ఇంజినీరింగ్ కాలేజీ ఎంపికకు ఇవి తప్పనిసరి!
ఎంసెట్-2022 ఫలితాలు విడుదలయ్యాయి. ఇటు విద్యార్థులు అటు తల్లిదండ్రులు తదుపరి ఘట్టానికి
సన్నద్ధమవుతున్నారు. విద్యార్థులు ఎటువంటి కళాశాలను ఎంపిక చేసుకోవాలి? ఏ కోర్సును ఎంచుకోవాలి? అని కొందరు అలోచిస్తుంటే.. అసలు కళాశాల ఎంపిక కోసం ఏ ప్రమాణాలను పరిగణనలోకి తీసుకోవాలి? అని మరికొందరు అడుగుతున్నారు. ఇటువంటి అనేక సందేహాల నివృత్తి కోసం ఓయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ. డాక్టర్ శ్రీరామ్ వెంకటేశ్ నిపుణకు ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు ఆయన మాటల్లో…
ఎటువంటి కళాశాలను ఎంపిక చేసుకోవాలి?
-పేరున్న కళాశాలను పరిగణనలోకి తీసుకునే ముందు, ఆ కళాశాల రెపుటేషన్ను, ముఖ్యంగా ఆ కళాశాలలో ప్లేస్‌మెంట్స్ ఏ విధంగా జరుగుతున్నాయి. ఎటువంటి ఫ్యాకల్టీతో బోధన సాగుతుంది? మౌలిక వసతులు ఏ విధంగా ఉన్నాయి? అనేవి తల్లిదండ్రులు తప్పక పరిశీలించిన తర్వాతే కళాశాలను ఎంపిక చేసుకోవాలి.
కోర్సు ప్రధానమా? కళాశాల ప్రధానమా?
ఇదే ప్రధానం అని నిర్దేశించి ఒకటి చెప్పలేం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఫ్యాకల్టీ, ప్లేస్‌మెంట్స్, మౌలిక వసతులు వంటివి, అలాగే NAAC, NBA గుర్తింపు పొందిన కళాశాలకు మొదటి ప్రాధ్యానం ఇవ్వాలి. ఐటీ రంగానికి నేడు చాలా ప్రాధాన్యం ఉన్నందున ఎక్కువ శాతం విద్యార్థులు కంప్యూటర్ కోర్సును ఎంపిక చేసుకుంటున్నారు. ఉదాహరణకు సీఎస్ఈ కోర్సులో చేరాలనుకుంటే పైన చెప్పిన అంశాలున్న కళాశాలలో సీఎస్ఈ కోర్సుకు తగిన అర్హత ఉన్న ర్యాంకు సాధిస్తే.. కోర్సుకే ప్రాధాన్యం ఇచ్చి చేరవచ్చు. ఒకవేళ అలా కాకుండా కోర్సు కోరుకున్నది రాకపోయినా రెండో ప్రాధాన్యతగా సివిల్/మెకానికల్ కోర్సును ఎంచుకుంటే వాటికి అర్హత ఉంటే చేరవచ్చు. పైన పేర్కొన్న అంశాల వల్ల ఆ విద్యార్థి భవిష్యత్‌కు ఎటువంటి ఇబ్బంది ఉండదు.
-నేడు చాలామంది విద్యార్థులు ముందుగానే నిశ్చయించుకుంటారు. ఫలానా కోర్సు మాత్రమే అని. పైన ఉదహరించినట్లు కంప్యూటర్ సైన్స్ కోర్సు కావాలనుకున్న విద్యార్థికి.. మంచి కళాశాలలో ఆ కోర్సులో సీటు సంపాదించే ర్యాంకు రానప్పుడు.. సెకండ్ ఆప్షన్‌గా ఉన్న మెకానికల్, సివిల్‌లో కూడా చేరవచ్చు. ఎందుకంటే నేడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనేది ఒక గ్రూప్‌కు మాత్రమే పరిమితం అనలేం. ప్రతి రంగంలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను వినియోగిస్తున్నారు. కాబట్టి అన్ని సదుపాయాలు ఉన్న కళాశాల ఉంటే కోర్సు అర్హతకు తగిన ర్యాంకు రాకపోయినా ఫర్వాలేదు.. ఈ విషయంలో కళాశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
– అలాకాకుండా కోరుకున్న కోర్సు మంచి కళాశాలలో రాలేదని పట్టుబట్టి ఆ కోర్సునే ప్రధానంగా చేసుకొని మరో కళాశాల ఎంపిక చేసుకునే క్రమంలో సదరు కళాశాల భవన నిర్మాణాలను, పైపై మెరుగులను చూసి ఆకర్షితులై చేరితే విద్యార్థి భవితకు ఎటువంటి ప్రయోజనం చేకూరదు.
ఫ్యాకల్టీ, మౌలిక వసతులు, ప్లేస్‌మెంట్స్
-విద్యార్థికి నచ్చిన, మెచ్చిన కోర్సు అందుబాటు ఫీజులో ఉందని, కళాశాల చూడటానికి బాగున్నదని చేరవద్దు. అది ప్రభుత్వ కళాశాల అయినప్పటికీ అందులో తగినన్ని సీట్లు ఉన్నాయని, సరైన ఫ్యాకల్టీ లేనప్పుడు అక్కడ చేరడం వ్యర్థం. ఫ్యాకల్టీలో నిపుణులు/నైపుణ్యం ఉన్నవారు ఉన్నారా లేదా అనేది కూడా పరిశీలించాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని కళాశాలలు కాంట్రాక్ట్ పద్ధతిన నియమించుకొని బోధన సాగిస్తున్నారు. ఈ విషయం తప్పక గమనించాలి, ఎందుకంటే నచ్చిన కోర్సులో చేరినా కూడా బోధన చేసేవారిలో నైపుణ్యం లేకపోతే విద్యార్థికి ఏం ప్రయోజనం ఉండదు. ఫ్యాకల్టీ విషయాన్ని ప్రధానంగా గమనించాలి. దీనికోసం మీరు ఎంచుకునే కాలేజీ వెబ్సైట్లో ఆయా డిపార్ట్మెంట్స్లో ఫ్యాకల్టీ వివరాలు ఉంటాయి. వాటిని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి. ఎంతమంది ఫ్యాకల్టీలకు పీహెచ్డీ ఉంది. వారు ఏటా ఎటువంటి రిసెర్చ్ పేపర్స్ సబ్మిట్ చేస్తున్నారు అనే విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి.
-మౌలిక వసతులు అనగానే చాలామంది తరగతి గదిలో బెంచీలు, బోర్డు, కుర్చీలు అనుకొని అంతటితో వదిలేస్తారు. కానీ మౌలిక వసతుల్లో ప్రధానంగా గమనించాల్సినవి ల్యాబ్స్. బోధన/థియరీ నాలెడ్జ్ ఎంత అవసరమో ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా అంతే ముఖ్యం. అటువంటి ప్రాక్టికల్ నాలెడ్జ్‌ని కళాశాలలో అందించేవి ల్యాబ్స్, వర్క్‌షాప్స్ మొదలైనవి మౌలిక వసతుల్లోకి వస్తాయి. సాధారణంగా ప్రతి కళాశాలలోనూ వీటిని పేర్కొంటారు. పేర్కొన్న ప్రతి కళాశాల వాటిని తప్పక వినియోగిస్తాయని చెప్పలేం. కాబట్టి వాటి గురించి పరిశీలించి అప్పుడు మాత్రమే ఒక నిశ్చిత అభిప్రాయానికి రావాలి.
– పైన పేర్కొన్న రెండు అంశాలతో పాటు మరో ముఖ్యమైన అంశం ప్లేస్‌మెంట్స్. పై రెండింటితో పొందిన జ్ఞానం విద్యార్థికి మంచి భవిష్యత్తును అందించకపోతే ఉపయోగం ఉండదు. ఆయా కాలేజీల్లో ప్లేస్‌మెంట్స్ ఏ విధంగా జరుగుతున్నాయి? ఎంతమేరకు జరుగుతున్నాయి? విద్యార్థుల్లో ఎంత శాతం వారికి ప్లేస్‌మెంట్స్ కల్పిస్తున్నారు? అనేది కూడా గమనించాలి. ఏయే కంపెనీలు రిక్రూట్మెంట్కు వస్తున్నాయి? రిక్రూట్ అయిన విద్యార్థుల సగటు వార్షిక వేతనం ఎంత ఉంది? వంటి విషయాలను నిశితంగా పరిశీలించాలి.
-ఫ్యాకల్టీ, మౌలికవసతులు, ప్లేస్‌మెంట్స్ ఈ మూడింటినీ తల్లిదండ్రులు ప్రధానంగా పరిగణనలోకి తీసుకొని కళాశాల ఎంపిక చేసుకోవడం ఉత్తమం.
అటానమస్ కళాశాల? ప్రైవేట్ కళాశాల?
-సాధారణంగా విద్యార్థి తనకు వచ్చిన ర్యాంకును అనుసరించి యూనివర్సిటీ ర్యాంక్ సాధిస్తే తప్పక మొదటి ప్రాధాన్యం యూనివర్సిటీలకే ఇవ్వాలి. తరువాత రెండో ఆప్షన్‌గా అటానమస్ కళాశాలలను ఎంపిక చేసుకోవడం మంచిది. అటానమస్ కళాశాలలు కూడా చాలా అద్భుతంగా బోధనను అందిస్తున్నాయి. బోధన మాత్రమే కాదు, ఉన్నత స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కలిగి ఉన్నాయి. NAAC, NBA వంటి ఎక్రిడిటేషన్ సంస్థలచే గుర్తింపు పొందడం అంటే తేలిక కాదు. న్యాక్, ఎన్బీఏ వంటి అనేక సంస్థల గుర్తింపు లభిస్తేనే అటానమస్ హోదాను ఇస్తారు. కోర్సు, రెప్యూటేషన్ వంటివి పరిగణలోకి తీసుకొని ఎంపిక చేసుకోవాలి.
-కొత్తగా ప్రారంభించిన ఎన్ఐటీ కళాశాలలను పరిగణనలోకి తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది. కారణం ఇప్పుడిప్పుడే స్థాపితమైనవి కనుక వాటిలోని ఫ్యాకల్టీ మిగిలిన కళాశాలలతో పోల్చితే అంత మంచి బోధన అందించలేకపోవచ్చు. బోధన మాత్రమే కాదు ల్యాబ్స్, వర్క్‌షాప్స్ వంటి విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. నాలుగు/ ఐదు బ్యాచ్‌లు గడిచిన తరువాత వీటిని పరిగణనలోకి తీసుకోవటం మంచిది.
-ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో ఏవైనా సరే ఫీజు తక్కువని, కళాశాల భవన నిర్మాణాన్ని చూసి ఆకర్షితులు కాకుండా పైన పేర్కొన్న అన్ని అంశాలను పరిశీలించి కాలేజీ ఎంపిక చేసుకోవాలి.
-సందేహాలు ఉంటే నిపుణులు, ఇంజినీరింగ్ కాలేజీ ఫ్యాకల్టీలు, వెబ్సైట్ల ద్వారా విషయాన్ని సేకరించుకుని నిర్ణయం తీసుకోవాలి.
– ఏవీ సాయి ఈశ్వర్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు