కాలాతీత కర్మయోగి
# మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ
సరిగ్గా 153 ఏళ్ల కిందట జన్మించి.. సుమారు అరవై ఏళ్ల కిందట మరణించిన ఒక మనిషి గురించి ఈ ప్రపంచం ఇంకా మాట్లాడుకుంటున్నది. కొందరు ఆయనను ప్రేమిస్తే.. ఇంకొందరు తన సిద్ధాంతాలను ప్రశ్నిస్తుంటారు. మరికొందరు ఏదో శోధించి.. ఇంకేదో సాధించాలనుకుంటారు. ఎందుకంటే.. మానవాళి చరిత్రలో అతనొక సమున్నత శిఖరం. అతనే మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ. కాలాతీత కర్మయోగి.
-కిందటి తరం గాంధీని చూసింది. నేటి తరం ఆయన గురించి చదువుతోంది. రేపటి తరం కూడా తెలుసుకుంటుంది. ఎందుకంటే అతడు మహాత్ముడు. నమ్మిన సిద్ధాంతాలని ఆచరించి చూపించిన కర్మయోగి. అతని సిద్ధాంతాలు కాలాతీతమైనవి.. విశ్వజనీనమైనవి. భారత్‌కు స్వాతంత్య్రాన్ని ప్రసాదించాయి. బానిసత్వంలో మగ్గిన ఆఫ్రికాకు విముక్తిని కలిగించాయి. అమెరికాలో జాతివివక్షపై పోరాడి విజయభేరి మోగించాయి. అది గాంధీ సిద్ధాంతాలకు ఉన్న శక్తి. కాలం కరిగినా.. శతాబ్దం మారినా.. రాజకీయ, సామాజిక, ఆర్థిక క్షేత్రాల్లో ఇప్పటికీ ఆ సిద్ధాంతాల అవశ్యకత ఉంది.
రాజనీతి కోవిదుడు
-మతంలోని మంచిని, ఆధ్యాత్మికతలోని శక్తిని రాజకీయలకు జోడించి, రాజకీయాల్లో నైతికత, ధార్మికత ఉండాలని తపించినవారు గాంధీ. విలువల్లేని రాజకీయాలని వ్యర్థంగా భావించారాయన. ఆ మహాత్ముడి దృష్టిలో రాజకీయమంటే ప్రజాసమస్యల పరిష్కారానికి కృషిచేయడం. ప్రజాసేవలో తరించడం.
-మరి నేడు.. సమకాలీన ప్రపంచంలో రాజకీయం ఒక రాక్షస క్రీడగా మారింది. నైతికతకు ధార్మికతకు దాదాపుగా తావులేదు. పదవుల కోసం పాకులాడే నేతాగణమే ఎక్కువగా కనిపిస్తుంది.
-ధర్మయుద్ధంలో గెలుపుకోసం, ధర్మబద్ధమైన ఆయుధాలనే వాడేవారు గాంధీజీ. అందుకే పిడికెడు ఉప్పుతో కూడా అఖండ భారతాన్ని కదిలించగలిగారు. మరి ఇప్పుడేం ఏం జరుగుతోంది? ప్రజలని సమీకరించడానికి, ప్రజాభిప్రాయాన్ని కూడగట్టడానికి మతం, కులం లాంటి సంకుచిత అంశాలని రెచ్చగొట్టడం తప్ప. అందుకే గాడి తప్పిన రాజకీయాలని చక్కదిద్దడానికి నేటి తరానికి గాంధేయ మంత్రమే స్ఫూర్తి కావాలి.
సమానత్వమే పరమావధి
-భిన్నత్వానికి ప్రతీకైన భారతదేశంలో మత సామరస్యం కోసం, సమానత్వం కోసం, పేదల సంక్షేమం కోసం అనుక్షణం పోరాడిన ధీరుడు గాంధీ. చివరిపేద వరకు సంక్షేమ ఫలాలు అందాలని (అంత్యోదయ), అందరి ముఖాల్లో చిరునవ్వులు వికసించాలని (సర్వోదయ) సంకల్పించారు గాంధీ. పేదవారిలోనే దేవుడున్నాడని బలంగా నమ్మిన ఆధ్యాత్మిక మూర్తి అతను. కానీ సమాజంలో నేటికీ దాదాపు 20 శాతం మంది పేదరికంలోనే బతుకీడుస్తున్నారు. అప్పుడప్పుడు ఆకలి చావులు కూడా కనిపిస్తున్నాయి. మొత్తం సంపదలో 10 శాతం కేవలం 25 మంది వ్యక్తుల దగ్గర పోగుపడ్డ దేశం మనది. ఆర్థిక అసమానతలు, సామాజిక అసమానతలకు ఆపై మరిన్ని పర్యావసనాలకు కారణమవుతున్నాయి. అన్ని రకాల అసమానతలు, అన్యాయాలను ఎదిరించాలని చాటిచెప్పే గాంధీ తాత్వికత ఇప్పటికీ మార్గ దర్శనమే.
సత్యాగ్రహి
-సత్యం, అహింస అనే ఆయుధాలతో బ్రిటిష్‌పై దండెత్తిన మహాత్ముడు సంపూర్ణ సత్యాగ్రహి. ఎట్టి పరిస్థితుల్లోనూ హింసను సమర్థించలేదు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష రూపంలో తనను తాను శిక్షించుకుంటారు. నేడు ప్రపంచ వ్యాప్తంగా హింసోన్మాదం చెలరేగుతోంది. ఒక దేశం మరో దేశంపై యుద్ధానికి కాలుదువ్వుతోంది. బాంబుదాడులు, భౌతికదాడులు, మారణహోమాలు, హత్యలు ఇవన్నీ నిత్యం ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో ఒక చోట కనిపిస్తున్నాయి. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే న్యాయం కోసం ప్రశ్నించే గొంతుకలపై కొన్నిసార్లు ప్రభుత్వాలే హింసకు దిగుతున్నాయి. మరి ఈ దుస్థితి నుంచి బయటపడటానికి బాపూజీ ప్రవచించిన సత్యాగ్రహ మార్గం తప్ప మనకు మరో దారి ఉందా!
అసమానం ఆ ధైర్యసాహసం
-ప్రపంచవ్యాప్తంగా యువతలో నిరాశ, నిస్పృహలు పెరుగుతున్నాయి. నానాటికీ పెరుగుతున్న ఆత్మహత్యా ధోరణులే దీనికి సాక్ష్యం. ధైర్యంలేని పిరికితనమే వీటన్నింటికి కారణం. మహాత్ముడి ధైర్యం మనలో తొణికిసలాడాలి. అవును గాంధీజీ యుద్ధవీరుడి కంటే ధైర్యవంతుడు. అతను ప్రవచించిన అహింసవాదాన్ని కొంతమంది అశక్తతగా మరికొందరు అధైర్యంగా అన్వయించవచ్చు. కానీ అది సరికాదు. ఎంత ధైర్యం లేకపోతే పరాయి ప్రభుత్వపు పోలీస్ లాఠీకి ఎదురుగా నిలబడి పోరాడారు గాంధీ.
వ్యక్తిత్వ వికాస నిపుణుడు
-గాంధీ నేటి తరానికి ఇచ్చిన అపురూపమైన కానుక వ్యక్తిత్వ వికాస పాఠాలు. గాంధీ సూక్తులకు చురకత్తికంటే పదునెక్కువ. ప్రపంచంలో చూడాలనుకున్న మార్పు ముందు మనలోనే జరగాలంటారు. మన ఆలోచనలే మన జీవితాన్ని నిర్మిస్తాయని ఉపదేశిస్తారు. ఈ సూక్తులకు కాలంతో పనేమైనా ఉందా? ఎప్పుడైనా ఇవి నిత్య సత్యాలే కదా! చరిత్రలో గాంధీ అచేతనంగా ఉన్న రోజులు తక్కువగా కనిపిస్తాయి. దేశం స్వాతంత్య్ర సంబరాలు చేసుకుంటున్న సందర్భంలో కూడా ఆ మహనీయుడు మత సామరస్యం కోసం కృషిచేశారు. ఒకవేళ ఇప్పుడు గాంధీ ఉండి ఉంటే కల్లోలం రేగుతున్న కశ్మీరంలోనో.. పౌరసత్వం కోసం పట్టుబడుతున్న ఈశాన్యంలోనో పర్యటించేవారేమో.. ఎందుకంటే అతనొక నిత్యకృషీవలుడు.
విద్యతోనే వెలుగు
-విద్యని జీవితానికి వెలుగుగా అభివర్ణించారు గాంధీ. చదువు ద్వారా శాంతి సౌభ్రాతృత్వం నెలకొంటాయని, దాంతో జాతి సమగ్రత సాధ్యమవుతుందని విశ్వసించారు గాంధీ. కానీ స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ నిరక్షరాస్యత ఉంది. ఆర్థిక స్తోమత, సామాజిక చైత్యనం లేకపోవడం, మౌలిక సౌకర్యాల లేమి.. ఇలా ఎన్నో అంశాలు కోట్లాది మంది భారత యువతను సరైన విద్యావంతులుగా తీర్చిదిద్దలేకపోతున్నాయి.
విశ్వవ్యాప్తం గాంధీ సిద్దాంతం
-గాంధీ సిద్ధాంత విజయగాథలు ఈ దేశానికే పరిమితం కాదు. అవి సరిహద్దులు దాటాయి. రాజకీయ, సామాజిక, ఆధ్యాత్మికవేత్తల్లో ప్రేరణ కల్పించాయి. బానిసత్వం, జాతివివక్ష, నిరంకుశత్వాలపై పోరాడాయి. గాంధీజి సిద్ధాంతాలకున్న మహత్తర శక్తిని ఎప్పుడో గుర్తించిన ప్రపంచం కొన్నిసార్లు అనుసరించింది.. మరికొన్ని సార్లు అనుకరించింది. దక్షిణాఫ్రికా పోరాటయోధుడు నెల్సన్ మండేలాకు అవి స్ఫూర్తి మంత్రాలు, అమెరికాలో జాతివివక్షపై కెరటంలా విరుచుకుపడ్డ మార్టిన్ లూథర్ కింగ్‌కు వెలుగు దివ్వెలు, ఆధ్యాత్మికవేత్త దలైలామాకు మార్గనిర్దేశకాలు.
-అమెరికా అధ్యక్షుడిగా గెలిచి శ్వేతజాతీయుల ఆధిపత్యానికి అడ్డుకట్ట వేసిన బరాక్ ఒబామాకు కూడా బాపూజీ సిద్ధాంతమే గెలుపు మంత్రం.
-ప్రపంచంలో హింస, అసమానతలు, అన్యాయాలు, పేదరికం కొనసాగినంతవరకు, శాంతి, కరుణ, ప్రేమ అవసరమైనన్నిరోజులు గాంధీజీ సిద్ధాంతాల ఔచిత్యం ఉంటుంది. సామాజిక, రాజకీయ, ఆర్థిక క్షేత్రాల్లో పునరుజ్జీవం నింపే శక్తియుక్తులుగా అవి పనిచేస్తాయి. అందుకే భారతీయుల అంతరాత్మ వంటి ఆ తేజోమయమూర్తి ప్రవచించిన ప్రతి సిద్ధాంతం కాలపరీక్షను తట్టుకుని సజీవంగా ఉంటూ క్రియాశీలంగా పనిచేస్తున్నాయి.
రైతు సౌభాగ్యం – గ్రామ స్వరాజ్యం
-చంపారన్ ఉద్యమంలో రైతులకు బాసటగా నిలిచారు గాంధీ. న్యాయమూర్తి ఎదుట హాజరై ఏది న్యాయమో.. ఏది అన్యాయమో.. వివరించగలిగారు. రైతులకు అనుకూలంగా తీర్పు తెప్పించగలిగారు. దేశంలో నేటికీ రైతు సమస్యలున్నాయి. రైతు మోసపోతున్నాడు, నష్టపోతున్నాడు చివరికి తన ప్రాణాలు తానే తీసుకుంటున్నాడు. ఈ రైతుని గెలిపించాలంటే మహత్ముడి చిత్తశుద్ధిలో ఇసుమంతైనా మనలో ఉండాలి కదా!
-గ్రామీణ భారతమంటే గాంధీజీకి ప్రాణం. గ్రామ స్వరాజ్యం కోసం తాను కలలుగన్నారు. కానీ ప్రపంచీకరణ, ప్రకృతి వైపరీత్యాలు కారణాలేవైనా నేటి గ్రామం కళతప్పింది. చదువుల కోసమో, ఉద్యోగాల కోసమో వలసవెళ్లేవాళ్లే ఎక్కువ. వ్యవసాయం సాగాలన్నా పల్లె మళ్లీ మెరవాలన్నా గాంధీ స్ఫూర్తిని మనం చాటగలగాలి.
ధరిత్రీ దేవోభవ
-ప్రపంచంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా పర్యావరణంపై ఆందోళన వ్యక్తమవుతుంది. మరి గాంధీజీ ఎప్పుడో చెప్పారు. మనుషులకు సంబంధించి మానవహక్కులపై ఏ విధంగా గళమెత్తారో.. పర్యావరణ ప్రస్తావన రాగానే సుస్థిరాభివృద్ధి గురించి కూడా మాట్లాడారు. మానవుని అవసరాలు తీరడానికి సరిపడా వనరులున్నాయి. కానీ ఏ ఒక్కరి అత్యాశనో తీర్చేన్ని వనరులు లేవని ఏనాడో చాటారు గాంధీ.
-శాంతికి-ప్రపంచ యుద్ధానికి మధ్య, మేధోశక్తికి-భౌతికవాదానికి మధ్య, ప్రజాస్వామ్యం-నియంతృత్వానికి మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ నవీన యుగంలో సాధారణ మానవులు ఇలాంటి పెద్ద యుద్ధాలని ఎదుర్కోవాలంటే గాంధేయవాదం కావాల్సిందే.
– దలైలామా
-మానవత్వం పురోగతి సాధించాలంటే గాంధీజీ సిద్ధాంతాలు తప్పనిసరి.
– మార్టిన్ లూథర్ కింగ్
-మల్లవరపు బాలలత
-సీఏఎస్బీ సివిల్స్ అకాడమీ, హైదరాబాద్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు