బాలలకు హక్కుల కల్పన.. యువ భారత్ సాధన!
బాలల హక్కులు
మానవ హక్కుల ప్రకటన అనంతరం బాలల హక్కులు కూడా మానవ హక్కులేననే స్పృహతో 1959లో ఐక్యరాజ్యసమితి బాలల హక్కుల ప్రకటన చేసింది. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా బాలల హక్కులకు ప్రాధాన్యత ఏర్పడింది. యునైటెడ్ నేషన్స్ చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ ప్రకారం 18 సంవత్సరాల లోపు వారందరూ బాలలే. పుట్టుకతో వారికి కలిగే అవసరాలన్నీ బాలల హక్కులే.
- అంతర్జాతీయ ఒడంబడికల ప్రకారం 18 ఏళ్లలోపు బాలలు 40 రకాల హక్కులను కలిగి ఉంటారు. వాటిని స్థూలంగా నాలుగు రకాలుగా వర్గీకరించారు.
1. జీవించే హక్కు (మనుగడ హక్కు)
- మంచి విద్యను పొందడం, ఆరోగ్యంగా జీవించడం, రక్షిత మంచినీరు పొందడం, ఆరోగ్యకర వాతావరణంలో జీవించడం, తల్లిదండ్రులతో కలిసి జీవించడం. గుర్తింపు కలిగి ఉండటం, ఏకాంతాన్ని కోరుకోవడం, స్వేచ్ఛగా బతకడం, గౌరవంగా జీవించడం, విశ్రాంతి కోరడం వంటి హక్కుల్ని బాలలు కలిగి ఉంటారు.
2. రక్షణ పొందే హక్కు (సంరక్షణ హక్కు)
- లింగ వివక్ష, కుల వివక్ష, మత వివక్ష, ప్రాంత వివక్ష, వర్ణ వివక్ష, దోపిడీ, దౌర్జన్యం, లైంగిక వేధింపులు వంటి అవమానాల నుంచి రక్షణ పొందే హక్కును బాలలు కలిగిఉన్నారు. ఇవే గాక ప్రకృతి వైపరీత్యాలు, అంటు వ్యాధులు, శిక్షలు, పని, మత్తుమందులు, హింస, ప్రమాదాల నుంచి బాలలు రక్షణ పొందే హక్కును కలిగి ఉంటారు. వాళ్లు ఆరోగ్యంగా పెరగడానికి, అభివృద్ధి చెందడానికి అర్హులు. దానికోసం జననపూర్వ, జననానంతర సంరక్షణతో పాటు తల్లీపిల్లల సంరక్షణ కోసం ప్రత్యేక శ్రద్ధ, రక్షణ ఉంటుంది. సరైన పోషకాహారం, గృహవసతి, వినోదం, వైద్య సేవలు పొందే హక్కు పిల్లలు కలిగి ఉన్నారు.
- 1974 నాటి జాతీయ బాలల విధానం తగినన్ని సేవలు, సౌకర్యాలు కల్పించాలని, మాతృగర్భంలో ఉన్నప్పటి నుంచి వారు యుక్త వయస్కులయ్యే వరకు వారి శారీరక, మానసిక, సామాజిక అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేయాలని పేర్కొంది. పిల్లల సమతుల్య అభివృద్ధికి నిర్ణీత కాలపరిమితిలో అన్ని విధాలైన సౌకర్యాలను కల్పించి, వారికి అత్యవసరమైన సేవలను విస్తృతంగా అమలుపరచాలని కూడా ఈ విధానం పేర్కొంది.
3. అభివృద్ధి చెందే హక్కు (వికాస హక్కు)
- బాలలు శారీరక, మానసిక, సాంఘిక, సాంస్కృతిక, వృత్తిపర, ఆధ్యాత్మికంగా, నైతికంగా అభివృద్ధి చెందాలి. ప్రశంసలు పొందడం, స్వేచ్ఛగా ఆలోచించడం, సామాజిక సమానత్వం వంటి హక్కులు బాలలు కలిగి ఉంటారు.
4. భాగస్వామ్యపు హక్కు (పాల్గొనే హక్కు)
- ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్య క్రమాలు, సంఘాల ఏర్పాటు వంటి అంశా ల్లో భాగస్వామ్యం పొందే హక్కు బాలలకు ఉంది. భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, స్నేహపూర్వక జీవనం, ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం కూడా దీని కిందికే వస్తాయి. ఈ హక్కులన్నీ బాలలు కలిగి ఉంటారు.
- ఈ నాలుగు హక్కులతో పాటు ప్రభుత్వం విద్యాభివృద్ధి కోసం ఉచిత నిర్బంధ విద్యాహక్కు చట్టాన్ని రూపొందించింది. బాలల ఆసక్తులు అనేవి వారు పొందే విద్యకు మార్గదర్శకాలుగా ఉండాలి. దీని కోసం తల్లిదండ్రులు బాధ్యత వహించాలి. ఆటలు, వినోదం పొందడానికి పూర్తి అవకాశాలను పిల్లలు కలిగి ఉండాలి. ఈ హక్కులు పొందడానికి సమాజం, ప్రభుత్వాధికారులు చొరవ చూపాలి.
- బాలల హక్కులు హరించే పనులు: భ్రూణ హత్యలు, బాల్య వివాహాలు, వేధింపులు, వెట్టిచాకిరి, గనుల్లో పనులు, పత్తి చేలలో పనులు, లింగ వివక్ష, పిల్లల అమ్మకం.
నోట్: ఎక్కువగా హరించబడుతున్న హక్కు- జీవించే హక్కు
బాలల హక్కులు – సంరక్షణ
- బాలల హక్కుల పరిరక్షణ ఒకరితో సాధ్య పడదు. ఇది అందరి బాధ్యతగా గుర్తిస్తేనే సాధ్యమవుతుంది. ముఖ్యంగా ప్రభుత్వం, తల్లిదండ్రులు, సమాజం, ఉపాధ్యాయుల కృషి అవసరం.
బాలల హక్కులు- భారత రాజ్యాంగం
- 6-14 సంవత్సరాల బాలలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యాహక్కు- ప్రకరణ 21A
- 14 సంవత్సరాల వయస్సు వరకు ఎలాంటి ప్రమాదకరమైన పనుల్లో ఉండకూడదు/ ఉంచకూడదు- ప్రకరణ 24 (Child La bour Prohibition and Regul action Act (CLPRA)-1986)
- ఎలాంటి దుర్వినియోగం నుంచైనా రక్షణ పొందే హక్కు, వృత్తిలో బలవంతపు ప్రవేశాల నుంచి రక్షణ పొందే హక్కు- ప్రకరణ 39 (e)
- ఆరోగ్యకరమైన స్వేచ్ఛ, స్వాతంత్య్రంతో అభివృద్ధి చెందేందుకు సమాన అవకాశాలు, సదుపాయాల హక్కు. దోపిడీ నుంచి భౌతికంగా, నైతికంగా, అనాథ కాకుండేలా బాల్యం, యవ్వనాల్ని రక్షించుకునే హక్కు- ప్రకరణ 39 (f)
- సమానత్వపు హక్కు- ప్రకరణ 14
- మత, జాతి, కుల, లింగ వివక్షకు గురి కాకుండా ఉండే హక్కు- ప్రకరణ 15
- అక్రమ రవాణా, కట్టు బానిసత్వం నుంచి రక్షణ పొందే హక్కు- ప్రకరణ 23
- సామాజిక అన్యాయం, అన్ని రకాల దోపిడీ నుంచి రక్షణ పొందే హక్కు- ప్రకరణ 46
- మహిళలు, పిల్లల కోసం ప్రత్యేక ఏర్పాటు- ప్రకరణ 15 (3)
- తెలంగాణ ప్రభుత్వం బడికి వెళ్లని బాలలంద రినీ బాల కార్మికులుగా గుర్తించి, పిల్లల్ని పని నుంచి విముక్తి చేసి పాఠశాలల్లో చేర్పించే దృఢ నిర్ణయం తీసుకుంది.
- 12 సంవత్సరాల లోపు బాలికలపై అత్యా చారాలకు పాల్పడినవారికి మరణ శిక్షను విధించేలా మొదటగా మధ్యప్రదేశ్, తర్వాత రాజస్థాన్ (2018) రాష్ర్టాలు బిల్లులను ఆమోదించాయి.
భరోసా కేంద్రాలు
- పసి పిల్లల నుంచి అన్ని రకాల వయస్సుల మహిళలకు ఎదురయ్యే రకరకాల సమస్యలను పరిష్కరించడానికి తెలంగాణ రాష్ట్రం భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల్లో వైద్యం, న్యాయం, కౌన్సిలింగ్, ఉపాధి నైపుణ్యాలను అందిస్తుంది.
బాల కార్మిక చట్టం
- దేశవ్యాప్తంగా 10 అక్టోబర్ 2006 నుంచి అమల్లోకి వచ్చింది.
- ఈ చట్టం ప్రకారం 14 సంవత్సరాల లోపు వయస్సు గల బాలబాలికలతో పనులు చేయించుకోకూడదు. అలా చేయించుకున్న యజమానులకు కనీసం మూడు నెలల నుంచి 12 నెలల వరకు జైలు శిక్ష, రూ.10,000 జరిమానా విధిస్తారు.
- నిషేధించిన వృత్తుల్లో బాలబాలికలందరికి ఉచిత భోజన వసతి సౌకర్యాలతో కూడిన ప్రత్యామ్నాయ విద్యను బోధించడానికి ఏర్పాట్లు చేస్తారు.
బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చట్టం-2005
- బాలల హక్కుల పరిరక్షణకు, బాలలపై జరిగే నేరాలను సత్వరం విచారించి తగు న్యాయాన్ని అందించేందుకు జాతీయస్థాయి లో, రాష్ట్రాల్లో బాలల హక్కుల పరిరక్షణ కమిషన్లు ఏర్పాటు చేయడానికి ఈ చట్టాన్ని రూపొందించారు.
- బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చట్టం 20 జనవరి, 2006న రాష్ట్రపతి ఆమోదం పొందింది. 20 నవంబర్ 1989న బాలల హక్కులపై ఐక్యరాజ్యసమితి సమావేశంలో స్వీకరించినవి, 11 డిసెంబర్ 1992లో భారత ప్రభుత్వం ఆమోదించిన బాలల హక్కులను ఈ చట్టంలో పొందుపరిచారు.
- ఈ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ద్వారా మార్చి 2007లో బాలల హక్కుల కోసం జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. 0 నుంచి 18 సంవత్సరాల లోపు వారిని బాలలుగా పరిగణిస్తారు.
నోట్: నిర్భయ ఉదంతం తర్వాత వచ్చిన తీవ్రమైన విమర్శల నేపథ్యంలో ఈ చట్టానికి సవరణ చేస్తూ క్రూరమైన నేరాలకు పాల్పడిన కేసుల్లో 16-18 ఏళ్ల బాలలను జువైనల్ చట్టం కింద కాకుండా భారతీయ శిక్ష స్మృతి (IPC) కింద విచారిస్తారు. దీన్ని లోక్ సభ 7 మే 2015న ఆమోదించింది.
బాల కార్మిక నిషేధ, నియంత్రణ చట్టానికి (1986) సవరణలు
- 13 మే 2015న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం బాలకార్మిక నిషేధ, నియంత్రణ చట్టానికి కింద తెలిపిన సవరణలకు ఆమోదం తెలిపింది.
- 14 ఏళ్లలోపు బాలబాలికలను అన్ని వృత్తులు, ప్రక్రియల్లో నియమించడాన్ని నిషేధించారు.
- ఉద్యోగ నియామకానికి నిషేధ వయస్సును విద్యా హక్కు చట్టం (2009)లో పేర్కొన్న విధంగానే ఉంటాయి. అయితే వాటికి కింది మినహాయింపులుంటాయి.
1. బాలబాలికలు తమ కుటుంబానికి లేదా కుటుంబ సంస్థకు సహాయపడుతుంటే వారికి ఈ చట్టం వర్తించదు. అయితే వారిని ప్రమాదకర వృత్తులు లేదా ప్రక్రియల్లో నియమించకూడదు. ఏవి ప్రమాదకరమో షెడ్యూల్లో ఇస్తారు. వీరిని పాఠశాల ముగిసిన తర్వాత మాత్రమే లేదా సెలవుల్లో మాత్రమే కుటుంబాలు, కుటుంబ సంస్థల్లో నియమించాలి.
2. ఒక బాలుడు లేదా బాలికను దృశ్య-శ్రవణ వినోద పరిశ్రమలో ఒక ఆర్టిస్ట్‌గా నియమిస్తే అటువంటి నియామకాలకు నిషేధం వర్తించదు. వాణిజ్య ప్రకటనలు, చలన చిత్రాలు, టెలివిజన్ సీరియళ్లు లేదా ఏ వినోద క్రీడా కార్యకలాపాల్లో నియమిస్తే అటువంటి నియామకాలకు ఈ నిబంధన వర్తించదు. అయితే వారిని సర్కస్‌లో నియమించకూడదు. ఇటువంటి నియామకాలు జరిపిన సందర్భాల్లో షెడ్యూల్లో నిర్దేశించిన విధంగా కొన్ని భద్రతా చర్యలు తీసుకోవాలి. నిర్దేశిత పనులు బాలబాలికల పాఠశాల విద్యుకు అవాంతరం కాకూడదు.
బాలల హక్కులు అమలుకు ప్రభుత్వం చేసిన చట్టాలు
1. బాలల చట్టం- 1933
2. బాలల ఉద్యోగ కల్పనా చట్టం-1938
3. కర్మాగారాల చట్టం- 1948
4. కనీస వేతన చట్టం (1948): బాలలను ఏ రకమైన పనిలోకి తీసుకున్నా ఈ చట్టం ప్రకారం శిక్షార్హులు.
5. ప్లాంటేషన్ కార్మిక చట్టం (1951): 12 సంవత్సరాలు నిండని బాలలను ప్లాంటేషన్ పనుల్లోకి తీసుకోకూడదు.
6. గనుల చట్టం (1952): 16 సంవత్సరాల లోపు బాల శ్రామికులను గనుల్లో నియమిం చడం నిషేధం.
7. మోటారు రవాణా కార్మిక చట్టం (1961): 15 సంవత్సరాల లోపు బాలలను మోటారు రవాణా రంగంలో నియమించ కూడదు.
8. ఏపీ సివిల్ సర్వీసెస్ (కాండాక్ట్) రూల్స్ (1961): ప్రభుత్వ ఉద్యోగులైతే పిల్లలను ఏ రకమైన పనిలో పెట్టుకున్నా ఈ చట్టం ప్రకారం శిక్షార్హులు.
9. వెట్టిచాకిరి నిర్మూలన చట్టం (1976): బాలలను జీతగాళ్లుగా తీసుకుంటే నేరం.
10. ఫ్యాక్టరీ చట్టం (1982): 14 సంవత్సరాల లోపు బాలబాలికలను ఫ్యాక్టరీ పనుల్లో నియమించుకోవడం నిషేధం.
11. బాల కార్మిక నిషేధ చట్టం (1986): 14 సంవత్సరాల లోపు వారిని పనుల్లోకి నియమించుకోవడం నిషేధం.
12. బాల కార్మిక చట్టం 1986, ఏపీ షాప్స్/ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1988: 14 సంవత్సరాల లోపు బాలలతో పనిచేయించే సంస్థల యజమానులు ఈ చట్టం ప్రకారం శిక్షార్హులు.
13. జువైనల్ జస్టిస్ యాక్ట్ (2000): నేరారోపణ నుంచి విముక్తి పొందే హక్కు.
14. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చట్టం-2005
15. బాలలకు ఉచిత, నిర్బంధ విద్యాహక్కు చట్టం- 2009
16. లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ చట్టం- 2012
17. బాలల న్యాయం (బాలల పట్ల శ్రద్ధ, సంరక్షణ) సవరణ చట్టం-2013: శ్రద్ధ, రక్షణ అవసరమైన బాలలు ముఖ్యంగా సంఘర్షణలో ఉన్న బాలల సంక్షేమం కోసం ఈ చట్టం చేశారు. ఈ చట్టం 18 సంవ త్సరాల లోపు వారిని బాలలుగా పేర్కొం టుంది. కుష్ఠు, క్షయ, హెపటైటిస్-బి వంటి వ్యాధులకు గురైన బాలలకు ఎలాంటి వివక్ష లేకుండా సంరక్షణను అందిస్తుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు