కాకతీయులు-రాజకీయ చరిత్ర
కాకతీయుల రాజకీయ చరిత్ర కాకర్త్య గుండనతో ప్రారంభమవుతున్నట్లు శాసన, సాహిత్య ఆధారాలను బట్టి తెలుస్తున్నది. కాకతీయ రాజ్యస్థాపకుడు మొదటి బేతరాజు కాగా స్వతంత్ర రాజ్య స్థాపకుడు రెండో ప్రోలరాజు . కాకతీయ రాజుల్లో గొప్పవాడు గణపతిదేవుడు. చివరివాడు రెండో ప్రతాపరుద్రుడు. ఢిల్లీ సుల్తాన్ ఘియా జొద్దిన్ తుగ్లక్ కాలంలో కాకతీయ సామ్రాజ్యం ఢిల్లీ సుల్తానేట్లో కలిసిపోయింది.
కాకర్త్య గుండన
-ఇతడు కాకతీయుల వంశస్థాపకుడు. ఇతనిది కొరివి మండలం.
మొదటి బేతరాజు
-మొదటి బేతరాజు కాకతీయ రాజ్యస్థాపకుడు. ఇతడు, వేంగి చాళుక్య రాజైన రెండో అమ్మరాజు మరణానంతరం వేంగి రాజ్యంలోని కొరివి రాష్ర్టాన్ని ఆక్రమించి, సుమారు క్రీ.శ.1000 నుంచి క్రీ.శ.1030 వరకు పాలించినాడు. ఇతనికి కాకతి పురాధినాథ అనే బిరుదు కలదు. మొదటి బేతరాజు శత్రు సమూహాన్ని ఓడించి కాకతీయ రాజ్యాన్ని స్థాపించడానికి తోడ్పడ్డాడు.
మొదటి ప్రోలరాజు ( క్రీ.శ.1030 నుంచి 1075)
-బిరుదు : కాకతీ వల్లభుడు మొదటి బేతరాజు మరణానంతరం, అతని కుమారుడు మొదటి ప్రోలరాజు రాజ్యాధికారానికి వచ్చాడు. ఇతడు గొప్పవీరుడు, చోళరాజులను ఓడించి, పశ్చిమ చాళుక్య చక్రవర్తి మొదటి సోమేశ్వరుని నుంచి అనుమకొండను (హన్మకొండ) పొందినాడు. ఇతడు జగత్ కేసరి అనే పెద్ద చెరువును తవ్వించి వ్యవసాయాన్ని అభివృద్ధి చేశాడు. ఈ వివరాలు పిల్లలమర్రి శాసనంలో ఉన్నాయి
రెండో బేతరాజు (క్రీ.శ. 1075 నుంచి 1110)
-బిరుదులు : త్రిభువన మల్ల పరమ మహేశ్వరుడు. ఇతడు పశ్చిమ చాళుక్య చక్రవర్తి ఆరో విక్రమాదిత్యుని సామంతుడుగా కాకతీయ రాజ్యపాలన చేసినాడు. ఇతడు చోళ రాజైన మొదటి కులోత్తంగుని, మాళ్వరాజైన ఉదయాదిత్యుని జయించి మత్తగజాలకు సింహం వంటి వాడని పొగడబడిన గొప్పవీరుడు. రాజ్యపాలనలో ఇతనికి వైద్య దండనాథుడు కుడిభుజంగా ఉన్నాడు. ఇతడు గొప్ప శివభక్తుడు. రెండో బేతరాజు కాలంలోనే హనుమకొండ కాకతీయుల రాజధాని నగరమైనది. ఇతడు శివపురంలో గొప్ప చెరువును, హనుమకొండలో గొప్ప ఉద్యానవనాన్ని నిర్మించినాడు, ఇతనికి గల బిరుదులు విక్రమ చక్రి, మహామండలేశ్వర, చలమర్తగండ.
రెండో ప్రోలరాజు (క్రీ.శ. 1110 – 1158)
-రెండో బేతరాజు మరణానంతరం అతని కొడుకు దుర్గస్రపతి సింహాసనం అధిష్టించిన కొద్ది కాలంలోనే మరణించాడు. దీంతో అతని తమ్ముడు రెండో ప్రోలరాజు సింహాసనమెక్కాడు. కాకతీయల చరిత్రలో ఇతని కాలం చాలా ముఖ్యమైనది. ఇతని కాలంలోనే సామంతరాజ్యంగా ఉన్న కాకతీయరాజ్యం స్వతంత్ర సామ్రాజ్యమైంది. ఇతడు అనేక యుద్ధాలు చేసి సామ్రాజ్యాన్ని విస్తరింపజేసిన గొప్పవీరుడు. ఇతడు చేసిన యుద్ధాలు, గడించిన రాజ్యాలు, స్వీకరించిన బిరుదులు అతని కుమారుడు రుద్రదేవుడు వేయించిన హనుమకొండ శాసనంలోను, గణపాంబ గణపవరం శాసనంలోను వివరంగా తెలుపబడినది. ఇతడు మహామండలేశ్వర బిరుదాంకితుడు. ద్రాక్షారామ శాసనం ఇతడు వెలనాటి బోధరాజుతో జరిగిన యుద్ధంలో మరణించినట్లు తెలుపుతుంది.
రుద్రదేవ మహారాజు (క్రీ.శ.1158 -1195)
-బిరుదు : విద్యాభూషణుడు, రెండో ప్రోలరాజు మరణానంతరం అతని జేష్టపుత్రుడు రుద్రదేవుడు సింహాసనం ఆక్రమించాడు, ఇతడు మహావీరుడు, ప్రతిభాశాలి. ఇతడు అనేక రాజ్యలను జయించి కాకతీయ రాజ్యాన్ని తూర్పున బంగాళాఖాతం వరకు, పశ్చిమాన కళ్యాణి వరకు, ఉత్తరాన మాళ్వా వరకు వ్యాపింపజేశాడు. రుద్రదేవునికి సంబంధించిన అనేక విషయాలు గణపతి దేవుని ఉపరపల్లి శాసనం, రుద్రమదేవి మాల్కాపురం శాసనం, రుద్రదేవుని హనుమకొండ శాసనాలు వివరంగా తెలుపుచున్నాయి.
ఇతడు వెలనాటి నాయకులపై ప్రతీకారచర్యగా వెలనాటి రాజ్యాన్ని ముట్టడించి బోధదేవుని సంహరించాడు. రుద్రదేవుడు హనుమకొండలో ప్రసిద్ధిగాంచిన వేయిస్తంభాల గుడిని, రుద్రేశ్వరాలయం నిర్మించాడు. ఇతడు ఓరుగల్లును రెండో రాజధానిగా చేశాడు. ప్రముఖ శైవాచార్యుడు, కవియైన పాల్కురికి సోమన రుద్రదేవుని ఆస్థానంలో ఉన్నాడు. మల్లికార్జున పండితారాధ్యుడు శైవ మతాచార్యుడు. రుద్రదేవుడు దేవగిరి రాజైన జైత్రపాలునితో (జైతుగి) జరిగిన యుద్ధంలో వీరస్వర్గం అలంకరించాడు. రుద్రదేవుడు గొప్ప శివభక్తుడు, ఇతడు గొప్పకవి, కవి పోషకుడు. ఇతడు తెలుగులో నీతిసారం అనే గ్రంథాన్ని రచించాడు. ప్రముఖ శైవాచార్యుడు కవియైన పాల్కురికి సోమన రుద్రదేవుని ఆస్థానంలో ఉన్నాడు. మూల్య కటియసేనాని రుద్రదేవుని మహాసేనాని, ప్రధాని. ఇతడు కోట నాయకులను జయించి కోటగెల్పట్టు అను బిరుదును రుద్రదేవుని నుంచి స్వీకరించినాడు.
-రుద్రదేవుని తరువాత అతని తమ్ముడు మహాదేవరాజు మూడేండ్లు (క్రీ.శ. 1196-1198) పాలించాడు. ఇతడు కూడా జైత్రపాలుని (జైతుగి)తో జరిగిన యుద్ధంలో మరణించాడు. ఇతడు పరమ శివభక్తుడు. ప్రసిద్ధ శైవాచార్యుడైన దూర్వేశ్వరస్వామి ఇతని మతగురువు.
గణపతి దేవుడు – (క్రీ.శ.1199- 1259)
-గణపతిదేవుడు మహాదేవుని కుమారుడు. ఇతడు తన తండ్రి మహాదేవుని దేవగిరియాదవ రాజైన జైత్రపాలుని పైకి యుద్ధానికి వెళ్లినప్పుడు తన తండ్రి యుద్ధంలో మరణించగా అతడు జైత్రపాలునిచే బంధింపడ్డాడు. పిదప గణపతి దేవుని ప్రజ్ఞా విశేషాలను చూసి జైత్రపాలుడు ఇతన్ని విడుదల చేయగా వెళ్లి కాకతీయ సింహాసనాన్ని ఆక్రమించినాడు. కాకతీయ సామ్రాజ్య రాజులందరిలో గణపతిదేవుడు గొప్పవాడు, మహాశూరుడు, విజేత, పరిపాలనాధక్షుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి. క్షీణదశలో ఉన్న కాకతీయ రాజ్యాన్ని ఉద్ధరించి, విస్తరింపజేసి దానిని గొప్ప సామ్రాజ్యంగా మార్చాడు.
-ఇతడు కాకతీయ సామ్రాజ్యాన్ని 60 సంవత్సరాలు పరిపాలించినాడు. గణపతిదేవుడు జైత్రపాలుని ఖైదిగా ఉండగా కాకతీయ రాజ్యంలో తిరుగుబాటు చేసిన సామంతులను సేనాని రేచర్ల రుద్రుడు అణచివేసి గణపతి దేవుడు తిరిగిరాగానే రాజ్యాన్ని అప్పగించినాడు. గణపతిదేవుడు రాజకీయ అనిశ్చిత పరిస్థితులను తనకు అనుకూలంగా వినియోగించుకొని కాకతీయ రాజ్యాన్ని విస్తరింపజేసినాడు. మొదట వెలనాడును జయించి బెజవాడను ఆక్రమించుకొన్నడు. అచ్చట నుంచి దివిసీమను సేనాని మలయబౌండ సాయంతో ఆక్రమించాడు. గణపతిదేవుడు నెల్లూరును ఏలిన తెలుగు చోళరాజగు తిక్కసిద్ధిని నెల్లూరు, కాంచీపుర సింహాసనాలపై ప్రతిష్టించినాడు. తిక్కసిద్ధి మరణం తరువాత తిరిగి నెల్లూరును దాయాదుల పోరు వలన తిక్కసిద్ధి కొడుకైన మనుమసిద్ధి కూడా తొడ్పడి అతని శత్రువులను ఓడించి అతన్ని నెల్లూరు కాంచీపుర సింహాసనం ఎక్కించాడు.
-దీనికి మనుమసిద్ధి ఆస్థాన కవియైన తిక్కన సోమయాజి ఓరుగల్లుకు వెళ్లి తన ప్రభువుకు సహాయం చేయమనగా… దీనికి ఒప్పుకున్న గణపతి దేవుడు తిక్కనకు సత్కరించాడు. దీంతో తిక్కనకు మనమసిద్ధి రాజ్యస్థాపనాచార్య అను బిరుదును ఇచ్చాడు. ఈ విధంగా గణపతిదేవుని సామ్రాజ్యం కంచి వరకు విస్తరించింది. తరువాత ఇతడు కళింగను తూర్పుగాంగులను కూడా జయించి రాజ్యవిస్తరణగావించాడు. గణపతి దేవుని యుద్ధాలు, విజయ పరంపరలు ఇరగవరం స్తంభ శాసనంలో పొందుపరచబడినది.
– గణపతిదేవుడు యుద్ధ వీరుడేగాక గొప్ప పరిపాలనాదక్షడు, దేశంలో వ్యవసాయం పరిశ్రమలను, విదేశీ వాణిజ్యాన్ని అభివృద్ధిపరచినాడు. తెలుగు పల్లవుల నుంచి మోటుపల్లి ఆక్రమించి విదేశీ వ్వాపారాన్ని అభివృద్ధి పరచినాడు గణపతిదేవుడు నిర్మించిన ప్రసిద్ధమైన ఆలయాల్లో ఓరుగల్లు కోటలోని స్వయం భూస్వామి ఆలయం, పాలంపేటలోని రామప్పగుడి ముఖ్యమైనవి. ఇతడి రాజ్యంలో నలుమూలల చెరువులు తవ్వించాడు. ఇతడు తవ్వించిన చెరువుల్లో నెల్లూరు, వలుగు, గణపవరం, ఏకశిలానగరం చెరువులు ముఖ్యమైనవి. గణపతిదేవుడు రాజధాని హన్మకొండ నుంచి ఓరుగల్లుకు మార్చాడు. గణపతిదేవుడు శైవ మతస్తుడైననూ సర్వమతాభిమాని ఇతనికి విశ్వేశ్వర శివాచార్యుడు (విశ్వేశ్వర శంభుడు) శివదీక్షా గురువు.
ఇతని సేనానుల్లో ముఖ్యులు
-రేచర్లరుద్రుని (బిరుదు కాకతిరాజ్య భారథౌరేయ, కాకతి రాజ్య స్థాపనాచార్య), మలయబౌండ, ఒప్పిలి సిద్ధుడు, గంగయ సాహిణి, సామంత భోజుడు, హేమాద్రిరెడ్డి, జాయపసేనాని మొదలగువారు. కాకతీయ రాజ్య చరిత్రలో గణపతిదేవుని కాలం స్వర్ణయుగం అని చెప్పవచ్చు.
రాజులు-వారి బిరుదులు
మొదటి బేతరాజు: కాకతి పురనాథ
మొదటి ప్రోలరాజు : 1) కాకతి వల్లభ
2) సమధి గత పంచమహాశబ్ద
3) అరిగజకేసరి
రెండో బేతరాజు :
1) త్రిభువనమల్ల, 2) పరమమహేశ్వర,
3) మహామండలేశ్వర, 4) విక్రమ చక్ర, 5) చలమర్తగండ
రెండో ప్రోలరాజు:
1) మహా అహాంకార
2) లంకేశ్వర
3) నిశ్మంక ప్రధాన ప్రభందన
రుద్రమదేవి (క్రీ.శ 1259-1295)
-గణపతిదేవునకు పుత్రసంతానం లేకపోవడంచేత అతని కుమార్తె రుద్రమదేవి రుద్రమహాదేవుడు అనే పురుషనామంతో పట్టాభిషక్తురాలయ్యెను. గణపతిదేవుడు ఈమెతో పాటు రాజ్యపాలన చేసి ఈమెకు రాజ్యపాలనలో తర్ఫీదునిచ్చి వీర వనితగా, పరిపాలనాధ్యక్షురాలిగా తయారు చేశాడు. అనగా 1259 నుంచి 1262 వరకు తండ్రికూతుళ్లిద్దరూ కలిసి రాజ్యపాలన చేశారు. క్రీ.శ 1262లో గణపతిదేవుడు మరణించిన తర్వాత రుద్రమదేవి పూర్తి రాజ్యభారం వహించింది. ఈమె భర్త నిడదవోలు ప్రాంతాన్ని పాలించిన చాళుక్య వీరభద్రుడు. దక్షిణ భారతదేశంలో రాజ్యమేలిన మొట్టమొదటి మహిళ రుద్రమదేవి.
-(గమనిక : భారతదేశంలో రాజ్యమేలిన మొట్టమొదటి మహిళ ఢిల్లీని ఏలిన రజియా సుల్తానా)
-రుద్రమదేవి రాజ్యానికి రాగానే స్త్రీ అనే భావంతో అనేక సామంతరాజులు ఎదురుతిరిగి స్వాతంత్య్రం ప్రకటించుకున్నారు. ఇరుగుపొరుగు రాజులు ఇదే తరుణమని భావించి కాకతీయ రాజ్యంపై దండెత్తారు. రుద్రమదేవి వారందరినీ అణిచివేసి దేశంలో ప్రశాంత పరిస్థితులను నెలకొల్పిన వీర వనిత. రుద్రమదేవికి యుద్ధాల్లో సాయపడిన సేనానుల్లో రేచర్ల ప్రసాదాదిత్యుడు ముఖ్యడు. ఇతడు శత్రువులను హతమార్చి రుద్రమదేవికి పట్టాభిషేకం చేయించి కాకతీయ రాజ్య స్థాపనాచార్య, రాయపిత మహాంక అను బిరుదులు పొందాడు.
రుద్రమదేవి ఇతర ముఖ్య సేనానులు
1) గణప్పదేవ
2) కిన్నెరనాయక
3) నిస్సంకమల్ల
4) మల్లికార్జునుడు
5) గోన గన్నారెడ్డి
6) పోతినాయుడు
7) పోలీనాయుడు
అంబదేవుడు : ఇతడు మొదట రుద్రమదేవికి సహాయపడి ఆ తర్వాతికాలంలో ఆమెపై తిరుగుబాటు చేసి కాకతీయ రాజ్యాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించాడు ఇతడు…1) గుంజాల 2) నెల్లూరు 3) గుత్తి 4) పెండెకల్లు. 6) కలకడ మొదలగు రాజ్యాలను జయించినాడు. రుద్రమదేవి ఇతన్ని ఓడించడానికి తన మనుమడు ప్రతాపరుద్రున్ని పంపించింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు