తెలంగాణలో పర్యాటక ప్రాంతాలు
హస్తకళలు
పర్యటనల్లో భాగంగా పర్యాటకులు వివిధ ప్రాంతాల్లో దొరికే వస్తువులను కొనడం అలవాటు.
బంజారా ఎంబ్రాయిడరీ: హైదరాబాద్, నిర్మల్‌లో లంబాడీలు బట్టలపై రకరకాల ఆకృతులను వేస్తారు. వీటిని బంజారా ఎంబ్రాయిడరీ అంటారు.
సిరిసిల్ల కాటన్స్: కరీంనగర్, సిరిసిల్లలో చేనేత వస్ర్తాలకు హైదరాబాద్‌లోని నిఫ్ట్ విద్యార్థులు కొత్త డిజైన్లు సృష్టించి మార్కెట్ చేస్తున్నారు. మగ్గాలపై నేసిన కోరా ఫ్యాబ్రిక్స్‌కు బ్లీచింగ్, ప్రాసెసింగ్, డైయింగ్ చేసిన బెడ్‌షీట్స్, పిల్లో కవర్స్, కుర్తాలు, చుడీదార్లు, బ్యాగ్‌లు, స్త్రీలు, పురుషులు ధరించే వస్ర్తాలు, టేబుల్ సెట్, దివాన్ సెట్స్‌ను అందంగా తీర్చిదిద్దుతున్నారు.
హిమ్రూ చేనేతలు: మొగలుల కాలంలో హైదరాబాద్‌కు చేరిన ఈ కళ కశ్మీర్లో పుట్టింది. కాటన్ బేస్‌పై, సిల్క్ దారాలతో వన్నెలొలికే డిజైన్లతో తయారయ్యే హిమ్రూ శాలువలు, షత్రంజాలను కొనుక్కోవడానికి పర్యాటకులు ఆసక్తి చూపుతారు.
నకాషీ: వస్త్రంపై సహజమైన రంగులతో బొమ్మలు వేసే పద్ధతినే నకాషీ అంటారు. నక్ష అంటే పటం, రంగులతో బొమ్మలు వేసేవారిని నకాషీలు అంటారు. లేదా పట చిత్రకళ అంటారు. వరంగల్ జిల్లా చేర్యాలలో ఈ కళ ఉన్నది. బట్టలపై జాంబ పురాణం, మడేల్ పురాణం, గౌడ పురాణం, రామాయణ, భారత, భాగవతాలను స్క్రోల్స్గా చిత్రిస్తారు.
పెంబర్తి ఇత్తడి కళ: పెంబర్తి (వరంగల్)లో ఇత్తడి రేకులను కావాల్సిన రీతిలో డిజైన్ చేస్తారు. ఆలయాలపై శిల్పకళకు ఆదరణ కరువైన ఈ రోజుల్లో ఇండ్లు, ఆఫీసులు, హోటళ్లలో అలంకరణ చేస్తున్నారు. ఇటీవల మెమొంటోలు, విగ్రహాలను తయారు చేస్తున్నారు.
చండూరు: నల్లగొండ జిల్లా చండూరులో తరతరాలుగా కళాత్మక ఇత్తడి వస్తువులను తయారు చేస్తున్నారు. కడవలు, బిందెలు, గంగాళాలు, బకెట్లు, ప్లేట్లు, పూలబుట్టలు, పూజసామాగ్రి తయారు చేస్తున్నారు. ఇక్కడి కళాకారులు ఇత్తడి వస్తువులను కాంతులీనేలా చేయడంలో సిద్ధహస్తులు. చండూరులో కంచు
లోహకారులు కూడా ఉన్నారు.
ఫిలిగ్రీ కళ: సన్నని వెండి తీగను కళాత్మకంగా తీర్చిదిద్దే కళను ఫిలిగ్రీ అంటారు. కరీంనగర్ ప్రాంతంలో మాత్రమే ఈ కళ ఉన్నది. పాన్దాన్, అత్తర్ డబ్బాలు, స్పూన్లు ముఖ్యమైనవి. చేనేత పరిశ్రమ కూడా ప్రఖ్యాతమైనదే.
శిల్పకళ: తెలంగాణ సంస్కృతిలో శిల్పకళకు రెండు వేల ఏండ్ల చరిత్ర ఉన్నది. ఆలయాల్లో విగ్రహాల ప్రతిష్ఠల కోసం, కార్యాలయాలు, ఇండ్లు, గార్డెన్స్‌లో డెకరేషన్ కోసం శిల్పాలను ఉంచవచ్చు. వరంగల్, హైదరాబాద్‌లలో తయారైన ఈ కళారూపాలు పర్యాటకులకు అందుబాటులో ఉంటున్నాయి. వివిధ రకాల రాళ్లపై తయారయ్యే శిల్పాలు పర్యాటకులకు అందుబాటులో ఉంటున్నాయి.
ఏటికొప్పాక కొయ్య బొమ్మలు: హైదరాబాద్‌లోని కళాంజలి, లేపాక్షి ఎంపోరియంలో దొరుకుతాయి.
నల్లగొండ జిల్లా
దర్శనీయ స్థలాలు: పానగల్లు, రామాలయం-గుడిపల్లి, వాడపల్లి కోట, లక్ష్మీనరసింహ స్వామి ఆలయం- వాడపల్లి, నాగార్జునసాగర్, బుద్ధవనం, అక్కంపల్లి జలాశయం, డిండి ప్రాజెక్టు, దేవరకొండ కోట, కోట గుట్టలు- అజిల్లాపురం, వల్లాల శిలాతోరణం, కాపురాల గుట్ట- నల్లగొండ, పేరూరు దేవాలయం, జడలరామలింగేశ్వరాలయం-చెర్వుగట్టు, రామాలయం-నల్లగొండ, రాజరాజేశ్వరస్వామి ఆలయం- గుడివాడ, లక్ష్మీనరసింహస్వామి ఆలయం- నకిరేకల్, లతీఫ్‌సాహెబ్ దర్గా, నల్లమల అందాలు, చండూరు ఇత్తడి పరిశ్రమ, జాన్‌పహడ్ దర్గా.
పానగల్లు: చాలా ప్రాచీన చరిత్ర గల గ్రామం. ఇక్కడ పచ్చల సోమేశ్వరాలయం, చాయా సోమేశ్వరాలయం, రామాలయం ఉన్నాయి.
నల్లమల అందాలు: చందంపేట మండలం అటవీ ప్రాంతం, సహజసిద్ధంగా ఏర్పడిన ప్రకృతి అందాలు, కనువిందు చేసే కృష్ణానది. బుగ్గ తండా నుంచి జాలువారే జలపాతం, ఇక్కడి గుట్టల్లో ఏలేశ్వరం దేవాలయాన్ని చూడవచ్చు.
నాగార్జునసాగర్
ఇక్కడ సాగర్ డ్యామ్, పైలాన్, పిల్లల పార్క్, నాగార్జునకొండ, మ్యూజియం, ఎత్తిపోతల జలపాతం, బుద్ధవనం, జలవిద్యుత్ కేంద్రం, పొట్టి చెలమ పార్కు, ఇక్షాకుల క్రీడా ప్రాంగణం, చారిత్రక ఆనవాళ్లు ఉన్నాయి.
జలవిద్యుత్ కేంద్రం: ఇది బహుళార్థసాధక ప్రాజెక్టు. ఇది 1975లో 8 యూనిట్ల ఉత్పత్తితో ప్రారంభమైంది.
ఎత్తిపోతల పథకం: సాగర్ డ్యామ్‌కు 13 కి.మీ. దూరంలో చంద్రవంక నదిపై ఉన్నది. ఇక్కడి నుంచి మద్దిమడుగు వరకు సొరంగ మార్గం ఉన్నదని ప్రతీతి.
అనుపు: ఇది ఇక్షాకుల కాలంనాటి ఓడరేవు. సాగర్ కుడి కాలువ నుంచి 8 కి.మీ. దూరంలో ఉన్నది. ఇక్షాకుల కాలం నాటి క్రీడాప్రాంగణం, నాగార్జునాచార్యుని వైద్యశాల, శిథిలాలు ఉన్నాయి.
బుద్ధవనం: విజయపురి సౌత్‌లో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేశా రు. బుద్ధుడి స్తూపం, బుద్ధవనాలు, పార్కులు, బుద్ధుడు తుదిశాస్వ విడిచిన కట్టడం ఉన్నాయి.
నాగార్జున కొండ: ఆనకట్ట నిర్మాణానికి ముందు ఇది పెద్ద లోయ. మూడు పక్కల కొండలతో పశ్చిమాన కృష్ణానది ఉన్నది. క్రీ.శ. 3 వ శతాబ్దంలో ఇక్ష్వాకుల రాజధానిగా విజయపురి విలసిల్లింది.
-నాగార్జునకొండలో పూర్వశిలాయుగ రాతిపనిముట్లు, మధ్యరాతి, కొత్తరాతి యుగఅవశేషాలు, ఇక్షాకుల ఆటస్థలాలు, హారితి ఆలయపు శిథిలాలు, సాక్షాత్తు బుద్ధ ధాతువును నిక్షిప్తంచేసిన ఇక్షాక రాణులు శాంతిశ్రీ, రుద్రదేవి భట్టారిక, భట్టిదేవి, సాధారణ ఉపాసకులు సైతం నిర్మించిన అనేక ఆరామాలు ఉన్నాయి.
డిండి ప్రాజెక్టు: దీన్ని 1940-43లో డిండి నదిపై నిర్మించారు. దీనిద్వారా 12,835 ఎకరాలకు సాగునీరందుతుంది.
చండూరు ఇత్తడి పరిశ్రమ: చండూరు మండల కేంద్రంలో ఇత్తడి పరిశ్రమను చూడవచ్చు. గ్రామంలో 35 శాతం ఇత్తడి పరిశ్రమ కార్మికులు ఉన్నారు.
మహబూబాబాద్ జిల్లా
-16 మండలాలు కలిగిన ఈ జిల్లాలో బయ్యారం చెరువు శాసనం, కొరవి వీరభద్రస్వామి ఆలయం, భీముని పాదం జలపాతం, శివాలయం-పుల్లూరు, బయ్యారం గనులు, డోర్నకల్ చర్చి, పాకాల చెరువు, ఇనుగుర్తి చూడదగ్గ ప్రాంతాలు.
భీముని పాదం జలపాతం
-ఇది గూడూరు మండలం కొమ్మవంచ గ్రామం వద్ద ఉన్నది.
పాకాల చెరువు
-దీన్ని గణపతిదేవుని సేనాని అయిన రుద్రుడు నిర్మించాడు.
-800 ఏండ్లుగా ఈ చెరువు ద్వారా పంటలు పండిస్తున్నారు.
-దీన్ని జగదలముమ్మడి క్రీ.శ. 1213లో మానేరుపై నిర్మించాడు.
-రెండు గుట్టల మధ్య ఉన్న ఇది మొసళ్లకు నిలయం. దీని పక్కనే అభయారణ్యం ఉన్నది. ఇక్కడ జింకలు, లేళ్లు, దుప్పులను చూడవచ్చు. ప్రపంచంలోని కాలుష్యరహిత చెరువుల్లో ఇదీ ఒకటి.
కొరవి వీరభద్రస్వామి
-కొరవి వీరన్నగా ప్రసిద్ధి. ఇక్కడి వీరభద్రస్వామి ఆలయం చాళుక్యుల కాలం నాటిది. ఈ విగ్రహం 56 అడుగుల ఎత్తు ఉన్నది. ఈ గ్రామానికి వెలుపల భద్రకాళీ ఆలయం ఉన్నది.
మంచిర్యాల జిల్లా
దర్శనీయ స్థలాలు: కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రం, ప్రాణహిత వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, శివారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, మల్లన్నస్వామి ఆలయం-కత్తెరసాల, అర్జునబొద్ది గుహలు, గాంధారికోట, సింగరేణి పార్క్-మందమర్రి, కుంతాల జలపాతం, గుట్ట మల్లన్నస్వామి గుహలు-వేలాల.
కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రం: జిన్నారం మండలంలో 892.23 చ.కి.మీ.ల వైశాల్యంలో విస్తరించి ఉన్నది. దీన్ని 1965లో ఏర్పాటు చేశారు. 1999 జూలై 14న వన్యప్రాణి అభయారణ్యంగా ప్రకటించారు.
ప్రాణహిత అభయారణ్యం: వైశాల్యం 136.02 చ.కి.మీ. ఆకురాల్చే, గడ్డి జాతులకు సంబంధించిన చెట్ల రకాలు ఉన్నాయి. ఇక్కడి అడవుల్లో నాయక్‌పోడ్ అనే గిరిజన జాతి నివసిస్తున్నది. వివిధ రకాల పుష్పజాతి మొక్కలు, పక్షిజాతులు, 20 రకాల సరీసృపాలు, చిరుతపులి, పునుగుపిల్లి వంటి వాటిని చూడవచ్చు.
శివారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం: 37 కి.మీ. పరిధిలో గల ఈ అభయారణ్యాన్ని మొసళ్ల సంరక్షణ కోసం ఏర్పాటు చేశారు. దీన్ని 1978లో వన్యప్రాణి సంరక్షణ చట్టం కిందకు తీసుకువచ్చారు. ఆకురాల్చే అడవులు ఇక్కడ కనిపిస్తాయి. గోండు, నాయక్‌పోడ్, లంబాడీ గిరిజన జాతులు కనిపిస్తాయి.
బుగ్గ రాజేశ్వరాలయం: మండల కేంద్రమైన బెల్లంపల్లికి 5 కి.మీ దూరంలో రెండు కొండల మధ్య ఈ ఆలయం ఉన్నది. ఇక్కడి నీటిగుంటలో నిరంతరం నీరు ఉంటుంది. ఇక్కడి శివలింగం ఏటేట పెరుగుతున్నదని భక్తుల విశ్వాసం.
సత్యనారాయణస్వామి ఆలయం: దండేపల్లి మండలం, గూడెంగుట్ట గ్రామంలో ఉన్నది. మంచిర్యాల రైల్వేస్టేషన్‌కు 30 కి.మీ., లక్సెట్టిపేటకు 6 కి.మీ. దూరంలో జాతీయ రహదారిపై ఉన్నది. సత్యనారాయణస్వామికి ఎదురుగా కుడివైపు బండసొరికల్లో జలం నిరంతరం ప్రవహిస్తుంది.
గుట్ట మల్లన్న స్వామి-వేలాల: జైపూర్ మండలంలోని వేలాలలో శివరాత్రి రోజు జాతర జరుగుతుంది. గుహలో ఉన్న ఈ ఆలయంలో స్వచ్ఛమైన నీరు ప్రవహిస్తుంది.
రాళ్లవాగు ప్రాజెక్టు : ఇది మధ్యతరహా ప్రాజెక్టు. మంచిర్యాల జిల్లాలో ఉన్నది.
కామారెడ్డి జిల్లా
-దోమకొండకోట, శివాలయం-దోమకొండ, టేక్రియాల్ చెరువు, భీమేశ్వర స్వామి ఆలయం- సంతాయిపేట, రామేశ్వరస్వామి ఆలయం- బండరామేశ్వరపల్లి, వేంకటేశ్వరస్వామి ఆలయం- తిమ్మాపూర్, సిద్ధరామేశ్వర స్వామి ఆలయం- భిక్కనూర్, త్రిలింగరామేశ్వర స్వామి ఆలయం- తాండూరు, కౌలాస్ కోట, వేణుగోపాలస్వామి, రామాలయాలు- ఎల్లారెడ్డి,
కాలభైరవ స్వామి ఆలయం- ఇస్సన్నపల్లి : దీనిని 1415లో నిర్మించారు. ఇందులో 8 అడుగుల విగ్రహం ఉన్నది. ఈ ఆలయానికి సమీపంలో శనీశ్వరాలయం ఉన్నది.
నిజాంసాగర్ ప్రాజెక్టు : మంజీరా నదిపై 1923-31లో ఏడో నిజాం నిర్మించాడు. దీని ద్వారా 15 మండలాల్లో 2.31 లక్షల హెక్టార్ల భూమి సాగు అవుతున్నది. 1970లో ఈ ప్రాజెక్టును ఆధునికీకరించారు.
ఎగువ మానేరు ప్రాజెక్టు : మానేరు నదిపై 1954లో గంభీరావుపేట మండలం నర్మాల వద్ద నిర్మించారు. గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండలాల్లో 15 గ్రామాల పరిధిలో 13086 ఎకరాల ఆయకట్టుకు నీరు అందిస్తుంది.
ఉమ్మడి వరంగల్ జిల్లా
-లక్ష్మీనరసింహ స్వామి ఆలయం- ఉరుగొండ, వేంకటేశ్వరస్వామి ఆలయం- సన్నూర్, ఏకశిలగుట్ట- శివాలయం, ఆత్మకూరు దర్గా, త్రికూటాలయం- కొండపర్తి, వేణుగోపాలస్వామి ఆలయం- పర్వతగిరి, పద్మాక్షమ్మ గుట్ట, మెట్టుగుట్ట రామాలయం, కాకతీయ ఏకశిలాతోరణం, వేంకటేశ్వరస్వామి ఆలయం- ఎర్రగుట్ట, దుర్గామల్లేశ్వరస్వామి ఆలయం- కొత్తూరు, కాజీపేట దర్గా, ఐనవోలు మల్లన్న ఆలయం, అనుమకొండ గుట్ట, వరంగల్ కోట, ఖుష్‌మహల్, ధర్మసాగర్, గొర్రెకుంట, హసన్‌పర్తి (ఎర్రగట్టు), కటాక్షాపూర్ శివాలయం, మడికొండ, శృంగారపు బావి, ఏకవీరాలయం- మొగిలిచర్ల, రంగశాయిపేట, ప్రతాపరుద్ర నక్షత్రవేదశాల, కాశీబుగ్గ.
వరంగల్ కోట: గణపతిదేవుని కాలంలో రాజధానిగా ఉన్నది. గతంలో ఇక్కడ ఏడు కోటలు ఉండేవి. ప్రస్తుతం మట్టికోట, రాతికోటలు ఉన్నాయి. వీటికి నాలుగువైపులా నాలుగు ద్వారాలు, కందకాలు ఉన్నాయి. రాతికోట మధ్య పడమరవైపు ఒక గండశిల ఉన్నది. దానిపై చిన్న గదులు తొలిచి ఉన్నాయి. మట్టికోట పరిధి 19 కి.మీ., రాతికోట పరిధి 8 కి.మీ., ఈ రాతి కోటను రుద్రదేవుని కుమారుడైన గణపతి దేవుడు కట్టించాడు. కోట మధ్య స్వయంభూదేవాలయం ఉంది. కోటపై 45 బురుజులు ఉన్నాయి.
ఏకశిల : స్వయంభూ ఆలయానికి దగ్గరలో ఒక మహాశిల ఉన్నది. ఇది ఒకే రాయి కావడంతో దాని చుట్టూ నిర్మించిన నగరాన్ని ఏకశిలానగరం అంటారు. దీనిపై అష్టకోణాకృతిలో నిర్మించిన బురుజు ఉంది. దీనిపై ఉన్న ఆలయంలోనే బమ్మెర పోతన భాగవతం రచించాడని ప్రతీతి.
ఖుష్ మహల్: దీన్ని షితాబ్‌ఖాన్ (సీతాపతి) నిర్మించాడు. ఇతడు ముస్లింలపై తిరుగుబాటు చేసి స్వతంత్రుడయ్యాడు. శిథిలమైన కోటను, ఆలయాన్ని బాగు చేయించి దర్బార్ హాలుగా ఉపయోగించాడు. కోట తవ్వకాల్లో బయట పడిన కొన్ని విగ్రహాలను ఇక్కడ ఉంచారు.
శృంగారపు బావి: ఖుష్మహల్కు ఎదురుగా అందమైన బావి ఉన్నది. అంతఃపుర స్త్రీల కోసం నిర్మించిన దీన్ని శృంగారపు బావి అంటారు.
రంగశాయి పేట: వరంగల్ పట్టణంలో ఉన్న ఈ రంగశాయి పేటలో సీతారామస్వామి ఆలయం ఉన్నది. ఇక్కడే సయ్యద్‌షా జలాలుద్దీన్ దర్గా కూడా ఉన్నది.
భద్రకాళీ ఆలయం: దీన్ని రెండో పులకేశి నిర్మించాడు. గణపతి దేవుడు ముఖ మండపాన్ని కట్టించాడు.
కడలాలయ బసది: హన్మకొండలోని పద్మాక్షి ఆలయం గుట్టపై ఒక జైన బసది ఉన్నట్లుగా రెండో ప్రోలరాజు మంత్రి బేతన భార్య మైలమ వేయించిన శాసనం ద్వారా తెలుస్తున్నది.
ప్రతాపరుద్ర నక్షత్రశాల: వరంగల్ మున్సిపల్ కార్యాలయం వెనుకవైపు ఎత్తయిన ప్రాంతంలో ఉన్నది. ఇందులో ఆధునికమైన టెలిస్కోప్ ఉన్నది.
త్రికూటాలయం: గణపతిదేవుడు ఈ గ్రామాన్ని సైనిక స్థావరంగా ఉపయోగించుకున్నాడు. బురుజుల పక్కనే 500 స్తంభాల గుడి, గణపతి ఆలయం ఉన్నాయి. ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం ఒక బండపై రెండు భుజాలు ఉన్నదిగా చెక్కారు. ఇది త్రికూటాలయం. ఇక్కడ ఏకశిలా విగ్రహం ఉంది. సురబండేశ్వర గుడి, వీరభద్ర గుడి ఉన్నాయి.
ఐనవోలు: ఇక్కడ కాకతీయులు కట్టించిన మల్లికార్జునస్వామి ఆలయం ఉన్నది. వరంగల్ కోటలో శంభునిగుడికి ఈ ఆలయానికి పోలిక ఉన్నది. గుడిలో భక్తుల జయగంటల తోరణాలు ఉన్నాయి. ఇక్కడ వరంగల్ కోట తోరణ ద్వారం పోలికలున్న తోరణ ద్వారాలు ఉన్నాయి. శిథిలమై ఇనుప ఛట్రాన్ని బిగించిన లింగం ఉన్నది.
శాయంపేట: పాంచాల రామస్వామి ఆలయం (శ్రీకృష్ణుడు) ఉన్నది. దీన్ని రామానుజాచార్యులు దర్శించారని ప్రతీతి. పాంచాలి మాన సంరక్షణ కోసం శ్రీకృష్ణుడు పాంచాల రాముడయ్యాడు. ఇది నల్లటి గ్రానైట్ శిలతో ఉన్నది. ఆలయానికి దక్షిణ దిశలో పెద్ద కోనేరు ఉంది.
వికారాబాద్ జిల్లా
-ఈ జిల్లాలో కోట్‌పల్లి జలాశయం-వికారాబాద్, లక్నాపూర్ ప్రాజెక్టు- పరిగి, కాగ్నానది, దామగుండం-పొద్దూరు, అనంతగిరి కొండలు, బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం, వరాహస్వామి విగ్రహం- గోవిందరావుపేట, పాంబండ రామలింగేశ్వర స్వామి ఆలయం, భూకైలాస్ ఆలయం- తాండూరు, అనంత పద్మనాభస్వామి ఆలయం- అనంతగిరి, తాండూరు గనులు చూడదగినవి.
అనంత పద్మనాభ స్వామి ఆలయం
-ఎత్తయిన కొండలుగల ప్రాంతమే అనంతగిరి. ఈ ఆలయం క్రీ.శ. 1300 నాటిది. ఈ ప్రాంతంలో ఏడు గుండాలు, గుహలు, సత్రాలు ఉన్నట్లు తెలుస్తున్నది. ఇక్కడ మార్కండేయ మహర్షి తపస్సు చేసినట్లుగా ప్రతీతి. గర్భగుడి సొరంగంలో ఉంది.
హెల్త్ టూరిజం
-శారీరక, మానసిక ఆరోగ్యాన్ని బాగుచేయడం కోసం వివిధ ప్రదేశాల్లో పర్యటించడాన్ని హెల్త్ టూరిజం అంటారు. కొండలు, అరణ్యాల్లో పారే సెలయేళ్లలో స్నానం చేయడం, ప్రకృతి రమణీయతను ఆస్వాదించడం ద్వారా ఎక్కువ కాలం జీవితం కొనసాగే అవకాశం ఉన్నది.
-అనేక పర్యాటక ఆకర్షణలు, రుచికరమైన వంటకాలు, అతిథి మర్యాదలకు పేరుగాంచిన మన రాష్ట్రంలో హెల్త్ టూరిజం ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉన్నది.
-హైదరాబాద్‌లో 30 ప్రైవేటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు ఉన్నాయి. సంప్రదాయ వైద్యాలైన సిద్ధ, ఆయుర్వేద, యునానీ పద్ధతులూ ఉన్నాయి.
-అపోలో, కేర్, సీడీఆర్, గ్లోబల్, ఇమేజ్, ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అండ్ రిసెర్చ్ సెంటర్, మెడ్విన్, నీలోఫర్, నిమ్స్, ఉస్మానియా, యశోదా, అవేర్ హాస్పిటల్స్, ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్, మ్యాక్సివిజన్ లేజర్ సెంటర్, ఒవైసీ హాస్పిటల్, రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్, రెమిడీ హార్ట్ ఇన్స్టిట్యూట్, సరోజినిదేవి ఐ హాస్పిటల్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచర్‌క్యూర్, శాంతిగిరి, అలంకృత, ప్రగతి ఆయుర్వేద స్పాట్ హెల్త్ రిసార్ట్స్ మొదలైనవి హైదరాబాద్‌లోని ప్రధాన హాస్పిటళ్లు.
1. ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేచర్ క్యూర్: జూబ్లీహిల్స్‌లో 1995లో ప్రారంభమైంది. ఇక్కడ యోగాశిక్షణతోపాటు మర్దనం, బురదపూత, బురద స్నానం, ఆవిరి స్నానం, ధ్యానం మొదలైన వాటిలో శిక్షణ ఇస్తారు.
2. శాంతిగిరి-ఆయుర్వేద సిద్ధ వైద్యశాల: జూబ్లీహిల్స్ (కేరళ ప్రభుత్వ సహకారంతో) ప్రశాసన్‌నగర్‌లో ఉన్నది. దీనిలో ఆయుర్వేద పంచకర్మ విధానం ఉంటుంది.
3. ప్రగతి ఆయుర్వేద స్పాట్ హెల్త్ రిసార్ట్స్: ఇది అమీర్‌పేటలో ఉన్నది. వృద్ధులకు మొక్కల నుంచి తయారైన మందులు ఇస్తారు. అభ్యంగ స్వేదం, పిళిబిల్, కాయశేకం, ధార, ఎళక్కళి, ఉద్వర్తనం, పంచకర్మ, వామనం, విరేచనం, వస్తి, నశ్యం, శిరోవస్తి, ముఖలేపనం, కదీవస్తి విధానాలు ఉన్నాయి.
స్పిరిచ్యువల్ టూరిజం
-మానసిక ప్రశాంతతకు ధ్యానాన్ని బోధించే, శిక్షణను ఇచ్చే కేంద్రాలను స్పిరిచ్యువల్ టూరిస్ట్ సెంటర్స్ అంటారు. హైదరాబాద్‌లోని రామకృష్ణమఠం, విపస్సన సెంటర్, ఆనంద బుద్ధవిహార్ (మహేంద్ర హిల్స్ వద్ద), శివం సెంటర్ మొదలైనవి.
విలేజ్ టూరిజం
-గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణులు పాల్గొనే పర్యాటకాన్ని విలేజ్ టూరిజం అంటారు. ఆధునికంగా జీవిస్తున్న వారికి గ్రామాల్లోని వేషభాషలు, విందువినోదాలు, ఆచార వ్యవహారాలు తెలుసుకోవడాన్ని గ్రామీణ టూరిజం అంటారు. గ్రామాల్లో డొంక రోడ్లు, కాలువ, చెరువు గట్లు, ఎడ్లబండ్లు, గుర్రపు బండ్లు, వింతలు విశేషాలు ఇందులో భాగమే.
-జానపద కళలు, ఎకోటూరిజం, అడ్వెంచర్ టూరిజం, హెల్త్, ఎడ్యుకేషనల్, ఎత్నిక్ టూరిజాలు కూడా ఇందులో భాగాలే. హస్తకళలు, ఎడ్లపందేలు, చేతివృత్తులు కూడా ఇందులోనివే. శిల్పారామం, డోలా-రి-ధని పల్లె వాతావరణాన్ని కళ్ల ముందుంచే ప్రయత్నాలు చేస్తున్నాయి.
అడ్వెంచర్ టూరిజం
-సాహసంతో కూడి, రిస్క్ తీసుకుని ప్రయాణం చేయడాన్ని అడ్వెంచర్ టూరిజం అంటారు. ఉదాహరణకు విమానాల విన్యాసం (ఎయిర్ షో), వాటర్ అడ్వెంచర్ షో (దీనిలో కయాకింగ్, కనోయింగ్, సెయిలింగ్, యాచింగ్, స్క్యూబాడైవింగ్, స్నోర్కెలింగ్, ఏంగ్లింగ్, ఫిషింగ్, జెట్ స్కీయింగ్, వాటర్ స్కీయింగ్, విండ్ సర్ఫింగ్, సర్ఫింగ్లు ముఖ్యమైనవి).
-ఖమ్మం జిల్లాలో గోదావరి, వైరా నదులు, వరంగల్‌లో లక్నవరం చెరువు, కరీంనగర్లో మానేరు, నిజామాబాద్ జిల్లాలో అలీసాగర్, నిజాంసాగర్ రిజర్వాయర్లలో ఈ టూరిజాన్ని అభివృద్ధి చేయవచ్చు.
-చారిత్రక యాత్రా స్థలాలు, కట్టడాలైన భువనగిరి, ఖమ్మం మొదలైన కోటలు ట్రెక్కింగ్, నేచర్వాక్లకు అనుకూలంగా ఉన్నాయి.
-ఇందూరు అడ్వెంచర్ ఫెస్టివల్: నిజామాబాద్‌లోని అలీసాగర్, అశోక్సాగర్ల వద్ద జలక్రీడలు, రాళ్లు ఎక్కటం, రిపెల్లింగ్, కనోయింగ్, కయాకింగ్ తదితర సాహస క్రీడలు ఉన్నాయి.
ఎత్నిక్ టూరిజం
-అడవుల్లోని జాతులు, తెగలు, వారి సంస్కృతిని చూసి తెలుసుకోవడమే ఎత్నిక్ టూరిజం. తెలంగాణలో గోండులు, కోయలు, యానాదులు, ఆదివాసీల జీవన విధానం తెలుసుకోవడం ఇందులో భాగమే. కొండలు, కోనలు, అడవులు, వాగులువంకలు, చెట్లుపుట్టలతో కూడిన ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఎత్నిక్ టూరిజానికి అవకాశాలు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో గోండులు, ఖమ్మం జిల్లాలో కోయల సంస్కృతిని తెలుసుకోవచ్చు.
-గోండులు: గుస్సాడి నృత్యం, ప్రత్యేక రామాయణం, డోక్రా కళ, ఇత్తడితో అలంకార పనిముట్ల తయారీ మొదలైనవి.
-సవరలు: తమ గుడిసెల గోడలపై సవరలు ప్రత్యేకంగా ముగ్గులు వేస్తారు.
-లంబాడీలు: రాజస్థాన్ నుంచి 13-14 శతాబ్దాల్లో వలస వచ్చారు. ప్రస్తుతం చాలా మంది తెలంగాణలో స్థిరపడి వ్యవసాయం చేస్తున్నారు. వీరి జీవన విధానం గురించి తెలుసుకోవడం కూడా ఎత్నిక్ టూరిజంలో భాగమే.
బిజినెస్/కన్వెన్షన్ టూరిజం
-ప్రజాదరణ పొందిన పర్యాటక కేంద్రాల వద్ద తమ తమ కార్యకలాపాలను కొనసాగిస్తూ తీరిక సమయంలో కొన్ని ఆకర్షణలను చూడటాన్ని కన్వెన్షన్ టూరిజం అంటారు.
-హైటెక్ సిటీ, వరంగల్‌లోని కల్చరల్ సిటీలో ఈ టూరిజం విస్తరించే అవకాశాలు ఉన్నాయి. విలాసవంతమైన హోటళ్లు, విశాలమైన కాన్ఫరెన్స్ హాళ్లు, రుచికరమైన ఆహారపదార్థాలు, చూడచక్కని ప్రదేశాలు ఉన్న ఏ ప్రాంతమైనా ఈ రకం టూరిజానికి అనువుగా ఉంటుంది.
-పర్యటనల్లో కొందరు కొన్ని వస్తువులను అక్కడక్కడ కొని తెచ్చుకుంటారు. ఉదా: ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్‌లో కొయ్య పలకలపైన వివిధ రంగులతో డిజైన్లను, పోర్ట్రయిట్లను, పౌరాణిక సాంఘిక దృశ్యాలను, ఆకులు తీగలు, పూలు, ఇతర డిజైన్లను కళాత్మంగా చిత్రిస్తారు. దీన్ని నకాషీ అంటారు. ఈ కళ మొగలుల కాలంలో ప్రారంభమై కుతుబ్‌షాహీ, అసఫ్‌జాహీల ఆదరణ పొందింది.
-నిర్మల్ కళాకారులు తేలికపాటి కొయ్యతో ఇంటి పనిముట్లు, రాజస్థానీ శైలిలో ఫర్నిచర్, సోఫాసెట్లు, పార్టిజన్ స్క్రీన్లు, రాకింగ్ చైర్లు, టోలీలు, దివానా మంచాలు, ఫ్లవర్‌వాజ్‌లు, ల్యాంప్షేడ్ల్లు, ట్రేలు, సిగార్ బాక్సులు తయారు చేస్తారు.
-లెదర్ ల్యాంప్ షేడ్స్: నిర్మల్ ల్యాంప్ స్టాండ్లపైన హంసలు, పక్షులతో డిజైన్స్ వేస్తారు. వరంగల్‌లో తివాచీలు తయారు చేస్తారు. నల్లగొండ జిల్లా పుట్టపాక, పోచంపల్లి, కొయ్యలగూడెంలలో టై అండ్ డై, ఇక్కత్, హస్తకళ, బంజారా ఎంబ్రాయిడరీ, సిరిసిల్ల కాటన్స్, హిమ్రూ చేనేత, నకాషీ చిత్రకళ-వరంగల్ ముఖ్యమైనవి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు