డిజిటల్ రూపీ.. క్యాష్‌లెస్ కరెన్సీ!
- ప్రస్తుతం దేశంలో డిజిటల్ రూపీ అనే పదం
- విస్తృతంగా వినిపిస్తుంది. ఎందుకంటే
- డిజిటల్ రూపీని ఇటీవల భారత్‌లో
- ప్రారంభించారు. గ్రూప్-1, సివిల్స్‌లో దీనిగురించి అడగవచ్చు. ఈ నేపథ్యంలో
- డిజిటల్ రూపీ గురించి నిపుణ పాఠకుల కోసం..
మారుతున్న కాలానికి అనుగుణంగా మనిషి మారడం సహజం. మార్పు అనేది ఏ ఒక్క రంగానికి మాత్రమే సంబంధించింది కాదు. ఇటీవల నగదు వ్యవస్థలో ప్రపంచంలో చాలా పరిణామాలు జరగడం చూస్తూనే ఉన్నాం. అందులో ఎల్ సాల్వెడార్ మధ్య అమెరికాలోని ఒక చిన్న దేశం. ఈ దేశం బిట్‌కాయిన్‌ను చట్టబద్ధమైన (లీగల్ టెండర్) టెండర్‌గా స్వీకరించింది. దీంతో ప్రపంచంలోనే ఇలాంటి ఆవిష్కరణ చేసిన మొదటి దేశంగా నిలిచింది. బ్రిటన్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీని (బ్రిట్కాయిన్) రూపొందించే అవకాశాన్ని కూడా అన్వేషిస్తుంది. 2020లో చైనా తన అధికారిక డిజిటల్ కరెన్సీని పరీక్షించడం ప్రారంభించింది. దీన్ని అనధికారికంగా డిజిటల్ కరెన్సీ ఎలక్ట్రానిక్ చెల్లింపు DC/EP అని పిలుస్తున్నారు. 2018 ఏప్రిల్‌లో క్రిప్టో కరెన్సీ, డిజిటల్ కరెన్సీలను వాటి వల్ల జరిగే దుష్పరిణామాలను దృష్టిలో ఉంచుకొని RBI వాటిపై నిషేధాన్ని విధించింది. 2020 మార్చిలో సుప్రీంకోర్టు ఈ నిషేధాన్ని రాజ్యాంగ విరుద్ధమని కొట్టివేసింది. ఇలా డిజిటల్ పద్ధతిలో నగదు వ్యవస్థలో చాలా పరిణామాలను చూశాం, చూస్తూనే ఉన్నాం కూడా.
అలాంటి ఒక గొప్ప పరిణామం ఇటీవల భారత ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకుంది. అదే డిజిటల్ రూపీ ఆవిష్కరణ. నవంబర్ 1న భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) డిజిటల్ రూపాయి (సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ-CBDC)ని విడుదల చేసింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గత ఫిబ్రవరిలో తన బడ్జెట్ ప్రసంగంలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశంలో డిజిటల్ రూపాయిని ప్రారంభించనున్నట్లు తెలిపారు. అప్పటి నుంచి దేశంలో డిజిటల్ రూపాయి గురించి చర్చలు ప్రారంభమయ్యాయి.
ఈ డిజిటల్ రూపాయి వినియోగాన్ని రెండు దశల్లో అమల్లోకి తెస్తున్నట్లుగా ఆర్బీఐ తెలిపింది. తొలి హోల్‌సేల్ పైలట్ ప్రాజెక్ట్‌లో విడుదలయ్యే రూపాయి, ఎంపిక చేసిన బ్యాంకులు ప్రభుత్వ సెక్యూరిటీల్లో జరిపే లావాదేవీలకు మాత్రమే పరిమితం. ప్రభుత్వ బాండ్ల సెకండరీ మార్కెట్ లావాదేవీల సెటిల్మెంట్ కోసం డిజిటల్ రూపీని ఉపయోగించుకోవచ్చని ఆర్బీఐ తెలిపింది. తదుపరి రోజుల్లో ఇతర హోల్‌సేల్ విభాగాలు, క్రాస్-బోర్డర్ చెల్లింపుల్లో పైలట్ ప్రాజెక్టుల్ని అమలు చేస్తామని ఆర్బీఐ తెలిపింది. RBI ప్రకటన ప్రకారం, తొలుత తొమ్మిది బ్యాంకులు- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంక్, యెస్ బ్యాంక్, IDFC ఫస్ట్ బ్యాంక్, HSBC ఈ పైలట్ ప్రాజెక్టులో పాల్గొంటాయి.
CBDCని డిజిటల్ రూపంలో సెంట్రల్ బ్యాంక్ జారీ చేసిన లీగల్ టెండర్ అని వివరించవచ్చు. ఇది ఫియట్ (సాధారణ) కరెన్సీకి సమానంగా ఉంటుంది, ఫియట్ కరెన్సీతో డిజిటల్ కరెన్సీని ఒకదానికొకటి మార్పిడి చేసుకోవచ్చు. కేవలం దాని రూపం మాత్రమే భిన్నంగా ఉంటుంది. సరళంగా చెప్పాలంటే, CBDCని ప్రాథమికంగా మనం ఉపయోగించే ఫియట్ కరెన్సీల డిజిటల్ వెర్షన్ (ఎలక్ట్రానిక్ రూపంలో)గా పేర్కొనవచ్చు.
సాధారణంగా చాలామంది డిజిటల్ కరెన్సీని, క్రిప్టో కరెన్సీని ఒకటిగానే భావిస్తారు. కానీ రెండూ వేరు.
కేంద్ర బ్యాంకు CBDCని తీసుకురావడం అనే ఆలోచన బిట్‌కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీ నుంచి ప్రేరణ పొందినప్పటికీ, డిజిటల్ కరెన్సీ క్రిప్టో కరెన్సీకి భిన్నం. క్రిప్టో కరెన్సీ ‘చట్టపరమైన’ హోదాను కలిగి ఉండదు, ప్రభుత్వం జారీ చేయదు. కానీ ఈ డిజిటల్ కరెన్సీని చట్టబద్ధంగా అధికారికంగా కేంద్ర బ్యాంక్ ప్రారంభించింది. అనేక దేశాలు CBDCల పట్ల ఆసక్తిని వ్యక్తం చేస్తున్నప్పటికీ, కొన్ని దేశాలు మాత్రమే తమ సొంత CBDCలను అభివృద్ధి చేసే పైలట్ దశను దాటి ముందుకు వెళ్లగలిగాయి. RBI వెబ్సైట్ ప్రకారం 2021కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకుల సర్వేలో 86 శాతం మంది డిజిటల్ కరెన్సీ సామర్థ్యాన్ని చురుకుగా పరిశోధిస్తున్నారని, 60 శాతం మంది సాంకేతికతతో ప్రయోగాలు చేస్తున్నారని, 14 శాతం మంది పైలట్ ప్రాజెక్ట్‌లను అమలు చేశారని వెల్లడించారు.
డిజిటల్ కరెన్సీ ఆవశ్యకతకు ప్రస్తుతం చాలా కారణాలుగా పేర్కొనవచ్చు. ఉదాహరణకు క్రిప్టో కరెన్సీ అనేది ప్రైవేట్ వ్యక్తులు సృష్టించి, నిర్వహించే ఒక ద్రవ్య సాధనంగా మారింది. దీన్ని అడ్డుకోవాలంటే డిజిటల్ కరెన్సీ లాంటి నూతన చట్టబద్ధ ద్రవ్యం కావాల్సిందే. డిజిటల్ కరెన్సీని నియంత్రించడం ద్వారా సెంట్రల్ బ్యాంక్ ప్రైవేట్ అక్రమాలకు చెక్ పెట్టవచ్చు.
క్రిప్టో కరెన్సీలు ఏదైనా ఆస్తి లేదా కరెన్సీకి అనుసంధానించనందున, దాని విలువ కేవలం ఊహాగానాల (డిమాండ్, సరఫరా) ఆధారంగా నిర్ణయిస్తారు. దీని కారణంగా బిట్‌కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీల విలువలో భారీ అస్థిరత ఉంటుంది.
డాలర్‌పై ఆధారపడటం తగ్గుతుంది. వాణిజ్య అవసరాల కోసం, వివిధ దేశాలతో, వ్యూహాత్మక భాగస్వాములతో డిజిటల్ రూపాయిని ఉన్నతమైన కరెన్సీగా స్థాపించడానికి భారతదేశానికి అవకాశం అందిస్తుంది.
ప్రైవేట్ కరెన్సీ ఆగమనం వల్ల పరిమిత కన్వర్టబిలిటీ ఉన్న జాతీయ కరెన్సీలు ఒకరకమైన ముప్పును ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ఆ ముప్పు నివారించే సాధనంగా ఈ డిజిటల్ కరెన్సీ ఉపయోగపడుతుంది.
బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల డిజిటల్ రూపీ లావాదేవీల వేగాన్ని, పారదర్శకతను పెంచుతుంది.
నగదుపై ఆధారపడటం తగ్గుతుంది. కరెన్సీ ప్రింటింగ్, స్టోరేజ్, రవాణా, నోట్ల రీప్లేస్మెంట్ వ్యయాలు తగ్గుతాయి. ఇప్పుడు వివిధ రూపాల్లో అందుబాటులో ఉన్న నగదుకు అదనపు ఆప్షన్‌గా డిజిటల్ రూపీ ఉపయోగపడుతుందని ఆర్బీఐ గతంలో విడుదల చేసిన నోట్లో తెలిపింది.
ఇది డిజిటల్ సాధనమైనందున సులభంగా, వేగంగా, చౌకగా లావాదేవీలు జరుపవచ్చు. కరెన్సీ నోట్లుగా కాకుండా డిజిటల్ మార్గంలో డబ్బును చెల్లించేటప్పుడు లభించే ప్రయోజనాలన్నీ తాజా డిజిటల్ రూపీతో లభిస్తాయి.
ఇది ప్రైవేట్ వర్చువల్ కరెన్సీల వినియోగం నుంచి ప్రజలకు జరిగే నష్టాన్ని కూడా తగ్గిస్తుంది.
n ఇది మరింత దృఢమైన, సమర్థవంతమైన, విశ్వసనీయమైన, నియంత్రిత, చట్టపరమైన టెండర్ ఆధారిత చెల్లింపుల ఎంపికకు దారితీయవచ్చు.
బ్లాక్ చైన్ లావాదేవీలకు సంబంధించిన సమాచారం ట్రాక్ చేసి ఎప్పటికప్పుడు అందిస్తుంది.
కరెన్సీ నోట్లను వెంట పెట్టుకోవడం కంటే డిజిటల్ రూపీని తోడు ఉంచడం చాలా సులభం.
ఈ కరెన్సీలో ఎలాంటి అస్థిరత ఉండదు. ఎందుకంటే దీన్ని RBI జారీ చేస్తుంది.
నగదు రహిత ఆర్థిక వ్యవస్థను నిర్మించడంలో డిజిటల్ రూపీ కీలక పాత్ర పోషిస్తుంది. ప్రభుత్వ పిలుపు మేరకు నగదు రహిత చెల్లింపుల్లో ఇది ఒక సాధనంగా ఉపయోగపడుతుంది.
ప్రజలు ఈ CBDCని ఉపయోగించడం వల్ల విదేశీ లావాదేవీల నిర్వహణ, విదేశాల నుంచి వచ్చే రెమిటెన్సుల స్వీకరణ, ద్రవ్య మార్పిడి వ్యయం తగ్గే అవకాశాలు ఉన్నాయి.
భారతదేశంలో డిజిటల్ చెల్లింపు పరిమాణం గత ఐదేళ్లలో సగటు వార్షిక రేటుతో పోలిస్తే దాదాపు 50 శాతం పెరిగింది. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వృద్ధి రేటులో ఒకటి. అందులోనూ భారతదేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) వంటి సాంకేతికత వల్ల దీని విస్తరణ మరింత వేగంగా ఏటా దాదాపు 160 శాతంగా ఉంది. ఈ UPI వ్యవస్థను 2016లో ప్రవేశపెట్టారు. అదే సంవత్సరం చివరిలో పెద్ద నోట్ల రద్దు ప్రకటన నగదు రహిత ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతం ఇచ్చింది. దీనికి వేగవంతమైన ఇంటర్నెట్ లభ్యత, ఒకే మొబైల్ ఫోన్లో వివిధ అప్లికేషన్ల ద్వారా UPI ఆధారిత చెల్లింపులు సులభమవడం ఇవన్నీ నగదు రహిత ఆర్థిక వ్యవస్థకు ఉత్ప్రేరకాలుగా మిగిలాయి.
CBDCల పరిధి, అంతర్లీన సాంకేతికత, ధ్రువీకరణ విధానం, పంపిణీ నిర్మాణం వంటి కొన్ని కీలక అంశాలు ఆర్బీఐ పరిశీలనలో ఉన్నాయి.
తాజాగా విడుదల చేస్తున్న డిజిటల్ రూపీ లావాదేవీ విధానాలు, డిపాజిట్లు, విత్‌డ్రాలు, వడ్డీ తదితర అంశాలపై ఆర్బీఐ నిర్దిష్టమైన నిర్ణయమేదీ ఇప్పటివరకు తీసుకోలేదు.
ఆర్థిక స్థిరత్వానికి ముప్పు కలగవచ్చన్న భయాలున్నాయి. డిజిటల్ రూపీ వడ్డీ లభించే సాధనంగా విడుదలవుతుందా లేదా వడ్డీరహిత సాధనంగా ఉంటుందా అనే అంశానికి అనుగుణంగా రిస్క్ ఉంటుంది.
ఆర్బీఐ వద్ద బ్యాంకుల ఖాతాలకు వడ్డీ లభిస్తుంటే బ్యాంకులు సైతం ఖాతాదారులు ప్రారంభించే డిజిటల్ రూపీ ఖాతాలకు కూడా వడ్డీ ఇవ్వాలి. ఈ ఖాతాల్లో ఉన్న డిజిటల్ రూపాయిల నిష్పత్తి ఆధారంగా రుణ వితరణను పెంచుకోలేకపోతే బ్యాంకులకు ఆ ఖాతాలు భారమైపోతాయి. బ్యాంకులు రిస్క్‌లో పడిపోతాయి. బ్యాంకింగ్ రంగంలో సంక్షోభం తలెత్తితే డిపాజిటర్లు వారి బ్యాంక్ డిపాజిట్లను డిజిటల్ రూపాయిల్లోకి మార్చుకుంటారు. దీంతో సంక్షోభం తీవ్రతరమవుతుంది.
బ్యాంక్ ఇబ్బందుల్లో ఉన్నట్టు గుర్తిస్తే డిజిటల్ రూపీ డిపాజిట్లను ఖాతాదారులు విత్ డ్రా చేసుకుంటారు. దీంతో బ్యాంక్‌పై ఒత్తిడి పెరుగుతుంది.
అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం ప్రకారం భౌతిక రూపంలో కరెన్సీని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత నిబంధనలు రూపొందించినందున చట్టపరమైన ఈ CBDC అమలుకు చట్టంలో మార్పులు అవసరం. నాణేల చట్టం, విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA), సమాచార సాంకేతిక చట్టంలో కూడా పర్యవసాన సవరణలు అవసరం. ఒత్తిడిలో ఉన్న, సంక్షోభంలో ఉన్న బ్యాంకు నుంచి అకస్మాత్తుగా డబ్బు తరలిపోవడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పవచ్చు.
డిజిటల్ రూపాయిని సృష్టించడం వల్ల మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో దాన్ని స్వేచ్ఛగా ఉపయోగించుకోవడానికి, పాత బ్యాంకింగ్ వ్యవస్థ నుంచి విముక్తి పొందేందుకు భారతదేశంలోని పౌరులకు విస్తరిస్తున్న సాంకేతికత ద్వారా నగదు సేవలకు వీలు కల్పిస్తుంది. ఆర్థిక స్థిరత్వం, సమర్థవంతమైన కరెన్సీ, చెల్లింపు కార్యకలాపాల ద్రవ్య విధాన లక్ష్యాలను చేరుకోవడానికి రూపొందించిన సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC)ని RBI అన్వేషిస్తుంది. స్థూల ఆర్థిక వ్యవస్థ, లిక్విడిటీ, బ్యాంకింగ్ వ్యవస్థలు, ద్రవ్య మార్కెట్లపై దాని ప్రభావాన్ని పరిశీలిస్తే, భారతదేశంలో డిజిటల్ రూపాయి అవకాశాలను పూర్తిగా పరిశీలించడం విధాన రూపకర్తలకు అత్యవసరం.
-మల్లవరపు బాలలత
సివిల్స్ ఫ్యాకల్టీ
సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ,హైదరాబాద్
- Tags
- Edit Page News
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు






