‘మాఫీనామా’కు ఒప్పుకోని వ్యక్తి ఎవరు?
పీవీ నరసింహారావు
# 1921, జూన్ 28న కరీంనగర్ జిల్లాలోని వంగరలో జన్మించారు. పూనాలో బీఎస్సీ, నాగపూర్‌లో ఎల్ఎల్బీ పూర్తిచేసి బూర్గుల రామకృష్ణారావు దగ్గర జూనియర్‌గా పనిచేశారు. 1957 నుంచి 1977 వరకు మంథెన నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వచ్చారు. నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో 1962-64 వరకు న్యాయ, జైళ్ల శాఖలను ఆ తర్వాత పౌర సమాచార సంబంధ శాఖలను చేపట్టారు.
# 1972, ఫిబ్రవరిలో ముల్కీ నిబంధనలు చెల్లుతాయని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం వల్ల జై ఆంధ్ర ఉద్యమం తలెత్తింది. దీంతో 1973లో ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకొన్నారు. 15 నెలలు మాత్రమే ముఖ్యమంత్రిగా పనిచేశారు. తెలుగు అధికార భాషగా బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టడమే కాకుండా ‘తెలుగు అకాడమీ’ని స్థాపించి, దానికి అధ్యక్షులుగా (1968-74) వ్యవహరించారు.
# కేంద్ర ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా, ఆరు నెలలు హోంమంత్రిగా, ప్లానింగ్ శాఖ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు. రాజీవ్‌గాంధీ హత్యానంతరం 1991లో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులై అదే సంవత్సరంలో ప్రధాన మంత్రి పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తి. పీవీ నరసింహారావు ఆర్థిక నిపుణుడైన మన్మోహన్ సింగ్‌ను ఆర్థిక మంత్రిని చేసి నూతన సరళీకృత ఆర్థిక విధానాలను ప్రవేశపెట్టి దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించారు. 2004, డిసెంబర్ 23న పీవీ మరణించారు.
ప్రొ.కొత్తపల్లి జయశంకర్
# 1934, ఆగస్ట్ 6న అక్కంపేట గ్రామంలో జన్మించారు. ఈయనను ప్రొ. జయశంకర్ సార్‌గా పిలుస్తారు. ఈయన విద్యాభ్యాసం హన్మకొండలో సాగింది. ఎంఏ ఎకనామిక్స్‌ను బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ (ఎకనామిక్స్) ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పొందారు.
# జయశంకర్ సార్ ‘తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్, తల్లడిల్లుతున్న తెలంగాణ, తెలంగాణ రాష్ట్రంపై విస్తృత అంగీకారం-నిజానిజాలు’ వంటి రచనలు చేసి ఎప్పటికప్పుడు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలు వెలుగులోకి తెచ్చి ప్రజల్లో తెలంగాణ సోయిని కలిగించారు. వీరి స్వీయ చరిత్ర ‘నొడువని ముచ్చట’ను కొంపల్లి వెంకట్‌గౌడ్ రచించారు.
# 1982-91 మధ్య సీఐఈఎఫ్ఎల్ రిజిస్ట్రార్‌గా పనిచేశారు. 1991-94 మధ్య కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్‌గా పనిచేశారు. వీరు గవర్నమెంట్ కాలేజీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, జనరల్ సెక్రటరీగా పనిచేశారు. 2011, జూన్ 21న మరణించారు. తన తుది శ్వాస వరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన మహనీయుడు జయశంకర్ సార్.
నారాయణ రావ్ పవార్
#ఈయన జగదీశ్ ఆర్య, గండయ్య ఆర్య అనే స్నేహితులతో కలిసి 1947, డిసెంబర్ 4న కింగ్ కోఠి ప్యాలెస్ వద్ద 7వ నిజాంపై బాంబు వేశారు. ఈ దాడిలో 7వ నిజాం తప్పించుకోగా దారినపోయే కొమురయ్య, ఫెర్నాండెజ్ అనేవారికి తీవ్ర గాయాలయ్యాయి. 1947లోనే సెషన్స్ కోర్టు నారాయణ రావుకు మరణ శిక్ష, జగదీశ్ ఆర్యకు జీవిత కారాగార శిక్ష విధించింది.
# కానీ 1948, సెప్టెంబర్ 17న చేపట్టిన పోలీస్ చర్య తరువాత నారాయణరావు పవార్ మరణ శిక్షను జీవిత కారాగార శిక్షగా మార్పుచేశారు. స్వామి రామానంద తీర్థ మధ్యవర్తిత్వంతో ‘మాఫీనామా’ అంటే తప్పయిందని ఒప్పుకొంటే విడిచిపెట్టడానికి గవర్నర్ జనరల్ ఒప్పుకొన్నాడు. అందుకు నారాయణరావు ససేమిరా ఒప్పుకోలేదు. చివరకు 21 నెలల జైలుశిక్ష అనంతరం 1949, ఆగస్టు 10న విడుదలయ్యారు. 2010, డిసెంబర్ 12న హైదరాబాద్‌లో మరణించారు.
సంగెం లక్ష్మీబాయి
# లక్ష్మీబాయి ధైర్యవంతురాలు. జీవించినంతకాలం దేశం కోసం, ప్రజల కోసం పోరాడారు. ఉన్నవ లక్ష్మీబాయమ్మ స్థాపించిన శారదానికేతన్‌లో చదువుకొని విద్వాన్ పాసయ్యారు. ఉప్పు సత్యాగ్రహంలో దుర్గాబాయి దేశ్ముఖ్తో కలిసి పాల్గొన్నారు. జైలులో ఉన్న కాలంలో ‘నా జైలు జ్ఞాపకాలు-అనుభవాలు’ అనే గ్రంథం రాశారు. 1928 సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. కల్లు దుకాణాలు, విదేశీ వస్తు దుకాణాల దగ్గర సత్యాగ్రహం చేశారు. నిజాం పాలనకు విసిగిపోయి నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. 1952 శాసనసభ ఎన్నికల్లో బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 1954-56 వరకు హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వంలో విద్యాశాఖ ఉపమంత్రిగా పనిచేశారు. 1957, 62, 67 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మెదక్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1952లో శ్యామలాదేవి, లలితాదేవి, కేవీ రంగారెడ్డిలతో కలిసి ఇందిరా సేవాసదన్ సొసైటీని స్థాపించారు. దానినే ఇప్పుడు ఐఎస్ సదన్‌గా పేర్కొంటున్నారు. లక్ష్మీబాయి 1979, జూన్ 2న మరణించారు.
ఈశ్వరీ బాయి జే
#1918, డిసెంబర్ 1న సికింద్రాబాద్‌లో సామాన్య దళిత కుటుంబంలో జన్మించారు. పూర్వపు హైదరాబాద్ సంస్థానంలో, ఆంధ్రప్రదేశ్‌లోనూ సామాజిక సేవా రంగంలో గణనీయమైన కృషి చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాలను, ఆశయాలను అధ్యయనం చేసి వీటిని సాధించడానికి అహోరాత్రులు కృషిచేసిన నాయకురాలు. దళిత ప్రజల ఆశలు, ఆకాంక్షల కోసం ‘రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా’ నిర్వహించిన పోరాటాల్లో అగ్రగామిగా నిలిచారు. 1951 పురపాలక సంఘం ఎన్నికల్లో చిలకలగూడ వార్డు నుంచి పోటీచేసి గెలిచారు. 1960లో ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల ఫెడరేషన్‌కు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1967లో నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి రిపబ్లిక్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి గెలిచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రారంభించిన తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో ‘రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా’ స్థాపనలోనూ, నిర్వహణలోనూ ప్రధాన పాత్ర పోషించారు.
స్వామి రామానంద తీర్థ
#ఈయన అసలు పేరు వెంకటరావు ఖేడ్గేకర్. ఈయనపై ప్రభావం చూపినవారు స్వామి రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, స్వామి రామతీర్థ. స్వామి రామతీర్థ రచనలతో ప్రభావితుడై శిష్యుడిగా మారి తన పేరును స్వామి రామానంద తీర్థగా మార్చుకున్నారు.
#రామానంద తీర్థ ‘పెట్టుబడి-శ్రమ’ అనే అంశంపై రాసిన వ్యాసం ఏఐటీయూసీ అధ్యక్షుడు అయిన ఎన్ఎం జోషికి నచ్చి తన సహాయకునిగా నియమించుకున్నారు. ఈ సమయంలో కార్మిక సంఘ అగ్రనేతలతో పరిచయాలు ఏర్పడి అభ్యుదయ భావాల వైపు ఆకర్షితులయ్యారు. కానీ ఆరోగ్యం సహకరించకపోవడంతో ఉస్మానాబాద్‌లోని ఆదర్శ పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయునిగా ఉద్యోగం చేశారు.
# తదనంతర కాలంలో భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరి హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపనలో, మహారాష్ట్ర పరిషత్ ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. మొదటి వ్యక్తిగత సత్యాగ్రహిగా 1940, సెప్టెంబర్ 11న అరెస్ట్ అయ్యారు. ఈయన నినాదం ‘దౌర్జన్యాన్ని ఎదిరించడం అంటే దేవుడిని పూజించినట్లు, లేవండి ఎదిరించండి’.
మదన్మోహన్
# 1969 ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజాసమితి స్థాపనలో కీలకపాత్ర పోషించి తొలి అధ్యక్షుడయ్యారు. 1970 సిద్దిపేట ఉపఎన్నికలో తెలంగాణ ప్రజాసమితి అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. సిద్దిపేట నియోజకవర్గం నుంచి 1972, 78, 83 ఎన్నికల్లో శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. 1983లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష నేతగా వ్యవహరించారు. ఈయన సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే హైదరాబాద్‌లో జేఎన్టీయూను స్థాపించారు.
టీఎన్ సదాలక్ష్మి
# దళిత ఉపకులమైన మెహతార్ కులానికి చెందిన వ్యక్తి సదాలక్ష్మి. 1957 ఎన్నికల్లో నిజామాబాద్, కామారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీచేసి గెలిచారు. నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో దేవాదాయ శాఖ మంత్రిగా, దామోదరం సంజీవయ్య కాలంలో తొలి మహిళా డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. చెన్నారెడ్డి అరెస్ట్ తర్వాత మొత్తం తెలంగాణ ఉద్యమాన్ని నడిపి అరెస్ట్ అయి చెంచల్‌గూడ జైలులో శిక్ష అనుభవించారు. కాంగ్రెస్ పార్టీలో కొంతకాలం పనిచేసి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపనలో పాలుపంచుకున్నారు. సదాలక్ష్మి బంధు సేవా మండలి, బాబు జగ్జీవన్‌రావు ట్రస్ట్, లిడ్‌క్యాప్ సంస్థలు స్థాపించారు.
మీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ (మీర్ మహ్మద్ అలీ)
# 1877, జూలై 11న హైదరాబాద్‌లో జన్మించారు. ఈయన పాఠశాల విద్య సెయింట్ జార్జ్ గ్రామర్ పాఠశాలలో, కళాశాల విద్య నిజాం కాలేజీలో, ఇంజినీరింగ్ 1896లో ఇంగ్లండ్‌లోని ప్రఖ్యాత కూపర్స్హిల్ కాలేజీలో నిజాం ప్రభుత్వ స్కాలర్‌షిప్‌తో చదివాడు. 1899లో తిరిగి హైదరాబాద్‌కు వచ్చి పబ్లిక్ వర్క్ డిపార్ట్ మెంట్లో అసిస్టెంట్ ఇంజినీర్‌గా పనిచేశాడు.
# ఇతడిని నిజాం హైదరాబాద్ రాష్ట్ర చీఫ్ ఇంజినీర్‌గా నియమించాడు. తెలంగాణలోని భారీ, మధ్యతరహా నీటి ప్రాజెక్టులకు ఇతనే ఆద్యుడు. భారీ నీటి పారుదల పనులను చేపట్టి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిజాం సాగర్లను నిర్మించాడు. వైరా, పాలేరు, ఫతేనగర్ ప్రాజెక్టులను నిర్మించడానికి ఎంతో శ్రమించాడు. ఇంకా ఉస్మానియా జనరల్ హాస్పిటల్, ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ, హైదరాబాద్ హౌస్ (న్యూఢిల్లీ) ఇతని ఇంజినీరింగ్ అద్భుతాలకు మచ్చుతునకలు.
#ఈయనను 1929లో బాంబే ప్రభుత్వం సుక్కూర్ బ్యారేజీ ఆర్థిక, సాంకేతిక నిపుణుడిగా మోక్షగుండం విశ్వేశ్వరయ్యతో కలిసి పనిచేయడానికి ఆహ్వానించింది. ఇతని పేరుమీదగానే నిజామాబాద్ (బోధన్)లోని డ్యాంకు అలీసాగర్గా పేరుపెట్టారు. ఇతని జన్మదినం అయిన జూలై 11ను తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఇంజినీర్స్ డేగా జరుపుకోవాలని ప్రకటించింది.
మాదిరి ప్రశ్నలు
1. ‘లోపలి మనిషి’ ఎవరి జీవిత చరిత్ర?
1) స్వామి రామానందతీర్థ
2) పీవీ నరసింహారావు
3) బూర్గుల రామకృష్ణారావు
4) ప్రొ. జయశంకర్
2. పీవీ నరసింహారావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలం?
1) 1972-73 2) 1971-72
3) 1973-74 4) 1970-71
3. ‘నా జైలు జ్ఞాపకాలు – అనుభవాలు’ గ్రంథ రచయిత?
1) రావి నారాయణ రెడ్డి
2) పుచ్చలపల్లి సుందరయ్య
3) సంగెం లక్ష్మీబాయి
4) ఈశ్వరీబాయి
4. ఆంధ్రప్రదేశ్‌లో ‘రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా’ స్థాపనలో కీలకపాత్ర పోషించినది?
1) జే ఈశ్వరీబాయి
2) సంగెం లక్ష్మీబాయి
3) టీఎన్ సదాలక్ష్మి
4) నారాయణ రావు పవార్
5. కింది వాటిలో టీఎన్ సదాలక్ష్మి స్థాపించిన సంస్థలు?
1) బంధు సేవా మండలి
2) బాబు జగ్జీవన్‌రామ్ ట్రస్ట్
3) లీడ్‌క్యాప్ 4 పైవన్నీ
6. కింది వారిలో తెలంగాణ ప్రజాసమితితో సంబంధం ఉన్న వ్యక్తులు?
1) మదన్ మోహన్ 2) టీఎన్ సదాలక్ష్మి
3) జే ఈశ్వరీ బాయి 4) 1, 2
7. ఎవరి జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం జూలై 11న ఇంజినీర్స్ డేగా జరుపుకొంటుంది?
1) నవాబ్ అలీ యావర్ జంగ్
2) మీర్ నవాజ్ అలీ నవాజ్ జంగ్
3) రాజ్ బహదూర్ వెంకటరాంరెడ్డి
4) తురబ్ అలీ ఖాన్
8. ‘నొడువని ముచ్చ’ను రచించింది?
1) కొంపల్లి వెంకట్ గౌడ్
2) జయశంకర్ 3) కోదండరాం
4) నందిని సిధారెడ్డి
9. కింది వాటిలో జయశంకర్ సార్ రచనలు?
1) తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్
2) తల్లడిల్లుతున్న తెలంగాణ
3) తెలంగాణ రాష్ట్రంపై విస్తృత అంగీకారం – నిజా నిజాలు
4) పైవన్నీ
సమాధానాలు
1-2, 2-1, 3-3, 4-1, 5-4, 6-4, 7-2, 8-1, 9-4
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ,
కోరుట్ల
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు