BIOLOGY | పర్యావరణ కాలుష్యం.. జీవుల మనుగడకు ఆటంకం
BIOLOGY TSPSC Special | ప్రజలు, ప్రపంచమంతా సవాళ్లతో కూడిన పర్యావరణ సమస్యలను ప్రతిరోజు ఎదుర్కొంటున్నారు. వాటిలో కొన్ని జీవావరణాలను మాత్రమే ప్రభావితం చేస్తాయి. కాని కొన్ని ప్రపంచ గతినే మార్చేస్తున్నాయి. భూమి తీవ్ర పర్యావరణ సంక్షోభం అంచున ఉంది. ప్రస్తుత పర్యావరణ సమస్యలు భవిష్యత్తులో విపత్తులు, విషాదాల బారిన పడేటట్లు చేస్తాయి. వివేకంతో అత్యవసరంగా ఈ సమస్యలను పరిష్కరించకపోతే ప్రమాదానికి గురవుతాం.
ప్రపంచ పర్యావరణ సమస్యలు
కాలుష్యం
- మన చుట్టూ ఉండే వాతావరణంలోకి హానికరమైన పదార్థాలు విడుదలై తగిన కాలపరిమితి, అధిక గాఢతలను కలిగి పర్యావరణానికి నష్టం కలిగించే పదార్థాలను కాలుష్యం అంటారు. కాలుష్యాన్ని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.
సహజ కాలుష్యం: ప్రకృతిలో సహజ ప్రక్రియల వల్ల సంభవించేది.
కృత్రిమ కాలుష్యం: మానవుడి చర్యల వల్ల సంభవించేవి.
ప్రాథమిక కాలుష్యకాలు: ఇవి ఏ స్థితిలో పర్యావరణంలోకి ప్రవేశిస్తాయో అదే స్థితిలో పర్యావరణాన్ని కలుషితం చేస్తాయి.
ద్వితీయ కాలుష్యకాలు: ప్రాథమిక కాలుష్యకాలు మార్పుచెందడం వల్ల ఈ కాలుష్యకాలు ఏర్పడతాయి.
గాలి కాలుష్యం
- ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం గాలిలో ఉండే భౌతిక, రసాయన జీవ సంబంధ కారకాలు పరిమితికి మించితే గాలి సహజత్వంలో మార్పుకలిగి మానవుడికి, పర్యావరణానికి హాని కలగడమే వాయు కాలుష్యం. ప్రాథమిక గాలి కాలుష్య కారకాలు.
1. కార్బన్ మోనాక్సైడ్ 2. హైడ్రోకార్బన్లు 3. నైట్రోజన్ ఆక్సైడ్లు 4. సల్ఫర్ డై ఆక్సైడ్లు - దేశవ్యాప్తంగా పెరుగుతున్న వాయు కాలుష్యం దృష్ట్యా ఒక కాలుష్య సూచిక అవసరమని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2015 ఏప్రిల్‌లో జాతీయ వాయు కాలుష్య సూచికను ప్రారంభించింది.
- WHO నివేదిక ప్రకారం ప్రపంచంలోనే 20 మొదటి అత్యంత కాలుష్య నగరాల్లో 13 భారత్‌లోనే ఉన్నట్లు గుర్తించారు.
- భారత్‌లో వాహనాల కాలుష్యాన్ని తగ్గించడానికి 2020 ఏప్రిల్ నుంచి జాతీయస్థాయిలో BS (Bharath Stage-IV)ను వాడారు. అనంతరం దాన్ని BS-VIకి మార్చారు.
జల కాలుష్యం
- ప్రస్తుతం లేదా భవిష్యత్తులో మానవుడు తన అవసరాలన్నింటికి ఉపయోగించుకోవడానికి పనికిరాని, కనీస నాణ్యతలేని నీటిని కలుషిత నీరు అంటారు.
- నీటి భౌతిక, రసాయన, జీవ సంబంధమైన లక్షణాల్లో మార్పునకు దారితీసి జీవన వ్యవస్థలపై హానికరమైన ప్రభావాలు ఏర్పడటాన్ని నీటి కాలుష్యం అంటారు.
- మురుగునీరు దేశీయ వ్యర్థాలు మానవ ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడం వల్ల కలరా, టైఫాయిడ్, విరేచనాలు వంటి వ్యాధులు కలుగుతాయి.
- పారిశ్రామిక వ్యర్థాలు, సీసం, పాదరసం, కాడ్మియం వంటి లోహాలను కలిగి ఉండి జీవ వ్యవస్థపై వినాశకర ప్రభావాన్ని చూపుతాయి. ఇవి ఆర్సెనిక్ వంటి హానికరమైన రసాయనాలను కలిగి ఉంటాయి.
- లెడ్ (సీసం)- కాలేయం, మూత్రపిండ వ్యాధులు
- ఆర్సెనిక్- ఊపిరితిత్తుల క్యాన్సర్, పేగులో పుండ్లు
- కాడ్మియం- అతిసారం, మూత్రపిండాల్లో తిత్తులు, ఎముక సంబంధ రుగ్మతలు
- మెర్క్యురీ- నరాల సంబంధ రుగ్మతలు
- తాగునీటిలో అధిక నైట్రేట్ కారణంగా మీథియోగ్లోబినేమియా (Blue baby Syndrome) వ్యాధి సంక్రమిస్తుంది.
- తాగునీటిలో ఫ్లోరైడ్ అధికంగా ఉండటం వల్ల దంతాలు, ఎముకలు క్షీణించిపోయి ఫ్లోరోసిస్ వ్యాధి సంక్రమిస్తుంది.
- గంగానది కాలుష్యాన్ని తగ్గించడానికి అప్పటి ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ గంగా యాక్షన్ ప్లాన్ పేరిట రూ.1000 కోట్లతో హరిద్వార్ నుంచి కలకత్తా వరకు గంగా జలాలను శుద్ధిచేసే కార్యక్రమాన్ని చేపట్టారు.
ధ్వని కాలుష్యం
- కంపించే వస్తువుల ఉపరితలం నుంచి వెలువడే యాంత్రిక శక్తిని ధ్వని అంటారు.
- అవాంఛిత ప్రదేశంలో, అసమ్మతమైన శ్రావ్యయోగం కాని ధ్వనుల వల్ల జీవుల ఆరోగ్యానికి హాని కలగడాన్ని ధ్వని కాలుష్యం అంటారు.
- ధ్వని తీవ్రతను డెసిబెల్స్ (dB) ప్రమాణాలతో కొలుస్తారు.
- ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని ఏటా మార్చి 3న నిర్వహిస్తారు.
- ధ్వని కాలుష్య ప్రభావానికి సంబంధించి కాలుష్య నివారణ చట్టం-1974, పర్యావరణ చట్టం-1986 ప్రవేశపెట్టారు.
భూతాపం (గ్లోబల్ వార్మింగ్)
- శిలాజ ఇంధనాల వినియోగం ఫలితంగా గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులకు కారణమైన మీథేన్, కార్బన్ డై ఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ వంటి గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారం జరుగుతుంది. గ్లోబల్ వార్మింగ్ మహా సముద్రాల ఉష్ణోగ్రత, భూ ఉపరితల ఉష్ణోగ్రతకు దారితీసి ధ్రువ ప్రాంతాలోల మంచు కరగడం, సముద్ర మట్టం పెరగడం, వరదలు, అధిక మంచు లేదా ఎడారీకరణ వంటి అసహజ పరిస్థితులు సంభవిస్తాయి. ప్రపంచ దేశాలు సౌర, గాలి, బయోగ్యాస్, భూశక్తి వంటి పునరుత్పాదక శక్తి వనరులు ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి.
- అధిక జనాభా, సహజ వనరుల క్షీణత, వ్యర్థాల నిర్మూలన, వాతావరణ మార్పు, జీవ వైవిధ్య నాశనం, అటవీ నిర్మూలన, సముద్ర జలాల ఆమ్లీకరణం, ఓజోన్ పొర క్షీణత, ఆమ్ల వర్షాలు, జన్యు మార్పిడికి చెందిన ఆహారాలు ప్రధాన సమస్యలుగా గుర్తించారు.
ఓజోన్ పొర క్షీణత - ఓజోన్ పొర మన గ్రహం చుట్టూ రక్షణ కవచంలా ఉండి సూర్యుడి నుంచి విడుదలయ్యే హానికరమైన అతినీలలోహిత కిరణాల నుంచి మనల్ని రక్షించే అదృశ్యపొర.
- ఓజోన్ ఫార్ములా O3. ఇది మూడు ఆక్సిజన్ పరమాణువుల కలయిక వల్ల ఏర్పడుతుంది.
- ఓజోన్ను డాబ్సన్ యూనిట్లలో కొలుస్తారు. ఈ పరికరాన్ని డాబ్సన్ స్పెక్ట్రో మీటర్ అంటారు.
- క్లోరో ఫ్లోరో కార్బన్లు (CFC)ల ద్వారా ఓజోన్ పొర నాశనమవుతుంది.
- ఇవి ఎక్కువగా రిఫ్రిజిరేటర్స్, ఏసీ, మంటలను ఆర్పే సిలిండర్లలో వాడే సాల్వెంట్లలో అధికంగా ఉపయోగిస్తారు.
- నైట్రిక్ ఆక్సైడ్ (NO) కూడా ఓజోన్ పొర క్షీణతకు కారణమే.
- క్లోరిన్ కన్నా ప్రమాదకరమైనది బ్రోమిన్. క్లోరిన్ కన్నా ఇది 100 రెట్లు అధికంగా ఓజోన్ పొరను నాశనం చేస్తుంది.
ఆమ్ల వర్షాలు
- పరిశ్రమల నుంచి విడుదలయ్యే వ్యర్థాలు, థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు మండించడం ద్వారా, వాహనాల నుంచి నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్స్ లాంటి కాలుష్యకాలు విడుదలై వాతావరణంలో తేమతో చర్యనొంది సల్ఫ్యూరిక్ ఆమ్లం, నత్రికామ్లం, హైడ్రోక్లోరిక్ ఆమ్లంగా మారి వర్షపు నీటితో కలిసి భూమిని చేరడాన్ని ఆమ్ల వర్షాలు అంటారు.
- ఆమ్ల వర్షం అనే పదాన్ని మొదటగా వాడినది రాబర్ట్ ఆంగోస్ స్మిత్.
- వర్షపు నీటి PH విలువ 5-6 కన్నా తక్కువగా ఉంటే దాన్ని ఆమ్ల వర్షంగా పరిగణిస్తారు.
- ఆమ్ల వర్షాల కారణంగా చారిత్రక కట్టడాలపై పగుళ్లు, గుంతలు ఏర్పడి అంద విహీనంగా పసుపు లేదా నలుపు రంగులోకి మారుతున్నాయి.
- మధురైలోని నూనె శుద్ధి కర్మాగారం నుంచి వెలువడిన వాయువులు ఆమ్ల వర్షానికి కారణమై ప్రపంచ ఖ్యాతి గాంచిన పాలరాతి కట్టడంఒ తాజ్‌మహల్ కళావిహీనమైపోతుంది.
- భారత్‌లో 1974లో మొదటగా ఆమ్ల వర్షాలు ముంబైలో కురిశాయి.
ప్రపంచ పర్యావరణ విపత్తులు
చెర్నోబిల్ – అణువిద్యుత్ కేంద్రం
- 1986 ఏప్రిల్ 26న చెర్నోబిల్ అణువిద్యుత్ కేంద్ర అగ్ని ప్రమాదాన్ని ఘోరమైన విస్ఫోటనంగా పరిగణిస్తారు. ఈ ప్రమాదంలో 50 మంది సిబ్బంది తక్షణమే మరణించారు. ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్ ఘటన హిరోషిమా ఘటన సమయంలో విడుదలైన రేడియేషన్ కన్నా 400 రెట్లు ఎక్కువ. రేడియోధార్మిక పదార్థాల విస్తృతమైన వ్యాప్తితో 4000 కన్నా ఎక్కువ మంది క్యాన్సర్ వల్ల మరణించారు. ఆ ప్రాంతం వద్ద రేడియోధార్మిక స్థాయిలు ఇప్పటికే ఎక్కువగా ఉన్నాయి.
యూనియన్ కార్బైడ్ – భోపాల్ దుర్ఘటన
- 3 డిసెంబర్ 1984లో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో గల యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ పురుగుల మందుల ప్లాంట్ ప్రమాదకరమైన రీతిలో ఒక ఘోరమైన రసాయనిక పొగను విడుదల చేసింది. అది 5000 కన్నా ఎక్కువ మంది మరణానికి కారణమైంది. వీరందరూ ప్రాణాంతక విషం మిథైల్ ఐసోసైనైట్ బాధితులయ్యారు.
మినిమేటా వ్యాధి దుర్ఘటన
- చిస్సో కార్పొరేషన్ అనే పరిశ్రమ 1932 నుంచి 1968 వరకు మిథైల్ మెర్క్యూరీని కలిగి ఉన్న పారిశ్రామిక వ్యర్థాన్ని మినిమేటా బే, జపాన్‌లోని షిరానుయ్ సముద్రంలో విడుదల చేసింది. అత్యంత విషపూరితమైన ఈ రసాయనం షెల్ చేప, ఇతర చేపల్లో పేరుకుపోయింది. ఆ చేపలను తిన్న స్థానిక ప్రజలు పాదరసం విషానికి బాధితులయ్యారు. మినిమేటా వ్యాధి ఫలితంగా 2000 మంది ప్రజలు చనిపోయారు. మరో 10 వేల మంది తీవ్ర వ్యాధిగ్రస్థులయ్యారు.
అంతర్జాతీయ పర్యావరణ సదస్సులు
- మాంట్రియల్ ప్రొటోకాల్: ఓజోన్ పొరకు కలుగుతున్న హానిని అరికట్టేందుకు 1987 సెప్టెంబర్ 16న కెనడాలోని మాంట్రియల్లో ప్రపంచ దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ మాంట్రియల్ ప్రొటోకాల్ 1989 జనవరి 1నుంచి అమలులోకి వచ్చింది. ఈ ప్రొటోకాల్‌పై భారత్ 1992లో సంతకం చేసింది. ఈ ఒప్పందానికి గుర్తుగా సెప్టెంబర్ 16ని ఓజోన్ పరిరక్షణా దినోత్సవంగా జరుపుకొంటారు.
- కిగాలి ఒప్పందం: ఈ ఒప్పందం మాంట్రియల్ ప్రొటోకాల్ ఒప్పందానికి జరిగిన సవరణ. 2016 అక్టోబర్‌లో రువాండా రాజధాని కిగాలిలో 197 దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. గ్లోబల్ వార్మింగ్‌కు కారణయ్యే క్లోరోఫ్లోరో కార్బన్ల ఉత్పత్తి, వినియోగాన్ని ఆపివేయడం ఫలితంగా 2100 నాటికి 0.4 డిగ్రీ సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రత తగ్గింపు ఈ ఒప్పందం లక్ష్యం.
పర్యావరణ పండగలు
- సాంగాయ్ పండుగ: ఇది మణిపూర్‌లో ప్రతి సంవత్సరం నవంబర్ 21-30 వరకు పర్యాటక విభాగం నిర్వహించే పండుగ.
- దీన్ని మణిపూర్ రాష్ట్ర జంతువైన సాంగాయ్ జింక పేరు మీదుగా నిర్వహిస్తారు.
- హార్న్ బిల్ ఫెస్టివల్: ఇది నాగాలాండ్ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 1 నుంచి 10 వరకు జరుపుకొనే ఒక పవిత్రమైన, సంప్రదాయాలు, వారసత్వాన్ని సుస్థిరపరుచుకునే పండుగ. దీన్నే 2000 సంవత్సరం నుంచి నాగా గిరిజనులు హార్న్‌బిల్ పక్షి పేరు మీద నిర్వహిస్తున్నారు.
- గుడ్ల గూబల ఫెస్టివల్: దేశంలో మొదటిసారిగా ఈ ఫెస్టివల్‌ను 2018 నవంబర్‌లో ఈల ఎన్జీవో ఫౌండేషన్ వారు పుణెలో నిర్వహించారు.
- గుడ్లగూబలపై అవగాహన కల్పించడం, మూఢ నమ్మకాలను పారదోలడం దీని ముఖ్య ఉద్దేశం.
ఏవీ సుధాకర్
స్కూల్ అసిస్టెంట్
జడ్పీహెచ్ఎస్
లింగంపల్లి(మంచాల)
రంగారెడ్డి జిల్లా
sudha.avanchi@gmail.com
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు