అమలుకాని ఆరు సూత్రాల పథకం
ఉల్లంఘనలకు మారు పేరు సీమాంధ్ర సర్కార్. ముల్కీ నిబంధనలు, పెద్దమనుషుల ఒప్పందం, జీవో 36, అష్టసూత్రాలు, పంచసూత్రాలు, ఆరు సూత్రాలు, జీవో 610. వెనుకబడిన తెలంగాణ ప్రాంతానికి రక్షణలు కల్పించడానికి ఏర్పాటు చేసిన జీవోలు, ఒప్పందాలు. రాజకీయ ఆధిపత్యం, ఉద్యోగ ఆధిపత్యం కారణంగా తెలంగాణ ప్రాంతానికి కల్పించిన రక్షణలన్నీ మట్టిలో కలిసిపోయాయి. పెద్దమనుషుల ఒప్పందం తర్వాత నీలంసంజీవరెడ్డితో మొదలైన ఉల్లంఘనలు.. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం వరకు కొనసాగాయి. తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పాటు చేసిన రక్షణలు, కమిషన్లు, కమిటీలు దేశంలో ఏ రాష్ట్రం కోసం వేసి ఉండకపోవచ్చు. అయినా సీమాంధ్రుల ఆధిపత్యం ముందు ఏవీ నిలబడలేకపోయాయి. ఏకంగా ఓపెన్ కోటాను నాన్‌లోకల్ కోటాగా మార్చుకున్న ఘనులు సీమాంధ్రులు. లేని ఫ్రీజోన్‌ను సృష్టించారు. ఆరు జోన్లను ఏడు జోన్లుగా మార్చారు. చివరకు దోపిడీకి కూడా ఒక లెక్క ఉంటుంది. ఆ లెక్కదాటినప్పుడు ప్రజలు తిరగబడతారు. పోరాటం చేస్తారు. సాధించుకుంటారు. చివరగా అదే జరిగింది. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించింది. ఆరు సూత్రాల పథకంలో ఎలా అన్యాయం జరిగిందో ప్రొ. లక్ష్మణ్ అందిస్తున్న ప్రత్యేక వ్యాసం.. గ్రూప్స్ విద్యార్థుల కోసం..
ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల నాయకులతో సంప్రదించిన పిదప ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆరుసూత్రాల పథకాన్ని 23 సెప్టెంబర్ 1973లో ప్రకటించింది. దీంతో అప్పటి వరకు అమల్లో ఉన్న ముల్కీ నిబంధనలు రద్దయి, దానిస్థానంలో ఆరుసూత్రాల పథకం రాష్ట్రపతి ఉత్తర్వులతో అమల్లోకి వచ్చాయి.
ఆరు సూత్రాల పథకం 1973
1. రాష్ట్రంలోని వెనుకబడ్డ ప్రాంతాల సత్వర అభివృద్ధితో పాటు రాష్ట్ర రాజధానిని నిర్ణీత పద్ధతిలో అభివృద్ధిపర్చడానికి కచ్చితమైన నిధులను కేటాయించాలి. అటువంటి ప్రణాళికలను తయారుచేయడంలో వెనుకబడిన ప్రాంతానికి ప్రాతినిథ్యం వహించే ఎమ్మెల్యేతో పాటు కొందరు నిపుణులకు భాగస్వామ్యం కల్పిస్తూ ఒక రాష్ట్రస్థాయి ప్రణాళికా బోర్డును, వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించిన ఉపసంఘాలను నియమించాలి.
2. విద్యా సంస్థల్లో స్థానిక అభ్యర్థులకు ప్రాధాన్యతనిచ్చే విషయంలో రాష్ర్టానికంతా ఒకే విధానాన్ని వర్తింపజేయాలి. రాష్ట్రంలో ముఖ్యంగా రాజధాని నగరంలో ఉన్నత విద్యావసతులు పెంచేందుకు ఒక కేం ద్రీయ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలి.
3. ఒక నిర్ణీత స్థాయి వరకు ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల విషయంలో స్థానికులకే ప్రాధాన్యమివ్వాలి. ప్రమోషన్ల విషయంలో కూడా ఒక నిర్ణీత స్థాయి వరకు ఈ నిబంధన పాటించాలి.
4. ఉద్యోగ నియామకాలు, సీనియారిటీ, ప్రమోషన్ వంటి విషయాల్లో ఉత్పన్నమయ్యే ఫిర్యాదులను పరిశీలించేందుకు ఉన్నతాధికారాలు గల ఒక అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఇచ్చే నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం విధిగా అమలుపర్చాలి.
5. పైన వివరించిన సూత్రాలను పాటించడంలో ఎదురయ్యే న్యాయపరమైన చిక్కులను అనిశ్చిత పరిస్థితులను నివారించేందుకు భారత రాజ్యాంగాన్ని తగువిధంగా సవరించే అధికారాన్ని రాష్ట్రపతికి కల్పించాలి.
6. పైన సూచించిన మార్గాన్ని అవలంబిస్తే ముల్కీ నిబంధనలు, తెలంగాణ ప్రాంతీయ కమిటీ కొనసాగింపు అనవసరమవుతాయి.
ఆరుసూత్రాల పథకంతో స్థానికత నాలుగేళ్లకు కుదింపు
-ఆరుసూత్రాల పథకం అమల్లోకి వచ్చిన పిదప ఈ పథకంలోని ఆరో సూత్రం ప్రకారం అప్పటి వరకు అమల్లో ఉన్న ముల్కీ నిబంధనలు, రీజనల్ కమిటీ రద్దయ్యాయి. ఈ పథకం అమలుతో స్థానికుడు కావడానికి కనీసంగా కావల్సిన నివాస అర్హత తగ్గింది. 1919 నుంచి అమల్లోకి వచ్చిన ముల్కీ నిబంధనల ప్రకారం స్థానిక అభ్యర్థి అంటే కనీస నివాసం పదిహేను సంవత్సరాలుగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటుతో 1956లో పన్నెండు సంవత్సరాలకు కుదించారు. 18-10-75 నుంచి జారీ అయిన రాష్ట్రపతి ఉత్తర్వుల అమలుతో పన్నెండు సంవత్సరాలుగా ఉన్న కనీస నివాస అర్హత నాలుగు సంవత్సరాలకు కుదించబడింది. ఈ నివాసాన్ని సైతం ఆయా సంబంధిత జోన్లకు పరిమితం చేశారు.
-ఈ ఆరుసూత్రాల పథకంలోని మొదటి అంశం తెలంగాణలాంటి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రణాళిక బోర్డులను నియమించడం. తెలుగుదేశంపార్టీ అధికార పగ్గాలు చేపట్టిన పిదప 1985లో తెలంగాణ వంటి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం నిర్దేశించిన ప్రణాళిక బోర్డులను ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వంతో కూడా సంప్రదించకుండా రద్దు చేశారు. ఆరు సూత్రాల పథకంలో భాగంగా ఉన్న ఈ ప్రణాళికబోర్డులను రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? అంతే గాకుండా ఈ పథకంలోని రెండో అంశం హైదరాబాద్ నగరంలో విద్యావసతులను పెంచేందుకు కేంద్రీయ విశ్వవిద్యాలయా న్ని నెలకొల్పటం. కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని మాత్రం హైదరాబాద్‌లోనే నెలకొల్పారు. కానీ, అందులోని బోధన, బోధనేతర సిబ్బందితో పాటు విద్యార్థుల్లో కూడా తెలంగాణ ప్రాంతంవారు నామమాత్రమే. అంటే 20 శాతం కూడా మించి లేరు. ఇక ఆరో సూత్రం ప్రకారం అప్పటి వరకు అమల్లో ఉన్న ముల్కీ నిబంధనలు, తెలంగాణ ప్రాంతీయ కమిటీ రద్దు అవుతాయన్నారు. పేరుకు మాత్రమే ఇది ఆరు సూత్రాల పథకం కానీ ఆచరణలో ఉన్నవి ఉద్యోగాల నియామకాలకు సంబంధించిన మూడో, నాల్గో అంశం మాత్రమే. మొదటి నుంచి తెలంగాణ అభివృద్ధికి నిర్దేశించిన సూత్రాలను రద్దుచేస్తూ తెలంగాణకు నష్టం కలిగించే సూత్రాలేమైనా ఉంటే వాటిని అమలు చేస్తూ వస్తున్నారు.
ఆర్టికల్ 371 డితో ఆరుజోన్ల వ్యవస్థ
-ఈ ఆరుసూత్రాల పథకానికి రాజ్యాంగ రక్షణ కోసం 32వ రాజ్యాంగ సవరణతో ఆర్టికల్ 371 డిని రాజ్యాంగంలో పొందుపర్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఉద్యోగరంగం, విద్యారంగంలో సమన్యాయం చేసేందుకు నిర్ణయించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 371 డికి అనుగుణంగా 18-10-1975లో కేంద్ర ప్రభుత్వం జీవో.నెం.674 ద్వారా రాష్ట్రపతి ఉత్తర్వులను జారీచేసింది. దీని ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాన్ని ఉద్యోగ నియామకాల కోసం ఆరు జోన్లుగా విభజించారు. జోన్లు 1, 2,3 ఆంధ్రప్రాంతానికి సంబంధించినవి కాగా జోన్ 4 రాయలసీమది, జోన్ 5, 6 తెలంగాణవిగా ఇందులో పేర్కొన్నారు. ఈ రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఏ జోను వారు ఆ జోనుకే స్థానిక అభ్యర్థులు, మిగతా జోన్లకు స్థానికేతరులన్నమాట. స్థానిక అభ్యర్థి అంటే కనీస నివాస అర్హత నాలుగు సంవత్సరాలుగా ఇందులో పేర్కొన్నారు.
రాష్ట్రపతి ఉత్తర్వుల్లో మినహాయింపు పొందిన ఈ కార్యాలయాల్లో 1975కు పూర్వం తెలంగాణ ఉద్యోగులే అధికంగా ఉండేవారు. ఉత్తర్వులు అమల్లోకి వచ్చిన పిదప ఈ కార్యాలయాల సంఖ్యను పెం చుతూ క్రమంగా వీటిని స్థానికేతరులతో భర్తీ చేయడంతో స్థానిక తెలంగాణ ఉద్యోగుల సంఖ్య తగ్గి స్థానికేతరుల సంఖ్య పెరిగింది. స్థానికులకు సముచిత ప్రాతినిథ్యం కూడా వీటిలో లభించకుండా చేశారు. దీంతో సచివాలయం వంటి కార్యాలయాల్లో తెలంగాణ ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గి 20 శాతానికి చేరుకుంది.
-రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని పేరా 14లో పొందుపర్చిన ఆఫీస్లన్నింటికీ స్థానిక రిజర్వేషన్ నుంచి మినహాయింపు ఇచ్చినప్పటికీ రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా తేదీ.11-1-1975న జారీ చేసిన జీవో. నెం. 728 జీ.ఏ.డీ.ఏ.పీ.లోని పేరా రెండు ప్రకారం మినహాయింపు పొందిన రాష్ట్ర సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, రాష్ట్రస్థాయి కార్యాలయాల్లోని ఉద్యోగ నియామకాలు, బదిలీల్లో అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేసేందుకు ఈక్విటబుల్ షేర్ లేదా సమన్యాయ సూత్రాన్ని పాటించాలని ఉత్తర్వులు ఇచ్చారు.
-రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా జారీ అయిన మరో జీవో. నెం.729 పేరా 21లో రాష్ట్ర సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, రాష్ట్రస్థాయి ఆఫీసుల్లో జరిగే ఉద్యోగ నియామకాల్లో ఫేర్ షేర్ సూత్రాన్ని పాటించి అన్ని ప్రాంతాల నుంచి సమ పద్ధతుల్లో నియామకాలు జరగాలి అని పేర్కొన్నది. వీటన్నింటిని ఉల్లంఘించి నియామకాలు చేపట్టారు.
-ఈ జీవోల ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వుల నుంచి మినహాయింపు పొందిన ఈ కార్యాలయాలన్నింటిలో తెలంగాణవాళ్లకు సముచిత వాటా లేదా ప్రాతినిథ్యం న్యాయబద్ధ్దంగా దక్కాలి. సముచిత వాటా అంటే జనాభా ప్రాతిపదికన తెలంగాణకు దక్కాల్సిన వాటా 42 శాతం. ఈ కార్యాలయాల్లో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు 20 శాతం ఉన్నారంటే అదనంగా తెలంగాణవాళ్లకు న్యాయబద్దంగా రావాల్సిన వాటా 22 శాతం అన్నమాట. అవీ దక్కకుండా పోయాయి.
ఓపెన్ కోటాను నాన్‌లోకల్ కోటాగా మార్చేశారు
-రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగాలన్నీ జోన్లవారీగా రిజర్వు చేయబడినవి. అంటే ఏ జోను వారు ఆ జోనుకే స్థానిక అభ్యర్థులు మిగతా జోన్లకు స్థానికేతరులన్నమాట. స్థానిక అభ్యర్థి అంటే కనీస నివాస అర్హత నాలుగు సంవత్సరాలుగా పేర్కొన్నారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగ నియామకాలను ఈ విధంగా చేపట్టాల్సి ఉంది. (1) జిల్లా స్థాయి కేడర్లలో ఎల్.డి.సి. లేదా ఎల్.డి.సి.తో సమానమైన ఉద్యోగాలు, ఎల్.డి.సి. కింది స్థాయి ఉద్యోగాల్లో 80 శాతం ఉద్యోగాలను ఆ జిల్లా వాళ్లకే రిజర్వు చేయాలి. (2) జోనల్ స్థాయి నాన్ గెజిటెడ్ పోస్టుల్లో ఎల్.డి.సి. కంటే పై స్థాయి నాన్ గెజిటెడ్ ఉద్యోగాల్లో 70 శాతం రిజర్వేషన్ ఆ సంబంధిత జోనువాళ్లకు కల్పించాలి. (3) జోనల్ స్థాయి గెజిటెడ్ పోస్టుల్లో 60 శాతం రిజర్వేషన్‌ను ఆ జోనులోని అభ్యర్థులకే కల్పించాలని పేర్కొంటున్నాయి. స్థానిక అభ్యర్థులకు రిజర్వు చేసిన ఉద్యోగాలు పోగా అంటే జిల్లా స్థాయి పోస్టుల్లో స్థానిక జిల్లావాళ్లకు రిజర్వు చేసిన 80 శాతం పోగా మిగతా 20 శాతం ఉద్యోగాల్లో, జోనల్ నాన్ గెజిటెడ్ ఉద్యోగాల్లో ఆ జోనువాళ్లకు రిజర్వు జేసిన 70 శాతం ఉద్యోగాలు పోగా మిగతా 30 శాతం ఉద్యోగాలను అదే విధంగా జోనల్ గెజిటెడ్ పోస్టుల్లో ఆ జోనువాళ్లకు రిజర్వు చేసిన 60 శాతం ఉద్యోగాలు పోగా మిగతా 40 శాతం ఉద్యోగాలన్నింటినీ ఓపెన్ కాంపిటీషన్ ద్వారా భర్తీ చేయాలి. వాటిని స్థానికేతరులకు రిజర్వు చేయరాదు. వాటికి స్థానిక, స్థానికేతర అభ్యర్థులందరూ అర్హులే. ప్రతిభను ప్రాతిపదికగా తీసుకుని స్థానిక, స్థానికేతరుల్లో ఎవరు ప్రతిభావంతులైతే వారికే ఆ ఉద్యోగాన్ని కట్టబెట్టాలి. ఇది పాటించాల్సిన పద్ధతి. కాని దీనికి భిన్నంగా తెలంగాణ జోన్లయినటువంటి 5,6 ల్లో స్థానికులకు రిజర్వు చేసిన ఉద్యోగాలు పోగా మిగతా వాటిని ఆంధ్ర జోన్లయినటువంటి 1, 2, 3 లకు చెందిన వారితో నింపారు. కాని ఆంధ్ర జోన్లయినటువంటి 1, 2, 3 ల్లో మాత్రం అలా చేయలేదు. ఆంధ్రజోన్లయినటువంటి 1, 2, 3 ల్లో మాత్రం నూటికి నూరు శాతం ఆ జోన్ల వారితోనే నింపారు. ఈ విధంగా ఉద్యోగ నియామకాలు చేపట్టడం వల్లనే తెలంగాణ జోన్లయినటువంటి 5, 6 ల్లో స్థానికేతర ఉద్యోగుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఈ విధంగా ఉద్యోగ నియామకాలు చేయడం తప్పు అన్న విషయాన్ని ప్రభుత్వం వారి U.o.Note no. 237/SPF-A/852 సైతం స్పష్టం చేసింది.
– రాష్ట్రపతి ఉత్తర్వుల్లో స్థానికులకు రిజర్వేషన్ ఉంది. కానీ స్థానికేతరులకు రిజర్వేషన్ లేదు. స్థానికేతర కోటాగా భావింపబడుతున్నది ఓపెన్ కోటా. దానికి పోటీపడేందుకు స్థానికులు, స్థానికేతరులు ఇద్దరూ అర్హులే. ప్రతిభ ఆధారంగా ఆ కోటా భర్తీ చేయాలి. ఎవరు ప్రతిభావంతులైతే వారికే పట్టం గట్టాలి. వాస్తవానికి ఇది ఒక విధంగా అన్ రిజర్వుడ్ రిజర్వేషన్ అన్న విషయాన్ని గమనించాలి.
-రాష్ట్రపతి ఉత్తర్వులోని పేరా 5 ప్రకారం జిల్లా స్థాయి ఉద్యోగాల్లో జిల్లాను జోనల్ స్థాయి ఉద్యోగాల్లో జోన్‌ను యూనిట్‌గా తీసుకుని నియామకాలు గాని పదోన్నతులు గాని లేదా ఉద్యోగుల బదిలీలుగాని జరగాలి. ఎట్టి పరిస్థితుల్లో జిల్లాస్థాయి ఉద్యోగాల్లో ఒక జిల్లా నుంచి ఇంకొక జిల్లాకు, జోనల్ స్థాయి ఉద్యోగాల్లో ఒక జోన్ నుంచి ఇంకొక జోన్‌కు బదిలీలు చేయకూడదు అనే నిబంధనలున్నా వాటిని ఉల్లంఘించి నియామకాలు పదోన్నతలు బదిలీలు చేయడంతో పెక్కుమంది తెలంగాణ ఉద్యోగులు న్యాయం కోసం కోర్టులను ఆశ్రయించిన ఉదంతాలు చాలా ఉన్నాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు