రాజ్యాంగం ప్రకారం వివిధ శాఖల్లో ఉన్న పరిపాలనా వ్యవహారాలను పరిశీలించడం, వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని సాధించడం మంత్రిమండలి ప్రధాన విధి. ఈ విధుల నిర్వహణ కోసం వివిధ నియామకాల నిర్ణయాలను మంత్రివర్గం తీసుకుంటుంది.
శాసనాధికారాలు - మంత్రిమండలి శాసనసభలో చురుకుగా వ్యవహరిస్తుంది.
- శాసనసభలో ప్రవేశపెట్టే ఎక్కువ బిల్లులు మంత్రులు ప్రవేశపెట్టేవే.
- గవర్నర్ జారీ చేసిన ఆర్డినెన్సులను చట్టరూపంలో తేవడానికి ప్రయత్నం చేస్తుంది.
- మంత్రిమండలి సలహాతోనే గవర్నర్ అసెంబ్లీని రద్దు చేస్తారు.
- ప్రకరణ 167 ప్రకారం ప్రభుత్వ వ్యవహారాలను మంత్రిమండలి నిర్ణయాలను ముఖ్యమంత్రి గవర్నర్‌కు తెలియజేయాలి.
ఆర్థికాధికారాలు - రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం, శాసనసభలో దాన్ని ఆమోదింపచేయటం మొదలైన బాధ్యతలు రాష్ట్ర మంత్రిమండలికి ఉన్నాయి.
గమనిక: వ్యక్తిగత బాధ్యత, సంయుక్త బాధ్యత మొదలైన అంశాలు కేంద్ర మంత్రిమండలి చాప్టర్లో వివరించినట్లుగా వీరికి కూడా వర్తిస్తాయి. - మంత్రులు ఏ సభలో సభ్యత్వం ఉన్నప్పటికి ఉభయసభల్లో ప్రసంగించవచ్చు.
జీబీకే పబ్లికేషన్స్
హైదరాబాద్, 8187826293
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు