అవిశ్రాంత శోధనలు.. వికాసానికి పునాదులు
జీవ శాస్త్రవేత్తలు- వారి సేవలు
ఆదిమానవుడి నుంచి ఆధునిక మానవుడి జీవితాన్ని విజ్ఞానం, శాస్త్ర సాంకేతిక రంగాలు ఎంతగానో ప్రభావితం చేశాయనడంలో అతిశయోక్తి లేదు. నాగరికతలో శాస్త్రవేత్తలు వారి ఆవిష్కరణలతో మానవుడి జీవితాన్ని సుఖమయం చేశాయి. జీవశాస్త్రంలో అనేకమంది శాస్త్రవేత్తలు వారి జీవితాన్ని ధారపోసి అనేక నూతన విషయాలను ఆవిష్కరించారు. అనేక వ్యాధులకు టీకాలు, సూక్ష్మజీవ నాశకాలు, వ్యాధులకు మందులు కనుగొనడంలో జీవ శాస్త్రవేత్తలు విశేష కృషి చేశారు. అటువంటి కొంతమంది జీవ శాస్త్రవేత్తలు,
వారి ఆవిష్కరణలు సంక్షిప్తంగా నిపుణ పాఠకుల కోసం..
హరగోవింద్ ఖొరానా
అవిభక్త భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలో జన్మించారు. వంశపారంపర్యంగా సం క్రమించే జీవ నిర్మాణానికి దోహదం చేసే కృత్రిమ జన్యువును సృష్టించారు. ఇందుకు ఆయనకు 1968లో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది.
ఎల్లాప్రగడ సుబ్బారావు
భారతదేశానికి చెందిన వైద్య శాస్త్రజ్ఞుల్లో ప్రసిద్ధుడు. ఫోలికామ్లం నిజ స్వరూపాన్ని కనుగొన్నాడు. బోదకాలు, టైఫాయిడ్, పాండురోగం మొదలైన వ్యాధులను పూర్తిగా నిర్మూలించగల మందులను కనుగొన్నాడు. ఆరియోమైసిస్ (టెట్రాసైక్లిన్) అనే యాంటీ బయాటిక్‌ను కనుగొన్నాడు. ఈయనను ‘అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడు’ గా పిలుస్తారు. ఇటీవల కొత్తగా కనుగొన్న ఒక శిలీంధ్రానికి ఈయన గుర్తింపుగా ‘సుబ్బారోమైసిన్ స్ప్లెండెన్స్’గా నామకరణం చేశారు.
జగదీశ్ చంద్రబోస్
మొక్కలకు కూడా ప్రాణం ఉంటుందని, అవి కూడా భావాలను వ్యక్తం చేస్తాయని నిరూపించిన శాస్త్రవేత్త. మొక్కల పెరుగుదలకు ఉపయోగపడే క్రిస్కోగ్రాఫ్ అనే పరికరాన్ని కనిపెట్టాడు. ఈయన రేడియో, మైక్రోవేవ్ ఆప్టికల్స్తో వృక్షశాస్త్రంలో గణనీయమైన ఫలితాన్ని సాధించాడు. ఈయనను ‘రేడియో సైన్స్ పితామహుడు’ అని కూడా పిలుస్తారు. ఈయన గౌరవార్థం చంద్రుడిపై ఉన్న ఒక బిలానికి ‘బోస్’ అని పేరు పెట్టారు.
ఎం.ఎస్. స్వామినాథన్
స్వామినాథన్ తమిళనాడులోని కుంభకోణంలో జన్మించాడు. ప్రముఖ భారత వ్యవసాయ శాస్త్రవేత్త. జన్యు శాస్త్ర నిపుణుడు. స్వామినాథన్ రిసెర్చ్ ఫౌండేషన్‌ను స్థాపించాడు. అధిక దిగుబడినిచ్చే వరి, గోధుమ వంగడాలను పరిచయం చేశారు. ప్రతిష్ఠాత్మక రామన్ మెగసెసె అవార్డు, శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు, పద్మ భూషణ్ పురస్కారం అందుకున్నాడు.
బీర్బల్ సహాని
భారత ఉపఖండంలో శిలాజాలను అధ్యయనం చేసిన భారత శాస్త్రవేత్త. భూగర్భశాస్త్రం, పురావస్తు శాస్త్రంలో విశేష ప్రతిభ కనబర్చారు. 1964లో లక్నోలో బీర్బల్ సహాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పేలియోబాటనీని స్థాపించారు. రాయల్ సొసైటీ ఆఫ్ లండన్‌కు ఎంపికయ్యారు. ఈయన జ్ఞాపకార్థం ప్రతిభ చూపిన వృక్షశాస్త్ర విద్యార్థులకు బీర్బల్ సహాని గోల్డ్ మెడల్ అందజేస్తున్నారు.
సలీం అలీ
ముంబైలో జన్మించిన ప్రముఖ పక్షి శాస్త్రవేత్త. ఈయన ‘బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి చెందారు. దేశంలో పక్షి శాస్త్రం (ఆర్నిథాలజీ) గురించి అవగాహన, అధ్యయనాన్ని పెంపొందించడానికి సలీం అలి చేసిన కృషి మరువలేనిది. బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ, భరత్ పూర్ పక్షుల అభయారణ్యం ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. పాల్ గెట్టి అవార్డుతో పాటు పద్మభూషణ్, పద్మ విభూషణ్ పురస్కారాలు అందుకున్నారు. ఈయన ఆత్మకథ ‘ది ఫాల్ ఆఫ్ స్వారో’.
అలెగ్జాండర్ ఫ్లెమింగ్
ఈయన స్కాట్లాండ్కు చెందిన జీవశాస్త్రవేత్త, వైద్యుడు. 1928లో కనుగొన్న ప్రపంచ మొట్టమొదటి యాంటీ బయాటిక్ పెన్సిలిన్ ఈయన పరిశోధనల్లో ముఖ్యమైనది. ఇందుకు ఈయనకు వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది.
లూయీ పాశ్చర్
లూయీ పాశ్చర్ ప్రముఖ ఫ్రెంచి జీవశాస్త్రవేత్త. వ్యాధులకు కారణమైన సూక్ష్మక్రిములను కనుగొని రోగనివారణకు బాటలు వేశారు. టీకాల ఆవిష్కరణకు ఈయన ఆద్యుడు. 1885లో మొదటిసారిగా రేబిస్ వ్యాధికి టీకాను కనుగొన్నాడు. పాలను శుద్ధిచేసే విధానమైన పాశ్చరైజేషన్ను కనుగొన్నాడు. పాశ్చర్ సూక్ష్మజీవ శాస్త్రంలో అత్యుత్తమ గౌరవంగా భావించే ‘లీవెన్ హుక్’ బహుమతి పొందాడు.
ఎడ్వర్డ్ జెన్నర్
సహజ పరిసరాలను అధ్యయనం చేసిన ఆంగ్ల శాస్త్రవేత్త. మశూచి వ్యాధికి టీకాను కనుగొన్నాడు. ఎవరికైతే కౌపాక్స్ సోకుతుందో వారికి భయంకరమైన మశూచి సోకడాన్ని ఈయన గమనించాడు. వ్యాక్సిన్ అనే పదం ‘వాకా’ నుంచి వచ్చింది. వాకా అంటే ఆవు అని అర్థం.
విలియం హార్వే
ప్రపంచ ప్రఖ్యాతి గాంచి న వైద్య శాస్త్రవేత్త. గుండె పనిచేసే తీరును, శరీరంలో రక్త ప్రసరణ జరిగే పద్ధతిని వివరించిన శాస్త్రవేత్త. 1628లో హార్వే ప్రచురించిన ‘అనాటమికల్ ఎక్సర్సైజ్ ఆన్ ది మోషన్ ఆఫ్ ది హార్ట్ అండ్ బ్లడ్’ అనే పుస్తకం వైద్య శాస్త్ర చరిత్రలో అపూర్వమైనది.
సర్ రొనాల్డ్ రాస్
ఈయన బ్రిటిష్ వైద్యుడు. మలేరియా వ్యాధిపై 16 సంవత్సరాల పాటు విస్తృతంగా పరిశోధనలు చేసిన మిలిటరీ డాక్టర్. 1897 ఆగస్టు 20న దోమలు మలేరియాను వ్యాప్తి చేస్తాయని నిరూపించాడు. కాబట్టి ఏటా ఆగస్టు 20న ప్రపంచ వ్యాప్తంగా మలేరియా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. మలేరియా సంక్రమించే విధానాన్ని సవివరంగా తెలిపినందుకు రాస్కు 1902లో నోబెల్ బహుమతి లభించింది.
వర్గీస్ కురియన్
కురియన్ను ‘మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా పిలుస్తారు. దేశంలో పాల ఉత్పత్తి భారీ స్థాయిలో పెరగడానికి విశేష కృషి చేసిన వారిలో అగ్రగణ్యుడు. ఇండియన్ డెయిరీ అసోసియేషన్ నవంబర్ 26న జాతీయ పాల దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించింది. భారత ప్రభుత్వం వర్గీస్ కురియన్ను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది.
చార్లెస్ డార్విన్
చార్లెస్ రాబర్ట్ డార్విన్ ఇంగ్లండ్‌కు చెందిన ప్రకృతివాది. ఈయన భూమిపై జీవజాలం ఏవిధంగా పరిణామక్రమం చెందిందనే విషయంపై పరిశోధనలు చేసి జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. డార్విన్ ఐదేళ్లు హెచ్ఎంఎస్ బీగిల్ అనే నౌకలో ప్రయాణం చేసి గాలపాగస్ దీవుల్లో గల ఫించ్ పక్షుల ముక్కులపై ప్రయోగాలు చేశాడు. జాతుల ఉత్పత్తి (Origin Of Species) అనే పుస్తకాన్ని రాశాడు.
కెరోలస్ లిన్నేయస్
స్వీడన్ దేశానికి చెందిన జీవశాస్త్రవేత్త, వైద్యుడు. ఈయన ఆధునిక ద్వినామీకరణానికి నాంది పలికాడు. ఈయన ప్రతిజీవికి రెండు పదాలుగా పేర్లతో నామకరణం చేశాడు. మొదటి పదం ప్రజాతి, రెండో పదం జాతి. లిన్నేయస్ సిస్టమా నేచురే అనే పుస్తకాన్ని రాశాడు.
గ్రెగర్ మెండల్
జన్యు భావనను తొలిసారిగా ప్రపంచానికి తెలియజెప్పిన ఆస్ట్రియా దేశానికి చెందిన మత గురువు. బఠాణి మొక్కలపై ప్రయోగాలు జరిపి వైవిధ్యాల గురించి అనేక నూతన విషయాలను కనుగొన్నాడు. ‘లా ఆఫ్ డామినెన్స్ లా ఆఫ్ సెగ్రిగేషన్’, ‘లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్‌మెంట్’ సిద్ధాంతాలను ప్రతిపాదించాడు.
ముఖ్యమైన అంశాలు
- కణాన్ని రాబర్ట్ హుక్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు.
- కణాన్ని కనుగొన్న 180 సంవత్సరాల తర్వాత కేంద్రకాన్ని రాబర్ట్ బ్రౌన్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు.
- కణ సిద్ధాంతాన్ని ష్లీడన్, ష్వాన్ అనే శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు.
- lపోలియో వ్యాధికి చుక్కల మందును డాక్టర్ ఆల్బర్ట్ సాబిన్ కనుగొన్నాడు.
- DNA ద్వికుండలీకరణ నమూనాను వాట్సన్, క్రిక్ అనే శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
- రెని లిన్నెక్ అనే శాస్త్రవేత్త స్టెతస్కోప్‌ను కనుగొన్నాడు.
- జాన్ బాప్టిస్ట్ లామార్క్ ప్రకృతి వరణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.
- T.H మోర్గాన్‌ను ఆధునిక జన్యుశాస్త్ర పితామహుడిగా పిలుస్తారు.
- ఎడ్వర్డ్ విల్సన్‌ను జీవవైవిధ్య పితామహుడిగా పిలుస్తారు.
మాదిర ప్రశ్నలు
1. ఎం.ఎస్ స్వామినాథన్ స్థాపించిన సంస్థ పేరేమిటి?
1) స్వామినాథన్ రిసెర్చ్ ఫౌండేషన్
2) భాభా అటామిక్ రిసెర్చ్ సెంటర్
3) నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్
4) పైవన్నీ
2. బఠాణి మొక్కలపై ప్రయోగాలు చేసి జన్యు వైవిధ్యాలను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు?
1) సర్ రొనాల్డ్ రాస్
2) వర్గీస్ కురియన్
3) గ్రెగర్ మెండల్ 4) సలీం అలి
3. ‘మిల్క్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ అని ఎవరిని పిలుస్తారు?
1) ఎం.ఎస్. స్వామినాథన్
2) వర్గీస్ కురియన్ 3) సలీం అలీ
4) ఎల్లాప్రగడ సుబ్బారావు
4. ‘బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు?
1) ఎం.ఎస్. స్వామినాథన్
2) వర్గీస్ కురియన్
3) సలీం అలీ
4) ఎల్లాప్రగడ సుబ్బారావు
5. దోమలు మలేరియాను వ్యాప్తి చెందిస్తా యని 16 సంవత్సరాలు పరిశోధనలు చేసి నిరూపించినందుకు సర్ రొనాల్డ్ రాస్కు నోబెల్ బహుమతి ఏ సంవత్సరంలో వచ్చింది?
1) 1902 2) 1903
3) 1904 4) 1905
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు