మొదటి సోలార్ రూఫ్‌టాప్ సిస్టమ్‌ను ఎక్కడ ఏర్పాటు చేశారు?
జాతీయ అంశాలు
రామ్సర్ సైట్లు అంటే: చిత్తడి నేలలతోనే జీవ వైవిధ్యం ఉంటుంది. దీనిని గుర్తించిన పర్యావరణవేత్తలు వాటిని పరిరక్షించాలని నిర్ణయించారు. ఇరాన్‌లోని రామ్సర్ ప్రాంతంలో చర్చలు జరిపి 1971లో ఒక ఒప్పందాన్ని అమల్లోకి తెచ్చారు. దీనినే రామ్సర్ ఒప్పందం అంటారు. భారత్ కూడా ఇందులో చేరింది. ఆస్ట్రేలియాలోని కౌబర్గ్ పెనిన్సులా ప్రపంచంలోనే తొలి రామ్సర్ సైట్‌గా గుర్తింపు పొందింది. అతి ఎక్కువ సైట్లు యూకేలో ఉన్నాయి. ఆ దేశంలో 175 చిత్తడి నేలలకు గుర్తింపు లభించింది. వైశాల్యం రీత్యా చూస్తే రామ్సర్ సైట్ల విస్తీర్ణం గరిష్ఠంగా బొలీవియాలో ఉంది. భారతదేశంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న సైట్లు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఒడిశాలోని చిలికా, రాజస్థాన్‌లోని కియోలాడియో ఘనా జాతీయ పార్క్‌లు భారత్‌లో తొలి రామ్సర్ సైట్లు. దేశంలో అతిపెద్ద రామ్సర్ చిత్తడి నేల.. పశ్చిమబెంగాల్లోని సుందర్బన్స్ కాగా, అతి చిన్నది రేణుక చిత్తడి నేల. ఇది హిమాచల్ ప్రదేశ్‌లో ఉంది.
ఓఈసీఎం సైట్
# హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో ఉన్న ఆరావళి జీవ వైవిధ్య పార్క్‌ను ఓఈసీఎం సైట్‌గా ఐయూసీఎన్ గుర్తించింది. ఓఈసీఎం అంటే అదర్ ఎఫెక్టివ్ ఏరియా బేస్డ్ కన్జర్వేషన్ మేజర్స్. ఐయూసీఎన్ అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వింగ్ నేచర్. ఏ ఒప్పందంలో భాగం కాకుండా, పర్యావరణానికి కీలకమైన ప్రదేశాలను ఈ విభాగంలో ఎంపిక చేస్తారు. ఇందులో భాగంగా భారత్ తరఫున ఎన్నికైన తొలి ప్రదేశం ఆరావళి జీవ వైవిధ్య పార్క్. ఇది 390 ఎకరాల్లో విస్తరించి ఉంది. 300 స్థానిక రకానికి చెందిన మొక్కలతో పాటు ఎన్నో జాతుల పక్షులకు ఇది ఆవాసం. ఈ ప్రాంత పరిరక్షణకు ‘ఐయామ్గుర్గావ్’ అనే ఒక స్వచ్ఛంద కార్యక్రమాన్ని స్థానికులు 2010లో ప్రారంభించారు.
భూ వారసత్వ ప్రదేశాలు
# హిమాచల్ ప్రదేశ్‌లోని శివాలిక్ శిలాజ పార్క్‌తో పాటు సిక్కింలోని స్ట్రొమేటోలైట్, డోలమైట్లతో ఏర్పడిన బక్సా ప్రాంతాన్ని భూ వారసత్వ ప్రదేశాలుగా జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. దీంతో దేశంలో ఈ తరహా సైట్ల సంఖ్య 34కు చేరింది.
జాతీయ యుద్ధ స్మారకం: అమర్ జవాన్ జ్యోతిని జాతీయ యుద్ధ స్మారకం (నేషనల్ వార్ మెమోరియల్)లో విలీనం చేశారు. వివిధ యుద్ధాల్లో పాల్గొని అమరులైన వారి కోసం న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నిర్మించిందే జాతీయ యుద్ధ స్మారకం. 1931లో బ్రిటిష్ వారు ‘అఖిల భారత యుద్ధ స్మారకం (ఆల్ ఇండియా వార్ మెమోరియల్)’ను నిర్మించారు. మొదటి ప్రపంచ యుద్ధంలో అమరులైన భారత సైనికుల స్మారకార్థం దీనిని ఏర్పాటు చేశారు. దీనికి దాదాపుగా 400 మీటర్ల దూరంలో జాతీయ యుద్ధ స్మారకాన్ని 2019 ఫిబ్రవరిలో ఆవిష్కరించారు. దాదాపు 40 ఎకరాల్లో ఇది నెలకొని ఉంది. ఇక్కడ 26,466 మంది అమర సైనికుల పేర్లను సువర్ణాక్షరాలతో లిఖించారు.
అమర్ జవాన్ జ్యోతి అంటే: బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో భాగంగా అమరులైన సైనికుల స్మారకార్థం 1971లో అమర్ జవాన్ జ్యోతిని వెలిగించారు. రాజ్‌పథ్ దగ్గరలోని గేట్ వద్ద ఇది ఉంది. 1972, జనవరి 26 నుంచి దీనిని వెలిగిస్తూనే ఉన్నారు. తాజాగా ఈ అమర్ జవాన్ జ్యోతిని జాతీయ యుద్ధ స్మారకంలో విలీనం చేశారు.
అతిపెద్ద జాతీయ పతాక ఆవిష్కరణ: ఖాదీని ఉపయోగించి రూపొందించిన ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ జెండాను జనవరి 15న భారత్-పాకిస్థాన్ సరిహద్దులో లొంగేవాలాలో భారత సైన్యం ఎగురవేసింది. ఏటా జనవరి 15న భారత సైనిక దినోత్సవంగా నిర్వహిస్తారు. తాజాగా ఎగురవేసిన జెండా సుమారు 1400 కేజీలు ఉంది. సుమారు 70 మంది ఖాదీ కళాకారులు 49 రోజుల పాటు శ్రమించి దీన్ని తయారు చేశారు.
సార్వత్రిక పింఛన్ పథకం: గిగ్ వర్కర్లకు సార్వత్రిక పింఛన్ పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వానికి చెందిన ఒక కమిటీ సూచించింది. గిగ్ వర్కర్లు అంటే ఏదైనా ఒక విధి నిమిత్తం నియామకమైన వాళ్లు. సంస్థ-ఉద్యోగి మధ్య సహజ బంధం వెలుపల ఉంటారు. ఉదాహరణకు జొమాటో, స్విగ్గీ తదితర వ్యవస్థల్లో పనిచేసే వాళ్లుగా భావించొచ్చు. ఇలాంటి వాళ్లకు సాంఘిక భద్రత కీలకమైంది. దేశంలో సాంఘిక భద్రత అనేది ప్రాథమిక హక్కు కాదు. కాని దీనిని ఆదేశిక సూత్రాల్లోని 41, 42 తదితర ప్రకరణల్లో పేర్కొన్నారు.
కొత్తగా రెండు రామ్సర్ సైట్లు
ఈ ఏడాది ఫిబ్రవరి 2న దేశంలోని రెండు కొత్త చిత్తడి నేలలను రామ్సర్ సైట్లలో చేర్చారు. అవి.. 1. ఖిజాడియా అభయారణ్యం (గుజరాత్) 2. బఖిరా అభయారణ్యం (ఉత్తరప్రదేశ్). వీటితో దేశంలో మొత్తం రామ్సర్ సైట్ల సంఖ్య 49కి చేరింది. ప్రస్తుతం దేశంలో రామ్సర్ సైట్ల విస్తీర్ణం 10,93,636 హెక్టార్లు. దక్షిణాసియాలో ఇదే గరిష్ఠం.
మాతృ మరణాల రేటు: ప్రతి లక్ష జననాలకు జరిగే మాతృ మరణాలను మాతృ మరణాల రేటు అంటారు. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన సమాచారం మేరకు, ఇవి దేశంలో క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఈ గణాంకాలను పరిశీలిస్తే..
2015-17లో 122 ఉండగా
2016-18లో 113
2017-19లో 103గా ఉంది
స్మార్ట్ సిటీస్ స్మార్ట్ అర్బనైజేషన్ సదస్సు: కేంద్ర పట్టణ వ్యవహారాలు, గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ ఈ సదస్సును సూరత్‌లో ఏప్రిల్ 18 నుంచి 20 వరకు నిర్వహించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఈ సదస్సు జరిగింది. ఇందులో అయిదు ఉపలక్ష్యాలను ఎంచుకొన్నారు. అవి.. 1) రీ ఇమేజింగ్ పబ్లిక్ ప్లేసెస్ 2) డిజిటల్ గవరెన్స్ 3) క్లెమేట్ స్మార్ట్ సిటీస్ 4) ఇన్నోవేషన్ 5) స్మార్ట్ ఫైనాన్స్.
సంకల్ప్ సే సిద్ధి: గ్రామాల్లో డిజిటల్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ఉద్దేశించిందే సంకల్స్ సే సిద్ధి. దీనికి సంబంధించిన సదస్సును ఏప్రిల్ మూడో వారంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. వన్ ధన్ వికాస్ కేంద్రాలను చేతనం చేయడం లక్ష్యంగా ఎంచుకొన్నారు.
అటల్ ఇన్నోవేషన్ పొడిగింపు: అటల్ ఇన్నోవేషన్ మిషన్‌ను మార్చి 2023 వరకు పొడిగించాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇందుకుగాను రూ.2000 కోట్లు వ్యయం చేయనున్నారు. సృజనాత్మకత, వ్యవస్థాపన సంస్కృతిని దేశంలో ప్రోత్సహించేందుకు ఉద్దేశించింది ఇది.
ఏవీఏఎస్ఏఆర్ (అవసర్) పథకం: దీనిని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రారంభించింది. స్వయం సహాయక సంఘాలు తమ ఉత్పత్తులను విమానాశ్రయాల్లో విక్రయించుకొనేందుకు ఉద్దేశించింది ఇది. ఏవీఎస్ఏఆర్ పూర్తి రూపం-ఎయిర్పోర్ట్ యాజ్ వెన్యూ ఫర్ స్కిల్డ్ ఆర్టిసాన్స్ ఆఫ్ ది రీజన్.
బెంగళూర్‌లో నాట్ గ్రిడ్ క్యాంపస్: నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ క్యాంపస్‌ను బెంగళూర్‌లో ప్రారంభించారు. ఉగ్రవాద చర్యలను నిరోధించేందుకు ఏర్పాటు చేసిన ఒక మేధోపరమైన వ్యవస్థే నాట్ గ్రిడ్. దాదాపు 21 ఇంటెలిజెన్స్ వ్యవస్థల సమన్వయం ఇందులో ఉంది.
ఉత్కర్ష్ మహోత్సవ్: దేశ వ్యాప్తంగా మాత్రమే కాకుండా, విదేశాల్లోనూ సంస్కృత భాష ఉన్నతికి ఉత్కర్ష్ మహోత్సవ్ సదస్సును కేంద్ర సంస్కృత విశ్వ విద్యాలయం కొత్త ఢిల్లీలో నిర్వహించింది.
కలాం వెబ్సైట్: స్థానిక సాహిత్యాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన కలాం వెబ్‌సైట్‌ను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆవిష్కరించారు. అనుభవజ్ఞులు, యువ రచయితలను ఇది ప్రోత్సహిస్తుంది.
భారత్ ఎన్నిక: అసొసియేషన్ ఆఫ్ ఏషియన్ ఎలక్షన్ అథారిటీస్‌కు సారథ్యం వహించేందుకు నిర్వహించిన ఎన్నికల్లో భారత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యింది. 2022-24 కాలానికిగాను భారత్ దీనికి నేతృత్వం వహిస్తుంది. ఈ ఎన్నికలను ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో నిర్వహించారు.
ఎన్సీఎఫ్ఎల్: హైదరాబాద్‌లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ పరిధిలోనే నేషనల్ సైబర్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించారు. సైబర్ కైమ్ నేరాలను అరికట్టేందుకు ఉద్దేశించింది ఇది.
టెంపుల్ 360: టెంపుల్ 360 పేరుతో ఒక వెబ్‌సైట్‌ను కేంద్ర సాంస్కృతిక మ్రంతి మీనాక్షి లేఖి ప్రారంభించారు. 12 జ్యోతిర్లింగాలతో పాటు చార్ ధామ్‌లో భాగం అయిన ప్రదేశాలను ఇంట్లో నుంచే వీక్షించేందుకు ఈ వెబ్సైట్ వీలు కల్పిస్తుంది. ఇందులో ఈ-దర్శన్, ఈ-ప్రసాద్, ఈ-ఆర్తి తదితర సదుపాయాలు ఉన్నాయి. భక్తులు తమకు వీలున్న సమయంలో వీటిని వీక్షించొచ్చు.
ఉత్సవ్ పోర్టల్: దేశంలోని వివిధ వేడుకలు, ఉత్సవాలను ప్రజలందరికీ చేరువ చేయడం కోసం ఉత్సవ్ పోర్టల్‌ను ప్రారంభించారు. ఏప్రిల్ 12, 13 తేదీల్లో న్యూఢిల్లీలో నిర్వహించిన అమృత్ సమాగమ్ అనే సదస్సులో భాగంగా ఈ వెబ్‌సైట్‌ను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు.
ప్రకృత్: ప్రకృత్ అనే మస్కట్‌ను కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఏప్రిల్ 5న ఆవిష్కరించారు. పౌరులు తమ జీవనంలో స్వల్ప మార్పులు చేసుకొని ఏ విధంగా ప్రకృతికి ఉపయోగపడవచ్చో తెలిపేందుకు ఉద్దేశించింది ఇది.
ఎఫ్ఏఎస్టీఈఆర్: ఉత్తర్వులను వేగంగా చేరవేసేందుకు ఎఫ్ఏఎస్టీఈఆర్ అనే వ్యవస్థను సుప్రీంకోర్ట్ ప్రారంభించింది. దీని పూర్తి రూపం- ఫాస్ట్ అండ్ సెక్యూర్డ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్టానిక్ రికార్డ్. సుప్రీంకోర్ట్ ఉత్తర్వులు, తీర్పులను వేగంగా చేరవేసేందుకు ఉద్దేశించింది ఇది.
సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణ: 11వ శతాబ్దపు భక్తి ఉద్యమకారుడు రామనుజాచార్య విగ్రహాన్ని హైదరాబాద్‌లోని ముచ్చింతల్‌లో ఏర్పాటు చేశారు. దీనికి సమతా మూర్తి లేదా స్టాచ్యు ఆఫ్ ఈక్వాలిటీ అని పేరు పెట్టారు. లోహంతో తయారై, కూర్చునే భంగిమలో ఉన్న విగ్రహాల్లో ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్దది. మొదటిది థాయిలాండ్‌లో ఉంది.
స్వచ్ఛ్ భారత్ సర్వేక్షణ్: స్వచ్ఛ్ సర్వేక్షణ్ ఎనిమిదో విడతను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. వృథా నుంచి సంపదను సృష్టించడమే దీని ప్రధాన లక్ష్యం. ఇది మూడు R లకు ప్రాధాన్యం ఇస్తుంది. అవి Reduce, Recycle, Re use.
డ్రోన్స్ ఉత్సవం: దేశపు అతిపెద్ద డ్రోన్ ఉత్సవాన్ని మే 27, 28 తేదీల్లో నిర్వహించారు. భారత్ డ్రోన్ మహోత్సవ్ పేరుతో జరిగిన ఈ వేడుకను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
పోర్టబుల్ సోలార్ రూఫ్‌టాప్ సిస్టమ్: దేశపు మొట్టమొదటి సోలార్ రూఫ్‌టాప్ సిస్టమ్‌ను గుజరాత్లో గాంధీనగర్‌లో ఉన్న స్వామి నారాయణ్ అక్షర్ధామ్ దేవాలయ ప్రాంగణంలో ప్రారంభించారు. న్యూఢిల్లీకి చెందిన సర్వోటెక్ పవర్స్ సిస్టమ్స్ లిమిటెడ్ దీనిని తయారు చేసింది.
వీర్ బాల్ దివస్: ఏటా డిసెంబర్ 26న వీల్ బాల్ దివస్‌గా నిర్వహించాలని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. 2022 నుంచి ఈ రోజును నిర్వహించనున్నారు. 17వ శతాబ్దంలో సిక్కు గురువు గురు గోవింద్ సింగ్ నలుగురు కుమారులు అమరులైన రోజు ఇది. అప్పట్లో వీరిని సజీవ సమాధి చేశారు.
ఏబీసీ విధానం: చదువు మధ్యలో ఒక విద్యా సంస్థ నుంచి మరో విద్యా సంస్థకు మారేందుకు స్వేచ్ఛ ఇచ్చే అకడమిక్ బ్యాంక్ ఆఫ్ క్రెడిట్ విధానానికి కేంద్ర విద్యా శాఖ శ్రీకారం చుట్టింది. విద్యార్థులు దక్కించుకున్న క్రెడిట్లను ఉన్నత విద్యా సంస్థలు ఒక డిజిటల్ నిధిలో భద్ర పరచడాన్ని ఏబీసీ విధానంగా వ్యవహరిస్తారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు