చీకటి పర్వం-శ్రీకృష్ణ కమిటీ 8వ అధ్యాయం (తెలంగాణ ఉద్యమ చరిత్ర)
– 2010, డిసెంబర్ 30న ఆంధప్రదేశ్‌లోని ప్రత్యేక పరిస్థితులపై ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను కేంద్ర హోం మంత్రి పీ చిదంబరానికి సమర్పించింది. ఆ నివేదికను 9 అధ్యాయాలుగా రూపొందించి అందులో 8వ అధ్యాయాన్ని సీల్డ్ కవర్లో బహిర్గతం చేయకుండా హోం శాఖకు సమర్పించింది.
– ఈ నివేదికలోని 8వ అధ్యాయాన్ని బహిర్గతం చేయాలని తెలంగాణకు చెందిన పండిట్ నారాయణ్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై వాదోపవాదాలు విని 2011, మార్చి 23న అప్పటి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి చీకటి అధ్యాయాన్ని కేంద్ర హోం శాఖ నుంచి తెప్పించుకొని చదివి రెండు వారాల్లోగా ఈ అధ్యాయాన్ని బహిర్గతం చేయాలని హోం శాఖ ఆదేశిస్తూ 58 పేజీల తుది తీర్పు వెలువరిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.
8 వ (రహస్య) చాప్టర్లోని ప్రధానాంశాలు
– తెలంగాణ రాష్ట్రమిస్తే శాంతికి భంగం కలుగుతుందని శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలోని 8వ చాప్టర్లో పేర్కొంది. తెలంగాణ రాష్ట్రం ఇస్తే రాష్ట్రంలో హిందూ, ముస్లిం మతకల్లోలాలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. మావోయిస్టులకు, మతఘర్షణలకు తెలంగాణ కేంద్ర బిందువు అవుతుందని హెచ్చరించింది. తమ కమిటీకి వచ్చిన విన్నపాలు, తాము కలిసిన వివిధ ప్రాంతాల ప్రజలు, రాజకీయ పార్టీలు, పోలీసు, పౌర ఉన్నతాధికారులతో జరిపిన చర్చల సందర్భంగా ఈ ఆందోళనలు వ్యక్తమయ్యాయని ఈ రహస్య అధ్యాయంలో పేర్కొంది.
– తక్షణ శాంతిభద్రతల సమస్యలు, దీర్ఘకాలిక అంతర్గత భద్రత పర్యవసానాలు, నక్సలైట్లు బలపడే అవకాశాలపై కమిటీ పరిశీలించింది. ఈ భయాందోళనలు వివిధ పార్టీలు, ఇతర గ్రూపుల నుంచి వచ్చిన వినతిపత్రాల్లో ఉన్నాయి. మేము వివిధ ప్రాంతాల్లో పర్యటించి ముఖాముఖి జరిపిన చర్చల్లో ప్రధానంగా ఈ అంశాలు ముందుకు వచ్చాయి. ఈ అంశాలను సీనియర్ ప్రభుత్వ అధికారులు, పోలీసులు, స్థానిక సంస్థల్లోని అధికారులు వ్యక్తీకరించారు.. దీనిపై ఒక నోట్‌ను కేంద్ర హోం శాఖకు పంపాం. ఈ కోణాలను దృష్టిలో పెట్టుకొని 8వ అధ్యాయంలో వివిధ ప్రత్యామ్నాయ మార్గాలు చూపాం. తెలంగాణలోని విద్యాసంస్థల్లో అధిక భాగం సీమాంధ్ర వారివే. ఇవి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నాయి. తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న విద్యార్థులు వీటిని లక్ష్యంగా ఎంచుకోవచ్చు. ఇది ఆయా విద్యాసంస్థలు, బోధనా సిబ్బంది వలసపోవడానికి దారితీయవచ్చు. అందువల్ల సామర్థ్యం గల అభ్యర్థుల కొరత ఏర్పడి తెలంగాణలోని ఉపాధి, వ్యాపారాలపై ప్రభావం చూపుతుంది.
-తెలంగాణలోని సున్నపురాయి, గ్రానైట్ ఖనిజ సంపడ అధికంగా ఉంది. థర్మల్ పవర్ స్టేషన్లు, ఫార్మా తదితరాలు ప్రధాన పరిశ్రమలు, వీటిలో చాలావరకు సీమాంధ్రకు చెందినవారివే. తెలంగాణ వస్తే ప్రధాన పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు పూర్తిగా ఈ ప్రాంతం వారికే ఇవ్వాల్సి వస్తుందని ప్రచారం ఉంది. ఈ పరిశ్రమల్లో పనిచేస్తున్న నిపుణులైన ఉద్యోగుల్లో అధిక శాతం సీమాంధ్రకు చెందినవారే. స్థానికంగా నిపుణులు లభించకపోవడంతో స్థానికులు, స్థానికేతరుల మధ్య యాజమాన్యం, కార్మికుల మధ్య ఘర్షణలు తలెత్తే అవకాశం ఉంది. విద్యుదుత్పత్తి కోసం తెలంగాణ ప్రాంతం కేవలం బొగ్గుపైనే ఆధారపడుతుంది. కానీ సీమాంధ్ర బొగ్గుపై ఆధార పడుతూనే గ్యాస్, పవన, సౌర, అణు విద్యదుత్పత్తి వైపు వేగంగా దృష్టి సారిస్తుంది. ఇంధన కొరత, ప్రజల వలసకు దారితీస్తుంది. తెలంగాణలో వ్యవసాయం ఎక్కువ భాగం భూగర్భజలాలు, వర్షాలు, ఎత్తిపోతల పథకాలపై ఆధారపడి ఉంది. వీటికి నిర్దిష్ట స్థాయిలో విద్యుత్ అవసరం. ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తుంది. తెలంగాణలోని చిన్న, సన్నకారు రైతులు ఎక్కువగా దీనివల్ల లబ్ధిపొందుతున్నారు. తెలంగాణలోని నల్లగొండ, మెదక్, మహబూబ్‌నగర్, హైదరాబాద్ వంటి జిల్లాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందాయి. వీటికి విద్యుత్ అవసరం ఎక్కువ.
– తెలంగాణలో అధికంగా థర్మల్ విద్యుత్ ప్లాంట్లే ఉన్నందున ఆర్థిక అసమతుల్యత వల్ల చిన్న, సన్నకారు రైతులకు ఇంధన కరువు ఏర్పడే అవకాశం ఉంది. ఇది వ్యవసాయ ఉత్పత్తిపై ప్రభావం చూపుతుంది. రైతులు, నష్టపోయి, భూములు అమ్ముకొని హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న పారిశ్రామిక వాడలకు వలసపోవాల్సిన స్థితి వస్తుంది. ఇది జనాభాలో మార్పులకు దారితీస్తుంది. సరిపడా భూమి, నీరు కొరవడుతుంది. ఇది ప్రాంతీయ విభేదాలకు దారితీస్తుంది.
– హైదరాబాద్‌లో అశాంతి నెలకొంటుంది. దీని ప్రభావం పై ప్రాంతాల్లో నివసిస్తున్న రెండువర్గాల మధ్య అభద్రతా భావం నెలకొనడానికి అవకాశం ఇస్తుంది. సమాజంలో అశాంతి, నిరుద్యోగం పెరగడం మత ఘర్షణలకు అవకాశం ఇస్తుంది. ఇది మిలిటెంట్లు, జీహాదీ శక్తులకు బలం చేకూర్చుతుంది. అధిక సంఖ్యలో ఉన్న ముస్లింలకు, వారి ప్రాబల్యాన్ని అడ్డుకట్ట వేయడానికి హిందూత్వవాదులు హిందూ జనాభా పెరుగుదలపై దృష్టిసారిస్తారు.
పొలిటికల్ మేనేజ్మెంట్
– పాలక పక్షంలోని నాయకుల మధ్య ఐక్యత అవసరం. బలమైన నాయకత్వం అవసరం ఉంది. టీఆర్ఎస్ శ్రేణులను కట్టడి చేయడానికి తెలంగాణకు చెందిన వారికి సీఎం లేదా డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి. దీంతో ఉద్యమం కొంత చల్లబడే అవకాశం ఉంది. ఇప్పటికే టీఆర్ఎస్ డిసెంబర్ 31 నుంచి సహాయనిరాకరణ, తెలంగాణ ఇవ్వకపోతే మహాయుద్ధం చేస్తామని ప్రకటించింది. ఈ ఆందోళనపై కాంగ్రెస్ నాయకత్వం ప్రజలకు ఏదో ఒకటి తేల్చి చెప్పాల్సి వస్తుంది. ఆందోళనకారులకు మద్దతు పలకవద్దని కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఉద్బోధించాలి.
-సున్నితమైన అంశంపై కాంగ్రెస్ హై కమాండ్ వారికి సర్ది చెప్పి తదనంతర పరిణామాలను విశదీకరించాల్సి ఉంది. కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత కేంద్రం ఈ అంశంపై చర్చలకు సిద్ధంగా ఉన్నామనే అంశాన్ని ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని నాయకులు పరిశీలకుల ముందుకు తీసుకెళ్లాలి. మంత్రులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలి. ఈ ప్రక్రియ సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలి.
మీడియా మేనేజ్మెంట్
-ఆంధ్రప్రదేశ్‌లో 13 ఎలక్టానిక్ చానళ్లు ఉన్నాయి. ఐదు స్థానిక పత్రికలు ప్రజాభిప్రాయాన్ని మలచడంలో కీలక భూమిక పోషిస్తున్నాయి. వీటిలో రెండు చానళ్లు (రాజ్ న్యూస్, హెచ్ఎం టీవీ) మినహా మిగిలినవన్నీ సమైక్యాంధ్రకు మద్దతు పలుకుతున్న వారివే. వీటిలో భాగస్వాములు కూడా సీమాంధ్రకు చెందినవారే (రెండు చానళ్లు మినహా). ప్రధానంగా ఎడిటర్లు, సబ్ ఎడిటర్లు, చిత్ర పరిశ్రమలోనూ సీమాంధ్రకు చెందినవారిదే పై చేయి. వారిలో ఉన్న సహకార ధోరణి సాధారణ మనిషిని మలచగలుగుతుంది. అయినప్పటికీ స్థానికంగా ప్రాతినిథ్యం వహిస్తున్న జర్నలిస్టులు అక్కడి సంఘటనలను, స్థానిక ప్రజల సెంటిమెంట్లను మాత్రమే రిపోర్టు చేయగలుగుతున్నారు.
– హైదరాబాద్ నగరం ఆందోళనకారులకు కేంద్రంగా మారింది. ఇక్కడ జరుగుతున్న ఆందోళనలను రిపోర్టు చేస్తున్న వారిలో ప్రత్యేక తెలంగాణకు మద్దతు పలికే జర్నలిస్టులే అధికంగా ఉన్నారు. ఒక పద్ధతి ప్రకారం సాధ్యమైనంత మేరకు తెలంగాణ జర్నలిస్టుల స్థానాలను సీమాంధ్ర జర్నలిస్టులతో భర్తీ చేయడం ద్వారా మీడియా యాజమాన్యం ఈ పరిస్థితిని ఎదుర్కోవచ్చు.
సంసిద్ధంగా ఉండాలి
-పత్రికల్లో తెలంగాణ వార్తలను ప్రకటించేటప్పుడు హెడ్‌లైన్స్, వార్తల ప్రాముఖ్యత విషయంలో ఎడిటర్లను మేనేజ్ చేయాలి. పత్రికల అడ్వర్టయిజ్మెంట్ల విషయంలో ప్రభుత్వంపై ఆధారపడుతున్నందున ఇది సాధ్యమే.
-కమిటీ సూచించిన సలహాల్లో దేన్ని అమలు చేయడానికి చూసినా పెద్ద ఎత్తున ఆందోళనలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ముందస్తుగా చేసిన సూచనలు అమలు చేయడంతోపాటు తగిన పోలీసు బలగాలను పూర్తి సాంకేతిక సహకారాలతో కీలక ప్రదేశాల్లో వెంటనే మోహరించాలి. దీర్ఘకాలం పాటు ఆందోళనలను ఎదుర్కోవడానికి సిద్ధపడాలి. పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేయడానికి క్షేత్ర స్థాయి నుంచి ఇంటెలిజెన్స్ నివేదికలు తీసుకొని, పరిస్థితి విషమించకుండా సమస్యాత్మక ప్రదేశాల్లో అదనపు బలగాలను మోహరించాలి. ఆందోళనకు ఉసిగొల్పుతున్న వారిని ముందుగా గుర్తించి అదుపులోకి తీసుకోవాలి.
– సీఎస్, డీజీపీలతో మేము జరిపిన చర్యల్లో ఎటువంటి ఆయుధాలు వినియోగించాలనే అంశం చర్చకు వచ్చింది. ఆందోళనకారులను తీవ్రంగా గాయపరిచే ఆయుధాలు కాకుండా అదే సమయంలో ఆందోళనలను అతి తక్కువ సమయంలో నియంత్రించే విధంగా ఉండేవి వినియోగించాలనే అంశంపై చర్చ జరిగింది. మొదటి రెండు నెలలు ఆందోళనలు ఉధృతంగా ఉండే అవకాశం ఉంది. నివేదిక ఇచ్చిన తర్వాత ప్రజల్లో ఉన్న భావోద్వేగాలపై ఊహాజనితమైన కథనాలు వచ్చే అవకాశం ఉంది.
– ఈ చీకటి అధ్యాయం పరిశీలించిన హైకోర్టు న్యాయమూర్తి ఎల్ నరసింహారెడ్డి శ్రీకృష్ణ కమిటీపై తీవ్రమైన ఆక్షేపణలు చేశారు. ఒక సీనియర్ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఇంత దిక్కుమాలిన నివేదిక ఎలా వెలువడిందని ఆయన ఆశ్చర్యపోయారు. ఈ ఎనిమిదో అధ్యాయాన్ని రహస్యంగా ఉంచాల్సిన భద్రతా కారణాలు ఏవీ లేవని ఈ నివేదిక బహిర్గతం చేయాలని ఆయన తమ తీర్పులో పేర్కొన్నారు. ఈ చీకటి అధ్యాయం బహిర్గతం కావడంతో శ్రీకృష్ణ కమిటీ ఆంధ్ర వలసవాదుల ద్వారా మేనేజ్ అయిందని యూపీఏ ప్రభుత్వంలో ఉన్న భాగస్వామ్య పార్టీల నాయకులు కూడా భావించారు. తెలంగాణ వ్యాప్తంగా ఈ కమిటీ నివేదికకు వ్యతిరేకంగా ఆందోళనలు తీవ్రం కావడంతో యూపీఏ ప్రభుత్వం ఈ నివేదికను చర్చకు పెట్టకుండా బుట్టదాఖలు చేసింది.
ఆంటోని కమిటీ రిపోర్టు
– ఆంటోనితో పాటు వీరప్ప మొయిలీ, దిగ్విజయ్ సింగ్, అహ్మద్ పటేల్ ఈ కమిటీలో సభ్యులు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆంటోని కమిటీతో రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల చర్చలకు సమన్వయకర్తగా వ్యవహరించాడు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలంగాణ సమస్యపై ఆంధ్ర-తెలంగాణ ప్రాంతాల కాంగ్రెస్ నాయకుల అభిప్రాయాలు తెలుసుకోవడానికి జూలై 30న చేసిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులను చర్చించడానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రక్షణ మంత్రి ఏకే ఆంటోని ఆధ్వర్యంలో ఈ నలుగురు సభ్యుల కమిటీని 2013, ఆగస్ట్ 6న నియమించారు.
గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్
-2013, ఆగస్ట్ 20న తెలంగాణ ప్రాంతానికి చెందిన రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, కాంగ్రెస్ నాయకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చర్చించేందుకు ఏకే ఆంటోని కమిటీని కలిశారు.
-అక్టోబర్ 4న ఈ కమిటీ తన నివేదికను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చర్చిస్తున్న మంత్రుల బృందానికి సమర్పించింది. ఆంటోని కమిటీ నివేదికలో హైదరాబాద్ నగరంలోని స్థిరపడిన ఆంధ్ర ప్రాంతం వారి అపోహలను, భయాలను పరిగణనలోకి తీసుకొని పది సంవత్సరాల పాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని సూచించింది.
– ఇంకా ఆదాయ వనరులు, జలాల పంపిణీ, విద్యకు సంబంధించిన పలు అంశాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లులో ప్రస్తావించాలని పలు సూచనలు చేసింది. ఆంటోని కమిటీ జీహెచ్ఎంసీలోని హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని ప్రాంతాలను ఉమ్మడి రాజధాని సరిహద్దులుగా ఉండాలని సూచించింది. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టు ప్రకటించి పర్యావరణ, పునరావాసం వంటి సమస్యలను పరిష్కరించి త్వరలో పూర్తి చేయాలని ఈ కమిటీ సూచించింది.
– 2013, అక్టోబర్ 3న కేంద్ర హోం శాఖ రూపొందించిన తెలంగాణ నోట్‌ను కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. కాంగ్రెస్ పార్టీ తరఫున విభజన కమిటీ పనిచేస్తుండగా సమాంతరంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ కోసం ప్రభుత్వం తరఫున విభజన కమిటీని ఏర్పాటు చేసింది. దీన్నే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీఓఎం) అని వ్యవహరించారు. దీన్ని 2013, అక్టోబర్ 8న ఏర్పాటు చేశారు. దీనికి చైర్మన్‌గా ఏకే ఆంటోని (రక్షణ శాఖ మంత్రి) ఉండగా సభ్యులుగా సుశీల్ కుమార్ షిండే (కేంద్ర హోం మంత్రి), పీ చిదంబరం (కేంద్ర ఆర్థిక మంత్రి), వీరప్ప మొయిలీ (పెట్రోలియం శాఖ మంత్రి), జైరాం రమేశ్ (కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి), గులాం నబీ ఆజాద్ (కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి) ప్రత్యేక ఆహ్వానితుడిగా వీ నారాయణస్వామి (సిబ్బంది, వ్యవహారాలు, ఐఎంవో మంత్రి) నియమితులయ్యారు.
-ఈ మంత్రుల బృందం పార్టీల నుంచి సూచనలు, సలహాలు కోరింది. దీంతో కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, సీపీఐ, ఎంఐఎం సూచనలతో కూడిన నివేదికలు ఇచ్చాయి. టీడీపీ, వైఎస్సార్సీపీ, సీపీఐ (ఎం) నివేదికలు ఇవ్వలేదు. 2013, డిసెంబర్ 5న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదలైన రోజునే కేంద్ర క్యాబినెట్ హైదరాబాద్‌తో కూడిన 10 జిల్లాల ‘తెలంగాణ ముసాయిదా బిల్లు-2013’ను ఆమోదించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పంపించారు.
– 2013, డిసెంబర్ 11న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన తెలంగాణ ముసాయిదా బిల్లు-2013ను ఆమోదించి రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయం కోసం హైదరాబాద్‌కు పంపారు.
మాదిరి ప్రశ్నలు
1. శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికలో ఏ అధ్యాయాన్ని రహస్య అధ్యాయంగా పేర్కొన్నది? (2)
1) 9 2) 8 3) 6 4) 7
2. ఆంటోని కమిటీలో సభ్యులు? (4)
1) వీరప్ప మొయిలీ 2) దిగ్విజయ్ సింగ్
3) అహ్మద్ పటేల్ 4) అందరూ
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ,
కోరుట్ల
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు