ఇప్పటివరకు ఎన్ని అగాథాలను అధ్యయనం చేశారు?
జలావరణం
- జలచక్రం అంటే మహాసముద్రాల నుంచి భూమి మీదకు, భూమి నుంచి మహాసముద్రాల్లోకి నీరు తిరగడం.
- నీరు వివిధ రూపాల్లో అంటే ద్రవ, ఘన, వాయు రూపాల్లో ప్రసరణ కావడాన్ని నీటి చక్రం అంటారు.
- నీటి చక్రంలో 6 దశలు ఉన్నాయి.
1) బాష్పీభవనం: భూమి, చెరువులు, నదులు, సముద్రాల నుంచి నీరు ద్రవరూపం నుంచి వాతావరణంలోకి వాయురూపంలోకి ప్రవేశించడం. మొక్కల నుంచి నీరు బాష్పోత్సేకం ద్వారా వాతావరణంలోకి ప్రవేశిస్తూ ఉంటుంది.
2) రవాణా: వాతావరణంలో నీటి ఆవిరి మేఘాల రూపంలో మహాసముద్రాల మీద నుంచి భూమి మీదకు చేరుతుంది.
3) ద్రవీభవనం: రవాణా అయిన నీటి ఆవిరి ద్రవీభవనం చెంది చిన్న నీటి బిందువులుగా, మబ్బులుగా మారుతుంది.
4) అవపాతం: వాతావరణంలోని నీరు భూమి ఉపరితలానికి చేరడాన్ని అవపాతం అంటారు. చల్లటి గాలులు మేఘాలను తాకినప్పుడు వాన, స్లీట్, మంచు రూపాల్లో నీరు తిరిగి భూమ్మీదకు లేదా సముద్రాలకు చేరుతుంది.
5) ఉపరితలంపై నీటి ప్రవాహం: భూమి మీదకు చేరిన కొంత నీరు భూమిలోకి ఇంకి భూగర్భజలాలుగా, మిగిలింది వాగులు, నదుల నుంచి సముద్రాలను చేరుతుంది.
6) భూగర్భజలం: లోపలికి ఇంకిన నీరు భూగర్భ జలం ఊట వంటి రూపాల్లో భూమి ఉపరితలం మీదికి వస్తుంది.
మొత్తం నీటిలో 97.25 శాతం ఉప్పునీరుగా మహాసముద్రాల్లో ఉంది.
కేవలం 2.75 శాతం మాత్రమే మంచినీరు. మంచినీరు అధిక శాతం 68.7 శాతం అంటార్కిటికా, ఆర్కిటిక్, ఇతర పర్వతాల్లో మంచుగడ్డలు, శాశ్వత మంచుపొరగా ఉంది.
మంచినీటిలో 29.9 శాతం భూగర్భజలంగా ఉంది. భూమ్మీద ఉన్న మొత్తం మంచినీటిలో 0.26 శాతం మాత్రమే చెరువులు, ఆనకట్టలు, నదుల్లో ఉంది.
జలభాగం నీటి శాతం
1) మహాసముద్రాలు 97.25
2) ధృవ మంచు ప్రాంతాలు,హిమానీ నదాలు 2.05
3) భూగర్భ జలం 0.68
4) సరస్సులు 0.01
5) నేలలో తేమ 0.005
6) వాతావరణం 0.001
7) నదులు 0.0001
8) జీవావరణం 0.00004
మొత్తం 100 శాతం
- భూమ్మీద ఖండాలు, మహాసముద్రాలను మొదటి శ్రేణి భూస్వరూపాలు అంటారు.
- సాధారణంగా సముద్రం, మహాసముద్రం పదాలను పర్యాయపదాలు ఉపయోగిస్తున్నారు.
- కచ్చితంగా చెప్పాలంటే చుట్టూ లేదా కనీసం ఒకవైపున భూమి ఉండే ఉప్పునీటి భాగాన్ని సముద్రం అంటారు.
- వివిధ ఖండాలు, ద్వీపాల సమూహాలు, ఇతర ప్రామాణికాల ఆధారంగా మహాసముద్రాలను విభజించారు.
1) పసిఫిక్ మహాసముద్రం- అమెరికాల నుంచి ఆసియా, ఓషియానా (ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పపువా న్యూగినియా)లను వేరుచేస్తుంది.
2) అట్లాంటిక్ మహాసముద్రం- అమెరికాల నుంచి యూరప్, ఆఫ్రికాలను వేరుచేస్తుంది.
3) హిందూ మహాసముద్రం- దక్షిణాసియా తీరాలను తాకుతుంది. ఆఫ్రికా, ఆస్ట్రేలియాలను విడదీస్తుంది.
4) అంటార్కిటిక్ మహాసముద్రం (దక్షిణ మహాసముద్రం)- అంటార్కిటికా ఖండాన్ని చుట్టి ఉంటుంది. పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాల కొనసాగింపుగా
5) ఆర్కిటిక్ మహాసముద్రం- ఒక్కోసారి అట్లాంటిక్ మహాసముద్రంలో భాగంగా పరిగణిస్తారు. ఆర్కిటిక్ ప్రాంతంలో అధిక భాగం విస్తరించింది. ఉత్తర అమెరికా, యురేషియా తీరాలను తాకుతుంది.
పై మహాసముద్రాలన్నీ కలిసి కోట్లాది సంవత్సరాల క్రితం ఒకే ఒక మహాసముద్రంగా ఉండేవి. దీన్నే ‘పాంథాల్స’ అనేవారు.
బ్రిటిష్ ఓడ ‘చాలెంజర్’తో లోతైన సముద్రాలను అన్వేషిస్తూ ప్రపంచాన్ని చుట్టిరావడంతో మహాసముద్రాల అధ్యయనం ప్రారంభమైంది.
మహాసముద్రాల ఉపరితలం చాలావరకు భూమి ఉపరితలాన్ని పోలి ఉంటుంది.
వీటి లోపల కొండలు, పీఠభూములు, కాన్యన్లు, టెర్రాస్ల వంటివి ఉంటాయి.
మహాసముద్రాల నేలను నాలుగు భాగాలుగా విభజించవచ్చు.
1) ఖండతీరపు అంచు: భూమికి, సముద్రానికి మధ్య సరిహద్దు ప్రాంతం ఇది.
ఖండతీరపు అంచు 200 మీటర్ల లోతు వరకు ఉండి సముద్ర విస్తీర్ణంలో 7.6 శాతం వరకు ఉంటుంది.
అతిపెద్ద ఖండతీరపు అంచు ఆర్కిటిక్ మహాసముద్రంలోని సైబీరియా అంచులో ఉంది. ఇది 1500 కి.మీ. వెడల్పు ఉంటుంది.
దీని ప్రాముఖ్యం
1) ఈ ప్రాంతంలో మత్స్య సంపద చాలా ఎక్కువ.
2) ఇక్కడ ముడిచమురు, సహజ వాయువులు లభిస్తాయి.
3) ఇక్కడ ఓడరేవులను నిర్మించవచ్చు.
2) ఖండతీరపు వాలు: 200 మీ. నుంచి 3000 మీటర్ల వరకు ఖండతీరపు వాలు ఉంటుంది. దీని విస్తీర్ణం 15 శాతం వరకు ఉంటుంది.
ఇది సరిహద్దు ఖండాలను సూచిస్తుంది. ఇక్కడే సముద్రపు కాన్యన్లు ఉంటాయి. ఇవి హిమానీ నదాలు, నదుల నీటికోత ప్రక్రియలతో ఏర్పడతాయి.
3) మహాసముద్ర మైదానాలు: మహాసముద్ర నేలలో లోపలి వరకు ఉన్న మైదానాలు. ప్రపంచంలోకెల్లా అత్యంత చదునుగా, నునుపుగా ఉండే ప్రాంతాలు ఇవే.
ఇవి 3000 నుంచి 6000 మీటర్ల లోతు వరకు ఉంటాయి. దీని విస్తీర్ణం 76.2 శాతం వరకు ఉంటుంది.
4) మహాసముద్ర అగాథాలు: ఇవి సన్నగా, లోతుగా 6000 మీటర్ల వరకు ఉంటాయి.
n అత్యంత లోతైన అగాథాలు సముద్రపు మధ్య భాగంలో కాకుండా ఖండాలకు దగ్గరగా ఉంటాయి.
ఫలక కదలికల అధ్యయనంలో అగాథాలు కీలక పాత్ర పోషిస్తాయి.
ఇప్పటివరకు 57 అగాథాలను అధ్యయనం చేశారు.
1) చాలెంజర్ లేదా మేరియానా అగాథం: పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. దీని లోతు 11,022 మీటర్లు.
2) ప్యూర్టోరికా లేదా నేమ్స్ అగాథం: అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంది. దీని లోతు 10,475 మీటర్లు.
3) జావా లేదా సుందా అగాథం: హిందూ మహాసముద్రంలో ఉంది. దీని లోతు 7,450 మీటర్లు.
లక్షల సంవత్సరాల పాటు సోడియం క్లోరైడ్ (Nacl) మూలకం ఉన్న కొండలపై వర్షం, వాగులు, నదులు ప్రవహించి దాన్ని సముద్రంలోకి చేర్చాయి. మహాసముద్రంలోని ఉప్పు కొంత వరకు సముద్రాల అగ్నిపర్వతాల నుంచి, జల ఉష్ణదారుల నుంచి వస్తుంది.
నీరు ఆవిరి అయినప్పుడు ఉప్పు కింది నీటిలోనే ఉండిపోతుంది. అలా సముద్రపు నీరు ఉప్పుగా మారుతుంది.
ఉప్పు ఎంత ఉందో తెలియజేయడానికి లవణీయత అనే దాన్ని ఉపయోగిస్తారు.
సాధారణంలో 1000 గ్రాముల సముద్ర నీటిలో ఎంత మోతాదు పీపీటీ (పార్ట్స్ పర్ థౌజండ్)గా వ్యక్తపరుస్తారు.
సాధారణంగా మహాసముద్రాల నీటి లవణీయత 35 శాతం లేదా 1000 గ్రాముల నీటిలో 35 గ్రాముల ఉప్పు ఉంటుంది.
సముద్రపు నీటిలో పెద్ద మొత్తంలో 77.8 శాతం ఉప్పు మాత్రమే ఉంటుంది.
మహాసముద్రాల ఉపరితల నీటిలో లవణీయత ప్రభావిత అంశాలు
1) నీరు ఆవిరి కావడం అవపాతం
2) తీర ప్రాంతంలో నదుల నుంచి ప్రవహించే మంచినీరు, ధృవ ప్రాంతాల్లో మంచు గడ్డకట్టడం, కరగడం.
3) నీటిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేసే గాలులు.
4) సముద్రపు ప్రవాహాలు/తరంగాలు
అధిక లవణీయత
సముద్రపు నీరు, ఉప్పు నీటి సరస్సు 30-50 శాతం, నదీ ముఖద్వారాలు, చిత్తడి భూములు, మడ అడవులు- 5-30 శాతం
స్వచ్ఛమైన నీరు చెరువులు,నదులు, సరస్సులు- 0.5 శాతం
ఎర్ర సముద్రంలో- 40 శాతం
మధ్యధరా సముద్రంలో- 35 శాతం
సాధారణ లవణీయత- 35 శాతం
బాలిస్టిక్ సముద్రం- 8 శాతం
వ్యవసాయ నీరు- 3 శాతం
తాగునీరు- 1 శాతం
నదుల నీటిలో- 2 శాతం
అత్యధిక లవణీయత
1) వాన్ సరస్సు (టర్కీ)- 330 శాతం
2) మృత సముద్రం (ఇజ్రాయెల్)- 238 శాతం
3) మహాలవణ సరస్సు (అమెరికా)- 220 శాతం తక్కువ లవణీయత
1) బాల్టిక్ సముద్రం- 3 నుంచి 15 శాతం
2) హడ్సన్ అగాథం- 3 నుంచి 15 శాతం
సమలవణీయతా రేఖ
సముద్రంలో ఒకే లవణీయత ఉన్న (Isohaline) ప్రాంతాలను కలిపే రేఖ.
మహాసముద్ర ఉష్ణోగ్రత- అక్షాంశాలు, గాలులు, సముద్ర ప్రవాహాలు, భూ విస్తీర్ణంలో తేడాలు. మారుతున్న కాలాలు వంటివి మహాసముద్ర ఉష్ణోగ్రతను ప్రభావితం చేస్తాయి.
సాధారణంగా మహాసముద్రాల ఉష్ణోగ్రత 20C నుంచి 290C మధ్య ఉంటుంది.
సముద్రపు లోతుల్లోకి వెళ్తున్నకొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. సముద్రంలోకి 5 కి.మీ. లోతు వరకు ఉష్ణోగ్రతలు క్రమేపీ తగ్గుతాయి. ఇంకా లోతుల్లో ఉష్ణోగ్రతలు 20C వద్ద ఉంటాయి.
భూపరివేష్టిత సముద్రాల వద్ద అత్యధిక ఉష్ణోగ్రత నమోదవుతుంది.
అత్యధిక ఉష్ణోగ్రత 380C ఎర్ర సముద్రంలో ఉంటుంది.
ఒక కచ్చితమైన దిశలో చాలా దూరం ప్రవహించే మహాసముద్రపు నీటిని మహాసముద్రపు ప్రవాహాలు అంటారు. ఒక్కోసారి వీటిని మహాసముద్రపు నదులు అంటారు.
ఉష్ణోగ్రతల ఆధారంగా ఈ ప్రవాహాలను ఉష్ణ ప్రవాహాలు, శీతల ప్రవాహాలుగా వర్గీకరిస్తారు. ఉష్ణ ప్రవాహాలు ధృవాలవైపు, శీతల ప్రవాహాలు భూమధ్య రేఖ వైపు ప్రవహిస్తాయి.
వేగాన్ని బట్టి ప్రవాహాలు, నిదానంగా ప్రవహించే దాన్ని డ్రిఫ్ట్ అని, వేగంగా ప్రవహించే దాన్ని స్ట్రీం అని పిలుస్తారు.
1) అపకేంద్ర బలం: భూమి తన చుట్టూ తాను తిరుగుతున్న క్రమంలో ధృవాలతో పోలిస్తే భూమధ్యరేఖ వద్ద అపకేంద్ర శక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ శక్తిలో తేడా వల్ల భూమధ్యరేఖా ప్రాంతం నుంచి మహాసముద్రాల నీళ్లు ధృవాలవైపు ప్రవహిస్తాయి.
2) పవనాలు: పవనాల కదలిక వల్ల ఏర్పడే ఒత్తిడి వల్ల ప్రవాహాల దిశలో మార్పు ఉంటుంది. పవనాల ఒరిపిడితో రాసుకుపోవడం వల్ల పవనాల దిశలో నీళ్లు ప్రవహిస్తాయి.
3) అవపాతం: భూమధ్య రేఖా ప్రాంతం వద్ద అత్యధిక అవపాతం ఉంటుంది. కాబట్టి ఇక్కడి సముద్ర నీటి మట్టం ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా భూమధ్య రేఖ నుంచి ఉత్తర, దక్షిణ దిశలుగా సముద్రపు నీరు ప్రవహిస్తుంది.
4) సౌర శక్తి: సౌర శక్తి వల్ల వేడెక్కిన నీళ్లు వ్యాకోచం చెందుతాయి. ఈ కారణం వల్ల భూమధ్య రేఖ వద్ద మధ్య అక్షాంశాలతో పోలిస్తే మహాసముద్రాల మట్టం 8 సెం.మీ. ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా కొద్దిపాటి వాలు ఏర్పడి, వాలు దిశగా మహాసముద్రపు నీరు ప్రవహిస్తుంది.
5) లవణీయత, నీటి సాంద్రతల వ్యత్యాసాలు, మంచు కరగడం వంటివి ఇతర కారణాలు.
మహాసముద్రాల్లో కనిపించే ఉష్ణ, శీతల ప్రవాహాలు
1) పసిఫిక్ మహాసముద్రం
శీతల ప్రవాహాలు: 1) కురైల్ ప్రవాహం, 2) పెరూవియన్ సముద్ర ప్రవాహం
ఉష్ణ ప్రవాహాలు: 1) కురోషివో సముద్ర ప్రవాహం,
2) తూర్పు ఆస్ట్రేలియా సముద్ర ప్రవాహం
2) అట్లాంటిక్ మహాసముద్రం
శీతల ప్రవాహాలు: 1) లాబ్రడార్ సముద్ర ప్రవాహం, బెంగుల్యా సముద్ర ప్రవాహం
ఉష్ణ ప్రవాహాలు: 1) కరేబియన్ సముద్ర ప్రవాహం, 2) మెక్సికన్ గల్ఫ్ సముద్ర ప్రవాహం, 3) బ్రెజిల్ సముద్ర ప్రవాహం, 4) పాక్లాండ్ సముద్ర ప్రవాహం
3) హిందూ మహాసముద్రం
శీతల ప్రవాహాలు: 1) అసలహన్ సముద్ర ప్రవాహం
ఉష్ణ ప్రవాహాలు: 1) భారతీయ సముద్ర ప్రవాహం, మడగాస్కర్ సముద్ర ప్రవాహం, మొజాంబిక్ సముద్ర ప్రవాహం
-జీ గిరిధర్
సివిల్స్ ఫ్యాకల్టీ
బీసీ స్టడీ సర్కిల్ హైదరాబాద్
9966330068
- Tags
- nipuna news
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు






