General Studies | తక్షణ స్పందన.. ప్రాణాలకు రక్షణ
ప్రథమ చికిత్స
- ఒక వ్యక్తి ప్రమాదానికి గురైనప్పుడు లేదా హఠాత్తుగా అస్వస్థత చెందినప్పుడు వెంటనే తాత్కాలికంగా అందించే సహాయాన్ని ప్రథమ చికిత్స అంటారు. ఒక వ్యక్తిని వైద్యుడి వద్దకు తీసుకెళ్లే లోపల చేసే చికిత్సను ప్రథమ చికిత్స అంటారు. ప్రథమ చికిత్స లక్ష్యాలు ముఖ్యంగా ప్రమాదానికి గురైన వ్యక్తిని బతికించడం. బాధ, విపత్తు నుంచి విముక్తి చేయడం. వైద్యుడు వచ్చేదాకా రోగి పరిస్థితి దిగజారకుండా చూడటం. వ్యక్తిని ఆసుపత్రికి తరలించడం.
- ఇస్మార్క్ (1823-1908)అనే జర్మన్ దేశీయుడు ప్రథమ చికిత్సకు ఆద్యుడు.
- 1879లో సెయింట్ జాన్స్ అంబులెన్స్ సర్వీస్ వల్ల ప్రథమ చికిత్స ప్రజాదరణ పొందింది.
కీటకాలు కుట్టడం: తేనెటీగలు లేదా ఇతర కీటకాలు కుట్టినప్పుడు వెంటనే గాయాన్ని శుభ్రంగా నీటితో కడిగి, కీటకాల ముళ్లను ఫోర్సెప్స్తో తీసేయాలి. తర్వాత యాంటిసెప్టిక్ ఆయిట్మెంట్ను పూసి వెంటనే వైద్యుడిని సంప్రదించి తగిన చికిత్స చేయించాలి.
తేలు కుట్టడం: తేలు కుట్టిన భాగానికి పైభాగాన గుడ్డతో కట్టాలి. తేలు కుట్టిన భాగంలో టార్టారిక్ ఆమ్లం లేదా పొటాషియం పర్మాంగనేట్ ద్రావణం పోయాలి. దీని వల్ల రోగికి కొంత ఉపశమనం కలుగుతుంది. అనంతరం వైద్యుడిని సంప్రదించి తగిని చికిత్స అందించాలి.
పాము కాటు - పాము కాటుకు చికిత్స చేసే ముందు ఏ రకమైన పాము కాటు వేసిందో తెలుసుకోవడం ముఖ్యం.
- పాము విషంలో టాక్సిన్ అనే విష రసాయన పదార్థాలుంటాయి.
- సముద్ర పాము విషం కండరాల మీద పనిచేస్తుంది.
టోర్నికిట్: పాము కాటు గాయానికి 5 సెంటీమీటర్ల పైన హృదయం దిశలో గుడ్డను బిగువుగా కట్టడం. - మనదేశంలో ప్రతి సంవత్సరం 15,000 మంది పాముకాటు వల్ల మరణిస్తున్నారు.
పాలీ–వాలెంట్: కాటు వేసిన పామును గుర్తించలేకపోతే ఇచ్చే విరుగుడును పాలీ-వాలెంట్ అంటారు. దీనిలో అనేక రకాలైన విషాలకు విరుగుడు ఉంటుంది.
విషానికి విరుగుడు: ఇది పౌడరు రూపంలో ఉంటుంది. దీన్ని స్టెరిలైజ్ చేసిన డిస్టిల్ వాటర్‌లో కలిపి రోగి సిరల్లోకి ఎక్కిస్తారు. విరుగుడులో ఉన్న ప్రతిరక్షకాలు, విషంలోని టాక్సిన్లను గుర్తించి విషాన్ని తటస్థీకరణం చేస్తాయి.
విషరహిత పాములు - కాటు వేసినప్పుడు U ఆకారంలో పాము పళ్ల గుర్తులు పడతాయి.
- గాయం వల్ల వెలువడిన రక్తం గడ్డ కడుతుంది.
విషపూరిత పాములు - కాటు వేసినప్పుడు 1 లేదా 2 కోరల గుర్తులు పడతాయి.
- కాటు వేసిన చోట సూదితో గుచ్చినట్లు గుర్తులు పడతాయి. గాయం నుంచి రక్తం, సీరం కారుతాయి.
- మొదట్లో గాయం అయినచోట విపరీతమైన బాధ, స్పర్శజ్ఞానం లేకపోవడం, ఆ ప్రదేశం ఉబ్బటం, ఎర్రగా మారడం జరుగుతుంది.
- పాము విషం రెండు రకాలు అవి.. 1. న్యూరో టాక్సిన్లు
2. హీమో టాక్సిన్లు
న్యూరో టాక్సిన్లు - న్యూరో టాక్సిన్లు నాడీ మండలం పై పనిచేస్తాయి.
- వీటి వల్ల కనురెప్పలు మూతపడటం, సరిగ్గా మాట్లాడలేకపోవడం, నడవలేకపోవడం, శ్వాసించేందుకు ఇబ్బంది కలగడం వంటి సమస్యలు కలుగుతాయి.
- కొన్ని సందర్భాల్లో పక్షవాతం కూడా వస్తుంది.
- ఈ లక్షణాలు పాముకాటు వేసిన
2 గంటల తర్వాత కనిపిస్తాయి.
ఉదా: కట్లపాము విషం
హీమో టాక్సిన్లు - రక్తకణాల మీద పనిచేస్తాయి.
- వల్ల ఎక్కువ రక్త నష్టం, కాటువేసిన చోట ఉబ్బడం, ఎక్కువ బాధ కలుగుతుంది.
- రక్తం నష్టపోవడం వల్ల హృదయం సక్రమంగా పనిచేయక ఆగిపోయే ప్రమాదాలుంటాయి.
ఉదా: రక్తపింజర విషం
ఎముక విరుపులు - ప్రమాదవశాత్తు ఎముకల్లో పగుళ్లు, విరగడం జరిగితే దాన్ని ఎముక విరుపు అంటారు.
- సామాన్య ఎముక విరుపు: దీన్ని మూసివేసిన ఎముక విరుపు అంటారు. ఇందులో ఎముక మాత్రమే విరుగుతుంది. కాని గాయం కనిపించదు.
- ఎక్కువచోట్ల ఎముక విరుపు: దీన్ని ఓపెన్ బోన్ ఫ్రాక్చర్స్ అంటారు. ఎముక విరగడంతో పాటు, విరిగినచోట గాయాలు కనిపిస్తాయి. విరిగిన ఎముక కొనలు ఒక వైపు గాని, రెండు వైపుల గాని చర్మాన్ని చీల్చుకొని బయటకు వస్తాయి.
జఠిలమైన ఎముక విరుపు: ఎముకల విరుపుతోపాటు ఇతర ముఖ్య అవయవాలైన కాలేయం, మెదడు, పేగులు, ప్లీహం, పెద్ద రక్తనాళాలు దెబ్బతింటాయి.
విఖండిత ఎముక విరుపు: ఈ రకపు ఎముక విరుపులో ఎముక చాలా చోట్ల విరుగుతుంది.
తాకిడి ప్రభావపు ఎముక విరుపు: తాకిడి ప్రభావం వల్ల విరిగిన ఎముక రెండు కొనలు ఒకదానిలోకి మరొకటి దూసుకుపోతుంది.
లేత ఎముక విరుపు: ఎముక వంగుతుంది కాని విరగదు. ఇది సాధారణంగా పిల్లల్లో జరుగుతుంది.
లక్షణాలు - ఎముక విరిగిన చోట నొప్పి ఉంటుంది. విరిగిన భాగం పచ్చిగా ఉండి ఏ మాత్రం ఒత్తిడిని భరించలేం. విరిగిన చోట వాపు ఉంటుంది. గాయం తగిలిన భాగం మామూలుగా కదల్చలేం. చెయ్యి లేదా కాలు వంకరపోవచ్చు. విరిగినచోట కదలిక అసామాన్యంగా ఉంటుంది.
ప్రథమ చికిత్స - ప్రమాదం జరిగిన వెంటనే ప్రథమ చికిత్స చేయాలి. రక్తస్రావం జరుగుతున్న గాయాలను శుభ్రపరిచి, రక్తస్రావాన్ని అరికట్టాలి.
- విరిగిన అవయవానికి కర్ర బద్దల సహాయంతో ఆధారం ఇవ్వాలి. ఇలా చేస్తే రక్తస్రావం ఆగి, రక్తనాళాలకు, నరాలకు, కండరాలకు హాని కలగకుండా ఆపుతుంది.
- బ్యాండేజీ కట్టు విరిగిన ఎముక మీద కాకుండా దానికి అటూ ఇటూ కట్టాలి. కట్టిన కట్టు తగినంత బిగుతుగా ఉండి, రక్త ప్రసరణ ఆగిపోకుండా ఉండాలి.
కాలటం - వేడి వల్ల శరీరానికి కలిగే గాయాన్నే కాలట అంటారు. ఇది మూడు రకాలుగా ఉంటుంది. 1. ప్రథమ దశ 2. ద్వితీయ దశ
3. తృతీయ దశ - కాలినప్పుడు ప్రథమ దశలో చర్మం పైపొర మాత్రమే దెబ్బతింటుంది. చర్మం కాలినచోట ఎరుపెక్కి బాధగా ఉంటుంది.
- ద్వితీయ దశలో చర్మం లోపలిభాగం దెబ్బతింటుంది. ఈ స్థితిలో రోగిని ఏటవాలుగా విశ్రాంతిగా పడుకోబెట్టాలి. దీని వల్ల అఘాత ప్రమాదం తగ్గుతుంది.
- ప్రతి 15 లేదా 20 నిమిషాలకు తగినంత నీరు, పాల వంటి ద్రవపదార్థాలను తాగించాలి.
- నూనె లేదా గ్రీజు సంబంధిత లేపనాలను వాడాలి.
- మొత్తం చర్మం, కండరాలు నష్టపోతే దాన్ని తృతీయ దశ అంటారు.
- రసాయనిక పదార్థాల వల్ల కాలితే ఆ భాగాన్ని నీటితో కడగాలి. క్షారం వల్ల కాలితే వెనిగర్‌తో కడగాలి. ఆమ్లం వల్ల కాలితో సోడియం బైకార్బోనేట్ (వంట సోడా) పూయాలి.
దేశంలోని విషయుత పాములు
సాధారణ నామం శాస్త్రీయనామం
త్రాచుపాము ఒఫియో ఫాగస్ హెన్నా
నాగుపాము నాజా నాజా
కట్లపాము బుంగారస్ సిరూలియస్
రక్తపింజర రస్సల్స్ వైపర్
సాస్కేల్ వైపర్ ఎకిస్ కారినేటా
ఉన్నత స్థాయి జీవుల్లో రవాణా వ్యవస్థ
చేపలు
- చేపల హృదయంలో రెండు గదులుంటాయి. అవి.. ఒక కర్ణిక ఒక జఠరిక.
- శరీర వివిధ భాగాల నుంచి ఆమ్లజని రహిత రక్తం సిరాసరణిలోకి చేరుతుంది.
- జఠరికల నుంచి రక్తం మొప్పలకు వెళుతుంది. మొప్పల్లో ఆమ్లజని రహిత రక్తం, ఆమ్లజనీకరణం చెందుతుంది.
- మొప్పల నుంచి రక్తం వివిధ శరీర భాగాలకు సరఫరా అవుతుంది. చేపల్లో గుండె ద్వారా రక్తం ఒకేసారి ప్రవహిస్తుంది. కాబట్టి ఈవిధమైన రక్త ప్రసరణను ఏకవలయ రక్త ప్రసరణ అంటారు.
- చేపల్లో రక్తాన్ని మొప్పలకు సరఫరా చేస్తుంది కాబట్టి వీటి హృదయాన్ని జలశ్వాస హృదయం అంటారు.
ఉభయచర జీవులు - కప్ప వంటి ఉభయ జీవుల హృదయంలో మూడు గదులుంటాయి. అవి..
రెండు కర్ణికలు ఒక జఠరిక. - శరీర భాగాల నుంచి ఆమ్లజని రహిత రక్తాన్ని మూడు పెద్ద సిరలు (మహా సిరలు) సేకరించి వాటి కలయిక వల్ల ఏర్పడిన సిరాసరణిలోకి పంపుతాయి. సిరాసరణి కుడి కర్ణికలోకి తెరుచుకుంటుంది.
- ఆమ్లజని రహిత ఆమ్లజని సహిత రక్తాలు జఠరికలో కలిసిపోయి మిశ్రమ రక్తం ఏర్పడుతుంది. ఈ రక్తం మహాధమని ద్వారా శరీర అన్ని భాగాలకు సరఫరా అవుతుంది.
- ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరా చేసే హృదయాన్ని పుపుస హృదయం అంటారు.
- కప్ప, ఇతర ఉన్నత జంతువుల్లో రక్తం హృదయం ద్వారా రెండు సార్లు ప్రయాణిస్తుంది. ఒకసారి ఊపిరితిత్తులు-హృదయం మధ్య, మరోసారి హృదయం-శరీర భాగాల మధ్య ప్రసరణ చెందుతుంది. ఇటువంటి ప్రసరణను ద్వివలయ ప్రసరణ అంటారు.
సరీసృపాలు - తొండలు, పాములు మొదలైన సరీసృపాల హృదయంలో రెండు కర్ణికలుంటాయి. జఠరిక అసంపూర్ణంగా రెండు గదులుగా విభజన చెందుతుంది. అందువల్ల ఇది అసంపూర్ణంగా విభజన చెందిన నాలుగు గదులు కలిగిన హృదయం.
- సరీసృపాల రక్త ప్రసరణను ద్వివలయ రక్త ప్రసరణ అంటారు. రక్తం ఊపిరితిత్తులకు ప్రసరణ చెందుతుంది కాబట్టి పుపుస హృదయం.
పక్షులు, క్షీరదాలు - పక్షులు, క్షీరదాల్లో హృదయం పూర్తిగా నాలుగు గదులుగా విభజన చెంది ఉంటుంది. అవి.. రెండు కర్ణికలు, రెండు జఠరికలు.
- వీటిలో సిరాసరణి ఉండదు.
- రక్త ప్రసరణ ద్వివలయ రక్త ప్రసరణ. రక్తం ఊపిరితిత్తులకు రవాణా అవుతుంది కాబట్టి పుపుస హృదయం.
వానపాములో రవాణా వ్యవస్థ - వానపాము శాస్త్రీయనామం- పెరిటిమా పోస్తుమా
- దీని రక్త ప్రసరణ వ్యవస్థలో హృదయాలు, రక్తనాళాలు, రక్తం ఉంటాయి.
- వానపాము శరీరంలో 8 జతల హృదయాలు పార్శ భాగాల్లో ఉంటాయి. ఇవి శరీరంలోని రెండు ముఖ్య రక్తనాళాలైన పృష్ట రక్తనాళం, ఉదర రక్తనాళాలను కలుపుతాయి.
- వానపాము రక్తంలో ఎర్ర రక్తకణాలు లేవు. ఆక్సిజన్‌ను మోసుకుపోయే ప్రొటీన్ అయిన హీమోగ్లోబిన్ రక్తంలో ఉండటం వల్ల వానపాము రక్తం ఎర్రగా ఉంటుంది. వానపాము రక్తంలో తెల్ల రక్త కణాలు మాత్రమే ఉంటాయి.
Previous article
SDSC SHAR Recruitment | షార్ శ్రీహరికోటలో 94 పోస్టులు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు