క్రీడాంశాలు
ఫిఫా
- ఫిఫా ప్రపంచకప్‌ను అర్జెంటీనా గెలుచుకుంది. తుదిపోరులో ఫ్రాన్స్‌ను ఓడించింది. ఈ టోర్నీని ఖతార్‌లో నిర్వహించారు. నవంబర్ 20న ప్రారంభమై డిసెంబర్ 18న ముగిసింది. ఈ టైటిల్‌ను అర్జెంటీనా గెలవడం ఇది మూడోసారి. ఈ ఏడాది నిర్వహించింది 22వ ప్రపంచ కప్. అరబ్ ప్రపంచంలో టోర్నీ జరగడం ఇదే తొలిసారి. మొత్తం 32 జట్లు ఇందులో పాల్గొన్నాయి.
టోర్నీ అవార్డులు..
- గోల్డెన్ బూట్ (అత్యధిక గోల్స్): కైలియన్ ఎంబాపే (ఫ్రాన్స్)
- గోల్డెన్ బాల్ (ఉత్తమ ప్లేయర్): లియోనల్ మెస్సీ (అర్జెంటీనా). మెస్సీ ఈ అవార్డును పొందడం రెండోసారి. 2014 ప్రపంచకప్‌లోనూ గోల్డెన్ బాల్ అవార్డు పొందాడు.
- గోల్డెన్ గ్లోవ్ (ఉత్తమ గోల్ కీపర్): ఎమిలియానో మార్టినెజ్ (అర్జెంటీనా)
అండర్-17 మహిళల ప్రపంచకప్
- ఫిఫా అండర్-17 మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో స్పెయిన్ విజేతగా నిలిచింది. తుదిపోరు అక్టోబర్ 30న జరిగింది. కొలంబియా జట్టును స్పెయిన్ ఓడించింది.
టీ-20 ప్రపంచకప్
- ఈ టోర్నీని అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు ఆస్ట్రేలియాలో నిర్వహించారు. ఇంగ్లండ్ జట్టు విజేతగా ఆవిర్భవించింది. తుదిపోరులో పాకిస్థాన్‌ను ఓడించింది. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా సామ్ కరన్ నిలిచాడు.
టోర్నీలో రికార్డులు..
- విరాట్ కోహ్లీ: టీ-20 అంతర్జాతీయ పోటీల్లో 4000 పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు.
- సూర్యకుమార్ యాదవ్: ఒక క్యాలెండర్ ఇయర్లో టీ-20లో 1000 పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. టీ-20 ప్రపంచకప్‌లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఆయన ఈ ఘనత సాధించాడు.
కామన్వెల్త్ క్రీడలు
- 2022 కామన్వెల్త్ క్రీడలను జూలై 28 నుంచి ఆగస్ట్ 8 వరకు ఇంగ్లండ్‌లో నిర్వహించారు. ఆ దేశంలో ఈ క్రీడలు నిర్వహించడం ఇది మూడోసారి. 1934లో లండన్‌లో, 2002లో మాంచెస్టర్‌లో నిర్వహించారు. ఈ పోటీలకు మస్కట్‌గా పెర్రీని ఎంపిక చేశారు. ఇది బహుళ రంగుల్లో ఉన్న ఒక ఎద్దు. 72 దేశాలు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. ఈ పోటీల్లో ఆస్ట్రేలియా మొత్తం 178 పతకాలను సాధించి పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అందులో 67 బంగారు, 57 వెండి, 54 కాంస్య పతకాలు ఉన్నాయి. 2, 3, 4 స్థానాల్లో వరుసగా ఇంగ్లండ్, కెనడా, భారత్ నిలిచాయి.
- భారత్: 61 పతకాలను సాధించింది. ఇందులో 22 బంగారు, 16 వెండి, 23 కాంస్య పతకాలు ఉన్నాయి. కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పాల్గొనడం ఇది పద్దెనిమిదో సారి. భారత్ తరఫున ప్రారంభ వేడుకల్లో పతాకదారులుగా మన్‌ప్రీత్ సింగ్, పీవీ సింధు పాల్గొన్నారు. తుది వేడుకలకు నిఖత్ జరీన్, ఆచంట శరత్ కమల్ పతాకదారులు.
ఇతర ముఖ్యాంశాలు
- స్వాష్ ఆటగాడు అనహత్ సింగ్ భారత్ తరఫున పాల్గొన్న వారిలో అతి చిన్న వయస్కుడు. 14వ ఏట ఈ క్రీడల్లో పాల్గొన్నాడు.
- లాన్ బోల్స్ ఆటగాడు సునీల్ బహదూర్ భారత్ తరఫున పాల్గొన్న అతి ఎక్కువ వయస్సున్నవాడు. 45వ ఏట పాల్గొన్నాడు.
- భారత్ తరఫున తొలి పతకాన్ని సాధించింది సంకేత్ సర్గర్. వెయిట్ లిఫ్టింగ్‌లో వెండి పతకాన్ని సాధించాడు.
- భారత్ తరఫున తొలి బంగారు పతకాన్ని సాధించింది మీరాబాయి చాను. ఆమె కూడా వెయిట్‌లిఫ్టింగ్‌లో ఈ పతకాన్ని సాధించింది. ఈమె 2020 టోక్యో ఒలింపిక్స్‌లో వెండి పతకాన్ని సాధించింది.
- మహిళల క్రికెట్ జట్టు వెండి పతకాన్ని సాధించింది. తుదిపోరులో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది.
అంధుల టీ-20 ప్రపంచకప్
- అంధుల టీ-20 ప్రపంచకప్‌ను భారత జట్టు కైవసం చేసుకుంది. ఈ టోర్నీని భారత్ గెలవడం ఇది మూడోసారి. తుదిపోరులో భారత్ బంగ్లాదేశ్‌ను ఓడించింది. భారత జట్టుకు అజయ్‌కుమార్ రెడ్డి నేతృత్వం వహించాడు. 2012, 2017 సంవత్సరాల్లో కూడా జరిగిన టోర్నీల్లో భారత జట్టే విజయం సాధించింది. 2022లో జరిగిన టోర్నీలో భారత్ ఒక్కమ్యాచ్ కూడా ఓడిపోలేదు.
అండర్-17 శాప్ ఫుట్‌బాల్
- అండర్-17 శాప్ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో భారత్ విజయం సాధించింది. తుదిపోరులో భారత్ నేపాల్‌ను ఓడించింది.
- ఆసియా బ్యాడ్మింటన్‌లో ఉన్నతి హుడా ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో ఉన్నతి హుడా రన్నరప్‌గా నిలిచింది. ఈ విభాగంలో తుదిపోరుకు చేరిన తొలి భారత మహిళగా ఆమె రికార్డు సృష్టించింది.
విజయ్ హజారే విజేత సౌరాష్ట్ర
- దేశవాళి క్రికెట్లో కీలకమైన విజయ్ హజారే ట్రోఫీలో సౌరాష్ట్ర విజయం సాధించింది. తుదిపోరులో మహారాష్ట్ర జట్టును ఓడించింది.
పీటీ ఉష
- ప్రముఖ స్ప్రింటర్ పీటీ ఉష రెండు అంశాలకు సంబంధించి రికార్డు సృష్టించారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌కు మహిళ అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. ఈ ఘనతను సాధించిన తొలి మహిళ ఆమె. అలాగే రాజ్యసభలో వైస్ చైర్మన్ల ప్యానెల్లో కూడా నియమితులయ్యారు. రాజ్యసభ చరిత్రలో ఒక నామినేటెడ్ సభ్యరాలు వైస్ చైర్మన్ ప్యానెల్లో ఎంపికయిన తొలి వ్యక్తి పీటీ ఉష.
- నరేంద్రమోదీ స్టేడియం రికార్డ్: ఐపీఎల్ తుదిపోరు మే 29న నిర్వహించారు. దీనికి 1,01,566 మంది ప్రత్యక్షంగా హాజరయ్యారు. ఒక టీ-20 మ్యాచ్‌ను ఇంత అత్యధిక సంఖ్యలో ప్రేక్షకులు హాజరు కావడం ఇదే తొలిసారి.
ప్రపంచ పారా షూటింగ్
- ప్రపంచ పారా షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ మూడు స్వర్ణాలు గెలుచుకుంది. యూఏఈలో ఈ టోర్నీ జరిగింది. భారత్ మొత్తం 20 పతకాలతో ఐదో స్థానంలో నిలిచింది. అగ్రస్థానంలో దక్షిణ కొరియా ఉంది.
చెస్ గ్రాండ్ మాస్టర్
- భారత 77వ గ్రాండ్‌మాస్టర్‌గా మహారాష్ట్రకు చెందిన ఆదిత్య మిట్టల్ ఘనత సాధించాడు.
సైన్స్, టెక్నాలజీ
అంతరిక్షం ఇస్రో ప్రయోగాలు
- తొమ్మిది గ్రహాలు: పీఎస్ఎల్వీ సీ-54ను వినియోగించి అంతరిక్ష పరిశోధన సంస్థ తొమ్మిది ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. నవంబర్ 26న ఈ ప్రయోగం జరిగింది. ఇందులో ఓషన్ శాట్ కూడా ఉంది. ఇది మూడో తరం ఉపగ్రహం. అలాగే మరో ఎనిమిది నానో ఉపగ్రహాలు ఉన్నాయి. ఓషన్ శాట్ వల్ల భూ వాతావరణ పరిశీలన, తుఫానులను పసిగట్టడం తదితర ప్రయోజనాలు ఉన్నాయి.
- పీఎస్ఎల్వీ సీ-53: పీఎస్ఎల్వీ సీ-53 ప్రయోగాన్ని జూన్ 30న చేపట్టారు. దీన్ని వినియోగించి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ వాహక నౌక ద్వారా సింగపూర్‌కు చెందిన మూడు ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
- పీఎస్ఎల్వీ సీ-52: పీఎస్ఎల్వీ సీ-52 ప్రయోగాన్ని విజయవంతంగా ఫిబ్రవరి 14న ఇస్రో చేపట్టింది. ఈ వాహక నౌక ద్వారా భూ పరిశీలన ఉపగ్రహం ఈవోఎస్-04తో పాటు మరో రెండు చిన్న ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి తీసుకెళ్లారు. ఈవోఎస్-04ను అటవీ, తోటల పెంపకం, వరద మ్యాపింగ్, నేల తేమ తదితర అనువర్తనాలకు వినియోగిస్తారు.
- ప్రైవేట్ రాకెట్ ప్రయోగం విజయవంతం: దేశ చరిత్రలో తొలిసారి ఒక ప్రైవేట్ సంస్థ అంతరిక్ష ప్రయోగాన్ని చేపట్టింది. నవంబర్ 18న చేపట్టిన ఈ ప్రయోగంలో రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. హైదరాబాద్ కేంద్రంగా ఉండే ప్రైవేట్ సంస్థ స్కైరూట్ దీన్ని చేపట్టింది. తిరుపతి జిల్లాలో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగింది.
- జీఎస్ఎల్వీ-మార్క్3: జీఎస్ఎల్వీ-మార్క్3 వాహన నౌక ప్రయోగం అక్టోబర్‌లో విజయవంతం అయింది. దీని ద్వారా 36 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. జీఎస్ఎల్వీ వాహక నౌక ద్వారా సుమారు ఆరు టన్నుల బరువు ఉండే విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలోకి తీసుకెళ్లడం ఇదే తొలిసారి. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్‌తో కుదుర్చకున్న ఒప్పందం మేరకు వన్‌వెబ్‌కు చెందిన 36 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
ఇతర దేశాలు
- ఎస్డబ్ల్యూఏటీ: ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహా సముద్రాలు, నదులు, సరస్సులను అధ్యయనం చేసేందుకు ప్రత్యేకించి ఉపగ్రహాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించింది. ఆ దేశంలోని కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం విజయవంతంగా జరిగింది. దీనికి స్వాట్ అని పేరు పెట్టారు, స్వాట్ పూర్తి రూపం- సర్ఫేస్ వాటర్ అండ్ ఓషన్ టోపోగ్రఫీ. ఫ్రాన్స్‌తో కలిసి దీన్ని అభివృద్ధి చేశారు.
- ఆర్టెమిస్-1: చంద్రుడిపైకి మానవులను పంపే ఉద్దేశంతో నాసా చేపట్టిన ప్రయోగమే ఆర్టెమిస్-1. ఫ్లోరిడాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి నవంబర్ 16న చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతమైంది.
- చైనా వ్యోమగాములు: అంతరిక్షంలోకి ముగ్గురు వ్యోమగాములను చైనా పంపింది. ఆ దేశం అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తుంది (ఇంటర్నేషనల్ స్పేస్‌స్టేషన్). షెంఝౌ-15 వ్యోమనౌకలో రాకెట్ ద్వారా వాళ్లు నింగిలోకి వెళ్లారు. ఆరు నెలల పాటు అంతరిక్ష కేంద్రం వద్ద వీళ్లు వివిధ విధులను నిర్వర్తించనున్నారు.
- స్పేస్ ఎక్స్: తెలుగు మూలాలు ఉన్న అమెరికా వ్యోమగామి రాజాచారి రోదసీలో ఆరు నెలలు ఉన్న అనంతరం మే 6న భూమికి చేరుకున్నారు. డ్రాగాన్ ఎండ్యూరెన్స్ వ్యోమనౌక ద్వారా ఉత్తర అమెరికా ఖండంలో మెక్సికోలోని సముద్ర జలాల్లో దిగారు. 2021 నవంబర్ 10న ఆయన ఫాల్కన్-9 రాకెట్ ద్వారా వెళ్లారు.
- డీఈఆర్టీ (డార్ట్): భూమివైపునకు దూసుకువచ్చే ఉల్కలను దారి మళ్లించడం లేదా ధ్వంసం చేసే ఉద్దేశంతో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేపట్టిన ప్రయోగం విజయవంతం అయింది.
రక్షణ రంగం
- 75 ప్రాజెక్టులు: భారత వాయు దళానికి సంబంధించి 75 ప్రాజెక్టులను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నవంబర్‌లో ప్రారంభించారు. ఇందులో రెండు హెలీప్యాడ్లు కూడా ఉన్నాయి. అవి తూర్పు లఢక్‌లో ఉన్నాయి. ఒకటి హాన్లేలో, మరొకటి థాకూంగ్లో ఏర్పాటు చేశారు.
- స్టాటీషియా నివేదిక: ప్రపంచంలో అతి ఎక్కువ మంది ఉద్యోగులు కలిగినదిగా భారత రక్షణ వ్యవస్థ ఉందని స్టాటీషియా అనే నివేదికలో వెల్లడయ్యింది. సైన్యం, రిజర్వ్ బలగాలతో కలిపి మొత్తం రక్షణ రంగంలో 2.92 మిలియన్ల మంది విధులు నిర్వహిస్తున్నారు.
- ఆపరేషన్ గరుడ: మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అడ్డుకొనేందుకు సీబీఐ బహుళ దశల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ అక్రమ రవాణాలో అనుసంధానమైన అన్ని వ్యవస్థలను దీని ద్వారా ధ్వంసం చేయనున్నారు.
- ప్రాజెక్ట్ 15బి: ప్రాజెక్ట్ 15బిలో భాగంగా మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ నిర్మించిన రెండో విధ్వంసక నౌకను భారత నౌకాదళానికి అప్పగించారు. దీనికి వై 12705 అని పేరు పెట్టారు. ఇందులో బ్రహ్మోస్ క్షిపణులు, దేశీయ టార్పిడో ట్యూబ్ లాంచర్లు, యాంటీ సబ్‌మెరైన్ రాకెట్లను మోహరించేందుకు వీలుంది.
- బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం: స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్‌ను అక్టోబర్ 14న భారత్ విజయవంతంగా ప్రయోగించింది. అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలాంతార్గమి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ప్రయోగం ఇది.
ఇతర అంశాలు
- సంలీన చర్య: భూమికి, కాంతికి మూలాధారమైన సూర్యుడిలో జరిగేది కేంద్రక సంలీన చర్య. ఈ చర్యనే భూమిపై అమెరికా శాస్త్రవేత్తలు సాధించారు. ఫ్యూజన్ ఇగ్నిషన్ పేరుతో ప్రారంభమైన ఈ ప్రయోగం విజయవంతమైంది. డిసెంబర్ 5న దీన్ని చేపట్టారు. ఈ చర్య మానవ సంక్షేమానికి వినియోగిస్తే భూతాపం తగ్గడంతో పాటు విద్యుత్ కొరత సమస్య తీరనుంది.
- మలేరియాపై పోరుకు: మలేరియా కట్టడికి రెండు ఎంఆర్ఎన్ఏ టీకాలను జార్జ్ వాషింగ్టన్ విశ్వవిద్యాలయం సైంటిస్టులు కనుగొన్నారు. మలేరియా వ్యాప్తిని ఇవి అడ్డుకోగలవు.
- జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్: తొలినాళ్ల నాటి గెలాక్సీలను అమెరికాకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ గుర్తించింది. బిగ్ బ్యాంగ్ తర్వాత కొన్ని లక్షల సంవత్సరాలకే నక్షత్రాలు పుట్టాయని ఈ ప్రయోగం ద్వారా తెలుసుకోగలిగారు.
- సమీకృత రాకెట్ తయారీ కేంద్రం: దేశంలో మొట్టమొదటి సమీకృత రాకెట్ డిజైన్, తయారీ, పరీక్ష కేంద్రం హైదరాబాద్‌లో రానుందని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు ప్రకటించారు. స్కైరూట్ ఏరోస్పేస్ దీన్ని ఏర్పాటు చేయనుంది.
- కాప్-15 సదస్సు: ఐక్యరాజ్య సమితి జీవ వైవిధ్య సదస్సు డిసెంబర్ 7 నుంచి 19 వరకు కెనడాలోని మాంట్రియల్లో నిర్వహించారు. పర్యావరణం, ప్రకృతిని కాపాడుకొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా తీసుకోవాల్సిన చర్యలపై తీర్మానాన్ని ఆమోదించారు.
- క్లోనింగ్ ఆర్కిటిక్ తోడేలు: ప్రపంచంలోనే తొలిసారిగా క్లోనింగ్ విధానంలో ఆర్కిటిక్ తోడేలును చైనాలోని బీజింగ్‌కు చెందిన సినోజీన్ బయో టెక్నాలజీ సంస్థ సృష్టించింది. దీనికి మాయా అని పేరు పెట్టారు.
- చంద్రుడి వాతావరణంలో ప్లాస్మా: చంద్రుడి ఎగువ వాతావరణంలోని అయనోస్పియర్‌లో అధిక సాంద్రతతో కూడిన ప్లాస్మా ఉందని చంద్రయాన్-2 ద్వారా కీలక సమాచారం అందింది. చంద్రుడిపై వేక్ అనే ప్రాంతంలో ఇది వెలుగు చూసింది.
- అంగారకుడిపై సేంద్రీయ పదార్థాలు: అంగారకుడిపై జీవాన్వేషణ సాగిస్తున్న అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ పర్సెవరెన్స్ కీలక అంశాన్ని గుర్తించింది. అరుణ గ్రహంలో జెజోరో బిలంలో సేంద్రీయ పదార్థాల జాడను కనుగొంది.
- టాబ్లాయిడ్ నిపుణ పేజీల్లో… రాష్ర్టాలు-వార్తాంశాలు వార్తల్లో వ్యక్తులు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం
Previous article
విరచిస్తా నేడే నవశకం..!
Next article
గోళాలుగా మారే నీటి బిందువులు.. ఎగబాకే ద్రవ పదార్థాలు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు