త్రెలంగాణ రాష్ట్రం.. అడవులకు నిలయం
- గూప్-1 ప్రత్యేకం
- ఇండియన్ జాగ్రఫీ
. నైరుతి రుతుపవనాల వైఫల్యానికి గల కారణాలను వివరించండి?
భారత వాతావరణ విభాగాన్ని అనుసరించి, రుతుపవనాలు ఆలస్యంగా రావడం, రుతుపవనాల కాలంలో వాతావరణం పొడిగా ఉండటం, ఆ కాలంలో రెండు వరుస వర్షాల మధ్యలో నేలలో తేమ లేకుండా ఉండటం లేదా భూ భాగం నుంచి ఆ రుతుపవనాలు త్వరగా తిరోగమించడాన్ని రుతుపవనాల ‘వైఫల్యం’ అంటారు.
వేసవి చివరి నాటికి భారత అఖండ భూ భాగంపై ఏర్పడే అల్ప పీడనం ఆ ఎగువ ట్రోపోస్పియర్లో ఉన్న అధిక పీడనం, రుతువపన మూలాలైన ఆగ్నేయ వ్యాపార పవనాల ఆగమనంపై ప్రభావం చూపే కారకాలు మన రుతుపవన వైఫల్యానికి కారణాలు.
సహజ కారణాల వల్ల లేదా మానవ నిర్మిత కారణాల వల్ల ఉద్భవించే అటవీ నిర్మూలన, కార్చిచ్చులు, నేలక్రమక్షయం, ఎడారీకరణ, భూ తాపం, శీతోష్ణస్థితి మార్పు మొదలైన ప్రపంచ పర్యావరణ సమస్యలు కూడా భారత రుతుపవనాల వైఫల్యానికి కారణాలుగా చెప్పవచ్చు.
రుతుపవనాల వైఫల్యానికి గల ప్రధాన కారణాలు
ఎల్ నినో: ఎల్ నినో అంటే పసిఫిక్ మహాసముద్రంలో భూమధ్య రేఖ వద్ద ఆవిర్భవించి, ఆగ్నేయానికి ప్రయాణించే ఒక సముద్ర ఉపరితల ఉష్ణ ప్రవాహం. ఇది సగటున ఆ ప్రాంతంలో ముఖ్యంగా దక్షిణ అమెరికా పశ్చిమ తీరమైన పెరూ తీరంలో 50 నుంచి 70 ఉష్ణోగ్రతల్ని పెంచుతుంది. తద్వారా అక్కడ ఒక బలమైన అల్పపీడన వ్యవస్థ ఏర్పడుతుంది. ఈ అల్పపీడనం వేసవి అంతానికి భారత భూ భాగం మీద ఏర్పడ్డ అల్పపీడనం కంటే బలమైనది. కాబట్టి ఆగ్నేయ వ్యాపార పవనాలు భూమధ్య రేఖను దాటక ముందే ఎల్ నినో సృష్టించే అల్పపీడనం వైపునకు తమ ప్రయాణాన్ని కొనసాగించడం వల్ల మన రుతుపవనాలు వైఫల్యం చెందుతాయి.
ఎల్ నినో ప్రభావం 3 లేదా 5 లేదా 7 సంవత్సరాలకు ఒకసారి ఉత్పన్నం అవుతుంది. మరుసటి సంవత్సరం ఈ పీడన వ్యవస్థలు తారుమారై మన రుతుపవనాల తీవ్రత పెరుగుతుంది. ఆ ప్రభావాన్ని ‘లా నినా’ అంటారు. ఎల్ నినో, లా నినా వల్ల పవనాలు, పీడనాలు భూమధ్య రేఖను ఆధారంగా చేసుకుంటూ, దాని కింద ఒకసారి తూర్పువైపునకు, మరోసారి పడమర వైపునకు చలిస్తుంటాయి. ఇలాంటి చలనం ముఖ్యంగా పసిఫిక్, హిందూ మహాసముద్రాల్లో గమనించడం జరిగింది. దీన్నే ‘దక్షిణ డోలనం’ అంటారు. భూతాపమో, ప్రతి భూమధ్య రేఖ ప్రవాహమో, శీతోష్ణస్థితి మార్పు ఇలా కొన్ని తెలియని కారణాల వల్ల ఈ ప్రభావం ఏర్పడుతుందని శాస్త్రవేత్తల అంచనా.
హిందూ మహాసముద్రపు ద్వి ధృవం రుణాత్మక విలువ (IOD): ఇంచుమించు ఎల్ నినో ఏర్పటడానికి గల కారణాలే ఐవోడీ ఏర్పడటానికి గల కారణాలుగా చెప్పవచ్చు. వాటికి అదనంగా ఎల్ నినో కూడా ఒక కారణంగా చెబుతున్నారు. సగటున 30 సంవత్సరాల్లో నాలుగు సంవత్సరాలు వాయవ్య హిందూ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీన్నే ఐవోడీ అంటారు.
ఐవోడీ+ సందర్భంగా మన అల్పపీడన వ్యవస్థ మరింత బలపడి, రుతుపవనాల తీవ్రత పెరుగుతుంది.
ఐవోడీ సందర్భంలో మన అల్పపీడన వ్యవస్థ అధిక పీడనంగా మారే అవకాశం ఉంది. కాబట్టి రుతుపవనాల రాక జరగకపోవచ్చు.
మాడెన్-జులియన్ డోలనం (MJO): ఎంజేవో అనేది కొన్ని శీతోష్ణస్థితి అంశాల సమ్మేళనం, దీనిలో అధిక ఉష్ణోగ్రతలు, అల్పపీడనాలు, సంవహనం చెందే గాలులు, క్యుములోనింబస్ మేఘాలు (ఎత్తు 2000-800 మీ.) ఉరుములు, పిడుగులు, కుంభవృష్టి మొదలైనవి ఉంటాయి.
ఈ వ్యవస్థ పశ్చిమ హిందూ మహాసముద్రం నుంచి తూర్పు పసిఫిక్ మహాసముద్రం వరకు 60-90 రోజుల పాటు చలిస్తూ ఉంటుంది. ఈ చలనం నైరుతి రుతుపవనాలతో ఏకీభవిస్తే రుతుపవనాల సఫలత ఉంటుంది. లేకపోతే రుతుపవనాలు వైఫల్యం చెందే అవకాశం ఉంది.
తెలంగాణలో అటవీ విస్తరణను తెలుపుతూ అటవీ సంరక్షణ కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించి తెలియజేయండి?
తెలంగాణ భౌగోళిక, శీతోష్ణ స్థితి లక్షణాల ఆధారంగా మన రాష్ట్రంలో ఇండియన్ రాష్ట్ర అటవీ రిపోర్ట్ (ISFR) నివేదిక ప్రకారం 3 ప్రధాన అటవీ సమూహాలు ఉన్నాయి. అవి..
- ఉష్ణమండల శుష్క ఆకురాల్చే అరణ్యాలు
- ఉష్ణమండల తేమతో కూడిన ఆకురాల్చే అరణ్యాలు
- ఉష్ణమండల ముళ్ల జాతి అరణ్యాలు
రాష్ట్ర అటవీ విభాగం వార్షిక నివేదిక ప్రకారం రాష్ట్రంలో 26,969 చ.కి.మీ. విస్తీర్ణంలో అడవులు ఉన్నట్లు, రాష్ట్ర భూ భాగంలో వాటి వాటా 24.05 శాతం ఉన్నట్లు చెబుతున్నారు. ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ ప్రకారం సార్వత్రిక అరణ్యాల శాతం ఎక్కువ ఉన్నట్లు చెబుతుంది. రాష్ట్ర భూ భాగంలో అత్యంత సాంద్రత గల అడవులు కేవలం 1శాతం మాత్రమే ఉన్నాయి.
రాష్ట్రంలోని అడవుల విస్తరణ ఏకరీతిలో లేదు, విస్తీర్ణం పరంగా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, నాగర్‌కర్నూలు మొదటి మూడు స్థానాల్లో ఉంటే జిల్లాల్లో అడవుల శాతం ఆధారంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కుమ్రంభీం ఆసిఫాబాద్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. కరీంనగర్, గద్వాల, హైదరాబాద్ వంటి జిల్లాలు అత్యల్ప శాతం అడవులను కలిగి ఉన్నాయి.
భారత అటవీ విధానాల లక్ష్యం ఏదైతే ఉందో ఆ 33 శాతం లక్ష్యాన్ని ఆదిలాబాద్, కుమ్రంభీ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి, నాగర్‌కర్నూలు జిల్లాలు ఆ లక్ష్యం కంటే ఎక్కువ శాతంలో అడవులను కలిగి ఉన్నాయి.
జనాభా పెరుగుదల, అందుకు తగ్గట్టుగా వ్యవసాయ విస్తరణ, పట్టణ వలసలు, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, భూతాపం, శీతోష్ణస్థితి మార్పులు, కార్చిచ్చులు, మౌలిక సదుపాయాల కల్పన, ప్రాజెక్టుల నిర్మాణాలు, పర్యావరణ కాలుష్యం వంటి అన్ని అడవుల క్షీణతకు కారణాలవుతున్నాయి.
రాష్ట్రంలో కాళేశ్వరం, ఎస్ఎల్బీసీ, పాలమూరు వంటి ప్రాజెక్టుల వల్ల అధిక మొత్తంలో అడవులను కోల్పోవాల్సి వచ్చింది. అడవులు అటవీ ఆధారిత ఉత్పత్తుల వల్ల గత ఆర్థిక సంవత్సరంలో రూ.1944 కోట్ల ఆదాయం రాగా ప్రాథమిక రంగంలో దాని వాటా 1.77 శాతంగా, రాష్ట్ర జీఎస్వీఏలో 0.32 శాతం కలిగి ఉంది.
ఏదైతే కలప సేకరణ రాష్ట్ర అటవీ విస్తీర్ణాన్ని కోల్పోడానికి కారణమవుతుందో అటువంటి జాతులను అటవీయేతర భూముల్లో పెంచే లక్ష్యంగా ఇంచుమించు 33,000 హెక్టార్ల భూ భాగంలో యూకలిప్టస్, టేకు, వెదురు వంటి వృక్షజాతులను పెంచే విధంగా తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు.
అటవీ సంరక్షణ గావిస్తున్న అధికారులకు శిక్షణ ఇవ్వడానికి తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ అకాడమీని ఏర్పాటు చేశారు. అదేవిధంగా రాష్ట్ర ఏర్పాటు అనంతరం అటవీ విద్యను, పరిశోధనను ప్రోత్సహించడానికి ఫారెస్ట్ కాలేజీ, రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ను ములుగులో ఏర్పాటు చేశారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించి అటవీ పరిరక్షణ, సుస్థిర అటవీ కార్యకలాపాల చట్టాలైన అటవీ పరిరక్షణ చట్టం, అటవీ హక్కుల రక్షణ చట్టం, కంపా (CAMPA) చట్టాన్ని విజయవంతంగా అమలు పరుస్తూ, ఆ లక్ష్యాల్లో ఇంచుమించు 70 శాతం వరకు చేరుకున్నారు. పట్టణ ప్రాంతాల్లో అడవులను అభివృద్ధి పరచడానికి 109 అర్బన్ ఫారెస్ట్ బ్లాక్స్‌ను ఏర్పాటు చేశారు. వీటన్నింటికి మించి 33 శాతం అడవుల లక్ష్యంతో 2015 జూలైలో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణకు హరితహారం అనే ఒక ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీన్ని రెండు విభాగాలుగా అమలుపరుస్తూ వస్తుంది. మొదటి విభాగంలో అడవులను సాంద్రత గల అడవులుగా మార్చడం వాటికి పునరుజ్జీవనం తేవడం. రెండో విభాగంలో సామాజిక అడవుల పెంపక ఆదర్శంగా రోడ్డుకు ఇరువైపుల, వ్యర్థ భ్యూముల్లో సంస్థలు, కార్యాలయాలు, పాఠశాలల ఆవరణాల్లో, సామాజిక స్థలాల్లో విపరీతంగా మొక్కలు నాటడం ఇలా గత ఏడు విడతలుగా రాష్ట్రంలో ఇంచుమించు 236 కోట్ల మొక్కలు నాటారు.
దీని ఫలితంగానే ఐఎస్ఎఫ్ఆర్-2021 రిపోర్టులో అటవీ భూముల్ని ఎక్కువగా పెంచిన రెండో రాష్ట్రంగా, అటవీ శాతాన్ని ఎక్కువగా పెంచిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ ఉంది.
నైరుతి రుతుపవనాలకు, ఈశాన్య రుతుపవనాలకు మధ్య తేడాలను తెలపండి?
నైరుతి రుతుపవన కాలం వేసవికాలంలో అనుసంధానంగా ఉండి, వేసవి అనంతరం రుతుపవనాలు ఇస్తే ఈశాన్య రుతుపవన కాలం శీతాకాలంలో భాగంగా ఉండి, ఆ కాలం ఆరంభంలోనే రుతుపవనాలను ఇస్తుంది. నైరుతి రుతుపవనాలను వేసవి రుతుపవనాలు అని, ఈశాన్య రుతుపవనాలను శీతాకాలపు రుతుపవనాలు అని అంటారు.
నైరుతి రుతుపవనాలు భారతదేశంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల ఐటీసీజడ్ అల్పపీడనం వల్ల, టిబెట్ ప్రాంతపు అధిక ఉష్ణోగ్రతలతో కూడిన అల్పపీడనం వల్ల, పశ్చిమ జెట్ ప్రవాహాలు తూర్పు జెట్ ప్రవాహాలు ఎగువ ట్రోపోస్పియర్లో ఏర్పరచిన అధిక పీడనం వల్లనో, అదేవిధంగా మాస్కరిన్ దీవుల వద్ద ఏర్పడ్డ అధిక పీడనం వల్ల సంభవిస్తే, ఐటీసీజడ్ దక్షిణార్ధ గోళంలో ఉండటం వల్ల ద్వారా ఉపఖండం మీద ఏర్పడ్డ అధిక పీడనం వల్ల ఈశాన్య రుతుపవనాలు సంభవిస్తాయి.
తేడాలు
- నైరుతి రుతుపవనాలు సముద్రం నుంచి భూమ్మీదకు వస్తున్న తేమతో కూడిన జలపవనాలు. అయితే ఈశాన్య రుతుపవనాలు భూమి నుంచి సముద్రం వైపునకు వస్తున్న పొడి భూపవనాలు.
- నైరుతి రుతుపవనాలు ఎక్కువగా పర్వతీయ వర్షపాతాన్ని కొంత చక్రవాక వర్షపాతాన్ని ఇస్తుంటే ఈశాన్య రుతుపవనాలు చక్రవాక, పర్వతీయ వర్షపాతాన్ని సమానంగా ఇస్తున్నాయి.
- నైరుతి రుతుపవనాలు రెండు శాఖలుగా విడిపోయి, ఒక్కో శాఖ 3 భాగాలుగా భారత్‌లోకి ప్రవేశిస్తాయి. ఈశాన్య రుతుపవనాలు ఒకే శాఖగా, ఒకే భాగంగా భారత్‌లోకి ప్రవేశిస్తాయి.
- నైరుతి రుతుపవనాల వల్ల ఏర్పడ్డ చక్రవాకాలు తక్కువగా భారత పశ్చిమ తీరాన్ని తాకుతుంటే, ఈశాన్య రుతుపవనాల వల్ల ఏర్పడ్డ చక్రవాకాలు ఎక్కువగా భారత తూర్పుతీరాన్ని తాకుతున్నాయి.
- భారతదేశ సగటు వర్షపాతంలో 75 శాతాన్ని నైరుతి రుతుపవనాలు ఇస్తే, 15 శాతం మాత్రమే ఈశాన్య రుతుపవనాలు ఇస్తున్నాయి.
- నైరుతి రుతుపవనాలు భారత వ్యవసాయాన్ని దాని అనుబంధ రంగాన్ని తద్వారా భారత ఆర్థిక వ్యవస్థను విపరీతంగా ప్రభావానికి గురిచేస్తుంటే వీటిపై ఈశాన్య రుతుపవనాల ప్రభావం తక్కువ.
- నైరుతి రుతుపవనాలు భారత ఖరీఫ్ కాలంతో అనుసంధానాన్ని కలిగి ఉంటే ఈశాన్య రుతుపవనాల రబీ కాలంతో అనుసంధానాన్ని కలిగి ఉన్నాయి.
- వర్షాచ్ఛాయ ప్రాంతాలు మినహా మిగతా భారతదేశం అంతా నైరుతి రుతుపవన ఆక్రమణ జరిగితే, దక్షిణ భారతదేశంపై మాత్రమే ఈశాన్య రుతుపవనాల ఆక్రమణ ఉంటుంది.
- నైరుతి రుతుపవనాలపై ఎల్ నినో లా నినా, ఎంజేవో వంటి వాటి ప్రభావం ఉంటే, ఈశాన్య రుతుపవనాలకు అక్టోబర్, హీట్‌తో సంబంధం ఉంటుంది.
మనూలో సివిల్స్ ఉచిత కోచింగ్
హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ, సీఎస్ఈ రెసిడెన్షియల్ కోచింగ్ అకాడమీ సివిల్స్- 2023 పరీక్ష ఉచిత కోచింగ్ ప్రకటన విడుదల చేసింది.
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2023 ఉచిత కోచింగ్
అర్హతలు: గుర్తింపు పొందిన ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణత.
- ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ద్వారా
- దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
- చివరితేదీ: జనవరి 10
- పరీక్ష తేదీ: జనవరి 22
- ఫలితాల వెల్లడి: జనవరి 30
- ఇంటర్వ్యూలు: ఫిబ్రవరి 6
- కోచింగ్ ప్రారంభం: ఫిబ్రవరి 15
- పూర్తి వివరాల కోసం వెబ్సైట్:
- https://manuu.edu.in
-జీ గిరిధర్ సివిల్స్ ఫ్యాకల్టీ
బీసీ స్టడీ సర్కిల్హైదరాబాద్
9966330068
- Tags
- nipuna news
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు