జీతం కోటి.. సాధించాడిలా !
నిర్దిష్ట ప్రణాళిక, స్పష్టమైన లక్ష్యం, ఎంచుకున్న సబ్జెక్టుపై ప్రేమ ఉంటే విజయం మన దాసోహమవుతుంది. లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఎంత కష్టమైనా అధిగమించగలననే ఆత్మవిశ్వాసం ఉండాలి. అవన్నీ కలగలిపి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుని ఔరా అనిపించాడు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణానికి చెందిన మల్కిరెడ్డి సాయి ఆర్యన్‌రెడ్డి. చిన్ననాటి నుంచి కలలుగన్న ఐఐటీ మద్రాసులో సీటు సాధించి ఇండియాలోనే ప్రముఖ కంపెనీలో సంవత్సరానికి రూ.కోటి ప్యాకేజీతో ప్లేస్మెంట్ సాధించాడు. సాయి ఆర్యన్‌రెడ్డి మంచి ప్లేస్మెంట్ సాధించడానికి ఎలా చదివాడు, సబ్జెక్టుపై పట్టు సాధించడానికి ఆయన వేసుకున్న ప్రణాళిక వంటి అంశాల గురించి ఆయన మాటల్లోనే..
సాయి ఆర్యన్ రెడ్డి ఎస్ఎస్సీలో 9.8జీపీఏ, ఇంటర్లో 981మార్కులు సాధించాను. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 112 ర్యాంకు వచ్చింది. ఐఐటీ మద్రాస్‌లో సీఎస్సీ బ్రాంచిలో సీటు లభించింది. మొత్తం 8 సెమిస్టర్లలో ఏడు పూర్తి చేసి అన్నిట్లోనూ మంచి గ్రేడ్ సాధించాను. మరో సెమ్ మిగిలి ఉండగానే కళాశాలలో జరిగిన క్యాంపస్ సెలక్షన్లో ‘గ్రావిటాన్ (GRAVITON)’ అనే సాఫ్ట్వేర్ కంపెనీ రూ.కోటి ప్యాకేజీతో ఎంపిక చేసుకుంది. ఏడో తరగతి నుంచి ఇంటర్ వరకు ఉచిత విద్యతో పాటు జేఈఈలో మంచి ర్యాంకు సాధించినందుకు ఫిట్జీ స్కూల్‌వారు ఐఐటీ మద్రాస్‌లో బీటెక్ పూర్తయ్యే వరకు ఏటా రూ.2.50 లక్షల స్కాలర్షిప్ ఇచ్చారు. ఆదిత్య బిర్లా వారు నిర్వహించిన టాలెంట్ టెస్టులో ప్రతిభ కనబర్చి ఏటా రూ.లక్ష స్కాలర్షిప్ను పొందుతున్నాను. అంటే బీటెక్ చదివే నాలుగేండ్లు ఏటా రూ.3.50లక్షల స్కాలర్షిప్ పొందుతున్నాను.
ఐఐటీ మద్రాస్‌లో సీటు రావడం అదృష్టంగా భావించాను. ఇందులోనూ ప్రతిభ కనబర్చాలనే తపనతో చాలా కష్టపడ్డాను. మొదటి సంవత్సరం రెండు సెమిస్టర్లలోనూ మంచి గ్రేడు వచ్చింది. సీ లాంగ్వేజ్, సీ ప్లస్ప్లస్పై పట్టు సాధించాను. నిరంతరం వీటిపై ప్రాక్టీస్ చేసేవాడిని. ప్రొఫెసర్లు చెప్పే సబ్జెక్టుతో పాటు కోడింగ్‌పై పూర్తి అవగాహన పెంచుకున్నాను. రెండో సంవత్సరంలో మొదటి సంవత్సరం సిలబస్‌ను రివైజ్ చేసుకుంటూ ప్రస్తుత సబ్జెక్టులపై అవగాహన పెంచుకునేవాడిని. కోడింగ్, సీ ప్లస్ వంటి వాటిపై పూర్తి అవగాహన కోసం పలు వెబ్సైట్లను ఫాలో అయ్యేవాడిని. అందులోని అంశాలను, ఆయా వెబ్సైట్లలో సీనియర్ల అనుభవాలు, సబ్జెక్టుల్లో మెలకువలను నేర్చుకున్నాను. మూడు, నాలుగో సంవ్సరంలో ఆపరేటింగ్ సిస్టం, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టం, కంప్యూటర్ నెట్వర్క్ సబ్జెక్టుల్లో రాణించాను.
బీటెక్ సీఎస్ఈ సెకండ్, థర్డ్ ఇయర్ సమయంలో సబ్జెక్టు పరంగా ఎక్కువ విషయాలను తెలుసుకునేందుకు మూడు వెబ్సైట్లను ఫాలో అయ్యాను. ఇందులో లీట్‌కోడ్ డాట్ కామ్(LEETCOD.COM), కోడ్ఫోర్సెస్ డాట్ కామ్(CODEFORCES.COM), కోడ్‌చెఫ్ డాట్ కామ్(CODECHEF.COM) తదితరాలు ఉన్నాయి. వీటిల్లో దాదాపు 10 నుంచి 20వేల ప్రశ్నలు ఉంటాయి. వీటన్నింటికీ సమాధానం చెప్పగలిగితే అన్ని సబ్జెక్టులపై పట్టు సాధించినట్లే. దీంతో కంప్యూటర్ భాషా నైపుణ్యం పెరుగుతుంది. క్యాంపస్ సెలక్షన్ ఇంటర్వ్యూలకు కూడా ఇది దోహదపడుతుంది. డేటా స్ట్రక్చర్ అండ్ అల్గారిథం కోర్సులో కూడా నైపుణ్యం వస్తుంది. కాబట్టి సీఎస్ఈ విద్యార్థులు పై వెబ్సైట్లను ఫాలో అయితే మంచిదని నా అభిప్రాయం.
దాదాపు అన్ని ఐఐటీ ఇన్స్టిట్యూట్లలో 6-7 సెమిస్టర్లు పూర్తికాగానే క్యాంపస్ సెలక్షన్స్ ఉంటాయి. కోడింగ్, సీప్లస్పై నిరంతరం ప్రాక్టీస్ చేయడం, వివిధ వెబ్సైట్లలో పొందుపరిచిన సిలబస్‌ను చదవడం, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడం చేయాలి. సీనియర్స్, ఇంతకు ముందు హైప్యాకేజీ తీసుకుంటున్న వారి అనుభవాలను కూడా వెబ్సైట్లలో గమనించాలి. సాఫ్ట్ స్కిల్స్ కోసం ఆన్లైన్లోని ఎన్పీటీఈఎల్ వెబ్సైట్ ఎంతో ఉపయోగపడుతుంది. గ్రూప్ డిస్కషన్స్ ఉండాలి. విద్యార్థులే ఒకరికొకరు ఇంటర్వ్యూ చేసుకోవడం ద్వారా కొత్త విషయాలను తెసుకోవడం, ఇంటర్వ్యూలో రాణించడం కోసం ఉపయోగపడుతుంది.
n క్యాంపస్ సెలక్షన్లో సబ్జెక్టుల్లో గ్రేడులు, సబ్జెక్టుపై అవగాహన, కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్‌ను ముఖ్యంగా పరిగణనలోకి తీసుకుంటారు. సబ్జెక్టుతోపాటు కాన్ఫిడెన్స్ కూడా దోహదపడుతుంది. మొదటి, రెండో సంవత్సరం పరీక్షల్లో 9 ప్లస్, లేదా 8.5 ప్లస్, లేదా 8 ప్లస్ గ్రేడ్ వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. అందుకే బీటెక్ మొదటి రెండు సంవత్సరాల పరీక్షలు బాగా ప్రిపేరయి రాయాలి. మూడు, నాలుగో సంవత్సరంలో స్కిల్స్ పెంచుకోవడం, ప్రాక్టీస్‌కే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది కాబట్టి ఈ రెండు సంవత్సరాల్లో సబ్జెక్టు గ్రేడులను సెలక్టర్లు అంతగా పట్టించుకోరు. అయితే ఏ కంపెనీ ఇంటర్వ్యూకు వెళ్తున్నామో ఆ కంపెనీ గురించి ముందే ఆన్లైన్లో తెలుసుకోవడం మంచిది.
క్యాంపస్ సెలక్షన్లో భాగంగా మొదట ఆయా సబ్జెక్టులపై టెస్టు నిర్వహించారు. అప్పటికే పలు వెబ్సైట్లలోని ప్రశ్నలను ఛేదించాను కాబట్టి కంపెనీ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాను. అనంతరం ఇంటర్వ్యూలో ఆపరేటింగ్ సిస్టం, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టం, కంప్యూటర్ నెట్వర్క్ సిస్టంలపై ప్రశ్నలడిగారు. వీటి గురించి ఆన్లైన్లో చదువుకోవచ్చు. అప్పటికే గ్రావిటన్ కంపెనీ గురించి తెలుసుకున్నాను. ఆ దిశగా సమాధానాలు చెప్పాను. దీంతో సెలక్టర్లు నన్ను ఎంపిక చేసినట్లు ప్రకటించారు. ఏటా రూ.50లక్షల బేసిక్, రూ.30 లక్షల నుంచి రూ.60లక్షల వరకు బోనస్, నాన్క్యాష్ బెనిఫిట్ కింద రూ.10 లక్షలు ఇచ్చేందుకు అగ్రిమెంట్ చేసుకున్నాం. సగటున ఏటా రూ.కోటి ప్యాకేజీ ఉంటుంది. ఇంత మంచి ప్యాకేజీతో ప్రముఖ కంపెనీలో ఉద్యోగం రావడం ఆనందంగా ఉంది.
ఈజిప్టులో త్వరలోనే జరుగబోయే ఐసీపీసీ కోడింగ్ కాంపిటీషన్‌కు నేను ఎంపికయ్యాను. ఇండియా నుంచి నాలుగు టీంలు ఎంపికయ్యాయి. ఒక్కో టీంలో ముగ్గురు ఉంటారు. ఐఐటీ మద్రాస్ నుంచి ఎంపికైన టీంలో నేను సభ్యుడిగా ఉండటం ఆనందంగా ఉంది. కంప్యూటర్ సైన్స్‌లో పోటీ పడేందుకు ప్రపంచవ్యాప్తంగా టీమ్‌లు వస్తాయి. అందులో రాణించేందుకు మా టీం సభ్యులం ప్రిపేరవుతున్నాం. ఇండియా లెవల్లో పెట్టే పోటీల్లో ప్రతిభ కనబర్చిన టీంలను వరల్డ్ లెవల్ పోటీలకు ఎంపిక చేస్తారు. అందులో ప్రతిభ కనబర్చి మెడల్ సాధించడమే లక్ష్యం.
చిన్ననాటి నుంచి మంచి గోల్ పెట్టుకొని చదివితే రాణించగలుగుతాం. చదువుతున్న సబ్జెక్టుపై ఇష్టాన్ని పెంచుకోవాలి. ప్రతి కాంపిటీటివ్ ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలి. మనకు తెలియకుండానే ఎన్నో టాలెంట్ టెస్టులు, స్కాలర్షిప్ అర్హత పరీక్షలు జరుగుతుంటాయి. వాటి గురించి తెలుసుకొని అందులో రాణిస్తే తల్లిదండ్రులపై భారం పడకుండా చదువుకోగలుగుతాం. నిత్య సాధన, సబ్జెక్టుపై ఆసక్తి, ఉన్నత లక్ష్యం ఉంటే ఎంతటి విజయాన్నయినాసాధించగలుగుతాం.
కొన్ని రోజులు పలు కంపెనీల్లో పనిచేసిన అనుభవంతో సొంతంగా సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించాలన్నదే నా లక్ష్యం. నాతో పాటు ప్రతిభ కలిగిన మరో వంద మందికి ఉపాధి కల్పించాలని గోల్‌గా పెట్టుకున్నా. నాకు విదేశాల్లో రూ.1.50కోట్ల ఆఫర్ కూడా వచ్చింది. కానీ నేను ఇండియాలోనే ఉండి కంప్యూటర్ సైన్స్‌లో రాణించి, ఇందులో కొత్తపోకడలను ఆవిష్కరించాలని ఉంది. నా స్కిల్స్, నా సర్వీసు దేశానికే చెందాలని నా ఉద్దేశం. కంప్యూటర్ సైన్స్‌లో మన దేశం ఎప్పటికీ తక్కువ కాదని నిరూపిం చాల్సిన అవసరం ఉంది. అందుకు నా వంతు కృషి చేస్తా.
చదువంతా స్కాలర్‌షిప్‌తోనే..
నాన్న మల్కిరెడ్డి మోహన్‌రెడ్డి, అమ్మ మాధవి. నాన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు, అమ్మ గృహిణి. 6వ తరగతి వరకు హుస్నాబాద్‌లోనే చదువుకున్నా. హైదరాబాద్‌లోని ఫిట్జీ వరల్డ్ స్కూల్(FIITJEE WORLD SCHOOL) వారు నిర్వహించిన టాలెంట్ టెస్టులో ఎంపికై దిల్‌షుఖ్‌నగర్ బ్రాంచిలో ఏడో తరగతిలో స్కాలర్‌షిప్‌తో కూడిన ఉచిత సీటును సాధించి ఇంటర్ వరకు అందులోనే చదివాను. అప్పటి నుంచే ఐఐటీలో సీటు సాధించాలనే గోల్ పెట్టుకున్నా.. అందుకు తగ్గట్టు కష్టపడ్డా. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకు మాదాపూర్ బ్రాంచిలో చదివాను. జేఈఈ అడ్వాన్స్‌లో 112 ర్యాంకు రావడం నాకు కలిసొచ్చింది. ఫిట్జీ స్కూల్ నుంచి రూ.2.50లక్షలు, ఆదిత్య బిర్లా ట్రస్టు నుంచి రూ.లక్ష మొత్తం రూ.3.50 లక్షల స్కాలర్‌షిప్‌తో మా తల్లిదండ్రులపై భారం పడకుండా బీటెక్ పూర్తి చేస్తున్నాను.
కరెంట్ అఫైర్స్
ఫిఫా విన్నర్: ఫుట్‌బాల్ వరల్డ్ కప్ (ఫిఫా)- 2022ను అర్జెంటీనా గెలుచుకుంది. ఖతార్‌లోని దోహాలో డిసెంబర్ 18న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఫ్రాన్స్‌ను షూటౌట్లో 4-2తో ఓడించింది. దీంతో 36 ఏండ్ల తర్వాత అర్జెంటీనా కల నెరవేరింది. విజేత జట్టు (అర్జెంటీనా)కు రూ.347 కోట్లు, రన్నరప్ (ఫ్రాన్స్) జట్టుకు రూ.248 కోట్ల ప్రైజ్‌మనీ లభించింది.
విశేషాలు
- ప్రపంచ కప్‌లో అత్యధిక విజయాల్లో పాల్గొన్న ఆటగాడిగా లియోనల్ మెస్సీ.. జర్మనీ దిగ్గజం మిరోస్లావ్ క్లోజ్ (17)తో సమానంగా నిలిచాడు. అర్జెంటీనాకు ఇది మూడో టైటిల్. గతంలో 1978, 1986లో గెలిచింది.
- వరల్డ్ కప్‌లో అత్యధిక మ్యాచ్‌లు (26) ఆడిన ఆటగాడిగా మెస్సీ రికార్డుల్లోకెక్కాడు.
- ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక సమయం మైదానంలో ఉన్న ఆటగాడిగా (2,314 నిమిషాలు) మెస్సీ రికార్డు సృష్టించారు. పాలో మాల్డిని (2,217 నిమిషాలు) రెండో స్థానంలో ఉన్నాడు.
- ఒకే ప్రపంచ కప్‌లో గ్రూప్ స్టేజ్, రౌండ్-16, క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్లో గోల్స్ చేసిన తొలి ఆటగాడిగా మెస్సీ రికార్డు సృష్టించాడు.
- 56 ఏండ్ల తర్వాత ఫిఫా ప్రపంచ కప్‌లో హ్యాట్రిక్ గోల్ కొట్టిన ఆటగాడిగా ఎంబాపే రికార్డు సాధించాడు. ఈ ప్రపంచ కప్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా ఫ్రాన్స్ ప్లేయర్ ఎంబాపే (8) నిలిచాడు. మెస్సీ (7) రెండో స్థానంలో ఉన్నాడు.
- మిసెస్ వరల్డ్-2022
- మిసెస్ వరల్డ్-2022 కిరీటాన్ని భారత్‌కు చెందిన సర్గం కౌశల్ గెలుచుకుంది. అమెరికాలోని లాస్ వెగాస్‌లో డిసెంబర్ 18న ఈ పోటీలను నిర్వహించారు. పెండ్లయిన వారికి నిర్వహించే ఈ పోటీలో 63 దేశాల నుంచి అందగత్తెలు పాల్గొనగా, సర్గం కౌశల్ విజేతగా నిలిచింది. ఆమె భర్త ఆది కౌశల్ భారత నౌకాదళ అధికారిగా విశాఖపట్నంలో పనిచేస్తున్నారు. 21 ఏండ్ల తర్వాత భారత్‌కు మిసెస్ వరల్డ్ కిరీటం దక్కింది. 2001లో తొలిసారి భారత్‌కు చెందిన డాక్టర్ అదితి గోవిత్రికర్ ఈ కిరీటాన్ని దక్కించుకున్నారు. 1984 నుంచి ఈ పోటీలను నిర్వహిస్తున్నారు.
-దరిపెల్లి రాజు, ఆర్సీ ఇన్చార్జి, హుస్నాబాద్
- Tags
- nipuna news
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు