వరల్డ్ టైగర్ భారత్
భారతదేశం జీవవైవిధ్యానికి పుట్టినిల్లు. మన దేశం అనేక అరుదైన జీవజాతులకు నిలయం. పెరుగుతున్న పట్టణీకరణ, పారిశ్రామికీకరణ వల్ల చాలా జీవజాతులు అంతరించిపోతున్నాయి. ఇప్పటికే చాలా జీవజాతులు అంతరించిపోయాయి. ప్రస్తుతం కొన్ని జాతుల జంతువులు కనుమరుగయ్యే ప్రమాదంలో ఉన్నాయి. వాటిని కాపాడటానికి భారత ప్రభుత్వం వన్య ప్రాణి సంరక్షణ ప్రాజెక్టులను ఏర్పాటు చేసింది. అవి ఎక్కడెక్కడ ఉన్నాయి.. ఆ ప్రాజెక్టుల్లో ఏ జీవులను సంరక్షిస్తున్నారో తెలుసుకుందాం.
వణ్యప్రాణి సంరక్షణ ప్రాజెక్టులు
ప్రాజెక్ట్ మణిపూర్ తమిన్
ఇది మణిపూర్‌లోని లోక్తక్ సరస్సు ప్రాంతంలో కనిపించే ‘తమిన్ డీర్’ అనే అరుదైన జింకల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన ప్రాజెక్ట్. దీన్ని 1977లో ప్రారంభించారు.
గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ప్రాజెక్ట్
బట్టమేక తలపిట్టను గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అంటారు. దీన్ని IUCN కు చెందిన రెడ్ డేటా బుక్‌లో చేర్చారు. బట్టమేక తల పిట్ట సంరక్షణకు ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. దీన్ని రాజస్థాన్‌లో 2013లో ప్రారంభించారు.
గంగా డాల్ఫిన్ సంరక్షణ
- గంగా, బ్రహ్మపుత్ర నదిలో నివసించే డాల్ఫిన్ సంరక్షణకు ఈ ప్రాజెక్ట్ ఏర్పడింది. ఈ ప్రాంతంలో బ్యారేజ్‌లు నిర్మించడం వల్ల కాలుష్యం ఏర్పడి డాల్ఫిన్ల సంఖ్య తగ్గింది. దీని శాస్త్రీయనామం ప్లాటానిస్టా గాంజెటికా. ఇది భారతదేశంలో నివసించే ఏకైక మంచినీటి డాల్ఫిన్.
- WWF, India Ganges River Dolphin Conservation ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్టును 1997లో ప్రారంభించారు.
- ఇటీవల ఈ ప్రాంతంలో కాలుష్యం, బ్యారేజీల నిర్మాణం ఎక్కువ కావడం, డాల్ఫిన్ల వేట వీటి మనుగడకు అడ్డంకిగా నిలిచాయి.
- డాల్ఫిన్‌ను IUCNకు చెందిన Red Data Book లో చేర్చారు. వీటి సంఖ్య ప్రస్తుతం 2000 కంటే తక్కువగా ఉంది. గంగా పరీవాహక రాష్ట్రాలైన ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, జార్ఖండ్, అసోం, మధ్యప్రదేశ్‌లో కనిపిస్తాయి.
- 2009 అక్టోబర్ 5న ‘మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్’ శాఖ దీన్ని ‘జాతీయ జలచర జంతువు’గా ప్రకటించింది.
- గంగానది డాల్ఫిన్‌కు స్థానికంగా గల పేరు-సిహు.
- అసోం నగర రాజధాని గువాహటి నగర మస్కట్‌గా డాల్ఫిన్ ఎంపికైంది.
ప్రాజెక్ట్ రెడ్ పాండా
అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, డార్జిలింగ్‌లో ఇవి కనిపిస్తాయి. రెడ్ పాండా సంరక్షణ కోసం ఈ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేశారు.
ప్రాజెక్ట్ కశ్మీరీ దుప్పి
దీన్ని జమ్ము కశ్మీర్‌లోని దబిగామ్ జాతీయ పార్కులో ఏర్పాటు చేశారు. కశ్మీరీ దుప్పి సంరక్షణ కోసం ఏర్పాటు చేశారు.
ప్రాజెక్ట్ టైగర్
- పులుల సంతతిని కాపాడటం కోసం భారత ప్రభుత్వం 1973 ఏప్రిల్ 1లో ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించింది.
- ప్రాజెక్ట్ టైగర్‌ను ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ జాతీయ పార్కులో చేపట్టింది. ప్రస్తుతం 53 పులుల అభయారణ్యాల్లో 2967 పులులను సంరక్షిస్తున్నారు.
- దేశంలో అత్యధిక పులులు గల రాష్ట్రం- కర్ణాటక (528)
- దేశంలో అత్యధిక పులుల రక్షిత ప్రాంతాలున్న రాష్ట్రం- మధ్యప్రదేశ్
- మధ్యప్రదేశ్‌ను పులుల రాష్ట్రం అంటారు.
- దేశంలోని మొదటి టైగర్ రిజర్వ్- జిమ్ కార్బెట్ జాతీయ పార్క్-ఉత్తరాఖండ్
- దేశంలోని అతిపెద్ద టైగర్ రిజర్వ్- రాజీవ్‌గాంధీ టైగర్ వ్యాలీ ప్రాజెక్ట్- ఆంధ్రప్రదేశ్
- భారతదేశంలో 2010లో ఉన్న పులుల సంఖ్య 1706 కాగా 2018నాటికి వీటి సంఖ్య 2967కు పెరిగింది.
- 2010లో టైగర్ సమ్మిట్ రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్‌లో జరిగింది. దీని లక్ష్యం 2022 నాటికి పులుల జనాభా సంఖ్యను రెట్టింపు చేయడం.
- ప్రపంచం మొత్తం పులుల సంఖ్యలో భారతదేశ పులుల వాటా 70 శాతం.
- ప్రపంచవ్యాప్తంగా 9 పులుల ఉపజాతులుండేవి ప్రస్తుతం వీటిలో 6 మాత్రమే ఉన్నాయి. అవి..
1. మలయా పులి
2. సుమిత్రా పులి
3. సౌత్ చైనా పులి
4. ఇండో-చైనా పులి
5. బెంగాల్ పులి
6. అముర్ లేదా సైబీరియన్ పులి
అంతరించిపోతున్న పులుల ఉపజాతులు మూడు. అవి..
1. జావా పులి 2. బాలి పులి
3. కాస్పియన్ పులి
రాజస్థాన్ పులుల రిజర్వ్
- ప్రస్తుతం భారత్‌లో ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి పులుల జనాభాను లెక్కిస్తున్నారు. పులుల జనాభా 2006లో 1411, 2010లో 1706, 2014-2226, 2018-2967.
- రాజస్థాన్‌లోని రామ్‌గఢ్ విషధారి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని ఆ రాష్ట్రంలో నాలుగో పులుల రిజర్వ్‌గా ప్రకటించేందుకు జాతీయ పులుల పరిరక్షణ అథారిటీ (నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ (ఎన్టీసీఏ)కి చెందిన సాంకేతిక కమిటీ 2021 జూన్‌లో ఆమోదం తెలిపింది. ఇది దేశంలో 52వ పులుల రిజర్వ్.
- రాజస్థాన్‌లోని బుందీ జిల్లా రామ్‌గఢ్ గ్రామానికి సమీపంలో ‘రామ్‌గఢ్ విషధారి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం’ ఉంది. దీన్ని 1982లో 252.79 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నోటిఫై చేశారు.
- ప్రస్తుతం ఇందులోని కొంత ప్రాంతంతోపాటు భిల్వారా, బుందీ, ఇందర్‌గఢ్, అడవుల్లోని కొన్ని స్థలాలను బఫర్ మండలాలుగా కలిపి మొత్తం 1017 చదరపు కిలోమీటర్లలో పులుల రిజర్వ్‌గా ప్రకటించారు.
- రాజస్థాన్‌లో ఇది కాకుండా మరో మూడు పులుల రిజర్వ్‌లు ఉన్నాయి. అవి
1. సవాయి మధోపూర్‌లోని రణథంబోర్ పులుల రిజర్వ్.
2. అల్వర్ ప్రాంతంలోని సరిస్కా పులుల రిజర్వ్.
3. కోటా ప్రాంతంలోని ముకుందా కొండల పులుల రిజర్వ్.
వీటిలో దాదాపు 90 పులులు కనిపిస్తాయి.
ఈ ప్రాజెక్ట్ ముఖ్యాంశాలు - పులుల వేటను నిరోధించడం.
- పెట్రోలింగ్ చేయడానికి కావలసిన నిధులు పులుల సంరక్షణ కేంద్రాలు గల రాష్ట్రాలకు కేటాయించడం.
- పులుల సంరక్షణాదళాన్ని ఏర్పాటు చేయడానికి సంబంధిత రాష్ట్రాలకు 100 శాతం కేంద్ర సహాయం అందించే ప్రొవిజన్ తీసుకురావడం.
ప్రాజెక్ట్ వల్చర్ (రాబందు)
- భారత ప్రభుత్వ పశుసంవర్థక శాఖ అందించిన వివరాల ప్రకారం రాబందుల సంఖ్య ఆసియాలో తగ్గిపోతుందని వాటిని రక్షించడానికి ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టారు. 2012 జీవ వైవిధ్య సదస్సులో కూడా వీటి సంరక్షణకు రూ.2లక్షల బహుమతి ప్రకటించారు.
- రాబందులు, కాకులు, బ్యాక్టీరియాలు ప్రకృతిలో పారిశుద్ధ్య కార్మికులు
- ప్రపంచవ్యాప్తంగా రాబందుల పరిరక్షణకు కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థ SAVE (save asiatic valture from extinction)
ప్రాజెక్ట్ క్రొకడైల్
- మొసళ్ల పరిరక్షణ కోసం 1975లో ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు.
- ప్రస్తుతం దేశంలోని 8 రాష్ర్టాల్లో 16 మొసళ్ల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
- భారతదేశంలో మూడు రకాల మొసళ్లు అందుబాటులో ఉన్నాయి. అవి
1. ఘరియల్ 2. ఘగ్గర్
3. ఉప్పునీటి మొసలి - దేశంలో అత్యంత వేగంగా అంతరించిపోతున్న మొసళ్ల జాతి ఘరియల్.
- మొసళ్ల సంరక్షణకు చెన్నైలో క్రొకడైల్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు.
- ‘central crocodile breeding and management training institute’ హైదరాబాద్‌లో ఉంది.
ప్రాజెక్ట్ స్నో లెపర్డ్
- భారతదేశంలోని జమ్ము కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌లో మంచు చిరుతలు కనిపిస్తాయి.
- ప్రాజెక్ట్ స్నో లెపర్డ్‌ను 2009 జనవరి 21న ప్రారంభించారు.
- సముద్ర మట్టానికి 3000 మీటర్ల ఎత్తులో హిమాలయ, ట్రాన్స్ హిమాలయ పర్వత శ్రేణుల్లో విస్తరించి ఉన్న పైన్ అడవుల్లో ఇవి కనిపిస్తాయి.
- ప్రపంచవ్యాప్తంగా వీటి సంఖ్య 7400. అత్యధిక మంచు చిరుతలు చైనాలో ఉండగా, భారత్‌లో వీటి సంఖ్య కేవలం 400 నుంచి 700 మాత్రమే ఉంటుందని అంచనా.
- మానవ, వన్యమృగాల ఘర్షణ వల్ల పశ్చిమ హిమాలయాల్లోని మంచు చిరుతల సంఖ్య గత 150 సంవత్సరాల నుంచి క్రమంగా తగ్గుతున్నది.
- దేశంలో ప్రస్తుతం 5 హిమాలయ రాష్ర్టాల్లో (జమ్ము కశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాంచల్, సిక్కిం, ఉత్తర్‌ప్రదేశ్) 11 మంచు చిరుతల అభయారణ్యాలను ఏర్పాటు చేశారు.
ప్రాజెక్ట్ రైనో
- ఈ ప్రాజెక్ట్‌ను ఒంటి కొమ్ము కలిగిన ఖడ్గ మృగాల సంరక్షణకు 1992లో ఏర్పాటు చేశారు. ఖడ్గ మృగాల కొమ్ము కోసం వేటాడుతారు. వీటి కొమ్ము రూపాంతరం చెందిన వెంట్రుక.
- రెండు కొమ్ములున్న ఖడ్గ మృగాలు ఆఫ్రికాలో కనిపిస్తాయి.
- ప్రపంచవ్యాప్తంగా 3,300 ఒంటి కొమ్ము ఖడ్గ మృగాలు ఉన్నాయి. వీటిలో 75 శాతం మన దేశంలోని అసోంలో ఉన్నాయి.
- చైనా వైద్యంలో వీటి కొమ్ముకు ప్రాధాన్యం ఉండటంతో పెద్ద మొత్తంలో వీటిని వేటాడుతున్నారు.
- వీటి సంరక్షణ కోసం అసోం ప్రభుత్వం, WWF, International Rhino Foun dation(IRF) బోడోల్యాండ్ టెరిటోరియల్ కౌన్సిల్ల సంయుక్త ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించారు.
- ప్రపంచంలోనే అత్యధిక ఒంటి కొమ్ము ఖడ్గ మృగాలు అసోంలోని ‘కజిరంగా నేషనల్ పార్క్’లో ఉన్నాయి. అసోంలోని మొత్తం ఖడ్గ మృగాల్లో 85 శాతం ఈ జాతీయ పార్కులోనే ఉన్నాయి.
- ఇండియన్ రైనో విజన్-2020: భారతదేశంలో ఉన్న ఒంటి కొమ్ము ఖడ్గ మృగాల సంఖ్యను 2020 నాటికి 3000కు పెంచడం ఈప్రాజెక్ట్ లక్ష్యం. అంతేకాకుండా అధిక సంఖ్యలో ఉన్న ఖడ్గ మృగాలను ఇతర ప్రాంతాలకు తరలించడం ఈ ప్రాజెక్ట్‌లో ఒక భాగం.
జంతువులు-చికిత్స
పశువుల చికిత్సకు ‘డైక్లో ఫినాక్ సోడియం’ అనే రసాయనాన్ని వాడతారు. దాని అవశేషాలు పశువులు మరణించినప్పుడు మృత కళేబరాల్లో జీవసాంద్రీకృతమవడం వల్ల వాటిని తిన్న రాబందుల్లోకి చేరుతున్నాయి. వాటి మూత్రపిండాలపై ప్రభావం చూపడం వల్ల మరణిస్తున్నాయి. దీంతో 9 రాబందుల జాతుల్లో 3 జాతులు అంతరించే స్థాయికి చేరుకున్నాయి. అవి..
1. White backed vulture
2. slender billed vulture
3. long billed vulture
పరిరక్షణకు భారత ప్రభుత్వం 2004లో ప్రాజెక్ట్ వల్చర్ను ప్రారంభించింది.
2006లో భారత ప్రభుత్వం పశువుల చికిత్సకు వాడే డైక్లోఫినాక్ సోడియంను నిషేధించింది. ప్రస్తుతం పశువుల చికిత్సకు డైక్లోఫినాక్కు బదులు mcloxicon ను వాడుతున్నారు.
హర్యానాలోని ఫింజోర్లో 2001లో Valture conservation and breeding station ను ఏర్పాటు చేశారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు