ఇష్టం + కష్టం = ప్రయత్నఫలం
ఎన్నో ఆశలు, మరెన్నో ఆకాంక్షలతో రాత్రింబవళ్లు కష్టపడి చదివిన విద్యార్థులు తెలంగాణ ఎంసెట్‌లో ర్యాంకులతో మెరిశారు. వారి తల్లిదండ్రుల కలల్ని నెరవేర్చాలనే సంకల్పంతో ఎంసెట్‌లో మంచి ప్రతిభ కనబరిచారు. సమాజానికి, దేశాభివృద్ధికి తమవంతు సహాయం అందిస్తామని చెబుతున్నారు. తల్లిదండ్రుల సహకారం, అధ్యాపకుల కృషితో ర్యాంకులు సాధించామంటున్నారు. కష్టానికి తగిన ఫలం దక్కడంతో పాటు ప్రణాళికాబద్ధంగా చదవడం వల్లే ర్యాంకులు సాధించామని చెబుతున్నారు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన అనంతరం పరిశోధన వైపు వెళ్లాలని కొందరు భావిస్తుండగా.. మరికొందరు వ్యాపారం, ఇంకొందరు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని పేర్కొంటున్నారు. మెడిసిన్ విద్యార్థులు ఎంబీబీఎస్ పూర్తి చేశాక న్యూరాలజీ స్పెషలైజేషన్ చేయాలని, కష్టతరమైన సర్జరీలను చేసి రోగుల జబ్బులను నయం చేయడంతో పాటు డాక్టర్లుగా పేదప్రజలకు సేవచేయాలని అనుకుంటున్నారు. తెలంగాణ ఎంసెట్‌లో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు నమస్తే తెలంగాణ నిపుణతో తమ మనోగతాలు పంచుకున్నారు. ఆ వివరాలు..
న్యూరాలజిస్ట్ అవుతాను
డాక్టర్స్ ఫ్యామిలీ కావటం.. చిన్నప్పటి నుంచి ఆస్పత్రికి వెళ్లడం.. పేషెంట్లు పడుతున్న ఇబ్బందులు, జబ్బునయం అయిన తరువాత వాళ్లు తన తల్లిదండ్రులతో మాట్లాడే విధానం తను డాక్టర్ కావడానికి ప్రేరణగా నిలిచాయంటున్న ఎంసెట్ మొదటి ర్యాంకర్ నేహ గురించి తన మాటల్లోనే..
మాది గుంటూరు జిల్లా తెనాలి. అమ్మ శ్రీవిద్య, నాన్న శివప్రసాద్ ఇద్దరు డాక్టర్లే. అమ్మ గైనకాలజిస్ట్ నాన్న పీడియాట్రీషియన్. అన్న రామ్ రిత్విక్ కూడా కర్నూల్లో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. నేను 10వ తరగతి వరకు తెనాలిలో చదివాను. ఇంటర్ విజయవాడ శ్రీచైతన్య కాలేజీలో చదివాను. ఉదయం 6.30 నుంచి రాత్రి 10.30 వరకు కాలేజీలోనే చదివేవాళ్లం. రెండు గంటలు బ్రేక్ మినహా మిగతా సమయం క్లాసులు, స్టడీ అవర్స్‌లో చదువుకోవడం ఉంటుంది. స్టడీఅవర్స్‌లో ఫ్యాకల్టీ పక్కనే ఉండి మా డౌట్స్ ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ చాలా సపోర్ట్ చేసేవారు.
ఎంసెట్‌లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ నీట్ ర్యాంకు కోసం ఎదురుచూస్తున్నాను. దానికి ఆలిండియా స్థాయిలో ర్యాంకులు ఉంటాయి కదా. నీట్లో కూడా మంచి ర్యాంకు వచ్చి ఢిల్లీ ఎయిమ్స్‌లో సీటు వస్తుందనుకుంటున్నాను.
చిన్నప్పటి నుంచి అప్పుడప్పుడు హాస్పటల్‌కి వెళ్లేదాన్ని అక్కడ అమ్మానాన్న చేసే సర్వీసు బాగా నచ్చేది. రోగులు వారికి వచ్చే జబ్బులను నయం చేసుకొని వెళ్లేటప్పడు వాళ్లు మాట్లాడే మాటలు చాలా ప్రభావం చూపించాయి. అందుకే నేను డాక్టర్ కావాలనుకున్నాను. ఎంబీబీఎస్ పూర్తి చేశాక న్యూరాలజీ స్పెషలైజేషన్ చేయాలనుకుంటున్నాను.
పేదలకు సేవలందిస్తాను
‘పుట్టింది రైతు కుంటుంబంలో లక్ష్యం మాత్రం డాక్టర్‌గా సేవచేయడం. మనిషి ప్రాణాలను కాపాడటం కన్నా గొప్ప పని ఏముంటుంది’ అంటున్న ఎంసెట్ 3వ ర్యాంకర్ తరుణ్ కుమార్ రెడ్డి గురించి ఆయన మాటల్లోనే..
నాన్న శివనాగిరెడ్డి, అమ్మ కోటేశ్వరి. నాన్న రైతు. మాది గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి. 10వ తరగతి వరకు గుంటూరులో చదివాను . ఇంటర్ విజయవాడ శ్రీ చైతన్య కాలేజీలో చదివాను. మా ఫ్యామిలీలో ఎవరూ ఇంతవరకు డాక్టర్ లేకపోవడం, సేవచేయాలనే కోరికతో 8వ తరగతి చదవుతున్నప్పుడే డాక్టర్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాను.
నీట్ రాశాను. ఢిల్లీ ఎయిమ్స్‌లో సీటు వస్తుందనుకుంటున్నాను. ఎంబీబీఎస్ తర్వాత రేర్ స్పెషలైజేషన్ అయిన అనస్థీషియా చేయాలనుకుంటున్నాను.
ఎంసెట్ ప్రిపరేషన్ మొత్తం కాలేజీలో ఫ్యాకల్టీ చెప్పినట్లు చదివాను. ఉదయం 6:30 నుంచి రాత్రి 10:30 వరకు ప్రిపరేషన్ ఉండేది. కాలేజీలో క్లాసులు, స్టడీ అవర్స్ ఉండేవి. స్టడీ అవర్స్ ఫ్యాకల్టీతో కమ్యూనికేషన్, కొంత స్వేచ్ఛ ఉండేది. స్టడీ అవర్స్‌లో ఫ్యాకల్టీ పక్కనే ఉండటం వల్ల డౌట్స్ వస్తే వెంటనే తీర్చుకునే అవకాశం ఉంటుంది.
మనకు తెలియని విషయాలను కేవలం స్నేహితులతో మాత్రమే చర్చించకూడదు. స్నేహితులతో ఎంతవరకు కమ్యూనికేట్ చేయాలో అంతవరకే చేయాలి. అన్ని విషయాలను స్నేహితులతో చర్చించకుండా టీచర్స్, పేరెంట్స్‌తో చర్చించడం వల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుంది. వాళ్లకు అనేక సమస్యలను పరిష్కరించే అనుభవం ఉంటుంది. కచ్చితంగా ఏకగ్రతతో చదవాలి.
ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చేస్తా
కుటుంబ నేపథ్యం ఏమిటి? విద్యాభ్యాసం?
– మాది ఆంధ్రప్రదేశ్‌లోని బూర్జ మండలం కుండం గ్రామం, శ్రీకాకుళం జిల్లా. నాన్న జయరామ్ సివిల్ ఇంజినీర్. అమ్మ జ్యోతి హౌజ్ వైఫ్. ప్రైమరీ ఎడ్యుకేషన్ హైదరాబాద్‌లో సాగింది. టెన్త్, ఇంటర్ విజయవాడ శ్రీచైతన్య కాలేజీలో చదివాను.
తెలంగాణ ఎంసెట్‌లో 2వ ర్యాంక్ రావడం ఎలా ఫీలవుతున్నారు?
-చాలా సంతోషంగా ఉంది. చదివిన దానికి ప్రతిఫలం వస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది. అమ్మానాన్నలు ఎంతో సంతోషిస్తున్నారు.
ప్రిపరేషన్?
ప్రతి రోజూ 12 గంటలు చదివాను. ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. కాలేజ్ నుంచి లెక్చరర్లు అన్ని విధాలా సహకరించారు. టెస్ట్‌లు పెట్టి పరీక్షలకు ప్రిపేర్ చేశారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, కాలేజీ లెక్చరర్ల సలహాలు, సూచనలు ఎంతగానో ఉపకరించాయి.
జేఈఈ మెయిన్స్‌లో ర్యాంక్? ఏమైనా మెరిట్ టెస్ట్ లు రాశారా?
-జేఈఈ మెయిన్స్‌లో 120వ ర్యాంక్ వచ్చింది. ఐఏసీటీ, ఐఎన్జేఎస్వో టెస్టులు రాశాను. వాటిలో సెలెక్ట్ అయ్యాను.
భవిష్యత్తు లక్ష్యం, విద్యార్థులకు సూచనలు, సలహాలు?
– ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్‌లో చేరడమే లక్ష్యం. ఐటీ స్టార్టప్ కంపెనీ ప్రారంభించాలన్నది నా కోరిక. కాన్ఫిడెన్స్, హార్డ్‌వర్క్‌తో ఏదైనా సాధించవచ్చు. సరైన ప్రణాళికతో చదివితే అనుకున్న విజయం సొంతమవుతుంది.
నూతన ఆవిష్కరణలు అంటే ఇష్టం
పల్లి జలజాక్షి, కాక్రాపల్లి, సంతబొమ్మాళి మండలం, శ్రీకాకుళం జిల్లా, 4వ ర్యాంక్
కుటుంబ నేపథ్యం ఏమిటి? విద్యాభ్యాసం?
– నాన్న గోవిందరావు ప్రభుత్వ టీచర్. అమ్మ జయలక్ష్మి హౌస్‌వైఫ్. ప్రాథమిక విద్యాభ్యాసం గుంతకల్‌లో సాగింది. 8వ తరగతి నుంచి ఇంటర్ వరకు శ్రీచైతన్య విజయవాడలో పూర్తిచేశాను.
ఎంసెట్ ప్రిపరేషన్ ఏ విధంగా సాగింది? రోజుకు ఎన్ని గంటలు చదివారు?
రోజూ 12 గంటలు ప్రిపేర్ అయ్యాను. ప్రత్యేకంగా ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. కాలేజీలో నిర్వహించే పరీక్షల్లో జరిగే తప్పులను గుర్తించి.. వాటిని పునరావృతం కాకుండా చూసుకోవడం వల్ల ర్యాంకు వచ్చింది. జేఈఈ మెయిన్స్‌లో 4వ ర్యాంకు, తెలంగాణ ఎంసెట్ 4వ ర్యాంకు రావడం చాలా ఆనందంగా ఉంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో కచ్చితంగా బెటర్ ర్యాంకు వస్తుందని నా నమ్మకం.
భవిష్యత్తు లక్ష్యాలు, విద్యార్థులకు సలహాలు, సూచనలు?
అడ్వాన్స్‌డ్‌లో మంచి ర్యాంక్ సాధించి ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్‌లో సీటు సంపాదించడమే లక్ష్యం. ఇంజినీరింగ్ విభాగంలో రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో సొంతంగా ఆవిష్కరణలు చేయాలనేది నా కల.
సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అవుతా
మా సొంతూరు శ్రీకాకుళం. నాన్న రవిశంకర్, అమ్మ స్వరాజ్య లక్ష్మి ఇద్దరూ ప్రభుత్వ టీచర్లు. నా ఎడ్యుకేషన్ శ్రీచైతన్య విజయవాడలో సాగింది.
ఎంసెట్ ప్రిపరేషన్?
-ఎంసెట్‌కు ప్రత్యేకంగా ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. జేఈఈ కోసం ప్రిపేరవుతూ ఎంసెట్ కూడా ప్రిపేరయ్యాను. రోజుకు 10 నుంచి 12 గంటలు చదివేవాడిని. తల్లిదండ్రులు చదువు విషయంలో పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో పాటు ఎంతో ప్రోత్సహించారు. కాలేజీ లెక్చరర్లు అన్ని విధాలా సహకరించారు. ప్రత్యేక టెస్ట్‌లు పెట్టి పరీక్షలకు ప్రిపేర్ చేశారు. ప్రాక్టీస్ టెస్టులు బాగా రాశాను.
మెరిట్ టెస్టులు?
జేఈఈ మెయిన్స్‌లో 7వ ర్యాంకు సాధించాను. ఐవోక్యూసీ, ఐవోక్యూపీ, ఐవోక్యూఎమ్, ఒలంపియాడ్ టెస్టులు రాశాను. వాటిలో సెలక్ట్ అయ్యాను.
భవిష్యత్తు లక్ష్యాలు, విద్యార్థులకు సలహాలు, సూచనలు?
-ప్రతిష్ఠాత్మక ఐఐటీ బాంబేలో సీటు సాధించడమే లక్ష్యం. కష్టపడేవారికి తప్పకుండా విజయం సొంతం అవుతుంది. ఎంత ఎక్కువ చదివామన్నది కాకుండా ఏం చదివామన్నది ముఖ్యం. లక్ష్యం ముందు కష్టం చిన్నదిగా కనిపించాలి.
ఐఐటీ బాంబేలో సీటే నా లక్ష్యం
గావినికాడి అరవింద్, ఈశ్వర్ కాలనీ, నాగర్‌కర్నూల్ 9వ ర్యాంక్
మీ కుటుంబ నేపథ్యం ఏమిటి? విద్యాభ్యాసం ఎక్కడ ఎలా సాగింది?
-మాది ఈశ్వర్ కాలనీ, నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రం. నాన్న గావినికాడి అంజయ్య ప్రభుత్వ టీచర్. అమ్మ వరలక్ష్మి హౌజ్ వైఫ్. 8వ తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యాభ్యాసం హైదరాబాద్‌లోనే సాగింది.
ఎంసెట్ ప్రిపరేషన్? కోచింగ్?
-ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. ఎంసెట్‌లో 9వ ర్యాంకు సాధించినందుకు చాలా సంతోషంగా ఉన్నది. రోజుకు 12 గంటలు చదివాను. కాలేజీ నోట్స్, మా లెక్చరర్స్ క్లాసెస్, టెస్ట్‌లు ఎంతగానో ఉపయోగపడ్డాయి. కాలేజీలో ఇచ్చిన షెడ్యూల్‌ను మిస్ అవ్వకుండా చూసుకునేవాడ్ని. ఏకాగ్రతతో రోజుకు 12 గంటల పాటు ప్రిపరేషన్ సాగించేవాడ్ని. తల్లిదండ్రుల ప్రోత్సాహం, టీచర్స్ పర్యవేక్షణ లేకపోతే ఈ ర్యాంకు వచ్చేది కాదు.
మెరిట్ టెస్టులు ఏమైనా రాశారా?
రాశాను. కేవీజేవైలో 600వ ర్యాంకు వచ్చింది.
భవిష్యత్తు లక్ష్యం, విద్యార్థులకు సూచనలు, సలహాలు?
ఐఐటీ బాంబేలో సీటు సాధించడమే లక్ష్యం. అందుకోసం జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ప్రిపేరవుతున్నాను. విద్యార్థులకు నేనిచ్చే సలహా… కష్టపడి, ఇష్టపడి ప్రణాళికతో చదివితే మనం అనుకున్న లక్ష్యాలు సాధించవచ్చు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు