చెరువులు – చెక్‌డ్యాంలు-ప్రాజెక్టులే ప్రాణాధారం
- పంట నేలలకు కృత్రిమంగా నీటిని అందించడమే నీటిపారుదలగా నిర్వచించవచ్చు. నీటిపారుదల అనేది వివిధ దశల్లో పంట మొక్కల పెరుగుదలకు తగు మోతాదులో నీటిని అందించి వ్యవసాయ ఉత్పాదకతను పెంచడంలో వినియోగించబడే అతి ముఖ్యమైన ఉత్పాదక విధాన సాధనం. ఇది వ్యవసాయ రంగానికి అమూల్యమైన సేవలందించడమేగాక సంబంధిత ప్రాంతంలో సామాజిక ఆర్థికాభివృద్ధికి కూడా ఎంతగానో తోడ్పడుతుంది.
- వర్షపాతం తక్కువగా ఉండే ప్రాంతాల్లో నీటి పారుదల వసతులు లేనట్లయితే వ్యవసాయం అసాధ్యమవుతుంది. నీటి పారుదల వసతులు ఉంటే వర్షపాతం చాలినంత ఉండే ప్రాంతాల్లో కూడా నీటిని సరైన పద్ధతిలో పంటలకు అవసరమైనంత మేర అందించే ఆస్కారం ఉంటుంది. నీటిపారుదల అనేది వ్యవసాయానికి తోడ్పడటమే గాక సహజ భూస్వరూపాల నిర్వహణ, శుష్క ప్రాంతాల్లో వర్షపాతం తక్కువగా ఉన్నప్పుడు మృత్తికలు, నేలలు క్రమక్షయం ద్వారా నష్టపోకుండా పచ్చదనాన్ని తిరిగి అభివృద్ధి చేయడంలో కూడా ఉపయోగపడుతుంది.
- వ్యవసాయ ఆదాయాలను పెంచడం చాలా కీలకమైన అవసరం. ఈ వ్యవసాయ ఆదాయాలను పెంచడం నీటి పారుదల రంగంపైనే ఆధారపడి ఉంటుంది. వ్యవసాయ అభివృద్ధికి నీటి వనరుల లభ్యత, వినియోగం ముఖ్యమైనవి. రుతుపవనాలపై చేసే వ్యవసాయం ఆటుపోట్లకు గురవుతుంది. రుతుపవనాలు అనిశ్చితంగా ఉండటం వల్ల సాగుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నాయి.
- వర్షాలు నాలుగు నెలలు మాత్రమే పడటం వల్ల మిగతా నెలలు ఇతర నీటి వనరులపై ఆధారపడవలసి వస్తుంది.
- సంవత్సరం పొడవునా నీటి సరఫరా ద్వారా పంటలు పండించడానికి నదులు, చెరువులు, బావులు, ఆనకట్టల ఉపయోగం తప్పనిసరి. అందుబాటులో ఉన్న నీటిని కృత్రిమ పద్ధతుల ద్వారా అవసరమైన సమయంలో పంటలకు అందించడాన్ని నీటిపారుదల అంటారు.
- పెద్ద మొత్తంలో పంటలు పండించాలన్నా అధిక దిగుబడులు పొందాలన్నా నీటి పారుదల తప్పనిసరి. అతివృష్టి, అనావృష్టిలను సమర్థవంతంగా ఎదుర్కోవడం వల్ల రైతులకు మంచి దిగుబడులు వస్తాయి.
- తెలంగాణ ప్రాంతాన్ని పాలించిన కాకతీయులు గొలుసుకట్టు చెరువుల ద్వారా వ్యవసాయానికి నీటిపారుదల సౌకర్యాలను కల్పించారు. రామప్ప, లక్నవరం, పాకాల వంటి చెరువులు నీటిపారుదలకే కాకుండా ప్రకృతి రమణీయతను కలిగి ఉండి విహార యాత్రికులను ఆకట్టుకుంటున్నాయి.
- పాకాల చెరువు: ఇది వరంగల్ జిల్లాలోని నర్సంపేట మండలంలో ఉంది. దీనిని క్రీ.శ. 13వ శతాబ్దంలో కాకతీయులు నిర్మించారు. ఇది పంపలవాగు, ఇసుకవాగుల జలధారలను పాకాల చెరువులోకి మళ్లించే పథకం. దీని ద్వారా 5, 200 ఎకరాలకు నీటిపారుదల సౌకర్యాన్ని అందిస్తుంది.
- లక్నవరం చెరువు: ములుగు జిల్లాలోని గోవిందరావుపేట మండలంలో ఉంది. దీని నిర్మాణంలో చిన్న చిన్న గుట్టలను కలుపుతూ మట్టి కట్ట నిర్మాణం చేపట్టారు.
- నిజాం కాలంలో వ్యవసాయానికి నీటిపారుదల నిర్మాణాలు చేపట్టారు. ప్రధానంగా వీటిని హైదరాబాద్ చుట్టు పక్కల నిర్మించారు. వీరి కాలంలో ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్, పోచారం చెరువు, నిజాంసాగర్, దిండి, పాలేరు, వైరా, ఎగువ మానేరు వంటి ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది.
- స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కృష్ణా గోదావరి నదులపై భారీ మధ్యతరహా ప్రాజెక్టులను ఏర్పాటు చేశారు.
నీటిపారుదల రకాలు
- భారతదేశంలో విస్తీర్ణపరంగా కాలువల ద్వారా నీటిపారుదల అధికంగా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్.
- చెరువుల ద్వారా నీటిపారుదల అధికంగా ఉన్న రాష్ట్రం తమిళనాడు
- తెలంగాణలో చెరువుల ద్వారా నికర నీటిపారుదల విస్తీర్ణం అధికంగా ఉన్న జిల్లా ఉమ్మడి వరంగల్
- తెలంగాణలో చెరువుల ద్వారా నికర నీటిపారుదల విస్తీర్ణం అల్పంగా ఉన్న జిల్లా ఉమ్మడి రంగారెడ్డి
- విస్తీర్ణంపరంగా బావుల ద్వారా నీటి పారుదల అధికంగా ఉన్న రాష్ట్రం గుజరాత్
- తెలంగాణలో బావుల ద్వారా నికర నీటి పారుదల విస్తీర్ణం అధికంగా ఉన్న జిల్లా ఉమ్మడి కరీంనగర్
- బావుల ద్వారా నికర నీటిపారుదల విస్తీర్ణం అల్పంగా ఉన్న జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్
- దక్షిణ భారతదేశంలోని నదులు వర్షాధారమైనవి అంతే కాకుండా దక్కన్ పీఠభూమిలోని శిలలు కఠినంగా ఉంటాయి. అందువల్ల భూ ఉపరితలం పై పొరల్లో నీటిని పొందడం కొంచెం కష్టంగా ఉంటుంది.
- ఈ కారణాల వల్ల వర్షపు నీటిని నిల్వచేసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దీంతో దక్షిణ భారతదేశంలో ప్రాజెక్టులు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.
ప్రాజెక్టులు-రకాలు
- నీటి పారుదల సామర్థ్యం ఆధారంగా ప్రాజెక్టులను మూడు రకాలుగా విభజించవచ్చు.
భారీ నీటిపారుదల ప్రాజెక్టులు:
- 10000 హైక్టార్లకుపైన నీటి సామర్థ్యం గలవి.
మధ్యతరహా నీటి పారుదల ప్రాజెక్టులు:
- 2000-10,000 హైక్టార్లకు మధ్య నీటిపారుదల సామర్థ్యం గలవి.
చిన్నతరహా నీటి పారుదల ప్రాజెక్టులు:
- 2000 హెక్టార్ల కంటే తక్కువ నీటి సామర్థ్యం కలవి.
- తెలంగాణలో నదీపరీవాహక ప్రాంతం ఎక్కువ ఉన్నందువల్ల వ్యవసాయ రంగానికి నీటిని అందించడంలో భారీ నీటిపారుదల ప్రాజెక్టులు ముఖ్యమైనవి.
- రాష్ట్రప్రభుత్వం మొత్తం కోటి ఎకరాలకు సాగునీటి సదుపాయం కల్పించాలనే లక్ష్యం తో 36 సాగునీటి ప్రాజెక్టులను చేపట్టింది. వీటిలో 21 భారీ సాగునీటి ప్రాజెక్టులు. 12 మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టులు. ఒక ఫ్లడ్ బ్యాంకు (వరదకట్ట), రెండు ప్రస్తుత ప్రాజెక్టులు ఆధునికీకరణలో ఉన్నాయి.
- ఈ సాగునీటి ప్రాజెక్టులతో 72 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించనుంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న 36 ప్రాజెక్టుల కింద 8.97 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు.
- తెలంగాణలో కృష్ణా, గోదావరి వంటి పెద్ద నదులే కాకుండా 15 చిన్న నదులు ఉన్నాయి.
- ఈ నదుల నుంచి 1230 టీఎంసీల సాగునీరు అందుతుంది.
- గోదావరి బేసిన్ నుంచి 933.70 టీఎంసీలు, కృష్ణా బేసిన్ నుంచి 298 టీఎంసీల నీటిని వినియోగించుకోవచ్చు.
- రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రధాన ప్రాజెక్టులను, మధ్యతరహా ప్రాజెక్టులను పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది.
- తెలంగాణలో అతిపెద్ద నదీపరీవాహక ప్రాంతం గోదావరి పరీవాహక ప్రాంతం. రాష్ట్రంలో చెరువులు, బావులు, కాలువల ద్వారా వ్యవసాయం సాగవుతుంది.
- తెలంగాణ ప్రభుత్వం కింది చర్యలను చేపట్టింది.
- సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేయడం
- నాగార్జునసాగర్, నిజాంసాగర్, శ్రీరాంసాగర్ పాత ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయడం.
- మిషన్ కాకతీయ కింద రాష్ట్రంలోని చెరువుల పునరుద్ధరణ.
- ప్రధాన చెరువులకు భారీ, మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టులను అనుసంధానం చేస్తూ తూములు, చెక్‌డ్యాంల నిర్మాణం చేపట్టి, ప్రాజెక్టుల కమాండ్ ప్రాంతంలోని జలాధార నదుల పునరుద్ధరణ చేపట్టడం.
- 9 భారీ నీటి పారుదల ప్రాజెక్టుల కింద 21.32 లక్షల నీటి పారుదల సామర్ధ్యాన్ని కల్పించారు.
బోరుబావులు అధికంగా ఉన్న జిల్లాలు
- నిజామాబాద్
- నల్లగొండ
- సిద్దిపేట
- సూర్యాపేట
బోరుబావులు తక్కువ ఉన్న జిల్లాలు
- కొమ్రంభీం ఆసిఫాబాద్
- మేడ్చల్ మల్కాజిగిరి
- ములుగు
- ఆదిలాబాద్
- రాష్ట్రంలో 46,531 చిన్నా పెద్ద చెరువులను బాగు చేసి నీటిరి ఒడిసిపట్టి నీటి కొరతను తీర్చడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది.
- 27,665 చెరువులను పునరుద్ధరణ చేయడంవల్ల 15.05 లక్షల ఎకరాలను స్థిరీకరించారు.
- 8.93 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం పునరుద్ధరణ జరిగింది.
రాష్ట్రంలో ఎక్కువ చెరువులున్న జిల్లాలు
- సిద్ధిపేట
- మెదక్
- సంగారెడ్డి
- భద్రాది కొత్తగూడెం
- నల్లగొండ
చెరువుల ద్వారా నీటిపారుదల ఆయకట్టు ఎక్కువున్న జిల్లాలు
- భద్రాది కొత్తగూడెం
- ఖమ్మం
- నిజామాబాద్
- సిద్దిపేట
- మెదక్
- నల్లగొండ
- నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించి తద్వారా సాగుభూముల విస్తీర్ణాన్ని పెంచడానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నది.
- ప్రధానంగా తెలంగాణ నీటి పారుదల రెండు నదులపై ఆధారపడి ఉన్నది. ఈ రెండు నదుల నుంచి కేటాయించిన జలాలు 1206.94 టీఎంసీలు
ప్రాక్టీస్ బిట్స్
1. తెలంగాణలో అతిపెద్ద నదీ పరివాహక ప్రాంతం ఏది?
ఎ) గోదావరి బి) కృష్ణా
సి) ఎ, బి డి) ఏదీకాదు
2. బోరుబావులు అధికంగా ఉన్న జిల్లాలు ఏవి?
ఎ) నిజామాబాద్ బి) నల్లగొండ
సి) సిద్దిపేట డి) పైవన్నీ
3. బోరుబావులు, తవ్విన బావులు తక్కువగా ఉన్న జిల్లాలు?
ఎ) కొమ్రంభీం ఆసిఫాబాద్
బి) మేడ్చల్ మల్కాజిగిరి
సి) ములుగు డి) పైవన్నీ
4. గోదావరి నదిపై గల ప్రాజెక్టులు ఏవి?
ఎ) శ్రీరాంసాగర్
బి) హిమాయత్ సాగర్
సి) ప్రియదర్శిని జూరాల
డి) పైవేవీకాదు
5. తెలంగాణలో గోదావరి నదిపై నిర్మించిన మొదటి ప్రాజెక్టు ఏది?
ఎ) ఇందిరాసాగర్ బి) శ్రీరాంసాగర్
సి) ఆలీసాగర్ డి) కాళేశ్వరం ఎత్తిపోతల
6. శ్రీరాంసాగర్ ప్రాజెక్టును ఎన్ని లక్షల ఎకరాలకు నీరందించేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టారు?
ఎ) 16 లక్షల ఎకరాలు
బి) 18 లక్షల ఎకరాలు
సి) 20 లక్షల ఎకరాలు
డి) 22 లక్షల ఎకారలు
7. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుపై ఉన్న ప్రధాన కాలువల పేర్లు ఏవి?
ఎ) లక్ష్మి బి) సరస్వతి
సి) కాకతీయ డి) పైవన్నీ
8. తెలంగాణలో అతి పొడవైన కాలువ ఏది?
ఎ) లక్ష్మి బి) సరస్వతి
సి) కాకతీయ డి) ఎ, బి
9. కాకతీయ కాలువ పొడవెంత?
ఎ) 324 కిలోమీటర్లు
బి) 268 కిలోమీటర్లు
సి) 284 కిలోమీటర్లు
డి) 294 కిలోమీటర్లు
10. మేడిగడ్డ బ్యారేజీ ఏ జిల్లాలో ఉంది?
ఎ) జయశంకర్ భూపాల పల్లి
బి) ములుగు
సి) కరీంనగర్ డి) నర్సంపేట
11. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని గంగారం గ్రామం వద్ద ఉన్న ఎత్తిపోతల పథకం పేరు?
ఎ) దేవాదులు బి) ఎల్లంపల్లి
సి) అర్గుల రాజారాం గుత్ప
డి) ఇందిరాసాగర్ /రుద్రమకోట
12. ఆలీసాగర్ ఎత్తిపోతల పథకం కింద ఎన్ని ఎకరాలకు నీటిని అందిస్తున్నారు?
ఎ) 63.876 ఎకరాలు
బి) 73.860 ఎకరాలు
సి) 53.793 ఎకరాలు
డి) 48.476 ఎకరాలు
13. వరద కాలువ పథకం ఏ జిల్లాలో ఉంది?
ఎ) నిజామాబాద్ బి) వరంగల్
సి) నల్లగొండ డి) ఖమ్మం
14. వరదకాలువ పధకం కింద ఎన్ని లక్షల
ఎకరాలకు సాగునీరు అందుతుంది?
ఎ) 2, 20,000 ఎకరాలు
బి) 1, 80,000 ఎకరాలు
సి) 1, 60,000 ఎకరాలు
డి) 2, 70,000 ఎకరాలు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?