అక్టోబర్ 11న మరో 33 బీసీ గురుకులాలు
- బాలికలకు 17, బాలురకు 16
- అదే నెల 15న 15 డిగ్రీ కాలేజీలు
- మంత్రి గంగుల కమలాకర్
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్తగా మంజూరు చేసిన 33 బీసీ గురుకులాలు, 15 డిగ్రీ కళాశాలలను వచ్చే నెలలో ప్రారంభించనున్నారు. బీసీ గురుకులాలను అక్టోబర్ 11న, డిగ్రీ కళాశాలలను అదే నెల 15న ప్రారంభించను న్నట్టు బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కొత్తగా ప్రారంభించ నున్నవాటిలో 17 గురు కులాలను బాలికలకు, మరో 16 గురుకులాలను బాలురకు ప్రత్యేకించారు. దీంతో రాష్ట్రంలోని మొత్తం బీసీ గురుకులాల సంఖ్య 310కి పెరగనున్నది. గురుకులాలు, కాలేజీల ఏర్పాట్లపై మంత్రి గంగుల కమలాకర్ బీసీ సంక్షేమశాఖ ఉన్నతాధికారులతో శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీల విద్యాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారనడానికి ఏటేటా గురుకులాల సంఖ్యను పెంచుతుండటమే నిదర్శనమని చెప్పారు. గురుకులాలకు స్థలాల గుర్తింపు బాధ్యతను జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. గతంలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన విధంగా హాలియా, దేవరకద్ర, కరీంనగర్, సిరిసిల్ల, వనపర్తితోపాటు 10 ఉమ్మడి జిల్లాలకు ఒక్కొక్కటి చొప్పున డిగ్రీ కాలేజీలను ప్రారంభిస్తామని వెల్లడించారు.
అదనంగా 50 బీసీ స్టడీ సర్కిళ్లు
రాష్ట్ర ప్రభుత్వం 80 వేల పై చిలుకు ఉద్యోగాలకు వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తున్న నేపథ్యంలో బీసీ అభ్యర్థులకు మెరుగైన శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా మరో 50 బీసీ స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేస్తామని మంత్రి గుంగుల తెలిపారు. వాటి ద్వారా గ్రూప్స్, డీఎస్సీ, తదితర పోటీ పరీక్షలకు నాణ్యమైన శిక్షణ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. స్టడీ సెంటర్ల ద్వారా దాదాపు 25 వేల మంది అభ్యర్థులకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. సమావేశంలో బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఎంజేపీ సొసైటీ కార్యదర్శి మల్లయ్యభట్టు, బీసీ స్టడీ సర్కిల్స్ డైరెక్టర్ అలోక్‌కుమార్, బీసీ సంక్షేమశాఖ ఉన్నతాధికారులు సంధ్య, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
బాలికల డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేసే ప్రాంతాలు
రంగారెడ్డి, సంగారెడ్డి, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ, వనపర్తి
బాలుర డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేసే ప్రాంతాలు
మహబూబ్‌నగర్, హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, మేడ్చల్, సిరిసిల్ల, నాగార్జునసాగర్
(మరో కాలేజీకి సంబంధించిన క్యాటగిరీ, పట్టణం ఎంపిక చేయాల్సి ఉన్నది)
బాలికల గురుకులాలు ఏర్పాటయ్యే జిల్లాలు (17)
జోగుళాంబ గద్వాల, మహబూబ్‌నగర్, వనపర్తి, రంగారెడ్డి, వికారాబాద్, నిజామాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ
(మిగిలిన 16 జిల్లాల్లో బాలుర గురుకులాలు ఏర్పాటు చేయనున్నారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు