ఎన్నికల కమిషనర్ల నియామకం – వివాదం
ఎలక్షన్ కమిషన్.. ప్రజస్వామ్య దేశానికి వెన్నెముక. అటువంటి ఎలక్షన్ కమిషన్ రాజకీయ నాయకుల స్వలాభం వల్ల మసకబారుతుంది. ఇటీవల ఎన్నికల కమిషనర్‌ను త్వరితగతిన, ఒకేఒక్క రోజులో నియమించడం, ఆరేండ్లు ఉండాల్సిన కమిషనర్‌ను పదవీకాలం కంటే ముందే తొలగించడం వంటి వాటి వల్ల ఎలక్షన్ కమిషన్ వివాదాలకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో గ్రూప్-1 దృష్ట్యా ఎలక్షన్ కమిషన్, కమిషనర్ల నియామకం, వివాదాల గురించి తెలుసుకుందాం..
- రాజ్యాంగంలో కొన్ని సంస్థలను బుల్ వాక్స్ ఆఫ్ డెమోక్రసీ అంటారు. ప్రజాస్వామ్యానికి పట్టం కడుతూ, పరిరక్షణ కల్పిస్తూ, దాన్ని ముందుకు నడిపే వ్యవస్థలనే బుల్ వాక్స్ ఆఫ్ డెమోక్రసీ అంటాం. కేంద్ర ఎన్నికల సంఘం, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఫైనాన్స్ కమిషన్ ఇలాంటి వాటినే బుల్ వాక్స్ ఆఫ్ డెమోక్రసీ అంటాం. ఇందులో ముఖ్యమైనది ఎలక్షన్ కమిషన్. ప్రజాస్వామ్యం వర్థిల్లాలన్నా, బతకాలన్నా, భద్రంగా ఉండాలన్నా, ప్రజాస్వామ్యం ప్రజలచే నడపబడాలన్నా ఎలక్షన్ కమిషన్ పాత్ర కీలకం. ఎందుకంటే నిష్పక్షపాతమైన ఎన్నికలను నిర్వహించడమనేది ప్రజస్వామ్య దేశంలో అత్యంత కీలకం. ఈ ఎన్నికల సంఘం గురించి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 నుంచి 329 వరకు పేర్కొన్నారు. అయితే ఎలక్షన్ కమిషన్‌లో కమిషనర్లు ఎంతమంది ఉండాలనేది రాజ్యాంగంలో పూర్తి స్థాయిలో సమాచారం లేదు. రాష్ట్రపతి ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర కమిషనర్లను నియమిస్తాడు అని మాత్రమే పేర్కొన్నారు. అంటే ఎంతమంది ఎన్నికల కమిషనర్లు ఉంటారు అని రాజ్యాంగంలో పేర్కొనలేదు. ఎన్నికల సంఘం 1950లో ప్రారంభమైనప్పటి నుంచి 15 అక్టోబర్ 1989 వరకు ఏక సభ్య సంస్థగా ఉంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) మాత్రమే దాని ఏకైక సభ్యుడు. 16 అక్టోబర్ 1989న ఓటింగ్ వయస్సు 21 నుంచి 18 సంవత్సరాలకు మార్చారు. కాబట్టి ఎన్నికల సంఘం పెరిగిన పనిని ఎదుర్కోవడానికి రాష్ట్రపతి మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్లను నియమించారు. అప్పటి నుంచి ఎన్నికల సంఘం 3 ఎన్నికల కమిషనర్లతో కూడిన బహుళ-సభ్య సంస్థగా మారింది. తరువాత జనవరి 1990లో ఎన్నికల కమిషనర్ల రెండు పదవులు తొలగించారు. ఎన్నికల సంఘం మునుపటి స్థితికి మార్చారు. 1993 అక్టోబర్‌లో రాష్ట్రపతి మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్లను నియమించినప్పుడు ఇది మళ్లీ పునరావృతమైంది. అప్పటి నుంచి ఎన్నికల సంఘం 3 కమిషనర్లతో కూడిన బహుళ-సభ్య సంస్థగా పనిచేస్తుంది. చీఫ్, ఇద్దరు ఇతర ఎన్నికల కమిషనర్లకు జీతాలతో సహా ఒకే విధమైన అధికారాలు, పారితోషికాలు ఉంటాయి. ఇవి సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమానంగా ఉంటాయి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ లేదా ఇద్దరు ఇతర ఎన్నికల కమిషనర్ల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడితే ఆ విషయాన్ని కమిషన్ మెజారిటీతో నిర్ణయిస్తుంది. వారు 6 సంవత్సరాల పాటు లేదా 65 సంవత్సరాలు వచ్చే వరకు పదవిలో ఉంటారు. వారు కూడా తొలగించబడవచ్చు లేదా వారి పదవీకాలం ముగిసేలోపు ఎప్పుడైనా రాజీనామా చేయవచ్చు.
- ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమిషనర్, మరో ఇద్దరు ఇతర ఎన్నికల కమిషనర్లతో ఎన్నికల సంఘం పని చేస్తుంది. ఇటీవల ఎన్నికల సంఘం వార్తల్లో నిలవడానికి కారణం అరుణ్ గోయల్ అనే పంజాబ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి ఎన్నికల కమిషనర్‌గా నియమితులవడం. త్వరితగతిన, ఒకేఒక్క రోజులో వేగంగా తన నియామకం జరగడం కొన్ని అనుమానాలకు దారి తీసింది. ఈ విషయంపై సుప్రీంకోర్టులో కేసు వేశారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్ట్ తన నియామకానికి సంబంధించిన ఫైలును తనకు సమర్పించమని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దీంతో పెద్ద దుమారమే రేగింది. అసలు ఎన్నికల కమిషనర్ల నియామకాలు రాజకీయ నియామకాల వలే జరుగుతున్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేసింది అత్యున్నత న్యాయస్థానం. ఎన్నికల కమిషనర్లు ఏదైనా తప్పు జరిగినప్పుడు ప్రధానమంత్రిని సైతం ప్రశ్నించే విధంగా విధిని నిర్వహించాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేయడం ప్రాముఖ్యం సంతరించుకుంది. దీనికి ప్రభుత్వం సైతం తనదైన వ్యాఖ్యలు చేయడం సుప్రీంకోర్టులో వాదోపవాదాలను తలపించింది. గత 20 సంవత్సరాల ఎన్నికల సంఘం చరిత్ర చూస్తే ఏ ఒక్క ఎన్నికల ప్రధాన కమిషనర్ కూడా 2004 నుంచి ఇప్పటివరకు ఆరు సంవత్సరాల పదవీకాలాన్ని పూర్తి చేయలేదు. ఇలా ప్రధాన కమిషనర్ పదవి రావడం, పోవడంలా తయారైంది. గత యూపీఏ ప్రభుత్వంలో పది సంవత్సరాల పదవీకాలంలో ఆరుగురు ప్రధాన ఎన్నికల కమిషనర్లు మారారు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వ గత ఎనిమిదేళ్ల కాలంలో ఎనిమిది మంది ప్రధాన ఎన్నికల కమిషనర్లు మారారు. ఇంతలా ఈ మార్పు ఏంటి అని కూడా చాలా మందిలో ఎన్నికల సంఘం పారదర్శకతపై అనుమానాన్ని కలుగజేస్తుంది. సుప్రీంకోర్టు నియామకంలో కొలీజియం వ్యవస్థ ఉంది. ఎలక్షన్ కమిషనర్ల నియామకంలో అలాంటి వ్యవస్థ లేదు. ప్రభుత్వ సిఫారసుల మేరకు రాష్ట్రపతి కమిషనర్లను నియమిస్తే వారు ఎన్నికల సమయంలో ప్రభుత్వానికి మద్దతుగా నిలిచే అవకాశం ఉంది. అలాంటప్పుడు దేశంలో నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణ ఎలా సాధ్యం అని సగటు పౌరుడికి కూడా అనుమానం వస్తుంది. స్వలాభం లేనిదే ఏ వ్యక్తి కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోడు. అలా ఈ నియామకంలో కూడా దీన్ని అనువర్తించవచ్చు. ఎన్నికల కమిషనర్ల నియామకంలో కొలీజియం వంటి వ్యవస్థ తీసుకురావాలన్నా, కమిటీ వేయాలన్నా దానికి ఆర్టికల్ 368 ఆధారంగా రాజ్యాంగ సవరణ అవసరం. ఇది అంత తేలికైన విషయం కాదు.
- రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించి ఎటువంటి చట్టం కూడా తీసుకురాలేదు. ఆర్టికల్ 324 అనేది నియామక ప్రక్రియ గురించి సమాచారాన్ని ఇవ్వడంలో మౌనంగా ఉందన్నమాట. ప్రభుత్వం సూచించే వ్యక్తిని రాష్ట్రపతి నియమించడం మాత్రమే చూస్తున్నాం. రాజ్యాంగ బద్ధ పదవి నియామకంలో రాజకీయాలు చోటుచేసుకోవడం ఎన్నికల సంఘం స్వతంత్రతను ప్రశ్నిస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ఎన్నికల సంఘం స్వతంత్ర, నిష్పక్షపాత పనితీరును పరిరక్షించడానికి, నిర్ధారించే నిబంధనలను ఈ విధంగా పేర్కొంది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు పదవీకాల భద్రత కల్పిస్తారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి వలే అదే పద్ధతిలో, అదే కారణాలతో తప్ప పదవి నుంచి తొలగించలేరు. మరో విధంగా చెప్పాలంటే నిరూపితమైన దుష్ప్రవర్తన లేదా అసమర్థత కారణంగా ప్రత్యేక మెజారిటీతో పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన తీర్మానం ఆధారంగా రాష్ట్రపతి అతన్ని తొలగించవచ్చు. కానీ ఎన్నికల సంఘానికి సంబంధించి ఇలా రాజ్యాంగ నిబంధనలో ఉన్న అర్ధ సమాచారం రాజకీయ పార్టీలకు, ప్రభుత్వాలకు అస్త్రంగా మారుతున్నాయి. మొదట ఒక వ్యక్తిని ఎన్నికల కమిషనర్‌గా నియమించడం, తర్వాత వారే ప్రధాన ఎన్నికల కమిషనర్ అవడం, అధికారంలో ఉన్న ప్రభుత్వానికి మద్దతివ్వడం ఉంటుంది అనే వాదన వినికిడిలో ఉంది. దేశంలో 1990 నుంచి 1996 వరకు ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా విధులు నిర్వర్తించిన టీఎన్ శేషన్ లాంటి ప్రముఖులు ఎన్నికల సంస్కరణల కోసం చాలా ప్రయత్నాలు చేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను తీసుకొచ్చింది కూడా ఈయనే. ఏ పార్టీకి, ప్రభుత్వానికి తలొగ్గని గొప్ప వ్యక్తి. ప్రధాన ఎన్నికల కమిషనర్ తొలగింపు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల తొలగింపు ఒకే విధంగా ఉంటుంది. కానీ ఎన్నికల కమిషనర్ల తొలగింపు మాత్రం ప్రధాన ఎన్నికల కమిషనర్ సూచన మేరకు జరగడం అనేది ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇతర ఎన్నికల కమిషనర్ల కంటే గొప్ప అనే భావనపై కూడా న్యాయస్థానాల్లో చర్చకు వస్తున్నాయి. దీనిలో కూడా మార్పులు రావాలని చాలా మంది కోరుకుంటున్నారు. రాజ్యాంగం ఎన్నికల సంఘం స్వాతంత్య్రం, నిష్పాక్షికతను కాపాడటానికి, నిర్ధారించడానికి ప్రయత్నించినప్పటికీ కొన్ని లోపాలను గుర్తించవచ్చు. అంటే రాజ్యాంగం ఎన్నికల కమిషన్ సభ్యుల అర్హతలను (చట్టపరమైన, విద్య, పరిపాలన లేదా న్యాయపరమైన) నిర్దేశించలేదు. పదవీ విరమణ చేస్తున్న ఎన్నికల కమిషనర్లను ప్రభుత్వం తదుపరి ఎలాంటి నియామకం చేయకుండా రాజ్యాంగం నిషేధించలేదు.
మొత్తానికి ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ సంస్థ, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే సంస్థ. కాబట్టి ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకంలో, తొలగింపులో మార్పులు రావాలి. ఆ మార్పులు రావాలంటే రాజ్యాంగ సవరణ అవసరం. కానీ ఈ మార్పు కేవలం కోర్టుల్లో కాదు.
-మల్లవరపు బాలలత సివిల్స్ ఫ్యాకల్టీ సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ, హైదరాబాద్
Previous article
జీతం కోటి.. సాధించాడిలా !
Next article
Scholarships
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం