సంస్థానాలయుగం – తెలంగాణ సాహిత్యం
-కొటికెలపూడి వీరరాఘవ కవి (1663-1712) : వినుకొండ సంస్థానవాసి అయిన ఇతడు గద్వాల సంస్థానాధిపతి పెదసోమభూపాలుడిని ఆశ్రయించాడు. పెదసోమభూపాలుని కోరిక మేరకు మహాభారతంలోని ఉద్యోగపర్వాన్ని ఎనిమిది ఆశ్వాసాల ప్రబంధంగా రాశాడు.
– కవి తార్కిక సింహ శ్రీనివాసాచార్యులు ( 18వ శతాబ్దం): మహబూబ్నగర్ జిల్లాలోని జటప్రోలు సంస్థానం మంచాలకట్ట గ్రామం ఇతని జన్మస్థలం. ఇతడు సుమారు 60 గ్రంథాలు రాశాడు. వీటిలో ప్రధానమైనవి ఆచమప్రామాణ్య గమనిక, ఏకాదశి నిర్ణయం, శృత ప్రకాశిక, వాదావళి, మాధ్వమత శతదూషిణి, బ్రహ్మానందీయ ఖండనం మొదలైనవి.
– కవి తార్కిక సింహ వేదాంతచార్యులు (1694-1764) : ఇతడు మహబూబ్నగర్ జిల్లా జటప్రోలు సంస్థానానికి చెందిన మంచాలకట్ట వాసి. ఇతని రచనలు – రంగనాథ పంచాశత్, చతుర్భక్తి ప్రదీపిక, వాసోయజ్ఞోపవీత విచారం, రామత్రింశత్ స్తోత్రం, దశ నిర్ణయం, ఉపయుక్తాంశ సంగ్రహం, సత్క్రియా కల్పమంజరి మొదలైనవి.
– శ్రీనాథుని వెంకటరామయ్య : ఇతడు ఖమ్మం జిల్లాలోని అశ్వారావుపేట ప్రాంతవాసి. క్రీ.శ. 1700 కాలంవాడు. అశ్వారావుల చరిత్రను అశ్వారాయచరిత్ర లేక శ్రీరామ పట్టాభిషేకం పేరుతో కావ్యంగా రాశాడు. ఇది అలభ్యం.
– మరింగంటి నరసింహాచార్యులు (క్రీ.శ. 1700) : నల్లగొండ జిల్లాలోని అనుముల నివాసి. సంస్కృతంలో ‘శఠవైరి వైభవ దివాకరం’ అనే అలంకార శాస్త్ర గ్రం థాన్ని రాశాడు. పన్నెండు మంది ఆళ్వారుల్లో ప్రసిద్ధుడైన నమ్మళ్వారుకే శఠవైరి అని పేరు. నూరు అర్థాలంకారాలు లక్ష్య లక్షణ వ్యాఖ్యానయుక్తంగా చెప్పబడిన గ్రంథమిది. అలంకారాలన్నింటిలో శఠవైరి వైభవాన్ని వర్ణించాడు.
– ముదిగొండ బ్రహ్మయ లింగం (క్రీ.శ. 1700): ఈయన మెదక్ జిల్లాలోని టేకుమాలు నివాసి. శైవమత సంబంధమైన ‘శివరహస్య ఖండం’ అనే వచన కావ్యాన్ని రాశాడు. దీనికే తత్త ప్రకాశిని అను పేరున్నది. స్కాంధ పురాణంలోని శివరహస్య ఖండానికి ‘తత్తప్రకాశిని’ అనే పేరుతో టీకా రాశాడు.
– ఆయలూరు కందాళయార్యుడు (క్రీ.శ. 1700) : బోరవెల్లి సంస్థానాధిపతియైన ముష్ఠిపల్లి వేంకటభూపాలుని ఆస్థాన కవి ఇతడు. ‘అలంకార శిరోభూషణం’ అనే సంస్కృత అలంకార శాస్త్ర గ్రంథాన్ని రాశాడు.
– చరిగొండ హన్మయ్య (క్రీ.శ. 1700) : ఇతడు చిత్ర భారతం రచించిన చరిగొండ ధర్మన్న వంశానికి చెందినవాడు. మహబూబ్నగర్ జిల్లా చరిగొండ వాసి. ఇతడు ‘జ్యోతిష రత్నాకరం’ను రచించి రంగరాజు సింహాద్రికి అంకితమిచ్చాడు.
-మరింగంటి అప్పలదేశికులు (క్రీ.శ. 1730) : నల్లగొండ జిల్లా మునగాల మండలం నరసింహపురం వాసి, ఇతని రచనలు శ్రీరామపాదస్తుతి, శ్రీగోదాదేవిస్తుతి, అర్వపల్లి నరసింహ స్తోత్రం, స్తంభగిరి నరసింహసో్త్రత్రం మొదలైనవి.
-ప్రగడరాజు చెన్న కృష్ణ కవి (క్రీ.శ. 1738) : ఇతడు వనపర్తి సంస్థానానికి చెందినవాడు. తూముకుంట జన్మస్థలం. ఇతని రచనలు 1. సావిత్రి చరిత్ర 2. శ్రీకృష్ణ విలాసం 3. యాదవ భారతీయం. యాదవ భారతీయాన్ని జనుంపల్లి వల్లభరాయులకు శ్రీకృష్ణ విలాసాన్ని కొండమరాజు శ్రీనివాస సచివునికి అంకితమిచ్చాడు.
– సురపురం కేశవయ్య ( 1734-1819) : ఇతని అసలు పేరు నంచెరుమాళ్ల పురుషకారి కేశవయ్య. సురపురం సంస్థానంలో ఉండటం వల్ల సురపురం కేశవయ్య అనే పేరు వచ్చింది. ఆయన ఉత్తర రామాయణ కథనం తీసుకొని నిరోష్ఠ్యోత్తర రామాయణం (దాశరథి చరిత్ర)ను రాశాడు. దీనిని శ్రీకృష్ణునికి అంకితమిచ్చాడు.
– ధర్మపురి శేషాచలదాసు (శేషప్ప) (1735-1825) : ఇతని స్వస్థలం కరీంనగర్ జిల్లాలోని ధర్మపురి గ్రామం. ఇతని రచనలో సుప్రసిద్ధమైనది నరసింహశతకం, ఇతర రచనలు – నరహరి శతకం, నృకేసరి శతకం, అవనిజా చరిత్ర, ధర్మపురి రామాయణం.
– పరశురామ పంతుల రామమూర్తి (1740-1800) : ఇతడు పరశురామపంతుల లింగమూర్తి కుమారుడు. వరంగల్ సమీపంలోని మట్టెవాడ ఇతని నివాసం. తండ్రి అడుగుజాడల్లో పయనించి అనేక ఆధ్యాత్మిక రచనలు చేశాడు. ఇతని రచనలు – మహిజ్ మనోహర శతకం, ఈదులవాయ రామశతకం, పరశురామ శతక ద్వయం, సీతారామాంజనేయం (యక్షగానం), జీవన్ముక్తి ప్రకరణం (యక్షగానం), శుకచరిత్ర, వివేకసారం మొదలైనవి. సీతారామాంజనేయాన్ని తన తండ్రికి అంకితమిచ్చాడు.
– కుందావజల గోపాలకృష్ణ కవి : (1750-1820) : ఇతడు కరీంనగర్ జిల్లా జురాబాద్ తాలూకా ములకనూరు గ్రామానికి చెందినవాడు. ఇతని రచనలు – శ్రీకృష్ణజన్మ ఖండానికి మూలం బ్రహ్మ వైవర్త పురా ణం. తపతీ సంవరణుల వృత్తాంతం కలది సంవరణ చరిత్రం.
– రాపాక శ్రీరామకవి (1780) : ఇతడు నిజామాబాద్ జిల్లా పరకాల నివాసి. ఇతడు రచించిన యక్షగానం ఆధ్యాత్మరామాయణం.
– రాజా బహరీ పామనాయక భూపాలుడు ( 1752-1773): ఇతడు సురపురం సంస్థానాధిపతి. ఇతని అసలు పేరు రాఘవ భూపాలుడు. కవి పండిత పోషకుడే గాక స్వయంగా కవి. ఈయన భార్గవ పురాణం అనే ప్రబంధాన్ని రచించి వాగినగిరి వేణుగోపాలస్వామికి అంకితమిచ్చాడు.
– తిరునగరి వేంకటచార్యులు (1780) : ఇతడు హనుమ కొండ నివాసి. ఇతని రచన యతిరాజ శతకం, విశిష్టాద్వైత మత ప్రవర్తకం, రసవత్తారం.
-ముద్దు బాలంభట్టు (క్రీ.శ. 1780) : ఇతడు కరీంనగర్ జిల్లా మంథని ప్రాంతానికి చెందినవాడు. ఇతని రచన మంథని రామాయణం. ఇది వాల్మీకి రామాయణాన్ని అనుసరించి రాయబడింది. ముద్దు బాలంభట్టు రావణ వధ వరకే రాయగా ఇతని తమ్ముడు ముద్దయ్య రామపట్టాభిషేకం రాశాడు. ముద్దు బాలంభట్టు మరో పేరు బాయన్నభట్టు. ఇతడు రచించిన మరో యక్షగానం శివపురాణం. దీన్ని ఉమామహేశ్వర యక్షగానంగా పేర్కొన్నాడు.
– చింతపల్లి ఛాయపతి (1770) : ఇతని గురువు తిరుమల శ్రీనివాసాచార్యులు. దేవరకొండ సమీపంలోని బోయనపల్లి ఇతని నివాసం. ఇతడు రచించిన కావ్యం రాఘవాభ్యుదయం
-భల్లా పేరయ్య కవి (1750) : ఈయన ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ ప్రాంతానికి చెందినవాడు. ఇతడు రచించిన శతకం భద్రగిరి శతకం, ముస్లింల దండయాత్రల వల్ల భద్రాద్రి రామునికి కలిగిన కష్టాలను చూసి ఆ రాముడినే నిందిస్తూ రాసిన శతకం ఇది.
– ములుగు పాపయారాధ్యులు (క్రీ.శ 1750) : సంస్కృత దేవీ భాగవతాన్ని తెలుగులోకి అనువాదం చేసి కాశీ విశ్వనాథునికి అంకితం చేశాడు. ఇతడు రచించిన అచ్చ తెలుగు కావ్యం సర్వమధురం
– బంగారు రంగప్ప (క్రీ.శ. 1770) : ఇతడు విశ్వబ్రాహ్మణుడు. నల్లగొండ జిల్లా పిల్లలమరి వాసి. కాకతీయుల వద్ద సేనానాయకుడిగా ప్రసిద్ధిగాంచిన భేతాళరెడ్డి కథను స్వీకరించి ‘భేతాళ చరిత్ర’ అనే ద్విపద కావ్యాన్ని రాశాడు.
– కాణాదం పెదసోమయాజి (1762-93) : అభినవ భోజుడిగా ప్రసిద్ధిగాంచిన గద్వాల సంస్థాన ప్రభువు రాజ చినసోమభూపాలుని ఆస్థానంలో ఉన్న కవుల్లో ఇతడు సుప్రసిద్ధుడు. ఇతడు అభినవ అల్లసాని పెద్దనగా పేరొందాడు. ఇతని రచనలు – ముకుంద విలాసం, మత్స్యపురాణం (అనువాదం), శేషశైలేశలీల మొదలైనవి. చినసోమభూపాలుడు ప్రారంభించిన యథాశ్లోక తాత్పర్య రామాయణంలో బాలకొండను, ఆధ్యాత్మిక రామాయణాన్ని అనువదించాడు. నందవరీక బ్రాహ్మణుల చరిత్రను విప్రవంశం పేరుతో రాశాడు.
– చినసోమభూపాలుడు (1773-1794) : చినసోమభూపాలుని పాలనాకాలం గద్వాల సంస్థాన సాహిత్య చరిత్రలో స్వర్ణయుగంగా చరిత్రకారులు భావించారు. ఈయన రామాయణాన్ని యథాశ్లోక తాత్పర్య రామాయణంగా అనువదించాడు. హరిభట్టు సంస్కృతంలో రచించిన రతిశాసా్త్రన్ని తెలుగులోనికి అనువదించాడు.
– కామసముద్రం అప్పలాచార్యులు (1773-1794) : ఇతడు చినసోమభూపాలుని మరొక ఆస్థాన కవి. చదుర్విధ కవితా నిర్వాహకులు. రాజు కోరిక మేరకు యథాశ్లోక తాత్పర్య రామాయణంలోని కిష్కింధకాండను మూడు ఆశ్వాసాలలో రాశాడు. ఈ రామయణానికి అవతారికను ఇతడే రాశాడు.
-బోరవెల్లి శేషాచార్యులు (1773-1794) : ఇతడు చినసోమభూపాలుని మరో ఆస్థాన కవి. రాజు కోరిక మేరకు యథశ్లోక త్పాత్య రామాయణంలోని అయోధ్యకాండను 5 అశ్వాసాలలో రాశాడు.
-మల్లికార్జున సిద్ధయోగి (18వ శతాబ్దం) : అష్టాదశ పురాణాలకు సమాంతరంగా వెలువడిన కుల పురాణాల్లో ముఖ్యమైనది గౌడ పురాణం. మల్లికార్జున సిద్ధయోగి గౌడ పురాణాన్ని ద్విపదలో రాశాడు. గంగవాడ వంశీయులైన పినవీర భద్రుడు ఆలేరుకు సమీపంలోని కొలనుపాక ఇతని నివాసం. ఇక్కడ గల మఠాల్లో ఒకటైన గౌడ మఠానికి ఈ కవి అధికారి.
-ముష్ఠిపల్లి వేంకటభూపాలుడు (క్రీ.శ. 18వ శతాబ్దం): ఈయన రాజవోలు పాలకుడు. సంగీత, సాహిత్యాల్లో అసమాన పాండిత్యం కలవాడు. ఇతని రచనలు 1. దివ్యదేశ మహత్మ్య దీపిక (ద్విపద కావ్యం) 2. రాజవోలి వేంకటేశ్వర శతకం 3. రాజవోలి వేంకటేశ్వర కీర్తనలు. ఇతడు సుమారు 3476 కీర్తనలు రాశాడు. అన్నమయ్య తర్వాత ఇన్ని కీర్తనలు రచించిన మరో కవి లేడని కపిలవాయి లింగమూర్తి అభిప్రాయపడ్డారు.
– కిరీటి వెంకటాచార్యులు (18వ శతాబ్దం) : ఇతడు గొప్ప కవి, పండితుడు. ఇతనికి ఉన్న బిరుదులు ప్రతిదిన ప్రబంధ పరమేశ్వర, శ్లేషయమక చక్రవర్తి, తర్కాలంకార వాగీశ్వర మొదలైనవి. ఇతని రచనలు – గదాధరీయ ఖండం, శృంగార తరంగిణి, అలంకార కౌస్తుభం, రసిక మానసోల్లాస బాణం, శుకాభి పతనం, యతిరాజ దండకం, హయగ్రీవ దండకం, దశావతార స్తోత్రం, భావ శతకం, గజసూత్రవాదం, శృంగార లహరి మొదలైనవి.
– ముడుంబి వెంకటాచార్యులు (క్రీ.శ. 18వ శతాబ్దం): ఇతడు వరంగల్లు ప్రాంత వాసి. రస ప్రదీపిక అనే వైద్యశాసా్త్రన్ని, దేవహూతి విలాసం అనే కావ్యాలను రాశాడు.
– బొమ్మకంటి నరసింహ కవి (18వ శతాబ్దం) : ఇతడు రచించిన కావ్యం ధర్మాంగద చరిత్ర. ఇది ద్విపదలో రాయబడింది. ధర్మాంగద చరిత్ర ‘పాముపాట’ పేరుతో ప్రసిద్ధిగాంచింది.
-బోయ ధర్మయ్య కవి (18వ శతాబ్దం) : ఇతడు ఆదిలాబాద్ జిల్లా బాసర సమీపంలోని ‘ఓల’ అనే గ్రామానికి చెందినవాడు. ఈయన రచించిన యక్షగానాలు – బభ్రువాహన, హరిశ్చంద్ర, అభిమన్యు, డాంగ్నేయచరిత్ర, లవకుశ మొదలైనవి.
డా. తండు కృష్ణ కౌండిన్య
అసిస్టెంట్ ప్రొఫెసర్, తెలుగు శాఖ
దేవరకొండ, నల్లగొండ జిల్లా
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు