మహాత్మాగాంధీ జలపాతం ఏ నదిపై ఉంది? (గ్రూప్స్ ప్రత్యేకం)
గత తరువాయి..
ఇండియన్ జాగ్రఫీ
బి) మహారాష్ట్ర పీఠభూమి
# కొంకణ్ తీరం, సహ్యాద్రి శ్రేణులను మినహాయించి మొత్తం మహారాష్ట్రలో ఈ పీఠభూమి ఉంది.
# క్రెటేషియన్ యుగం చివరి కాలంలో (6.5 కోట్ల సంవత్సరాల క్రితం) భ్రంశ ఉద్భేదన (Fissure Erruption) ద్వారా ఉపరితలానికి వచ్చిన బస్టాల్తో ఈ ప్రాంతం మొత్తం కప్పబడింది.
#దీనిని దక్కన్ నాపరాతి ప్రాంతం (Deccan Trap) అని పిలుస్తారు.
#బస్టాల్ శిలల శైథిల్యం వల్లనే ఈ ప్రాంతంలో నల్లరేగడి మృత్తికలు ఏర్పడ్డాయి. ఈ నేలలు పత్తిపంటకు ప్రసిద్ధి.
#ఈ పీఠభూమి ఉత్తర అంచున తపతి నది ప్రవహిస్తుండగా, పీఠభూమి ప్రధాన భాగం మొత్తం గోదావరి నది పరీవాహక ప్రాంతంలో ఉంది. దక్షిణ భాగం మాత్రం కృష్ణా ఉపనది అయిన భీమా నది పరీవాహక ప్రాంతంలో ఉంది.
# ఈ పీఠభూమి నదులతో ఖండించబడగా మిగిలిన ఎత్తయిన భాగాలు పడమర నుంచి తూర్పునకు కొండలుగా విస్తరించాయి. అవి.. అజంతా, నిర్మల్, సాత్మల శ్రేణులుగా, వీటికి దిగువన హరిశ్చంద్ర రేంజ్, బాలాఘాట్ రేంజ్‌లుగా విస్తరించాయి.
సి) చత్తీస్ఘడ్ మైదానం
# మహానది, సియోనాడ్, హస్‌డో నదుల మధ్య చత్తీస్ఘడ్ రాష్ట్రంలో ఈ మైదానం విస్తరించి ఉంది.
#దీనికి దక్షిణాన దండకారణ్యం, పడమర మైకల్ శ్రేణి, ఉత్తరాన ఛోటానాగ్పూర్ పీఠభూమి సరిహద్దులుగా ఉన్నాయి.
#ఈ ప్రాంతంలో టెర్షియరీ కాలానికి చెందిన బిట్యుమినస్ బొగ్గు నిక్షేపాలు ఉన్నాయి. హస్‌డో నది ఒడ్డున ‘కోర్బా’ బొగ్గు గని ఉంది.
# దక్షిణాన గల ‘రాజారా కొండల్లో’ హెమటైట్ రకానికి చెందిన ఇనుప నిక్షేపాలు ఉన్నాయి.
# రామ్‌ఘర్, బిలాస్పూర్, భిలాయ్, దుర్గు పట్టణాలు దీనిలో ఉన్నాయి.
డి) మహానది పరీవాహక ప్రాంతం
#గర్జాట్ కొండలు, నయాగర్ కొండలకు మధ్యలోగల హిరాకుడ్ బేసిన్, మహానది దిగువ భాగాలు. మహానది డెల్టా దీనిలో భాగాలే.
# హిరాకుడ్ డ్యామ్ నిర్మాణం తర్వాత ఈ ప్రాంతం వ్యవసాయపరంగా బాగా అభివృద్ధి చెందింది.
ఇ) గర్జాట్ కొండలు
#చత్తీస్ఘడ్ మైదానాలు, ఛోటానాగ్పూర్ పీఠభూమికి, మహానది మైదాన ప్రాంతానికి మధ్యలోని కొండలు. వీటిని ‘ఒడిశా ఉన్నత భూములు (Odisha High Lands)’ అని కూడా అంటారు.
# దీనిలోని కియోంజర్, మయూర్భంజ్ ప్రాంతాల్లో ఇనుము, మాంగనీస్ సమృద్ధిగా ఉన్నాయి. వీటిలో ఎత్తయిన శిఖరం మలయగిరి శిఖరం (1187 మీ.).
# బ్రాహ్మణి, వైతరణి నదుల ద్వారా ఈ ప్రాంతం ఖండించబడుతుంది. ఈ కొండల్లో ‘సిమ్లిపాల్ బయోస్పియర్ రిజర్వ్’ ఉంది.
ఎఫ్) దండకారణ్యం (బస్తర్ పీఠభూమి)
#చత్తీస్ఘడ్ మైదానాలకు దిగువన, గోదావరి నది వరకు, చత్తీస్‌ఘడ్‌లో ప్రధానంగా కొంతభాగం ఒడిశాలోనూ, ఆంధ్రప్రదేశ్‌లోనూ విస్తరించింది.
# దీనిలో ఇంద్రావతి, శబరి నదుల పరీవాహక ప్రాంతాలు ఉన్నాయి.
# దీనిలోని ‘అబుజ్మడ్ కొండల్లో’ గల ‘బైలడిల్లా’లో విలువైన ఇనుప ఖనిజం ఉంది. విశాఖ ఉక్కు కర్మాగారానికి ఇనుమును ఇక్కడి నుంచే తరలిస్తారు.
#తాడోబా, ఇంద్రావతి, కంగర్ వ్యాలీ నేషనల్ పార్క్‌లు ఇక్కడ ఉన్నాయి. బస్తర్ పీఠభూమి దీనిలోని భాగమే. దేశంలో గిరిజనులు అధికంగా నివసిస్తున్న పీఠభూమి.
దక్షిణ దక్కన్ పీఠభూమి
# కర్ణాటక పీఠభూమి, తెలంగాణ పీఠభూమి, తమిళనాడు ఉన్నత భూములు దీనిలో భాగం.
ఎ) కర్ణాటక పీఠభూమి
# కృష్ణా నదికి దిగువన, పశ్చిమ కనుమలకు తూర్పు భాగాన, తుంగభద్ర, కావేరి నదుల ఎగువ భాగాన్ని కర్ణాటక పీఠభూమిగా పిలుస్తారు. దీనినే మైసూర్ పీఠభూమి అని కూడా పిలుస్తారు. ఇది ధార్వార్ శిలలతో నిర్మితమైంది. దక్షిణ భారత్‌లోనే ఎత్తయిన పీఠభూమి కర్ణాటక పీఠభూమి (దక్షిణ భారతదేశ పైకప్పు).
#బన్నేర్‌ఘట్ట నేషనల్ పార్క్, రంగన్తిట్టా పక్షి సంరక్షణ కేంద్రం ఇక్కడే ఉన్నాయి.
#కర్ణాటక పీఠభూమి తూర్పు భాగాన్ని ‘బెంగళూరు పీఠభూమి’ అంటారు.
# కర్ణాటక పీఠభూమి ఉత్తర అంచున శేషాచలం కొండలు, దక్షిణ భాగాన తమిళనాడు రాష్ట్రంలో మెలగిరి శ్రేణులు ఉన్నాయి. దీని తూర్పు అంచున కోలార్ పీఠభూమి ఉంది. దీనిలోనే ‘కోలార్ గోల్డ్ఫీల్డ్’ ఉంది. పాలార్, పొన్నియార్ నదులు ఈ కోలార్ పీఠభూమి నుంచి ప్రారంభమవుతాయి.
# కావేరి జలపాతం, హొగెనకల్ జలపాతం కర్ణాటక పీఠభూమి దక్షిణ అంచున ఉన్నాయి.
# కర్ణాటక పీఠభూమిలోని పశ్చిమ ప్రాంతాన్నే మలెనాడు (మలండ్) పీఠభూమిగా పిలుస్తారు. మలెనాడు అంటే కన్నడంలో కొండలతో కూడిన ప్రదేశం (Hill Country).
# కర్ణాటకలోని బాబాబుడాన్/పశ్చిమ కనుమల తూర్పు, పశ్చిమ వాలు ప్రాంతాన్నే ‘మలెనాడు ప్రాంతంగా’ పిలుస్తారు.
# ఇక్కడ ప్రధాన వేసవి విడిది కేంద్రం ‘కెమ్మన్గండి (1433 మీ.)’.
#ఈ పీఠభూమిలో తుంగభద్ర, శరావతి, నేత్రావతి, మలప్రభ, ఘటప్రభ నదులు జన్మిస్తున్నాయి.
# జోగ్ (గెరుసొప్పె లేదా జోగడ్ గుండి లేదా మహాత్మాగాంధీ జలపాతం) జలపాతం శరావతి నదిపై సిద్ధాపుర వద్ద ఉన్నది. దీని ఎత్తు 253 మీ.
# ఈ మలెనాడు పీఠభూమిలో ప్రధానంగా కాఫీతోపాటు ఇతర తోట పంటలు పండిస్తున్నారు.
# ఇక్కడ గల అగుంబె (షిమోగా జిల్లా) మాసిన్రాం, చిరపుంజిల తర్వాత అధిక వర్షపాతం పొందిన ప్రాంతం.
#‘మైదాన్ పీఠభూమి’ అంటే సమతల ప్రదేశం లేదా మైదాన ప్రాంతమని అర్థం.
# మైదాన్ పీఠభూమి, మలెనాడు పీఠభూమికి, పశ్చిమ కనుమలకు తూర్పుగా, తెలంగాణ పశ్చిమ సరిహద్దులో ఉంది. ఇది అత్యంత శుష్క ప్రాంతం.
#మైదాన్ పీఠభూమిలో భాగంగా బెలగామ్ పీఠభూమి, రాయచూర్ పీఠభూమి, కోలార్ పీఠభూమి ఉన్నాయి.
# దక్షిణ భారత్‌లో అధికంగా కరువులు సంభవించే ప్రాంతం మైదాన్ పీఠభూమి (ఉత్తర కర్ణాటక ప్రాంతం).
బి) తెలంగాణ పీఠభూమి
#అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలు కూడా ఈ పీఠభూమిలోని భాగాలే. 770 కి.మీ. పొడవు, 515 కి.మీ. వెడల్పు గల పీఠభూమి, దీనినే పశ్చిమాంధ్ర పీఠభూమి అంటారు.
#ఈ పీఠభూమిని ఎగువ తెలంగాణ పీఠభూమి, దిగువ తెలంగాణ పీఠభూమిగా విభజించవచ్చు.
# దీనిలో సాత్మల కొండలు (ఆదిలాబాద్), నిర్మల్ కొండలు (నిర్మల్), రాఖీ కొండలు (నిజామాబాద్, జగిత్యాల), అమ్రాబాద్ గుట్ట (నాగర్ కర్నూలు), కంది కొండలు (జయశంకర్), రాచకొండలు (రంగారెడ్డి), రామగిరి కొండలు (పెద్దపల్లి), సిర్నాపల్లి కొండలు (కామారెడ్డి) ఉన్నాయి.
# ఉత్తర భాగాన గోదావరి నది పరీవాహక ప్రాంతంలో గోండ్వానా రకానికి చెందిన శిలలు ఉన్నాయి. వీటిలో బొగ్గు సమృద్ధిగా దొరుకుతుంది.
సి) తమిళనాడు ఉన్నతభూములు
# వీటిని తమిళనాడు కొండలు, కోయంబత్తూర్, మధురై మెట్ట భూములుగా విభజించారు.
# జవ్వాది, జింజి, షవరాయ్ కొండలు, పచాయ్మలై కొండలు, శిరుమలైన కొండలు ఇక్కడ ఉన్న ప్రాంతాలు.
# ఈ ప్రాంతం పొన్నియార్, కావేరి, వైగై, వైపర్ నదుల ద్వారా క్రమక్షయం చెందుతుంది.
ఇతర పీఠభూములు
1) భాందర్ పీఠభూమి- ఇది మధ్యప్రదేశ్‌లో ఉంది. ఇది వింధ్య శ్రేణుల్లో ఉంది.
2) రేనా పీఠభూమి- ఇది మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో విస్తరించి ఉంది.
3) కైమూర్ పీఠభూమి (రోహతస్ (Rohtas))- ఈశాన్య మధ్యప్రదేశ్, నైరుతి బీహార్ రాష్ట్రాల్లో విస్తరించి ఉంది.
4) కాస్ పీఠభూమి (Kass Plateau)- మహారాష్ట్రలోని సతారా ప్రాంతంలో గల సహ్యాద్రి పర్వత ప్రాంతంలో ఉంది.
5) సిగుర్ పీఠభూమి (Sigur Plateau)- ఇది తమిళనాడులోని నీలగిరి కొండల్లో ఉంది.
6) వల్లాం పీఠభూమి (Vallam Plateau)- తమిళనాడులోని తంజావూర్ పట్టణ ప్రాంతంలో ఉంది.
# సహ్యాద్రి పర్వతాలుగా పిలిచే పశ్చిమ కనుమలు ఖాందేష్ (సోనాగఢ్) నుంచి కన్యాకుమారి వరకు లేదా తపతి నుంచి హిందూ మహాసముద్రం వరకు 1600 కి.మీ. పొడవునా, 50-100 కి.మీ. వెడల్పుతో విస్తరించి ఉన్నాయి.
# అక్షాంశపరంగా 80 24l ఉత్తర అక్షాంశం నుంచి170 43lల ఉత్తర అక్షాంశం వరకు ఉన్నాయి.
# 900 నుంచి 1600 మీ. సగటు ఎత్తున విస్తరించి ఉన్నాయి. దీని విస్తీర్ణం 1,60,000 కి.మీ2.
# ఇవి గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఉత్తరం నుంచి దక్షిణంగా అరేబియా సముద్ర తీరం వెంబడి విస్తరించి ఉన్నాయి.
# ఎత్తయిన పీఠభూములు భేదన క్రమక్షయానికి (Differential Erosion) గురైతే మధ్యలోని భూభాగాలు ఎత్తుగా ఉండి పర్వతాలుగా పిలువబడతాయి. ఇలాంటి వాటిని ‘పరిశిష్ట పర్వతాలు’ అంటారు.
# పశ్చిమం వైపున (అరేబియా) నిట్రవాలుగా కలిగి, తూర్పు వైపున క్రమవాలును కలిగి ఉన్నాయి.
# ఉత్తరం వైపున తక్కువ ఎత్తు ఉండి దక్షిణం వైపునకు వచ్చేకొద్దీ క్రమేణా ఎత్తు పెరుగుతుంది.
# ఉత్తర భాగంలో పర్వతాలు బస్టాల్ శిలా ఉపరితలాన్ని దక్షిణ భాగం ఆర్కియన్, నీస్ శిలా ఉపరితలాన్ని కలిగి ఉన్నాయి.
పశ్చిమ కనుమలకు గల ప్రాంతీయ పేర్లు
1) మహారాష్ట్ర, గోవా, కర్ణాటక – సహ్యాద్రి కొండలు, – సాత్మల కొండలు (నాసిక్‌లో)
2) కర్ణాటక- బాబాబుడాన్ కొండలు, కూర్గ్ కొండలు, రత్నగిరి కొండలు, వరాహగిరి కొండలు, నందిదుర్గా కొండలు,
బ్రహ్మగిరి కొండలు, కుద్రేముఖ్ కొండలు
3) ఉత్తర తమిళనాడు, కర్ణాటక, కేరళ- నీలగిరి కొండలు
4) ఉత్తర కేరళ- అన్నామలై
5) దక్షిణ కేరళ- కార్డమమ్ కొండలు
6) దక్షిణ తమిళనాడు- పళని కొండలు
మాదిరి ప్రశ్నలు
1. దేశంలో ఎత్తయిన పీఠభూమి లడఖ్ పీఠభూమి. అయితే దక్షిణాన ఎత్తయిన పీఠభూమి ఏది?
1) కైమూర్ పీఠభూమి 2) మైకాల్ పీఠభూమి
3) సిగర్ పీఠభూమి 4) మైసూర్ పీఠభూమి
2. ‘దండకారణ్యం’ కింది ఏ రాష్ట్రంలో విస్తరించి లేదు?
1) ఛత్తీస్‌గఢ్ 2) ఒడిశా
3) తెలంగాణ 4) ఆంధ్రప్రదేశ్
3. మహాత్మాగాంధీ జలపాతం కింది ఏ నదిపై ఉంది?
1) కావేరి 2) శరావతి
3) పెన్నా 4) ఏదీకాదు
4. దక్షిణ భారత్‌లో కరువులు సంభవించే పీఠభూమి ఏది?
1) బస్తర్ పీఠభూమి 2) మైదాన్ పీఠభూమి
3) కొడెర్మ పీఠభూమి 4) కథియావార్ పీఠభూమి
5. తెలంగాణ పీఠభూమి మొత్తం పొడవు ఎంత?
1) 770 కి.మీ. 2) 660 కి.మీ.
3) 880 కి.మీ. 4) 550 కి.మీ.
సమాధానాలు
1-4, 2-3, 3-2, 4-2, 5-1.
జీ గిరిధర్
సీనియర్ ఫ్యాకల్టీ
ఫైవ్ మంత్ర ఇన్స్టిట్యూట్
అశోక్‌నగర్
9966330068
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు