కమిటీతో కాలయాపన ( గ్రూప్స్ ప్రత్యేకం)
తెలంగాణ ఉద్యమ చరిత్ర
గిర్గ్లానీ కమిషన్
#మలిదశ తెలంగాణ ఉద్యమంలో చర్చకు వచ్చిన ప్రధానాంశాల్లో జీవో 610 కూడా ఒకటి. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పదేపదే ఈ జీవో విషయాన్ని, ఆరుసూత్రాల పథకం వైఫల్యాన్ని ప్రస్తావిస్తుండటంతో చంద్రబాబు ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోక తప్పలేదు. ఇదే విషయమై తెలంగాణలోని ఉద్యోగ సంఘాలన్నీ ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడి జీవో 610 అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాయి.
#దీంతో ప్రభుత్వం 2001, జూన్ 15న అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జేఎం గిర్‌గ్లానీతో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేస్తూ 2001, జూన్ 25న ఉత్తర్వులు జారీచేసింది. జూన్ 26న కమిషన్ బాధ్యతలు చేపట్టింది. రాష్ట్రంలోని 134 మంది శాఖాధిపతుల్లో ఒక్కరు (ట్రెజరీ శాఖాధిపతి బ్రహ్మయ్య) తప్ప మిగిలినవారంతా తెలంగాణేతరులే కావడం వల్ల చాలామంది కమిషన్‌కు సహకరించలేదు. కమిషన్ కోరిన ఉద్యోగుల సర్వీసు రికార్డును సమర్పించలేదు.
#దీంతో కమిషన్ గడువును మరొక ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం 2002, జూన్ 24 నుంచి ఉత్తర్వులు అమలయ్యేటట్లు జీవో జారీచేసింది. మరోసారి 2003 జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు కమిషన్ కాలపరిమితి పెంచుతూ ఉత్తర్వులను జారీచేసింది. ఆ తరువాత మరోసారి కాలపరిమితి పెంచింది ప్రభుత్వం.
అమలుకాని నివేదిక
# గిర్గ్లానీ కమిషన్ తమ తొలి నివేదికను 2001, అక్టోబర్‌లో ప్రభుత్వానికి సమర్పించింది. కొన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగాల్లో జోనల్ ఉల్లంఘనకు పాల్పడినట్లు కమిషన్ గుర్తించింది. అక్రమంగా నియమితులైన ఆ ఉద్యోగులను వెనక్కి పంపించాలని సిఫారసు చేసింది.
# గిర్గ్లానీ తన తుది నివేదికను 2004, సెప్టెంబర్ 30న అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమర్పించారు. ఈ నివేదిక మూడు వాల్యూమ్‌లతో 705 పేజీలు ఉంది. మొదటి వాల్యూమ్‌లో 1975 నుంచి అమల్లోకి వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వుల తీరుతెన్నులను పరిశీలించి ఉద్యోగ రంగంలో తెలంగాణ స్థానికులకు జరిగిన నష్టాన్ని పరిశీలించింది.
# రెండో వాల్యూమ్‌లో కమిషన్ సేకరించిన సమాచారన్నంతా ‘అనెగ్జర్’ల రూపంలో పొందుపర్చారు. మూడో వాల్యూమ్‌లో 1975 నుంచి 2004 వరకు రాష్ట్రపతి ఉత్తర్వుల అమలును పరిశీలించి వాటిపై తన పరిశీలనాంశాలను తెలిపారు. గిర్గ్లానీ తన నివేదికలో రాష్ట్రపతి ఉత్తర్వులను 126 పద్ధతుల్లో ఉల్లంఘించారని, వాటిని 18 రకాలుగా వర్గీకరించి 35 పరిష్కార మార్గాలను సూచించారు.
నివేదికలోని ముఖ్యాంశాలు
# ఉద్యోగ నియామకాల్లో విధిగా పాటించాల్సిన రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘనలు ఏ విధంగా జరిగాయో నివేదికలో పేర్కొన్నారు. అందులో కొన్ని ముఖ్యమైన అంశాలు.
# శాఖాధిపతి కార్యాలయానికి, జిల్లా కార్యాలయానికి మధ్య ఉన్న ప్రాంతీయ కార్యాలయాలను శాఖాధిపతి కార్యాలయంలో భాగంగా చేయడం ద్వారా ఉల్లంఘనలు జరిగాయి. శాఖాధిపతి కార్యాలయంలో భాగంగా చేస్తే అందులోని ఉద్యోగాలు రాష్ట్రపతి ఉత్తర్వుల పరిధిలోకి రావు. స్థానికులకు చెందాల్సిన ఉద్యోగాలు స్థానికులకు చెందవు.
సీమాంధ్ర బదిలీలు
#బదిలీల ద్వారా రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘన జరిగింది. స్థానికేతరులు ఇతర జిల్లాలకు జోన్లకు బదిలీ అవడంతో స్థానికుల ప్రమోషన్లు సీనియారిటీకి దెబ్బ తగిలింది. రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించిన మరో పద్ధతి డిప్యూటేషన్లు, బదిలీలు సాధ్యం కానప్పుడు డిప్యూటేషన్ల మార్గాన్ని ఎంచుకున్నారు. బదిలీకి డిప్యూటేషన్ అడ్డదారిగా మారింది. ఎక్కడి నుంచైనా ఎంతమందినైనా శాఖాధిపతులు డిప్యూటేషన్ ద్వారా ఉద్యోగులను తీసుకున్నారు. భారీ అభివృద్ధి ప్రాజెక్టులను రాష్ట్రపతి ఉత్తర్వుల పరిధిలోకి మొదట తీసుకురాలేదు. ప్రభుత్వం 1985, అక్టోబర్ 3న జారీచేసిన జోవో 455 ప్రకారం ఈ ప్రాజెక్టులన్నింటిని స్థానిక రిజర్వేషన్ కిందికి తీసుకువచ్చారు.
#ఈ భారీ నీటిపారుదల ప్రాజెక్టులన్నీ నీటిపారుదల ఆయకట్టు ప్రాంత అభివృద్ధి శాఖలో భాగం. కానీ వాటిని అధిపతుల కార్యాలయాలుగా గుర్తించి వాటిలో ఉద్యోగ నియామకాలు చేశారు. దీన్ని కమిషన్ తప్పు పట్టింది. వర్క్ చార్జ్డ్ ఉద్యోగులు రాష్ట్రపతి ఉత్తర్వుల పరిధిలోకి వస్తారని గాని, రారని గాని ప్రత్యేకంగా ఉత్తర్వుల్లో పేర్కొనలేదు. కానీ శాఖాధిపతుల కార్యాలయాలు, సచివాలయం మినహా మిగిలిన ఉద్యోగులను రాష్ట్రపతి ఉత్తర్వుల పరిధిలోకి తెచ్చారు. దీని ప్రకారం వివిధ శాఖల్లోని వర్క్ చార్జ్డ్ ఉద్యోగులు రాష్ట్రపతి ఉత్తర్వుల పరిధిలోకి వస్తారు. దీంతో ఆయా ప్రాజెక్టుల్లో ఇలాంటివారే ఎక్కువగా ఉంటారు.
# నీటిపారుదల, రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్, ఇంజినీరింగ్ శాఖల్లో వారు ఎక్కువగా ఉన్నారు. దాదాపు 40,870 మంది వర్క్ చార్జ్డ్ ఉద్యోగులున్నట్లు కమిషన్ గుర్తించింది. ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయిన తర్వాత కూడా వారిని అక్కడి నుంచి మార్చకుండా రెగ్యులరైజ్ చేశారు. ఇందులో ఎక్కువ భాగం పనిలేకుండా ఉన్నారు. వర్క్ చార్జ్డ్ ఉద్యోగుల్లో ఎంతమంది స్థానికులు, ఎంతమంది స్థానికేతరులు అనే వివరాలు లేవు. వీరందరికీ రాష్ట్రపతి ఉత్తర్వులను వర్తింపజేసి స్థానికులకు న్యాయం చేయాలని కమిషన్ సిఫారసు చేసింది.
ప్రమోషన్ల పేరుతో అక్రమాలు
#నాన్ గెజిటెడ్ పోస్టులను గెజిటెడ్ చేయాలన్నా, గెజిటెడ్ పోస్టులను రాష్ట్రస్థాయి గెజిటెడ్ పోస్టులుగా మార్పు చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి అనుమతి తీసుకోవాలి. అయితే గత 30 ఏండ్ల నుంచి చాలా డిపార్ట్మెంట్లలో కేంద్రప్రభుత్వ అనుమతి లేకుండానే నాన్ గెజిటెడ్ పోస్టులను గెజిటెడ్ పోస్టులుగా చేయడం, గెజిటెడ్ పోస్టులను స్టేట్ గెజిటెడ్ పోస్టులుగా మార్చడంతో స్థానిక రిజర్వేషన్లను కుదించారు. ఉదా: నాన్ గెజిటెడ్ పోస్టులకు రిజర్వేషన్ 70 శాతం. అయితే వాటిని గెజిటెడ్‌గా మార్చడంతో నిబంధనల ప్రకారం వాటికి 60 శాతం స్థానిక రిజర్వేషన్ వర్తించేది. అంటే తెలంగాణ వారికి 10 శాతం నష్టం కలుగుతుందన్నమాట. అక్రమంగా ఓపెన్ కోటాలోని ఉద్యోగాలను నాన్ లోకల్ వారికి రిజర్వ్ చేయడం వల్ల తెలంగాణకు నష్టం జరిగింది.
జలదృశ్యంపై పోలీసుల దాడి
#2002, ఫిబ్రవరి 2వ వారంలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజాప్రతినిధులకు తెలంగాణలోని వివిధ అంశాలపై శిక్షణ తరగతులు శ్రీరాంసాగర్ వద్దగల గెస్ట్‌హౌస్ ఆవరణలో రెండు రోజులు నిర్వహించింది. టీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ ప్రధాన ప్రసంగం చేయడంతోపాటు ఈ తరగతులను సమన్వయపరిచారు. ప్రొ. జయశంకర్, బీ జనార్దనరావు, వీ ప్రకాశ్, ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్లు కొందరు ఈ శిక్షణా తరగతుల్లో వివిధ అంశాలపై ప్రసగించారు. ముఖ్య నేతలంతా శ్రీరాంసాగర్ వద్ద ఉన్న సంగతి గ్రహించిన చంద్రబాబు టీఆర్ఎస్ కార్యాలయం ఉన్న జలదృశ్యంపై రెవెన్యూ పోలీసు అధికారులను పంపి దాడి చేయించి తన అక్కసు వెళ్లగక్కాడు. అంతకుపూర్వం జలదృశ్యం స్థలం తమదని ప్రభుత్వం కోర్టులో కేసు వేసింది.
# ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుకు ముందే జలదృశ్యం స్థలాన్ని కొనుక్కొని మున్సిపల్ నిబంధనల ప్రకారం ఇల్లు కట్టుకున్న కొండా లక్ష్మణ్ బాపూజీ, 45 ఏండ్లుగా నివాసం ఉన్నవారి ఇంటిని తప్పుడు రికార్డులు సృష్టించి ప్రభుత్వ స్థలమని ఉన్నత న్యాయస్థానాన్ని నమ్మించి తీర్పు అనుకూలంగా తెచ్చుకున్నది రాష్ట్ర ప్రభుత్వం. కనీసం గడువైనా ఖాళీ చేయడానికి బాపూజీకి ఇవ్వలేదు. జలదృశ్యంలో ఏడాదిగా ఉంటున్న టీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ఖాళీ చేయాలని ఏ హెచ్చరికా చేయలేదు.
#బాపూజీ ఢిల్లీలో ఉన్నారు. కేసీఆర్, పార్టీ నేతలంతా శ్రీరాంసాగర్ గెస్ట్‌హౌస్‌లో ఉండగా సెలవురోజు అకస్మాత్తుగా దాడి చేసి ఆఫీసు సామానంతా గోషామహల్ స్టేడియానికి తరలించారు. అడ్డుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలపై లాఠీచార్జ్ చేసి అరెస్ట్ చేశారు.
చేనేత కార్మికుల కోసం కేసీఆర్ భిక్షాటన
# భూదాన్ పోచంపల్లి గ్రామంలో కొందరు చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారి కుటుంబాలను ఆదుకోవడానికి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు భిక్షాటన చేసి ఒక్కో కుటుంబానికి రూ.50 వేలు అందించారు. 2002, ఆగస్ట్ 11న ఆలె నరేంద్ర నాయకత్వంలోని ‘తెలంగాణ సాధన సమితి’ టీఆర్ఎస్లో విలీనమైంది. పార్టీలో సెక్రటరీ జనరల్‌గా నరేంద్ర నియమితులయ్యారు.
#2002 సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 7 వరకు రెండువారాల పాటు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో పార్టీని, ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి టీఆర్ఎస్ పార్టీ పల్లెబాట కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమం అన్ని జిల్లాల్లో విజయవంతమైంది. 2002, అక్టోబర్ 26న నాగార్జున సాగర్ కుడి కాలువకు నీరు వదిలి, ఎడమ కాలువ ఆయకట్టును ఎండబెడుతున్న చంద్రబాబు ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వేల సంఖ్యలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ముగించుకొని కేసీఆర్ హైదరాబాద్ చేరకముందే అధికారులు ఎడమ కాలువకు నీరందించారు. ఈ సంఘటనతో టీఆర్ఎస్కి ప్రజల్లో మరింత ఆదరణ లభించింది.
తెలంగాణ జలసాధన సభ
#2002, డిసెంబర్ 25 నుంచి 2003 జనవరి 6 వరకు తెలంగాణ జలసాధన ఉద్యమాన్ని రోజుకొక కార్యక్రమం చొప్పున టీఆర్ఎస్ పార్టీ నిర్వహించింది. సాగునీటి రంగంలో తెలంగాణ జిల్లాలకు జరిగిన అన్యాయాలను పెద్ద ఎత్తున ప్రచారం చేసింది.
#టీఆర్ఎస్ ఆవిర్భావానికి ముందే తెలంగాణ ప్రముఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఎస్ ప్రభాకర్ దగ్గర నీటి లెక్కలు తీసుకొని వీ ప్రకాశ్ ‘నీరు మనం’ శీర్షికన వార్త దినపత్రికలో 2001, ఏప్రిల్, మే నెలల్లో తెలంగాణలోని దాదాపు అన్ని ప్రాజెక్టుల్లో జరిగిన అన్యాయాలపై విడివిడిగా వ్యాసాలు రాశారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై ఇవే తొలి వ్యాసాలు. 1969లో కూడా కేవలం పోచంపాడు, నాగార్జునసాగర్ ప్రాజెక్టులపై మాత్రమే వ్యాసాలు రాశారు. మిగిలిన ప్రాజెక్టుల్లో జరిగిన అన్యాయాలను ఎవరూ రాయలేదు. ప్రశ్నించలేదు. ప్రకాశ్ రాసిన వ్యాసాలు ప్రజలను ఆలోచింపజేశాయి.
# ఆ తరువాత ‘జలవిజ్ఞానం’ శీర్షిక ద్వారా వార్త దినపత్రికలో విద్యాసాగర్ రావు ధారావాహికంగా వ్యాసాలు రాశారు. వీరి రచనలు, జలసాధన ఉద్యమం తరువాత తెలంగాణలోని అక్షరం నేర్వని రైతుకు కూడా సాగునీటి లెక్కల గురించి మాట్లాడే చైతన్యం వచ్చింది.
#2003, జనవరి 6న జలసాధన ఉద్యమం ముగింపు సభ లక్షలాదిమందితో సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగింది. ఈ సభకు కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్, శిబూ సోరెన్, నేషనల్ అలయన్స్ ఫర్ పీపుల్స్ మూవ్మెంట్’ నాయకులు మేధాపాట్కర్ హాజరయ్యారు.
వరంగల్ జైత్రయాత్ర
# 2003, ఏప్రిల్ 27న టీఆర్ఎస్ రెండో వార్షికోత్సవ సభ ‘వరంగల్ జైత్రయాత్ర’ పేరుతో హన్మకొండ పట్టణంలో జరిగింది. దేశంలో ఇంతపెద్ద సభను మునుపెన్నడూ చూడలేదని మాజీ ప్రధాని దేవెగౌడ అన్నారు. ఈ సభకు ముఖ్య అతిథిగా దేవెగౌడతో పాటు అప్పటి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అజిత్ సింగ్ కూడా హాజరయ్యారు. విదర్భ ప్రత్యేక ఉద్యమ నాయకులు బన్వర్ లాల్ పురోహిత్, బుందేల్‌ఖండ్ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నాయకులు ప్రొ. బాబూలాల్ తివారీ ఈ సభలో పాల్గొన్నారు.
జాతీయ ఫ్రంట్
# 2003, సెప్టెంబర్ 9న కేసీఆర్ ఢిల్లీలో కొత్త రాష్ట్రాల ఏర్పాటు కోసం జాతీయ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు హరితప్రదేశ్‌ను కోరుతున్న అజిత్‌సింగ్, విదర్భ రాష్ట్రాన్ని కోరుతున్న బన్వర్‌లాల్ పురోహిత్, బుందేల్‌ఖండ్‌ను కోరుతున్న ప్రొ. బాబూలాల్ తివారీ, సినీ నటుడు రాజా బుందేలా, ఇతర రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు.
#సుదీర్ఘకాలం పోరాడిన తరువాత జార్ఖండ్ రాష్ట్రాన్ని సాధించుకున్న శిబూసోరెన్ ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కొత్త రాష్ట్రాల ఏర్పాటు కోసం ఎన్డీఏ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఈ సదస్సు నిర్ణయించింది. ఈ లక్ష్యం కోసం ప్రతినిధులందరూ కలిసి ‘నేషనల్ ఫ్రంట్ ఫర్ న్యూ స్టేట్స్’ సమాఖ్యను ఏర్పాటు చేశారు. దీనికి కన్వీనర్‌గా కేసీఆర్‌ను ఎన్నుకున్నారు.
మాదిరి ప్రశ్నలు
1. గిర్గ్లానీ ఏకసభ్య కమిషన్‌ను నియమించిన ముఖ్యమంత్రి?
1) వైఎస్ రాజశేఖర్ రెడ్డి
2) చంద్రబాబు నాయుడు
3) కిరణ్ కుమార్ రెడ్డి 4) రోశయ్య
2. 2002లో ఎవరి నాయకత్వంలోని ‘తెలంగాణ సాధన సమితి’ టీఆర్ఎస్లో విలీనమైంది?
1) ఆలె నరేంద్ర
2) వీ ప్రకాశ్
3) దేవేందర్ గౌడ్
4) ఎవరూకాదు
3. కింది వాటిలో సరైనవి?
1) ‘నీరు-మనం’ శీర్షికన వార్త దినపత్రికలో తెలంగాణలోని దాదాపు అన్ని ప్రాజెక్టుల్లో జరిగిన అన్యాయాలపై విడివిడిగా వ్యాసాలు రాసింది- వీ ప్రకాశ్
2) ‘జల విజ్ఞానం’ శీర్షిక ద్వారా వార్త దినపత్రికలో సాగునీటి రంగంలో తెలంగాణ రైతులకు జరుగుతున్న అన్యాయాలపై వ్యాసాలు రాసింది- విద్యాసాగర్ రావు
3) 1 4) 1, 2
4. ఉద్యోగాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను వివరిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులను 126 పద్ధతుల్లో ఉల్లంఘించారని చెప్పిన కమిషన్?
1) ఆఫీసర్స్ కమిటీ
2) సుందరేశన్ కమిటీ
3) గిర్గ్లానీ కమిషన్
4) పూం కమిషన్
5. కింది వాటిలో సరైనవి?
1) 2003, సెప్టెంబర్ 9న కేసీఆర్ ఢిల్లీలో కొత్త రాష్ట్రాల ఏర్పాటు కోసం జాతీయ సదస్సును నిర్వహించారు
2) ఈ సదస్సులో ప్రతినిధులందరూ కలిసి ‘నేషనల్ ఫ్రంట్ ఫర్ న్యూ స్టేట్స్’ సమాఖ్యను ఏర్పాటు చేశారు
3) ఈ సమాఖ్య కన్వీనర్‌గా కేసీఆర్‌ను ఎన్నుకున్నారు 4) పైవన్నీ సరైనవే
6. 2003, జనవరి 6న జలసాధన ఉద్యమం ముగింపు సభ లక్షలాదిమందితో సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్లో జరిగింది. ఈ సభకు హాజరైన ‘నేషనల్ అలయన్స్ ఫర్ పీపుల్స్ మూవ్మెంట్’ నాయకులు?
1) అరుంధతీ రాయ్ 2) మేధాపాట్కర్
3) సుందర్‌లాల్ బహుగుణ
4) పై అందరూ
సమాధానాలు
1-2, 2-1, 3-4, 4-3, 5-4, 6-2.
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ,
కోరుట్ల
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు