పరమాణువుల పరస్పర ఆకర్షణ
పోటీ పరీక్షల్లో జనరల్ స్టడీస్ సబ్జెక్టు ప్రధానమైనది. ఇందులోంచి ఎక్కువ ప్రశ్నలు అడుగుతారు. ఉద్యోగార్థులు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రసాయనశాస్త్రంలోని కొన్ని ముఖ్యమైన నిర్వచనాల గురించి తెలుసుకుందాం..
అణువులు: ఒక మూలకానికి చెందిన పరమాణువులు గానీ, వేర్వేరు మూలకాలకు చెందిన పరమాణువులు గానీ సంయోగం చెంది, వాటి సమీప జడవాయు ఎలక్ట్రాన్ విన్యాసాన్ని పొంది, తద్వారా స్థిరత్వం పొందినప్పుడు ఏర్పడే వాటినే అణువులు అంటారు.
కాటయాన్: పరమాణువు లేదా పరమాణువుల సమూహం ఎలక్ట్రాన్ లేదా ఎలక్ట్రాన్లను కోల్పోయినప్పుడు ఏర్పడే ధనాత్మక అయాన్నే కాటయాన్ అంటారు.
ఆనయాన్: ఒక పరమాణువు లేదా పరమాణువుల సమూహం ఒక ఎలక్ట్రాన్‌ను గ్రహించడం ద్వారా ఏర్పడే రుణాత్మక అయాన్నే ఆనయాన్ అంటారు.
రసాయన బంధం
ఎలక్ట్రాన్లు:
పరమాణువుల్లో రుణ విద్యుదావేశం కలిగి ఉన్న ప్రాథమిక కణాలను ఎలక్ట్రాన్లు అంటారు.
జడవాయువులు:
VIIIA లేదా 18వ లేదా 0 (సున్నా) గ్రూపునకు చెందిన ఏక పరమాణుక వాయు మూలకాలను జడవాయువులు అంటారు.
లూయీస్ చుక్కల నిర్మాణాలు:
మూలక పరమాణువులను, దానిలోని వేలన్సీ ఎలక్ట్రాన్లను పటం రూపంలో అంటే పరమాణు కేంద్రకానికి లోపలి కక్ష్యలోని ఎలక్ట్రాన్లను ఆ మూలకం గుర్తు ద్వారా, పరమాణు బాహ్యకక్ష్యలోని ఎలక్ట్రాన్లను చుక్కలతో (.) లేదా గుణకారపు గుర్తు (x)తో సూచించడాన్నే లూయీస్ చుక్కల నిర్మాణం అంటారు.
అష్టక నియమం:
మూలకాలకు చెందిన పరమాణువులు తమ బాహ్య కక్ష్యలో ఎనిమిది ఎలక్ట్రాన్లు మిగిలిఉండేలా రసాయనిక మార్పు చెందడానికి ప్రయత్నిస్తాయి. దీన్నే అష్టక నియమం అంటారు.
రసాయన బంధం:
అణువులోని రెండు పరమాణువులు లేదా పరమాణువుల సమూహాల మధ్య ఉండే ఆకర్షణ బలాన్ని రసాయన బంధం అంటారు.
అయానిక బంధం:
లోహ పరమాణువుల నుంచి అలోహ పరమాణువులకు ఎలక్ట్రాన్ల బదలాయింపు వల్ల ఏర్పడిన ధనాత్మక అయాన్లు (కాటయాన్లు), రుణాత్మక అయాన్ల (ఆనయాన్లు) మధ్య పనిచేసే స్థిర విద్యుత్ ఆకర్షణ బలం ఆ రెండింటిని కలిపి ఉంచి విద్యుత్ పరంగా తటస్థంగా ఉండే ఒక నూతన సంయోగ పదార్థాన్ని ఏర్పరచడాన్ని అయానిక బంధం అంటారు.
సంయోజనీయ బంధం:
రెండు పరమాణువుల మధ్య వేలన్సీ ఎలక్ట్రాన్లు పంచుకోవడం వల్ల రెండు పరమాణువులు క్రమ బాహ్య కక్ష్యలో అష్టక విన్యాసం లేదా రెండు ఎలక్ట్రాన్ విన్యాసం (హీలియం ఎలక్ట్రాన్ విన్యాసం) పొందడం ద్వారా ఏర్పడిన బంధాన్ని సంయోజనీయ బంధం అంటారు.
స్థిర విద్యుదాకర్షణ బలం:
ధనాత్మక, రుణాత్మక ఆవేశాలు కలిగిన వస్తువులు లేదా అయాన్ల మధ్య ఉండే ఆకర్షణ బలాన్నే స్థిర విద్యుదాకర్షణ బలం అంటారు.
ఎలక్ట్రో వలెంటం:
సంయోజకత అనే భావనను ఎలక్ట్రాన్ల పరంగా వివరించారు. అందుకే దీన్ని ఎలక్ట్రో వలెంటం అని కూడా అంటారు.
ధ్రువ ద్రావణి:
నీరు, అమ్మోనియా లాంటి సమ్మేళనాలు ద్విధ్రువాలను (పాక్షిక, ధన, రుణ ఆవేశాలను) కలిగి ఉంటాయి. ఇవి అయానిక పదార్థాలను తమలో కరిగించుకొనే స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇలాంటి ద్రవాలనే ధ్రువ ద్రావణిలు అంటారు.
అధ్రువ ద్రావణి:
పెట్రోలు, కార్బన్ టెట్రాక్లోరైడ్, బెంజీన్ వంటి సమ్మేళనాలు శాశ్వతమైన ద్విధ్రువ బ్రామకాలను కలిగి ఉండవు. అవి అయానిక పదార్థాలను తమలో కరిగించుకోలేవు. కానీ సంయోజనీయ పదార్థాలను తమలో కరిగించుకుంటాయి. ఇటువంటి ద్రావణాలనే అధ్రువ ద్రావణిలు అంటారు.
అయానిక పదార్థాలు:
అయానిక బంధం వల్ల ఏర్పడిన సమ్మేళనాలను అయానిక పదార్థాలు అంటారు.
సంయోజనీయ పదార్థాలు:
ఒక సమ్మేళనం దాని అణువుల్లోని పరమాణువుల మధ్య సంయోజనీయ బంధాలుంటే ఆ పదార్థాలను సంయోజనీయ పదార్థాలు అంటారు. (లేదా) సంయోజనీయ బంధంతో ఏర్పడిన అణువులను కలిగిన పదార్థాలను సంయోజనీయ పదార్థాలు అంటారు.
ధన విద్యుదాత్మక ధర్మం:
సాధారణంగా లోహ మూలకాలు తమ బాహ్య కక్ష్య నుంచి ఎలక్ట్రాన్లను కోల్పోయి అష్టక విన్యాసం పొందడానికి ప్రయత్నిస్తాయి. ఈ విధమైన స్వభావాన్నే లోహ ధర్మం లేదా ధన విద్యుదాత్మకత అంటారు.
రుణ విద్యుదాత్మక ధర్మం:
అలోహ మూలకాలు ఎలక్ట్రాన్లను గ్రహించడం ద్వారా అష్టక నియమాన్ని పొందడానికి ప్రయత్నిస్తాయి. ఈ స్వభావాన్నే రుణ విద్యుదాత్మకత అంటారు.
ధ్రువ బంధాలు:
వేర్వేరు మూలక పరమాణువుల మధ్య ఎలక్ట్రాన్ల అసమ పంపిణీ వల్ల ఏర్పడిన సంయోజనీయ బంధాలను ధ్రువ బంధాలు అంటారు.
బంధ ఎలక్ట్రాన్ జంట:
రెండు పరమాణువులు ఎలక్ట్రాన్ జంటను పంచుకోవడం ద్వారా వాటి మధ్య బంధం ఏర్పడినప్పుడు, బంధమేర్పరిచిన ఆ ఎలక్ట్రాన్ జంటనే బంధ ఎలక్ట్రాన్ జంట అంటారు.
బంధ దూరం:
సంయోజనీయ బంధంతో కలుపడబడిన రెండు పరమాణువుల కేంద్రకాల మధ్య సమతాస్థితి వద్ద గల దూరాన్నే బంధదూరం లేదా బంధ దైర్ఘ్యం అంటారు.
బంధ శక్తి:
ఒక సమ్మేళనపు అణువులోని బంధం కలిగి ఉండే శక్తిని బంధ శక్తి అంటారు. (లేదా) పరమాణువుల మధ్య కొత్త బంధం వల్ల అణువు ఏర్పడినప్పుడు విడుదలయ్యే శక్తిని బంధ శక్తి అంటారు.
అణువుల ఆకృతి:
పరమాణువులు సంయోగం చెంది అణువులను ఏర్పరిచినపుడు అవి ఒకరకమైన ఆకృతిని (ఆకారాన్ని) కలిగి ఉంటాయి. దీన్నే అణువుల ఆకృతి అంటారు.
రేఖీయం:
కార్బన్ డై ఆక్సైడ్ (O=C=O), హైడ్రోజన్ సయనైడ్ (H-C=N), ఎసిటిలీన్ (H-C=C-H) మొదలైన అణువుల్లో మాదిరిగా పరమాణువులు సరళరేఖలో అమర్చి ఉండి అణువులను ఏర్పరచడాన్ని రేఖీయం అంటారు.
టెట్రా హైడ్రల్:
నాలుగు ముఖాలు కలిగిన త్రిమితీయ నిర్మాణం లేదా ఆకారాన్నే చతుర్ముఖీయం అంటారు.
ఒంటరి ఎలక్ట్రాన్:
అణువులో బంధమేర్పరచని లేదా పంచుకోని ఎలక్ట్రాన్ జంటను ఒంటరి ఎలక్ట్రాన్ జంట అంటారు.
అయానిక పదార్థాలు:
పదార్థంలోని అణువుల్లో పరమాణువుల మధ్య అయానిక బంధాలు గల పదార్థాలను అయానిక పదార్థాలు అంటారు.
ఉదా: NaCl, MgCl2, Na2O మొదలైనవి.
గాలిలోని కాలుష్యం – ప్రభావం చూపే భాగం
1. క్లోరిన్ ఆమ్లాలు, ఐసోసైనేట్ – కన్ను, ముక్కు, గొంతు భాగాలు
2. క్లోరిన్ పెస్టిసైడ్స్ – ఊపిరితిత్తుల వ్యాధి
3. కార్బన్ టెట్రా క్లోరైడ్ – కాలేయ వ్యాధులు
4. ఫినాల్, బెంజీన్, పాదరసం – మూత్రపిండాల వ్యాధి
5. రేడియోధార్మికత వికిరణం – కాలేయం, ఊపిరితిత్తులు, చర్మం, ఎముకలు, రక్తసంబంధ వ్యాధులు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు