Home
Study Material
Indian Geography Group-1 Special | జెట్ స్ట్రీమ్స్ – వర్షపాత విస్తరణ – బృహత్ మైదానాలు
Indian Geography Group-1 Special | జెట్ స్ట్రీమ్స్ – వర్షపాత విస్తరణ – బృహత్ మైదానాలు
భారతదేశ శీతోష్ణస్థితిని ఎక్కువ ప్రభావితం చేసే జెట్ స్ట్రీమ్స్ గురించి వివరించండి?
- దేశంలో రుతుపవన వ్యవస్థను ఏర్పరచడంలో జెట్‌స్ట్రీమ్స్ ప్రధాన పాత్ర పోషిస్తూ, నైరుతి రుతుపవనాల పురోగమనానికి తోడ్పడతాయి.
- జెట్ స్ట్రీమ్స్ అంటే వ్యాపార పవనాలకు వ్యతిరేక దిశలో ట్రోపో ఆవరణ పై సరిహద్దున (6-9 కి.మీ. మధ్యన) పశ్చిమ పవనాలననుసరించి, పశ్చిమం నుంచి తూర్పునకు అత్యంత వేగంతో వంకర్లు తిరుగుతూ కదిలే జియోస్ట్రోపిక్ పవనాలు. వీటి వేగం శీతాకాలంలో గంటకు దాదాపు 180 కి.మీ.ల వేగంతో, వేసవికాలంలో దాదాపు 110 కి.మీ. వేగంతో కదులుతూ ఉంటాయి.
- ఇవి భారతదేశంలో రుతుపవన వ్యవస్థను ఏర్పరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. జెట్ ప్రవాహాలు వేసవిలో ఉత్తరానికి జరిగి నైరుతి రుతుపవనాలు ఇండియాలోకి ప్రవేశించడానికి తోడ్పడతాయి. అదేవిధంగా శీతాకాలంలో దక్షిణానికి జరిగిన ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించడానికి సహకరిస్తుంది.
- ఇవి వీచే భౌగోళిక ప్రాంతాన్ని అనుసరించి వీటిని 5 రకాలుగా విభజించారు. అవి..
1) తూర్పు జెట్‌స్ట్రీమ్
2) పశ్చిమ జెట్‌స్ట్రీమ్
3) పోలార్ ఫ్రంట్ జెట్‌స్ట్రీమ్
4) పోలార్ నైట్ జెట్‌స్ట్రీమ్
5) సోమాలియాలో లెవల్ జెట్‌స్ట్రీమ్ - భారతదేశం మీద ప్రధానంగా మొదటి రెండు జెట్స్ట్రీమ్ల ప్రభావం ఉంటుంది. అవి..
తూర్పు జెట్‌స్ట్రీమ్ - వీటిని ఆఫ్రికన్ జెట్‌స్ట్రీమ్స్ అని కూడా పిలుస్తారు. ఇవి దేశంలో రుతుపవన విస్పోటనానికి, పురోగమనానికి తోడ్పడతాయి. 6 నుంచి 9 కి.మీ.ల ఎత్తులో భారత్ నుంచి పశ్చిమ ఆఫ్రికా వైపు ప్రయాణిస్తూ నైరుతి రుతుపవనాల పురోగమనానికి తోడ్పడతాయి. ఇవి 5 డిగ్రీల నుంచి 20 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య వీస్తాయి.
- ఇవి జూన్‌లో ప్రారంభమై సెప్టెంబర్ మొదటి వారం వరకు వీస్తాయి. నైరుతి రుతుపవనాలు మంగళూరు నుంచి కోల్‌కతా అక్షం వైపునకు (నైరుతి నుంచి ఈశాన్యం) భూ ఉపరితలం మీదుగా వీస్తూ ఉంటే, తూర్పు జెట్‌స్ట్రీమ్ కోల్‌కతా నుంచి మంగళూరు అక్షం దిశలో (ఈశాన్యం నుంచి నైరుతి) ట్రోపో ఆవరణం పై భాగంలో వీస్తూ ఉంటాయి.
- ఈ తూర్పు జెట్‌స్ట్రీమ్ టిబెట్ పీఠభూమిలో ఏర్పడిన అల్పపీడన గాలుల రూపమే. ఇవి అత్యంత వేగంతో వీస్తూ (60 కి.మీ./గంటకు లేదా 110 కి.మీ./గంటకు) నైరుతి రుతుపవనాల పురోగమనానికి తోడ్పడతాయి. అంటే టిబెట్ పీఠభూమిలోని గాలులను ఖాళీ చేయడం, తత్ఫలితంగా రుతుపవనాలు పురోగమిస్తాయి.
- తూర్పు జెట్‌స్ట్రీమ్స్ చల్లగా ఉండి పొడిగా ఉండే వాయురాశులు. తమ కింద ప్రయాణించే నైరుతి రుతుపవనాలను తాకినప్పుడు చల్లబడి వర్షానికి కారణమవుతున్నాయి. రుతుపవన కాలంలో సముద్రంలో ఏర్పడే వాయుగుండాలను భారతదేశం వైపునకు పురోగమించడానికి కారణమవుతాయి.
- జెట్ స్ట్రీమ్స్ అనేవి టిబెట్ ప్రాంతంలోని ఉష్ణోగ్రత, పీడన పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి. టిబెట్‌లో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటే అల్పపీడనం ఏర్పడి బలమైన రుతుపవనాలు, అల్ప ఉష్ణోగ్రతలు ఉంటే అధిక పీడన పరిస్థితి ఉండి బలహీనమైన రుతుపవనాలు ఏర్పడతాయి.
పశ్చిమ జెట్‌స్ట్రీమ్స్ - శీతాకాలంలో హిమాలయాలకు దక్షిణంగా అంటే 30 డిగ్రీల ఉత్తర అక్షాంశ ప్రాంతంలో పశ్చిమం నుంచి తూర్పు చైనా సముద్రం వైపు వీచే ఉప అయన రేఖ పశ్చిమ జెట్‌స్ట్రీమ్స్ ప్రభావం వల్ల మధ్యధరా సముద్ర ప్రాంతంలో ఏర్పడే అల్ప పీడనాలను భారతదేశ వాయవ్య ప్రాంతంలోకి లాగడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
- ఈ అల్పపీడనాలనే పశ్చిమ అలజడులు అని పిలుస్తారు. ఇవి గంటకు 185 కి.మీ. అత్యధిక వేగాన్ని కలిగి ఉంటాయి. శీతాకాలంలో ఆసియాలో ఉప ఉష్ణమండల పశ్చిమ జెట్‌స్ట్రీమ్స్ బలంగా వీస్తాయి. ఇవి ఈశాన్య రుతుపవనాల రాకకు కారణమవుతున్నాయి. ఇవి గంగా మైదాన ప్రాంతంలో శీతాకాల వర్షాలకు కారణమవుతాయి.
ముగింపు - ఈ జెట్ ప్రవాహాల ప్రభావం, భారత్‌లో ప్రధానంగా ఉంటుంది. తూర్పు జెట్‌స్ట్రీమ్స్ వల్ల నైరుతి రుతుపవనాలు, అలాగే పశ్చిమ జెట్‌స్ట్రీమ్స్ వల్ల ఈశాన్య రుతుపవనాలు బలంగా భారత్‌లోకి వీస్తాయి. ఫలితంగా భారత్‌లో సంవత్సర సరాసరి వర్షపాతానికి కారణంగా వీటిని చూస్తారు.
భారతదేశంలో వర్షపాత విస్తరణను తెలియజేయండి?
- భారత్‌లో వర్షపాత విస్తరణలో తీవ్రమైన వ్యత్యాసాలు కనిపిస్తాయి. ప్రపంచంలో అత్యధిక వార్షిక సగటు వర్షపాతం సంభవించే మాసిన్రామ్ (మేఘాలయ) భారతదేశంలోనే ఉంది. 25 డిగ్రీల అక్షాంశం వద్ద గల మాసిన్రాం 1187 సెం.మీ. వార్షిక వర్షపాతాన్ని నమోదు చేస్తుండగా, 26 డిగ్రీల అక్షాంశం వద్దగల జైసల్మేర్ (థార్ ఎడారిలో) 13 సెం.మీ. వార్షిక వర్షపాతాన్ని మాత్రమే పొందుతుంది.
- భారతదేశ వార్షిక సగటు వర్షపాతం 118.7 సెం.మీ.
1) రుతువులవారీగా వర్షపాత విస్తరణ - రుతువు వర్షపాతం వర్షపాత రకం
1) శీతాకాలం 2 శాతం చక్రవాత
2) వేసవి కాలం 10 శాతం సంవహన
3) నైరుతి రుతుపవన కాలం 75 శాతం పర్వతీయ
4) ఈశాన్య రుతుపవన కాలం 13 శాతం చక్రవాత
2) నెలలవారీగా వర్షపాత విస్తరణ
1) అత్యధిక వర్షపాతం నమోదయ్యే మాసం జూలై. 24.2 శాతం, మొత్తం వార్షిక వర్షపాతంలో వాటా.
2) ఆగస్టు నెలలో 21.2 శాతం, మొత్తం వార్షిక వర్షపాతంలో వాటా
3) సెప్టెంబర్ నెలలో 14.2 శాతం, మొత్తం వార్షిక వర్షపాతంలో వాటా
4) జూన్ నెలలో 13.8 శాతం, మొత్తం వార్షిక వర్షపాతంలో వాటా
5) అత్యల్ప వర్షపాతం డిసెంబర్, జనవరి మాసాల్లో నమోదవుతుంది.
3) వర్షపాత ప్రాంతీయ విస్తరణ - వర్షపాత విస్తరణను ఆధారంగా చేసుకొని దేశాన్ని 4 వర్షపాత ప్రాంతాలుగా విభజించవచ్చు.
1) అధిక వర్షపాత ప్రాంతాలు: 200 సెం.మీ.ల కంటే అధిక వర్షపాతం పడే ప్రాంతాలు.
ఎ) పశ్చిమ కనుమల పశ్చిమ వాలులు, తిరువనంతపురం నుంచి ముంబై వరకు గల పశ్చిమ తీరం.
బి) దక్షిణ షిల్లాంగ్ పీఠభూమి (మేఘాలయలోని గారో, ఖాసి, జయంతియా కొండల దక్షిణ భాగం).
సి) అసోం కొండల దక్షిణ భాగం (అసోం, మణిపూర్, త్రిపుర)
డి) అండమాన్, నికోబార్ దీవులు
2) మధ్యస్థ వర్షపాత ప్రాంతాలు: 100-200 సెం.మీ. వర్షపాతం పడే ప్రాంతాలు.
ఎ) పశ్చిమ కనుమల తూర్పువాలులు
బి) దక్కన్ పీఠభూమి పూర్వోత్తర భాగాలు (ఒడిశా, బీహార్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ర్టాల తూర్పు భాగం).
సి) ఉత్తర భారతదేశంలోని తూర్పు గంగా మైదానాలు (ఉత్తరప్రదేశ్, తూర్పు భాగం, పశ్చిమ బెంగాల్ భాగం)
డి) హిమాలయ ప్రాంతంలోని హిమాచల్ ప్రదేశ్, జమ్ముకశ్మీర్ ప్రాంతాలు
ఇ) హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లోని కొండ ప్రాంతాలు
ఎఫ్) మహారాష్ట్రలోని ఎక్కువ ప్రాంతం (విదర్భ పీఠభూమి కాకుండా)
జి) జార్ఖండ్, బీహార్‌లోని పీఠభూములు, మైదానాలు
హెచ్) తమిళనాడు, కోస్తా ఆంధ్ర తీరం, ఒడిశా తీరం
ఐ) అరేబియా సముద్రంలోని దీవులు
3) అల్ప వర్షపాత ప్రాంతాలు: 50-100 సెం.మీ. వర్షపాతం పడే ప్రాంతాలు.
ఎ) దక్కన్ పీఠభూమిలోని విశాలమైన లోపలి భాగం (ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర)
బి) పశ్చిమ మధ్యప్రదేశ్ ప్రాంతం
సి) పంజాబ్, హర్యానా, రాజస్థాన్, సౌరాష్ట్రల్లోని కొన్ని ప్రాంతాలు
డి) ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ప్రాంతం
ఇ) గుజరాత్ కచ్ ప్రాంతం
4) అత్యల్ప వర్షపాత ప్రాంతాలు: 50 సెం.మీ. కంటే తక్కువ వర్షపాత ప్రాంతాలు.
ఎ) పశ్చిమ రాజస్థాన్‌లోని థార్ ఎడారి ప్రాంతం, ఉత్తర గుజరాత్ ప్రాంతం. ఈ ప్రాంతంలో నైరుతి రుతుపవనాలు, ఆరావళి పర్వత శ్రేణులకు సమాంతరంగా ప్రయాణం చేయడంతో వర్షపాతం సంభవించదు.
బి) పశ్చిమ కనుమలకు తూర్పున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, మహారాష్ట్రలో మరాఠ్వాడ, విదర్భ, దక్షిణ కర్ణాటక పీఠభూమి ప్రాంతాలు పవన పరాన్ముఖ దిశలో ఉండటంతో వర్షాచ్ఛాయ ప్రాంతాలుగా రూపొందాయి. ఈ ప్రాంతంలో అల్ప వర్షపాతం సంభవిస్తుంది.
సి) దక్షిణ పంజాబ్, దక్షిణ హర్యానాల్లో కూడా వర్షపాతం తక్కువగా ఉంటుంది.
డి) లఢక్ ప్రాంతం
3. బృహత్ మైదానాలు లేదా గంగా- సింధూ- బ్రహ్మపుత్ర మైదాన ప్రాంతం ఉపరితల భూస్వరూపాలను, వాటి లక్షణాలను పేర్కొనండి?
- ద్వీపకల్ప పీఠభూమికి, హిమాలయాలకు మధ్య పశ్చిమాన సింధూ నది ముఖద్వారం నుంచి తూర్పున గంగానది ముఖద్వారం వరకు 3,400 కి.మీ. పొడవు, 150 నుంచి 300 కి.మీ.ల వెడల్పుతో ఉత్తర మైదానం విస్తరించి ఉంది. హిమాలయ, ద్వీపకల్ప నదులు తీసుకొచ్చిన ఒండ్రు మట్టి, ఒకప్పుడు మిగిలిపోయిన టెథిస్ భూ అభినీతిలో నిక్షేపితమవడంతో ఈ బృహత్ మైదానం ఏర్పడింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అభివృద్ధి మైదానం.
- ఇది దేశంలోనే అతి తక్కువ వయస్సుగల నైసర్గిక స్వరూపం. ఇది దేశ భూభాగంలో 7.5 లక్షల చ.కి.మీ. విస్తీర్ణాన్ని ఆక్రమించి చతుర్భుజీవ (క్వార్టనరీ) మహాయుగంలో 20-22 మిలియన్ల సంవత్సరాల క్రితం ‘ప్లీస్టోసిన్-హాలోసిన్’ కాలాల్లో ఏర్పడింది.
- బృహత్ మైదాన ఉపరితల భూస్వరూప లక్షణాలు, ఆ ప్రాంత భౌతిక, రసాయన సంఘటనల ఆధారంగా ఈ మైదానాన్ని 5 భాగాలుగా విభజించవచ్చు. అవి..
1) బాబర్: సింధూ-తీస్తా నదుల మధ్య శివాలిక్ శ్రేణుల పాదాల వెంట విసనకర్ర ఆకారంలో గులకరాళ్ల, అవ అశోణీకృత అవక్షేపాలు నిక్షేపించగా ఏర్పడిన ఒక సచ్ఛిద్ర పీట్ మౌంట్ మైదానం. ఇది పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లోని ఉత్తర మైదానాల సరిహద్దు వెంబడి 8-16 కి.మీ. వెడల్పుతో ఉన్న సన్నని మేఖల. ఈ ప్రాంత సచ్ఛిద్ర స్వభావం వల్ల హిమాలయ నదులు ఇక్కడికి రాగానే అందులోని నీరు ఇంకిపోయి నీటి పరిమాణం తగ్గుతుంది.
2) టెరాయ్: బాబర్ మండలంలో ఇంకిపోయిన నీరు దీనికి దిగువన పైకి పొంగి ప్రవహించడం వల్ల అక్కడ 15-30 కి.మీ. వెడల్పుతో ఏర్పడిన దట్టమైన అరణ్యాలతో కూడిన చిత్తడి ప్రదేశమే టెరాయ్. ఈ ప్రాంతం అడవులు వివిధ రకాల వన్య మృగాలకు నిలయంగా ఉండేవి. కానీ సింధూ నాగరికత కాలం నుంచి ఈ మైదాన ప్రాంతంలో జనాభా పెరిగింది. తద్వారా వారి ఆహార అవసరాలకు సాగు భూమి విస్తీర్ణం పెంచే క్రమంలో టెరాయ్ అడవులను చాలావరకు నిర్మూలించి వ్యవసాయ భూములుగా మార్చారు. ఇవి ప్రస్తుతం చెరకు, వరి, గోధుమ వ్యవసాయ ప్రాంతాలుగా మారిపోయాయి.
3) భంగర్: టెరాయ్కు దక్షిణంగా బృహత్ మైదానం పాత ఒండ్రుమట్టి అవక్షేపాలతో నిక్షేపితమై సారవంతంగా ఉండటంతో ఇవి వ్యవసాయాభివృద్ధికి నిలయంగా ఉన్నాయి.
4) ఖాదర్: ఇవి నదీ తీరాలను ఆనుకొని కొత్త ఒండ్రుమట్టితో ఏర్పడిన మైదానాల్లోని నిమ్న ప్రాంతాలు. ఇందులో బంక మన్ను తక్కువగా ఉండి, ఇసుక, బురద ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఇవి భంగర్ కంటే ఎక్కువ సారవంతమైనవి.
5) రే/కల్లార్/ఊసర్: రాజస్థాన్, దక్షిణ పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని కార్బోనేట్స్, బై కార్బోనేట్స్ లవణాలతో కూడిన చవుడు, లవణీయత, స్ఫటికీయ భూభాగాలు ఉన్నాయి.
జీ గిరిధర్
సివిల్స్ ఫ్యాకల్టీ
బీసీ స్టడీ సర్కిల్
హైదరాబాద్
9966330068
Previous article
Model Essays | మహిళలు సామాజిక సమస్యలు
Next article
TCIL Recruitment | టీసీఐఎల్‌లో మేనేజర్ పోస్టులు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు