2022 రౌండప్ – తెలంగాణ
ఆర్థిక అంశాలు
పెరిగిన వరిసాగు
l తెలంగాణలో వరిసాగు విస్తీర్ణం ఐదు సంవత్సరాల్లో 86% పెరిగింది. 2017-18లో 19.62 లక్షల హెక్టార్ల వరిసాగు ఉండగా, 2021-22 నాటికి 36.54 లక్షల హెక్టార్లకు విస్తరించింది. ఆహార పంటల సాగు విస్తీర్ణం ఐదు సంవత్సరాల్లో 45.85% వృద్ధి చెందింది.
సాఫ్ట్వేర్ ఎగుమతులు
l సాఫ్ట్వేర్ ఉత్పత్తుల ఎగుమతుల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. తొలి స్థానంలో కర్ణాటక, రెండో స్థానంలో మహారాష్ట్ర నిలిచాయి. తెలంగాణ నుంచి రూ.11,59,210 కోట్ల సాఫ్ట్వేర్ ఎగుమతులు జరిగాయి.
ఇతర ఎగుమతులు
l ఎగుమతుల సంసిద్ధత పరంగా దేశంలో తెలంగాణ దేశంలో రెండో స్థానంలో, అనుకూలతల్లో అయిదో స్థానంలో ఉంది. 2020-21లో తెలంగాణ రూ.2,10,081 కోట్ల విలువైన సరకులను విదేశాలకు ఎగుమతి చేసింది. రాష్ట్ర స్థూల జాతీయ ఉత్పత్తిలో ఇది 21.4%. ఎగుమతుల్లో ఎక్కువ ఔషధాలు కాగా ఆ తర్వాత సేంద్రియ రసాయనాలు ఉన్నాయి. ఎక్కువగా అమెరికా దేశానికి తెలంగాణ నుంచి ఎగుమతులు ఉన్నాయి.
రైతు కుటుంబాల ఆదాయం
l తెలంగాణ రాష్ట్ర రైతు కుటుంబ ఆదాయం రూ.9403గా ఉంది. 2019 జనవరి నుంచి డిసెంబర్ మధ్య కాలంలో నిర్వహించిన 77వ రౌండ్ జాతీయ నమూనా సర్వేలో ఈ విషయం వెల్లడయ్యింది.
తలసరి అప్పు
l తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అప్పు 2020 మార్చి నాటికి రూ.2,25,418 కోట్లు ఉంది. తలసరి రుణ భారం రూ.64,398 ఉండగా, రుణం: జీఎస్డీపీ నిష్పత్తి 23.5% నమోదయ్యింది.
తలసరి ఆదాయం
l తలసరి ఆదాయంలో దక్షిణాది రాష్ర్టాల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉంది. రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,58,561 ఉంది.
పెట్టుబడులు
మొబిలిటీ వ్యాలీ
l వాహన రంగంలో భారీగా పెట్టుబడుల సాధనకు మొబిలిటీ వ్యాలీని రెండు వేల ఎకరాల్లో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలో విద్యుత్ వాహనాల విధానాన్ని ప్రకటించిన ఘనత తెలంగాణ రాష్ర్టానిదే.
జపాన్ పరిశ్రమలు
l యంత్ర పరికరాలు తయారు చేసే దైఫుకు సంస్థ తెలంగాణలో రూ.450 కోట్ల పెట్టుబడితో పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. ఈ సంస్థ జపాన్ దేశానికి చెందింది. ఇదే దేశానికి చెందిన నికోమాక్ తైకిషా రూ.126.22 కోట్లతో రాష్ట్రంలో పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. పరిశుభ్రత పరికరాల తయారీ పరిశ్రమ ఇది. ఈ రెండు రంగారెడ్డి జిల్లా చందన్వెల్లిలో పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నాయి.
అడోబ్ సంస్థ
l అడోబ్ అభివృద్ధి చేయనున్న అడోబ్ కృత్రిమ మేధ పరిష్కారాల కోసం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో పెట్టుబడులను పెట్టనుంది.
డేటా కేంద్రం
l సింగపూర్‌కు చెందిన అంతర్జాతీయ స్థిరాస్థి సంస్థ క్యాపిటల్యాండ్ తెలంగాణలో రూ.6200 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. మాదాపూర్‌లో 2.50 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో డేటా కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది.
అమర రాజా
l దేశంలోనే తొలి అత్యాధునిక విద్యుత్ వాహనాల బ్యాటరీల తయారీ కోసం లిథియం అయాన్ గిగా కర్మాగారాన్ని, పరిశోధన కేంద్రాన్ని మహబూబ్‌నగర్‌లోని దివిటిపల్లి పారిశ్రామిక పార్కులో అమర రాజా సంస్థ నెలకొల్పనుంది. ఇందుకు రూ.9500 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 4500 మందికి ప్రత్యక్షంగా ఉపాధి దొరుకుతుంది.
అమెజాన్ వెబ్ సర్వీసెస్
l అమెజాన్‌కు చెందిన వెబ్ సర్వీసెస్ ఆసియా పసిఫిక్ ప్రాంతీయ కేంద్రం హైదరాబాద్‌లో నవంబర్ 22న ప్రారంభించారు. రానున్న ఎనిమిది సంవత్సరాల్లో రూ.36,300 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఏటా సగటున 48 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి.
జాకీ ఉత్పత్తులు
l రూ.290 కోట్లతో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, సిద్దిపేట జిల్లా ములుగులో భారీ పరిశ్రమలను ఏర్పాటు చేయనున్నారు. అమెరికాకు చెందిన దుస్తుల తయారీ సంస్థ జాకీ అనుబంధ ఫేజ్ ఇండస్ట్రీస్ పరిశ్రమను నెలకొల్పనుంది.
ఐస్‌క్రీమ్‌ల తయారీ యూనిట్
l దేశంలోనే అతిపెద్ద ఐస్‌క్రీమ్ సంస్థను జహీరాబాద్‌లో ప్రారంభించారు. హాట్సన్ సంస్థ దీన్ని ఏర్పాటు చేసింది. రోజుకు ఇక్కడ 7 టన్నుల చాక్లెట్లు, 100 టన్నుల ఐస్‌క్రీమ్‌ను ఉత్పత్తి చేస్తారు. దీని ఏర్పాటుకు రూ.600 కోట్లు వెచ్చించారు.
ప్రాజెక్ట్ సంజీవని
l ఆసియాలోనే అతిపెద్ద స్టెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో సహజానంద్ మెడికల్ టెక్నాలజీస్ దీన్ని ఏర్పాటు చేసింది.
గేట్ వే టు హైదరాబాద్
l ప్రస్తుతం హైటెక్ సిటీ ఉన్న గచ్చిబౌలి-మాదాపూర్‌లకు ప్రత్యామ్నాయంగా మేడ్చల్ జిల్లా కండ్లకోయలో గేట్ వే ఐటీ పార్కును తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఫిబ్రవరి 17న దీన్ని ప్రారంభించారు.
ఒప్పందాలు
క్యూటీసీఐ
l క్వాంటమ్ సాంకేతికతలపై పనిచేస్తున్న అంకురాలకు అవసరమైన సహకారాన్ని అందించేందుకు క్వాంటమ్ ఎకోసిస్టమ్స్ టెక్నాలజీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రత్యేకంగా టీ హబ్‌తో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ప్రారంభ, అభివృద్ధి దశల్లో ఉన్న అంకురాలు క్వాంటమ్ సాంకేతికత వినియోగించుకొనేందుకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది.
కాయిన్‌బేస్
l అమెరికాకు చెందిన కాయిన్‌బేస్ సంస్థతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇది వెబ్ 3.0 సాంకేతిక సేవలను అందించేందుకు ఉద్దేశించింది. బ్లాక్ చెయిన్ సాంకేతికతతో ప్రజా సమస్యల పరిష్కారానికి వీలు కలుగుతుంది.
మలేషియాతో
l ఆయిల్ పామ్‌ను పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు 20 లక్షల ఎకరాల సాగు లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది. ఇందుకు తెలంగాణ రాష్ట్రం మలేషియాతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఐఐఎంతో ఒప్పందం
l ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని అగ్రిహబ్ ఐఐఎం (బెంగళూర్)తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వినూత్న ఆలోచనలతో వచ్చే వారిని వ్యవసాయ వాణిజ్యవేత్తలుగా ప్రోత్సహించడం దీని ప్రత్యేకత.
యూఎన్డీపీతో
l వాతావరణంలోని మార్పులపై రైతులకు సమగ్ర సమాచారం అందించేందుకు యూన్డీపీతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. కృత్రిమ మేధ పరిజ్ఞానం ఆధారంగా ఇది పనిచేస్తుంది. రిమోట్ సెన్సింగ్ ఇతర సాంకేతికతలతో కలిసి వాతావరణ మార్పులను తట్టుకోగల పొలాలను డేటా ఇన్ ైక్లెమేట్ రెసిలెంట్ అగ్రికల్చర్లో భాగంగా సమాచారం ఇస్తారు.
ఫ్రాన్స్‌తో ఒప్పందం
l రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యార్థులను అంతర్జాతీయ ఉపాధి అవకాశాలు, నైపుణ్యాల్లో తీర్చిదిద్దేందుకు ఫ్రాన్స్ సహకరించనుంది. అవకాశాలు అందిపుచ్చుకునేందుకు వీలుగా స్టూడెంట్స్ ఎక్సేంజ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారు.
బ్రిటిష్ కౌన్సిల్‌తో
l విద్య, ఇంగ్లిష్ తదితర అంశాల్లో తెలంగాణ ప్రభుత్వం బ్రిటిష్ కౌన్సిల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. నిజానికి ఈ ఒప్పందం 2018లోనే కుదిరింది. ఈ ఏడాది పునరుద్ధరించారు. యువతలో ఉద్యోగ సాధన నైపుణ్యాలను పెంచేందుకు ఉద్దేశించింది ఇది.
థాయిలాండ్ ప్రభుత్వంతో
l చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహానికి థాయిలాండ్ వాణిజ్య మంత్రిత్వ శాఖతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.
అస్కితో రెడ్కో ఒప్పందం
l ఇంధన సంరక్షణ కార్యక్రమాలపై కలిసి పనిచేసేందుకు ‘అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (అస్కి)’తో తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్ రెడ్కో-తెలంగాణ స్టేట్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్) అక్టోబర్ 26న ఒప్పందం కుదుర్చుకుంది. వచ్చే ఐదేండ్ల పాటు రెండు సంస్థలు ఇంధన సంరక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తాయి. అస్కి డైరెక్టర్ జనరల్ (ఇన్చార్జ్) డాక్టర్ నిర్మల్య బాగ్చి, టీఎస్రెడ్కో వీసీ, ఎండీ ఎన్ జానయ్య ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
స్టార్టప్‌లతో నార్మ్ ఒప్పందం
l స్టార్టప్‌లకు మద్దతు ఇచ్చి, మార్గదర్శకత్వం చూపి అభివృద్ధికి ప్రోత్సహించేందుకు మూడు సంస్థలతో నార్మ్ (నేషనల్ అకాడమీ అగ్రికల్చరల్ రిసర్చ్ మేనేజ్మెంట్-ఎన్‌ఏఏఆర్‌ఎం) నవంబర్ 4న ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు అసోసియేషన్ ఫర్ ఇన్నోవేషన్ డెవలప్మెంట్ ఆఫ్ ఎంట్రప్రెన్యూర్షిప్ ఇన్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్ (a-IDEA-TBI) విభాగాన్ని ఏర్పాటు చేసింది. శ్రీ కొండా లక్ష్మారెడ్డి తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ (ఎస్‌కేఎల్‌టీఎస్‌హెచ్‌యూ)-హైదరాబాద్, షుగర్‌కేన్ బ్రీడింగ్ ఇన్స్టిట్యూట్ (ఎస్బీఐ)-కోయంబత్తూర్, నేషనల్ రిసర్చ్ సెంటర్ ఆన్ గ్రేప్స్ (ఎన్ఆర్సీజీ)-పుణె, ఈ మూడు సంస్థలతో ఒకేసారి అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు నార్మ్ జేడీ జీ వెంకటేశ్వర్లు వెల్లడించారు.
అంతర్జాతీయ ఘనతలు
జీఐ ట్యాగ్
l తాండూర్ కందిపప్పునకు భౌగోళిక గుర్తింపు లభించింది. తెలుగు రాష్ర్టాల్లో వ్యవసాయ పంటల పరంగా మొదట జీఐ ట్యాగ్ పొందిన ఉత్పత్తి ఇదే. ఈ పప్పును పోలిన రుచి, వాసన మరెక్కడా లేదు. ఇక్కడ పండించే కందులు నాణ్యంగా ఉండటమే కాకుండా పోషకాలు కూడా ఎక్కువే.
ఎర్త్‌ప్రైజ్
l పర్యావరణ ఆస్కార్గా పేరున్న ఎర్త్ షాట్ అవార్డును తెలంగాణకు చెందిన ఖేతి స్టార్టప్ దక్కించుకుంది. బ్రిటిష్ యువరాజు విలియం ఈ అవార్డును నెలకొల్పారు. పర్యావరణ హితంగా చిన్న రైతులు తక్కువ పెట్టుబడితో సుస్థిర ఆదాయం పొందేలా ఈ సంస్థ గ్రీన్హౌస్ ఇన్ ఏ బాక్స్ విధానాన్ని రూపొందించి అవార్డును దక్కించుకుంది.
దోమకొండ కోట
l కామారెడ్డి జిల్లా దోమకొండ కోటకు యునెస్కో ఆసియా-పసిఫిక్ అవార్డ్ ఫర్ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్ అవార్డ్ ఆఫ్ మెరిట్ దక్కింది. ప్రైవేట్ నిర్మాణం అయినప్పటికీ సాంస్కృతిక స్థలాన్ని విజయవంతంగా పునరుద్ధరించారు. నిరాదరణకు గురైన కోటకు పూర్వ వైభవం తెచ్చారు.
మెట్ల బావి
l గోల్కొండ కోటలో ఉన్న మెట్ల బావికి కూడా యునెస్కో గుర్తింపు లభించింది. కుతుబ్ షాహీల కాలంలో దీన్ని తవ్వారు. దీన్ని పునరుద్ధరించినందుకు గుర్తింపు లభించింది.
ఓయూకు పురస్కారం
l ప్రపంచంలోనే ఉత్తమ బ్రాండ్ యూనివర్సిటీ అవార్డు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి దక్కింది. లండన్‌లో డబ్ల్యూసీఆర్‌సీ లీడర్స్ ఆసియా, వరల్డ్స్ బెస్ట్ బ్రాండ్ 2022 అవార్డును అక్టోబర్ 28న ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ అందుకున్నారు.
————
జాతీయ స్థాయిలో ఘనతలు
సహకార సమాఖ్యకు అవార్డ్
l కామారెడ్డికి చెందిన కామారెడ్డి మండల సహకార సమాఖ్య క్రెడిట్ సొసైటీ జాతీయ స్థాయిలో ఉత్తమ సంఘంగా ఎంపికయ్యింది. స్వయం సహాయక సంఘాలకు బ్యాంక్ లింకేజీ రుణాల కార్యక్రమం మొదలై మూడు దశాబ్దాలు అవుతున్న సందర్భంగా ఈ ఎంపికలు చేశారు.
టెలికన్సల్టెన్సీలో
l టెలికన్సల్టెన్సీ సేవల అమలులో పెద్ద రాష్ర్టాల క్యాటగిరీలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. ఈ ఏడాది అక్టోబర్ 12 నుంచి డిసెంబర్ 8 వరకు నిర్వహించిన టెలికన్సల్టెన్సీ క్యాంపెయిన్‌లో తెలంగాణ 17.47 లక్షల కన్సల్టేషన్లను పూర్తి చేసింది.
బుద్ధవనం ప్రాజెక్ట్
l నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం ప్రాజెక్టుకు మిత్ర అవార్డ్ లభించింది.
తెలంగాణ ఆగ్రోస్
l తెలంగాణ ఆగ్రోస్‌కు జాతీయ స్కోచ్ ఉత్తమ పురస్కారం దక్కింది. గ్రామాల్లోని విద్యావంతులైన నిరుద్యోగులతో 1050 ఆగ్రోస్ రైతు కేంద్రాలు ఏర్పాటు చేయించి ఉపాధి కల్పించడమే కాకుండా, సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, యంత్రాలను అందుబాటులో ఉంచి విక్రయిస్తున్నారు.
సరళతర వ్యాపార నిర్వహణలో
l సరళతర వ్యాపార నిర్వహణలో తెలంగాణ రాష్ర్టానికి ఎకనామిక్ టైమ్స్ పురస్కారం ఇచ్చింది. సంస్కరణలతో పాటు కార్యాచరణ, మీ-సేవ పోర్టల్ కూడా తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా మెరుగైన సేవలు అందుతున్నాయి.
ఓడీఎఫ్ ప్లస్‌లో
l బహిరంగ మల విసర్జనను పూర్తిగా పరిహరించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఘన, ద్రవ వ్యర్థాలను సక్రమంగా నిర్వహిస్తూ ఓడీఎఫ్ ప్లస్ స్థాయి పొందిన అగ్రస్థానంలోని అయిదు రాష్ర్టాల్లో తెలంగాణ స్థానం పొందింది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో తాగునీళ్లను అందించే టాప్-3 రాష్ర్టాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది.
ఈ-ఓటింగ్‌కు అవార్డ్
l రాష్ట్ర ప్రభుత్వం బ్లాక్ చెయిన్ విధానం కింద చేపట్టిన కృత్రిమ మేధ ఆధారిత ఈ-ఓటింగ్ ప్రాజెక్టుకు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అత్యుత్తమ ప్రాజెక్ట్ పురస్కారాన్ని ఇచ్చింది. స్మార్ట్ ఫోన్ ఆధారిత ఓటింగ్‌కు సంబంధించి దేశంలోనే ఇది తొలి ప్రదర్శన.
సౌర విద్యుత్ ఉత్పత్తి
l ఎన్టీపీసీ నిర్మించిన నీటిపై తేలియాడే 100 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రంలో పూర్తి స్థాయి ఉత్పత్తి జూలై 1న ప్రారంభమయ్యింది. ఇది పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఉంది. దీని నిర్మాణానికి రూ.423 కోట్లు వ్యయం చేశారు. జలాశయంలో 500 ఎకరాల్లో ఇది విస్తరించి ఉంది.
ఫార్మూలా ఈ రేసింగ్
l అంతర్జాతీయంగా వివిధ నగరాల్లో జరిగే ఈ క్రీడ భారత్ తరఫున ఎంపికయిన నగరం హైదరాబాద్.
శాసనాల మ్యూజియం
l దేశంలో తొలి శాసనాల మ్యూజియంను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నారు.
రాళ్ల మ్యూజియం
l పురాతన రాళ్ల గురించి తెలిపే మ్యూజియం దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో ఏర్పాటయ్యింది.
సంసద్ ఆదర్శ గ్రామ్ యోజన
l దేశ వ్యాప్తంగా అమలవుతున్న పథకం ఇది. ప్రతి ఎంపీ గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలి. దేశంలో బాగా అభివృద్ధి చెందిన టాప్-10 పంచాయతీలు అన్ని తెలంగాణలోనే ఉన్నాయి. అగ్రస్థానంలో వడపర్తి (యాదాద్రి జిల్లా), రెండో స్థానంలో కొండాపూర్ (కరీంనగర్ జిల్లా), పల్దా (నిజామాబాద్ జిల్లా) మూడో స్థానంలో ఉన్నాయి.
—–
పథకాలు
ఇళ్ల నిర్మాణానికి: సొంత స్థలం ఉన్న పేదలకు రూ.3 లక్షల పథకానికి రాష్ట్ర క్యాబినెట్ డిసెంబర్ 10న నిర్ణయం తీసుకుంది.
ఖేలో ఇండియా కేంద్రాలు: ఖేలో ఇండియా ప్రాజెక్టులో భాగంగా తెలంగాణలో 17 జిల్లాల్లో కేంద్రాలను ప్రారంభించనున్నారు. సీనియర్ క్రీడాకారుల సలహాలు, సూచనలు, అంతర్జాతీయ, జాతీయ స్థాయి పోటీల్లో ప్రాతినిథ్యం వహించిన వారికి ఉపాధి అవకాశాలు కూడా దక్కనున్నాయి. ఒక్కో కేంద్రానికి ఏటా రూ.5 లక్షలు కేంద్రం ఇవ్వనుంది.
నేతన్న బీమా: చేనేత, అనుబంధ వృత్తి కార్మికుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఆగస్ట్ 7 నుంచి నేతన్న బీమా పథకాన్ని అమలు చేస్తున్నారు. 18 నుంచి 60 ఏళ్లలోపు నేత కార్మికులు ఎవరైనా మరణిస్తే నామినీకి పది రోజుల్లో రూ.5 లక్షలు అందుతాయి. రాష్ట్రంలోని 80 వేల నేత కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుంది. పథకం అమలుకు ఎల్ఐసీతో రాష్ట్రం ఒప్పందం కుదుర్చుకుంది.
పౌష్టికాహార కిట్లు: గర్భిణులకు పౌష్టికాహార కిట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొమ్మిది జిల్లాల్లో దీన్ని అమలు చేస్తారు.
పౌష్టికాహార కిట్ల పంపిణీ
l పౌష్టికాహార కిట్ల పంపిణీని డిసెంబర్ 21 నుంచి రాష్ట్రంలో చేపట్టారు. రక్తహీనత తక్కువ ఉన్న తొమ్మిది జిల్లాల్లో ముందుగా దీన్ని అమలు చేస్తారు. ఆ జిల్లాలు- కుమ్రం భీం ఆసిఫాబాద్, జోగుళాంబ గద్వాల్, వికారాబాద్, కామారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, నాగర్ కర్నూలు, ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి.
l కిట్‌లో పౌష్టికాహార మిశ్రమ పొడి, కిలో ఖర్జూరం, ఐరన్ సిరప్ మూడు సీసాలు, 500 గ్రాముల నెయ్యి, ఆల్బెండజోల్ మాత్రలు ఉన్నాయి.
చారిత్రక ఆనవాళ్లు
బాసర: బాసరలోని అతి పురాతన కుక్కుటేశ్వర ఆలయంలో జైన శాసన దేవత విగ్రహాన్ని గుర్తించారు. విగ్రహ శైలిని బట్టి రాష్ట్ర కూటుల కాలం నాటిదని భావిస్తున్నారు.
నర్మెట్ట గ్రామం: సిద్దిపేట జిల్లా నంగనూర్ మండలం చారిత్రక ప్రదేశం అయిన నర్మెట్ట గ్రామంలోని పాటిగడ్డమీద అమ్మదేవత మట్టి శిల్పం లభించింది. ఇది కొత్త రాతి యుగపు కాలానికి చెందినదిగా భావిస్తున్నారు.
రాతి పాత్ర: రెండు వేల సంవత్సరాల కిందటి నాటి రాతి పాత్ర కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పక్కన ఉన్న బోర్లాం గ్రామంలోని ఒక మట్టిదిబ్బపై గుర్తించారు. ఇది శాతవాహన కాలం నాటి చారిత్రక అవవేషం. రాతి పాత్రపై లఘు శాసనం ఉంది. క్రీస్తు పూర్వం ఒకటో శతాబ్దానికి చెందిన ప్రాకృత భాష, బ్రాహ్మీ లిపిలో ఉంది.
మూసాపేట: మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండలం మూసాపేటలో ఇనుపయుగం నాటి సమాధులను గుర్తించారు. మూసాపేటలోని రామస్వామి గుట్ట సమీపంలో ఇవి ఉన్నాయి.
వీరగల్లు: రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లోయపల్లి సోమన్న గుట్ట వద్ద అయిదు ఆత్మాహుతి వీరగల్లులను గుర్తించారు. నరికిన తలలను తమ చేతులతో పట్టుకున్న వీరుల వీరగల్లులు ఇందులో ఉన్నాయి. తెలంగాణలో ఈ తరహా వీరగల్లులు కనిపించడం ఇదే ప్రథమం. 14, 15 శతాబ్ది కాలం నాటివి ఇవి.
చేర్యాల మండలం: సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రం సమీపంలోని పాటిగడ్డ మీద శాతవాహనులు, అంతకుముందు కాలం ప్రజలు ఉపయోగించిన అపురూపమైన టెర్రకోట వస్తువులు, బొమ్మలను గుర్తించారు.
విద్య అంశాలు
యాదాద్రిలో శిల్ప కళాశాల
l అంతరించి పోతున్న శిల్పకళను పునరుద్ధరించాలని యాదాద్రిలో మూడేళ్ల కోర్స్‌తో కూడిన డిగ్రీ కళాశాలను ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ప్రస్తుతం 15 సీట్లు ఉన్నాయి. ఇంటర్ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు.
తొలిమెట్టు
l ప్రాథమిక తరగతుల విద్యార్థుల్లో విద్యా సామర్థ్యాలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్ట్ 15న మౌలిక అక్షరాస్యత, గణిత సామర్థ్యాల సాధన కార్యక్రమాన్ని తొలిమెట్టు పేరుతో ప్రారంభించింది. ఇందులో పిల్లలకు చదవడం, రాయడం నేర్పిస్తారు.
మన ఊరు మనబడి
l ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమాన్ని చేపట్టింది. 26,000 పాఠశాలలను బాగుచేయయడానికి రూ.7289.54 కోట్ల వ్యయం చేయనున్నారు. తొలి దశలో 9123 పాఠశాలలను బాగు చేస్తారు. ప్రతి పాఠశాలలో 12 పనులను చేపడుతారు.
అవార్డులు
సంకోజు వేణు
l సాహితీవేత్త సంకోజు వేణును రాష్ట్ర ప్రభుత్వం దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారానికి ఎంపిక చేసింది. నల్లగొండకు చెందిన వేణు 1972 నుంచి పలు కవితలు, కథలు, వ్యాసాలు, గ్రంథాలు రచించారు. 2001లో తెలంగాణ రచయితల వేదికను స్థాపించారు.
అమ్మంగి వేణుగోపాల్
l డాక్టర్ సీ నారాయణరెడ్డి సాహిత్య పురస్కారాన్ని ప్రముఖ కవి, విమర్శకుడు అమ్మంగి వేణుగోపాల్‌కు ఇచ్చారు.
కేశవులు
l రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ సంచాలకుడు డాక్టర్ కేశవులుకు అంతర్జాతీయ స్థాయి ప్రతిష్ఠాత్మక పురస్కారం లభించింది. చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ రిసెర్చ్ ఫౌండేషన్ వ్యవసాయం, ఆహార భద్రత రంగంలో పనిచేసే వారికి ఇచ్చే ఎంఎస్ స్వామినాథన్ అవార్డ్ 2022 కేశవులుకు దక్కింది.
పద్మావతి, రెడ్డీస్ ఫౌండేషన్
l దివ్యాంగుల సాధికారత కోసం పనిచేస్తున్న డాక్టర్ కోటబత్తిని పద్మావతి, డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్లకు దివ్యాంగుల సాధికారత జాతీయ అవార్డు లభించింది. ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసి దివ్యాంగులకు గానం, అభినయం, నృత్యం, కంప్యూటర్, కుట్టుపని, కొవ్వొత్తులు, సాఫ్ట్‌టాయ్స్ తయారీలో పద్మావతి ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. అలాగే దివ్యాంగులకు ప్లేస్‌మెంట్స్ కల్పిస్తున్న డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్‌కు కూడా పురస్కారం దక్కింది.
రఘు అరికెపూడి
l పది సంవత్సరాలుగా దివ్యాంగులకు అందిస్తున్న సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం 2022కు రఘు అరికెపూడికి ఉత్తమ సోషల్ వర్కర్ అవార్డు ప్రకటించింది. ఆయన బీడీఎల్ ఉద్యోగి. ఉద్యోగం చేస్తూనే సేవ చేస్తున్నారు.
డా. శుభాకర్
l ఎర్రగడ్డలోని ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రి మాజీ మెడికల్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ కే శుభాకర్ లండన్‌లోని రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజీషియన్స్ ఇచ్చే అరుదైన ఫెలోషిప్ ఎఫ్ఆర్సీపీ పురస్కారానికి ఎంపికయ్యారు. ఛాతీ సంబంధిత రోగాల చికిత్స పద్ధతులు, కొత్త విధానాలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు వంటి అంశాల్లో పరిశోధనలు చేశారు.
సుద్దాల అశోక్ తేజ
l డాక్టర్ సామల సదాశివ పురస్కారం-2022 ప్రముఖ కవి, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజకు లభించింది.
సాయిరాం
l హైదరాబాద్‌కు చెందిన యువ వైద్యుడు డాక్టర్ సాయిరాం ప్రతిష్ఠాత్మక డయానా పురస్కారాన్ని గెలుచుకున్నారు. బ్రిటన్‌లో అతను ఇటివల ఎంబీబీఎస్ పూర్తి చేశారు.
ద్రోణ శ్రీనివాస శర్మ
l నేషనల్ జియోసైన్స్ అవార్డును ప్రముఖ శాస్త్రవేత్త ద్రోణ శ్రీనివాస శర్మ అందుకున్నారు. ఆయన సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం సర్వారం గ్రామానికి చెందిన వారు.
జోగినపల్లి సంతోష్ కుమార్
l గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ సాలు మారద తిమ్మక్క జాతీయ హరిత పురస్కారాన్ని అందుకున్నారు.
పరిపాలన నిర్ణయాలు
రహదారుల మరమ్మతులకు నిధులు
l రహదారుల మరమ్మతులకు రూ.1865 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర క్యాబినెట్ డిసెంబర్ 10న నిర్ణయం తీసుకుంది. ప్రజా రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచే దిశగా తక్షణమే పనులు చేపట్టేందుకు రూ.635 కోట్లు కేటాయించారు. అత్యవసర సమయాల్లో మరమ్మతులు తదితర ప్రజా అవసరాల కోసం ఖర్చు చేసేందుకు స్వీయ నిర్ణయాధికారాలకు అవకాశం కల్పించారు. ఇందుకు ఏడాదికి రూ.129 కోట్లు కేటాయించారు.
దివ్యాంగులకు మంత్రిత్వ శాఖ
l రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమానికి ప్రత్యేకంగా దివ్యాంగుల సంక్షేమ శాఖను ఏర్పాటు చేయనున్నారు. గతంలో ఈ శాఖ మహిళా శిశు సంక్షేమ శాఖలో భాగంగా ఉంది. దివ్యాంగులకు సంబంధించి సంక్షేమ పథకాలు అమలు, వారికి మేలు కలిగించే విషయాల్లో వేగంగా నిర్ణయం తీసుకోడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. కొత్త శాఖ పేరు- దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్ల సాధికారత విభాగం.
ప్రాజెక్టులకు అనుమతి
l ముక్తీశ్వర (చిన్న కాళేశ్వరం), చనాకా-కొరాటా, చౌట్పల్లి హన్మంత్ రెడ్డి ఎత్తిపోతల పథకాల డీపీఆర్‌లకు కేంద్ర జలసంఘం ఆమోదం తెలిపింది. గోదావరి నదులపై ఈ ప్రాజెక్టులను నిర్మించనున్నారు.
జడ్పీ చైర్పర్సన్ అనర్హత
l నాగర్‌కర్నూలు జడ్పీ చైర్‌పర్సన్‌గా 2019లో పెద్దపల్లి పద్మావతి ఎన్నికయ్యారు. అయితే ముగ్గురు సంతానం ఉండటం వల్ల ఆమె జడ్పీటీసీ సభ్యత్వాన్ని రద్దు చేశారు.
కంటి వెలుగు కేంద్రాలు
l అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కేసీఆర్ కంటి వెలుగు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కంటి వెలుగు కార్యక్రమాన్ని 2018 ఆగస్ట్ 15న ప్రారంభించారు. 2019 మార్చి 31తో అది ముగిసింది. 9887 గ్రామాల్లో కొనసాగిన ఈ కార్యక్రమంలో మొత్తం 1,54,71,769 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు.
కొత్త మెడికల్ కాలేజీలు
l రాష్ట్రంలో కొత్తగా ఎనిమిది వైద్యకళాశాలలను నెలకొల్పారు. నవంబర్ 15 నుంచి ఇవి ప్రారంభమయ్యాయి.
కొత్త కాలేజీలు- కొత్తగూడెం, నాగర్‌కర్నూలు, మహబూబాబాద్, సంగారెడ్డి, రామగుండం, వనపర్తి, జగిత్యాల, మంచిర్యాల.
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ
l రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రధాని మోదీ నవంబర్ 12న జాతికి అంకితం చేశారు.
సీబీఐకి అనుమతి ఉపసంహరణ
l కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిని ఉపసంహరించుకుంది. దీంతో ఆ సంస్థ రాష్ట్రంలో ఎలాంటి దర్యాప్తు చేపట్టలేదు. ఆగస్ట్ 30న జీవో 51ని విడుదల చేసింది. దీన్ని అనుసరించి రాష్ట్రంలో సీబీఐ సొంతంగా కేసులను దర్యాప్తు చేయడం కుదరదు.
సర్వాయి పాపన్న జయంతి
l సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని ఆగస్ట్ 18న, వర్ధంతిని ఏప్రిల్ 2న అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కుతుబ్ షాహీ రాజ్యంలో పన్ను వసూలు విధానానికి వ్యతిరేకంగా ఆయన తిరుగుబాటు చేశారు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం, ఖిలాషాపూర్‌లో జన్మించారు.
కవ్వాల్ నుంచి గ్రామాల తరలింపు
l కవ్వాల్‌లో పులుల సంరక్షణకు గ్రామాల ప్రజల తరలింపు అక్టోబర్ 21న ప్రారంభమయ్యింది. తెలుగు రాష్ర్టాలతో పాటు మధ్య ప్రదేశ్, కర్ణాటకకు చెందిన గ్రామాలు ఉన్నాయి. తెలుగు రాష్ర్టాలు మినహా మిగతా వాటిల్లో అనేక గ్రామాలను చాలా కాలం కిందటే తరలించారు. నిర్మల్ జిల్లా కడెం మండలం మైసంపేట్, రాంపూర్ గిరిజనులు తమ గ్రామాలను వీడారు.
నియామకాలు
తిప్పన విజయసింహారెడ్డి
l తెలంగాణ స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్ఏఐడీసీ) నూతన చైర్మన్‌గా డిసెంబర్ 11న బాధ్యతలు స్వీకరించారు.
ఇస్లావత్ రామచంద్రనాయక్
l రాష్ట్ర గిరిజన ఆర్థికాభివృద్ధి సంస్థ చైర్మన్‌గా నియమితులయ్యారు. నల్లగొండ జిల్లా త్రిపురారం మండలానికి చెందినవారు.
మేడే రాజీవ్ సాగర్
l ప్రభుత్వ రంగ సంస్థ తెలంగాణ ఫుడ్స్ చైర్మన్‌గా నియమితులయ్యారు
ఖాజా ముజిబుద్దీన్
l రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్‌గా జూలై 21న బాధ్యతలు స్వీకరించారు.
మంత్రి శ్రీదేవి
l రాష్ట్ర అధికార భాషా సంఘం చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు.
వార్తల్లో వ్యక్తులు
మాలావత్ పూర్ణ
l ఏడు ఖండాల్లోని ఎత్తయిన శిఖరాలను అధిరోహించారు. ఉత్తర అమెరికాలో అత్యంత ఎత్తయిన పర్వతం డెనాలిని జూన్ 5న అధిరోహించడం ద్వారా ఈ ఘనత దక్కించుకున్నారు.
ఇన్నోవేషన్ ఫర్ యూ
l అంకుర సంస్థల్లో విజయవంతమైన 75 మంది మహిళ వ్యవస్థాపకుల వివరాలతో ‘ఇన్నోవేషన్ ఫర్ యూ’ అనే కాఫీ టేబుల్ బుక్ విడుదలయ్యింది. అటల్ ఇన్నోవేషన్ మిషన్ దీన్ని తీసుకొచ్చింది. తెలంగాణ నుంచి ఇందులో ఐదు మందికి చోటు దక్కింది. వాళ్లు…
l శ్రుతిరెడ్డి రాపోలు: అంత్యేష్టి ఫ్యూనరల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు.
l సంతోషి బుద్దిరాజు: ఆటోక్రసీ మెషినరీ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు.
l శ్వేతాగెల్లా: గరుడాస్త్ర ఏరో ఇన్వెంటివ్ సొల్యూషన్స్ వ్యవస్థాపకురాలు.
l ప్రతిభా భారతి: నేచుర్స్ బయో ప్లాస్టిక్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు.
l శ్రీవల్లి శిరీష: నియో ఇన్వెట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు.
రమేష్ కార్తిక్
l బల్దేర్ బండి రచయిత రమేష్ కార్తిక్. అతడు రాసిన జారేర్ బాటి కవితను కాకతీయ విశ్వవిద్యాలయం అటానమస్ కళాశాల డిగ్రీ ఐదో సెమిస్టర్ సిలబస్‌లో రేండేళ్ల కిందటే చేర్చింది. తాజాగా ఈ సంపుటిని ఆంధ్రవిశ్వవిద్యాలయం ఎంఏ తెలుగు నాలుగో సెమిస్టర్ సిలబస్‌లో చేర్చింది. రమేష్ కార్తిక్‌ది నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలంలో వివేక్ నగర్ తండా.
వెల్ది హరిప్రసాద్
l రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్. ఆయన పేరును ప్రధాని నరేంద్రమోదీ మన్ కీ బాత్‌లో ప్రస్తావించారు. చేనేత మగ్గంపై మూడు రోజులు శ్రమించి వస్త్రంపై జీ-20 చిహ్నం తయారు చేసి, ప్రధానికి పంపి ప్రశంస అందుకున్నారు.
l హస్వి: ఐరోపాలోని అత్యంత ఎత్తయిన పర్వతం ఎల్బ్రస్ను అధిరోహించింది హస్వి అనే చిన్నారి. భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 14 సంవత్సరాల చిన్నారి ఈ విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే ఈ ఘనతను విశ్వనాథ్ కార్తికేయ అనే 13 సంవత్సరాల బాలుడు, వెంకట్ రెడ్డి, విజయలక్ష్మి అనే దంపతులు కూడా సాధించారు.
l సయ్యద్ హఫీజ్: ప్రముఖ బిజినెస్ పత్రిక ఫోర్బ్స్ ఇండియా ప్రకటించిన ‘టాప్ 100’ డిజిటల్ స్టార్స్‌లో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన యువకుడికి చోటు దక్కింది. 32వ స్థానంలో అతడు నిలిచారు. యూట్యూబ్‌లో నిర్వహిస్తున్న తెలుగు టెక్టట్స్కు ఈ గుర్తింపు లభించింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు