తెలంగాణ బిల్లుపై జరిగిన సంఘటనలు (తెలంగాణ హిస్టరీ)
– 2014, జనవరి 3న రెండో విడత శీతాకాల సమావేశాలు మొదలయ్యాయి. అంతకుముందు 2013, డిసెంబర్ 31న శాసన సభ వ్యవహారాల శాఖను శ్రీధర్‌బాబు నుంచి శైలజానాథ్‌కు బదలాయించడంతో శ్రీధర్‌బాబు ఆయన దగ్గర ఉన్న పౌర సరఫరాల శాఖ మంత్రి పదవికి 2014, జనవరి 2న రాజీనామా చేశారు.
-2014, జనవరి 8న బిల్లుపై మొట్టమొదటి చర్చను మంత్రి వట్టి వసంతకుమార్ ప్రసంగంతో ప్రారంభించారు. జనవరి 10న బిల్లుపై టీఆర్ఎస్ఎల్పీ నేత ఈటల రాజేందర్ తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాలను వివరిస్తూ, అనుకూలమైన వాదనలు చేస్తూ ప్రసగించారు. జనవరి 25న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రసంగంలో పూర్తిగా తెలంగాణ బిల్లును వ్యతిరేకించాడు. అదేరోజు ప్రసంగించిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నిజమైన బిల్లును పంపాలని, తప్పుల తడకల బిల్లు కాదని పరోక్షంగా తెలంగాణను పూర్తిగా వ్యతిరేకించారు.
-తర్వాత రాష్ట్రపతి ఇచ్చిన 42 రోజుల గడువు ముగిసిపోవడంతో మరో మూడు వారాలు గడువు కావాలని అసెంబ్లీలో కోరగా చీఫ్ సెక్రటరీ రాష్ట్రపతికి లేఖ పంపాడు. అదేరోజు రాష్ట్రపతి మరో వారం రోజుల పాటు గడువు పెంచుతూ లేఖ పంపారు. ఆ మర్నాడు జనవరి 25న రూల్ 77 కింద బిల్లు తిరిగి పంపాలని స్పీకర్‌కు తీర్మానం నోటీస్ ముఖ్యమంత్రి ఇచ్చారు. వైఎస్సార్సీపీ మాత్రం బిల్లుపై ఓటింగ్‌కు పట్టుపట్టింది. దీనిపై తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. జనవరి 30న అసెంబ్లీలో బిల్లును తిరస్కరించినట్టుగా కేంద్రానికి పంపారు. ఈ బిల్లుపై 294 మందిలో 87 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడగా మిగిలిన వారు రాతపూర్వకంగా తమ అభిప్రాయాలు ఇచ్చారు.
-ఫిబ్రవరి 4 నుంచి 6 వరకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీవోఎం చర్చలు జరిపి ఏపీ అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును ఆమోదించింది. ఫిబ్రవరి 7న జీవోఎం ఆమోదించిన తెలంగాణ బిల్లును కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. ఫిబ్రవరి 9న బిల్లు రాష్ట్రపతి వద్దకు చేరింది. ఫిబ్రవరి 11న కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని లోక్‌సభలో ప్రవేశపెట్టిన సీమాంధ్రకు చెందిన ఆరుగురు కాంగ్రెస్ ఎంపీలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
– ఫిబ్రవరి 13న కేంద్ర హోం శాఖ మంత్రి సుశీల్‌కుమార్ షిండే లోక్‌సభలో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టారు. అదేరోజు బిల్లు ప్రవేశపెడుతున్న సమయంలో విజయవాడ ఎంపీ లగడపాటి రాజ్‌గోపాల్ సభలో పెప్పర్ స్ప్రే చేయడంతో తీవ్ర గందరగోళం మధ్య వాయిదా పడింది. ఈ గందరగోళానికి కారకులైన 14 మంది సీమాంధ్ర ఎంపీలను 5 రోజులపాటు సస్పెండ్ చేశారు. తెలంగాణ నుంచి ఇద్దరు ఎంపీలను గుత్తా సుఖేందర్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలను సస్పెండ్ చేశారు. అదేరోజున జాతీయ మీడియా లగడపాటి రాజగోపాల్ చర్యలను తీవ్రంగా దుయ్యబట్టింది. ఆయనను దేశద్రోహిగా అభివర్ణిస్తూ శాశ్వతంగా పార్లమెంట్‌కు రాకుండా నిషేధం విధించాలని టైమ్స్ నౌ ఎడిటర్ అర్నబ్ గోస్వామి అన్నారు.
-ఫిబ్రవరి 18న తెలంగాణ బిల్లుపై చర్చ తర్వాత మూజువాణి ఓటుతో లోక్‌సభలో బిల్లును ఆమోదించారు. ఫిబ్రవరి 19న రాజ్యసభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 20న రాజ్యసభలో చర్చ అనంతరం తెలంగాణ బిల్లు ఆమోదం పొందిందని అప్పటి డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ ప్రకటించడంతో తెలంగాణ రాష్ట్రం దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడేందుకు మార్గం సుగమం అయ్యింది.
l తెలంగాణ రాష్ట్రంతోనే ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తానని ప్రకటించిన కేసీఆర్ ఫిబ్రవరి 26న బేగంపేటకు చేరుకొని ఎయిర్పోర్ట్ నుంచి గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వరకు భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించి అమరవీరులకు నివాళుర్పించారు. మార్చి 1న తెలంగాణ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేస్తూ ఆమోదముద్ర వేశారు. అదేరోజు ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. మార్చి 2న కేంద్రం తెలంగాణ ఏర్పాటు కోసం ఆవిర్భావ తేదీ లేకుండా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. కేంద్రం మార్చి 4న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 అని ప్రకటించింది. ఈ విధంగా జూన్ 2న దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది.
తెలంగాణ ప్రముఖులు
బూర్గుల రామకృష్ణారావు (1899-1967)
ఈయన 1899, మార్చి 13న కల్వకుర్తి గ్రామంలో జన్మించారు. ఈయన ఇంటిపేరు పుల్లమరాజు. కానీ ఈయన గ్రామం బూర్గుల ఊరిపేరే ఇంటిపేరుగా మారింది. 1948లో హైదరాబాద్ భారత్‌లో విలీనం తరువాత ఏర్పడిన వెల్లోడి ప్రభుత్వంలో రెవెన్యూ, విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. 1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల్లో షాద్‌నగర్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 1952-56 వరకు హైదరాబాద్ రాష్ట్ర మొదటి, చివరి సీఎంగా పనిచేశారు. 1956-60 వరకు కేరళ రాష్ట్ర గవర్నర్‌గా, 1960-62 వరకు ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా పనిచేశారు. 1962-66 వరకు రాజ్యసభ సభ్యులుగా కొనసాగారు.
-1967, సెప్టెంబర్ 14న మరణించారు. ఆంధ్ర రాష్ట్ర తొలి సీఎం టంగుటూరి ప్రకాశం పంతులు 1957లో చనిపోయినప్పుడు ఆయనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు చేసింది. కానీ 1967లో హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయిన బూర్గుల రామకృష్ణారావు మరణించినప్పుడు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయలేదు. ఇతని శతజయంతి ఉత్సవాల సందర్భంగా 1999లో పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేశారు. అప్పటి ప్రధాని వాజ్‌పేయి హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో బూర్గుల బయోగ్రఫీని విడుదల చేశారు. అంజయ్య సీఎంగా ఉన్నప్పుడు బూర్గుల పేరుమీద హైదరాబాద్‌లోని ఎస్సార్ నగర్లో బూర్గుల రామకృష్ణారావు ఆయుర్వేద కళాశాల ఏర్పాటు చేశారు.
రచనలు
-బూర్గుల రామకృష్ణారావు బభాషా కోవిదులు. ఈయన రచనలు..
1) కృష్ణ శతకం- దీనిలో మనుషుల్లో గల చిత్త చాంచల్యాన్ని వెల్లడించారు.
2) సారస్వత వ్యాస ముక్తావళి- ఇది ఒక వ్యాస సంకలనం. దీనిలో నండూరి ‘ఎంకి’ పాటల ప్రాశస్త్యం, రెడ్డి రాజుల కాలం నాటి మత, సాంఘిక పరిస్థితులు, అప్పకవి తెలంగాణ వాడని మొదలైన అంశాలు వివరించారు.
3) దాశరథి గాలిబ్ గీతాలు, ఆత్మానందస్వామి మేఘ సందేశం, వానమామలై పోతన చరిత్రకు పీఠికను రాశారు.
అనువాదాలు
– అంతేకాకుండా ‘ది డ్రీమ్స్ ఆఫ్ పోయెట్’ అనే ఇంగ్లిష్ రచన కూడా చేశారు.
– జగన్నాథ పండిత రాయలు లహరీ సంచికను పండితుడు పంచామృతం పేరుతో, శంకరాచార్యుల సౌందర్యలహరిని కనకధారస్తవ పేరుతో, పారశీ విజ్ఞయ చరిత్రను, ఉమర్ ఖయ్యూంను తెలుగులోకి అనువదించారు.
మందుముల నర్సింగరావు
-ఈయన ఆంధ్ర జన సంఘం స్థాపకుల్లో ఒకరు. రయ్యత్ (ఉర్దూ) పత్రిక స్థాపకుడు. 1938-42 కాలంలో నిజాం లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా పనిచేశారు. 1952లో కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున హైదరాబాద్ శాసనసభకు ఎన్నికయ్యారు. 1957-62 కాలంలో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ‘50 ఏండ్ల హైదరాబాద్’ ఈయన స్వీయ జీవిత చరిత్ర.
కొండా వెంకటరంగారెడ్డి (1890-1970)
-ఈయన 1890, డిసెంబర్ 12న పెద్ద మంగళారం (హైదరాబాద్)లో జన్మించారు. 1969 ఉద్యమంలో పాల్గొని హైదరాబాద్‌లోని సిద్దియంబర్ బజార్లో చరిత్రాత్మక ఉపన్యాసం ఇచ్చారు. ఈ ఉపన్యాసం ముగింపులో ‘గులాం కీ జిందగీ సే మౌత్ అచ్చీ హై (బానిస బతుకుల కంటే మరణం మంచిది)’ అనే పదాలతో ముగించారు. 1959లో నీలం సంజీవరెడ్డి మంత్రి వర్గంలో రెవెన్యూ మంత్రిగా, దామోదరం సంజీవయ్య మంత్రివర్గంలో ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. ఏవీ కాలేజీ అనే విద్యాసంస్థను స్థాపించారు. ఈయన పేరుమీదే కేవీ రంగారెడ్డి ఉమెన్స్ డిగ్రీ కాలేజీ (హైదరాబాద్)ని ఏర్పాటు చేశారు. ఈయన కేవీ రంగారెడ్డి మహిళా వసతిగృహాన్ని కూడా స్థాపించారు. ఈయన మరణానంతరం ఇతని పేరుమీదుగానే మరి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రంగారెడ్డి జిల్లా ఏర్పడింది. ఈయన జీవిత చరిత్ర ‘మై ఆటోగ్రఫీ బై కేవీ రంగారెడ్డి’.
కొండా లక్ష్మణ్ బాపూజీ (1915-2012)
1915, సెప్టెంబర్ 27న వాంకిడి (ఆదిలాబాద్)లో జన్మించారు. 1952లో ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1957-60 వరకు డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. 1969లో తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన మొదటి వ్యక్తిగా చరిత్రలో నిలిచారు. మండల్ కమిషన్ సిఫారసులను రాజీవ్‌గాంధీ వ్యతిరేకించినందుకు బాపూజీ కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వాన్ని వదులుకున్నారు.
వందేమాతరం రామచంద్రరావు
– రాంచందర్ దెహల్వా అనే ఆర్యసమాజీయుని ప్రభావంతో ఆర్యసమాజంలో క్రియాశీలంగా పాల్గొన్నారు. ఇతనికి పండరీపురం సభలో వీరసావర్కర్ వందేమాతరం అనే బిరుదు ఇచ్చారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు భాగల్పూర్ (బీహార్) జైలులో శిక్ష అనుభవించారు. సిడ్నీకాటన్ (ఆస్ట్రేలియా)తో నిజాంకు గల అక్రమ ఆయుధాల సరఫరా ఒప్పంద సమాచారాన్ని సేకరించి భారత ఏజెంట్ జనరల్ కేఎం మున్షీకి అందించారు. ఈయన ఇచ్చిన సమాచారం ఆధారంగానే హైదరాబాద్‌కు మారణాయుధాల స్మగ్లింగ్‌ను ఆపగలిగారు. కేఎం మున్షీ భారత ఏజెంట్ జనరల్‌గా నా పని విజయవంతం కావడంలో వందేమాతరం రామచంద్రరావు కృషి ఎంతో అమూల్యమైనదని పేర్కొన్నారు. ఆ విధంగా నిజాం వ్యతిరేక ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించారు.
మాదిరి ప్రశ్నలు
1. ఫిబ్రవరి 13న తెలంగాణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర హోంశాఖ మంత్రి?
1) పీ చిదంబరం 2) సుశీల్‌కుమార్ షిండే
3) ఏకే ఆంటోని 4) గులాం నబీ ఆజాద్
2. తెలంగాణ బిల్లును లోక్‌సభ ఆమోదించినది?
1) 2014, ఫిబ్రవరి 18
2) 2014, ఫిబ్రవరి 20
3) 2014, మార్చి 8
4) 2014, మార్చి 20
3. లోక్‌సభలో బిల్లును ప్రవేశపెడుతున్న సమయంలో సభలో పెప్పర్ స్ప్రే చల్లి గందరగోళం సృష్టించిన ఆంధ్ర నాయకుడు?
1) అంబటి రాంబాబు 2) శైలజానాథ్
3) లగడపాటి రాజగోపాల్ 4) హర్షవర్ధన్
4. కింది వాటిలో సరైనవి?
1) 2014, మార్చి 1న తెలంగాణ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేస్తూ ఆమోదముద్ర వేశారు
2) 2014, మార్చి 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించారు
3) 1 4) 1, 2
5. వెల్లోడి ప్రభుత్వంలో బూర్గుల రామకృష్ణారావు నిర్వహించిన మంత్రిత్వ శాఖ?
1) విద్య 2) రెవెన్యూ
3) హోం 4) 1, 2
6. ‘50 సంవత్సరాల హైదరాబాద్’ ఎవరి స్వీయ జీవిత చరిత్ర?
1) మందుముల నరసింగరావు
2) కొండా వెంకటరంగారెడ్డి
3) మాడపాటి హనుమంతరావు
4) బూర్గుల రామకృష్ణారావు
7. 1969 తెలంగాణ ఉద్యమంలో ‘బానిస బతుకుల కంటే మరణం మంచిది’ అని పిలుపునిచ్చింది?
1) మందుముల నరసింగరావు
2) కొండా వెంకటరంగారెడ్డి
3) కొండా లక్ష్మణ్ బాపూజీ
4) మరి చెన్నారెడ్డి
8. ‘మండల్ కమిషన్’ సిఫారసులను రాజీవ్‌గాంధీ వ్యతిరేకించినందుకు కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసింది?
1) కొండా లక్ష్మణ్ బాపూజీ
2) మాడపాటి హనుమంతరావు
3) వందేమాతరం రామచంద్రరావు
4) ఎవరూకాదు
9. కింది వాటిలో బూర్గుల రామకృష్ణారావు రచనలు?
1) కృష్ణ శతకం
2) సారస్వత వ్యాసముక్తావళి
3) ది డ్రీమ్స్ ఆఫ్ పోయెట్
4) పైవన్నీ
10. వందేమాతరం రామచంద్రరావుకు వందేమాతరం అనే బిరుదు ఇచ్చింది?
1) వినాయక దామోదర సావర్కర్
2) స్వామి రామానంద తీర్థ
3) వల్లభాయ్ పటేల్
4) జవహర్లాల్ నెహ్రూ
11. ‘వీరి సహకారంతో హైదరాబాద్ రాజ్యంలో భారత ఏజెంట్ జనరల్‌గా నా పని విజయవంతమయ్యింది’ అని కేఎం మున్షీ ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు?
1) రావు బహదూర్ వెంకట్రామిరెడ్డి
2) వందేమాతరం రామచంద్రరావు
3) మాడపాటి హనుమంతరావు
4) షోయబుల్లా ఖాన్
12. తెలంగాణ ఆవిర్భావ దినంగా 2014, జూన్ 2ను కేంద్రం ఎప్పుడు ప్రకటించింది?
1) 2014, మార్చి 2
2) 2014, మార్చి 3
3) 2014, మార్చి 4
4) 2014, మార్చి 6
సమాధానాలు
1-2, 2-1, 3-3, 4-4, 5-4, 6-1, 7-2, 8-1, 9-4, 10-1, 11-2, 12-3
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ,
కోరుట్ల
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు