Parliament – General Studies | అంతిమ తీర్మానం.. విశ్వాసముంటేనే అధికారం
పార్లమెంటరీ పద్ధతులు-పారిభాషిక పదజాలం
పార్లమెంటు సమావేశంలో ఉన్నప్పుడు సభలో వివిధ చర్చలు, తీర్మానాలు, ఓటింగ్ మొదలగు ప్రక్రియలుంటాయి. పార్లమెంటులో ప్రయోగించే పదాలకు ప్రత్యేక అర్థం ఉంటుంది. పార్లమెంటరీ ప్రక్రియలో అధిక భాగం బ్రిటిష్ రాజ్యాంగం నుంచి గ్రహించారు. ఆ పదజాలం, పద్ధతుల గురించి తెలుసుకుందాం.
సమావేశ కాలం
- పార్లమెంటు కార్యక్రమాలు ప్రారంభమైన మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఉన్న మధ్య కాలాన్ని సమావేశ కాలం అంటారు. ఈ మధ్య కాలంలో సభ ప్రతిరోజు సమావేశమవుతుంది.
- సభా వ్యవహారాలు కొనసాగుతూ సమయం ప్రకారం వాయిదా పడుతూ మళ్లీ కొనసాగుతూ ఉంటాయి.
కోరమ్ (నిర్దిష్ట పూర్వక సంఖ్య)
- పార్లమెంటు సమావేశాలు జరగడానికి హాజరు కావలసిన కనిష్ఠ సభ్యుల సంఖ్యనే కోరమ్ అంటారు. ఆ సభలోని మొత్తం సభ్యుల్లో (సభాధ్యక్షులతో కలుపుకొని) 1/10వ వంతుకు సమానంగా ఉంటుంది. కోరమ్ కన్నా తక్కువ సభ్యులు హాజరైతే సభా కార్యక్రమాలను సభాధ్యక్షులు కొంతసేపు వాయిదా వేయాల్సి ఉంటుంది.
- కోరమ్ ఉన్నదా లేదా అని సభాధ్యక్షులు నిర్ణయిస్తారు. ప్రస్తుతం లోక్‌సభలో కోరమ్ 55 మంది సభ్యులు, రాజ్యసభలో కోరమ్ 25 మంది సభ్యులు ఉన్నారు.
- గమనిక: రాష్ట్ర శాసనసభలో కూడా కోరమ్ 1/10 వంతే ఉంటుంది. కానీ తక్కువ శాసనసభ సభ్యులున్న రాష్ర్టాల్లో పది మంది సభ్యులు గాని 1/10 వంతు కాని ఏది ఎక్కువైతే దాన్ని తీసుకుంటారు.
ఎజెండా - సభలో చర్చించవలసిన కార్యక్రమాల పట్టికను ఎజెండా అంటారు. సభా కార్యక్రమాలు ఎజెండా ప్రకారమే నిర్వహిస్తారు. సభా వ్యవహారాల సలహా కమిటీ ఎజెండాను నిర్ణయిస్తుంది.
డిజల్యూషన్ (రద్దు)- ప్రభావం - లోక్‌సభ పదవీకాలం పూర్తయిన తర్వాత లేదా రాజకీయ అనిశ్చిత పరిస్థితి గల సమయంలో ప్రకరణ 85 ప్రకారం రాష్ట్రపతి సభను రద్దు చేస్తారు. కొత్త లోక్‌సభ కోసం ఎన్నికలు జరుగుతాయి.
లోక్‌సభ రద్దయినప్పుడు బిల్లులపై ప్రభావం - లోక్‌సభ పరిగణనలో ఉన్న బిల్లులు (లోక్‌సభలోనే ప్రవేశపెట్టినా లేదా రాజ్యసభ నుంచి లోక్‌సభ ఆమోదానికి వచ్చినా) రద్దవుతాయి.
- లోక్‌సభ చేత ఆమోదించబడి, రాజ్యసభ పరిగణనలో ఉన్న బిల్లులు రద్దవుతాయి.
- రాజ్యసభ పరిగణనలో ఉన్న బిల్లులు లోక్‌సభ ఆమోదానికి రానప్పుడు, ఆ బిల్లులు రద్దు కావు.
- ఉభయ సభల చేత ఆమోదించబడిన బిల్లులు రాష్ట్రపతి ఆమోదానికి పంపబడి ఈమధ్య సమయంలో లోక్‌సభ రద్దయినా బిల్లులు రద్దు కావు.
- ఉభయసభల చేత ఆమోదింపబడి, రాష్ట్రపతి అనుమతికి పంపిన బిల్లులను, రాష్ట్రపతి ఆ బిల్లులను పార్లమెంటు పునఃపరిశీలనకు పంపినప్పుడు కూడా బిల్లులు రద్దు కావు.
- ఒక బిల్లు విషయంపై ఉభయ సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడినప్పుడు, దాన్ని తొలగించడానికి రాష్ట్రపతి ఉభయసభల సంయుక్త సమావేశానికి నోటిఫికేషన్ ఇచ్చి ఉంటే అలాంటి బిల్లులు కూడా రద్దు కావు.
వాయిదా - సమావేశ మధ్య కాలంలో సభా కార్యక్రమాలను తాత్కాలికంగా నిర్ణీత వ్యవధి వరకు నిలిపివేసి ఆ తర్వాత కొనసాగిస్తారు. దీన్నే వాయిదా అంటారు. ఉదా: సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడినప్పుడు, భోజన విరామం, సెలవులు మొదలగు కారణాల వల్ల సభా కార్యక్రమాలను సభాధ్యక్షుడు నిలిపివేస్తారు.
నిరవధిక వాయిదా - సభా సమావేశాలను కాలపరిమితి తెలపకుండా నిరవధికంగా వాయిదా వేయడం. సభలను నిరవధికంగా వాయిదా వేసే అధికారం సభాధ్యక్షులకు ఉంటుంది.
దీర్ఘకాలిక వాయిదా - సభా సమావేశాలు పరిసమాప్తం కావడం లేదా సభా సమావేశాలు ముగియడాన్ని దీర్ఘకాలిక వాయిదా అంటారు. దీన్ని రాష్ట్రపతి లేదా గవర్నర్ లాంఛనప్రాయంగా ప్రకటిస్తారు. బిల్లులపై ఎలాంటి ప్రభావం ఉండదు. కానీ నోటీసులు రద్దవుతాయి.
ప్రశ్నోత్తరాల సమయం
- పార్లమెంటు ఉభయ సభల్లో ప్రతిరోజు మొదటి గంటను ప్రశ్నోత్తరాలకు కేటాయిస్తారు. సభాధ్యక్షులకు సభ్యులు నోటీసు ఇచ్చి వివిధ అంశాలపై ప్రశ్నలు అడగవచ్చు. సంబంధిత మంత్రులు వీటికి సమాధానం చెబుతారు. ఈ ప్రశ్నలు మూడు రకాలు.
- ఒక సభ్యుడు ఒకరోజుకు నక్షత్ర, నక్షత్రం గుర్తులేని ప్రశ్నలు కలిపి 10 వరకు సభ ముందుకు తీసుకురావచ్చు. అయితే ఐదు ప్రశ్నలే ఆమోదిస్తారు.
గమనిక: అవసరమైతే దీన్ని నిర్ణీత సమయం కంటే ముందుగానే రద్దు చేయవచ్చు. అలాగే చేపట్టకపోవచ్చు. ఉదా: కొవిడ్-19 నేపథ్యంలో పార్లమెంటులో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. అలాగే చైనా, పాక్ యుద్ధ సమయంలో కూడా దీన్ని రద్దు చేశారు.
నక్షత్ర గుర్తు గల ప్రశ్నలు - నక్షత్ర గుర్తుగల ప్రశ్నలకు సంబంధిత మంత్రులు మౌఖిక సమాధానాలు ఇస్తారు. ప్రశ్నల ప్రాధాన్యతను బట్టి సభాధ్యక్షులు నక్షత్ర గుర్తులు ఇస్తారు. నక్షత్రగుర్తు ఆ ప్రశ్నలకు ఉండటం వల్ల వాటిని నక్షత్ర గుర్తుగల ప్రశ్నలు అంటారు. నక్షత్ర గుర్తు ప్రశ్నల సమయంలో ఒకటి లేదా రెండు అనుబంధ ప్రశ్నలు కూడా అడగవచ్చు. రోజుకు సభలో సుమారు 20 వరకు నక్షత్ర గుర్తుగల ప్రశ్నలు సభ ముందు ఉంటాయి.
స్వల్ప వ్యవధి ప్రశ్నలు - అత్యవసర ప్రజా ప్రాముఖ్యం గల విషయంపై మౌఖికంగా అడిగే ప్రశ్నలను స్వల్ప వ్యవధి ప్రశ్నలు అంటారు. సాధారణంగా ఈ ప్రశ్నలకు 10 రోజుల ముందు నోటీసు ఇవ్వాలి.
జీరో అవర్ (శూన్య కాలం)
- జీరో అవర్ అనే పదం పార్లమెంటరీ నియమాల్లో పద్ధతుల్లో పేర్కొనలేదు. ఇది పత్రికలు సృష్టించిన పదం. భారత పార్లమెంటరీ ప్రక్రియలో స్వతహాగా ఏర్పాటు చేసుకున్న పద్ధతి. ప్రశ్నోత్తరాల సమయం తర్వాత ఇతర సభాకార్యక్రమాల ప్రారంభానికి ముందున్న కొద్ది కాలాన్ని జీరో అవర్ అంటారు. సభాధ్యక్షుని విచక్షణ మేరకు ఇది పాటిస్తారు. నిర్ణీత గడువు ఉండదు. ఈ సమయంలో ముందస్తు నోటీసు లేకుండా సభ్యులు ప్రశ్నలను అడగవచ్చు. కానీ సమాధానానికి పట్టుపట్టరాదు. ఈ పద్ధతిని 1960 నుంచి పాటిస్తున్నారు.
- మొదట రాజ్యసభలో ఆ తర్వాత లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 2009 తర్వాత దీని కోసం ఉదయం 9.30లకు ముందు నోటీసు ఇవ్వాలని షరతు పెట్టారు.
అర్ధగంట చర్చ - సభలో అంతకుముందు లేవనెత్తిన విషయం నుంచి ఉద్భవించే కొన్ని ప్రశ్నలపై జరిగే చిన్న చర్చను అర్ధగంట చర్చ అంటారు. సాధారణంగా లోక్‌సభలో వారంలో మూడు రోజుల్లో చివరి అర్ధగంటపాటు చర్చ జరుగుతుంది.
- రాజ్యసభలో రోజూ సాయంత్రం మూడు నుంచి ఐదు మధ్య చర్చ జరుగుతుంది. బడ్జెట్ సమావేశం జరుగుతున్నప్పుడు ఈ చర్చ ఉండవచ్చు.
- ఒక సమస్యపై చర్చ లేవనెత్తాలనుకున్న సభ్యుడు, ఆ మేరకు సభ సెక్రటరి జనరల్ ను లిఖితపూర్వకంగా కోరాల్సి ఉంటుంది.
సావధాన తీర్మానం - ఇది కూడా భారత్ స్వతహాగా ఏర్పాటు చేసుకున్న ప్రక్రియ. 1954 నుంచి దీన్ని ఉపయోగిస్తున్నారు. దీన్ని పార్లమెంటరీ నియమాల్లో పేర్కొనడం జరిగింది. సభాధ్యక్షుల అనుమతితో, అత్యంత ముఖ్యమైన, ప్రజా సంబంధ విషయంపై ప్రభుత్వం నుంచి అధికారపూర్వక సమాధానాన్ని రాబట్టడానికి సభ్యుడు ఈ తీర్మానాన్ని వినియోగిస్తారు.
- సంబంధిత మంత్రి ఆ విషయంపై ఒక ప్రకటన చేస్తారు. ఈ తీర్మానంపై చర్చ ఉండదు. ఓటింగు, ప్రభుత్వంపై విమర్శ ఉండదు. ఒక సభ్యుడు ఒక సమావేశంలో రెండు కంటే ఎక్కువ నోటీసులు ఇవ్వరాదు.
వాయిదా తీర్మానం
- ఇది అత్యంత శక్తిమంతమైన తీర్మానం. దీన్ని లోక్‌సభలోనే ప్రవేశపెట్టాలి. ఇందుకోసం 50 మంది సభ్యులు సంతకాలు చేసి స్పీకర్‌కు/సెక్రటరీ జనరల్‌కు లిఖితపూర్వకంగా ఆ రోజు ఉదయం 10 గంటలలోపు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని స్పీకర్ అనుమతించవచ్చు లేదా నిరాకరించవచ్చు.
- అత్యంత ముఖ్యమైన సమకాలీన ప్రజా సమస్య వైపు సభ దృష్టిని మరలించడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఈ తీర్మానంలో చర్చ, ఓటింగు ఉంటుంది.
- ఓటింగ్ నెగ్గితే ప్రభుత్వం తీవ్ర అభిశంసనకు గురి అవుతుంది. కానీ రాజీనామా చేయవలసిన అవసరం లేదు. చర్చ ముగిసేంతవరకు సాధారణంగా సభను వాయిదా వేయరు.
- వాయిదా తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టాలంటే కొన్ని పరిమితులు ఉంటాయి. వాయిదా తీర్మానంలో అంశం సమకాలీన ప్రజా ప్రాముఖ్యత కలిగి ఉండాలి.
- ఒక విషయం కంటే ఎక్కువ విషయాలు ఉండరాదు. సమావేశంలో చర్చించిన లేదా న్యాయ స్థానాల పరిగణనలో ఉన్న అంశాలను, ఒక ప్రత్యేకమైన తీర్మానంలో చర్చించదగిన విషయం ఇందులో ఉండరాదు.
అవిశ్వాస తీర్మానం - దీన్ని అంతిమ తీర్మానం అని కూడా అంటారు. ప్రకరణ 75 ప్రకారం మంత్రులు సంయుక్తంగా లోక్‌సభకు బాధ్యత వహిస్తారు. అంటే లోక్‌సభలో మెజారిటీ సభ్యుల విశ్వాసం ఉన్నంతవరకే మంత్రిమండలి అధికారంలో కొనసాగుతుంది.
- ఈ తీర్మానాన్ని కూడా లోక్‌సభలోనే ప్రవేశపెట్టాలి. ఇందుకోసం 50 మంది సభ్యులు సంతకాలు చేసిన నోటీసును స్పీకరుకు ఇవ్వాలి. అలాగే 50 మంది సభ్యులకు తక్కువ కాకుండా సభలో సభ్యులు ఆ తీర్మానానికి మద్దతిస్తున్నట్లు ప్రకటించాల్సి ఉంటుంది.
- అనుమతించిన తర్వాత పది రోజుల లోపు స్పీకర్ నిర్ణయించిన తేదీలో తీర్మానంపై చర్చ ఉంటుంది. ఓటింగు కూడా ఉంటుంది. హాజరై ఓటు వేసిన వారిలో మెజారిటీ సభ్యులు ఆమోదిస్తే ప్రభుత్వం పడిపోతుంది లేదా రాజీనామా చేస్తుంది.
- అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ప్రత్యేక కారణాన్ని సూచించాల్సిన అవసరం లేదు. ఈ తీర్మానం గురించి రాజ్యాంగంలో ప్రత్యక్షంగా పేర్కొనలేదు. కానీ పార్లమెంటరీ ప్రక్రియలో రూల్ నంబర్ 198లో ప్రస్తావించారు.
- ఎన్ని సార్లయినా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టొచ్చు. తీర్మానం వీగిపోతే అదే సమావేశంలో మరోసారి దీన్ని ప్రవేశపెట్టడానికి వీలులేదు.
- ఇంతవరకు లోక్‌సభలో 27 సార్లు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టారు. మొదటిసారి 1962లో నెహ్రూ ప్రభుత్వంపై ప్రవేశపెట్టారు. కానీ చర్చకు రాలేదు.
- రెండోసారి 1963లో నెహ్రూ ప్రభుత్వంపై (జె.బి. కృపలాని) అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా వీగిపోయింది.
- అవిశ్వాస తీర్మానాన్ని అత్యధికంగా ఇందిరాగాంధీపై 12 సార్లు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత పీవీ నరసింహారావుపై మూడు సార్లు, లాల్ బహదూర్ శాస్త్రిపై మూడుసార్లు ప్రవేశపెట్టారు. ఇంతవరకు ఏ ప్రధాని కూడా అవిశ్వాస తీర్మానాల ద్వారా తొలగించబడలేదు.
గమనిక: 16వ లోక్‌సభలో తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. 2018 జూలై 19, 20 తేదీల్లో ఓటింగ్ జరిగింది. 451 మంది ఓటు వేశారు. 126 మంది అనుకూలంగా, 325 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. తీర్మానం వీగిపోయింది.
విశ్వాస తీర్మానం - ఈ ప్రక్రియ గురించి రాజ్యాంగంలో కాని, పార్లమెంటరీ నియమ నిబంధనల్లో గాని ప్రస్తావించలేదు. అవిశ్వాస తీర్మానంతో సమానంగా భావిస్తారు. అయితే తీర్మానాన్ని ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది. అధికారంలో ఉన్న పార్టీ కొన్ని కారణాల వల్ల మెజారిటీ కోల్పోతే, తన మెజారిటీని నిరూపించుకోమని ప్రధానమంత్రిని రాష్ట్రపతి కోరతారు.
జీబీకే పబ్లికేషన్స్
హైదరాబాద్, 9959361278
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు