Summits and Conferences 2023 | వెయ్యి సరస్సుల భూమి.. సభ్య దేశాల హామీ
నాటో(NATO)లో ఫిన్లాండ్ సభ్యత్వం
- NATO : North Atlantic Treaty Organization
- ప్రపంచంలో అతిపెద్ద మిలిటరీ కూటమి అయిన నాటోలో ఫిన్లాండ్ 2023, ఏప్రిల్ 4న సభ్యత్వం పొందింది.
- ఈ సభ్యత్వం తర్వాత రష్యా దేశ సరిహద్దు నాటో దేశాల సరిహద్దును రెట్టింపు చేస్తుంది.
- రెండో ప్రపంచ యుద్ధంలో సోవియట్ యూనియన్ చేతిలో ఫిన్లాండ్ ఓడిపోవడంతో ఆ దేశం తటస్థ వైఖరి అవలంబించింది. కానీ 2022, ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడం మొదలు పెట్టడంతో తన వైఖరి మార్చుకుంది. 1948లో రష్యాతో ఫ్రెండ్షిప్ ఒప్పందం కుదుర్చుకొంది.
- ఫిన్లాండ్ సభ్యత్వం పొందిన రోజు నాటోకి 74వ వార్షికోత్సవం. నాటోలో ఫిన్లాండ్ చేరడంతో సభ్యదేశాల సంఖ్య 31కి చేరింది.
- ఫిన్లాండ్ విదేశాంగ శాఖ మంత్రి పెక్కా హావిస్టో, అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంథోని జె.బ్లింకెన్‌కు తమ సభ్యత్వ ప్రవేశ పత్రాన్ని అందించారు.
- అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ నాటో సభ్యదేశాల పత్రాలను భద్రపరిచే రిపాజిటరి. నాటోలో సభ్యత్వం పొందాలంటే అందులో సభ్య దేశాల పార్లమెంటులు ఆమోదించాలి.
- ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించిన తర్వాత ఫిన్లాండ్, స్వీడన్ దేశాలు 2022, మే 18న నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోర్టెన్బర్గ్కు అధికారిక అప్లికేషన్లు
అందించి వీలైనంత తొందరగా నాటోలో సభ్యత్వం ఇవ్వాలని కోరాయి. - ఫిన్లాండ్, స్వీడన్ దేశాల ప్రవేశ ప్రొటోకాల్‌పై నాటో సభ్య దేశాలు 2022, జూలై 5న సంతకాలు చేశాయి.
- 2022, జూన్ 29న నాటో మాడ్రిడ్ సమావేశంలో ఫిన్లాండ్, స్వీడన్ దేశాల సభ్యత్వాన్ని సభ్యదేశాల నాయకులు ఆమోదించారు.
- 2023 ఫిబ్రవరిలో ఫిన్లాండ్ పార్లమెంట్ నాటో సభ్యత్వానికి ఆమోదం తెలిపింది. ఈ ఓటింగ్‌లో 184 మంది ఎంపీలు అనుకూలంగా, ఏడుగురు ఎంపీలు వ్యతిరేకంగా, ఒక ఎంపీ తటస్థంగా వ్యవహరించారు.
- ఫిన్లాండ్కు నాటోలో సభ్యత్వం ఇవ్వడానికి చివరగా ఆమోదించిన రెండు దేశాలు హంగేరి, టర్కీ. హంగేరి పార్లమెంట్ 2023, మార్చి 27న, టర్కీ పార్లమెంట్ 2023 మార్చి 31న ఫిన్లాండ్ చేరికకు ఆమోదించాయి.
- స్వీడన్ దేశ సభ్యత్వాన్ని ఇంకా ఆమోదించని దేశాలు హంగేరి, టర్కీ.
- టర్కీతో ఉగ్రవాదులుగా భావించే సిరియాలోని కుర్దిస్థాన్ వర్కర్స్ పార్టీ, డెమోక్రటిక్ యూనియన్ పార్టీ సభ్యులకు స్వీడన్ రక్షణ కల్పిస్తుందని టర్కీ ప్రస్తుత అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఆరోపిస్తూ
ఆమోదించలేదు. - హంగేరి పట్ల స్వీడన్ శత్రువైఖరిని కలిగి ఉండటం, హంగేరి అధ్యక్షుడు విక్టర్ డర్బన్ చట్టబద్ధమైన పాలన కొనసాగించడం లేదని విమర్శించడం వల్ల స్వీడన్ సభ్యత్వాన్ని హంగేరి ప్రస్తుతానికి ఆమోదించకుండా ఉంది.
- ప్రస్తుతం నాలుగు దేశాలు నాటో సభ్యత్వం కోసం తమ ఆమోదం ప్రకటించాయి. అవి…
1. బోస్నియా, హెర్జ్‌గోవినా 2. జార్జియా
3. స్వీడన్ 4. ఉక్రెయిన్ - నాటోలో 30వ సభ్యదేశంగా ఉత్తర మాసిడోనియా 2020, మార్చి 27న చేరగా, 29వ సభ్యదేశంగా మాంటెనిగ్రో 2017లో చేరింది.
- రష్యా తూర్పు సరిహద్దుతో ఫిన్లాండ్ సుమారు 1340 కి.మీ సరిహద్దును పంచుకొంటుంది. ఫిన్లాండ్పై రష్యా దాడి చేస్తే ప్రకరణ 5 ప్రకారం నాటో సభ్యదేశాలన్నీ రష్యాపై దాడి చేస్తాయి.
- ప్రకరణ 5 అనేది ‘ఒక సభ్యునిపై దాడి అందరిపై దాడి’ అని తెలియజేస్తుంది.
- ఫిన్లాండ్ నాటోలో చేరడం తమ దేశానికి ఒక కొత్త శకం ఆరంభమని ఆ దేశ అధ్యక్షుడు సౌలీ నీనిస్టో ప్రకటించారు.
- ఫిన్లాండ్ నాటోలో చేరిక అనేది ‘ఫిన్లాండ్ సురక్షితం, నాటో బలోపేతం’ అని నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్ బర్గ్ అభివర్ణించారు.
- ప్రకరణ 5ను ఇప్పటివరకు ఒకే ఒకసారి ఉపయోగించారు. 2001లో అమెరికాలో 9/11 టెర్రరిస్టు దాడుల్లో భాగంగా ఉపయోగించారు.
ఫిన్లాండ్ గురించి..
- దీని రాజధాని హెల్సింకి. కరెన్సీ యూరో. సౌలీ నీనిస్టో అధ్యక్షులుగా ఉండగా సనా మారిన్ ప్రధానమంత్రిగా ఉన్నారు.
- 2023 ప్రపంచ సంతోష సూచీలో 7.80 స్కోరుతో ఫిన్లాండ్ వరుసగా ఆరోసారి అగ్రస్థానం పొందింది. ఈ దేశాన్ని ‘వెయ్యి సరస్సుల భూమి’ అని పిలుస్తారు. ఇక్కడ సుమారు 1,87,888 సరస్సులు ఉన్నాయి. అంటే దేశంలో ప్రతి 26 మందికి ఒక సరస్సు ఉంది.
- ప్రముఖ వీడియోగేమ్ ‘యాంగ్రీబర్డ్స్’ ఫిన్లాండ్కు చెందినదే. మొబైల్ హ్యాండ్సెట్ మేకర్ నోకియా కూడా ఈ దేశానికి చెందినదే.
- ఇది ఒక అంతర ప్రభుత్వ సైనిక కూటమి. ఇందులో యూరోపియన్ దేశాలు (29), ఉత్తర అమెరికా (2) దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి.
- ఉత్తర అమెరికా నుంచి సభ్యత్వం ఉన్న రెండు దేశాలు అమెరికా, కెనడా.
- నాటో 1949, ఏప్రిల్ 4న ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం బెల్జియంలోని బ్రస్సెల్స్‌లో ఉంది.
- ఇది నార్త్ అట్లాంటిక్ ఒప్పందంపై సంతకాలు చేయడంతో ఏర్పడింది. నార్త్ అట్లాంటిక్ ఒప్పందాన్ని ‘వాషింగ్టన్ ట్రీటీ’ అని కూడా పిలుస్తారు. ప్రారంభ సభ్య దేశాలు 12.
- నార్త్ అట్లాంటిక్ ఒప్పందం ఐక్యరాజ్యసమితి చార్టర్ ఆర్టికల్ 51 ప్రకారం జరిగింది. అంటే దీని ప్రకారం వ్యక్తిగత లేదా సామూహిక రక్షణకు స్వతంత్ర రాష్ర్టాల స్వాభావిక హక్కును ఇది తెలియజేస్తుంది.
- నార్త్ అట్లాంటిక్ ఒప్పందం 14 ఆర్టికల్స్ కలిగి ఉంది.
- 1949లో సోవియట్ యూనియన్ తూర్పు యూరప్‌పై తన నియంత్రణను ఖండంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించడానికి ప్రయత్నించే ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి పరస్పర సహాయ ఒప్పందాన్ని రూపొందించారు. అదే నార్త్ అట్లాంటిక్ ఒప్పందం.
- 1952లో గ్రీసు, టర్కీ చేరాయి. దీంతో నాటో యూరప్‌లో దక్షిణ పార్శాన్ని బలోపేతం చేసింది. నార్త్ అట్లాంటిక్ ఒప్పందంలో ఆర్టికల్ 10 కూటమిలో దేశాలు ఎలా చేరవచ్చో తెలియజేస్తుంది.
- ఆర్టికల్ 10 ప్రకారం నార్త్ అట్లాంటిక్ ఒప్పందం సూత్రాలు ముందుకు తీసుకెళ్లడానికి, ఉత్తర అట్లాంటిక్ ప్రాంత భద్రతకు దోహదపడే యూరప్ దేశానికి సభ్యత్వం ఉంటుంది.
- 2022, జూన్ 29న నాటో అధిపతులు ‘2022 స్ట్రాటజిక్ కాన్సెప్ట్’ను మాడ్రిడ్ సమావేశంలో ఆమోదించారు.
- నాటో ప్రధాన కార్యాలయం ప్రారంభంలో ఫ్రాన్స్‌లోని పారిస్‌లో ఉండేది. అయితే 1966లో అప్పటి ఫ్రాన్స్ అధ్యక్షుడు చార్లెస్ డిగాలో నాటో సమీకృత మిలిటరీ నిర్మాణం నుంచి ఫ్రాన్స్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని నిర్ణయించారు. దీంతో 1966లో నాటో ప్రధాన కార్యాలయాన్ని బెల్జియంలోని బ్రస్సెల్స్‌కి మార్చారు.
- 1955, మే 14న పోలెండ్‌లోని వార్సాలో సోవియట్ యూనియన్, ఏడు తూర్పు యూరప్ దేశాలు ఒక రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీన్నే వార్సా ఒప్పందం అంటారు.
- 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం కావడంతో వార్సా ఒప్పందంలోని చాలా దేశాలు నాటోలో సభ్యత్వం పొందాయి. నాటో ప్రస్తుత సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్ బర్గ్ (నార్వే). ఇతడు 2014, అక్టోబర్ 1 నుంచి కొనసాగుతున్నారు.
ఐక్యరాజ్య సమితి స్టాటిస్టికల్ కమిషన్‌కు భారత్ ఎన్నిక
- 2023, ఏప్రిల్ 5న ఐక్యరాజ్య సమితి స్టాటిస్టికల్ కమిషన్‌కు జరిగిన అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎన్నికల పోటీలో నాలుగు సంవత్సరాల కాలానికి భారతదేశం అత్యధిక మెజారిటీతో ఎన్నికైంది.
- భారత్ పదవీకాలం 2024, జనవరి 1 నుంచి మొదలవుతుంది.
- రెండు సీట్ల కోసం జరిగిన ఎన్నికలకు నాలుగు దేశాలు (భారత్, చైనా, దక్షిణకొరియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) పోటీ పడ్డాయి. ఈ ఎన్నికలు ఆసియా-పసిఫిక్ దేశాల ప్రాతినిధ్యం కోసం జరిగాయి.
- ఈ ఎన్నికల్లో భారతదేశం అత్యధికంగా 46 ఓట్లు పొందగా, దక్షిణకొరియా 23 ఓట్లు, చైనా 19 ఓట్లు, యూఏఈ 15 ఓట్లు పొందాయి.
- ఆసియా-పసిఫిక్‌కు భారతదేశం, దక్షిణ కొరియాలు ఎన్నికయ్యాయి. ఇప్పటికే యూఎన్ స్టాటిస్టికల్ కమిషన్‌లో జపాన్, సమోవా దేశాలు సభ్యదేశాలుగా ఉన్నాయి. వీటి పదవీకాలం 2024తో ముగుస్తుంది.
- కువైట్, దక్షిణ కొరియా దేశాలది 2023 తో సభ్యత్వం ముగుస్తుంది. వీటి స్థానంలో భారత్, దక్షిణ కొరియా ఎన్నికయ్యాయి.
- భారత్, దక్షిణ కొరియాలతో పాటు ఎలాంటి పోటీ లేకుండా అర్జెంటీనా సియొర్రాలియోన్, స్లావేనియా,
ఉక్రెయిన్, ది రిపబ్లిక్ ఆఫ్ టాంజానియా, యూఎస్ఏలు యూఎన్ స్టాటిస్టికల్ కమిషన్‌కు ఎన్నికయ్యాయి. వీటి పదవీకాలం 2024, జనవరి 1న మొదలవుతుంది. - యూఎన్ స్టాటిస్టికల్ కమిషన్‌కు భారత్ గతంలో 2004లో ఎన్నికైంది.
యూఎన్ స్టాటిస్టికల్ కమిషన్ గురించి.. - ఇది 1947లో ఏర్పాటైంది.
- ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్‌లో ఉంది. షిగెరు కవాసాకి (జపాన్) ప్రస్తుతం చైర్మన్‌గా ఉన్నారు. ఇది ఐక్యరాజ్య సమితి ఆర్థిక సామాజిక మండలి ఆధ్వర్యంలో పని చేస్తుంది.
- ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సభ్యదేశాలకు చెందిన చీఫ్ స్టాటిస్టియన్లను ఒకేచోట చేర్చే ప్రపంచ గణాంక వ్యవస్థలోని ఒక అత్యున్నత సంస్థ.
- ఇది అంతర్జాతీయ గణాంక కార్యకలాపాల కోసం అత్యున్నత నిర్ణయాధికార సంస్థ. గణాంక ప్రమాణాలను సెట్ చేయడానికి, జాతీయ, అంతర్జాతీయ స్థాయి ల్లో వాటి అమలుతో సహా భావనలు, పద్ధతుల అభివృద్ధికి కృషి చేస్తుంది.
- దీనిలో సభ్య దేశాలు-24. ఈ సభ్యదేశాలను ఐక్యరాజ్య సమితి ఆర్థిక, సామాజిక మండలి సమానమైన భౌగోళిక పంపిణీ ఆధారంగా ఎన్నుకొంటుంది.
- ఆఫ్రికా ఖండం నుంచి ఐదు దేశాలు
- ఆసియా పసిఫిక్ నుంచి నాలుగు దేశాలు
- తూర్పు యూరప్ నుంచి నాలుగు దేశాలు
- లాటిన్ అమెరికా, కరేబియన్ నుంచి నాలుగు దేశాలు
- పశ్చిమ యూరప్, ఇతర దేశాల నుంచి ఏడు దేశాలు ఎన్నికవుతాయి.
భారత్, ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక మండలి ద్వారా ఇటీవల ఎన్నికైన కొన్ని ముఖ్యమైన అంశాలు - ఎయిడ్స్‌పై ఉమ్మడి ఐక్యరాజ్యసమితి కార్యక్రమం ప్రోగ్రామ్ కోఆర్డినేటింగ్ బోర్డ్‌లో ఆసియా-పసిఫిక్ దేశాల నుంచి ఖాళీలను భర్తీ చేయడానికి ఆర్థిక, సామాజిక మండలి ద్వారా భారత్, కంబోడియా దేశాలు ఎన్నికయ్యాయి.
- ఈ రెండు దేశాల పదవీకాలం 2023 ఏప్రిల్ 5న ప్రారంభమై 2025, డిసెంబర్ 31న ముగుస్తుంది.
- నార్కోటిక్ డ్రగ్స్ మీద ఏర్పాటైన కమిషన్‌కు ఆసియా-పసిఫిక్ నుంచి ప్రాతినిధ్యం వహించే 11 దేశాల్లో ఒకటిగా భారతదేశం నాలుగేళ్ల కాలానికి ఎన్నికైంది. ఇది 2024, జనవరి 1 నుంచి ప్రారంభమవుతుంది. ఈ కమిషన్‌లో 53 సభ్య దేశాలుంటాయి.
- కార్యక్రమ, సమన్వయం కోసం కమిటీలో కూడా భారతదేశం నాలుగేళ్ల కాలానికి ఎన్నికైంది. ఇది కూడా 2024, జనవరి 1 నుంచి ప్రారంభమవుతుంది.
అరబ్ లీగ్‌లో తిరిగి సభ్యత్వం పొందిన సిరియా
- అరబ్ లీగ్ సభ్యదేశాల విదేశాంగ మంత్రులు 2023, మే 7న ఈజిప్టులోని కైరోలో నిర్వహించిన సమావేశం సందర్భంగా సిరియాను తిరిగి సభ్యదేశంగా చేర్చుకోవడానికి ఓటింగ్ ద్వారా తమ నిర్ణయాన్ని ప్రకటించారు.
- సిరియా అధ్యక్షుడు బషర్ అల్-అస్సాద్ 2011, మార్చిలో నిరసనకారుల అణచివేతకు ఆదేశించిన తర్వాత సిరియాను అరబ్‌లీగ్ నుంచి తొలగించారు. ఇది సిరియాను అంతర్యుద్ధంలోకి నెట్టి దాదాపు 5 లక్షల మందిని చంపింది. 23 మిలియన్ల మందిని నిరాశ్రయులను చేసింది.
- 2023, మే మొదట్లో జోర్డాన్‌లో ఈజిప్టు, ఇరాక్, సౌదీ అరేబియా, సిరియాకు చెందిన అగ్ర ప్రాంతీయ దౌత్యవేత్తలు సమావేశం తర్వాత, సిరియాను అరబ్ లీగ్‌లోకి తీసుకురావాలని
నిర్ణయించారు. దీన్నే ‘జోర్డానియన్ ఇనీషియేటివ్’ అంటారు. - 2023, మే 19న సౌదీ అరేబియాలో అరబ్ లీగ్ సమావేశం జరిగింది. సిరియా 12 ఏళ్ల తర్వాత అరబ్ లీగ్‌లో మళ్లీ సభ్యత్వం పొందింది.
అరబ్ లీగ్ గురించి.. - 1945, మార్చి 22న మధ్యప్రాచ్య, ఆఫ్రికాలోని ప్రాంతాలతో ఏర్పాటు చేసిన ఒక ప్రాంతీయ సంస్థ.
- దీని ప్రధాన కార్యాలయం ఈజిప్టులోని కైరోలో ఉంది. ఇది ప్రారంభంలో ఏడు దేశాలతో ఏర్పడింది. ప్రస్తుత సభ్యదేశాలు 22.
- పరిశీలక హోదా దేశాలు- భారత్, అర్మేనియా, బ్రెజిల్, ఎరిత్రియా, వెనెజులా
- ఉద్దేశం: సభ్యదేశాల రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక కార్యక్రమాల బలోపేతం, సమన్వయం చేయడం, వారి మధ్య లేదా వారికి మూడో పక్షాల మధ్య మధ్యవర్తిత్వం చేయడం.
- సభ్య దేశాలు ఉమ్మడి రక్షణ, ఆర్థిక సహకారంపై ఒప్పందం చేసుకొన్నాయి. సైనిక రక్షణ చర్యలకు ఒప్పందం కుదుర్చుకున్నాయి.
- ప్రస్తుత సెక్రటరీ జనరల్: అహ్మద్ అబేల్ ఘెయిట్ (ఈజిప్టు).
తాన్న రవి
ఫ్యాకల్టీ
ఏకేఆర్ స్టడీసర్కిల్
వికారాబాద్
Previous article
English Grammar | Everyone loved her because of her simplicity
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు