14ఎఫ్.. మలిదశ ఉద్యమం ఉధృతం (తెలంగాణ ఉద్యమ చరిత్ర)
గ్రూప్స్ ప్రత్యేకం
# సుప్రీం ధర్మాసనం సి.ఎ నెం. 5141-2002 కు సంబంధించిన కేసులో 2009, అక్టోబర్ 9న సంచలనాత్మక తీర్పునిచ్చింది. ‘రాష్ట్రపతి ఉత్తర్వుల నుంచి మినహాయించిన 14F హైదరాబాద్ సిటీ పోలీస్ ఉద్యోగ నియామకాల్లో స్థానిక రిజర్వేషన్ ఉండదు. ఈ ఉద్యోగాలకు స్థానిక, స్థానికేతర అభ్యర్థులందరూ అర్హులే. ప్రతిభ ఆధారంగా ఆ కొలువుల భర్తీ జరుగుతుందని ఆ తీర్పు సారాంశం. ప్రభుత్వ రంగంలో ఉపాధి అవకాశాలు అధికంగా ఉండేవి కేవలం రెండే రెండు డిపార్ట్ మెంట్లలో ఒకటి ఉపాధ్యాయ రంగం, రెండోది పోలీస్ రంగం.
# తెలంగాణలోని మొత్తం పోలీస్ ఉద్యోగాల్లో సగానికి పైగా ఉద్యోగాలు హైదరాబాద్ సిటీ పరిధిలోనే ఉంటాయి. ఈ తీర్పుతో హైదరాబాద్ సిటీ పోలీస్‌లో స్థానికులకు రిజర్వేషన్ లేకపోవడం ఉద్యోగులు, నిరుద్యోగులను ఆందోళనకు గురిచేసింది. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలన్నీ రాష్ట్రపతి ఉత్తర్వుల నుంచి 14Fను తొలగించాలని డిమాండ్ చేశాయి.
సిద్దిపేటలో ఉద్యోగుల సభ
# ఉద్యోగుల ఆందోళనను, సుప్రీంకోర్టు తీర్పువల్ల తెలంగాణ నిరుద్యోగులకు జరుగబోయే అన్యాయాన్ని అర్థం చేసుకున్న టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ 14F రద్దుకోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి సిద్దిపేటలో ఉద్యోగ గర్జన సభ నిర్వహించారు. ఈ సభకు పెద్ద ఎత్తున ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, టీఆర్ఎస్ కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సభలోనే కేసీఆర్ 14F ను రద్దుచేయడానికి కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేయాలని లేకుంటే ‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో..’ జరుగుతుందన్నారు. అవసరమైతే 14F రద్దు కోసం తాను ఆమరణ దీక్షకు సిద్ధమేనని కేసీఆర్ ఈ సభలో ప్రకటించారు. సిద్దిపేట సభలో 14F ను రద్దు చేయాలని కేసీఆర్ చేసిన ప్రకటనను కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టడంతో కేసీఆర్ 2009, నవంబర్ 29న సిద్దిపేట పక్కనే ఉన్న రంగదాంపల్లిలో ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధపడ్డారు. తెలంగాణ అంశం క్లెమాక్స్‌కు చేరుకునే గొప్ప నిర్ణయం ఇది. కేసీఆర్ ఆరోగ్యం గురించి తెలిసిన సన్నిహితులు వారించినా వినకుండా పార్టీ నేతలతో, తెలంగాణ వాదులతో సంప్రదించి కేసీఆర్ తనకు తాను తెలంగాణ కోసం సమిధగా మారడానికి నిర్ణయించుకున్నారు.
ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో కేసీఆర్ ఆమరణ దీక్ష
# కరీంనగర్ నుంచి సిద్దిపేటలోని నిరాహార దీక్షకు బయలుదేరిన కేసీఆర్‌ను అల్గునూరు వద్ద పోలీసులు అరెస్ట్ చేసి ఖమ్మంకు తరలించారు. కేసీఆర్ వెంట ఉన్న ప్రొ. జయశంకర్‌ను అల్గునూరులో దించివేశారు. కేసీఆర్ వాహనం వెంట డజన్లకొద్ది పోలీస్ వాహనాలు కాన్వాయ్‌గా వెళ్లాయి. ఆ రోజు ఆదివారం కావడంతో సెకండ్ క్లాస్ స్పెషల్ మేజిస్ట్రేట్ చదలవాడ శ్రీరామమూర్తి ఇంటికి కేసీఆర్‌ను, ఇతర నాయకులను హాజరుపర్చారు. కేసీఆర్‌తో పాటు మరో పదిమందిపై 9 సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు.
# మేజిస్ట్రేట్ శ్రీరామమూర్తి అడిగిన మాటలకు కేసీఆర్ స్పందిస్తూ ‘నన్ను వరంగల్ సెంట్రల్ జైలుకు గాని, హైదరాబాద్ చంచల్‌గూడ జైలుకు గాని పంపండి’ అని కోరారు. తెలంగాణ జిల్లాల్లో ఉద్రిక్తత పరిస్థితులున్నాయి. ఇక్కడి నుంచి తరలించడం సాధ్యం కాదని ఏఎస్పీ పరిమళ మేజిస్ట్రేట్‌కు వివరించారు. లోపల విచారణ జరుగుతుండగా బయట వాతావరణం ఉద్రిక్తంగా మారింది. మేజిస్ట్రేట్ ఇంటి సమీపంలో న్యూడెమోక్రసీ కార్యకర్తలు, తెలంగాణ వాదులు జై తెలంగాణ నినాదాలు చేశారు.
# కేసీఆర్ ఆమరణ దీక్షలో ఉండటంతో 24 గంటలు ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని అధికారులు నిర్ణయించారు. అందుకోసం అప్పటికే జైలులోనే నిర్మాణం పూర్తయి ప్రారంభంకాని హాస్పిటల్ బ్లాకుకు కేసీఆర్‌ను తరలించారు. ఆ బ్లాక్‌లో ఉన్న రెండు బ్యారక్‌లలో ఒకదాంట్లో కేసీఆర్‌ను, మాజీ మంత్రులను, ఇంకొక దాంట్లో ఇతర కార్యకర్తలను ఉంచారు. ఉదయం ప్రారంభించిన దీక్ష రోజంతా కొనసాగింది. తెలంగాణ భగ్గుమన్నది. ఓయూ విద్యార్థులపై లాఠీచార్జ్ చేశారు. టీఆర్ఎస్వీ అధ్యక్షుడు బాల్క సుమన్‌ను ఆరుగురు పోలీసులు కిందపడేసి లాఠీలతో తీవ్రంగా కొట్టారు. ఈ దృశ్యాన్ని టీవీ చానళ్లన్నీ ప్రత్యక్ష ప్రసారం చేశాయి.
అమరవీరుడు శ్రీకాంతాచారి
# హైదరాబాద్ ఎల్బీ నగర్ రస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద శ్రీకాంతాచారి అనే విద్యార్థి ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని మంటలతో ‘జై తెలంగాణ’ అని నినదిస్తూ రోడ్డుపైకి రావడం తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలను కంటతడి పెట్టించింది. తీవ్ర ఆవేశాన్ని రగిల్చింది. శ్రీకాంతాచారిని డీఆర్డీవో అపోలో (కంచన్‌బాగ్) ఆస్పత్రికి తరలించారు పోలీసులు. కేసీఆర్‌ను నిమ్స్‌లో చేర్చిన రోజు రాత్రి డీఆర్డీవో హాస్పిటల్లో శ్రీకాంతాచారి మరణించారు. పోలీసులను ధిక్కరించి వీ ప్రకాశ్, ఇతర తెలంగాణ వాదులు శ్రీకాంతాచారి మృతదేహాన్ని గన్‌పార్క్‌కు ఊరేగింపుగా తీసుకెళ్లారు. గన్‌పార్క్ దగ్గర నివాళి అర్పించిన తర్వాత విద్యార్థులు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.
ప్రజాందోళన
# రవాణా వ్యవస్థ స్తంభించింది. బంద్‌లు, రాస్తారోకోలతో తెలంగాణ అట్టుడికింది. విద్యార్థుల బలిదానాలు రోజు రోజుకూ ఎక్కువవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఒత్తిడి పెరిగింది. ప్రజలు కాంగ్రెస్ నేతలను, ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. ఓయూ, కేయూ విద్యార్థులు వేల సంఖ్యలో రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు. పార్టీలు, సంస్థలు రాజకీయాలకు అతీతంగా విద్యార్థులు, అన్ని రంగాల ప్రజలు, నేతలు స్పందించారు. కేసీఆర్ ప్రాణాలు కాపాడుకోవాలని ఇష్టదైవాలకు మొక్కుకున్నారు. బలిదానాలు ఆగిపోవాలని ప్రార్థించారు. కేసీఆర్ సొంత ఊరు సిద్దిపేట నియోజకవర్గంలోని చింతమడక గ్రామం నుంచి చాలామంది మహిళలు నిమ్స్‌కు వచ్చి కేసీఆర్‌ను చూసి కంటతడి పెట్టారు. సిద్దిపేట నియోజకవర్గం నుంచి తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి రాజకీయాలకతీతంగా వందలాదిమంది కేసీఆర్‌ను పరామర్శించి వెళ్లారు.
నిమ్స్ ఆవరణలో మీడియా పాయింట్ ఏర్పాటు చేసుకొని పాత్రికేయులు, ఎలక్టానిక్ మీడియా ప్రతినిధులు 24 గంటలు వచ్చిపోయే వారి స్పందనను బయటి ప్రపంచానికి ఎప్పటికప్పుడు తెలిపారు.
చిదంబరం ప్రకటన
# డిసెంబర్ 9: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తన జన్మదినం సందర్భంగా 2009, డిసెంబర్ 9న కేసీఆర్‌కు గతంలో ఇచ్చిన మాట ప్రకారం ‘తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రక్రియను ప్రారంభిస్తున్నామని కేంద్ర హోంమంత్రి చిదంబరం ద్వారా ప్రకటన చేయించారు. దీంతో కేసీఆర్ నిమ్స్ హాస్పిటల్లో 12 రోజులుగా చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను విరమించారు.
# చిదంబరం ప్రకటనను రూపొందించే ముందు తెలంగాణ మార్గదర్శి జయశంకర్‌తో పలుమార్లు ఫోన్లో చర్చించి ఆ ప్రకటన పాఠాన్ని రూపొందించారు. చిదంబరం ప్రకటన వెలువడగానే తెలంగాణ అంతటా ఆ రాత్రి దీపావళి పండుగను తలపించే విధంగా ప్రజలు బాణాసంచా కాల్చారు.
# ఈ సంతోషం ఎక్కువ కాలం నిలువలేదు. మరునాడే ఆంధ్రప్రాంత ప్రజాప్రతినిధులంతా మూకుమ్మడిగా తమ పదవులకు రాజీనామా చేయడంతో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ ఉనికికే ముప్పు ఏర్పడింది. ఆంధ్రలో కృత్రిమ సమైక్య ఉద్యమాన్ని టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు డబ్బులు గుమ్మరించి సృష్టించారు.
రాజకీయ ఐకాస ఆవిర్భావం
# డిసెంబర్ 23: 2009, డిసెంబర్ 23 రాత్రి చిదంబరం మరో ప్రకటన చేస్తూ ‘ఆంధ్రప్రదేశ్‌లో డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటన తర్వాత మారిన పరిస్థితులపై సంప్రదింపులను జరపాల్సిన అవసరం ఉందని’ అన్నారు. దీంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ అటకెక్కింది.
# చిదంబరం మళ్లీ ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ రాజకీయ పార్టీలతో, గ్రూపులతో తెలంగాణ కోసం సంప్రదింపులు జరుపుతామని ప్రకటించాడు. దీంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై యూపీఏ ప్రభుత్వం వెనక్కు మళ్లుతున్నదని స్పష్టం కావడంతో తెలంగాణ ఒక్కసారిగా భగ్గుమన్నది. కేసీఆర్ జయశంకర్‌ను వెంటబెట్టుకొని అర్ధరాత్రి పార్టీల సీనియర్ నాయకులను కలిసి తెలంగాణపై మారిన యూపీఏ వైఖరి గురించి చర్చించారు.
# తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అన్ని పార్టీలు, ప్రజా సంఘాలను కలుపుకొని ఉద్యమించాలని నిర్ణయించారు. దీనికి సారథ్య బాధ్యతలను స్వీకరించాలని ప్రొ. జయశంకర్‌ను అభ్యర్థించగా, ఆయన తెలంగాణ విద్యావంతుల వేదిక నాయకుడు ప్రొ. కోదండరామ్‌కు ఈ బాధ్యతలను అప్పగించాలని సూచించారు. అప్పటికప్పుడే ప్రొ. కోదండరామ్‌తో సంప్రదించి ఐక్యకార్యాచరణ కమిటీ చైర్మన్‌గా ఆయన పేరును కేసీఆర్ ప్రకటించారు. మరుసటి రోజు 2009, డిసెంబర్ 24న ఉదయం 11 గంటలకు టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ ఎంఎల్ (న్యూడెమొక్రసీ) తెలంగాణ కోసం పనిచేస్తున్న దాదాపు అన్ని ప్రజా సంఘాల నాయకులు బంజారాహిల్స్‌లోని కళింగ ఫంక్షన్ హాల్లో సమావేశమై ప్రొ. కోదండరామ్ చైర్మన్‌గా వివిధ ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజేఏసీ)ని ఏర్పాటు చేశారు.
జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ
# రాష్ట్రంలో తలెత్తిన ప్రత్యేక తెలంగాణ, సమైక్యాంధ్ర సమస్యపై కేంద్ర హోంశాఖ ఉత్తర్వుల ద్వారా 2010, ఫిబ్రవరి 3న శ్రీకృష్ణ కమిటీని నియమించారు. అదే శాఖ ఉత్తర్వుల ద్వారా కమిటీ విధి విధానాలు ప్రకటించారు.
అఖిలపక్ష సమావేశం
# 2009, డిసెంబర్ 30న రాష్ట్రంలోని 8 పార్టీలను అఖిలపక్ష సమావేశానికి హాజరు కావాలని కేంద్ర ప్రభుత్వం లేఖలు పంపింది. తెలంగాణపై అభిప్రాయ సేకరణకు 2010, జనవరి 5న అఖిల పక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆ లేఖల్లో పేర్కొంది. ఈ అఖిల పక్ష సమావేశానికి ప్రతి రాజకీయ పార్టీ తమ పార్టీ తరఫున ఇద్దరు చొప్పున అభ్యర్థులను పంపాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. 2010, జనవరి 5న చిదంబరం రాష్ట్ర రాజకీయ పార్టీలతో ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య ప్రత్యేక ఆహ్వానితునిగా హాజరయ్యారు.
ఈ సమావేశానికి హాజరైనవారు
# టీఆర్ఎస్: కేసీఆర్, ప్రొ. జయశంకర్
# కాంగ్రెస్ పార్టీ: తెలంగాణ ప్రాంతం నుంచి ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఆంధ్ర ప్రాంతం నుంచి కావూరి సాంబశివరావు
# టీడీపీ: తెలంగాణ ప్రాంతం నుంచి రేవూరి ప్రకాశ్‌రెడ్డి, ఆంధ్ర ప్రాంతం నుంచి యనమల రామకృష్ణుడు
# బీజేపీ: తెలంగాణ ప్రాంతం నుంచి బండారు దత్తాత్రేయ, ఆంధ్ర ప్రాంతం నుంచి హరిబాబు
# ఎంఐఎం: అసదుద్దీన్, అక్బరుద్దీన్
# ప్రజారాజ్యం: చిరంజీవి, రామచంద్రయ్య (ఇద్దరూ ఆంధ్ర ప్రాంతం నుంచి)
# సీపీఎం: జూలకంటి రంగారెడ్డి (తెలంగాణ), బీవీ రాఘవులు (ఆంధ్ర)
# సీపీఐ: గుండా మల్లేశ్ (తెలంగాణ), నారాయణ (ఆంధ్ర)
మాదిరి ప్రశ్నలు
1. కేసీఆర్ 14ఎఫ్ రద్దు కోసం ఉద్యోగ గర్జన సభను ఎక్కడ నిర్వహించారు?
1) కరీంనగర్ 2) సిద్దిపేట
3) వరంగల్ 4) హైదరాబాద్
2. 2009, డిసెంబర్ 9న సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా ‘తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రక్రియను ప్రారంభిస్తున్నామని’ హోంమంత్రి హోదాలో ప్రకటన చేసినది?
1) చిదంబరం 2) సుశీల్ కుమార్ షిండే
3) ప్రణబ్ ముఖర్జీ 4) ఆంటోని
3. కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో.. అని ఏ సభా వేదికగా కేసీఆర్ ప్రకటించారు?
1) సిద్దిపేట ఉద్యోగ గర్జన సభ
2) కరీంనగర్ సింహగర్జన
3) మిలియన్ మార్చ్
4) సకల జనుల సమ్మె
4. కేసీఆర్ 2009, నవంబర్ 29న ఏ ప్రాంతంలో ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు?
1) జనగామపల్లి 2) రంగదాంపల్లి
3) బంగెనపల్లి 4) అల్గునూరు
5. నిరాహార దీక్షకు బయలుదేరిన కేసీఆర్‌ను అల్గునూరు వద్ద అరెస్ట్ చేసి ఎక్కడికి తరలించారు?
1) హన్మకొండ 2) సిద్దిపేట
3) ఖమ్మం 4) హైదరాబాద్
సమాధానాలు
1-2, 2-1, 3-1, 4-2, 5-3
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ,
కోరుట్ల
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు