‘ఇన్ఫినిటీ బ్రిడ్జి’ని ఏ దేశంలో నిర్మించారు? (అన్ని పోటీ పరీక్షలకు..)
ప్రతి పోటీ పరీక్షల్లో జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ సమకాలీన అంశాలపై ప్రశ్నలు అడుగుతున్నారు. ప్రపంచంలో ఎత్తయినవి, చిన్నవి, వార్తల్లో ప్రముఖంగా నిలిచిన వ్యక్తులు, ఇతర దేశాల్లో చేపట్టిన శాటిలైట్, మిసైల్ ప్రయోగాలు తదితర అంశాలు వస్తాయి. ఈ నేపథ్యంలో నిపుణ పాఠకుల కోసం జనవరి నుంచి భారత్ ఇతర దేశాలతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలు, ఇతర అంశాల గురించి అందిస్తున్నాం.
నేపాల్:
ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఎవరెస్ట్ పర్వతంపైన ఏర్పాటు చేసిన ‘వెదర్ స్టేషన్’ అందుబాటులోకి వచ్చింది. ఈ స్టేషన్‌ను 8,830 మీటర్ల ఎత్తులో నేషనల్ జియోగ్రాఫిక్ సొసైటీకి చెందిన నిపుణులు ఏర్పాటు చేశారు. వాతావరణానికి సంబంధించి ఉష్ణోగ్రత, గాలి వేగం-దిశ, వాయు పీడనం, మంచు ఉపరితల ఎత్తులో వచ్చే మార్పులను ఈ వెదర్ స్టేషన్ ద్వారా తెలుసుకునే వీలుంది.
మహాకాళీ నది:
భారత్, నేపాల్ దేశాలను కలుపుతూ మహాకాళీ నదిపై ఒక వంతెన నిర్మాణానికి కేంద్ర క్యాబినెట్ జనవరి 6న ఆమోదం తెలిపింది. ఈ వంతెన ఉత్తరాఖండ్‌లోని దార్చుల అనే ప్రాంతాన్ని నేపాల్‌తో కలుపుతుంది. దీన్ని మూడు సంవత్సరాల్లో పూర్తిచేయనున్నారు. ఈ నదిని ఉత్తరాఖండ్‌లో శారదా నది లేదా కాళిగంగా నది అని కూడా అంటారు. గంగా నదికి ఇది ఉపనది.
లిస్టెడ్ సంస్థ:
దక్షిణాసియాలో లిస్టెడ్ సంస్థల్లోని బోర్డుల్లో అత్యధిక సంఖ్యలో మహిళలను కలిగి ఉన్న దేశంగా బంగ్లాదేశ్ నిలిచింది. ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, ఢాకా స్టాక్ ఎక్సేంజ్ లిమిటెడ్‌లు ఈ మేరకు నివేదికను వెలువరించాయి. 2020లో ఆ దేశంలో లిస్టెడ్ కంపెనీల్లో మహిళల శాతం అయిదు ఉండగా, తాజాగా అది ఆరు శాతానికి పెరిగింది.
ఇండోనేషియా:
అన్నింటికంటే పెద్ద దీవి దేశం ఇది. ఈ దేశం తన రాజధానిని జకర్తా నుంచి నుసంతరాకు మార్చింది. జావనీస్ భాషలో నుసంతరా అంటే దీవుల సముదాయం (ఆర్చిపెలాగో) అని అర్థం. ఇండోనేషియా స్వాతంత్య్రం పొందిన నాటి నుంచి జకర్తానే రాజధాని. అయితే అక్కడ జనాభా విపరీతంగా పెరగడం, ఇరుకైన రహదారులు ఉండటం వల్ల రాజధానిని మార్చారు.
వియత్నాం:
ప్రపంచంలోనే అతిపెద్ద గ్లాస్ బాటమ్ బ్రిడ్జిని వియత్నాం మే నెలలో అందుబాటులోకి తెచ్చింది. 150 మీటర్ల ఎత్తులో 636 మీటర్ల పొడవుతో ఈ బ్రిడ్జి ఉంది. గతంలో 526 మీటర్ల పొడవుతో నిర్మించిన అతిపెద్ద గ్లాస్ బాటమ్ బ్రిడ్జి చైనాలో ఉంది. ఈ రెండు కూడా వేలాడే వంతెనలు.
శ్రీలంక:
శ్రీలంక ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది. విపరీతంగా ద్రవ్యోల్బణం పెరగడంతో అక్కడి ప్రజలు ఉద్యమబాట పట్టారు. ప్రధానితో సహా అందరూ తమ పదవులకు రాజీనామా చేశారు. గతంలో అధికారంలో ఉన్న రాజపక్స ప్రభుత్వం భారీగా పన్నులను తగ్గించింది. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే తర్వాతి కాలంలో కొవిడ్-19 విజృంభించడంవల్ల శ్రీలంక ఆదాయం భారీగా తగ్గింది. విదేశీ మారక నిల్వల సమస్య కూడా వచ్చింది. అదేవిధంగా సేంద్రియ ఎరువుల విధానానికి శ్రీలంక మళ్లింది. అకస్మాతుగా ఈ నిర్ణయం తీసుకుంటూ అన్ని రకాల రసాయన ఎరువులను నిషేధించారు. దాంతో ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గి, డిమాండ్ పెరగడం ధరల పెంపునకు దారితీసింది. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి శ్రీలంకలో విదేశీ మారక నిల్వలు కేవలం 2.31 బిలియన్ డాలర్లు మాత్రమే ఉన్నాయి. గతంలో భారత్ ఆ దేశానికి ఒక బిలియన్ డాలర్ల లైన్ ఆఫ్ క్రెడిట్‌ను అందించింది.
హైడ్రో పవర్ ప్రాజెక్టులు:
భారత విదేశాంగ మంత్రి జైశంకర్ శ్రీలంకలో మార్చి నెలలో పర్యటించారు. మూడు హైబ్రిడ్ పవర్ ప్రాజెక్టులను ఆ దేశంలో గ్రాంట్ రూపంలో భారత్ నిర్మించనుంది. నైనతివు, నెడుంతివు, అనలైతివు అనే ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరింది.
మాల్దీవులు:
భారత విదేశాంగ మంత్రి మార్చి నెలలో రెండు రోజులపాటు మాల్దీవుల్లో పర్యటించారు. భారత ఆర్థిక సాయంతో అక్కడ అడ్డూ నగరంలో నిర్మించిన నేషనల్ కాలేజ్ ఆఫ్ పోలీసింగ్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ను ప్రారంభించారు. అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ, మాల్దీవుల పోలీస్ సర్వీసుల మధ్య కూడా అవగాహన ఒప్పందం కుదిరింది. మాల్దీవుల పోలీసులకు భారత్ శిక్షణ ఇవ్వనుంది.
యూఏఈ:
గల్ఫ్ దేశాల్లో మొట్టమొదటి మంకీ పాక్స్ కేసు యూఏఈలో నమోదైంది. ఇటీవలి కాలంలో ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నది. ఇది ఒక డీఎన్ఏ వైరస్. పాక్స్ విరిడే కుటుంబానికి చెందినది.
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం:
భారత్, యూఏఈల మధ్య ఈ ఏడాది సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. ఇది ఒక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం. ఇరు దేశాల మధ్య ప్రస్తుతం ఉన్న 60 బిలియన్ అమెరికన్ డాలర్ల వాణిజ్యాన్ని రానున్న అయిదేళ్లలో 100 బిలియన్ అమెరికన్ డాలర్లకు పెంచడమే లక్ష్యం. మధ్య ప్రాచ్య ఉత్తర ఆఫ్రికా ప్రాంతంలో భారత్‌కు ఈ తరహా ఒప్పందం ఇదే. ఈ ప్రాంతాన్నే ఇంగ్లిష్‌లో మిడిల్ ఈస్ట్ నార్త్ ఆఫ్రికా అంటారు.
ఇన్ఫినిటీ బ్రిడ్జి:
గణిత గుర్తు అయిన ఇన్ఫినిటీ ఆకారంలో ఉండే బ్రిడ్జిని యూఏఈలో జనవరి 16న ప్రారంభించారు. ఈ బ్రిడ్జిపై ఒక గంటలో అన్ని వైపుల నుంచి 24,000 వాహనాలు ప్రయాణించే ఆస్కారం ఉంటుంది. ఆ దేశంలోని డియరా – బుర్ దుబాయ్లను ఈ బ్రిడ్జి అనుసంధానం చేస్తుంది.
పాకిస్థాన్:
భారత్‌తో సరిహద్దును కలిగి ఉన్న పాకిస్థాన్ పలు అంశాల రీత్యా వార్తల్లో నిలిచింది. ఆ దేశ ప్రధానిగా ఉన్న ఇమ్రాన్‌ఖాన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధంగా పదవిని కొల్పోయిన ఆ దేశపు తొలి ప్రధాని ఆయనే. ప్రస్తుతం ఆయన స్థానంలో షెహ్బాజ్ షరీఫ్ బాధ్యతలు స్వీకరించారు. ఇమ్రాన్ పదవీచ్యుతుడు కావడానికి ముందు పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. తనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడంలో విదేశీ హస్తం ఉందంటూ ఆయన ఆరోపించారు. అంతేగాక సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టక ముందే జాతీయ అసెంబ్లీని దీర్ఘకాలికంగా వాయిదా వేశారు. ఆ తర్వాత సభను రద్దు చేయమని సిఫారసు చేయడంతో రాష్ట్రపతి అందుకు ఆమోదం తెలిపారు. అయితే ఈ నిర్ణయాలను పాకిస్థాన్ సుప్రీంకోర్టు కొట్టివేసింది. దాంతో సభ నిర్వహించి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు.
పాకిస్థాన్‌లోకి భారత క్షిపణి:
భారత్ ప్రయోగించిన ఒక క్షిపణి పొరపాటున పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లింది. ఆ దేశంలోకి 124 కిలోమీటర్ల మేర చొచ్చుకెళ్లింది. సాంకేతిక లోపం వల్లే ఇది జరిగిందని భారత్ పేర్కొనడాన్ని పాకిస్థాన్ అంగీకరించింది. ప్రయోగాలకు ముందు సమాచారం ఇచ్చే అంశానికి సంబంధించి ఇరు దేశాల మధ్య 2005లో ఒక ఒప్పందం కుదిరింది. దీన్నే ‘ప్రీ నోటిఫికేషన్ ఆఫ్ ఫ్లైట్ టెస్టింగ్ ఆఫ్ బాలిస్టిక్ మిస్సైల్ అగ్రిమెంట్-2005 (బాలిస్టిక్ క్షిపణి పరీక్ష ముందస్తు సమాచారం)’ అంటారు. ఇరుదేశాలు అంగీకరించిన అంతర్జాతీయ సరిహద్దుకు 40 కిలోమీటర్ల లోపల ఎలాంటి పరీక్షలు నిర్వహించరాదు. అలాగే పరీక్షకు మూడు నుంచి అయిదు రోజుల ముందు సమాచారం ఇవ్వాలి.
ఆయేషా మాలిక్:
పాకిస్థాన్ సుప్రీంకోర్టులో జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన తొలి మహిళగా ఆయేషా మాలిక్ నిలిచారు. ఈ ఏడాది జనవరి 24న ఆమె బాధ్యతలు చేపట్టారు. దక్షిణాసియా దేశాల్లో కేవలం పాకిస్థాన్‌లో మాత్రమే ఇప్పటివరకు మహిళలకు సుప్రీంకోర్టు జడ్జిగా అవకాశం దక్కలేదు. ఇప్పుడు ఆ లోటు తీరింది.
తుర్క్మెనిస్థాన్:
భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఏప్రిల్ 1 నుంచి 4 వరకు మధ్య ఆసియా దేశం అయిన తుర్క్మెనిస్థాన్లో పర్యటించారు. ఆ దేశాన్ని సందర్శించిన భారత తొలి రాష్ట్రపతి ఆయనే. భారత్ ఈ ఏడాది 75వ స్వాతంత్య్ర వేడుకలను జరుపుకొంటుండగా, తుర్క్మెనిస్థాన్ 30వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నది. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై కూడా 30 ఏండ్లయ్యింది. ఆర్థిక నిర్వహణకు సంబంధించి ఇరుదేశాల మధ్య ఒప్పందం కుదిరింది. అలాగే విపత్తు నిర్వహణ, సాంస్కృతిక-కళల అంశాల్లో పరస్పర సహకారానికి కూడా ఇరుదేశాల మధ్య ఒప్పందాలు కుదిరాయి. ఈ సందర్భంగా టీఏపీఐ గ్యాస్ పైప్‌లైన్ కూడా చర్చకు వచ్చింది. ఇది 33 బిలియన్ క్యూబిక్ మీటర్ల సహజ గ్యాస్‌ను అందించేందుకు ఉద్దేశించినది. తుర్క్మెనిస్థాన్, అఫ్గానిస్థాన్, పాకిస్థాన్, భారత్ వరకు ఈ పైప్‌లైన్ కొనసాగుతుంది. ఈ పైప్‌లైన్‌కు ఆసియా అభివృద్ధి బ్యాంక్ రుణాన్ని ఇస్తుంది. భారత్, పాకిస్థాన్‌లకు 14 బిలియన్ క్యూబిక్ మీటర్లు, అఫ్గానిస్థాన్‌కు 5 బిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను సరఫరా చేయనున్నారు. ఈ పైప్‌లైన్ 1,814 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అయితే గతంలో ఈ పైప్‌లైన్ భద్రతకు సంబంధించి భారత్ పలు అంశాలను ప్రస్తావించగా.. వాటిని పరిశీలించేందుకు తుర్క్మెనిస్థాన్ అంగీకరించింది.
ఉజ్బెకిస్థాన్:
భారత్, ఉజ్బెకిస్థాన్ మధ్య మార్చి 22 నుంచి 31 వరకు ఎక్స్-దస్త్లిక్ పేరుతో ఉమ్మడి సైనిక శిక్షణ విన్యాసాలు కొనసాగాయి. భారత్ తరఫున గ్రెనడియర్ బెటాలియన్ ఈ విన్యాసాల్లో పాల్గొన్నది.
ఇజ్రాయెల్:
ఐరన్ బీమ్ పేరుతో ఒక క్షిపణిని ఇజ్రాయెల్ విజయవంతంగా ప్రయోగించింది. గాలిలోంచి వచ్చే యూఏవీ, రాకెట్లను, లేజర్ కిరణాలను ధ్వంసం చేయగల సామర్థ్యం ఈ క్షిపణికి ఉంది. ఈ తరహా క్షిపణి ప్రపంచంలో ఇది ఒక్కటి మాత్రమే ఉంది.
30 సంవత్సరాల దౌత్య సంబంధాలు:
భారత్, ఇజ్రాయెల్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై 30 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఒక లోగోను ఆవిష్కరించారు. దానిపై అశోకచక్రంతోపాటు స్టార్ ఆఫ్ డేవిడ్ ప్రతిమలు ఉంటాయి. ఇజ్రాయెల్‌ను అధికారికంగా ఒక దేశంగా 1950లో భారత్ గుర్తించింది. అయితే సంబంధాలు మాత్రం 1992లో ప్రారంభమయ్యాయి. ఆ దేశంతో దౌత్య సంబంధాలు కలిగిన 164 దేశాల్లో భారత్ కూడా ఒకటి. ఆ దేశాన్ని సందర్శించిన భారత తొలి మంత్రి ఎల్కే ఆద్వాని. 2000 సంవత్సరంలో ఆయన ఆ దేశానికి వెళ్లారు. అలాగే 2003లో నాటి భారత విదేశాంగ మంత్రి జశ్వంత్ సింగ్ ఇజ్రాయెల్‌లో పర్యటించారు. ఆ దేశంలో పర్యటించిన భారత తొలి విదేశాంగ మంత్రి ఆయనే. భారత్‌కు ఆయుధాలు సరఫరా చేస్తున్న దేశాల్లో ఇజ్రాయెల్ రెండో స్థానంలో ఉంది. అలాగే సూక్ష్మ వ్యవసాయంతోపాటు ఆధునిక సాగు విధానాల అంశాల్లో ఇరుదేశాల మధ్య పలు ఒప్పందాలు కుదిరాయి.
డ్రోన్లకు అనుమతి:
వాయుతలంలోకి పౌరుల డ్రోన్లను అనుమతిస్తూ ఇజ్రాయెల్ నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలో ఈ తరహా అనుమతి ఇచ్చిన తొలి దేశం ఇజ్రాయెల్. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ నిర్ణయం తీసుకుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు