అక్రమంగా నియమితులైన ఆంధ్రా ఉద్యోగుల సంఖ్య?
ఆఫీసర్స్ (జయభారత్ రెడ్డి) కమిటీ
ఆరు సూత్రాల పథకం, రాష్ట్రపతి ఉత్తర్వులు ఉల్లంఘనకు గురయ్యాయని స్వామినాథన్ అధ్యక్షతన తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ చేసిన ఫిర్యాదుల వల్ల 1984లో ఎన్టీ రామారావు ప్రభుత్వం జయభారత్ రెడ్డి నాయకత్వాన ముగ్గురు ఐఏఎస్ అధికారుల కమిటీని నియమించింది. ఈ కమిటీలో ఉన్న మరో ఇద్దరు అధికారులు కమలనాథన్, ఉమాపతి రావు.
#ఈ కమిటీ తన విచారణలో ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో జరిగిన నియామకాల సందర్భంగా రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించినట్లు గమనించింది. చాలా ప్రభుత్వ శాఖలు ఈ కమిటీకి ఉద్యోగుల సర్వీస్ బుక్‌లను అందించలేదు. తమకు అందుబాటులో ఉన్న రికార్డులను పరిశీలించిన కమిటీ సభ్యులు 1 నుంచి 4 జోన్లకు సంబంధించిన సీమాంధ్ర ప్రాంతం వారిని 1975లో రాష్ట్రపతి ఉత్తర్వులు అమలైన నాటి నుంచి 1983-84 వరకు 58,962 ఉద్యోగాల్లో తెలంగాణ ప్రాంతంలో (5, 6 జోన్లలో) నిబంధనలకు విరుద్ధంగా నియమించారని ఈ కమిటీ 36 పేజీల నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.
# సహజంగానే తెలంగాణకు న్యాయం జరిగే అంశాలను తొక్కిపెట్టడానికి అలవాటుపడిన ఆంధ్ర పాలకులు మరో ఐఏఎస్ అధికారి సుందరేశన్ నాయకత్వంలో మరో కమిటీని వేశారు. సుందరేశన్ కమిటీ సిఫారసుల ఆధారంగా 1985, డిసెంబర్ 30న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 610 జీవోను వెలువరించింది. ఈ 610 జీవో 1986, మార్చి 31 నాటికి అమలు కావాలని ఆ జీవోలోనే పేర్కొన్నారు. కానీ వాస్తవంలో ఈ 610 జీవో ఎప్పటికీ అమలు కాకపోవడం వల్ల మలిదశ ఉద్యమానికి ఈ జీవో ప్రధాన అస్త్రంగా మారింది.
610 జీవో ముఖ్యాంశాలు
1) ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అమల్లోకి వచ్చిన రోజు నుంచి 610 జారీ అయ్యేనాటికి తెలంగాణ ప్రాంతంలోని జిల్లాల్లో, జోన్లలో నిబంధనలకు వ్యతిరేకంగా నియమించిన నాన్ లోకల్ ఉద్యోగులందరినీ వారి స్వస్థలాలకు 1986, మార్చి 31లోగా పంపించాలి. ఆయా ప్రాంతాల్లో అవసరమైతే అదనపు పోస్టులు (సూపర్ న్యూమరరీ) కల్పించాలి.
2) జూరాల, శ్రీశైలం ఎడమ కాలువ, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల కోసం నాన్ గెజిటెడ్ కేడర్లలో నియమించిన స్థానికేతరులందరినీ వారికి సంబంధించిన జోన్లకు బదిలీ చేయాలి.
3) రాష్ట్ర సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు ఇతర రాష్ట్ర స్థాయి కార్యాలయాల్లో ఉండే ఉద్యోగుల నియామకంలో అన్ని లోకల్ కేడర్లు (అంటే అన్ని ప్రాంతాల వారికి) సమన్యాయం జరగాలి.
4) బోగస్ సర్టిఫికెట్ల ద్వారా తెలంగాణ ప్రాంతపు ఎంప్లాయ్మెంట్ ఎక్సేంజీల్లో పేరు నమోదు చేసి అక్రమంగా ఉద్యోగాలు సంపాదించిన స్థానికేతరులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలి.
5) అక్రమ నియామకాలు, ప్రమోషన్లకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంతపు అభ్యర్థులు చేసుకున్న అప్పీళ్లన్నింటిని 1986, మార్చి 31లోగా పరిష్కరించాలి.
6) వివిధ లోకల్ ఏరియాలు, కేడర్ల మధ్య సిబ్బంది బదిలీలను విచ్చలవిడిగా చేయరాదు.
7) ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి జరిగిన నియామకాలు, ప్రమోషన్లు అన్నింటినీ పునఃపరిశీలించాలి. ఈ పనిని రాష్ట్ర సచివాలయంలోని విభాగాలు 1986, జూన్ 30లోగా పూర్తిచేయాలి.
తెలంగాణ అస్థిత్వం కోసం తపన
#1973 నుంచి 1983 మధ్యకాలంలో తెలంగాణ ఉద్యమకారులు కొంతమేరకు స్తబ్దుగా ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టిన అనంతరం ప్రత్యేక తెలంగాణ వాదుల్లో కదలిక వచ్చింది.
# 1983 నుంచే అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ప్రచారం చేస్తున్న తెలుగు జాతి భావనకు వ్యతిరేకంగా తెలంగాణ భావన ప్రజల్లో ప్రచారం చేయడానికి, తెలంగాణ అస్థిత్వాన్ని పరిరక్షించడానికి, ఆంధ్రుల పాలనలో ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలను వివరించడానికి ఆంధ్ర ఆధిపత్య వ్యతిరేక పోరాటానికి సన్నాహాలు మొదలయ్యాయి.
#1983 జనవరిలో శాసనసభకు జరిగిన ఎన్నికల్లో తొలిసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎన్నికైన టీడీపీ శాసన సభ్యుల్లో నారాయణరావు గౌడ్ ఫలితాలు వెలువడిన రోజే గుండెపోటుతో మరణించడంతో హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్ నియోజకవర్గానికి ఉపఎన్నిక అవసరమైంది. ఈ ఉపఎన్నికలో తెలుగుదేశం అభ్యర్థిగా స్థానికులను కాదని విజయవాడ నుంచి ఉపేంద్రను ఎంపిక చేశారు. దీనిపై మండిపడిన తెలంగాణ వాదులు 1969 ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్న జనసంఘ్ నాయకులు ఆలె నరేంద్రకు అనుకూలంగా ప్రచారం చేశారు.
# ఈ ప్రచారం సందర్భంలో ఆంధ్రుల వలసాధిపత్యానికి వ్యతిరేకంగా ప్రజల్లో ప్రచారం చేశారు. దీంతో ఉపేంద్ర ఓడిపోయాడు. తెలంగాణవాదిని గెలిపించడంతో 1969లో తెలంగాణ కోసం ఉద్యమించిన ప్రముఖులు మరోసారి ఉద్యమ నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభించారు.
తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో భాగంగా ఏర్పడిన సంస్థలు
తెలంగాణపై సార్వదేశిక్ ఆర్య ప్రతినిధి సభ -కమిషన్
#ఆర్యసమాజ్ అనుబంధ సంస్థ అయిన ‘సార్వదేశిక్ ఆర్య ప్రతినిధి సభ’ ఢిల్లీకి చెందిన తమ ప్రతినిధులు ఓం ప్రకాష్ త్యాగి, హెచ్‌కేఎస్ మాలిక్‌లతో ద్విసభ కమిషన్‌ను తెలంగాణ సమస్య పరిశీలన కోసం నియమించింది.
# ఈ కమిషన్ సభ్యులు తెలంగాణ ప్రాంతం లో విస్తృతంగా పర్యటించి, చాలామందిని కలిసి వివరాలు సేకరించి తమ నివేదికను 1985, నవంబర్ 22న వెలువరించారు. ఈ నివేదికలో వారు ‘ప్రత్యేక తెలంగాణ డిమాండ్’ న్యాయమైన ఆకాంక్షగా పేర్కొన్నారు. అప్పటి భారత ప్రధాని రాజీవ్‌గాంధీకి ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు’ కోరుతూ ఒక లేఖ రాసి తమ 10 పేజీల నివేదికను జతపర్చారు.
తెలంగాణ డెమొక్రటిక్ ఫ్రంట్
# హిమాయత్‌నగర్ ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్థి ఓటమి పొందడం వల్ల సంతోషించిన తెలంగాణవాదులు వైఎంసీఏ హాల్లో సదస్సును నిర్వహించారు. ఈ సదస్సు నిర్వహణలో స్టేట్ అడ్వయిజర్ పత్రిక సంపాదకుడు అయిన సత్యనారాయణ కీలక పాత్ర పోషించారు.
# ఈ సదస్సులోనే ఉద్యమ నిర్వహణ కోసం ‘తెలంగాణ డెమొక్రటిక్ ఫ్రంట్’ను ఏర్పాటు చేశారు. దీనికి కన్వీనర్‌గా సత్యనారాయణ ఎన్నికయ్యారు.
తెలంగాణ జనసభ
సత్యనారాయణ అధ్యక్షతన తెలంగాణ జనసభ ఏర్పడింది. తెలంగాణ జనసభ 1985, ఫిబ్రవరి ఆంధ్ర సారస్వత పరిషత్తు హాలులో సదస్సును నిర్వహించింది. ఈ సదస్సుకు అఖిల భారత ఆర్య సమాజ నాయకుడు వందేమాతరం రామచంద్రారావు అధ్యక్షత వహించారు.
ప్రతాప్ కిశోర్ ఢిల్లీ పాదయాత్ర
జర్నలిస్ట్ ప్రతాప్ కిశోర్ ప్రత్యేక తెలంగాణ అంశానికి దేశవ్యాప్త మద్దతు కోసం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి 1987, జూన్ 6న తన పాదయాత్రను చార్మినార్ నుంచి ప్రారంభించారు. ఆయనతో పాటు మిత్రులు షేర్‌ఖాన్, సయ్యద్ షహబుద్దీన్ పాల్గొన్నారు.
#నాగ్‌పూర్‌లో విదర్భ జర్నలిస్ట్ సంఘం వీరికి ఆతిథ్యం ఇచ్చి విదర్భ నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసింది. నాగ్‌పూర్ వరకు వీరి పాదయాత్ర చేరేసరికి ప్రతాప్ కిశోర్ పాదాలు పూర్తిగా వాచి కదలలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో పాదయాత్ర కొనసాగించే అవకాశం లేకపోవడంతో ఈ ప్రతినిధి వర్గం రైలు ప్రయాణం చేసి ప్రధానమంత్రికి, ఇతర కేంద్రమంత్రులకు తెలంగాణ ఆవశ్యకతపై వినతిపత్రాలు ఇచ్చారు.
మళ్లీ ఆవిర్భవించిన తెలంగాణ ప్రజాసమితి
# ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన అనంతరం ప్రతాప్ కిశోర్, మరికొందరు తెలంగాణ వాదులతో కలిసి 1987లో తెలంగాణ ప్రజాసమితిని పునరుద్ధరించారు. దీనికి అధ్యక్షుడిగా భూపతి కృష్ణమూర్తి (తెలంగాణ గాంధీ) ఎన్నికయ్యారు.
తెలంగాణ సంఘర్షణ సమితి
తెలంగాణకు వివిధ రంగాల్లో అన్యాయాలపై జనాన్ని కదిలించడానికి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమించడానికి మాజీ హోం మంత్రి కోహెడ ప్రభాకర్ రెడ్డి, మాజీ మంత్రి మేచినేని కిషన్ రావు ఆధ్వర్యంలో తెలంగాణ సంఘర్షణ సమితి 1989లో ఏర్పడింది.
తెలంగాణ సంఘర్షణ సమితి తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలపై శామీర్‌పేట వద్ద కొద్దిరోజుల పాటు అవగాహన తరగతులు నిర్వహించింది.
తెలంగాణ ముక్తిమోర్చా
తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన సంఘాల్లో తెలంగాణ ముక్తి మోర్చా కీలకమైంది. తెలంగాణ ముక్తిమోర్చా ఏర్పాటులో కీలకపాత్ర పోషించినవారు.. మేచినేని కిషన్ రావు (కన్వీనర్), పురుషోత్తం రెడ్డి, మదన్ మోహన్, సీహెచ్ లక్ష్మయ్య.
# తెలంగాణతో పాటు భారతదేశాన్ని చిన్న రాష్ట్రాలుగా విభజించాలని తెలంగాణ ముక్తిమోర్చా కోరింది. తెలంగాణ ముక్తిమోర్చా నిర్వహించే ఉద్యమానికి ఆంధ్ర ప్రాంతానికి చెందిన జస్టిస్ టీఎల్ఎన్ రెడ్డి వంటి నాయకులు కూడా మద్దతిచ్చారు.
ఓయూ ఫోరం ఫర్ తెలంగాణ ఆధ్వర్యంలో అధ్యాపకుల కృషి
# 1989 తర్వాత ఆవిర్భవించిన తెలంగాణ సంస్థల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని అధ్యాపకులు ప్రొఫెసర్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ఓయూ ఫోరం ఫర్ తెలంగాణ’ ముఖ్యమైనది. ఈ సంస్థ యూనివర్సిటీలోని అధ్యాపకుల్లో, విద్యార్థుల్లో తెలంగాణ భావజాల వ్యాప్తికి ఎంతో కృషి చేసింది. ప్రొఫెసర్లు మధుసూదన్, కేశవరావు జాదవ్, ఆనందరావు తోట, జయశంకర్, హరినాథ్, తిప్పారెడ్డి మొదలైన ఎందరో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఈ ఫోరం ద్వారా కృషి చేశారు. ఈ ఫోరం అనేకసార్లు సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యవంతం చేసి, తెలంగాణకు జరిగిన అన్యాయాలపై విస్తృత సమాచారాన్ని ప్రచురించింది.
మాదిరి ప్రశ్నలు
1. కింది వారిలో ఆఫీసర్స్ కమిటీలో సభ్యుడు కానివారు?
1) జయభారత్ రెడ్డి 2) కమలనాథన్
3) ఉమాపతి రావు 4) సుందరేశన్
2. ఏ కమిటీ సిఫారసులను అనుసరించి ఎన్టీఆర్ ప్రభుత్వం 610 జీవోను వెలువరించింది?
1) ఆఫీసర్స్ కమిటీ 2) సుందరేశన్ కమిటీ
3) గిర్గ్లానీ కమిషన్
4) ఆరుసూత్రాల పథకం
3. కింది వారిలో తెలంగాణ డెమొక్రటిక్ ఫ్రంట్ కన్వీనర్?
1) సత్యనారాయణ
2) మేచినేని కిషన్ రావు
3) కాళోజీ 4) ప్రతాప్ కిశోర్
4. తెలంగాణలో జరుగుతున్న అన్యాయాలపై శామీర్‌పేట వద్ద అవగాహన తరగతులు నిర్వహించిన సంస్థ?
1) తెలంగాణ ప్రజాసమితి
2) ఓయూ ఫోరం ఫర్ తెలంగాణ
3) తెలంగాణ సంఘర్షణ సమితి
4) తెలంగాణ జనసభ
5. తెలంగాణతో పాటు భారతదేశాన్ని చిన్న రాష్ట్రాలుగా విభజించాలని డిమాండ్ చేసింది?
1) తెలంగాణ ముక్తిమోర్చా
2) తెలంగాణ సంఘర్షణ సమితి
3) ఓయూ ఫోరం ఫర్ తెలంగాణ
4) తెలంగాణ జనసభ
6. కింది వాటిలో సరైనవి?
1) సార్వదేశిక ఆర్య ప్రతినిధి సభ తెలంగాణ సమస్య పరిశీలన కోసం ఒక ద్విసభ కమిషన్‌ను నియమించింది?
2) ఏ కమిషన్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ ప్రధాని రాజీవ్ గాంధీకి ఒక లేఖ రాసి తమ 10 పేజీల నివేదికను జతపర్చింది
3) 1 3) 1, 2
7. కింది వాటిని జతపర్చండి?
ఎ. తెలంగాణ జనసభ 1. సత్యనారాయణ
బి. తెలంగాణ ముక్తిమోర్చా
2. మేచినేని కిషన్ రావు
సి. ఓయూ ఫోరం ఫర్ తెలంగాణ
3. ప్రొఫెసర్ లక్ష్మణ్
డి. పునరుద్ధరించిన తెలంగాణ ప్రజాసమితి 4. భూపతి కృష్ణమూర్తి
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-బి, 2-ఎ, 3-డి, 4-సి
4) 1-డి, 2-బి, 3-సి, 4-ఎ
8. ప్రత్యేక తెలంగాణకు దేశవ్యాప్త మద్దతు కోసం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పాదయాత్ర చేసినది?
1) భూపతి కృష్ణమూర్తి 2) ప్రతాప్ కిశోర్
3) ప్రొఫెసర్ లక్ష్మణ్ 4) సత్యనారాయణ
9. ఎవరి అధ్యక్షతన టీఎన్జీవో యూనియన్ చేసిన ఫిర్యాదు వల్ల ఎన్టీఆర్ ప్రభుత్వం జయభారత్ రెడ్డి కమిటీని నియమించింది?
1) ఆమోస్ 2) స్వామినాథన్
3) కొలిశెట్టి రామదాసు 4) గోపాల్
10. కింది వాటిలో సరైనవి?
1) సుందరేశన్ కమిటీ సిఫారసుల ఆధారంగా 1985, డిసెంబర్ 30న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 610 జీవోను విడుదల చేసింది
2) ఈ జీవో 1986, మార్చి 31 నాటికే అమలు కావాలని ఆ జీవోలోనే పేర్కొన్నారు
3) 1 4) 1, 2
11. 1983లో ఎక్కడ జరిగిన ఉప ఎన్నికలో తెలంగాణ వాదిగా పేరుపొందిన జనసంఘ్ అభ్యర్థి ఆలె నరేంద్ర గెలుపొందారు?
1) హిమాయత్ నగర్ 2) సికింద్రాబాద్
3) అంబర్‌పేట 4) ముషీరాబాద్
12. జయభారత్ రెడ్డి కమిటీ నివేదిక ప్రకారం తెలంగాణలో అక్రమంగా నియమితులైన ఆంధ్ర ఉద్యోగుల సంఖ్య?
1) 37,690 2) 58,690
3) 58,962 4) 38,590
సమాధానాలు
1-4, 2-2, 3-1, 4-3, 5-1, 6-4, 7-1, 8-2, 9-2, 10-4, 11-1, 12-3.
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ,
కోరుట్ల
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు