వలస దోపిడీపై రగిలిన తెలంగాణ
కార్యాచరణ సమితి ఏర్పాటు
-పాఠశాల, కళాశాలల ప్రతినిధులతో 1952, జూలై 26న వరంగల్ లో కార్యచరణ సమితి ఏర్పాటయింది. పార్థసారథి చేసిన అక్రమాలపై విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ డా. షెండార్కర్ జూలై 26న వరంగల్‌లో విచారణ జరుపుతున్నారు. (వరంగల్ సెంట్రల్ మిడిల్ స్కూల్‌కు చెందిన 8 మంది ఉపాధ్యాయులు, హయగ్రీవాచారి ఫిర్యాదులపై విచారణ) ఈ విషయం తెలిసిన వరంగల్ విద్యార్థులు సుమారుగా 4 వేల మంది హన్మకొండ చౌరస్తా నుంచి సుబేదారి వరకు (విచారణ స్థలం) ర్యాలీగా వెళ్తూ నాన్‌ముల్కీ గోబ్యాక్ ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఇతర ప్రాంతాలకు ఉద్యమ వ్యాప్తి
-ఈ ఉద్యమం ఖమ్మం పట్టణం, మధిర, ఇల్లందు, మహబూబాబాద్, నల్లగొండ, మిర్యాలగూడ, హైదరాబాద్ మొదలైన ప్రాంతాలకు వ్యాపించింది. సమ్మెలు, ర్యాలీలు, గోడలపై నినాదాలు రాయడం నిత్యకృతమయ్యాయి.
కార్యాచరణ సమితి – తీర్మానం
-వరంగల్‌లో ర్యాలీ తీసిన విద్యార్థులు (1952, జూలై 28) సమావేశమై ముల్కీ నిబంధనల్ని పరిశీలించడానికి క్యాబినెట్ సబ్ కమిటీని నియమించాలని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి పత్రికా ప్రకటన ద్వారా తెలియజేయాలని తీర్మానం చేసి నాటి సీఎం బూర్గుల రామకృష్ణారావుకు చేరవేశారు. విద్యార్థుల కోరికలు న్యాయమైనవని అంగీకరించిన బూర్గుల త్వరలోనే సబ్‌కమిటీని ఏర్పాటు చేస్తానని విద్యార్థులకు హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఆగస్టు 22న వరంగల్‌కు వచ్చిన సీఎంను ఆగ్రహంతో ఉన్న విద్యార్థులు నిలదీశారు. ఆగస్టు 27 లోపు సబ్‌కమిటీని ఏర్పాటుచేస్తూ ప్రభుత్వం ప్రకటన చేయకుంటే సమ్మె చేస్తామని విద్యార్థులు 1952, ఆగస్టు 24న సీఎంకు లేఖ రాశారు.
మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు
-వరంగల్ విద్యార్థులకు హామీ ఇచ్చినట్లుగానే ప్రభుత్వం ముల్కీ సమస్యను పరిశీలించడానికి, బోగస్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన గైర్‌ముల్కీలను ఉద్యోగాలు నుంచి తొలగించడానికి ముల్కీ రూల్స్‌ను కట్టుదిట్టంగా అమలుచేయడానికి మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటుచేసినట్లు వరంగల్ జిల్లా కలెక్టర్ ద్వారా విద్యార్థి కార్యాచరణ కమిటీ కన్వీనర్ బుచ్చయ్యకు సీఎం తెలిపారు.
-ఈ ఉప సంఘం ఏర్పాటును పత్రికా ప్రకటన ద్వారా సెప్టెంబర్ 7న తెలిపారు.
ఉపసంఘం సభ్యులు
1. కేవీ రంగారెడ్డి, 2. పూల్చంద్గాంధీ,
3. మెహదీనవాజ్జంగ్, 4. డాక్టర్ మెల్కోటే
ముల్కీల సమస్యపై సభ
-ముల్కీ ఉద్యమంలో భాగంగా హైదరాబాద్‌లో ఆగస్టు 27న మొదటిసారి పెద్దసభ జరిగింది. దీనికి డాక్టర్ తిమ్మరాజు అధ్యక్షత వహించాడు.
ముల్కీ ఉద్యమ ప్రధాన నినాదాలు
-నాన్‌ముల్కీ గో బ్యాక్, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్,
-మదరాసీస్ గో బ్యాక్, గోంగూర పచ్చడి గో బ్యాక్
నాన్ ముల్కీ గోబ్యాక్
-హైదరాబాద్ రక్షణ సమితి: హైదరాబాద్ శాసనసభ సభ్యుడైన జీ రామాచారి 1952 ఆగస్టులో దీనిని స్థాపించారు. నాన్‌ముల్కీలు వెనక్కు వెళ్లాలని నినదించారు. రామాచారి నేతృత్వంలో జరుగుతున్న ఉద్యమాన్ని హయగ్రీవాచారి ప్రోత్సహించాడు. ఈ ఉద్యమానికి కె.వి.రంగారెడ్డి, మర్రిచెన్నారెడ్డి (మంత్రులు) పరోక్షంగా మద్దతు తెలిపారు.
-తెలంగాణ ప్రాంతంలో ఆంధ్రప్రాంతం నుంచి అంటే మద్రాస్ నుంచి వచ్చినటువంటి ఉద్యోగస్తులు, ఆఫీసర్లు తెలంగాణను చాలా అవహేళన చేసుకుంటూ మాట్లాడేది. 1952 ఆగస్టులో అప్పటికే నా ఇంటర్మీడియెట్ కాలేజీ (వరంగల్)లో ఇంగ్లిషు, తెలుగు లాంగ్వేజ్ చెప్పేవాళ్లంతా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చేసిండ్రు. సబ్జెక్టు చెప్పేవాళ్లంత ఇక్కడ్నేమో ఉర్దూలోనే చెప్పాలి. అయితే వాళ్లంతా ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చారు. వాళ్లందరూ విశాలాంధ్ర ఏర్పాడాలి అని అనేవారు.
దీనికితోడు ఏ గెస్ట్‌లను పిలిచినా వరంగల్‌లో ఆంధ్ర ప్రాంతం నుంచి పిలచుకొనేది. ఒకసారి ఒక పెద్ద పబ్లిక్ మీటింగ్ ఏర్పాటుచేసి, అయ్యదేవర కాలేశ్వరరావు అనే ఒక పెద్ద లీడరును విజయవాడ నుంచి పిలిపించి మీటింగ్ పెట్టించారు. ఆయన ఉపన్యాసం మొదలుపెట్టిండు. అదే మీరుంటే అభివృద్ధి చెందలేరు. మీకు తెలుగురాదు. మీకు నాగరికత తెలవాలి అని మాట్లాడారు. అంటే మీకు ఏం రాదు, మీరు దద్దమ్మలు, మిమ్మల్ని సంస్కరించాలి. అంటే మాతో కలవాలే అని మొదలుపెడితే అల్లరిజేసినంబాగ. మీటింగ్ అంత అల్లరి అయితుంటే పోలీసుల్ని పిలిపిచ్చిండ్రు. అప్పుడు కలెక్టరు, పోలీసులంత అక్కడ్నించి వచ్చినోల్లే ఉన్నరు. లాఠీచార్జి అయింది. లాఠీదెబ్బలు తిన్నవాళ్లలో నేను ఒకన్ని (ఇవి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అనుభవాలు)
-వొడవని ముచ్చట, కొంపెల్లి వెంకట్‌గౌడ్ పేజీనెం. 106.
వరంగల్‌లో విద్యార్థులపై లాఠీచార్జి
-ఆగస్టు 28, 1952న ఉదయం విద్యార్థులు తనను కొట్టాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తనకు సమాచారం ఉందని, అందువల్ల తనకు రక్షణ కల్పించాలని జిల్లా ప్రభుత్వాన్ని డివిజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ పార్థసారథి (గవర్నమెంట హైస్కూల్, హన్మకొండ, ప్రిన్సిపాల్ కూడా) కోరగా, ఎస్.పి.వి.పి.నాయర్ స్కూల్ పక్కనే ఉన్న పోలీస్‌స్టేషన్‌ను అప్రమత్తం చేశాడు. సమ్మె విషయమై చర్చించుకొంటున్నారు కొందరు విద్యార్థులు, మరికొందరు విద్యార్థులు తరగతులకు హాజరైనారు. కొందరు విద్యార్థులు క్లాసులో ఉన్న విద్యార్థుల్ని బయటకు రావాలని బలవంతం చేస్తుండటాన్ని గమనించిన ఎస్పీ, కలెక్టర్ స్కూల్ ఆవరణలోకి వెళ్లారు. ప్రిన్సిపాల్ పర్మిషన్ లేకుండా లోపలికి ఎందుకు ప్రవేశించారు అని వారిని విద్యార్థులు నిలదీశారు. అంతలోనే లాఠీచార్జి జరిగింది. ఆరుగురి విద్యార్థులకు గాయాలైయ్యాయి.
శివకుమార్లాల్పై విద్యార్థుల దాడి
-ఒక గంట తర్వాత ప్రిన్సిపాల్ రాంలాల్ స్వయంగా వెళ్లి పోలీస్ కమిషనర్ శివకుమార్లాల్ను కలిసి కళాశాల వద్ద నెలకొన్న ఉద్రిక్త వాతావరణం గురించి వివరించాడు. (అప్పటికే డిప్యూటీ కమిషనర్ సుందరం పిళ్లే, సిటీ కళాశాల వద్ద ఉంటూ పోలీసులకు ఆదేశాలిస్తున్నాడు). ఉదయం 11.45లకు ప్రిన్సిపాల్, పోలీస్ కమిషనర్ శివకుమార్‌లాల్ కళాశాల దక్షిణం గేటు (మహబూబ్షాహీ రోడ్డు) ద్వారా లోపలికి రావడానికి ప్రయత్నించగా సుమారు 700 మంది విద్యార్థులు కమిషనర్ కారుపై రాళ్లు విసిరారు. (మహబూబ్-కి-మోహంది చౌరస్తా వద్ద) కొద్దిమంది విద్యార్థులు కమిషనర్‌ను చుట్టుముట్టారు. టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించవద్దని కమిషనర్ పోలీసుల్ని ఆదేశించాడు. పేట్ల బురుజు నుంచి వస్తున్న పోలీసుల్ని రాకూడదని ఆదేశించాడు. కమిషనర్‌పై విద్యార్థులు దాడి చేయగా, అతని యూనిఫాం చినిగింది. ఈ సమయంలో సమయస్ఫూర్తి ప్రదర్శించిన కమిషనర్ విద్యార్థులకు నచ్చజెప్పి కళాశాల లోపలికి పంపించారు.
-పోలీసులు వదిలిన టియర్‌గ్యాస్ హైకోర్టు ఆవరణలో వ్యాపించడంతో డివిజన్ బెంచ్ కొన్ని గంటల పాటు తమ విధుల్ని నిలిపివేసింది.
-విషయం తెలుసుకున్న ప్రాణేశాచారి, బాకర్అలీమీర్జా కళాశాలకు చేరుకొని విద్యార్థుల్ని శాంతింపజేసే ప్రయత్నాలు చేశారు.
సిటీ కళాశాల వద్ద పోలీసుల కాల్పులు
-సెప్టెంబర్ 2న పోలీసులు చేసిన లాఠీచార్జి విద్యార్థుల కోపానికి కారణమైంది. సెప్టెంబర్ 3న సిటీ పోలీస్ కమిషనర్ శివకుమార్‌లాల్ హైదరాబాద్ పోలీసు చట్టం సెక్షన్ 22 కింద సభలు, ఊరేగింపులు, ఆయుధాలు, రాళ్లతో సంచరించడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
-సిటీ కాలేజీ (హైకోర్టు దగ్గర) వద్ద ఉదయం 10 గంటలకు తరగతులకు వెళ్లకుండా విద్యార్థులు గుమిగూడారు.
-కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ రాంలాల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వుల్ని విద్యార్థులకు అందించారు. ఉత్తర్వుల్ని ధిక్కరించి విద్యార్థులు ఊరేగింపునకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని తెలుసుకొన్న కమిషనర్ సిటీ కళాశాల చుట్టూ పోలీసులు, టియర్ గ్యాస్ బృందాల్ని మోహరించారు.
-సిటీ కళాశాల దక్షిణంవైపు ఉన్న గేటు నుంచి మహబూబ్షాహీరోడ్ ద్వారా విద్యార్థులు బయటికి వెళ్లారు. ఉపాధ్యాయులు కూడా (ప్రిన్సిపాల్ ఆదేశాలపై) విద్యార్థుల వెంట వెళ్లారు. కొద్ది సేపట్లోనే వెనక్కి వచ్చిన ఉపాధ్యాయులు, పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారని ప్రిన్సిపాల్‌కు చెప్పారు. ఈ విషయం విన్న ప్రిన్సిపాల్ బయటికి వచ్చేసరికి, ఊరేగింపుగా బయటికి వెళ్లిన విద్యార్థులు కళాశాల ఆవరణలోకి తిరిగి వచ్చి పోలీసుల మీదికి రాళ్లు విసిరారు. విద్యార్థులపైకి టియర్ గ్యాస్ షెల్స్‌ను పోలీసులు వదిలారు.
తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమం
-వరంగల్ విద్యార్థులకు మద్దతుగా, లాఠీచార్జికి నిరసనగా, నాన్ ముల్కీలకు వ్యతిరేకంగా సికింద్రాబాద్, హైదరాబాద్, నల్లగొండ మొదలైన ప్రాంతాల్లో ఉద్యమం ఉధృతమైంది. విద్యార్థుల కార్యాచరణ సమితి వరంగల్‌లో హార్తాళ్ జరిపింది.
-నాన్ ముల్కీలకు చెందిన హోటళ్లను వరంగల్‌లో విద్యార్థులు మూసివేయించారు.
-చాదర్‌ఘాట్ కాలేజీ విద్యార్థులు, భద్రుకా కాలేజీ విద్యార్థులు సమ్మె చేశారు. సైన్స్, కామర్స్ కళాశాలల విద్యార్థులు నిజాం కళాశాలకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడి నాన్ ముల్కీల కారణంగా స్థానికులకు ఉద్యోగాలు రావడం లేదని ముల్కీ (స్థానిక) నిబంధనల్ని కచ్చితంగా అమలు చేయించుకోవడానికి సమ్మె చేయాలని నిర్ణయించుకున్నారు.
-వరంగల్‌లో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జికి వ్యతిరేకంగా ముషిదుత్ అనాం స్కూల్ విద్యార్థులు, ధర్మవంత్ కళాశాల, గురువన్న మిడిల్ స్కూల్, దారుల్ – ఉలూమ్ హైస్కూల్ విద్యార్థులు ఊరేగింపులు నిర్వహించారు.
-సిటీ కళాశాలకు చెందిన విద్యార్థులు అఫ్జల్‌గంజ్, మొహంజా మార్కెట్, ఆబిడ్స్ ద్వారా ఘోషామహల్ స్కూల్ నుంచి చాదర్‌ఘాట్ పాఠశాల వరకు ఊరేగింపుగా వెళ్లారు. నాన్ ముల్కీ గో బ్యాక్ నినాదాలిచ్చారు.
-సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ మదర్సా-ఇ-ఆలియా విద్యార్థులు ప్రిన్సిపాల్ తమను ర్యాలీకి అనుమతించకపోవడంతో పూలకుండీలు, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు.
-ఆగస్టు 30న కుల్సుంపురా, పురానాపూల్, ముస్తాహెదాపురా, ఇమాంపురా స్కూళ్ల విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు.
-మదరాసీస్ గోబ్యాక్, నాన్ ముల్కీ గోబ్యాక్ నినాదాలు పురవీధుల్లో మార్మోగాయి.
-శివకుమార్‌లాల్ విజ్ఞప్తి : నగర పోలీస్ కమిషనర్ శివకుమార్‌లాల్ సెప్టెంబర్ 1న ముల్కీ ఉద్యమంలో విధ్వంసకర సంఘటనలు, హింస చోటుచేసుకుంటున్నందు వల్ల పిల్లల్ని వీటిలో పాల్గొనకుండా చూడాలని స్కూళ్ల యాజమాన్యాలకు, తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశాడు.
-విధ్వంసానికి పాల్పడేవారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని పోలీసులు మైకుల ద్వారా వీధుల్లో ప్రచారం చేశారు. అంతేకాకుండా ఈ వార్త సెప్టెంబర్ 2న పత్రికల్లో అచ్చయింది. విద్యార్థులు పోలీసుల విజ్ఞప్తుల్ని ఖాతరు చేయకుండా, డబీల్పూరా, ధూల్‌పేట, చాదర్‌ఘాట్ ప్రాంతాల్లో శాంతియుతంగా ప్రదర్శనలు నిర్వహించారు. విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేశారు.
పత్తర్‌ఘట్టీ ప్రాంతంలో కాల్పులు
-పత్తర్‌ఘట్టీ ప్రాంతంలో కాల్పులు జరిపారు పోలీసులు. పత్తర్‌ఘట్టీ పోలీస్‌స్టేషన్‌కు ఆందోళనకారులు నిప్పుపెట్టారు.
గాయపడిన, మరణించిన ఉద్యమకారులు
-పోలీసు కాల్పులతో కొందరు చనిపోయారు. అనేక మంది గాయపడ్డారు.
-సిటీ కాలేజీ సంఘటన గురించి తెలుసుకున్న ప్రజలు వేలాదిగా సిటీ కాలేజీ, హైకోర్టు పరిసర ప్రాంతాలకు తరలివచ్చారు. కొందరు విద్యార్థులు పోలీసులపైకి రాళ్లు విసిరారు. 5వేల మంది విద్యార్థులు ర్యాలీగా బయలుదేరి పోలీస్ జీపులపై రాళ్లు విసిరారు.
కొండా లక్ష్మణ్ ప్రయత్నాలు
-ప్రజల పక్షాన వాదించే వకీలుగా పేరున్న వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నాడు. బలహీనవర్గాల నాయకుడు. ఆసిఫాబాద్ (ఆదిలాబాద్ జిల్లా) శాసనసభ్యులు. అతడు విద్యార్థులకు నచ్చజెప్పి రాళ్లు రువ్వడాన్ని ఆపించారు. మెజిస్ట్రేట్ బషీర్ అహ్మద్, పోలీస్ కమిషనర్ శివకుమార్లాల్కు నచ్చజెప్పి కొద్దిదూరం వెనక్కి పంపించారు. సుమారు గంటన్నర వరకు పరిస్థితుల్ని చక్కదిద్దడానికి కొండా లక్ష్మణ్ ప్రయత్నాలు చేశారు. ఈ లోపు సిటీ కాలేజీ, మదీనా బిల్డింగ్, పత్తర్‌ఘట్టీ, చార్మినార్ ప్రాంతాల నుంచి నినాదాలతో వేలాదిమంది పోలీసులున్న చోటుకు చేరుకున్నారు. మరోమారు పోలీసులపైకి రాళ్ల వర్షం ప్రారంభమైంది. అయినప్పటికీ కొండా లక్ష్మణ్, మరికొంత మంది పెద్దలతో కలిసి కర్రలు పట్టుకొని విద్యార్థుల్ని లైన్లలో నిలబెట్టారు. ఈ లోపే కొంతమంది విద్యార్థులు రాళ్లు విసరడం ప్రారంభించడంతో విద్యార్థుల్ని నియంత్రించడం తనవల్ల కాదని కొండా లక్ష్మణ్ పోలీస్ కమిషనర్‌కు తెలిపాడు.
విద్యార్థులపై కాల్పులు
-పరిస్థితులు చేయిదాటిపోతున్నాయని అక్కడే ఉన్న మెజిస్ట్రేట్‌కు కమిషనర్ చెప్పడంతో అతను ఫైరింగ్‌కు అనుమతినిచ్చాడు. రెండు రౌండ్లు ఎవరికీ తగలకుండా కాల్పులు జరిపారు. అయినా ఎవరూ వెనక్కి తగ్గలేదు. నేరుగా కాల్పులు జరపడంతో ఒక యువకుడు కిందపడిపోయాడు. అతన్ని పోలీసులు హాస్పిటల్‌కు తరలించారు. మళ్లీ రాళ్ల వర్షం ప్రారంభమైంది.
మళ్లీ కాల్పులు
-అఫ్జల్‌గంజ్ నుంచి వచ్చిన పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక యువకుడు చనిపోయాడు. విషయం తెలుసుకున్న జనం పెద్ద సంఖ్యలో సిటీ కాలేజీకి చేరుకున్నారు. మెజిస్ట్రేట్, పోలీసు కమిషనర్లు అక్కడే ఉన్నారు. మెజిస్ట్రేట్ (బషీర్ ఖాన్) ప్రకారం సుమారు 40 వేల మంది జనం అక్కడే ఉన్నారు. ఆ తరువాత 15 నిమిషాలపాటు 12 రౌండ్లు కాల్పులు జరిపారు. అనేకమంది తూటాలకు నేలపై పడిపోయారు. ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా, మరో ఇద్దరు ఉస్మానియా హాస్పిటల్లో చనిపోయారు. మొదటిసారి కాల్పులవల్ల మహ్మద్ ఖాసి, రెండోసారి జరిపిన కాల్పుల వల్ల షేక్ మహబూబ్ (బస్సు తగులబెడుతున్న ఇతనిపై పోలీసులు కాల్పులు జరపగా 3 తుపాకీ గుళ్లు వీపులో దిగాయి), జమాలుద్దీన్ (సెప్టెంబర్ 3న జరిగిన కాల్పుల్లో గాయపడ్డాడు) సెప్టెంబర్ 5న, రాములు సెప్టెంబర్ 29న మరణించారు.
సీఎం కారుకు నిప్పంటించిన ఉద్యమకారులు
-కోఠి ప్రాంతంలో జరిగిన మహిళా సమావేశానికి సీఎం బూర్గుల సతీమణి హాజరై ప్రసంగించారు. ఆమె సీఎం కారులో వచ్చారు. పోలీసు కాల్పుల్లో విద్యార్థులు చనిపోయారు. మీటింగ్ ఆపండి అని విద్యార్థులు నినదించడమేగాకుండా కారును తగులబెట్టారు.
ఫతేమైదాన్‌లో సమావేశం
-సమావేశానికి ముఖ్యమంత్రి సలహాపై ప్రతిపక్ష నాయకుడు వీడీ దేశ్‌పాండే, వీకే ధాగే హాజరయ్యారు. పోలీసు కాల్పుల్ని ఖండించారు. అమరుల త్యాగం వృథాకానివ్వమని ప్రమాణం చేశారు. పోలీసు కాల్పులపై నిష్పక్షపాతంగా విచారణ చేయించడానికి ప్రభుత్వం విచారణ కమిషన్‌ను నియమించాలని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించారు. మరుసటి రోజు ఉదయం 9.30 గంటలకు ఉస్మానియా హాస్పిటల్‌కు చేరుకొని విద్యార్థుల మృతదేహాలతో ఊరేగింపు నిర్వహించాలని విద్యార్థులు, నాయకులు నిర్ణయించారు.
ఉస్మానియా వద్ద ఉద్రిక్తత
-సెప్టెంబర్ 4న ఉస్మానియా హాస్పిటల్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ముందురోజు (సెప్టెంబర్ 3) ఫతేమైదాన్ సభలో నిర్ణయించుకున్న ప్రకారం ఉదయం 9.30 గంటలకే భారీ సంఖ్యలో జనం, విద్యార్థులు, నాయకులు ఉస్మానియాకు చేరుకున్నారు.
-పద్మజా నాయుడు, డా. వాఘ్రే లు ఉస్మానియాకు చేరుకోకముందే సీఎం బూర్గులతో సమావేశమై 3న జరిగిన పోలీసు కాల్పులు, సమావేశం, 4న విద్యార్థులు మృతదేహాలతో చేపట్టబోయే ఊరేగింపు విషయాలపై చర్చించారు.
-ఆస్పత్రికి పెద్ద సంఖ్యలో ప్రజలు, విద్యార్థులు వచ్చిన సమాచారాన్ని నాయుడు, వాఘ్రేలు సీఎంకు చేరవేశారు.
-చనిపోయినవారిలో విద్యార్థులు లేరని, కావున వారి మృతదేహాల్ని విద్యార్థులకు అప్పగించడం సాధ్యం కాదని సీఎం అన్నారు.
మృతదేహాలను ఖననం చేసిన పోలీసులు
-ఒకవైపు విద్యార్థులు, మరోవైపు నాయకులు మృతదేహాల గురించి పోలీసుల్ని ఆరా తీశారు. మృతదేహాల్ని ఈ రోజు తెల్లవారుజామునే మీర్ ఆలం చెరువు సమీపంలో ఖననం చేశామని కమిషనర్ చెప్పడంతో విద్యార్థులు, నాయకులు షాక్‌కు గురయ్యారు.
-ఈ విషయాన్ని సీఎంకు కూడా పోలీసులు ఆలస్యంగా చెప్పారు.
-ఈ విషయమై పద్మజ, వాఘ్రేలను నాయకులు, సీఎం వద్దకు పంపారు. ఖననం చేసిన మృతదేహాలను వెలికితీసి కుటుంబ సభ్యులకు అప్పగించాలని చీఫ్ సెక్రటరీ సమక్షంలో కమిషనర్‌ను సీఎం ఆదేశించారు.
-అయితే ఇదంతా మోసం అని, ప్రజల్ని పక్కదారి పట్టించేందుకే ఇలా చేస్తున్నారని జనం మండిపడ్డారు.
సెప్టెంబర్ 4న కాల్పులు – నలుగురి మృతి
-కాల్పులు జరపరాదని కమిషనర్ స్పష్టమైన ఆదేశాలిచ్చినా పోలీసులు మాత్రం కాల్పులు జరిపారు. సెప్టెంబర్ 4న జరిగిన కాల్పుల్లో చాదర్‌ఘాట్ మిడిల్ స్కూల్ విద్యార్థి విలాయత్ అలీ, మరో ముగ్గురు మరణించారు.
-కాల్పుల్లో మొత్తం 147 మందికి గాయాలు కాగా 104 మంది పోలీసులు కూడా గాయపడ్డారు.
-సెప్టెంబర్ 4, 5 తేదీల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నగరంలో కర్ఫ్యూ విధించడంతో కాలేజీలు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, హైకోర్టు పనిచేయలేదు. ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు