ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్
జాతీయం
- ఉత్తర భారతదేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ (తేలియాడే) సోలార్ ప్రాజెక్టును పంజాబ్ గవర్నర్ బన్వారీలాల్ పురోహిత్ జనవరి 23న ప్రారంభించారు. చండీగఢ్‌లోని వాటర్ వర్క్స్‌లో 2000 కేడబ్ల్యూపీ సామర్థ్యంతో దీన్ని నిర్మించారు. అదేవిధంగా చండీగఢ్‌లోని ధనాస్ సరస్సు వద్ద ఏర్పాటు చేసిన ఫౌంటెయిన్లతో కూడిన 500 కేడబ్ల్యూపీ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టును కూడా ఆయన ప్రారంభించారు. వీటిని చండీగఢ్ రెన్యువబుల్ ఎనర్జీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రమోషన్ సొసైటీ (సీఆర్ఈఎస్టీ) ఏర్పాటు చేసింది.
ఐఎన్ఎస్ వాగీర్
- భారత నౌకాదళంలోకి కల్వరి తరగతికి చెందిన 5వ జలాంతర్గామి ఐఎన్ఎస్ వాగీర్ జనవరి 23న చేరింది. నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ సమక్షంలో ఇండియన్ నేవీకి అప్పగించారు. ప్రాజెక్ట్-75లో భాగంగా దీన్ని స్కార్పియన్ టెక్నాలజీతో, ఫ్రాన్స్ నేవల్ గ్రూప్ సహకారంతో మజగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించింది. వాగీర్ అంటే షార్క్ అని అర్థం.
షీ ఫీడ్స్ ది వరల్డ్
- పెప్సికో, కేర్లకు చెందిన ఫౌండేషన్లు ‘షీ ఫీడ్స్ ది వరల్డ్’ అనే కార్యక్రమాన్ని కోల్‌కతాలో జనవరి 24న ప్రారంభించాయి. వ్యవసాయ రంగంలో మహిళలు, బాలికల సాధికారత కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. వ్యవసాయ రంగంలో లింగ అసమానతలను తగ్గించేందుకు, వ్యవసాయ కుటుంబాలు స్థిరమైన ఆదాయాన్ని పొందేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. మొదట ఈ కార్యక్రమాన్ని పశ్చిమ బెంగాల్‌లోని కూచ్ బీహార్, అలీపూర్దూర్ జిల్లాల్లో అమలు చేయనున్నారు. దీని ద్వారా సుమారు 48,000 కంటే ఎక్కువ మంది మహిళలను మెరుగుపర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
అంతర్జాతీయ సదస్సు
- ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐ) ఢిల్లీలో 2వ అంతర్జాతీయ సదస్సును జనవరి 23, 24 తేదీల్లో నిర్వహించింది. ‘యూజ్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఎలక్షన్స్ ఇంటిగ్రిటీ’ అనే అంశంపై ఈ సదస్సును నిర్వహించారు. ‘సమ్మిట్ ఫర్ డెమోక్రసీ’పై 2021, డిసెంబర్లో వర్చువల్‌గా నిర్వహించిన సదస్సు నుంచి భారత్ నాయకత్వం వహిస్తుంది. దీంతో 2022 అక్టోబర్ 31, నవంబర్ 1 తేదీల్లో మొదటి అంతర్జాతీయ సదస్సును నిర్వహించారు. 17 దేశాల నుంచి 43 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు.
ఆరెంజ్ ఫెస్టివల్
- నాగాలాండ్, కొహిమా జిల్లాలోని రూసోమ గ్రామంలో 3వ ఆరెంజ్ ఫెస్టివల్‌ను జనవరి 24, 25 తేదీల్లో నిర్వహించారు. నారింజ రైతుల శ్రమకు గుర్తుగా ఈ పండుగను నిర్వహిస్తున్నారు. నారింజ ద్వారా ఆ రాష్ర్టానికి రూ.5 కోట్ల వరకు ఆదాయం వస్తుంది.
- కేరళలో బనానా ఫెస్టివల్, జాక్‌ఫ్రూట్ ఫెస్టివల్, మణిపూర్‌లో పైనాపిల్ ఫెస్టివల్, గోవాలో కొంకణ్ ఫ్రూట్ ఫెస్టివల్, మహారాష్ట్రలోని మహాబలేశ్వర్‌లో స్ట్రాబెర్రీస్ ఫెస్టివల్, విదేశాల్లో.. థాయిలాండ్‌లో పైనాపిల్ ఫెస్టివల్, కెనడాలో క్రాన్బెర్రీ ఫెస్టివల్, ఇటలీలో మేరీనో గ్రేప్ ఫెస్టివల్, అమ్‌స్టర్‌డామ్‌లో ఆరెంజ్ ఫెస్టివల్ నిర్వహిస్తారు.
టూరిజమ్ డే
- నేషనల్ టూరిజమ్ డే (జాతీయ పర్యాటక దినోత్సవం)ని జనవరి 25న నిర్వహించారు. 1948 నుంచి ఈ జాతీయ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సెప్టెంబర్ 27న, వరల్డ్ అగ్రి టూరిజమ్ డేని మే 15న యూఎన్వో ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.
సైక్లోన్-1
- భారత్-ఈజిప్ట్ సైనిక దళాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న 14 రోజుల ఎక్సర్సైజ్ ‘సైక్లోన్-1’ జనవరి 27న ముగిసింది. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ఈ ఎక్సర్సైజ్ను నిర్వహించారు. ఇరుదేశాల సైనిక నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడంతో పాటు సహకారం మరింత పెంపొందించుకోవడమే ఈ ఎక్సర్సైజ్ లక్ష్యం.
అంతర్జాతీయం
న్యూక్లియర్ స్పేస్‌క్రాఫ్ట్
- న్యూక్లియర్ థర్మల్ రాకెట్‌ను నాసా, డిఫెన్స్ అడ్వాన్స్డ్ రిసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ (డీఏఆర్‌పీఏ) సంయుక్తంగా రూపొందిస్తున్నట్లు నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ జనవరి 24న ప్రకటించారు. నాసా చేపట్టిన మిషన్ మార్స్‌లో భాగంగా ఈ న్యూక్లియర్ రాకెట్లను 2027 కల్లా పూర్తి చేయనున్నారు. వీటివల్ల స్పేస్‌క్రాఫ్ట్ వేగంగా ప్రయాణించడంతో పాటు వ్యోమగాములకు ఎలాంటి హాని జరగదు.
ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్
- స్వీడన్లో ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆ దేశ మైగ్రేషన్ మినిస్టర్ మారియా మాల్మర్ స్టెనెగార్డ్ జనవరి 25న వెల్లడించారు. స్వీడన్లోకి వచ్చే శరణార్థులను నిరోధించేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. 2019లో నోర్డిక్ దేశాల్లోకి వచ్చిన శరణార్థుల్లో 76 శాతం మంది స్వీడన్‌కు వచ్చారు. స్వీడన్‌కు కేటాయించే శరణార్థుల కోటాను తగ్గించాలని యునైటెడ్ నేషన్స్ రిఫ్యూజీస్ ఏజెన్సీ (యూఎన్హెచ్ఆర్సీఆర్)కి సిఫారసు చేశారు. స్వీడన్ 1950 నుంచి శరణార్థులను ఆహ్వానిస్తుంది.
కస్టమ్స్ డే
- ఇంటర్నేషనల్ కస్టమ్స్ డేని జనవరి 26న నిర్వహించారు. ప్రపంచ సరిహద్దుల గుండా వస్తువులను సజావుగా చేరవేయడంలో కస్టమ్స్ అధికారులు పోషించే పాత్ర, బాధ్యతలను గుర్తించడానికి ఏటా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. కస్టమ్స్ అధికారుల సామర్థ్యాన్ని పెంచేందుకు వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూసీవో)ను 1953, జనవరి 26న స్థాపించి, బెల్జియంలోని బ్రస్సెల్స్‌లో మొదటి సమావేశం నిర్వహించారు. దీనికి గుర్తుగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. దీన్ని మొదట కస్టమ్స్ కో ఆపరేషన్ కౌన్సిల్ (సీసీసీ)గా వ్యవహరించేవారు. ఈ ఏడాది దీని థీమ్ ‘నర్చరింగ్ ది నెక్ట్స్ జనరేషన్: ప్రమోటింగ్ ఏ కల్చర్ ఆఫ్ నాలెడ్జ్-షేరింగ్ అండ్ ప్రొఫెషనల్ ప్రైడ్ ఇన్ కస్టమ్స్’.
హోలోకాస్ట్ రిమెంబ్రన్స్ డే
- ఇంటర్నేషనల్ హోలోకాస్ట్ రిమెంబ్రన్స్ డే ని జనవరి 27న నిర్వహించారు. 1933-45లో హిట్లర్, అతని సైన్యం ద్వారా ఊచకోతకు గురైన 6 మిలియన్ల యూదు ప్రజల జ్ఞాపకార్థంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. యునైటెడ్ నేషన్స్ సంస్థ ఈ రోజున ఇంటర్నేషనల్ హోలోకాస్ట్ రిమెంబ్రన్స్ డేగా నిర్వహించాలని 2004లో నిర్ణయించింది.
క్రీడలు వైట్ కార్డ్
- ఫుట్‌బాల్ చరిత్రలో మొదటిసారి పోర్చుగల్ వైట్కార్డును వినియోగించింది. లిస్బన్లో జనవరి 21న బెన్ఫికా, లిస్బన్ (పోర్చుగీస్‌లో ఫుట్‌బాల్ జట్లు) మహిళా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఫెయిరీ ప్లేని గుర్తించడానికి ఈ వైట్ కార్డును ఉపయోగించారు. ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ప్రేక్షకుడు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడు. అతడికి వైద్య సహాయం అందించేందుకు రెండు జట్లకు చెందిన వైద్యులు స్టాండ్స్‌లోకి వెళ్లి చికిత్స అందించారు. వైద్యుల సేవలకు అభినందనగా రిఫరీ వైట్ కార్డును చూపించాడు. సందర్భంగా ఫిఫా ప్రపంచ కప్ ప్రారంభం (1970) నుంచి ఫుట్‌బాల్‌లో ఎవరైనా తప్పు (ఫౌల్ ప్లే) చేస్తే రిఫరీలు రెడ్, ఎల్లో కార్డులను చూపుతున్నారు. ఏదైనా తప్పు చేస్తే తొలిసారి హెచ్చరికగా ఎల్లో కార్డును, ఆట నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే ఆటగాడిని బయటికి వెళ్లమని రెడ్ కార్డును చూపిస్తారు.
ఇండియా ఓపెన్ బ్యాడ్మింటన్
- న్యూఢిల్లీలోని కేడీ జాదవ్ ఇండోర్ హాల్లో జరిగిన ఇండియా ఓపెన్ టూర్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీ జనవరి 22న ముగిసింది. ఈ టోర్నీ పురుషుల సింగిల్స్‌ను థాయిలాండ్ ఆటగాడు కున్లావుత్ వితిద్సర్న్ గెలుచుకున్నాడు. అతడు విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)పై గెలిచాడు.
- మహిళల టైటిల్‌ను ఆన్ సియాంగ్ (కొరియా) గెలుచుకుంది. ఆమె అకానె యమగూచి (జపాన్)పై గెలిచింది.
పురుషుల డబుల్స్‌లో లియాంగ్ కెంగ్-వాంగ్ చాంగ్ (చైనా), మహిళల డబుల్స్‌లో మత్సుయామా-చిహరు (జపాన్), మిక్స్డ్ డబుల్స్‌లో వతనబె-హిగషినొ (జపాన్) జంటలు విజేతలుగా నిలిచాయి.
ఐసీసీ అవార్డులు
- ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్)-2022 అవార్డులను జనవరి 24న ప్రకటించింది. టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా సూర్యకుమార్ యాదవ్, ఉమెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా తహలియా మెక్‌గ్రాత్ (ఆస్ట్రేలియా) ఎంపికయ్యారు.
- ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును మాక్రో జాన్సేన్ (సౌతాఫ్రికా), మహిళల్లో రేణుకా సింగ్ (భారత్) గెలుచుకున్నారు. అంపైర్ ఆఫ్ ది ఇయర్‌గా రిచర్డ్ ఇల్లింగ్రోత్ ఎంపికయ్యాడు. వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును బాబర్ ఆజం (పాకిస్థాన్), మహిళల్లో నాట్ సివర్ (ఇంగ్లండ్) గెలుచుకున్నారు.
- టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్) ఎంపికయ్యాడు.
ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును బాబర్ ఆజం, ఉమెన్స్ ఆఫ్ ది ఇయర్ అవార్డు నాట్ సివర్ గెలుచుకున్నారు. - అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెరార్డ్ ఎరాస్మస్ (నమీబియా), ఉమెన్స్ అసోసియేషన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఈషా ఓజా (యూఏఈ), స్పిరిట్ ఆఫ్ ది క్రికెటర్ అవార్డు ఆసిఫ్ షేక్ (నేపాల్)లకు లభించాయి.
వార్తల్లో వ్యక్తులు
విక్రమ్ దేవ్
- డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తదుపరి అధ్యక్షుడిగా విక్రమ్ దేవ్ దత్‌ను నియమిస్తూ క్యాబినెట్ నియామకాల కమిటీ జనవరి 21న ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన 1993 బ్యాచ్ ఏజీఎంయూటీ (అరుణాచల్‌ప్రదేశ్, గోవా, మిజోరం, కేంద్రపాలిత ప్రాంతం) కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఈయన ఫిబ్రవరి 28న బాధ్యతలు చేపడతారు. ప్రస్తుతం ఈ పదవిలో అరుణ్‌కుమార్ ఉన్నారు.
మధు
- అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) నూతన అధ్యక్షురాలిగా మధు బొమ్మినేని జనవరి 21న ఎన్నికయ్యారు. లాస్‌వెగాస్‌లోని ది మిరాగ్లో జరిగిన ఆటా బోర్డు మీటింగ్‌లో గత అధ్యక్షుడు భువనేశ్ బూజుల కొత్త అధ్యక్షురాలికి బాధ్యతలు అప్పగించారు. ఆమె 2004 నుంచి ఆటాలో సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వంటి అనేక పదవులు నిర్వర్తించారు.
అమృత్ ప్రీత్
- బటాలా (పంజాబ్) నగరానికి చెందిన అమృత్ ప్రీత్ 120 గంటల పాటు నిర్విరామంగా తబలా వాయించి ఇండియాస్ వరల్డ్ రికార్డ్స్‌లో జనవరి 24న చోటు సంపాదించారు. వరుసగా 5 రోజులు తబలా వాయించి ఈ రికార్డు నెలకొల్పారు. గతేడాది డిసెంబర్ 31న ఉదయం 11 గంటలకు తబలా వాయించడం ప్రారంభించి, జనవరి 5న ఉదయం 11 గంటలకు ముగించారు. ఇంతకు ముందు ఈ ప్రపంచ రికార్డు 110 గంటలు ఉంది.
రాజేశ్ సుబ్రమణియమ్
- భారత సంతతికి చెందిన రాజేశ్ సుబ్రమణియమ్‌కు హొరాటియో ఆల్గర్ అవార్డు-2023 జనవరి 24న లభించింది. ఈయన ఫెడెక్స్ సీఈవోగా పనిచేస్తున్నారు. ఉత్తర అమెరికాలో వ్యాపార, పౌర, సాంస్కృతిక రంగాల్లో ప్రతిభ చూపిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ఫెడెక్స్‌ను ఫ్రెడరిక్ డబ్ల్యూ స్మిత్ 1971లో ప్రారంభించారు.
Previous article
ప్రజల సంక్షేమానికి జీడీపీ పరిమితులను వివరించండి?
Next article
సామాజిక రక్షణ..సాధారణ బీమా
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు